27, ఫిబ్రవరి 2026, శుక్రవారం

పట్టుదల, ఓర్పు, ఉండాలి.

 శ్రీరామ (96)


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


ఏ కార్యం సాధించాలన్నా పట్టుదల, ఓర్పు, ఉండాలి.

రాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడని, పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసము చేశారని చదువుతాము.

ఆ వనవాసం ఎంత కష్టమైనదో, అప్పుడు వారు ఎన్ని కష్టాలు పడ్డారో క్షణం కూడా ఆలోచించము.

అలాగే మహర్షులు నిరాహారులై, ఎండా వానా లెక్క చేయకుండా తపస్సు చెయ్యటం గురించి కూడా.

ఈ కథలన్నీ కేవలం పారాయణ చేసి పుణ్యం సంపాదించుకోవాలని కాకుండా,

మనం కూడా ఓర్పు, సహనశక్తి అలవర్చుకొని కార్యసాధకులమవాలని ఋషుల ఆశయం.


పూర్తిగా అందుకు భిన్నంగా మన ప్రవర్తన ఎలా ఉంటున్నదో శ్రీ ధూర్జటిమహాకవి 

ఇలా చెబుతున్నారు.


 మ// ఒకపూటించుక కూడు తక్కువగునే నోర్వంగలే డెండకో /

పక నీడన్వెదకుం జలింజడిసి కుంపట్లెత్తుకో 

జూచు వా /

నకు నిండిండ్లును దూఱు నీ తనువు, దీనన్వచ్చు సౌఖ్యంబు రో /

సి కడాసింపరుగాక మర్త్యులకటా శ్రీకాళహస్తీశ్వరా !


(ఓ శ్రీకాళహస్తీశ్వరా! ఈ మానవుడు తనకు ఆహారం తక్కువయితే ఒక్క పూటకూడా ఓర్చుకోలేడు.

ఎండను భరించలేక నీడకోసం వెతుకుతాడు. 

చలికి ఓర్చుకోలేక కుంపట్ల దగ్గరకో,చలి మంటల దగ్గరకో వెళ్లి కాచుకుంటాడు.

దారిలో వర్షం వస్తే తడవకుండా ఉండటానికి ఇళ్లల్లో దూరుతాడు.

ఇదంతా తన శరీరం కష్టపడకూడదనేగా !

ఈ శరీరం వల్ల వచ్చే సుఖం అశాశ్వతమని గ్రహించి పరమార్థం కోసం ఈ మానవుడు శ్రద్ధతో ఏ ప్రయత్నమూ చేయడం లేదు. అకటా!ఎంత శోచనీయమైన విషయము!)


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

27-2-'26.

కామెంట్‌లు లేవు: