వాడుకతెలుగులో అపప్రయోగాలు - డా. రవ్వా శ్రీహరి
అంతర్బహిర్పోరాటం - పోరాటం తెలుగు పదం, ఇది వైరి సమాసం, సాధుప్రయోగం కాదు.
అంతర్కళాశాల, అంతర్జాతీయ, అంతర్దేశీయ, అంతర్రాష్ట్రీయ (అంతారాష్ట్రీయ అనాలట) మొదలైన వాటిలో అంతర్ అంటే లోపలి (అంతరాత్మ వలె) అనే అర్థమై కానీ “మధ్యన” అన్న అర్థం రాదట.
“అక్షతలు” సరి, అక్షింతలు, అక్షంతలు కాదు.
“అగణిత”ప్రతిభాశాలి (గణింపబడని) కాదు, “అగణ్య”ప్రతిభాశాలి (గణింపశక్యం కాని) అనాలి.
“అగ్నిమాపకదళం” అంటే అగ్నిని కొలిచేది అని అర్థం, తెలుగు “మాపు” ధాతువు, “అక”ప్రత్యయాన్ని చేర్చుకుని సంస్కృతంలో లేని “మాపకం” అనే పదంగా మారడమే వింత.
అధిగమించడమంటే పొందడం అనే అర్థం, అతిక్రమించడం, అతిగమించడం అనే అర్థాలు రావు.
అధీనం (ధర్మి వాచకం) కు ముందు షష్ఠీవిభక్తి పొసగదు, అధీనత (ధర్మ వాచకం) సరైన అర్థాన్నిచ్చే ప్రయోగం.
అధ్వర్యం, ఆధ్వర్యం కాదు - “ఆధ్వర్యవం” సరైన ప్రయోగం. యజ్ఞంలో ఆధ్వర్యుడు ప్రధానుడు.
అనుకూలవతి అంటే అనుకూలుడు(రు) కలిగిన స్త్రీ, “అనుకూ అంటే చాలు, కోరుకున్న అర్థం వస్తుంది.
అనుయాయుడు అనే తత్సమం చేయడానికి అనుయాయ అనే రూపం లేదు, “అనుయాయి” సరైనది.
అపరిచయత్వీకరణ అనడం సరి కాదు, అపరిచయీకరణ అనో అపరిచతత్వీకరణ అనో అంటే సరిపోతుంది.
అపురూపం అనేది అపూర్వం అన్నమాటకు వాడుకలో జరిగిన మార్పేమో. “అప”రూపం (దుష్టరూపం) తప్ప అపురూపానికి సంస్కృతంలో ఆధారం లేదు.
అభ్యంగన కాదు “అభ్యంజన”మే సరి. “అభ్యంగం” కూడా తలంటు అనే అర్థంలో యుక్తమే.
అయిష్టం వ్యాకరణ సమ్మతం కాదు, (న+ఇష్టం) “అనిష్టం” అని వాడాలి, “అనితర” లాగా.
“అర్ధరాత్రం” అనేది ఆర్థరాత్రకు తత్సమం, అర్ధరాత్రి సరికాదు.
అసభ్యకరంగా అంటే అసభ్యాన్ని కలిగించే విధంగా, ఈ ప్రయోగం సరి కాదు. “అసభ్యం”గా లేదా “అసభ్యతాకరం”గా అనవచ్చును.
అహోరాత్రం సరైన రూపం, అహోరాత్రులు, అహోరాత్రాలు, అహోరాత్రుళ్లు కాదు.
ఆదర్శవంతం అంటే ఆదర్శాలు కలది అని అర్థం, ఆదర్శమైనది అన్న అర్థం రాదు.
సంస్కృత అపేక్షా తెలుగులో “అపేక్ష” అవుతుంది కానీ, అక్కరలేని దీర్ఘంతో ఆ-పేక్ష కాదు.
ఆధునీకరణం కాదు, ఆధునికీకరణం.
“ఆశిస్సు” సాధురూపం, శీ-కి దీర్ఘం లేదు.
“సాంతం” అంటే సరిపోతుంది, ఆ-సాంతం అంటే అనటంతో కూడిన దానివరకు అనే విపరీతార్థం.
ఆసురీ లేదా అసురీ (స్త్రీలింగం) గుణాలు (పుంలింగం) సరి కాదు, అసురగుణాలు సరి.
ఆహ్వానితులు (ఆహ్వానం కలవాళ్ళు) సరి కాదు, “ఆహూతులు” (ఆహ్వానింపబడిన వారు) సరి.
వరరుచి పబ్లికేషన్సు (1995), హైదరాబాద్ వారికి, శ్రీమతి ఆర్. అనంతలక్ష్మి గారికి ధన్యవాదములతో.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి