11, ఫిబ్రవరి 2023, శనివారం

విషయభోగములను

 *సుభాషితమ్* 


శ్లో𝕝𝕝 *భోగేచ్ఛానోపభోగేన*

*భోగినాం జాతుశామ్యతి|*

*లవణేనాన్తరాలేన*

*తృష్ణా ప్రత్యుపజాయతే||*

తా𝕝𝕝 *విషయభోగములను ఎంత అనుభవించిననూ వాటియందు కోరిక ఉపశమించదు*....ఉప్పునీరు త్రాగినచో దాహము తీరకపోగా అంతకంతకు అధికమగుట లోకప్రసిద్ధమేగదా!!

భార్య - భర్త

 భార్య - భర్త


భార్య గురించి, భార్యాభర్తల సంబంధం గురించి మహాస్వామి వారు  


వేదము ప్రతిపాదించిన శాస్త్రకర్మలు చేసితీరవలసిందే. ఇందుకోసం మానవుడు బ్రహ్మచర్యాశ్రమము తరువాత వేరొకరి సహాయం తీసుకొనవలసిందే. ఆ సహాకురాలు నీకు భగవంతుడు ఇచ్చిన బహుమానం. అది ఎప్పటికి నీనుండి విడదీయలేని ఆస్తి. ఆమె ఉపయోగం నీకు కేవలం వండిపెట్టడానికి, నీ ఇంద్రియాలకు తృప్తి నివ్వడానికి మాత్రమే కాదు. ఆమెను “ధర్మ-పత్ని”, “యజ్ఞ-పత్ని” అని శాస్త్రాలు కొనియాడాయి. కేవలం ధర్మాచరణకు ఆమె భర్తతో ఉండాలి. భర్తకు అటువంటి ధర్మానురక్తి కలిగించడం ఆమె కర్తవ్యం. ధర్మపత్నిగా ధర్మాచరణయందు ఆయన పక్కన ఉండాలి. మానవాళి సంక్షేమానికి చేసే యజ్ఞయాగాది క్రతువులందు ఆమె భర్తను అనుగమిస్తూ ఆయనకు సహాయం చెయ్యాలి. 


ఆమె తన భర్తకు కేవలం వంట చేసి, అతని ఇంద్రియాలకు సుఖాన్ని ఇచ్చినా ఆమె ప్రపంచ క్షేమాన్ని కోరుకున్నట్టే. అది ఎలాగంటే ఆమె కేవలం తన భర్తకు మాత్రమే వంట చెయ్యదు. ఆమె చేసిన వంట వల్ల అతిథులు, అన్నార్తులు, పశుపక్ష్యాదులు కూడా ఆధారపడతాయి. ఇలా ఆమె వల్ల ‘అతిథిసేవ’ ‘వైశ్వేదేవము’ కూడా జరుపబడతాయి. ఆమెకు పుట్టిన పిల్లలు కేవలం తన భర్తకు ఇచ్చిన సుఖానికి ప్రతిఫలములు కాదు. ఆమె వైదిక ధర్మాన్ని పెంపొందించడానికి వారిని కంటుంది. కుమారుల పెంపకం కూడా భవిష్యత్ ధార్మిక ప్రయోజనాలకోసమే. ప్రపంచంలోని ఏ ఇతర ధర్మము వివాహ వ్యవస్థకి ఇంతటి లక్ష్యం ఆపాదించలేదు. 


మన సనాతన ధర్మంలో స్త్రీపురుష సంబంధం కేవలం ప్రాపంచిక విషయ సుఖాలకోసం కాదు. ఆ పవిత్ర సంబంధం వల్ల ఆత్మోన్నతి, మానవ ఉద్ధరణ లభిస్తాయి. వేరే మతాల్లో కూడా దేవుని సాక్షిగానే వివాహాలు జరుగుతాయి కాని మన వివాహ వ్యవస్థ అంత ఉన్నతమైన వ్యవస్థ కాదు వారిది. మన సనాతన ధర్మంలో వివాహం, భర్తను ఉత్తమ స్థితికి తీసుకునివెళ్ళి భార్యకు పరిపూర్ణత్వాన్ని ప్రసాదించడమే. ఇంతటి మహోన్నత వ్యవస్థ వేరే సంప్రాదాయాలలో లేదు. వేరే దేశాలలో స్త్రీ పురుష సంబంధం కేవలం కుటుంబం లేదా కేవలం సమాజిక ఒప్పందం మాత్రమే. కాని ఇక్కడ వారిది ఆత్మ సంబంధం. కాని ఈ సంబంధం కూడా ప్రాపంచిక విషయాలనుంచి ఆత్మను దూరం చేసి ఆత్మోన్నతి పొందేది అయ్యుండాలి. ఇందులో విడాకులు అన్న పదానికి తావు లేదు. అది తలవడం కూడా పాపమే.


మూడు ముఖ్యమైన సంస్కారములు కలగలిసి వివాహము అనే సంప్రదాయం ఏర్పడింది. మొదటిది వేదాధ్యయనం అవ్వగానే పురుషునికి ఒక తోడు, సహాయకురాలు ఏర్పాటు చెయ్యడం. ఈ తోడు కేవలం ఇంటి అవసరాలు తీర్చడం కోసమే కాకుండా పురుషుని వైదికధర్మాచరణకు తోడ్పాటునివ్వడం. రెండవది మంచి వ్యక్తిత్వం మంచి నడవడిక గల ఉత్తమ సంతానాన్ని కనడం. వారి వల్ల ఆ వంశపు వైదికసంస్కృతి పరిఢవిల్లుతుంది. మంచి వ్యక్తులుగా ఎదిగి సంఘానికి మేలుచేసే సంతానం అవుతారు. మూడవది స్త్రీకి ప్రాపంచిక ఉనికినుండి విముక్తినివ్వడం. ఆత్మోన్నతి పూర్తిగా పొందని భర్తని అతని కర్మానుసారం భార్య నడిపిస్తుంది. అలా చేయడం వలన ఆమె పూర్తిగా భర్తకు అంకితమై అతనికంటే పైస్థాయిని పొందుతుంది. నాలుగవది పైమూడు విషయాలకోసం విచ్చలవిడి ఇంద్రియ సుఖాలను అణిచివేయడం.


కాని ఇప్పుడు మనం పై మూడింటిని మరచిపోయాము. మిగిలినది నాలుగవది ఒక్కటే శారీరక సుఖం లేదా ఇంద్రియ సుఖం. ఎల్లప్పుడూ అసత్యమైన ఈ శరీరమును సుఖింపచేయడం. మీరు నా సలహా పాటించి శాస్త్రము చెప్పిన ఉన్నతమైన ఆదర్శాలకొరకు సశాస్త్రీయ వివాహము చేసుకొన్న ఆత్మోన్నతి తప్పక పొందెదరు. చంద్రమౌళీశ్వరుడు మిమ్ము కాపాడుగాక !!!


బాలస్థావత్క్రీడాసక్తః తరుణస్థావత్తరుణీసక్తః

వృద్ధస్తావచ్చింతాసక్తః పరే బ్రహ్మణి కోపి న సక్తః ||


#KanchiParamacharyaVaibhavam #Paramacharya

మదర్స్ డే --ఫాదర్స్ డే ..

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

 *🌷మదర్స్ డే!  - ఫాదర్స్ డే!🌷*              

  ( శ్రీ చెరుకు రామమోహనరావు)

                    🌷🌷🌷 

 

మదర్స్ డే --ఫాదర్స్ డే .........

దయ వుంచి ఓపికతో ఒక్క సారి చదవండి. చదివి మీ అభిప్రాయం తెలుపండి. బాగుంటే పదిమంది తో పంచుకోండి. 

సంక్రాంతి సందడి ముగిసింది.  సెలవరోజు సంబరాలు. తలంటి స్నానాలు. కొత్త బట్టలు. పొంగళ్ళు, పూజలు. దేవాలయ సందర్శనాలు. బంధుమిత్రులకు శుభాభినందనలు. మిఠాయి పంపకాలు. మృష్ఠాన్న భోజనాలు. అన్నిటినీ అనుభవించి అలసి నిద్రాదేవిని ఆహ్వానిస్తున్నవేళ ఒక చిన్న ఆలోచన చిగురించింది.

ఈ పండగలన్నిటి చారిత్రక, పౌరాణిక కారణాలు ఏమైనప్పటికీ…నా అభిప్రాయములో…మూలాన వున్న కారణము…చెడుపై మంచి సాధించిన విజయాన్ని సంబరంగా జరుపుకోవటమే. 

మనకు అకారణమైన పండుగలు వుండవు. పాశ్చాత్యులకు సకారణమైన పండుగ ఒక్కటి లేదు. వాళ్ళు అతి గొప్పవనుకొనే పండుగలు కూడా, పాత పుస్తకాలపై కొత్త లేబుళ్ల లాంటివే! మిగిలినవన్నీ దివసాలే ! దివసము అంటే దినము అని అర్థము (Day) అది వాస్తవమే. వానిని  తద్దినాలు అనికూడా అనవచ్చు. తప్పుగా అనుకోవద్దు. తత్+దినము అంటే ఆ రోజు అని అర్థము .అది అమ్మ రోజు కావచ్చు నాన్న రోజు కావచ్చు మరే రోజైనా కావచ్చు. కానీ మన సాంప్రదాయ మదికాదు. కాలే వత్తిని కాస్త ఎగ దోస్తాము ఎందుకంటే అది ఇంకా బాగా మండాలని. అంటే మన అన్ని పండగల సారాంశము ఒకటే కాబట్టి మనలో వుండే మంచిని మళ్ళీమళ్ళీ ఉత్తేజితము చేస్తాము. పెద్దలైన తలిదండ్రులు గతించిన తరువాత కూడా వారు గతించిన దినమును గుర్తుంచుకొని మరీ జ్ఞాపకార్థము పేదలకు అన్నము పెట్టుట, బ్రాహ్మణునికి దానము చేయుట మొదలైనవి చేసి తృప్తి చెందుతాము. పాశ్చాత్య సంస్కృతికి  మన సంస్కృతికి హస్తిమశకాంతరము. వాళ్ళ పద్ధతికి మన పద్ధతికి పండుగకు తద్దినానినికి ఉన్నంత తేడా వుంది.

దాదాపు 13 వ శతాబ్దపు చివరి వరకు నాగరికత లేని ఆ జాతికి పెళ్లి అన్నది ,నేటికి కూడా,ఆడామగా సంబంధము. అదే మనకు రెండు కుటుంబాల అనుబంధం. వారిది సంబంధమే కాబట్టి ఈ రోజు ఒకరితో వుంటే రేపు వీనికి విడాకులిచ్చి వేరొకనితో సంబధం ఏర్పరచు కొంటారు . విడాకులు అన్న మాట మనకు కూడా ఉన్నదే అని ఆశ్చర్య పడవద్దు. 'ఆకు' అనే మాటకు 'కాగితము' అన్న అర్థము ఒకటుంది. 'విడి' అంటే విడిపోవుటకు అని అర్థము. ఈ పదము 'divorce papers' అన్న మాటకు అనువాదార్థకముగా వచ్చినది. మన సాంప్రదాయములలోని పెళ్లి మంత్రములలో ఈ ప్రస్తాపన ఎక్కడా రాదు. ఇక పెళ్లి చేసుకొన్నా దంపతులు అదృష్ట వశాన రెండు మూడేళ్ళు వుంటే వారికి సంతానము కలిగితే ఎవరితో వుండేది ముందే వ్రాసుకొంటారు లేకుంటే ఆ పిల్లలకు అనాధాశ్రమమే గతి. ఆమె వేరోకనితో పెళ్లి చేసుకొంటే వాడు ఆమె పిల్లలకు 'అంకులు'. ఆ మగ వాని పిల్లలకు ఆమె 'ఆంటి'. ఇట్లా స్వంత తల్లి దగ్గర లేని వాళ్ళు mothers' day రోజు వాళ్ళ అమ్మను కలిస్తే లేక వాళ్ళ అమ్మ వాళ్ళను కలిస్తే వారు కలిసి భోంచేస్తారు. తరువాత ఎవరి దోవ వారిది. ఇది MOTHERS' DAY. ఆలాగే Fathers' Day కూడా. మిగతవన్నీ మతాకర్షణ మారణాయుధాలు.

PALTO పాశ్చాత్యుల మహా పురుషుడు. ఆయన 'THE REPUBLIC' 'THE LAWS' అన్న రెండు పుస్తకాలు వ్రాసినాడు. ఆ వ్రాతలు వారికి శిరోధార్యములు. ఆయన గారి 'THE REPUBLIC' లో 'స్త్రీ' కి ఆత్మ వుండదు అది పురుషునిలో మాత్రమె ఉంటుందని నుడివినారు. అనగా స్త్రీ కేవలము ఒక వస్తువుతో సమానము. ఇది ఆయన వచనము లోని తాత్పర్యము. వారే తమ 'THE LAWS'అను పుస్తకములో స్త్రీ కి ఆత్మ లేనందున ఆమెకు ఆత్మానాత్మ విచారణ కలుగదన్నారు. అందువల్ల స్త్రీ కి న్యాయస్థానములో సాక్ష్యము నిచ్చు అర్హత లేదు.

ఇంచుమించు 14 వ శతాబ్దము వరకు ఓటు హక్కు వారికి లేదు ఎందుకంటే వారికి ఆత్మా లేదు కావున. ఇటువంటి అసమానతలు ఎన్నో కలిగి యుండిన ఈ ప్రథ ఇంచుమించుగా 1950 వరకు ఐరోపా దేశాలలో ఉండినదని విన్నాను. వారు '50 వరకు బ్యాంకులలో ఖాతా ప్రారభించుటకు కూడా అనర్హులు. ఒకవేళ భర్త భార్యను వదిలిపెడితే ఆమెను 'మంత్రగత్తె' గా పరిగణించేవారు. అటువంటి ఆడవారిని అమిత క్రూరముగా కాల్చి చంపిన ఉదంతములు వేనకు వేలు. వ్యభిచారము విచ్చలవిడిగా వుండేది. కన్న బిడ్డలను కాన్వెంట్ల వద్ద (అంటే సన్యాసినుల మఠము)(మనము బడి కి ప్రత్యామ్నాయముగా వాడే కాన్వెంటుకు ఆ అర్థము ఆంగ్ల నిఘంటువులో దొరకదు. అది కూడా తెలుసుకోకుండా మన పిల్లలను కాన్వెంటు కు పంపుచున్నాము) దిగ విడిచి పోయేవారు. వ్యభిచార నేరము కోర్టులో విచారణ జరిగితే ఆడవారి సాక్ష్యములు అంగీకరింప బడేవి కావు.

దాదాపు 200 వందల సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక్క స్త్రీ కూడా ఆమెరికాలో ప్రసిడెంటు కాలేదు.

రాత్రిరేవం వ్యరంసీత్

 

శ్లోకం:☝

*కిమపి కిమపి మందం మందమాసక్తి యోగాత్*

*అవిరళిత కపోలం జల్పతోరక్రమేణ |*

*అశిధిల పరిరంభ వ్యాపృతైకైకదోష్ణో*

*అవిదిత గతయామా రాత్రిరేవం వ్యరంసీత్ ||*


భావం: "(సీతారాములు) అతి సన్నిహితంగా ఒకరి బాహువులలో ఒకరు ఒదిగి, వారి చెక్కిలికీ చెక్కిలికీ మధ్య ఖాళీ లేకుండా ఆనించి, ఏవేవో ముచ్చట్లు  చెప్పుకుంటూ ఉండగా వారికి తెలియకుండానే రాత్రి జాములు దొర్లిపోయి యిలా గడిచిపోయింది." అని భావం.

భవభూతి ఉత్తర రామచరిత్ర లోని ఈ శ్లోకాన్ని మహాకవి కాళిదాసుకి వినిపిస్తే, అయన భవభూతిని మెచ్చుకుని "అందులో *రాత్రిరేవం వ్యరంసీత్* (రాత్రి *యిలా* గడిచిపోయింది.) అనే బదులు

*రాత్రిరేవ వ్యరంసీత్* (రాత్రే గడిచిపోయింది, మాటలు యింకా మిగిలే వున్నాయి)"

అని చెబితే మరీ బాగుంటుంది కదా అని సవరించాడట. "పరస్పరం అనురక్తులైన దంపతుల మాటలు ఎడతెగనివి. ఇంకా మిగిలి ఉంటూనే ఉంటాయి. రాత్రి జాములు మాత్రం దొర్లిపోతూంటాయి. అని అందమైన భావం వస్తుంది" అన్నాడు కాళిదాసు. దానికి భవభూతి "అవశ్యం మహాకవీ!" అని ఆ సవరణ స్వీకరించాడని ఐతిహ్యం.🙏




8, ఫిబ్రవరి 2023, బుధవారం

వేదాంతసారము

 *ఇది శంకరులు రచించిన "ఏకశ్లోకీ" వేదాంతసారము!*


కిం జ్యోతిస్తవ భానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం

స్యాదేవం రవిదీపదర్శనవిధౌ కిం జ్యోతిరాఖ్యాహి మేl

చక్షుః తస్య నిమీలినాదిసమయే కిం ధియో దర్శనే

కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభోll


నీవు సమస్తజగత్తుని దేని సాయమున చూస్తున్నావు?

పగలు సూర్యుని, రాత్రి చంద్రనక్షత్రదీపకాంతులచే! ఆ సూర్యుడినీ, దీపాదులను దేనితో తెలుసుకుంటున్నావు?

నేత్రములచే!

నేత్రములు మూసుకున్నప్పుడో?

బుద్దిచేత!

ఆ బుద్ధి దేనిచే విశ్లేషించుదువు?

నాచేత!

నాచేత అనగా,

ఆత్మచేత, కావుననే ఆ అత్మయే సర్వ ప్రకాశముగదా! అదియే నీవు అని తెలుసుకొనుము. అట్లు తెలుసుకొనుటయే మోక్షము.

*సేకరణ*

పచ్చని పాల సముద్రం

 పచ్చని పాల సముద్రం


పరమాచార్య స్వామివారిని ప్రముఖ గీత రచయిత కన్నదాసన్ కలిశాడు. ఎప్పటిలాగే వారు ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకున్నారు. ఇతఃపూర్వం కన్నదాసన్ నాస్తికుడుగా ఉండి మన మతం గురించి హేళనగా రాసేవాడు. మహాస్వామివారి ప్రభావం వల్ల మెల్లిగా మారిపోయాడు. స్వామివారే అతణ్ణి పనికిమాలిన హేతువాదం నుండి బయటకు తెచ్చారు. కాని విమర్శించడం అనే సామాన్య గుణం మాత్రం అతణ్ణి వదలలేదు.


“పాలు తెల్లగా ఉంటాయి కదా? మరి పాలకడలి ఎందుకు మేఘవర్ణంగా చూపబడుతుంది? మహావిష్ణువు రంగు పాలసముద్రంలో కలిసిపోయిందా?” అని అడిగాడు స్వామివారిని.


స్వామివారు ఒక చిరునవ్వు నవ్వి, “ఆనందంగా ఉండు. మధ్యాహ్నానికి నీకు సమాధానం దొరుకుతుంది” అని చెప్పారు.


కన్నదాసన్ కలవరపడ్డాడు. ఇక ఏమీ మాట్లాడడానికి సాహసం చెయ్యలేదు. ఆ మాధ్యాహ్నం శ్రీమఠానికి వుమ్మిడి బంగారు చెట్టి వచ్చాడు. కన్నదాసన్, వుమ్మిడి ఇద్దరూ చెట్టియార్ కులానికి చెందినవారు. వాళ్ళ పద్దతిలో వారు నమస్కరించుకున్నారు. తరువాత వుమ్మిడి బంగారు చెట్టి పెద్ద పచ్చని మరకతాన్ని స్వామివారు స్వీకరించాలని పాదాల వద్ద సమర్పించాడు. మహాస్వామి వారికి రత్నాలకు రాళ్ళకు భేదం లేదు.


వెంటనే స్వామివారు మఠం పరిచారకులని పిలిచి ఒక పాత్రలో పాలను తెమ్మని చెప్పారు. పాలు తెచ్చిన తరువాత ఆ మరకతాన్ని పాలపాత్రలో ఉంచమని వుమ్మిడికి చెప్పారు. ఇది వుమ్మిడికి పిడుగులాంటి మాట. సాధారంగా మరకతాన్ని పరీక్షించడానికి ఇలా చెయ్యడం తనకు వ్యాపారంలో అనుభవం.


కంచి శ్రీచరణులు నా ఆలోచనల్ని, ఈ రత్నాన్ని శంకిస్తున్నారా? అని అనుకుని మౌనంగా ఆ పనిచేశాడు. వెంటనే ఆచరులు కన్నదాసన్ ను పిలిచారు చూడమని. అది చూసి కన్నదాసన్ ఆశ్చర్యపోయాడు. పలు మొత్తం లేత పచ్చ రంగులోనికి మారిపోయి, పాలలో మునిగిన మరకతం నుండి ఒక చిన్న కాంతిరేఖ కనపడుతోంది.


కన్నదాసన్ కు నోట మాట రావడంలేదు. ఇది ఎలా జరిగింది? ఆచార్యులవారు అలా జరగడానికి గల కారణాన్ని శాస్త్రీయంగా వివరించి, ఇలాగే పాలసముద్రం విషయంలో కూడా, “పరమాత్మ పాల సముద్రంలో పడుకున్నప్పుడు, ఆయన నుండి కూడా ఇటువంటి తేజస్సు వస్తుంది. అందుకే అది మేఘవర్ణంగా ఉంటుంది” అని తెలిపారు.


వెంటనే కన్నదాసన్ కళ్ళు వర్షించగా, అప్పటికప్పుడే “తిరుప్పార్కడలిల్ పళ్ళికొండాయే శ్రీమన్నారాయణా . . .” (ఈ పాటను 1975లో వచ్చిన స్వామి అయ్యప్పన్ అన్న తమిళ సినిమాలో కే. జే. ఏసుదాస్ గారు అద్భుతంగా పాడారు) అన్న అద్భుత గీతాన్ని వ్రాశారు. 


వుమ్మిడియార్ కి, ఆచార్య స్వామివారు ఆశీస్సులు అందించి, ఆ మరకతాన్ని వరదరాజస్వామి దేవాలయానికి తీసుకునివెళ్ళి, దానితో స్వామివారికి మకుటాన్ని చేయించమని ఆదేశించారు. 


కన్నదాసన్ తో పాటు అతను కూడా కళ్ళనీరు పెట్టుకున్నారు. స్వామివారు మరకతాన్ని పాలలో ముంచమని చెప్పినప్పుడు అవమానపడ్డాను అనుకున్నాడు. కాని అది రత్నాన్ని పరీక్షించడానికి చెయ్యమన్నది కాదని తెలిసి పశ్చాతాప్పడ్డాడు.


ఇలాంటి ఎన్నో సంఘటనలతో జనుల అజ్ఞానాన్ని, అహంకారాన్ని పోగొట్టే జ్ఞాన గురువులు మన స్వామివారు.


జయ జయ శంకర, హర హర శంకర  


కే. జే. ఏసుదాస్ గారి అద్భుత గళంలో ఆ పాటను ఇక్కడ వినవచ్చు.

www.youtube.com/watch?v=npqGilN-7Os


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

స్వయంగా ఈశ్వరుడే

 స్వామి వారు కోరితే స్వయంగా ఈశ్వరుడే అనుగ్రహిస్తాడు.....

ఒకసారి పరమాచార్య వారి దర్శనానికి టి. ఎన్. రమణి అనే వారు వచ్చారు. వారు సమీపంలోకి రాగానే స్వామి "వేద పాఠశాల విద్యార్థులకు పండ్లు కోనివ్వగలవా "అని అడిగారు.

రమణి సంతోషం తో "తప్పకుండ."అన్నాడు.

ఇంతలో గది వెలుపల మరాఠి లో  మాట్లాడుతున్నట్లు వినిపించింది. స్వామి వారు శిష్యునితో

"వారిని లోనికి తీసుకునిరా " అన్నారు.

వచ్చిన వ్యక్తి స్వామి కి ప్రణమిల్లి తనని తాను పరిచయం చేసుకున్నాడు.

ఆయన కాశ్మీ ర్ రాజు ఆస్థానం లో చాలా కాలం పనిచేసి, పదవి విరమణ తరువాత ప్రస్తుతం సతారా లో నివసిస్తున్నానని తెలియ చేసుకొన్నాడు.

"స్వామీ! మా రాజు గారు తమ భక్తులు. దర్శనానికి వెళ్తున్నానని తెలిసి 10చెక్క పెట్టెలలో నాణ్యమైన ఆపిల్ పండ్లు పంపారు. తమకు సమర్పించమని ఆదేశించారు."అని ఆ పెట్టెలను స్వామి స్వామి ముందు ఉంచారు.

స్వామి నవ్వుతూ రమణి వైపు చూస్తూ

"ఈశ్వరుడు నీకు ఖర్చు తప్పించాడు. రెండు, మూడు బుట్టల పండ్లు వేద పాఠశాల విద్యార్థులకు వెళ్లి పంచు. ఒక బుట్ట పండ్లు నువ్వు తీసికో."అన్నారు.

స్వామి వారి చేతి మీదుగా ప్రసాదం గా ఒక్క పండు అయినా పొందాలని వందల మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. వారు బుట్ట పండ్లను అనుగ్రహించటమే వారి అనంత కారుణ్యానికి నిదర్శనం.

***ఇలాంటి సంఘటనలు శ్రీ రమణుల చరిత్రలో కూడ మనకు కనిపిస్తాయి. ఉడతల కు పెట్టడానికి జీడిపప్పు పంపటానికి వంటవారు నస పెడితే భగవాన్ "జీడిపప్పు లేవంటున్నారు. మీకేమో(ఉడతలకు )వేరుశెనగ పప్పు పోసగదు."అన్నారు. ఎక్కడో నిద్రిస్తున్న రమణ భక్తునికి కలలో ఇవే మాటలు వినిపించి దర్శనానికి వస్తూ జీడిపప్పు తెచ్చి ఇచ్చారు. (చూ. రమణాశ్రమ లేఖలు)

**శ్రీ లలితా దేవి జయంతి*

 **శ్రీ లలితా దేవి జయంతి*


*లలిత దేవి జయంతి యొక్క ప్రాముఖ్యత*


ప్రతి సంవత్సరం , మాఘ మాసం పూర్ణిమలో లలిత జయంతి ఉపవాసం పాటిస్తారు.  లలితాదేవికి భక్తి ఆరాధన చేసేవాడు , శాంతి , శ్రేయస్సు మరియు మోక్షం వైపు అడుగులు వేస్తాడు. వీటితో పాటు , ఈ ఉపవాసం అన్ని రకాల సిద్ధిలను సాధించడంలో సహాయపడుతుంది. ఈ రోజున కొన్ని ప్రదేశాలలో చాలా గొప్ప ఉత్సవాలు నిర్వహిస్తారు. దేవాలయాలలో , భక్తులు శ్రీ లలితదేవి ఆశీర్వాదం పొందడానికి క్యూలలో వేచి ఉంటారు. లలితాదేవితో పాటు , స్కందమాత మరియు శంకరుల లను గౌరవించే సంప్రదాయం కూడా ఈ రోజునే అనుసరించబడింది.  లలితా మాతను రాజేశ్వరి , షోడాషి , త్రిపుర సుందరి పేర్లతో పిలుస్తారు. లలితాదేవి పార్వతి అవతారం కాబట్టి , ఆమెను తాంత్రిక పార్వతి అని కూడా పిలుస్తారు.    


ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీలలితా త్రిపురసుందరి రెండో స్వరూపం. ఆమె శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత , పంచదశాక్షరీ మంత్రాధిదేవత. భండాసురుణ్ణి వధించడానికి మాఘ పౌర్ణమినాడు శ్రీ లలితా దేవి ఆవిర్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి.


