27, ఫిబ్రవరి 2026, శుక్రవారం

మనస్సును ఎలా స్వాధీనం చేసుకోవాలి ?

 శ్రీరామ (99)


       ( మనస్సును ఎలా స్వాధీనం చేసుకోవాలి ? )



శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్// 

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).


                           ------------





ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎన్ని విన్నా, భగవద్గీత, రామాయణ,భారత, భాగవతాది  గ్రంథాలు ఎన్ని చదివినా, ఆ విషయాలు అనుభవంలోకి తెచ్చుకోటానికి సాధన చేయాలి.


ఆ సాధనలో ప్రధానమైనది మనస్సును స్వాధీనం చేసుకోవడం.


మనస్సు అతివేగంగా సంచరిస్తుంది కాబట్టి దానిని స్వాధీనం చేసుకోవాలంటే  ముందు మనస్సుయొక్క వేగాన్ని తగ్గించాలి.

మనస్సుయొక్క వ్యక్తరూపం వాక్కు కాబట్టి,

 ఆ వాక్కును ఒక మంత్రంమీదో, ఏదైనా భగవన్నామము మీదో పెట్టటంవల్ల మనస్సుయొక్క  వేగం క్రమంగా తగ్గుతుంది.

అంతేకాదు క్రమంగా భగవంతుని దర్శనం కూడా అవుతుంది.

అయితే దీనికి ప్రధానమైన అడ్డంకి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే అరిషడ్వర్గం.

వీటికి సంబంధించిన ఆలోచనలు మనస్సుయొక్క వేగాన్ని మామూలు ఆలోచనలవల్ల సంభవించే వేగం కంటే నూరింతలు ఎక్కువ చేస్తాయి.

అందువల్ల ముందు ఈ అరిషడ్వర్గమును జయించాలి.

అది ఎంతో కష్టసాధ్యం కాబట్టి,

" స్వామీ !  వీటిని జయించడం నావల్ల కాదు, నీవే అనుగ్రహించాలి " 

అంటున్నారు శ్రీ ధూర్జటిమహాకవి.


శా//నీ నా సందొడబాటు మాట వినుమా! నీచేత జీతంబు నే/

గానిం బట్టక సంతతంబు మది వేడ్కన్ గొల్తు,నన్తస్సప/

త్నానీకంబున కొప్పగింపకుము, నన్నాపాటియే జాలు దే/

జీ నొల్లం గరి నొల్ల నొల్ల సిరులన్, శ్రీకాళహస్తీశ్వరా//


(ఓ శ్రీకాళహస్తీశ్వరస్వామీ!మనమిద్దరము ఒక ఒప్పందం చేసుకుందాము.

నేను నీకు మనస్ఫూర్తిగా సేవ చేస్తాను. 

ఒక్క ఏగానీ(తొంభై ఆరు ఏగానీలు ఒక రూపాయి) కూడా జీతంగా పుచ్చుకోను.

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము లనే అంతశ్శత్రువు లకు నన్ను అప్పగించవద్దు.

 జీతం బదులు సేవాఫలంగా ఇది ఒక్కటీ అనుగ్రహిస్తే చాలు. 

గుర్రాలు, ఏనుగులు (ఆ కాలంలో వాహనాలు), మరి ఏ సంపదలూ,నాకు వద్దు.

ఈర్ష్యా,ద్వేషాలవంటి ఆలోచనలు నా మనస్సులోకి రాకుండా నన్ను కాపాడితే చాలు స్వామీ, శ్రీకాళహస్తీశ్వరా! ).


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

27-2-'26.

కామెంట్‌లు లేవు: