14, ఫిబ్రవరి 2026, శనివారం

మాఘ పురాణం - 27వ*

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷శనివారం 14 ఫిబ్రవరి 2026🌷*

_*మాఘ పురాణం - 27వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


      *14వ తేదీ శనివారం*

         *వేకువఝామున*

       *చదువు కొనుటకు*


మాఘ పురాణం ఇరవై ఏడవ అధ్యాయంలో, గృత్నృమద మహర్షి జహ్నుమునితో ఇలా అన్నాడు: “జన్మ సంసారమనే సముద్రాన్ని దాటడానికి సాధనం మాఘమాస వ్రతం. దాని ప్రశస్తిని వెల్లడించే మరో కథను విను…

```

పూర్వం ద్వాపర యుగంలో అంగదేశాన్ని పాలించే సులక్షణ రాజు ఉండేవాడు. అతను సూర్యవంశంలో జన్మించినవాడు. బలపరాక్రమాలు కలిగినవాడు, ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. అతనికి నూరుగురు భార్యలున్నా సంతానం మాత్రం లేదు. రాజులు అందరూ అతనికి సామంతములై కప్పములు చెల్లించుచున్నా, సంతానం లేదనే విచారం మాత్రం రాజుకు తప్పలేదు. ‘నేనేమి చేసిన కులవర్ధనుడు అనే పుత్రుడు జన్మించును?’ పెద్దలు పుత్రులు లేని వారికి, దరిద్రునికి, కృతఘ్నునకు, వేద హీనుడగు విప్రునకు సద్గతి లేదని అందురు. పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమములకు వెళ్లి అక్కడ పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారు ఏమైనా ఉపాయం చెప్పగలరేమో? ప్రయత్నించి చూచెదను’అని నిశ్చయించుకున్నాడు. 


అనేక మంది మహర్షులు కల నైమిశారణ్యం వెళ్లడమే మంచిదని నైమిశారణ్యానికి వెళ్లాడు. 


అక్కడ మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించాడు.


అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి ఇట్లన్నారు: ‘రాజా! వినుము నీవు పూర్వ జన్మలో సౌరాష్ట్ర మహారాజువు, సర్వసంపన్నుడవైనను మాఘమాసంలో రధ సప్తమి నాడు కూష్మాండ దానం చేయలేదు. అందువలన నీకు ఈ జన్మలో సంతానం కలుగలేదు. ఇందువలననే ఇంత మంది భార్యలున్నా నీకు సంతానం కలుగలేదు’ అని చెప్పారు. 


అప్పుడు రాజు నాకు సంతానం కలుగు ఉపాయం చెప్పుడని వారిని ప్రార్థించాడు. 


అప్పుడా మునులు ఒక ఫలమును మంత్రించి రాజుకిచ్చిరి. ‘దీనిని నీ భార్యలందరికిని పెట్టుము. ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మింతురని’ చెప్పారు. 


సులక్షణ మహారాజు సంతోషంతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి తమ ఇంటికి వచ్చాడు. 


రాణులు సంతోషంతో వారికెదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషంతో స్వాగతం చెప్పారు. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యా గృహంలో ఉంచాడు. స్నానం మున్నగునవి చేయవలెనని లోనికి వెళ్లాడు. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలమును దొంగలించి తాను ఒక్కతే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలం కనపడలేదు. సేవకులను, రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదనిరి. 


తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. 


రాజు ఏమియు చేయలేక ఊరకుండెను. కొన్నాళ్లకు ఆమె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య ఇట్లు గర్భవతి అగుట మిగిలిన భార్యలకు ఇష్టము లేదు. ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నములను చేసిరి. కాని దైవబలమున అవి అన్నియు వ్యర్థములయ్యెను. కాని వారు చేసిన ప్రయత్నము వలన గర్భపాతమునకు ఇచ్చిన మందుల వలన చిన్న భార్య మతి చెడెను. ఎవరికి తెలియకుండ అడవిలోనికి పారిపోయెను. 


ప్రయాణపు బడలికకు ఆమె అలసెను ఒక పుత్రుని కని ఒడలు తెలియక పడియుండెను. 


గుహలోనున్న పులి బాలింతను ఈడ్చుకొని పోయి భక్షించెను.


అప్పుడే పుట్టిన పసిబిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచు ఉండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండ మున్నగువాని బాధ ఆ శిశువునకు లేకుండ చేసినవి. తేనె, పండ్ల గుజ్జు మున్నగు వానిని బాలునకు పెట్టి ఆ హంసలు అతనిని రక్షించినవి. బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటుపడి అచటనే తిరుగుచుండెను. అచటి సరస్సు తీరమున అతడాడుకొనుచుండగా హంసలు నదిలో విహరించెడివి. ఒకనాడు పవిత్ర దినమగుటచే  సమీప గ్రామముల వారు సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి, అట్లు వచ్చినవారిలో ఇద్దరు భార్యలుండి సంతానను లేని గృహస్థు ఒకడు వారితో బాటు స్నానమునకు వచ్చెను.

అచట తిరగాడుచున్న బాలుని చూచి ముచ్చటపడి ఇంటికి గొనిపోవలెను అని తలచి ఈ బాలుడెవరు యెవరి సంతానము అడవిలో యేల విడువబడెను అని యెంత ఆలోచించినను వారికి సమాధానము దొరకలేదు. 


వనమున, జలమున, గర్భమున నెచటనున్న వానినైనను రక్షించి పాలించు వాడు శ్రీమన్నారాయణ మూర్తియే కదా ! ఆయనయే నాకీ బాలుని యిట్లు చూపినాడని తలచెను. 


బాలుని ఇంటికి గొనిపోయెను. సవతులైన వాని ఇద్దరు భార్యలు ఎవరికి వారు వారే ఆ బాలుని పెంచవలెను అని పరస్పరము వివాద పడుచుండిరి. ఈ విధముగా రెండు సంవత్సరములు గడచెను. ఒక నాడు ఆ గృహస్థు ఇంటియందు లేని సమయములో పెద్ద భార్య ఆ బాలుడిని అడవిలో విడచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు బాలుని యెంత వెదకినను కనిపించలేదు.

అడవిలో విడువబడిన బాలుడేడ్చుచు వింటివలెనున్న తులసి పొదవద్దకు వెళ్ళెను అచటె పండుకొనెను. తులసీ స్పర్శవలన బాలునకా వనమున యెట్టి ఆపదయు రాలేదు. 

శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడచినది యెవరును లేని ఆ బాలుడు యేడ్చుట తప్ప మరేమి చేయగలడు. వాని దైన్యము, నిస్సహాయత ఆ అడవిలోనుండు పశుపక్ష్యాదులలోని జీవలక్షణమునకు విలువైనది. అడవిలో కల ప్రాణులు, మృగములు, పక్షులు అచ్చటికి వచ్చినవి, బాలుని నిస్సహాయత ధైర్యము వానిలోని దివ్య లక్షణములను మేల్కొలిపి వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులును కన్నీరు కార్చినవి. ఒకరి బాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్ష్యాదులు యిట్టి సహానుభూతి నందినప్పుడు మరియొక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా! అట్లే బాలుడును పక్షియోమృగమైనప్పుడు వాని దుఃఖము యెట్లుండునో కదా, బాలుడు పశుపక్ష్యాదులు  విభిన్నజాతులవారైనను వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము ఒక చోటనుండి రేవునుండి వచ్చినదే. అదియే దివ్యత్వము, కాని విచిత్రమేమనగా బాలునికి తనజాతిదే అయిన స్త్రీ వలన ఆపదవచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య, ఆమెలోని దివ్యత్వము లోపించినది.

సృష్టి విచిత్రమని యనుకొనుట తప్ప మనకే సమాధానమును తోచదు. ఇదియే భగవంతుని లీల, అటుల వచ్చిన పక్షులు, మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు ఎండ వానిపై పడకుండ రెక్కలతో నీడను కల్పించినవి, తమ విచిత్ర రూపములతో అతని మనస్సును శోకము నుండి మరల్చినవి. మృగములును తేనె, ముగ్గినపండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు, పక్షులు వానికి తాము చేయగలిగిన యుపచారములను చేసి వాని దుఃఖములను  మాన్పించి తమ ఉపచారములచే వాని ఆకలిని తీర్చినవి. 


బాలుడు తులసి పాదులో ఉండుట, తులసిని చూచుట, తాకుట మున్నగు పనులను ఆతర్కితముగ చేయుటచే పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన దైవ అనుగ్రహము అతడు పొందగలిగెను. తన జాతికి చెందని పశుపక్ష్యాదుల సానుభూతిని, యుపచారములను పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారము వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగల్గెను. అప్రయత్నముగ అతని నోటి నుండి కృష్ణ, గోవింద, అచ్యుత మున్నగు భగవన్నామముల ఉచ్ఛారణ వల్ల శక్తి కలిగినది. అతడు ఆ మాటలనే పలుకుచు తులసి పాదులో నివసించుచు, ఆడుకొనుచు కాలమును గడుపసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన యొక బాలునకట్టి దయను పశుపక్ష్యాదుల ద్వారా చూపినది. అట్టి తులసి మన ఇండ్లలోనుండి మనచే పూజింపబడిన మనపై యెట్టి అనుగ్రహమును చూపునో విచారింపుడు. తులసి మన ఇంట నుండుట వలన మనము తులసిని పూజించుట వలన మనకు దైవ అనుగ్రహము కలిగి మరెన్నియో ఇహ పరలోక సుఖములను పొందవచ్చును. పాపములను పోగొట్టుకొనవచ్చును. భగవదనుగ్రహమును మరింత పొందవచ్చును.```


*రాజకుమారుని పూజ – శ్రీహరి అనుగ్రహము*```


సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్య ఏమైనదో తెలుసుకొనవలెనని సేవకులను పంపి వెదకించెను. కాని ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి ఊరకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమునందువలెనే శ్రీహరినామస్మరణ చేయుచు పశుపక్ష్యాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి, తండ్రి, తాత, సోదరుడు యిట్టి బంధువుల నెరుగడ. కేవలము శ్రీహరి నామోచ్ఛారణము శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యెను. శ్రీహరి దర్శనము కలుగలేదు అని విచారము వానికి కల్గెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేరు. ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతము నాచరింపుమని వానికి చెప్పెను. 

రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటల ననుసరించి మాఘస్నానము పూజ మున్నగు వానిని ప్రారంభించెను.


మాఘశుక్ల చతుర్దశినాడు రాజకుమారుని పూజాంతమున శ్రీహరి వానికి దివ్య దర్శనమునిచ్చెను. శుభమును కలిగించు బాహువులలో బాలుని కౌగిలించుకొనెను. ఓ బాలకా నా భక్తుడవైన నీకు వరమునిత్తును కోరుకొమ్మని పలికెను. 


బాలుడును నాకు నీపాద సాన్నిధ్యమును చిరకాలమనుగ్రహింపుమని కోరెను. 


శ్రీహరి “బాలకా! నీవు రాజువై యీ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకుము, పుత్రపౌత్ర సమృద్ధిని, సంపదలను, భోగభాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకుపొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వసంపదలను, సర్వసమృద్దులను, సర్వసుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడువక చేయుము. ఆ తరువాత నా సన్నిధిని చేరుమ”ని పలికెను. 

అచటనున్న సునందుడను వానిని పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చుమని చెప్పి సపరివారముగ అంతర్దానమందెను. 


సునందుడును రాజకుమారుని దీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించెను. పుత్రుని వానికి అప్పగించెను తన స్థానమునకు తాను పోయెను.


సులక్షణ మహారాజు ఆశ్చర్యమును, ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడని పేరిడెను. బాలుడు విద్యా బుద్ధులను పొంది పెద్ద వాడైన తరువాత వానిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువుగా చేసెను. 


వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగెను. వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను. 


వాని భార్యలును సమాగమము చేసి పరలోకమునకు భర్తననుసరించి తరలిరి. 


సుధర్ముడు భక్తితో తండ్రికి, తల్లులకు శ్రద్ధతో శ్రార్ధకర్మల నాచరించెను. సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగ ప్రజారంజకముగ చిరకాలము రాజ్యమును పాలించెను. పుత్రులను, పౌత్రులను పెక్కు మందిని పొందెను. అతడెప్పుడును మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోను, మనుమలతోను, భార్యలతోను కలసి జీవించియున్నంతవరకు మాఘమాస వ్రతము నాచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.”


జహ్నుమునీ! ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడువక ఆచరింప వలయును. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు ఎట్టి భయమునుండదు. ఈ వృత్తాంతమును వినిన వాడును విష్ణు భక్తుడై మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణు ప్రియుడై ఇహ పరలోక సుఖముల నంది శ్రీహరి సాన్నిధ్యమునందును. సందేహము లేదు అని జహ్నుమునికి గృత్నృమదమహర్షి చెప్పెను.```


*మాఘపురాణం ఇరవై ఏడవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

కామెంట్‌లు లేవు: