15, ఫిబ్రవరి 2026, ఆదివారం

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము


*652 వ రోజు*

ఏనుగుని ఇవ్వడానికి గౌతముని షరతులు

చివరకు గౌతముడు ఏనుగును ఇవ్వడానికి అంగీకరిస్తూ " రాజా ! పుణ్యకార్యములు చేసిన వాడికి సుఖములు, పాపకార్యములు చేసిన వాడికి కష్టములు కలిగించగలిగిన ప్రదేశం అయిన యమసభకు వస్తే నేను ఈ ఏనుగును నీకు ఇస్తాను. ఆ మాటలకు రాజువేషంలో ఉన్న ఇంద్రుడు నవ్వి " గౌతమా ! పాపములు చేసిన వారు నాస్తికులు పోయే చోటు అయిన యమసభకు నేను ఎలా రాగలను " అన్నాడు. గౌతముడు " రాజా ! అదేమిటి యముడు పుణ్యాత్ముడు కదా ! అక్కడకు రానని చెప్పడం మర్యాదగా ఉంటుందా ! " అన్నాడు. ఇంద్రుడు " అది కాదయ్యా ! యముడు తల్లి, తండ్రులని అక్కను భక్తితో పూజించి పుణ్యాత్ముడయ్యాడు. అక్కడకు నేను రాను " అని అన్నాడు. గౌతముడు " సరేలే గంగానది ఒడ్డుకు రా అక్కడ నేను ఏనుగును ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " గౌతమా ! నదీతీరాన అతిథులను సత్కరించి పిదప భుజించేవారు, పరుల నుండి ఏమీ పుచ్చుకునే వారు ఉంటారు కనుక అక్కడకు నేను ఎలా రాగలను ? " అని అడిగాడు. గౌతముడు " కానీ మేరుపర్వతము వద్దకు రా అక్కడ నేను ఈ ఏనుగును ఇస్తాను. ఇంద్రుడు " అదేమిటయ్యా ! మృదువుగా మాట్లాడే వారు, ఎల్లప్పుడు సత్యము పలికేవారు, సర్వభూతములను ప్రేమించేవారు, అందరి మీద దయ కలిగినవారు ఉంటారు అక్కడకు నేను ఎలా రాగలను " అన్నాడు. గౌతముడు " అయితే నారదుడు విహరించే వనముకు రా అక్కడ ఏనుగును ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " అక్కడ ఉన్న నృత్యకళా కోవిదులతో నారదుడు వినోదిస్తూ ఉంటాడు. అక్కడకు నేను ఎలా రాగలను " అన్నాడు. గౌతముడు " పోనీ 'ఉత్తరకురుభూములకు రా అక్కడ దేవతలు విహరిస్తుంటారు. దేవేంద్రుడు కూడా అక్కడకు వచ్చి దేవతల కోరికలు తీరుస్తుంటాడు. అక్కడ నీకు ఏనుగును ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " అది కుదరదయ్యా ! అక్కడకు కామము, హింస విడిచి పెట్టిన వారు వస్తారు. ఆచోటుకు రావడం నా తరంకాదు " అన్నాడు. గౌతముడు " చంద్రుడి ఇంటికి రా అక్కడ నీకు ఏనుగును ఇస్తాను " ఇంద్రుడు " అక్కడ కుదరదులే. అక్కడ దానం చేసే వారు, మరొకరి దానము పుచ్చుకొనని వారు అక్కడకు వస్తారు. నేను దానం తీసుకోవడానికి అక్కడకు ఎలా రాగలను " అని అన్నాడు. గౌతముడు " పోనీ సూర్యలోకముకు రా ! అక్కడ ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " మంచితపస్సు, సాధ్యాయనం చేసే వారు వస్తారు. కనుక అక్కడకు నేను రాలేను " అన్నాడు. గౌతముడు " పోనీ వరుణలోకముకు రా ! అక్కడ నీకు ఏనుగును ఇస్తాను " అని అన్నాడు. ఇంద్రుడు " యజ్ఞ, యాగములు, నిత్యాగ్ని హోత్రములు చేసే వారు వస్తారు. అక్కడకు నేను రాను " అని అన్నాడు. గౌతముడు " పోనీ ఇంద్రుడి వద్దకు రా అక్కడ ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " అమ్మో అక్కడకు యుద్ధ వీరులూ, యజ్ఞమును చేసిన సోమయాజులు, నూరేండ్లు జీవించిన మానవులు ఉంటారు. అక్కడకు నేను రాను " అన్నాడు. గౌతముడు " పోనీ ప్రజాపతి లోకానికి రా అక్కడ ఏనుగును ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " అక్కడకు అశ్వమేధయాగము చేసినవారు వస్తారు. నేను అక్కడకు రాను " అన్నాడు. గౌతముడు " పోనీ గోలోకముకు రా అక్కడ ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " అక్కడకు గోదానము చేసిన వారు, తీర్ధయాత్రలు సేవించిన వారు, నిరంతరం బ్రహ్మచర్యము అవలంబించువారు వస్తారు. అక్కడకు నేను రాను " అన్నాడు. గౌతముడు " రాజా ! శీతోష్ణములు, సుఖదుఃఖములు, మిత్రులు శత్రువులు లేని ద్వదందములకు అతీతమైన బ్రహ్మలోకముకు రా ! అక్కడ నీకు ఏనుగును ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " అది కుదరదులే ! అక్కడకు సంగత్వము లేని వారు, ఆత్మజ్ఞానంతో ప్రకాశించే వారు, ఎల్లప్పుడూ వ్రతనిష్ట కలిగిన వారు, ఆధ్యాత్మ విద్యయందు ఆసక్తికలవారు వస్తారు. అక్కడకు నేను రాలేను " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: