13, ఏప్రిల్ 2026, సోమవారం

పిల్లేదైవం

 #పిల్లేదైవం#


ప్రతిదానికీ హేతుబద్ధంగా ఆలోచించే

అప్పారావు గారు రమ్మంటే ఓ రోజు

వారింటికి వెళ్ళాను.


ఆయన కూడా సాహిత్యాభిలాషి,ఆయన గదిలో అడుగు పెట్టగానే నన్ను ఆకర్షించిన

అంశం,గదిలో అందమైన ప్రేములో

గోడకు తగిలించి ఉన్న పిల్లి ఫోటో.


ఆశ్చర్యంగా చూస్తున్న,నాస్సందేహం

అర్ధం చేసుకున్న అప్పారావు గారు

అది నా హేతువాద గురువు.అందుకే దానికి రోజూ ఓ పువ్వు పెట్టి నమస్కరిస్తుంటాను అన్నారు.ఇంకా సందేహంగా చూస్తున్న నాకు పిల్లి ఆయన గురువైన కథ ఇలా చెప్పారు.

*** . ***** ‌‌. ***** ‌‌ ***

నాకు జాతకాలమీద‌ విపరీతమైన నమ్మకం ఉండేది.ఏది చెయ్యాలన్నా

జ్యోతిష్కుణ్ణి అడిగితే కాని చేసే వాణ్ణి కాదు.


నాకు ఏభై ఏళ్ళ వయసులో కళ్ళకి

ఇబ్బందులు వచ్చాయి,ఏ గ్రహప్రభావం ‌వల్లనో తెలుసుకుందామని జ్యోతిష్కుడు

గారి‌ఇంటికి బయలు దేరాను,గేటు

తీసుకొని బయటికి వచ్చేటప్పటికీ

మ్యావు‌ అంటూ పిల్లి ఎదురొచ్చింది.


ఈ వేళ పని కాదు అనుకుని జ్యోతిష్కుడి ఇంటికి వెళ్ళాను,

ఆయన లేరు,వెధవ పిల్లి శకునం అనుకుని ఆయన ఎప్పుడొస్తారని

అడిగితే, ఇంట్లో వారు చెప్పినది

ఏమిటంటే,కళ్ళు మసకలుగా

ఉన్నాయని‌ కంటి డాక్టర్ గారి ‌దగ్గరకు వెళ్ళారుట.


ఆ మాట వినగానే నాలో జ్నాన నేత్రం తెరుచుకుంది.నేనూ కంటి డాక్టర్ గారి ‌దగ్గరకు కదా వెళ్ళాలి

అని.అప్పటినుంచి నేను జాతకాలు

జోలికి పోకుండా సహేతుకంగా

ఆలోచిస్తూ హాయిగా ఉన్నా.దీనంతటికి కారణం నాటి

పిల్లి శకునం అన్నారు.


ఇంతలో ఛాయ్ తీసుకుని వచ్చారు

ఆయన శ్రీ మతి.


ఆయన చెప్పిన పిల్లి కథ విన్నాక

మరో వింత విషయం‌ చెప్పారు.


అదేమిటంటే


ఈ మధ్య‌ యాత్రలకు వెళ్ళి నప్పుడు #వైదీశ్వన్# వెళ్ళడం జరిగిందిట.సరే జాతకాలు వదిలేసి

ఓ ఇరవై‌ఏళ్ళయింది,ఓ సారి చూద్దాం అని నాడీ జ్యోతిషం చూపించుకున్నారట.


అందులో ‌అనేక విషయాలు చెబుతూ,నీకు జాతకాలు మీద

నమ్మకం ఉండదు, కాకపోతే మీ జీవితం ఓ పిల్లి వల్ల మారింది,మీకు

నమ్మకం ఉంటే ఓ పిల్లి ఫోటో కి

రోజూ ఓ పువ్వు పెట్టి, అగరొత్తులు

వెలిగించమన్నాట్ట.


వింతగాలేదండీ‌ ఈ పిల్లి కథ.

                     ***** 

జయంతి లక్ష్మీ నరసింహం

కామెంట్‌లు లేవు: