🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*బుధవారం 11 మార్చి 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
*22వ భాగం*
*స్వాయంభువ మనువు తన పుత్రికలు ఆకూతి దేవహూతి ప్రసూతిలను రుచి మహర్షి, కర్దమ మహర్షి, దక్ష ప్రజాపతిలకు ఇచ్చి వివాహం చేయుట*```
చతుర్ముఖ బ్రహ్మ ఆదేశానుసారం స్వాయంభువ మనువు భూమండలానికి రాజై పరిపాలన చేయసాగాడు. కాలక్రమంలో స్వాయంభువ మనువుకి, శతరూపకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు జన్మించారు.
శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేసిన కర్దముని కరుణించి విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.
కర్దముడు అనేక విధాల స్తుతించి నమస్కరించి “శ్రీహరీ! నా తండ్రి బ్రహ్మదేవుడు నన్ను జగత్ సృష్టికి సహకరించమని ఆదేశించాడు. ఇందుకోసం నాకు తగిన ఉత్తమురాలైన భార్యను, సత్సంతానాన్ని అనుగ్రహించండి”అని వరం కోరాడు.
శ్రీమహావిష్ణువు ప్రసన్నుడై “కర్దమా! నీ కోరిక తీరుతుంది. మనువంశ మూలపురుషుడు స్వాయంభువ మనువు నిన్ను అన్వేషిస్తూ వచ్చి తన కుమార్తె దేవహూతిని నీకు ఇచ్చి వివాహం చేస్తాడు. నీకు, ఆమెకు తొమ్మిది మంది పుత్రికలు జన్మించి బ్రహ్మ మానస పుత్రులైన తొమ్మిది మంది ప్రజాపతులకు భార్యలు అవుతారు. వీరి వలన ప్రజా సృష్టి జరుగుతుంది. తరువాత నేనే మీకు పుత్రుడై జన్మించి తరింప చేస్తాను” అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు.
కొంతకాలం తరువాత శ్రీమహావిష్ణువు స్వాయంభువ మనువుకి కలలో కనపడి “బ్రహ్మావర్త అధిపతీ! స్వాయంభువ మను చక్రవర్తీ! నీ పుత్రిక, నా భక్తురాలు దేవహూతికి కర్దమ ముని తగిన వరుడు. కర్దముడు బిందు సరోవర తీరంలో ఆశ్రమం ఏర్పరచుకుని నివసిస్తున్నాడు. నీవే భార్యాపుత్రికలతో వెళ్లి నీ కుమార్తెను కన్యాదానం చేసి వివాహం చేయుము. నేను త్వరలో వారికి కుమారుడనై జన్మించి మీ రెండు వంశాలను తరింప చేస్తాను" అని ఆశీర్వదించాడు.
తెల్లవారిన వెంటనే స్వాయంభువ మనువు భార్యా పుత్రికలతో కలిసి కర్దమ ముని ఆశ్రమానికి వెళ్లాడు. కర్దముడు స్వాగతం పలికి అతిథి సత్కరాలు చేశాడు. స్వాయంభువ మనువు కర్దమ మునికి నమస్కరించి "మునీంద్రా! శ్రీమన్నారాయణుడు నా కుమార్తె దేవహూతిని మీకు కన్యాదానం చేసి వివాహం చేయమని ఆదేశించాడు.
ఈమె నా కుమార్తె దేవహూతి. సౌందర్యంతో పాటు సకల సద్గుణ సంపన్నురాలు. భూదేవి అంత వినయ విధేయతులు కలిగి ఉన్నది. మహావిష్ణువుకి పరమ భక్తురాలు. ఈమెను అర్ధాంగిగా స్వీకరించి నన్ను ధన్యుని చేయండి” అని కోరాడు.
కర్దముడు అంగీకరిస్తూ “మను చక్రవర్తీ! విష్ణువు ఆదేశం నాకు శిరోధార్యం. తప్పక చేసుకుంటాను. కాని నాకు ఒక నియమం ఉంది. నేను తగిన కన్యను వివాహం చేసుకుని సంతానం పొంది సృష్టికి సహకరిస్తాను” అని నా తండ్రి బ్రహ్మదేవునికి మాట ఇచ్చాను. కనుక మీ అమ్మాయి దేహహూతిని వివాహం చేసుకుని సంతానం పొందుతాను. సంతానవృద్ధి జరుగగానే సన్యాసాశ్రమం స్వీకరిస్తాను. దీనికి మీ కుమార్తె అంగీకరిస్తే తప్పక వివాహం చేసుకుంటాను” అన్నాడు.
స్వాయంభువ మనువు తన భార్య, పుత్రిక దేవహుతితో మాట్లాడి ఆ నియమానికి అంగీకరించాడు.
దేవహూతి వివాహం కర్దమునితో జరిపించడానికి నిశ్చయించి స్వాయంభువ మనువు మిగిలిన ఇద్దరు పుత్రికల వివాహం కోసం బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి “తండ్రీ! నా రెండవ కుమార్తె దేవహూతి వివాహం, శ్రీమన్నారాయణుని ఆదేశం ప్రకారం కర్దమ మునితో నిశ్చయమైంది. పెద్ద కుమార్తె ఆకూతికి, చిన్న కుమార్తె ప్రసూతికి తగిన వరులను మీరు చెబితే ముగ్గురి వివాహం ఒకేసారి చేస్తాను” అని కోరాడు.
బ్రహ్మదేవుడు ఆలోచించి మందహాసంతో “మను చక్రవర్తీ! నీ పెద్ద కుమార్తె ఆకూతిని రుచి మహర్షికి, చిన్న కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి ముగ్గురి కుమార్తెల వివాహం జరిపించు” అని చెప్పాడు.
స్వాయంభువ మనువు బ్రహ్మ చెప్పినట్టు ఆకూతిని రుచి మహర్షికి, దేవహూతిని కర్దమ మహర్షికి, మూడవ కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి ఒకేసారి వివాహం చేశాడు.
రుచి మహర్షికి, ఆకూతికి విష్ణువు అంశగా యజ్ఞుడు అనే దివ్య పురుషుడు జన్మించాడు. స్వాయంభువ మన్వంతరంలో యజ్ఞుడు మనువుని అనేక మంది రాక్షసుల నుంచి కాపాడి ప్రసిద్ధి చెందాడు.
కనిష్ఠ పుత్రిక ప్రసూతికి దక్ష ప్రజాపతికి అనేక మంది పుత్రికలు జన్మించారు. వారికి సంతానంగా దేవ రాక్షస పశు పక్ష్యాది జాతులు జన్మించి వృద్ధి చెందాయి.
*(సశేషం)*
*తరువాతి కథ రేపటి భాగంలో చదువుదాం.*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి