చర్మరక్షణ కొరకు , సౌందర్యం కొరకు మూలికా యోగములు -
• టంకణం ( borax ) , పసుపు సమానంగా కలిపి కొబ్బరినూనెలో కలిపి పైకి రాయుచున్న కాలిపగుళ్లు , పెదాల పగుళ్లు క్రమేణా నివారణ అగును.
• శ్రీ గంథం , అగరు , వట్టివేళ్లు సమానంగా తీసుకుని మిశ్రమం చేసి ఆ చూర్ణమును పాలు లేదా పన్నీరు కలిపి రాయుచున్న ముఖవర్చస్సు పెరుగుతుంది .
• చందనం , కుంకుమపువ్వు మరియు కస్తూరి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి లేపనం చేయుచున్న ముఖవర్చస్సు పెరుగును .
• శనగలు , పెసలు , కచ్చురాలు , చందనం , కస్తూరి పసుపు మొదలైన ద్రవ్యాలను కలిపి సిద్దం చేసుకున్న " సున్నిపిండి " శరీరానికి పట్టించి మర్దన చేసుకుని ఒక గంట తరువాత స్నానం చేయుచున్న మనస్సుకి ఆహ్లాదం కలిగించడంతో పాటు చర్మరోగాలు రానివ్వకుండా కాపాడును.
• సీతాఫలం గింజలను వేపనూనెలో మర్దించి పైకి లేపనం చేయుచున్న తలలో చుండ్రు హరించును .
• ఒక కప్పు పాలల్లో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి మరునాడు ఉదయం గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుగుకొనుచున్న క్రమేణా ముఖం మీద మచ్చలు తగ్గును.
• గసగసాలు పాలలో మర్దించి తలకు పట్టించి తలస్నానం ఆచరించిన చుండ్రు హరిస్తుంది.
• కాలిన గాయాల వలన ఏర్పడిన మచ్చలు పోవడానికి బంతి ఆకుల రసమును పైకి పట్టించుచుండిన మచ్చలు తగ్గును. స్వచ్చమైన తేనె రాసినను కాలిన గాయపు మచ్చలు తగ్గును.
• మామిడి ఆకుల ఈనెలు సేకరించి నీడలో ఆరబెట్టి మెత్తటి చూర్ణం సిద్దం చేసుకుని అందులో కొంచం బట్టలసోడా , కొద్దిగా సున్నం కలిపి పైన పట్టించుచుండిన పులిపిర్లు క్రమేణా నశించును .
• వేపబెరడు గాని వేపచిగుళ్ళు గాని తీసుకుని పసుపు కలిపి నీటితో నూరి శరీరముకు పట్టించి గంట తరువాత స్నానం చేయుచుండిన చెమటకాయలు క్రమేణా తగ్గిపోవును
• కుప్పింట ఆకు రసం రెండు చెంచాలు కడుపులోకి ఇస్తే నులిపురుగులు చచ్చిపడిపొవును .
• నిమ్మరసం మరియు తులసి ఆకు రసం సమానంగా తీసుకుని బాగా కలిపి పైన రాయుచున్న గజ్జలలో దురదతో కూడి బిళ్లలుగా జనియించే రింగ్ వార్మ్ అనే చర్మవ్యాధి నశించును.
• జాజికాయ , చందనం మరియు మిరియాలు సమానంగా గ్రహించి గోరువెచ్చని నీళ్లతో మెత్తగా నూరి ఆ గంధమును పైకి రాయిచున్న మోటిమలు నివారణ అగును.
• ఒక కప్పు పెరుగు నందు అర టీస్పూను నిమ్మరసం , అర టీస్పూను పటిక చూర్ణం కలిపి తలకు మర్దన చేసుకుని స్నానం చేయుచున్న చుండ్రు , తలలో పేలు హరించును .
• కాలిన గాయాలకు కలబంద రసములో కొద్దిగా పసుపు కలిపి పైన పట్టిస్తే త్వరగా మానుతాయి. కాలిన గాయాలకు వెంటనే తేనెను రాస్తే తీవ్రమైన వేదన , మంట శాంతిస్తాయి.
• నిమ్మరసం , కొబ్బరిపాలు కలిపి బాగా గిలకొడితే తెల్లటి మీగడ వంటి పదార్థం తయారగును దీనికి ముఖానికి పట్టిస్తే ముఖవర్చస్సు పెంపొందును.పైన చెప్పినవాటిలో కొన్ని మూలికలు మీకు ఆయుర్వేద దుకాణాలలో లభ్యం అగును.
మరిన్ని అతి సులభ యోగాలు, మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి