8, ఫిబ్రవరి 2026, ఆదివారం

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*645 వ రోజు*

అనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము

శూద్రుడి ప్రవర్తన

ధర్మరాజు" పితామహా ! శూద్రుడు ఏ ప్రకారం చేస్తే ఇహ లోకంలోను, పరలోకంలోను సుఖములు పొందగలడు. భీష్ముడు " ధర్మనందనా ! పూర్వము పరాశరుడు తన శిష్యులకు కొన్ని ధర్మసూక్ష్మములు తెలియ చేసాడు. ఆ వాక్యముల సారాంశం ఇది. శూద్రుడైన వాడు ఇంద్రియములను జయించి అంతః శత్రువులైన కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలను జయించి గర్వమును వదిలి పెట్టి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులముల వారికి భక్తితో శుశ్రూషలు చేసిన ఈ లోకములోనూ పరలోకము లోనూ సుఖపడగలడు. అలాకాక తన ధర్మమును వదిలి వేదాధ్యయనము, తపస్సు చేస్తే ఈ లోకములోనే కాక పరలోకములో కూడా హీనుడౌతాడు. బ్రాహ్మణుడికి వేదాధ్యయనం, క్షత్రియుడికి బలపరాక్రమాలు, వైశ్యునికి వాణిజ్యము శూద్రుడికి సేవకా వృత్తి అధిక ధనాలు. ఇది వేదము చూపిన మార్గము. ఈ మార్గములలో నడిచిన వారు ఉత్తమ గతులు పొందుతారు. అలా కాక స్వధర్మం వదిలి పరధర్మమును ఆచరించిన ఇహలోకంలోను పరలోకంలోను కూడా దుర్గతి కలుగుతుంది.

శౌచము

ధర్మనందనా ! నీకు పరాశరుడు తన శిష్యులకు శౌచము గురించి చెప్పినవి చెప్తాను. మానవుడు మలమూత్ర విసర్జన పగలు ఉత్తర దిక్కున, రాత్రి దక్షిణదిక్కున చేయడం మంచిది. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం ఉత్తరదిక్కుగా మలమూత్రములను విసర్జించి అవయవములను సున్నితంగా ఎడమచేతితో శుభ్రపరచుకోవాలి. లేని ఎడల రోగములు ప్రాప్తిస్తాయి. తరువాత చేతిని చక్కగా కడుగుకుని తరువాత చేతులకు మట్టి పూసుకుని రుద్దుకుని కడగాలి. తరువాత పాదములను శుభ్రంగా కడుగు కోవాలి. మలమూత్రములను బహిరంగ ప్రదేశములో విసర్జించ కూడదు. దూరంగా చాటుగా చేయాలి. మలమూత్ర విసర్జన తరువాత నురగలేని మంచి నీటితో ఆచమనం చేయాలి. ఆచమనం చేసిన తరువాత నోటిని తుడుచుకోవాలి. తలమీద నీళ్ళు చల్లుకోవాలి. తరువాత శుభ్రమైన నీటితో కళ్ళు, ముక్కు, చెవులు, భుజములు, గుండెలు, బొడ్డు తుడుచుకోవాలి. తలమీద నీళ్ళతో తుడుచుకోవాలి. ఆచమనం చేసేటప్పుడు తూర్పుముఖంగా గాని, ఉత్తరముఖంగా కాని కూర్చోవాలి. ఇలా చేసిన ఋగ్యజుర్సామ వేదములు సంతోషిస్తాయి. నీటితో ఆచమనం చేసిన అధర్వణవేదం సంతోషిస్తుంది. అలా ధర్మశాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు సంతోషిస్తాయి. కాళ్ళు కడగడం వలన పుండరీకాక్షుడు సంతోషిస్తాడు. నీటితో కళ్ళు తుడుచుకుంటే సూర్యుడు సంతోషిస్తాడు. ఇది ఆచమనవిధి. ఈ ఆచనమును ప్రతి ఒక్కరు వస్త్రములు మార్చుకొనినప్పుడు, జంధ్యమును మార్చుకొనినప్పుడు, అన్న పానముల వేళలందు చేయాలి. అన్నము తిన్న తరువాత ఆహారపు ముక్కలు పళ్ళ మధ్య ఇరుక్కుంటాయి కనుక మూడు మార్లు పుక్కిలించి ఆ నీటిని ఉమ్మి వేసి ఆ తరువాత ఆచమనం చేయాలి. ఈ ఆచమనం అన్ని వర్గముల వారు చేయాలి.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: