🌹🌹🪷🐚🛕🐚🪷🌷🌹
*గురువారం 12 మార్చి 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
*23వ భాగం*
*నారాయణుని కపిల మహర్షి అవతారం*```
స్వాయంభువ మనువు రెండవ పుత్రిక దేవహూతి వివాహం కర్దమ మహర్షితో జరిగింది. దేవహూతి కర్దమ దంపతులు కర్దమ ఆశ్రమంలో సంసార జీవితం సుఖసంతోషాలతో గడుపుతున్నారు. దేవహూతి చేసే పతి సేవలకు ప్రసన్నుడై కర్దముడు ఆమెతో “దేవహూతీ! వివాహం జరిగిన రోజు నుండి భక్తి శ్రద్థలతో నాకు సేవలు చేసి నన్ను సంతోషపరిచావు. నీ పతిభక్తికి మెచ్చి సమస్త జీవుల భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసుకోగల దివ్యదృష్టి నీకు అనుగ్రహిస్తున్నాను. మనస్సులో వేరే కోరిక ఉంటే అడుగుము. తీరుస్తాను" అన్నాడు.
భర్త పాదాలకు నమస్కరించి దేవహూతి “స్వామీ! మీవంటి బ్రహ్మ మానస పుత్రుని భర్తగా పొందటం నా అదృష్టం. మీ సేవాభాగ్యాన్ని పొందటం మించిన కోరికలు నా మనస్సులో లేవు" అని పలికింది. కానీ ఆమె మనస్సులో సంతానం పొంది సంతానవతి కావాలి అనే కోరిక ఉంది. కానీ సంతానం కలిగిన వెంటనే సన్యాసాశ్రమం తీసుకుంటాను అని కర్దమ మహర్షి వివాహానికి పెట్టిన నియమం గుర్తుకు వచ్చి తన కోరికను మనస్సులో దాచుకుంది.
కర్దమ మహర్షి దేవహూతి మనస్సులో గల కోరికను గ్రహించాడు. ఆయనకు కూడా తొందరగా బ్రహ్మదేవుని ఆదేశం పాటించి సంతానం పొంది సన్యాసాశ్రమం తీసుకోవాలి అని ఉంది. అందుకని తనే ఆమె మనస్సులోని కోరిక తీర్చాలి అని నిశ్చయించుకున్నాడు.
దేవహూతిని బిందు సరోవరానికి తీసుకెళ్లి "దేవహూతీ! ఈ బిందు సరోవరం శ్రీమహావిష్ణువు కరుణారస బిందువులతో ఏర్పడింది. ఇందులో స్నానం చేసినవారికి శుభ ఫలితాలు లభిస్తాయి. నీవు ఈ సరోవరంలో స్నానం చేసి శుచివై రమ్ము" అని ప్రేమగా చెప్పాడు.
భర్త మాట పాటించి దేవహూతి బిందు సరోవరంలో స్నానం చేసి వచ్చింది.
కర్థమ మహర్షి తన తపశక్తితో దివ్య విమానం సృష్టించాడు. కర్దముడు దేవహూతి దివ్య సుందరాకార స్త్రీ పురుషులుగా మారి విమానం ఎక్కి విహారానికి బయలుదేరి వెళ్లారు. నూరు సంవత్సరాలు లోకాలన్ని విహరిస్తూ దాంపత్య సుఖాలు ఆనుభవించారు. ఆశ్రమానికి వచ్చేముందు తొమ్మిది దివ్య రూపాలు ధరించి దేవహూతిని కలిసి గర్భాధానం చేసాడు.
ఫలితంగా ఆశ్రమం తిరిగి వచ్చిన దేవహూతికి క్రమంగా తొమ్మిది మంది ఆడపిల్లలు జన్మించారు. వారికి వరుసగా కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అని నామకరణం చేసారు. దేవహుతికి పిల్లలు పుట్టిన కొంత కాలానికి కర్దమ మహర్షి దేవహూతికి తను వివాహానికి పెట్టిన నిబంధన గుర్తు చేస్తూ "నీవు అనుమతి ఇస్తే నేను సన్యాసాశ్రమం తీసుకుంటాను" అన్నాడు.
దేవహూతి భర్తకు నమస్కరించి "స్వామీ! మీ నియమం నాకు గుర్తుంది. మీ అనుగ్రహం చేత జన్మించిన ఆడపిల్లలు రేపు వివాహాలు చేసుకుని అత్తారింటికి వెళ్లి పోతారు. మీరు సన్యాసాశ్రమం తీసుకుని వెళ్లి పోతే నేను ఒంటరిదానను అవుతాను.
పున్నామ నరకం తప్పించడానికి పుత్రుడు కావాలి అంటారు. మీరు నన్ను వరం కోరుకోమని అడిగినప్పుడు కోరలేదు. ఇప్పుడు కోరుకుంటున్నాను. నాకు పుత్ర సంతానం అనుగ్రహించండి. శ్రీమన్నారాయణుడు మనకు పుత్రుడిగా జన్మిస్తానని మీకు వరము ఇచ్చాడు అని చెప్పారు.
కనుక నారాయణుడు నా గర్భాన జన్మించేలా అనుగ్రహించండి. పుత్రుడు కలిగాక, తండ్రిగా ఆడపిల్లల వివాహాలు జరిపించండి. పిదప మీ అభీష్టం మేరకు సన్యాసం స్వీకరించండి" అని కోరింది.
భార్య కోరికలో ధర్మముందని గ్రహించి కర్దమ మహర్షి అంగీకరించాడు.
"దేవీ! నీ కోరిక తప్పక తీరుస్తాను. త్వరలో శ్రీమన్నారాయణుడు నీ గర్భం నుంచి కపిలుడిగా జన్మిస్తాడు. సాంఖ్య శాస్త్రాచార్యుడిగా లోక ప్రసిద్ది చెందుతాడు. శ్రీహరి నాకిచ్చిన వరం నెరవేరడానికి నీవు ధృడచిత్తంతో, భక్తి శ్రద్థలతో అష్టాక్షరి నారాయణ మంత్రంతో శ్రీహరిని సేవించుము. శ్రీహరి నీ గర్భాన జన్మించి నీకు తత్త్వోపదేశం చేసి తరింపచేస్తాడు" అని అష్టాక్షరి మంత్రం ఉపదేశించాడు.
దేవహూతి శుభ ముహూర్తంలో అష్టాక్షరి మహామంత్ర దీక్ష తీసుకుని భక్తి శ్రద్థలతో నారాయణుని పూజించ సాగింది.
ఆమె దీక్షకు ప్రసన్నుడైన నారాయణుడు ఒక రోజు రాత్రి కలలో కనిపించి "తల్లీ! నీ దీక్షకు ప్రసన్నుడయ్యాను. త్వరలో నీకు కుమారుడిగా జన్మిస్తాను" అని పలికి అదృశ్యమయ్యాడు. దేవహూతి భక్తితో నమస్కరించింది. కొంతకాలానికి దేవహూతి గర్భవతి అయ్యింది. కర్దమ మహర్షి, దేవహూతిలు నారాయణ నామ స్మరణ చేస్తూ గడప సాగారు.
*తరువాతి కథ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి