14, ఫిబ్రవరి 2026, శనివారం

గడియల్ రెంటికొ, మూటికో

 శ్రీరాము (82)


                          శుభోదయం.

🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


 ధూర్జటి మహాకవి ఇలా అంటున్నారు:


మ// గడియల్  రెంటికొ, మూటికో, గడియకో, కాదేని నేడెల్లియో/

కడ నేడాదికొ, ఎన్నడో ఎఱుగ మీ కాయంబు లీ భూమిపై/

బడగా నున్నవి,ధర్మమార్గ మొకటిం  బాటింపరీ మానవుల్/

చెడుగుల్  నీ పద భక్తియున్ దెలియరో !  శ్రీకాళహస్తీశ్వరా ! 


(స్వామీ! శ్రీకాళహస్తీశ్వరా! మా ప్రాణాలు ఎప్పుడు పోవునో మాకు తెలియదు.

 రెండు గడియలకే పోవచ్చు.

మూడు గడియలకు పోవచ్చు. 

లేకపోతే ఇంకొక్క గడియకే పోవచ్చు.

ఈ రోజు కానీ, రేపు గానీ పోవచ్చు.

 లేదా ఒక యేడాది లో పోవచ్చు.

 ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదుగానీ, మొత్తానికి ప్రాణాలు పోయి ఈ శరీరము భూమిపై పడటము తప్పదు.

ఈ మానవులు, ప్రాణం ఉన్నప్పుడే ధర్మ కార్యాలు చేసి సమస్త సుఖములు ప్రసాదించే పుణ్యం సంపాదించుకోవడం లేదు.


మోక్షాన్ని ప్రసాదించే నీ మీద భక్తినైనా,  ఈ చెడుగులు, అలవరచుకోవడం లేదు.

అయ్యో! అతి దుర్లభమైన మానవ జన్మను, వ్యర్థ కాలక్షేపాలతో పాడు చేసుకుంటున్నారు గదా! )


జనన మరణ  వార్ధక్య వియోగ దుఃఖాలతో కూడిన  సంసారసాగరం తరించడానికి భగవంతుని మీద భక్తిగాని, వేదం ఉపదేశించిన సత్యం, అహింస, మొదలైన ధర్మములను ఆచరించడంగాని, ముఖ్యోపాయాలు.

అయ్యో! ఆ రెంటిని విస్మరించి మానవ జీవితం వ్యర్థం చేసుకుంటున్నాముగదా !  అని  శ్రీ భర్తృహరి మహాయోగి కూడా ఇలా అంటున్నారు.


" న ధ్యాతం పద మీశ్వరస్య విధివత్ సంసార విచ్ఛిత్తయే "


( సంసారచక్రంనుండి బయట పడేందుకు 

యథవిధిగా భగవంతుని పాదపద్మములను ధ్యానించ లేదు )


" స్వర్గద్వార కవాట పాటన పటుః ధర్మోపి నోపార్జితః "

(స్వర్గద్వారములు తెరిపించి సమస్త సుఖములను ప్రసాదించే  శక్తిగల, "ధర్మము" నైనా  సంపాదించ లేదు) 


కాబట్టి మన శ్రేయోభిలాషులైన మహాత్ముల ఉపదేశములను గ్రహించి, మన కర్తవ్యం తెలుసుకొన్నవారలమై, తదాచరణకు శాయశక్తులా కృషి చేద్దాం.


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

14-2-'26

కామెంట్‌లు లేవు: