3, మే 2026, ఆదివారం

శ్రీ మహావిష్ణు పురాణం

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*శనివారం 2 మే 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

               *75వ భాగము*


*సగర చక్రవర్తి నూరవ అశ్వమేధ యజ్ఞం - ఇంద్రుని చేత అశ్వం అపహరణ - సగర చక్రవర్తి అరవై వేల పుత్రుల మరణం:*```


శాస్త్ర విద్యలు, యుద్ద విద్యలు నేర్చి మహా బలవంతుడు, పరాక్రముడు అయిన సగరుడు తన తల్లి ఎల్లపుడు దుఖంతో ఉండటం గమనించి కారణం అడిగాడు. సగరుని తల్లి దుఖిస్తూ “కుమారా! హైహయులు ఆకస్మాత్తుగా అన్యాయంగా చెప్పకుండా రాజ్యంపై దాడిచేసి ఆక్రమించారు. మీ తండ్రి గర్భవతి అయిన నాతో అడవుల్లోకి వచ్చి ఔర్వ మహర్షి ఆశ్రమంలో శరణు పొందారు. నా సవతి నాకు విషం పెట్టి నిన్ను పుట్టకుండానే చంపాలని చూసింది. మీ తండ్రిగారు రాజ్యం పోయిన దిగులుతో మరణించారు. ఔర్వ మహర్షి దయ వలన నీవు జన్మించి మహావీరుడివి అయ్యావు” అని జరిగినదంతా చెప్పింది.


సగరుడు “అమ్మా! హైహయులను సంహరించి రాజ్యం గెలిచి మరణించిన తండ్రిగారిఆత్మకు శాంతి చేకూరుస్తాను”అని ప్రతిజ్ఞచేసి సేనలను సమకూర్చుకుని హైహయులపై యుద్దానికి వెళ్లాడు. యుద్ధంలో హైహయులను ఓడించి నిర్దాక్షిణ్యంగా ముక్కలుముక్కలు గా ఖండించి సంహరించాడు.


సగరుని బలపరాక్రమాలకు, జరిగిన మారణకాండకు శక యవన కాంభోజాది రాజులు భయపడి పారిపోయి సూర్యవంశ కులగురువైన వసిష్ట మహర్షిని శరణు కోరారు. వసిష్టుడు ఆలోచించి వారిని కులాచారాలు పాటించని వారిగా, బ్రతికినా చచ్చినవారిగా ప్రకటించి సగరుడి దగ్గరకు వెళ్లాడు.


“సగరా!నేను మీవంశ కులగురువుని. నా మాట వినుము. హైహయులను ఓడించి నీ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నావు. మిగిలిన రాజులందరు భూమండలానికి నిన్నుచక్రవర్తిగా అంగీకరించి సామంతులైనారు. ప్రాణభయంతో రక్షించమని శక యవన కాంభోజాదులు నన్ను శరణు వేడారు. వీరు బ్రతికుండ గా చచ్చినవారితో సమానంగా ప్రటించాను. అలాగే వైదిక కులా చారాలు పాటించనివారు అవుతారు. వీరిని ప్రాణాలతో వదిలేయుము” అని చెప్పాడు. 


సగరుడు కులగురువు మాటను గౌరవించి ఆ రాజులతో “మీమీ రాజ్యాలకు వెళ్లి నిర్భయంగా జీవించండి. నేను అభయం ఇస్తున్నాను” అని పంపివేశాడు. ఆనాటి నుండి యవనులు,శకులు, పారదులు, ప్లవులు, కాంభోజులు కులాచారాలు వదలి బ్రాహ్మణులకు దూరమై మ్లేచ్ఛులయ్యారు.


సప్త ద్వీప వసుంధరకు సగరుడు చక్రవర్తి అయ్యాడు. తన రాజ్యానికి వెళ్లి అభిషిక్తుడు అయ్యాడు. కశ్యపుని కుమార్తె సుమతి, విదర్భ రాజ పుత్రిక సుకేశిని వివాహం చేసుకుని రాజ్యభోగాలు అనుభవించ సాగాడు. చాలాకాలం సంతానం కలుగక పోవడంతో భార్యలను తీసుకుని ఔర్వ మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు.


ఔర్వ మహర్షి వారి చేత యజ్ఞం చేయించి మంత్రించిన యాగ జలం ఇస్తూ “మీలో ఒకరికి వంశాన్ని ఉద్దరించే సంతతి గల పుత్రుడు కలుగుతాడు. మరొకరికి అమితమైన బలం గల అరవై వేల మంది పుత్రులు కలుగుతారు. ఎవరికి ఏమి కావాలో కోరుకుని మంత్రజలం స్వీకరించండి” అని అన్నాడు.


సుకేశిని ఒక్క కుమారుడు పుట్టాలని మంత్రజలం తీసుకుంటే, సుమతి అరవై వేల వీరులైన పుత్రులని కోరుకుంటూ మంత్రజలం తీసుకుంది. ఔర్వ మహర్షి ఆశీర్వచనం, అనుమతి తీసుకుని నగరానికి తిరిగి వచ్చారు. కొంతకాలానికి సుకేశి నికి ఒక పుత్రుడు, సుమతికి అరవై వేల మంది పుత్రులు కలిగారు.


సుకేశినికి కలిగిన పుత్రునికి అసమంజసుడు అని నామకరణం చేశారు. పేరుకు తగ్గట్టే పెద్దవాడైన అసమంజసుడు బలవంతులైన తమ్ముళ్ళను తీసుకుని దుష్ట కార్యాలు చేస్తూ ప్రజలకు, మునులకు, బ్రాహ్మ ణులకు ఇబ్బందులు, కష్టాలు కలిగించసాగారు.యజ్ఞయాగాదులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. సగరుడు తెలిసినా పుత్రప్రేమతో కొంతకాలం ఊరకున్నాడు. 


అసమంజసునికి పెళ్లి అయ్యి అంశుమంతుడు అనే కుమారుడు పుట్టాడు. మనవడు పుట్టాక, సగరచక్రవర్తి మారని అసమంజసుని నాయకత్వం తీసేసి బహిష్కరిస్తే మిగిలిన పుత్రులందరు మంచి మార్గానికి వస్తారు అని తలచి అసమంజసుని రాజ్యం నుంచి బహిష్కరించాడు. అరవై వేల మంది కుమారులు భయపడి జాగ్రత్తగా ఉండసాగారు.


ఆగిపోయిన యజ్ఞయాగాదులు చేసి దేవతలను, మునులను, బ్రాహ్మణులను సగరుడు సంతృప్తి చేయదలచాడు. అరవైవేలమంది కుమారులు, మనవడు అంశుమం తుడు సహాయంగా ఉండగా సగర చక్రవర్తి వరుసగా తొంభై తొమ్మిది అశ్వమేధ యాగాలు చేసాడు. నూరవ ఆశ్వమేధ యాగం చేయ సంకల్పించి సగరుడు యాగదీక్షలో కూర్చున్నాడు.


నూరు యాగాలు చేస్తే సగర చక్రవర్తికి ఇంద్రపదవి పొందడానికి అర్హత లభిస్తుంది. సగరకుమారుల బలపరాక్రమాల వలన యాగం నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇంద్రుడు తెలుసుకుని సగరుడి నూరవ అశ్వమేధ యాగం భగ్నం చేయదలచాడు. భూపరిక్రమణకు వెళ్లిన యాగాశ్వాన్ని అపహరించి దొరకకుండా పాతాళంలో గల కపిల ముని ఆశ్రమంలో చెట్టుకి కట్టేసి వెళ్లి పోయాడు. కపిలముని ధ్యానంలో ఉండి చూడలేదు.


యాగాశ్వం కనపడటం లేదన్న సంగతి తెలిసిన సగరుడు, యాగ దీక్షలో ఉన్న తాను వెళ్లకూడదని, అరవైవేల మంది పుత్రులను అశ్వాన్ని వెదికి తీసుకు రమ్మని పంపాడు. భూమండలమంతా వెతికినా సగర పుత్రులకి యాగాశ్వం పాతాళంలో ఉన్నదని తెలిసింది. భూమిని తవ్వుకుంటూ మార్గం చేసుకుని సగరపుత్రులు పాతాళానికి వెళ్లారు.


పాతాళ లోకంలో వెతుకుతున్న సగరపుత్రులకు యాగాశ్వం కపిల మహర్షి ఆశ్రమంలో చెట్టుకి కట్టివేయబడి కనిపించింది. సమీపంలోనే కపిల మహర్షి తపోముద్రలో ధ్యానం చేస్తూ కనపడ్డాడు. అరవై వేల మంది సగర పుత్రులు కపిల మహర్షే యాగాశ్వాన్ని దొంగిలించి ఆశ్రమంలో కట్టేసి దొంగ తపస్సు చేస్తున్నాడని భావించారు.


ఇతనిని చంపి యాగాశ్వం తీసుకెళదాం అని ఆయుధాలతో కపిల మహర్షి పై దాడి చేయబోయారు. కన్నుల తెరిచిన కపిల మహర్షి దివ్యదృష్టితో జరిగింది గ్రహించి, ఆగ్రహించి సగర పుత్రుల వంక తీక్షణంగా చూసాడు. మహర్షి కన్నుల నుండి అగ్ని కణాలు వెలువడి అరవై వేల సగర పుత్రులను క్షణంలో కాల్చి బూడిద చేసాయి.


కుమారుల మరణ వార్త నారదుని ద్వారా తెలుసుకున్న సగరుడు బాధపడ్డాడు. యాగదీక్షలో ఉన్నందున మనవడు అంశుమంతుని పిలిచి కపిల మహర్షికి కుమారులు చేసిన దుష్కార్యానికి క్షమాపణలు చెప్పి యాగాశ్వం తీసుకురమ్మని పంపాడు. అంశుమంతుడు పాతాళానికి వెళ్లి కపిల మహర్షిని దర్శించి, వినయంతో నమస్కరించి స్తుతించాడు.


కపిల మహర్షి అంశుమంతుని భక్తి శ్రద్థలకు, వినయ విధేయతలకు ప్రసన్నుడై "అంశుమంతా! యాగాశ్వం తీసుకువెళ్లి మీ తాతగారి యాగం పూర్తి చేయించు" అని యాగాశ్వాన్ని చూపించాడు. 


అంశుమంతుడు ప్రణమిల్లి "మహర్షీ! మా తండ్రులు చేసిన దుష్కర్మలు క్షమించి, మరణించిన వారికి సద్గతులు పొందే మార్గం చెప్పండి. లేదంటే వారి ప్రేతాత్మలు ఇక్కడే ఉండిపోతాయి" అని పలికాడు.


కపిల మహర్షి కరుణించి "వత్సా! శ్రీహరి పాదాల నుండి ఉద్భవించిన ఆకాశగంగ దివి నుండి ఇక్కడకు వచ్చి ఈ చితాభస్మాలపై ప్రవహిస్తే మీ తండ్రులకు స్వర్గవాస ప్రాప్తి కలుగుతుంది. మీరు, మీ వంశజులు భూమి మీదకు ఆకాశ గంగను తెచ్చే ప్రయత్నం చేయండి" అని దీవించాడు.


అంశుమంతుడు "మహర్షీ! ఆకాశగంగను తీసుకు రావడానికి నేను తప్పక ప్రయత్నం చేస్తాను. ముందుగా ఆ పవిత్ర గంగాదేవి గురించి తెలుసుకోవాలని ఉంది" అని అడిగాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది*                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: