3, మే 2026, ఆదివారం

*సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*729 వ రోజు*

అశ్వమేధ పర్వము తృతీయాశ్వాసము

ఉదంకుడి ఆగ్రహం

ఈ మాటలకు ఉదంకుడు కోపంతో ఊగిపోతూ " కృష్ణా ! దీనికంతా నువ్వే కారణం. నువ్వు తలచు కుంటే సంధి కుదిరేది. నీకు శక్తి ఉండి కూడా ప్రయత్నించక నీ మోసంతో కౌరవులను సమూలంగా నాశనం చేసావు. ఇంత ఘోరము నీ వలననే జరిగింది కనుక నేను నిన్ను శపిస్తున్నాను " అని కోపంతో పలికాడు. ఆ మాటలు విన్న కృష్ణుడు " మహర్షీ ! నేను చెప్పబోవు మాటలు విని తరువాత మీ ఇష్టము వచ్చిన విధముగా చెయ్యండి. మహర్షీ మునులకు కోపంము తగదు. కనుక శాంతం వహించి ప్రశాంత చిత్తముతో నేను చెప్పేది వినండి. అనవసరంగా నాకు శాపం ఇచ్చి తమరి అమూల్యమైన తపోబలం వ్యర్ధము చేసుకోకండి " అని అన్నాడు. ఉదంకుడు శాంతించి " సరే నువ్వు చెప్పదల్చుకుంది ఏదో చెప్పు శాంతంగా వింటాను " అని అన్నాడు. శ్రీకృష్ణుడుచిరునవ్వు నవ్వి " ఉదంకా ! నేనెవరో నీకు తెలియచెప్తాను. సత్వరజోతమో గుణములు నా యందే ఉండి నా ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తాయి. మరుత్తులు, వసువులు మొదలైన దేవతాగణములన్ని నా అందే ఉద్భవించాయి. ఈ విశ్వమంతా నేను వ్యాపించి ఉన్నాను. ఈ సృష్టి అంతా నా అందే వ్యాపించి ఉంది. పర, అపర తత్వములు నేనే. ఓంకారము, వేదములు, నాలుగు వర్ణములు , నాలుగు విధములైన ఆశ్రమాలు, వాటికి సంబంధించిన సమస్త కర్మలు, స్వర్గము, మోక్షము అన్నీ నేనే నా రూపాలే. యజ్ఞయాగాలలో నన్ను స్థుతించి యజ్ఞఫలమును పొందుతుంటారు. పాపములు చేసిన వారు కూడా నన్ను భజించి వారి పాపములకు ప్రాయశ్చితము చేసుకుంటారు. ఈ లోకములో అధర్మము పెచ్చుపెరిగి పోయనప్పుడు నేను అవతరించి అధర్మమును రూపుమాపి ధర్మమును రక్షిస్తాను. నేను బ్రహ్మగా, ఈశ్వరుడుగా, విష్ణువుగా ఆయా విధులు నిర్వహిస్తూంటను. అంటే సృష్టి, స్థితి, లయములను నేను మూడు రూపములలో నిర్వర్తిస్తుంటాను. ధర్మముకు హాని జరిగినప్పుడు అధర్మవర్తకులను రూపు మాపి ధార్మికులను రక్షించి లోకోపకారము చేస్తాను. ఉదంకా నేను సర్వసమర్ధుడిని అయినా అధర్మవర్తనులైన కౌరవులతో ధర్మవర్తనులైన పాండవులను కలపడానికి ఎంతో ప్రయత్నము చేసాను. నేను చేసిన ప్రయత్నమును వ్యాసుడు, మొదలైన మహా మునులు కూడా ప్రశంసించారు. కాని దుర్మదులైన కరవులకు నా మాటలు రుచించ లేదు. అందువలన యుద్ధమే శరణ్యం అయినది. అధర్మవతనులైన కౌరవులు సమూలంగా నాశనం అయ్యారు. జరిగిన విషయం నీకు చెప్పాను. ఇక నీవు చెయ్యతలచినది చెయ్యి " అన్నాడు. ఉదంకుడు " శ్రీకృష్ణా ! నీవు ఎవరో నీ మహిమలు ఏమిటో నాకు ముందే తెలుసు. కాని నేను తాత్కాలిక కోపానికి గురి అయ్యాను. అందుకే నిన్ను నిందించాను. నీ అమృతతుల్యమైన వాక్కులతో నా మనసులోని మాలిన్యాలను కడిగివేసావు. కాని నాకు ఒక కోరిక ఉంది. మహోన్నతమైన నీ విశ్వరూపము చూడాలని కోరికగా ఉంది. నేను అందుకు అర్హుడిని అనుకుంటే నాకు నీ విశ్వరూపము చూపించు " అని ప్రార్థించాడు. ఉదంకుడి మాటలు మన్నించిన శ్రీకృష్ణుడు నాడు యుద్ధభూమిలో అర్జునుడికి చూపించిన విశ్వరూపమును ఉదంకుడికి చూపించాడు. అనిర్వచనము, అద్భుతమైన ఆవిశ్వరూపమును చూసిన ఉదంకుడు ఏకకాలమున భయము ఆనందము ఆశ్చర్యముకు లోనై చేతులు జోడించి శ్రీకృష్ణుడిని ఇలా స్తుతించాడు. " పుండరీకాక్షా ! ఈ భూమి అంతా నీ పాదపద్మములతో నిండి పోయింది. ఆకాశమంతా నీ శిరస్సులతో నిండి పోయింది. నీ యొక్క నడుము అంతరిక్షము అంతా నిండి పోయింది. నీ భుజములు, చేతులు అన్నిదిక్కులను ఆక్రమించాయి. లెక్క లేనన్ని శిరస్సులతో చేతులతో కాళ్ళతో ఈ విశ్వం అంతా నీవే నిండి ఉన్నావు. మహాత్మా ! నీ విశ్వరూపమును కళ్ళారా చూసి ధన్యుడిని అయ్యాను. నా మనస్సు తృప్తి చెందింది. లోకోత్తరమైన ఈ విశ్వరూపమును ఉపసంహరించి నీ జగన్మోహనాకారమైన నీ సహజరూపమును ధరించమని ప్రార్ధిస్తున్నాను కృష్ణా ! " అని ఉదంకుడు ప్రార్థించాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: