2, ఆగస్టు 2024, శుక్రవారం

మానసికంగా

 *ఎలా మానసికంగా దృఢంగా ఉండాలి*, 


*చిన్న చిన్న వాటికే ఎమోషనల్ అవ్వడం ఎలా కంట్రోల్ చేయాలి ?*


మానసికంగా దృడంగా ఉంటే చాలు , చాలా సమస్యలను తేలికగా పరిష్కరించగలరు.


1.) ఏ విషయాన్ని మనస్సు తో కాక పరిస్థితులను బట్టి ఆలోచించండి.


2.)మనస్సు తో ఆలోచించటం వల్ల మనం ఆ విషయాన్ని అన్ని కోణాలను గమనించ లేము.


3.) చిన్న చిన్న విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే అనుకోకుండా మన ముందుకు వచ్చే పెద్ద విషయాలను ఎదుర్కునే ధైర్యం లేక ప్రక్క వారి పై ఆధారపడ వలసి వస్తుంది


4.)ప్రతి విషయానికి మనకు ఎవరో ఒకరు ఉండాలంటే మనం ఎక్కడ ఉన్న వాళ్ళం ఎప్పటికి అలాగే ఉంటాము.


5.) ప్రక్కవారిపై ఎక్కువ గా ఆదారపడటం వల్ల వాళ్ళ దృష్టి లో మన పై వారికి గౌరవం ఉండక చులకనగా చూస్తారు , లేదా ఆలోచిస్తారు . తరువాత కాలం లో ఇబ్బందు లు రావచ్చు


6 ) .మనల్ని మనం గౌరవించికుంటూ , మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే నెమ్మదిగా మన మనస్సుకి ఆ ధైర్యం వచ్చేస్తుంది , అవసరాలు మనకు అన్ని తప్పక నేర్పుతాయి.


7.)  మనం చేయవలసింది ఒక్కటే మనపై మనకు నమ్మకం ఉండాలి


8.)ఎదుటి వారు మన గురించి చెప్పింది నిజం అని నమ్మక్క ర్లేదు , మీకు మీరుగా చెక్‌ చేసుకోని మీ మనస్సు ఏమి చెబుతుందో తెలుసుకోండి .


9.)ఒకటి రెండు సార్లు అర్దం కాకపోయినా పర్లేదు , అర్దమైయేంతవరకు మీకు మీరు సమయాన్ని కేటాయించండి


10.) మీ మనస్సు మీది ,అది మీ మంచినే కోరుతుంది.అప్పుడు మీరు మనస్సు చేతిలో కాక మనస్సు ను మీ మాట వినేలా తేసుకోగలరు.

డ్రై ఫ్రూట్స్

 *ఏ డ్రై ఫ్రూట్స్.. ఎంత పరిమాణంలో తింటే హెల్తీ*


*డ్రై ఫ్రూట్స్ ! ఇవి ఆరోగ్యానికి మంచిదని చాలా మంది సూచిస్తారు. ప్రొటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఇవన్నీ ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి కావాల్సినవి*. 


*వీటన్నింటిని పొందడానికి డ్రై ఫ్రూట్స్ ఒక ఆప్షన్. అయితే ఇవి ఆరోగ్యానికి మంచిది కదా అని.. ఇష్టమొచ్చినట్టు తినకూడదు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అయితే ఎంత పరిమాణంలో తినాలి*. 


*ఏ డ్రై ఫ్రూట్స్ ఎన్ని తింటే ఆరోగ్యకరం ?* 


*డ్రైఫ్రూట్స్ ను తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి?* 


*లాభాలేంటి..?*


 *డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.*


*అలాగే.. షుగర్స్, క్యాలరీలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని 20 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. అలాగే డైరెక్ట్ గా తినడం కూడా మంచిది కాదు. కాబట్టి.. డ్రై ఫ్రూట్స్ తినే విధానం, ఏ నట్స్ ఎంత పరిమాణంలో తినాలి అనేది ఇప్పుడు చూద్దాం..*


*బాదం :*


*బాదాంపప్పులో మోనో శ్యాచురేటెడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్ట్ కి, బ్రెయిన్ కి , స్కిన్ కి మంచిది. అలాగే ఆల్మండ్స్ లో విటమిన్ ఈ, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెజర్ నార్మల్ గా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహకరిస్తాయి. రోజుకి 4 నుంచి 7 బాదాం గింజలు తినడం వల్ల వీటిని నుంచి అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.*


*వాల్ నట్స్ :*


*వాల్ నట్స్ పైన ఉండే బొప్పి తీయగానే.. ఉండే స్కిన్ ఫ్లేవర్ అంత టేస్టీగా ఉండదు. కానీ.. 90 శాతం యాంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్ యాసిడ్స్, టాన్నిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఈ స్కిన్ లోనే ఉంటాయట. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని రోజుకి 3 నుంచి 4 తీసుకోవచ్చు.*


*కర్జూరం :*


 *కర్జూరమనగానే చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో మనుషులు హెల్తీగా ఉండటానికి ఉపయోగపడే న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫ్రాక్టోజ్ ఇందులో రిచ్ గా ఉంటుంది. మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండటానికి కర్జూరం ఉపయోగపడుతుంది. వీటిని రోజుకి మీడియం సైజులో ఉండే 1 లేదా రెండు తీసుకుంటే సరిపోతతుంది.*


*పిస్తా:*


*పిస్తా వెల్ నెస్ కి చిహ్నం. ఇవి బలానికి, ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో మిగిలిన డ్రైఫ్రూట్స్ లో కంటే ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు.*


*జీడిపప్పు :*


*జీడిపప్పు రెగ్యులర్ గా తినడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వారానికి 28 జీడిపప్పులను తినడం ఆరోగ్యకరమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.*



*ఎండుద్రాక్ష:*


*ఎండుద్రాక్షను ఎక్కువ మోతాదులో తిన్నా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇందులో విటమిన్ బి, పొటాషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకి గుప్పెడు ఎండుద్రాక్ష తినవచ్చు. 50 ఎండుద్రాక్షలు తినవచ్చు. అయితే మహిళలు రోజుకి ఒకటిన్నర కప్పు, మగవాళ్లు 2 కప్పుల ఎండుద్రాక్ష తినాలని నిపుణులు సూచిస్తున్నారు.*

శ్రీదత్త పురాణము

 శ్రీదత్త పురాణము

ద్వితీయభాగం

(మొదటిది -1)


సూత మహర్షి ఇలా చెప్తున్నాడు. శౌనకాది మునులారా బ్రహ్మ కలిపురుషుడుకి చెప్తున్న దీపక వేదధర్ముల సంభాషణ ఇలా జరిగింది. అంతా కూలంకషంగా చెప్తాను ఆలకించండి. వేదధర్ముడు చెప్పిన యదు - అవధూత సంభాషణని విన్న దీపకుడు శ్రద్ధగా విని పులకరించిపోయి, ఆనందంతో గురూత్తమా! నీ పాద పద్మాలను సేవించుకొనే భాగ్యం నాకు దొరికింది. నేను ధన్యుణ్ణి నన్ను కన్న తల్లి తండ్రులు ధన్యులు, ప్రహ్లాద - అజగర సంభాషణ - యదు - అవధూత సంభాషణలు రెండుకి రెండు అత్యంత మనోహరాలు

నిగూఢార్ధ ప్రభోధాలు. అయినా తనివి తీరలేదు. ఇంకా దత్త మహిమల్ని వినాలి తెలుసుకోవాలి అనే కుతూహలం నా

మనస్సును తొందరపెడుతున్నది. దయచేసి మిగతా దత్త కధలు కూడా చెప్పి నన్ను తరింపజెయ్యండి నా జన్మ చరితార్ధం చేసుకొంటాను. దప్పికతో ఉన్నవాడు మధుర పానీయాలు ఆశించినట్లు నేను దత్త కధామృతాన్ని యాచిస్తున్నాను అనుగ్రహించు అన్నాడు. నాయనా దీపకా ఈ దత్త కధల పట్ల నీకు ఇంత ప్రీతి కలుగడం నిజంగా నీ అదృష్టం. జనన మరణాలతో సంబంధం లేని ముక్తి నీకు లభించును. దత్త కధలలో అద్భుతమైన సుమతి వృత్తాంతంవుంది చెబుతాను విను. 


*సుమతి వృత్తాంతం*


అనగనగా ఆర్యావర్తంలో ఒక పల్లెటూరు. ఆ వూళ్లో ఒక బ్రాహ్మణుడు. వేదవేదాంగ పారంగతుడతడు. సర్వసద్గుణ సంపన్నుడు. సర్వసౌమ్యుడు. శాంత స్వభావి. ధర్మపత్నీ సమేతుడై యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తూ ఆచరిస్తూ వుండేవాడు. కాని ఎంతకూ వారికి సంతానం కలుగలేదు. ఇంక మన బ్రతుకులు ఇంతే ! ఈ తనువు ఇలా

రాలిపోవలసిందే అని దిగులు చెందుతున్న నడి వయస్సులో వారి కలలు ఫలించి ఆమె కడుపు పండింది. పది నెలలూ మోసి పండంటి మగ బిడ్డను ప్రసవించింది. బంగారు మేనిఛాయతో దివ్యతేజస్సుతో సౌందర్య రాశిలా వున్నాడు బిడ్డడు. రోజుల గడుస్తున్న కొద్దీ బిడ్డడు అంధుడని, చెవిటివాడని, మూగవాడని ఆ తల్లితండ్రులు గుర్తించి భోరు భోరున విలపించారు. అవిటివాడైతేనేమి కొడుకు పుట్టాడు అంతే చాలు అనుకొని గుండెలురాయి చేసుకొని బ్రతుకుతున్నారు.

అల్లారుముద్దుగా బిడ్డడిని పెంచుకొంటున్నారు. సుమతి అనినామకరణం చేసి సంబరపడ్డారు. ఏనాటికైనా అతడు

ఆరోగ్యవంతుడవుతాడని ఆశతో ఎదురుచూస్తూ జీవితం గడుపుతున్నారు. కాని అది అడియాశే అయ్యింది. ఏ చైతన్యం

లేని జడపదార్థంలా సుమతి ఎదుగుతున్నాడు. ఎనిమిదేళ్ళు వచ్చాయి. వయస్సుకు తగిన బుద్ధి వికసించలేదు. కాని ముఖ వర్చస్సు మాత్రం అద్భుతంగా వుండేది. ఉపనయనంజేసి కనీసం గాయత్రినైనా జపిస్తే ఫలితం కలుగుతుందని తండ్రి ఆశపడి ముహూర్తం ఏర్పాటు చేసి ఒడుగు జరిపించాడు. చెవిలో గాయత్రిమంత్రం జపించాడు. విన్న అలికిడి ఆ బిడ్డ ముఖంలో కన్పించలేదు. తండ్రి గాంభీర్యం అంతా సడలిపోయింది. అయ్యో నాయనా ఇంత జడుడుగా వున్నావేరా అంటూ బిడ్డని గుండెలకు హత్తుకొని భోరుభోరున విలపించాడు. బిడ్డలు లేనంతకాలం అదొక్కటే దిగులు ఇప్పుడు నిన్ను పెంచిపెద్ద చెయ్యటం అనుక్షణము మాకు అగ్ని పరీక్ష అంటూ దుఃఖించాడు. ఏ జన్మలో ఏ పాపం

చేసానో ఈలాంటి బిడ్డని భగవంతుడు అనుగ్రహించాడని ఇదీ ఒక పరీక్షే అని ఆ దంపతులు ఒకరినొకరు ఓదార్చుకొని దుఃఖిస్తున్నారు.

ఓ రోజు సాయంకాలం సంధ్యను ఉపాసింపజేసి తొమ్మిదేళ్ళ సుమతిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తనయా ! ఉపనయనం చేసాను. వేదాధ్యయనానికి నీకు వయస్సు వచ్చింది. గురుకులంలో వేస్తాను గురుసేవ చేస్తూ చదువుకో బాగా వివేకం సంపాదించు. వయస్సు వచ్చాక వేదాధ్యయనం అయ్యాక అనువైన సంబంధం చూసి నీకు వివాహం జరిపిస్తాను. గృహస్థాశ్రమం ధర్మబద్ధంగా నడిపి సత్పుత్రులను పొంది వారికి నీ బాధ్యతలు నెరవేర్చి వానప్రస్థాశ్రమం

స్వీకరించి ఆ తరువాత అనుబంధాలన్ని తెంపుకొని

సన్యాసంపుచ్చుకో. ఆ దీక్షతో నీకు ముక్తి లభిస్తుంది. సుమతి

అంతా శ్రద్ధగా వింటున్నాడు అతడికి అన్ని తెలుస్తున్నాయి అనే భ్రమతో పాపం ఆ పిచ్చి తండ్రి ఇంతటి బోధ చేస్తున్నాడు. సుమతి మాత్రం ఉలకలేదు, పలకలేదు అసలు అతనికి వినిపించిందో లేదో కూడా తెలియలేదు. తనపుత్ర వ్యామోహానికి తానే దిగులుపడి కళ్ళల్లో నీళ్ళు కుక్కుకున్నాడు. పాపం ప్రతీ రోజు ఈ తంతు ఇలా

జరుగుతూనే వుంది. ఒకనాటి మధ్యాహ్నం సమయాన సుమతి హఠాత్తుగా మాట్లాడాడు. తనను తానే నమ్మలేనంతగా

ఆశ్చర్య చకితుడై వింటున్నాడు తండ్రి. తండ్రీ విూరంటున్న వేదాలు శాస్త్రాలు కళలు కావ్యాలు ఇవి అన్నీ నేను ఎన్నో సార్లు అభ్యసించాను. ఇవి ఏమీ నాకు కొత్తకాదు. గ్రుడ్డి, మూగ, చెవుడు, జడుడు అనుకున్న కొడుకు ఇలా మాట్లాడటమేమిటి అని ఆశ్చర్యపోతున్నారు కదా! ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు. నా కథ చెబుతాను విను. ఇంతవరకూ నేను కొన్ని వేల జన్మలు ఎత్తాను. అవన్నీ నా కళ్ళ ఎదుట బొమ్మలు లాగా కదులుతున్నాయి. ప్రతిజన్మలో జరిగిన ప్రతీ విషయం నాకు జ్ఞాపకం ఉంది.

ఎందరెందరు తల్లిదండ్రులు ఎందరెందరు బంధుమిత్రులు ఎందరెందరు భార్యాపుత్రులు లెక్క పెట్టి చెప్పడం ఎవ్వరి తరమూకాదు. ఎన్నెన్ని సుఖాలు ఎన్నెన్ని దుఃఖాలు ఎన్నెన్ని అనుభవాలు ఎన్నెన్ని అనుభూతులు. తలుచుకుంటేనే తల తిరిగిపోతుంది నరజన్మలేనా మృగజన్మలేనా పశుపక్షి, కీటకాదిక్రిముల జన్మలేనా అన్నీ నేను అనుభవించాను. ప్రతి పుట్టుకా ఒక నరకం మలమూత్ర పంకిలమైన జననీ జఠర నివాసం. శైశవ, బాల్య, యౌవన, కౌమార, వార్థక్యాలలో సుఖదుఃఖాల వెలుగునీడలు స్వయం కృతాలు, పరాకృతాలు, అన్ని చాలా రుచి చూసాను. భృత్యజన్మల్లో కృంగిపోయాను. రాజజన్మల్లో విర్రవీగాను. పిరికిపందగా పారిపోయాను. మహాశూరుడిగా విజృంభించాను. దరిద్ర, ధనిక, చోర, కిరాతక, జూదరిజన్మలు ఎన్నో ఎత్తి వంచించాను, వంచింపబడ్డాను. త్యాగిగా కీర్తింపబడ్డాను. లోభిగా నిందింపబడ్డాను. సర్వాంగ సౌందర్యాలు, అంగవైకల్యాలు అన్నీ గుర్తువున్నాయి. అవన్నీ కలిగించిన నిర్వేదంతో ఈనాడు ఇలా జడపదార్థంలా

మారిపోయి మీ ఇంటిలో జన్మించాను. పూర్వజన్మస్మృతి లేకపోవడం నిజంగా మానవుడివరం. లేకపోతే నాలాగే అందరూ జడపదార్థముల వలె ఉండేవారు. నిర్వేదంలో మునిగిపోయేవారు సరే - ఆ జన్మలూ, ఆ కష్టాలు, ఆ వైరాగ్యాలు, వాటి మాటకేం గాని తండ్రీ నీవు చెబుతున్న వేదోక్త కర్మలపట్ల నాకు సదభిప్రాయం లేదు. అవి నాకు

రుచింపవు. యజ్ఞయాగాదులు చెయ్యడం స్వర్గ సౌఖ్యాలు అనుభవించడం సంపాదించుకున్న పుణ్యం ఖర్చుకాగానే మళ్ళీ భూలోకంలో గర్భవాస నరకం అనుభవించడం ఏదో ఒక జన్మ మళ్ళీ ఎత్తడం మళ్ళీ దుష్కర్మలు సత్కర్మలూ నరకయాతనలు సుఖదుఃఖాలు అనుభవించడం మళ్ళీ పుట్టడం మళ్ళీ గిట్టడం ఇంతేగదా జనన మరణ చక్రంలోబడి కొట్టు మిట్టాడటం. దీనికి విసుగూ విరామం లేదా ? నువ్వంటునట్లు కర్మమార్గం ఇంతకన్నా ఉత్తమ పదాన్ని అందిస్తుందా? ఇంతకన్నా ఉన్నతపదం ఉంది అని అసలు నీవు గుర్తించావా? జననమరణాలకు అతీతమైన శాశ్వత ఆనందధామం కదా మనం చేరుకోవలసింది దాన్ని పొందాలి అంటే జ్ఞాన మార్గం ఒక్కటే శరణ్యం. నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించడం

ఒక్కటే జ్ఞానమార్గం, సర్వ సంగపరిత్యాగము, రాగద్వేషాది ద్వందాలకు లొంగని ప్రవృత్తి అలవరచుకోవడమే జ్ఞానమంటే.

ఇది ఉన్నవాడికి దుఃఖం ఉండదు. కర్మబంధం ఉండదు. జన్మరాహిత్యమే చివరఫలం. తండ్రీ ఇది నువ్వు తెలుసుకోవాలి.

ఆశ్చర్యచకితుడై కళ్ళు అప్పగించి తండ్రి రవ్వంత తేరుకున్నాడు. ఇంతటి జ్ఞాని తన ఇంట పుట్టినందుకు ఆనందం కల్గుతున్నా చిన్నవాడి వైరాగ్య మాటలు అతన్ని కలవరపరచాయి. జడుడు అనుకున్నవాడు నేడు జ్ఞాని అయ్యాడని సంతోషించాలో ఈ ధోరణికి దుఃఖించాలో అగమ్యగోచరంగా ఉంది. నాయనా సుమతి ఏమిటి నీ మాటలు, ఒక్కనిమిషంలో నీకు ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది? పూర్వజన్మల స్మృతి ఎలా కలిగింది? ఏదైనా శాపకారణంగా

నీవు మా ఇంట జన్మించావా ? నన్ను మీ అమ్మను మళ్ళీ దుఃఖ సాగరంలో ముంచి వెళ్ళిపోతావా? అసలు నీ జన్మ రహస్యం ఏమిటి ? చెప్పు అని ఆందోళనతో అడిగాడు. వేదవేదాంగాలు అభ్యసించిన తండ్రి పుత్రవ్యామోహంతో అలా రోదిస్తుంటే సుమతికి నవ్వు వచ్చింది. ఇలా అన్నాడు. తండ్రీ నీకు పుత్రుడుగా జన్మించడానికి ముందు చాలా శాస్త్రాలు అభ్యసించాను. ఆ ఇంటికి వచ్చిపోయే సాధు సజ్జనులతో సాంగత్యం కలిగింది. వేదాంగ చర్చలు అనేకం

చేసాను. ముక్తిమార్గాలు తెలుసుకున్నాను. జ్ఞానం ఉదయించింది. అంతరంగం నిండా వెలుగునింపుకొంది. ఏకాంత వాసంలో చాలాకాలం గడిపాను. నా నియమనిష్టలు పరిపక్వదశకు వచ్చే సమయంలో, బ్రహ్మసాక్షాత్కారం లభించే సమయంలో ప్రమాద వశాత్తు మరణించాను. యోగశక్తికారణంగా అప్పటి నుండి నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. నేను చేసిన జ్ఞాన దానాల ఫలితంగా పదివేల పూర్వజన్మల్లోని అన్ని విషయాలు నాముందు నిలచాయి. నిర్వేదంతో, సంగాతీత, ద్వంద్వాతీత స్థితి కలిగింది. దానినే ఈ జన్మతోను కొనసాగించదలచాను. ఇప్పుడు ఆ జ్ఞాన మార్గాన్ని

విడిచి నువ్వు చెప్తున్న కర్మమార్గం అవలంభించలేను. ఏ మార్గంలో ఎవరు ప్రయాణం చేసినా అందరూ చేరుకొనేది గమ్యమే. అదే అందరి లక్ష్యము. నా మార్గంలో నేను గమ్యం చేరుకుంటాను. అందువలననే ఈ జడ స్థితి. కాలం వృధా చేసుకోకూడదు కదా ! ఈ శరీరానికి ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికెరుక, కనుక ముక్తిలభించే వరకు అనుక్షణము ఆత్మానుభవపరుడ్నై తదేక దీక్షలో గడపడం నా ధృడసంకల్పం. నీ ఇంట పుట్టాను కనుక పితృఋణం తీర్చుకోవడం

నా ధర్మం. జ్ఞాన దానం చేసి ఋణ విముక్తి పొందుతాను. తండ్రీ నీకేమైనా సందేహాలుంటే అడుగు అన్నాడు. ಆ కిందటి క్షణం వరకు జడుడుగా ఉండి ఇప్పుడు ఇంతటి జ్ఞానిగా ప్రసంగిస్తున్న కొడుకు ఆ తండ్రికంటికి మహాయోగీశ్వరుడులా కనిపించాడు. హిమాలయ శిఖరంలా గోచరించాడు. సుమతికి తాను పెట్టిన పేరు సార్ధకమయ్యిందని సంబరపడ్డాడు. కుమారా, నాయనా ఇంతకీ ఇప్పుడు నా కర్తవ్యము ఏమిటి చెప్పు. నేను ఈ జన్మ పరంపరలలో ఇలా మునిగి తేలవలసిందేనా ! దీనికి విముక్తి ఏమిటి ? దయచేసి తెలియచెప్పు. కన్నకొడుకుతో మాట్లాడుతున్నానన్న చనువు, మహాజ్ఞానితో మాట్లాడుతున్నానన్న బెరుకు తండ్రి స్వరంలో వినిపించాయి. సుమతి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తండ్రితో ఇలా అన్నాడు. తండ్రీ నా మాటలమీద నీకు నిజంగా గురి కుదిరింది కదా ! అయితే చెబుతాను విను. ఈ సంసారము నిస్సారమని ముందు నువ్వు గ్రహించు. ఆ తరువాత ఆలస్యం చేయకుండా గృహస్థాశ్రమం వదలి వానప్రస్థం స్వీకరించి అమ్మతో సహా అడువులకు వెళ్లి భగవధ్యానం చేసుకుంటూ నిస్సంగత్వం అలవరుచుకో, ఆ పైన సన్యాసం స్వీకరించు.క్షేత్ర, క్షేత్రజ్ఞ విలువలను గుర్తించు, ద్వంద్వ ప్రవృత్తిని జయించు. ఏకాంతవాసంతో, యోగాభ్యాసంతో అంతరేంద్రియాలను నిగ్రహించు. భిక్షాటనతో దేహాన్ని నిలుపుకుంటూ నిరంతరం జాగరూకుడవై యోగ మార్గాన పయనిస్తే ఆత్మ బ్రహ్మైక్యానుసంధానం చెందుతుంది, భవరోగాలన్నింటికీ అదే దివ్య ఔషధం. జనన మరణాల చక్రము నుండి బయటపడే సాధనం ఇదే, మరొకటి లేదు. యోగమార్గాన ప్రయాణం చేయడమే శరణ్యం. ఈ క్షణములోనే నీవు ధృడంగా సంకల్పించుకో. నాయనా ! కళ్ళు తెరిపించావు. ఈ సంసారము నుండి బయటపడాలి. బయటపడాలి అనుకోవడమే తప్ప

బయటపడే మార్గం తెలియక ధైర్యంచాలక కొట్టుకుంటున్నాను. దారి చూపించావు. ధైర్యం కలిగించావు. జన్మ పరంపరల సుడిగుండం నుంచి తప్పించే యోగవిద్య నాకు ఉపదేశించు. భవదావాగ్నిలో మాడిపోతున్న నా అంతరంగానికి బ్రహ్మ జ్ఞానమనే జడివానతో ఉపశమనం కలిగించు. అవిద్య కృష్ణసర్పం కాటువేసి మూర్ఛపోయిన నన్ను నీ మంత్రోపదేశంతో బయటపడేయి. . ఇల్లు వాకిలి ఇల్లాలు బిడ్డలు ధనధాన్యాలు ఇలా వేయి పాశాలు ముడివేసుకొని గిలగిలా కొట్టుకుంటున్నాను. యోగవిద్య అనే ఖడ్గంతో నా బంధనాలు ఛేదించి స్వేచ్ఛ ప్రసాదించు. తండ్రీ! యోగాభ్యాసానికి కావలసిన పరిణతి నీకులభించింది. తప్పకుండా ఉపదేశిస్తాను. వెనుక దత్తయోగీంద్రుడు

అలర్కుడికి చెప్పిన యోగవిద్య నీకు చెప్తాను, శ్రద్ధగా విను. నాయనా కుమారా నువ్వు బోధించే యోగవిద్యలో ఈ అంశాలు వస్తాయో రావో, మళ్ళీ చివరలో ఈ సందేహాలు గుర్తుంటాయో ఉండవో అందుకని ముందే అడుగుతున్నాను. దత్తయోగీంద్రుడు ఎవరు? అలర్కుడు అంటున్నావు. ఆయన ఎవరు? వీళ్ళ జన్మ వృత్తాంతాలు ముందుగా చెప్పి ఆపైన యోగవిద్య చెబుదువుగాని. తండ్రీ అడగవలసిందే అడిగావు. వీరిద్దరి గురించి చెప్పకుండా యోగవిద్య ఎలా చెప్పగలను. ముందుగా దత్త యోగీంద్రుని ఆవిర్భావానికి హేతువయిన పావన గాధ చెబుతాను విను.


Post:- సనాతన ధర్మం,



ఓం శ్రీదత్తాయ గురవే నమః 

హరిః ఓం తత్సత్ 

ఓం తత్సత్  ఓం తత్సత్ ఓం తత్సత్

ఆగష్టు,03, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐* 

       🍁 *శనివారం*🍁

 🌹 *ఆగష్టు,03, 2024*🌹

     *దృగ్గణిత పంచాంగం*

                   

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - కృష్ణపక్షం*


*తిథి : చతుర్ధశి* సా 03.50 వరకు ఉపరి *అమావాస్య*

వారం :*శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం : పునర్వసు* ప 11.59 వరకు ఉపరి *పుష్యమి*


*యోగం : వజ్ర* ఉ 11.01 వరకు ఉపరి *సిద్ధి*

*కరణం : శకుని* సా 03.50 *చతుష్పాద* రా 04.12 తె వరకు 


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 10.30 - 12.00 సా 04.00 - 06.00*

అమృత కాలం :*ఉ 09.29 - 11.09*

అభిజిత్ కాలం :*ప 11.48 - 12.39*


*వర్జ్యం : రా 08.28 - 10.10*

*దుర్ముహుర్తం : ఉ 05.49 - 07.31*

*రాహు కాలం : ఉ 09.01 - 10.37*

గుళిక కాలం :*ఉ 05.49 - 07.25*

యమ గండం :*మ 01.50 - 03.26*

సూర్యరాశి : *కర్కాటకం* 

చంద్రరాశి : *కర్కాటకం* 

సూర్యోదయం :*ఉ 05.49* 

సూర్యాస్తమయం :*సా 06.38*

*ప్రయాణశూల :‌ తూర్పు దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.49 - 08.23*

సంగవ కాలం :*08.23 - 10.57*

మధ్యాహ్న కాలం :*10.57 - 01.30*

అపరాహ్న కాలం :*మ 01.30 - 04.04*

*ఆబ్ధికం తిధి :ఆషాఢ బహుళ చతుర్దశి*

సాయంకాలం :*సా 04.04 - 06.38*

ప్రదోష కాలం :*సా 06.38 - 08.52*

నిశీధి కాలం :*రా 11.51 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.19 - 05.04*

______________________________

           🌹 *ప్రతినిత్యం*🌹

*_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🌹 *శ్రీవేంకటేశపంచకస్తోత్రం*🌹


1. శ్రీధరాధినాయకం శ్రితాపవర్గదాయకం

       శ్రీగిరీశమిత్రమమ్బుజేక్షణం     

       విచక్షణమ్ ।

       శ్రీనివాసమాదిదేవమక్షరం  

      పరాత్పరం    

      నాగరాఙ్గిరీశ్వరం 

      నమామి వేఙ్కటేశ్వరమ్ ॥

 *వచ్చే వారం రెండవ స్తోత్రం* 


<><><><><><><><><><><><><><><>

           🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹

🙏🪷🌹🛕🌹🌷🪷🌷🙏

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

లోపము

 లోపము

-------------

సీ||

పంచమ స్వరమున బాడునేమో గాని

       పికము నలుపనుచు బేరు గలుగు!

సొంపైన రంగుతో నింపైన వాసనల్

        చల్లు గులాబీకి ముల్లు గలుగు!

కడలి గంభీరమై కన్పట్టునే గాని

       యుదకంపు రుచిమాత్ర ముప్పనౌను!

రాయంచ నడకలు రమణీయమే గాని

        కంఠస్వరము కొంత కఠిన మనుచు

తే.గీ||

మంచి నెంచక తప్పుల నెంచువాని

జెంతకును బిల్చి నల్వురు జెప్పిరిటుల!

"ఇతరులందున లోపాల నెంచునట్టి

లోపముండెను గాదె నీలోన మనుజ!"


---------కోడూరి శేషఫణి శర్మ

*శ్రీ గణనాథోద్భవము

 *శ్రీ గణనాథోద్భవము!* మూలం: శ్రీ శివ మహాపురాణం!

12కం.

చెక్కిలి నొక్కుచు కొమరుని

మక్కువ దాముద్దులాడి మరిమరి గనుచా

నుక్కరిని నిల్పి వాకిట

గ్రక్కున జనె జలకమాడ గౌరియు సఖులున్!!


భావము: కుమారుని బుగ్గలను నొక్కుచూ ప్రీతితో ముద్దులాడి బలవంతుడైన బాలకుని ద్వారము వద్దనిల్పి చెలికత్తెలతో తాను స్నానానికి వెళ్ళెను.


(అమ్మ ఆజ్ఞప్రకారం బాలకుడైన జగన్మాత నందనుడు ద్వారపాలకుడుగా అమ్మ మందిర వాకిట నిలబడి వున్నాడు.)

నిత్యపద్య నైవేద్యం

 నిత్యపద్య నైవేద్యం-1566 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-201. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


 సుభాషితం:

అదత్తే త్యాగతా లజ్జా 

దత్తేతి వ్యథితం మనః l

ధర్మ స్నేహాంతరే న్యస్తా:

దుఃఖితాం ఖలు మాతర:ll


తేటగీతి:

ఆడపిల్లకు పెళ్లి కానంత వరకు 

తల్లి కెంతయో సిగ్గుండు నుల్లమందు 

పెళ్లి యయ్యాక కొమరితన్ విడిచియుండ 

తల్లి మనసెంతొ దిగులుగా తల్లడిల్లు.


భావం:

ఎదిగిన ఆడపిల్లకు పెళ్లి కానంత వరకు తల్లికి సిగ్గుగా ఉంటుంది. పెళ్లైతే కూతురుని విడిచి ఉండటానికి తల్లి మనసు బాధ పడుతుంది. ఇలా ఒక వైపు కర్తవ్యమూ, మరొక వైపు మమత.. ఈ రెండింటి మధ్య చిక్కుకున్న తల్లుల మనసు దుఃఖిస్తుంది.

శ్రీరామ స్తుతి🙏

 🌸శ్రీరామ స్తుతి🙏


పట్టాభిరామ ! నీపావననామమ్ము

    తలచిన జన్మంబు ధన్యమగును

కోదండరఘురామ ! కోర్కెలు తీర్చుమా 

   కోసలాధీశుడా ! కోరి కొలుతు

జనకునిజామాత ! జానకీ ప్రాణేశ !

   జగమేలు జగదీశ ! జయము జయము

సకలలోకములకు సంరక్ష  సర్వజ్ఞ

   సజ్జనసేవిత సాధుశీల

తే.రమ్ము మముకావ రఘు నాథ !  రమ్య దేహ !

ధర్మ పాలన చేసిన ధర్మవీర !

పరమపావన రఘు వంశి ! పరమపురుష !

దశరథాత్మజ ! రఘువీర ! ధర్మ తేజ


జయలక్ష్మి

మఱ్ఱి చెట్టు.

 

               మఱ్ఱి చెట్టు.          

 వేయి పుల్గులు రేయి విదిత నిద్రాముద్ర 

నంకించి సుఖియించి టెంకిపట్టు 


పగటియెండకు తాపభరి తాంగములు వసి 

వాడు పాంథుల కెల్ల నీడ పట్టు 


వంగవోల్ సరకుల బండ్లకు మరలి పో 

యెడు వేళ యగు దాక విడిది పట్టు 


 చుట్టు పట్టుల నుండు బొట్టె ల కానంద 

మను పదమ్మును పంచు నాట పట్టు 


క్రమ్మి నంత మేరయు నంగి గప్పి పుచ్చు 

దట్టపుo జొంపముల తోడ నిట్టు నట్టు 

గాలి కూగాడు కొమ్మలై కొంచు వారి 

మనము లలరించు నా పెద్ద మఱ్ఱి చెట్టు. 


పండ్ల కెంపులు నాకుల పచ్చలును చి 

గుళ్ల పగడాలు పండు టాకులను దర్శ 

నీయ గోమేది కములు నై నిత్య రత్న 

మండనాంచిత మా పెద్ద మఱ్ఱి చెట్టు. 


అవసరమ్మని తోచి నపుడెల్ల కొమ్మలు 

కఱకు గొడ్డళ్లతో నఱకుచున్న 


విస్తళ్ళకని యెల్ల వేళల నేచి యా 

కులను దోటుల తోడ కోయుచున్న 


దంత ధావనకు నుత్తమమములం చెగబడి 

చేసేత నూడలు చీల్చుచున్న 


వైద్యమ్మునకు పాలు వలెనంచు కత్తులు 

పెట్టి బోదెకు గాట్లు పెట్టుచున్న 


నడరు వడక పరోపకారార్థ మీ శ 

రీరమని పూని తను వెల్ల చూఱ లిచ్చు 

మనజులకు వితరణ గుణ మాననీయ 

విమలతర కీర్తి న్యగ్రోధ వృద్ధ మూర్తి. 

దేవీదాస శర్మ.

నిను నిను నిను నిన్ను నిన్ను నినునిను నిన్నున్

 : అనుదినమారాధించెడి 

ధన లక్ష్మి తనను కొలువగ తగిన విధముగా 

ధన,కీర్తులివ్వ బిలుచును 

నిను నిను నిను నిన్ను నిన్ను నినునిను నిన్నున్ 


శనగల చంద్రశేఖర్

:

 ప్రతిరోజూ ఆరాధింపబడే ధన లక్ష్మి, తనను తగినవిధముగా కొలిచిన నిన్ను, నిన్ను, నిన్ను ఇలా మీ అందరిని ధనము, కీర్తి ని ఇవ్వడానికి పిలుస్తుంది 

అని ఊహించి రాసాను సార్