‘మఘము’ అంటే యజ్ఞం. యజ్ఞ , యాగాలూ , పవిత్రమైన దైవ కార్యాలు చేయడానికి అత్యున్నతమైనదిగా మాఘ మాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు. అలాంటి మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే *‘మహా మాఘి’* అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర , నదీ స్నానాలు , పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. *లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత.* లలితా దేవి ఆవిర్భావ గాథ దేవీ పురాణంలో ప్రస్తావితమై ఉంది. భండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు అతని తపో నిష్టకు మెచ్చి , ప్రత్యక్షమయ్యాడు. ఎవరైనా తనతో యుద్ధం చేస్తే... ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలనీ , శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హానీ కలగకూడదనీ భండాసురుడు వరం కోరుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. వర గర్వంతో విజృంభించిన భండాసురుడు తన సోదరులతో కలిసి మూడు లోకాలనూ పీడించడం మొదలుపెట్టాడు. అతను పెట్టే బాధలను భరించలేక... నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు. మహా యాగం చేశారు. ఆ హోమ గుండం నుంచి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించి , శ్రీచక్రాన్ని అధిష్ఠించి , భండాసురుణ్ణి సంహరించింది.


ఆమె రౌద్ర రూపాన్ని శాంతింపజేయడానికి దేవతలు , మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే *‘శ్రీ లలితా సహస్రనామం’గా* ప్రాచుర్యం పొందాయి. కామేశ్వరుణ్ణి లలితాదేవి పరిణయమాడింది. సకల సృష్టినీ నిర్వహించేది వారేనని పురాణాలు పేర్కొంటున్నాయి. 


సర్వశక్తులకూ మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే... అమ్మవారిని ఏ రూపంలో పూజించినా *‘లలితా సహస్రనామా’* న్ని పఠిస్తారు. అరుణ వర్ణంలో ప్రకాశిస్తూ , పాశాన్నీ , అంకుశాన్నీ , పుష్పబాణాలనూ , ధనస్సునూ నాలుగు చేతుల్లో ధరించి ఆమె దర్శనమిస్తుంది. శ్రీ లలితా దేవిని భయాన్ని పోగొట్టి , శాంతిని ప్రసాదించే తల్లిగా  కొలుస్తారు. దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి , లలితాసహస్రనామ పారాయణ చేస్తే... కరుణాపూరితమై దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందనీ , కళల్లో ప్రావీణ్యాన్నీ , కుటుంబ సౌఖ్యాన్నీ , ప్రశాంతతనూ ,  సంపదనూ ప్రసాదిస్తుందనీ భక్తుల నమ్మిక. ప్రత్యేకించి , శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణమి రోజున... పవిత్ర స్నానాలు చేసి , లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందనీ , అలాగే *‘ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం...’* అంటూ ప్రారంభమయ్యే *‘శ్రీలలితా పంచ రత్న స్తోత్ర’* పారాయణ కూడా విశేష ఫలప్రదమనీ పెద్దల మాట.


సర్వశక్తులకూ మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే... అమ్మవారిని ఏ రూపంలో పూజించినా *‘లలితా సహస్రనామా’* న్ని పఠిస్తారు.


మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే *‘మహా మాఘి’* అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర , నదీ స్నానాలు , పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత.

సన్యాసాశ్రమం

 శాస్త్రం విధించిన సన్యాసాశ్రమం


మన దేశంలో నానావిధాలవారు సన్యాసులెందరో వున్నారు. వీరెవ్వరూ ఫలప్రదం, లాభకరం అయినపని ఏదీ చేయరు. గృహస్తులు పెట్టే భిక్షవల్లజీవిస్తూ వుంటారు. ఈ భిక్షసన్యాసులందరు పరోపజీవనులనీ, వీరివల్ల దేశానికేమీ లాభించదనీ మనపరిపాలకులలోనే కొందరు అభిప్రాయపడుతూ వుంటారు. ఈ సన్యాసి జనసమూహాన్ని కూడగట్టి ప్రజోపయోగకరమైనపని చేయిస్తే మంచిదను తలంపుతో “అఖిల భారత సాధు సంఘమ”నే సమాజాన్ని ఇటీవల నెలకొల్పారు. వీరిలో కొందరిని సంచార ప్రచారకులుగా నియమించి వారికి కొంత ప్రతిఫలం ముట్టచెప్పుతూ ప్రజాహితం సాధించాలని ఆలోచించారు. 


అవును, దేశంలో ఈ సన్యాసిమూక ఎక్కువగా నున్నమాటనిజమే. వీరు పరోపజీవనం చేస్తున్నమాట నిజమే. అలావుండటం మంచిది కానిమాట సత్యమే. కాని సన్యాసులు పరోపజీవనం చేయకూడదనే అభిప్రాయాన్నీ, సన్యాసులు భిక్షాటనవల్లనే జీవించాలనే శాస్త్రవిధిని- ఈరెంటినీ సమన్వయించడం ఎలాగూ అనేదే ప్రశ్న. 


నాలుగాశ్రమాలవారిలో సన్యాసులకు, బ్రహ్మచారులకూ మాత్రమే భిక్షాజీవనం అర్హమనీ, విహితమనీ శాస్త్రం చెప్పుతున్నది. బ్రహ్మచారులు గురుకులవాసం చేసేటప్పుడు చాలా కొలది గృహములందు 'భవతిభిక్షాందేహి' అని ఇల్లాండ్రనడిగి, తమకోసం గురువుకోసం అన్నమును తెచ్చుకోవాలి. దీనివల్ల రెండు ప్రయోజనాలు కలుగుతున్నవి. విద్యార్థి తన చదువుకోసం వినియోగించుకోడానికి ఎంతో కాలమూ, శక్తి దీనివల్ల కలిసివస్తవనేది ఒకటి; రెండోది విద్యార్జనకవసరమైన వినయమూ, చిత్తశుద్ధీ దీనివల్ల అలవడుతవనేది. గురుకుల వాసమందు ఈ భిక్షాటనం రాచబిడ్డలకూ విధింపబడింది. బ్రహ్మచారులిలా తెచ్చిన భిక్షాన్నమును గురువుకర్పిస్తే దానిని గురువు అందరికీ పంచిపెడతాడు. విద్యార్థులు గురువులకు జీతాలివ్వడమనేది ఆనాడులేదు. విద్య పూర్తి చెందిన పిమ్మట శిష్యుడు గురువునకు శక్తి కొలది దక్షిణ సమర్పిస్తాడు. దేశంలో ఉన్న రాజులవల్ల, సంపన్నులవల్ల శిష్యులు ఈ దక్షిణను సంపాదించి భక్తిపూర్వకంగా గురువులకు అర్పించేవారు. 


సన్యాసి గూడా ఇలా భిక్షాన్నంవల్ల జీవించవలసిందే. చిత్తవృత్తులను విషయజాలమునుండి మరలించి పరమాత్మ ధ్యానమందు నిరంతరంగా లగ్నం చేసివుంచడమే అతనికి విహిత కృత్యం, సన్యాసులు జీవనార్థం ఏదో వృత్తి నవలంబించి అందరివలె లాభకరమైన పనులుచేస్తూ ఉంటే, వారికి విహితమైన బ్రహ్మనిష్ఠకు భంగం కలిగితీరుతుంది. సన్యాసి సప్తభిక్ష చేసి జీవించాలని శాస్త్రం విధించింది. సప్తభిక్ష అంటే ఏడు ఇండ్లయందు మాత్రమే భిక్షనర్థించాలి. ఆ అర్థించడం గూడా ఇంటి ముందు నిలిచి అడగాలి. ఆ నిలవడం గూడా గోదోహనకాలమాత్రం నిలవాలి అంటే, ఆవును పాలుపిదుకుట కెంతకాలము పట్టునో అంతసేపే నిలవాలి. ఈ విధంగా లభించిన భిక్షాన్నముచే అతడు జీవించాలి భిక్ష దొరకనినాడు ఉపవసించాలి. సన్యాసి అల్పాహారముతో బ్రతకాలని, కష్టించి విద్యార్జనం చేయవలసిన బ్రహ్మచారి కడుపునిండా తినవలెనని కూడా దీనివల్ల ఏర్పడుతున్నదని మనం గ్రహించాలి. 


''యతిశ్చ బ్రహ్మచారీ చ పక్వాన్నస్వామినా వుభౌ||'' 


అనే శాస్త్రం యతులకు, బ్రహ్మచారులకు పక్వాన్న జీవనం విధిస్తున్నది. కనుక వారికి అన్నం పెట్టే బాధ్యతను గృహస్థులకు కూడా విధిస్తున్నదన్నమాట. ఇలాభిక్షాన్నముచే జీవించే ఈ ఉభయుల వల్లా సంఘానికి కలిగే హాని ఏమీ లేకపోగా, ఎంతో మేలు కలుగుతున్న విషయం మనం గమనించాలి భిక్షాటనంచేస్తూ చదువుకొన్న విద్యార్థి వినీతుడగుటేకాక, అట్లు సంపాదించిన విద్యావినయములచే సద్గృహస్థుడై సంఘానికి మిక్కిలి ఉపయోగిస్తాడు. ఇక సన్యాసుల మాట అడుగుతారా? సంసారభారం మోయలేక భిక్ష వల్ల అనాయాస జీవనం జరుగుతుందికదా అని కావులుగట్టిన వారందరు సన్యాసులు కారు. అట్టివారు భిక్షార్హులు కారు. ఐహికాముష్మిక ఫ భోగవిరాగియై ఆలుబిడ్డలను, ఇల్లూవాకిలిని, సౌఖ్యములను విడనాడి, యధావిధిగా ఆశ్రమస్వీకారం చేసినవారే నిక్కపు సన్యాసులు. అట్టిసన్యాసం అందరికి సుకరంగాదు. అట్టియతులే భిక్షార్హులు. బ్రహ్మనిష్ఠతో కాలంగడిపే అట్టి మహనీయులు ఉత్తమగతులకు మార్గం చూపెట్టుతూ వుంటారు. కనుక వారి వల్ల లోకాలకి మేలే కలుగుతుంది. అట్టి యతులు అరుదుగా ఉంటారు. వారిని భరించడం సంఘాని కొక కష్టంలోదికాదు. 


లోకంలో మనకు కన్పించే సన్యాసులందరు అట్టి మహనీయులు కారు. బౌధ్ధమతాన్ని అవలంబించినకొన్ని దేశాలలో ప్రజలందరు నియమనిగ్రహముల కోసం కొన్నాళ్ళు భిక్షుక వృత్తి స్వీకరించాలనే నియమం ఉన్నది. వ్రతపరిసమాప్తియైన పిమ్మట కొందరు గృహస్థాశ్రమం స్వీకరిస్తారు. తక్కినవారు భిక్షులుగానే ఉండిపోతారు. అట్టి యథార్ధభిక్షులనుచూచి, పనిపాటులొల్లని సోమరులు గూడా కొందరాదేశాలలో కావులుగట్టి భిక్షాటనం వల్ల ఆశ్రమజీవనం చేస్తూ ఉండడం కద్దు. 


ఆట్లే మన దక్షణ దేశంలో కొందరు పరదేశులమనీ, ఉత్తరదేశంలో సాధులమనీ బయలుదేరి భిక్షాటనముచే సుఖంగాజీవిస్తూ ఉంటారు. సన్యాసులకువిహితమైన వ్రతపాలనంకానీ, నియమనిష్ఠలుకాని, సంప్రదాయంకాని, ఆశ్రమస్వీకారంగాని వీరికక్కరలేదు. పొట్టకోసం దేవులాటేతప్ప వీరికి బ్రహ్మనిష్ఠతో పనిలేదు. పరోపజీవనం చేసే ఈ సోమరులను పరిహరించవలసిందే. మేము కాదనము. కానీ ఈ కలుపు మొక్కలను ఊడబెరికేయత్నంలో పైరు మొక్కలనుగూడా పీకివేయవలదనే మేము చెప్పేది. లోకసంగ్రహార్థం ఆశ్రమస్వీకారం చేసిన యధార్థ యతులను సోమరులని తెగనాడదగదు. దండ కమండులు ధారణంవల్ల, వైరాగ్యవర్తనంవల్ల గుర్తింపదగిన యదార్థసన్యాసులు ఒకానొక అచ్చమైన సంప్రదాయంలో వారై ఉంటారని కూడా మనం గ్రహించాలి. 


సన్యాసులకొక సంఘమంటూ అక్కరలేదు. ఏకాంతవాసం చేయుటేతప్ప సంఘాలుగాకూడటం సన్యాసుల లక్షణంకాదు. సంఘములుగగూడిన సన్యాసులు ఆశ్రమధర్మభ్రష్ఠులై తామూ లోకసామాన్యంలో చేరిపోతారు. 


కాబట్టి సన్యాసులకు, బ్రహ్మచారులకేతప్ప ఇతరులకు భిక్షాజీవనం పనికిరాదు. పనిపాటులొల్లక భిక్షాటనంచేసే సోమరితనాన్ని మాన్పుటకు రెండు ఉపాయములు కన్పిస్తున్నవి (1) బహుజనులకు విరివిగా పనికల్పించటం (2) సంపన్నల భోగానుభవాలకు నిరుపేద కష్టజీవనానికి వుండే వ్యత్యాసాన్ని తగ్గించడం వీనిలో మొదటిపని ప్రభుత్వానిది, రెండవది ప్రజలది జీవనపుటంతస్తు (స్టాండర్డు ఆఫ్ లివింగ్) పెరుగవలెనంటూ నేడుపఠించే మంత్రాలకు ఫలితమేమిటంటే, భోగసక్తి పెరగడమే భోగాలను విడనాడి, గ్రాసవాసోదైన్యం లేకుండా, మితంగా, సౌమ్యంగా బ్రతకడమే నిజమైన సోషలిజమనిపించుకుంటుంది. శీతావాతాతపముల నుండి రక్షించే సముచిత వస్త్రధారణం, జిహ్వచాపల్యం కోసం కాక శరీరధారణం కోసం భుక్తి. ఇదే సోషలిజపు లక్షణము దేహధారణ మాత్రమైన భుక్తియే అపరిగ్రహమనిపించుకొంటుంది. దేశసంపదను విజ్ఞానాభివృద్ధికి, దేశరక్షణకు వినియోగించాలేకాని భోగానుభవాలకై వెచ్చించకూడదు. జీవనవ్యయాన్ని సరళజీవనానికిసరిపడేటట్లుతగ్గించాలిగాని పెంచకూడదు. అలాచేస్తే ప్రజలందరకు సరిపడ్డ కూడు గుడ్డలు, నివాసమూ లభిస్తవి. 


నేడు అదనపు సంపదగల దేశాలు, పురుషులు ఆ సంపదను రాజకీయంగా తమతో ఏకీభవించే దేశాలకు, యుధ్ధంలో తమకు తోడ్పడే దేశాలకు పంచిపెట్టడం జరుగుతూ ఉంది. ఇది కూడనిపని. అదనపుసంపదను పేదదేశాలకు, ప్రజలకు ఇవ్వడం న్యాయం. ఏ దేశానికాదేశం తమకున్న సంపదతో తృప్తి పడటం నేర్చుకుంటే, జీవనపుటంతస్థుననుభవించే దేశాలు ఆ యంతస్తును కాపాడుకోవడాని కెప్పటికప్పుడు విదేశ విపణులను ఆక్రమించుకొంటూ వుండటం, ఆ కృత్రిమపు వాపు ఎప్పుడు బుస్సున తీసిపోతుందో అని భయపడతూ వుండడం తప్పదు. మింటిఎత్తు పెరిగినవానికి పడిపోతానేమో అనే భీతి వెంటాడుతూనే వుంటుంది. ఇతర దేశాలను అనుకరిస్తే, ఎప్పటికైనా మనకూ ఈ దురవస్థ పట్టుతుంది. 


ఇంతకూ సన్యాసానికి, సంఘటనకు చుక్కెదురనేది ప్రస్తుతం. సన్యాసులను పోషించే భారాన్ని సంఘం వహించక తప్పదు. పొట్టకోసం భిక్షాటనం చేసేవారికి పనిపాటులు చూపించాలి. యధావిధిగా ఆశ్రమ స్వీకారం చేసిన సన్యాసులను, పరోపజీవనం చేసే సోమరులను నిందింపరాదు. సన్యాసులను సంఘటితపరచి, ప్రభుత్వం చేయవలసిన పనులను వారిచే చేయింప బూనడం కూడా యుక్తంగాదు.                        


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- “జగద్గురు బోధలు” నుండి


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఉద్యోగం పురుషలక్షణమ్!!*

 *సుభాషితమ్* 

*అశ్వస్య లక్షణం వేగం*

*మదో మాతంగ లక్షణమ్!*

*చాతుర్యం లక్షణం స్త్రీణాం*

*ఉద్యోగం పురుషలక్షణమ్!!*


గుఱ్ఱము యొక్క లక్షణం పరుగెత్తడం. ఏనుగు లక్షణం మదము కలిగిఉండడం. చతురతతో మాట్లాడుట స్త్రీల లక్షణము. అలాగే, ఉద్యోగము చేయడం పురుషుల లక్షణం.