*బ్రహ్మాస్త్రవర్ణనము*
వాయువునకు వలే వేగమైనది. అగ్ని మరియు సూర్యుని వలే తేజము కలది. ఆకాశము వలే విశాలమైనది. ఎక్కడికైనను చొచ్చుకొని పోగలదు.మేరు మందర గిరులవలే బరువైనది. బంగారముతో నిర్మితమైనది. బలమగు రెక్కలు కలది. ఉజ్జ్వలమగు కాంతులు కలది. సకల భూతముల సారములను గ్రహించి నిర్మింపబడినది. పొగలతో కూడి ప్రళయ కాలాగ్నివలె భయంకరమైనది. మహాసర్పము వలె మెరయుచుండునది. అతివేగముతో శత్రువుల యొక్క గజాశ్వ సమూహములను ఛేదించునది. అరివీరుల పుర ద్వారములను పరిఘలను పర్వతములను ముక్కలు ముక్కలుగా చేయునది. అరివీరుల రక్తముతో తడిసినది. క్రొవ్వుతో కూడియున్నది. మిక్కిలి దారుణమైనది. వజ్రమువలే దృఢమగునది. వేగముగా వెళ్ళునప్పుడు భయంకరమగు ధ్వనులు కలది. కపట యుద్ధమును ఛేదించునది. అందరనూ భీతిల్ల చేయునది. రాబందులకు గ్రద్దలకు ఇతరములగు పక్షులకు రాక్షసులకు నిత్యమునూ ఆహారమొసగునది. యముని రూపము వలె మిక్కిలి భయమును కలిగించునది. వానరోత్తములకు ఆనందమునూ రాక్షసులకు వినాశమునూ కలిగించినది. సుందరములును చిత్రవర్ణములును అగు గరుత్మంతుని పక్షములు కట్టినది. సమస్త లోకములలో గల శరములలో ఉత్తమమైనది. ఇక్ష్వాకు వంశజులకు శత్రుభయమును పోగొట్టునది. శత్రువుల కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయునది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి