21, ఏప్రిల్ 2021, బుధవారం

వాక్సిన్ లో వాక్సిన్లు ( స్కెచ్ )

వాక్సిన్ లో  వాక్సిన్లు ( స్కెచ్ )

నిన్న నేను మధ్యాన్నం బోహాజనం చేసి ఒక కునుకు తీద్దామనుకొని పక్కమీదికి వారీగాను కొంతసేపటి తరువాత దూరంగా ఒక కేక వినిపిస్తున్నది. ఈ మధ్య రోడ్డుమీద బండ్లపైన అమ్మేవాళ్ళు చిన్న మీకు ఒకటి పెట్టుకొని దానిలో రికార్డు చేసిన వాటిని ప్లే చేస్తూ  అమ్ముకుంటున్నారు. సరిగ్గా అటువంటి శబ్దమే వినపడుతుంది. ముందుగా కొంచం చిన్నగా వినపడ్డ తరువాత చెవులకు బిగ్గరగా వినపడుతుంది. అది ఏమిటా అని నేను ఆలకించాను . 

వాక్సిన్ లో  వాక్సిన్లు కోవెడు వాక్సిన్లు కావాక్సీన్, కవిషీల్డు, స్పుటినిక్ వాక్సిన్ లో  వాక్సిన్లు బాబు ఇప్పుడు వాక్సిన్లు వేసే బండి మీ వీదిలోకే వచ్చింది, మీ ఇంటిముందుకే వచ్చింది అమ్మలారా, అయ్యలారా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అని వినపడుతుంది. 

 అప్పుడు నాకనిపించింది ఇదేమి చిత్రంరా నాయన వాక్సిన్లు ఇంటి ముందుకే వచ్చి వేస్తున్నారు అదికూడా కూరగాయలు అమ్మినట్లు అని నేను అనుకునేలోపలే నన్ను ఎవరో తట్టి లేపినట్లయింది ఎవరా అని చుస్తే అది నా శ్రీమతి మీ నిద్ర చాలుకాని ఇంటిముందుకి కూరగాయల బండి వచ్చింది వెళ్లి ఏవైనా రెండు మూడు కూరలు కొనండి అని ఫూరమాయించింది.  నేను అప్పుడే మగత నిద్రలోంచి లేవటం వల్ల ఒక క్షణ కాలం అయోమయంగా అయ్యింది వెంటనే లేచి వాష్ బేసిన్లో మొఖం మీద దోసెడు నీళ్లు కొట్టుకొని టవల్తో తుడుచుకుంటుంటే అప్పుడు ఆ మైక్ శబ్దం నాకు ఇలా వినపడుతుంది 

కూరలండి కూరలు తాజా తాజా కూరలు కూరలమ్మే బండి ఇప్ప్పుడు మీ వీధిలోకి వచ్చింది, మీ ఇంటిముందుకే వచ్చింది అమ్మలారా, అయ్యలారా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అని వినపడుతుంది. 

అప్పుడు కానీ నాకు ఇందాక మగత నిద్రలో నేను కల కన్నానని తెలిసింది.  లేకపోతె వాక్సిన్లు బండి మీద తీసుకొని వచ్చి ఇవ్వటమే ఏమిటి. 

మనం ఇప్పుడు ఒక విచిత్రమైన మానసిక స్థితిలో వున్నాము అదేమిటంటే ప్రస్తుతం మన మనస్సు పూర్తిగా ఈ ముదరాష్టపు కరోనానే నిండి వుంది. మనం లేచి వున్నా, నిద్రలో వున్నా, కలత నిద్రలో వున్నా లేక మగత నిద్రలో వున్నా మనం పూర్తిగా కరోనా గూర్చే ఆలోచిస్తున్నాము. ఇక మన మిత్రులకు ఫోన్లో 

మీరు వాక్సిన్ వేయించుకున్నారా  

లేదు 

అయ్యో ఇంకా వేయించుకోలేదా అప్పుడే మేము రెండో డోసుకు కూడా దగ్గర పడుతున్నాము. నా సెల్ఫీ పిక్ గ్రూపులో పెట్టాను చూడలేదా  

వాక్సిన్ వేసుకున్న తరువాత మీకేమైనా ప్రాబ్లమ్ అయ్యిందా. 

ఆ బాబా దయవల్ల నాకు కొంచం జ్వరం వచ్చింది ఇంజన్క్షన్ ఇచ్చిన చోట రెండు మూడు రోజులు నొప్పి చేసింది. కానీ నా శ్రీమతికి మాత్రం నొప్పి కొంచం ఎక్కువగా అయ్యింది.  ఇప్పుడు మేమిద్దరం ఓ.కే. మీరు ఇప్పడి దాకా ఎందుకు వేయించుకోలేదు.  ఇంకా ఆలస్యం చేయకండి వెంటనే వెళ్ళండి లేదంటే మీరు బ్లాకులో కొనాల్సి రావచ్చు. ఇప్పుడు మన దగ్గారలోని ఓం సాయి ఆసుపత్రిలో కూడా వేస్తున్నారట. నేను మాత్రం జనప్రియ పక్కనే గవర్నమెంట్ ఆసుపత్రిలో వేయించుకున్నాను. జనం మరి అంతగా లేరు. కానీ టెక్సట్లు చేసుకునే వారు కూడా ప్రక్క ప్రక్కగా వున్నారు. అది కొంచం జాగ్రత్తగా ఉండాలి. మీరింకా ఆలస్యం చేయకండి వెంటనే వెళ్ళండి మరొక సారి ఉచిత సలహా ఇచ్చాడు మిత్రుడు. మా చుట్టాలు అందరు రెండో డోసుకూడా వేసుకున్నారు నేనే వెనక పడ్డా నంటే మీరు మాకన్నా వెనక పడ్డారు (ఇండైరెక్టుగా తానేదో ఘన కార్యం చేసినట్లు నను చేయనట్లు దెప్పి పొడుపు )

ఈ సంభాషణలు నిత్యం అనేక మందితో జరుగుతున్నాయి. ఇక కొంతమంది అయితే అదేమిటి రావు నీవు ఇంత భయస్తుడొనుకో లేదు పెద్దగా ఏమి నొప్పి చేయదు మాములుగా ఉంటుంది వెంటనే వేళ్ళు. ఇలా కొంతమంది. ఏతా వాత తేలేది ఏమిటంటే మనం ఎవరికి ఫోను చేసినా కరోనా, వాక్సిన్ కాక వేరొక విషయం లేకుండా పోయింది. 

అయ్యా నేను పూర్తిగా ఇంట్లోనే ఉంటున్నాను. కనీసం మా ఇంటి గుమ్మం ముందుకు కూడా వెళ్ళటం లేదు నేను ఎందుకు భయపడాలి అంటే కాదు ససమీరా నీవు వాక్సిన్ వేసుకోవలసిందే ఇది ప్రస్తుత ట్రాండు. 

సహజంగా ప్రతి మనిషి ఒక ఇల్యూసొంలో ఉంటాడు అదేమిటంటే తానూ చేసింది కరెక్టు తనకే అన్ని తెలుసు ఎదుటువాడిని ఏమి తెలియదు. వాడిని తానూ ఉద్దరించాలి అని అనుకోవటమే కాదు తానె ఉద్దరించినట్లు పదిమందికి చెపుతువుంటాడు. ఈ దోరణి ఇప్పుడు బాగా పెరిగింది. 

ఇక కొంతమంది వాక్సిన్ వేసుకున్న రెండో రోజునుంచే పని వున్నా లేకున్నా రోడ్లమీద బలాదూర్ తీరుగుడు తిరుగుతున్నారు. అటు వైద్య శాఖ వారు మీరు వాక్సిన్ తీసుకున్న జాగ్రత్తగా వుండండి, మాస్కు పెట్టుకోండి ఇల్లు వదలకండి అని వేనోళ్ళ చెపుతున్నా అవి అన్ని పెడచెవిన పెడుతున్నారు. మేము వాక్సిన్ వేసుకున్నాము మాకు ఏమి కాదు అనే విధంగా వున్నారు. వీళ్ళని ఆ దేముడే మార్చాలి. ఇప్పుడే వీళ్ళకి సంఘ సేవ జ్ఞాపకం వస్తుంది. ఇది ఇట్లా ఉంటే ప్రభుత్వం ఎన్నికలని ఇప్పుడే నిర్వహిస్తున్నది. ఎన్నికలలో అనేకులు అవకాశం వదులుకోకుండా సంపాయించాలని పార్టీ జెండాలు పట్టుకొని రోడ్ల మీద విహరిస్తున్నారు. 

కర్పూ : ఎట్టకేలకు తెలంగాణ ప్రేభుత్వం రాత్రి వేళ కర్పూ పెట్టింది. 

మిత్రులారా నేను మీకు చెప్పేది ఏమిటంటే కోవిడు కూడా సాధారణ జలుబు లాంటిదే.  జలుబు ఎలా సంక్రమిస్తుందో అదే విధంగా ఇదికూడా వైరస్ వల్ల సోకుతుంది.  కాకపొతే జలుబు వారం రోజులు ఉండి నిన్ను వదిలి పోతుంది కానీ వారంలో కరోనా నిన్ను తీసుకొని పోతుంది.  ఈ వత్యాసం గమనించండి. జాగ్రత్తగా వుండండి. 

ఎవరి ప్రాణం వాళ్లకు ముఖ్యం. మీరు ఇల్లు వదిలి వెళ్ళకండి మీమ్ము మీరు కాపాడుకోండి. మాస్కు వేసుకోక పోయిన  ,శానిటైజర్ వాడక పోయిన  పర్వాలేదు. ఇల్లు కదలకుండా ఉంటే చాలు. 









 

20, ఏప్రిల్ 2021, మంగళవారం

తపశ్శక్తి

 *తపశ్శక్తి...!*

                  ➖➖➖✍️



*మనిషి స్వప్రయత్నంతో అనుకున్నవి సాధించగలడు. అయినా కొన్ని పనులు అసాధ్యంగానే ఉండిపోతాయి. అనితర సాధ్యమైనవి సైతం కార్యరూపం దాల్చాలంటే తపస్సును ఒక మార్గంగా చెబుతారు పెద్దలు.*


*తపస్సు చేసి సృష్టించే శక్తిని బ్రహ్మ పొందాడని ఉపనిషత్తులు చెబుతాయి*


*నరనారాయణులు సైతం తపస్సు ఆచరించారట.*


*పరమశివుణ్ని పతిగా పొందేందుకు గౌరీదేవి, గంగను భువికి తెచ్చేందుకు భగీరథుడు, పాశుపత దివ్యాస్త్రాన్ని పొందేందుకు అర్జునుడు, మృత్యువును జయించాలని మార్కండేయుడు తపస్సు చేసి సాధించారని మన పురాణాలు చెబుతాయి.*


*రామ నామం రామ పాదం రామ కార్యాలనే తపస్సుగా చేసుకుని, ఒక వానరుడు సముద్రాన్నే లంఘించగలిగాడు.*


*సీతాన్వేషణలో సఫలమై రావణ వధకు నాంది పలికాడు. రుద్రావతారుడిగా కీర్తి గడించాడు. హనుమ అనే ఈ వానర వీరుడి సుందర లీలల వర్ణనే రామాయణ మహాకావ్యంలో సుందరకాండగా ప్రత్యేకత సంతరించుకుంది.*


 *పఠించిన ఉత్తర క్షణం భక్తులను అనుగ్రహించే పారాయణ గ్రంథమైంది. మహిషాసుర, భస్మాసుర, హిరణ్యకశిపుల వంటి ఎందరో రాక్షసులూ ఘోర తపస్సుతోనే శక్తులను, వరాలను పొందగలిగారు.*


✅*తపస్సు అంటే అనుకున్నది సాధించే వరకు మనసు చేసే ఎడతెగని ప్రయత్నం.*✅


*మనసు సామాన్య స్థితిలో చంచల స్వభావంతో అనేక విషయాల్లో సంచరిస్తూనే ఉంటుంది. అదే మనసుకు ఒకే విషయాన్ని గ్రహించి, మిగిలినవన్నీ విస్మరించే ఉన్నత లక్షణమూ ఉంది.*


*మనసును సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడమే తపస్సుగా పెద్దలు చెబుతారు. *


*ఒక వస్తువుపై మనసున నిలకడగా కాసేపు ఉంచగలిగితే అది ధారణ అవుతుంది.*

 

*మరింత సమయం మనసును నిలువరించగలిగితే అది ధ్యానమవుతుంది.*


*మనసు అనే వింటి నారిని తపస్సు అనే విల్లులో బాగా లాగి కట్టాలి. అప్పుడే బుద్ధి జాగృతమై లక్ష్యాన్ని ఛేదిస్తుంది.*


*మనసును నియంత్రించడమన్నది చాలా పెద్ద సమస్య.*


*మహాభారతంలోని శాంతిపర్వం మనసును, ఇంద్రియాలను తాదాత్మ్యం చేసి బాహ్యం నుంచి అంతరంగానికి తీసుకుపోయేదే తపస్సుగా చెప్పింది.*


*మనోనిగ్రహం ఒక్కరోజు కృషితో పొందేది కాదు. నిరంతర అభ్యాసం కావాలి. బాహ్య అంతఃకరణాలైన మనసు ఇంద్రియాలను సమాధాన పరచడమే తపస్సుగా ఆదిశంకరులు బోధించారు.*


*మనిషిలోని మనోబలాన్ని,సంకల్ప శక్తిని పెంచేదే తపస్సు. పెంపొందిన ఈ మనఃశక్తిని ఎలా వినియోగించుకోవాలి- అనేది మాత్రం మనిషి లక్ష్యంపైనే ఆధారపడి ఉంటుంది. *


*లక్ష్యాన్ని బట్టి తపస్సును సాత్విక, రాజసిక, తామసాలనే మూడు విధాలుగా భగవద్గీత చెబుతుంది.*


*మంచి చెడు తేడాలతో సంబంధం లేకుండా అసురులవలే అనుకున్నవన్నీ సాధించాలని చేసే తీవ్రమైన ప్రయత్నాలన్నీ తామసమని, పదవి కీర్తికోసం చేసేవి రాజసికమని, చిత్తశుద్ధి కోసం చేసేవి సాత్వికమని గీత చెబుతుంది.*


*తపస్సు,తపస్సుతో పొందేది రెండూ దైవంగానే చెబుతుంది తైత్తిరీయం.*


*దుష్టత్వాన్ని దహించే మనసును కడిగి శక్తిని ప్రజ్వలింపజేసేదే తపస్సు. నిష్కామ, నిస్వార్థ కార్యాలన్నీ తపస్సే. యజ్ఞమూ తపస్సే, యుద్ధమూ తపస్సే.*


*చిత్తశుద్ధి కోసం చేసే జపం, చిత్తశుద్ధితో చేసే ప్రతీపని తపస్సే అవుతుంది. సాధనా తపస్సే, సేవా తపస్సే.*


*తపస్సు అంటే వెంటనే మనకు స్ఫురించేది నుదుట విభూది రేఖలు, మెడలో రుద్రాక్షలు, కళ్లు మూసుకుని చేసే మంత్ర జపాలు. ఇవి తపస్సుకు అంగాలు మాత్రమే. మన లక్ష్యాన్ని అనుక్షణం గుర్తుచేసే చిహ్నాలు. తప్పటడుగు వెయ్యకుండా మనసును నియంత్రించేందుకు దోహదపడేవి. మనసును ఏకాగ్రపరచడం, నిస్వార్థ సేవతో జీవించడం తపస్సుకు పరమావధి...✍️*

           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                           🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

కన్యాశుల్కం

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

   *తొలి తెలుగు నాటకం*    

       *‘కన్యాశుల్కము'* 

               🌷🌷🌷

🚩

అభినవ ఆంధ్ర సాహితీ వైతాళికుడు, తెలుగు కథ

ఆద్యుడు #గురజాడ అప్పారావు గారు (21-09-1862 & 30-11-1915) పూర్తిస్థాయి వాడుక భాషలో రాసిన తొలి తెలుగు నాటకం ‘కన్యాశుల్కము’.   ప్రపంచ నాటకాల్లో కన్యాశుల్కానికి ఒక ప్రముఖ స్థానం ఉంది.


🚩

 *‘కన్యాశుల్కముకథ !* 


#విజయనగరంలో #మధురవాణి అనే వేశ్య బహుజాణ.  ఆమెకన్నా జాణతనం కలిగిన #గిరీశం అనే ఇంగ్లీషు చదువుకున్న జిత్తులమారి యువకుడు ఒక పూటకూళ్లమ్మ ఇంట్లో వుంటూ మధురవాణితో స్నేహం కలుపుతాడు. రామచంద్రాపురం అగ్రహారంలో పెద్దమనిషిగా చలామణి అయ్యే#రామప్పంతులు బ్రహ్మచారి, వేశ్యాలోలుడు. మధురవాణి దగ్గరకి వస్తుంటాడు.  అదే ఊళ్లో # *లుబ్ధావధానులు* అనే అరవయ్యేళ్ల లక్షాధికారి ఉన్నాడు.  అతని డబ్బు గుంజే ప్రయత్నంలో రామప్పంతులు అతనిని పునర్వివాహం చేసుకోమని వుసిగొల్పుతాడు. వార్ధక్యంలో పెళ్లెందుకని కూతురు మీనాక్షి వారించినా లుబ్దావధానులు వినడు.  ఆ రోజుల్లో డబ్బులకు ఆశపడి, కన్యాశుల్కము పుచ్చుకొని నోరెరుగని బాలికలను భార్యలేని ముసలివాళ్లకు కట్టబెట్టడం పరపాటి. కృష్ణరాయపుర అగ్రహారంలో వుండే #అగ్ని హోత్రావధానులు అలా పిల్లల్ని అమ్ముకోవడంలో ఘనాపాఠి. అతని పెద్దకూతురు బుచ్చమ్మ చిన్నప్పుడే భర్తను కోల్పోయింది.  చిన్నకూతురు సుబ్బమ్మకు తొమ్మిదేళ్లు. ఆ పిల్లను పద్దెనిమిది వందల కన్యాశుల్కానికి రామప్ప పంతులు ద్వారా లబ్ధావధాన్లకు అమ్మడానికి అగ్నిహోత్రావధానులు నిశ్చయిస్తాడు. అమాయకురాలైన అతని భార్య వెంకమ్మ అడ్డుపడి పోట్లాడుతుంది.  అయినా ఖాతరు చెయ్యడు.


విజయనగరంలో అప్పులబారి నుండి విముక్తి కాలేక, జిత్తులమారి గిరీశం తన వద్ద ఇంగ్లిష్‌ పాఠాలు నేర్చుకునే అగ్నిహహోత్రవధానులు కొడుకు వెంకటేశంను తీసుకొని కృష్ణరాయపుర అగ్రహారం చేరుకుంటాడు. వాళ్ల ఇంట్లో వున్న విధవరాలైన బుచ్చమ్మను చూసి మోహించి ఆమెను లేవదీసుకెళ్లి వివాహం చేసుకోవాలని పన్నాగం పన్నుతాడు.  ఇంతలో అగ్ని హోత్రావధానులు భార్య ‘‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ అనే వీధి గాయకుల పాటవిని, తన చిన్న కూతురు బ్రతుకు కూడా విధవరికానికే దారితీస్తుందని దుఃఖించి నూతిలో పడుతుంది.  అక్కడే వున్న గిరీశం ఆమెను రక్షిస్తాడు.  ఈ విషయం అగ్నిహోత్రావధానులు బావమరిది కరటకశాస్త్రికి తెలిసి ఎలాగైనా బాల్యవివాహాన్ని ఆపి, కన్యాశుల్కము రాబట్టాలనే బావగారి ఆశలకు చరమగీతం పాడాల్సిందేనని నిశ్చయిస్తాడు.  స్వయంగా రంగస్థల నటుడు కావడంతో మధురవాణి సహకారంతో తన శిష్యుడు మహేశంకు ఆడపిల్ల వేషం వేసి రామప్పంతులు వద్దకు తీసుకెళ్లి అతనికి లంచమిస్తానని ఆశపెట్టి, అగ్నిహోత్రావధానుల అమ్మాయితో నిశ్చయించిన పెళ్లిని ఆపించమని అందుకు ప్రతిగా ఆడవేషంలో ఉన్న మహేశంతో వివాహం జరిపించమని నాటకమాడుతాడు.  మధురవాణి రంగంలోకి దూకి మహేశంతో పెళ్లి తంతు జరిపిస్తుంది. లుబ్ధావధానులకు అసలు విషయం తెలిసి పశ్చాత్తాపం చెందుతాడు.  ఇదే అదునుగా గిరీశం బుచ్చమ్మను లేవదీసుకొని విశాఖపట్నం చేరుకొని సౌజన్యరావు (గుమ్మడి) అనే సంస్కారవంతుడైన వకీలును కలిసి సాయం కోరతాడు. ఈలోగా వీరిని వెదుక్కుంటూ అందరూ విశాఖపట్నం చేరుకుంటారు.  మధురవాణి జరిగిన విషయాన్ని సౌజన్యరావుకు విశదీకరిస్తుంది.  సౌజన్యరావు గిరీశాన్ని మందలించి

వెళ్ళ గొడతాడు

 *"డామిట్ కధ అడ్డం తిరిగింది"* అంటూ గిరీశం నిష్క్రమిస్తాడు.

🚩

తెలుగునాట సాంఘిక నాటకం అంటే మొదట గుర్తొచ్చేది గురజాడ వారి కన్యాశుల్కం నాటకమే. కన్యాశుల్కం పేరు చెప్పగానే గుర్తొచ్చేది గిరీశం.


డామిట్ కధ అడ్డం తిరిగింది . (గిరీశం)


*తాంబూలాలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి.* (అగ్నిహోత్రావధాన్లు),


*విద్యవంటి వస్తువు లేదు* (రామప్పంతులు),


*బుద్ధికి అసాధ్యం ఉందేమో కాని డబ్బుకు లేదు* (మధురవాణి), 

ఇలా ఎన్నో సంభాషణలు ఇప్పటికీ జనం నాలుకమీద ఆడుతూ ఉంటాయి.


ఆ నాటకానికే సినిమాకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ‘కన్యాశుల్కం’ చిత్రాన్ని నిర్మించారు వినోదా సంస్థ అధినేత డి.ఎల్.  ఈ చిత్రానికి పి.పులయ్య దర్శకత్వం వహించారు. 1955 ఆగస్ట్ 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.


*‘కన్యాశుల్కం’* నాటకం తెలుగువారు ఉన్న చోటల్లా పేరు సంపాదించుకుంది. ఈ నాటకంలో తొలి డైలాగ్ *‘సాయంత్రమయింది’* అన్నది, చివరి డైలాగ్ *‘డామిట్ కథ అడ్డంగా తిరిగింది’* అనేది. ఈ రెండూ గిరీశం నోట వెలవడతాయి. 

ఆ డైలాగులు తెలుగువారికి కంఠోపాఠంగా ఉండేవి.


🔻🔻🔻🔻🔻🔻🔻🔻

రామాయ‌ణం యుద్ధ కాండ‌*

 *రామాయణ దివ్యకథా పారాయణం*

*శ్రీ‌రామ‌న‌వ‌మి ప‌ర్విదినం వ‌ర‌కు* 

          *8 వ  రోజు*


*రామాయ‌ణం యుద్ధ కాండ‌*

        🌸🌸🌸🌸🌸


శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం 

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి




ఆకాశాన్ని పోల్చడానికి ఆకాశమే సరి. సముద్రాన్ని

 సముద్రంతోనే పోల్చగలం. అలాగే రామ రావణుల యుద్ధాన్ని

 మరి దేనితోను పోల్చడానికి వీలు లేదట.


*గగనం గగనాకారం సాగరం సాగరోపమం*

*రామ రావణయోర్యుద్ధం రామరావణయోరివ*


*కుంభ‌క‌ర్ణుడి ప్ర‌వేశం*

అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిద్ర‌లేప‌మ‌ని మంత్రులను పంపాడు.  శూలాలతో పొడిచి, ఏనుగులతో త్రొక్కించి,  కుంభకర్ణుని నిద్ర‌నుంచి లేపారు. 

రావణుడు కుంభకర్ణుడికి జరిగిన విషయం వివరించాడు. అనాలోచితంగా రావణుడు చేసిన చెడ్డపనులను సోదర ప్రేమతో నిందించాడు కుంభకర్ణుడు. స‌రే జ‌రిగింది జ‌రిగిపోయింది, ఇక తాను రామలక్ష్మణులను, సకల వానర సేనను భక్షించి పరిస్థితిని చక్కదిదద్దుతానని, రావణుడికి మాట యిచ్చి, కోట గోడను ఒక్క అడుగులో దాటి యుద్ధానికి బయలుదేరాడు. ఆరు వందల ధనువుల యెత్తూ, వంద అడుగుల కైవారం ఉన్న ఆ మహాకాయుని చూస్తూనే వానర సేనలు పారిపోసాగాయి. ధైర్యం చెప్పి వారిని అతికష్టంమీద అంగదుడు నిలువరించాడు.

కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. రామ లక్ష్మణుల బాణాలు కుంభకర్ణుని ఆయుధ విహీనుడిని చేశాయి. . రాముడు వాయువ్యాస్త్రంతోను, ఐంద్రాస్త్రంతోను వాడి చేతులు నరికేశాడు. రెండు మహిమాన్విత బాణాలతో తొడలు కూడా నరికేశాడు. అయినా నోరు తెరుచుకొని  వస్తున్న  కుంభ‌కర్ణుడిని ఐంద్రాస్త్రంతో చంపేశాడు. వాడు పర్వతంలా క్రిందపడ్డాడు. వాడి క్రింద పడి ఎందరో వానరులు, రాక్షసులు కూడా నశించారు.


హనుమ ఓషధి పర్వతాన్ని తెచ్చుట


పుత్రుల, సోదరుల మరణానికి చింతాక్రాంతుడై యున్న రావణుడికి ధైర్యం చెప్పి, ఇంద్రజిత్తు యుద్ధరంగానికి వెళ్ళాడు. హోమం చేసి అస్త్రాలను అభిమంత్రించి అదృశ్యరూపుడై వానర సేనను  చీల్చి చెండాడ సాగాడు. ఇక ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. దానితో అందరూ మూర్ఛిల్లారు. రామ లక్ష్మణ హనుమంతులు కూడా బ్రహ్మాస్త్రాన్ని మన్నించక తప్పలేదు. అందరూ మరణించారనుకొని సింహనాదం చేసి ఇంద్రజిత్తు విజయోత్సాహంతో లంకలోకి వెళ్ళాడు.


మృత ప్రాయులై ఉన్నవారిలో బ్రతికినవారికోసం విభీషణుడు, హనుమంతుడు వెదకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికిఉన్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమంలో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు అన్నాడు.  హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతం మీది మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధాన కరణి అనే ఔషధాలను తీసుకు రమ్మని హనుమను కోరాడు.


జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్నే సమూలంగా ఎత్తిపట్టుకొని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. రామ లక్ష్మణులూ, వానరులూ సృహలోకి వచ్చారు. విగతులైన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు. అయితే ఎప్పటికప్పుడు మరణించిన రాక్షసులను సముద్రంలో త్రోసివేయమని రావణుడు ఆజ్ఞనిచ్చినందువలన రాక్షసులకు ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. తరువాత మళ్ళీ పర్వతాన్ని తీసికొని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు.


*ఇంద్రజిత్తు మరణం*


రాక్ష‌స‌వీరులు వంద‌లు ,వేల కొద్ది మ‌ర‌ణిస్తుండ‌డంతో రావ‌ణుడు, 

 ఇంద్రజిత్తును ఆశీర్వదించి యుద్ధరంగానికి పంపాడు. హోమం చేసి, శస్త్రాస్త్రాలు ధరించి యుద్ధరంగానికి వచ్చి అదృశ్యరూపంలో వానరసేనను, రామలక్ష్మణులను కల‌వ‌ర‌పెడుతున్నాడు. లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం వేద్దామంటే రాముడు అతనిని వారించాడు. ఇంతలో దృశ్యరూపుడై మాయాసీత తలను అందరి యెదుటా తెగనరికాడు. అది చూసి అంతా శోకంలో మునిగిపోయారు. రావణుని తత్వం తెలిసిన విభీషణుడు అది కేవలం మాయ అని వారికి నచ్చచెప్పాడు. ఇంద్రజిత్తు నికుంభిలా యాగం చేయడానికి వెళుతున్నాడు. అతని చుట్టూ రాక్షసులు వ్యూహం తీరి కవచంలా ఉన్నారు.


యాగం చేయడడానికి ఇంద్రజిత్తు నికుంభిలకు వెళ్ళకుండా ఎవరు ఆపగలరో వారిచేతులోనే ఇంద్రజిత్తు చావు రాసిపెట్టి ఉందని విభీషణుడు అస‌లు ర‌హ‌స్యం చెప్పాడు. రాముని అనుజ్ఞ తీసుకొని, లక్ష్మణుడు ఆయుధ ధారియై, హనుమంతుని భుజాలపై కూర్చుని జాంబవంత, విభీషణ, అంగదాది వీరులతో కూడి నికుంభిలవైపు కదిలాడు. భయానక సంగ్రామానంతరం చుట్టూరా ఉన్న రాక్షసులను ఛేదించి ఇంద్రజిత్తును ఎదుర్కొన్నారు.  "ఇక్ష్వాకు వంశీయుడు రాముడు ధర్మస్వరూపుడూ, సత్యవ్రతుడూ అయితే ఈ మహేశ్వరాస్త్రం ఇంద్రజిత్తును వధించుగాక" అని సమంత్రకంగా ల‌క్ష్మ‌ణుడు అస్త్రాన్ని విడిచాడు. ఇంద్రజిత్తు తల తెగిపడింది. రాక్షసులు పారిపోయారు. వానరులు లక్ష్మణస్వామికి జయం పలుకుతూ  రాముని వ‌ద్ద‌కు  చేరుకొన్నారు.


*రామరావణ యుద్ధం ఆరంభం*


ఇంద్రజిత్తు మరణంతో రావణుడు తెలివితప్పి పడిపోయాడు. లేచి, కోపంతో సీతను చంప బోయాడు. సుపార్శ్వుడు అనే బుద్ధిమంతుడైన అమాత్యుడు అతనిని వారించి, వీరోచితంగా యుద్ధంచేసి విజయుడవు కమ్మని చెప్పాడు. ఇక రావణుడు అన్నింటికీ తెగించి సైన్యంతో ఉత్తర ద్వారంగుండా యుద్ధరంగంలో అడుగుపెట్టాడు.

మ‌రోవైపు వాన‌ర వీరులు  "శ్రీరామచంద్రునికి జయం", "లక్ష్మణునికి జయం", "సుగ్రీవునికి జయం", "ఆంజనేయునికి జయం", "అంగదునికి జయం", "జాంబవంతునికి జయం" అని పేరుపేరునా జయజయ ధ్వానాలు చేస్తూ, ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతూరాక్షసులనెదుర్కోవడానికి ముందుకు దూకారు.


లక్ష్మణ మూర్ఛ, మారుతి సేవ


రావణుడు తన వాడి బాణాలతో రామలక్ష్మణాదులను వేధించ సాగాడు. లక్ష్మణుడు రావణుని సారథి తల యెగురగొట్టాడు. ధనస్సు విరిచేశాడు. 

రావణుడు విసిరేసిన శక్తి , వక్షస్థలానికి తగిలి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. సోదరుని అవస్థకు పరితపిస్తూనే ప్రళయాగ్నిలా రాముడు రావణునిపై బాణవర్షం కరిపించసాగాడు. కొంత సేపటికి శక్తి లక్ష్మణుని విడచిపెట్టింది. అప్పుడు రాముడు తనవారిని ఉద్దేశించి - "మీరు సౌమిత్రిని రక్షిస్తూ, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. జగత్తు అరావణం క‌నాలి" అన్నాడు. రామ రావణ సంగ్రామం చెలరేగింది. ఎంతో సమయం యుద్ధం చేసిన రావణుడు గాలిలోకి ఎగిరి మేఘంలోకి దూరిపోయి లంకలోకి వెళ్ళిపోయాడు.


యుద్ధభూమిలో అచేతనంగా పడిఉన్న లక్ష్మణుని చూసి రాముడు విలపించసాగాడు. లక్ష్మణుడు కేవలం మూర్ఛిల్లాడని ధైర్యం చెప్పి సుషేణుడు మరల హనుమను మళ్లీ గిరిశిఖరానికి వెళ్ళమన్నాడు. హనుమంతుడు గరుడగమనంతో వెళ్ళాడు. మూలికలను గుర్తించలేక పర్వతాన్నే పెకలించుకొని ఓషధులతో సహా తెచ్చేశాడు. సుషేణుడు మూలికలను ఏరి రసం తీసి లక్ష్మణుని నాలుకపై పోశాడు. తెలివి వచ్చిన లక్ష్మణుని రాముడు గుండెల‌కు హ‌త్తుకున్నాడు.. లక్ష్మణుడు లేచి నిలబడి,

 "అన్నా! ముందు నువ్వు ప్రతిజ్ఞ చెల్లించుకో.  అన్నాడు.

రాముడు చిరున‌వ్వు న‌వ్వాడు. కీల‌క ఘ‌ట్టంస‌మీపిస్తున్న‌ది.

వాన‌ర సేన జ‌య జ‌య‌ధ్వానాలు మిన్నుముట్టుతున్నాయి. యుద్ధం కొన‌సాగుతున్న‌ది..........


                 

 *రావణ సంహారం*


అదే సమయంలో ఇంద్రుడు పంపగా మాతలి దివ్యమైన రథంతో రాముడికి సారథిగా వచ్చాడు. అగ్ని సమానమైన కవచం, ఐంద్రచాపం, సూర్య సంకాశాలైన శరాలు, తీక్ష్ణమైన శక్తి కూడా ఆ రథంలో ఉన్నాయి. రాముడు సంతోషించి ప్రదక్షిణం చేసి రథం ఎక్కాడు. రావణుడు వజ్రసదృశమైన శూలాన్ని చేతబట్టి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. రావణుడు విసిరేసిన శూలం ఎదురుపడి రాముని బాణాలు కాలిపోయాయి. అప్పుడు రాముడు మాతలి తెచ్చిన ఇంద్రశక్తిని విసిరేశాడు. అది రావణుని శూలాన్ని నిర్మూలించింది. రావణుడు కూడా శరపరంపరతో రాముని ముంచెత్తాడు. రాముడు విడచిన తీవ్ర బాణాలతో రావణుడి శరీరం రక్తసిక్తమయ్యింది. చివరకు అస్త్రవిహీనుడైన రావణుని పరిస్థితి గమనించి రావ‌ణుడిసారథి, రథాన్ని దూరంగా తీసుకుపోయాడు.


అగస్త్యుడు అక్కడికి వచ్చి యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు సనాతనము, పరమ రహస్యము అయిన "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు.


*ఆదిత్య హృదయం పుణ్యం

 సర్వశత్రు వినాశనం ।

జయావహం జపేన్నిత్యం

 అక్షయ్యం పరమం శివం ॥


సర్వమంగళ మాంగళ్యం

 సర్వ పాప ప్రణాశనం ।

చింతాశోక ప్రశమనం

 ఆయుర్వర్ధన ముత్తమం ॥ 5 ॥


రశ్మిమంతం సముద్యంతం

దేవాసుర నమస్కృతం ।

పూజయస్వ వివస్వంతం

 భాస్కరం భువనేశ్వరం 


 సమస్త లోక సాక్షి అయిన సూర్యుని స్తుతించే ఆ మంత్రం జయావహం. అక్షయం. పరమ మంగళకరం. సర్వపాప ప్రణాశనం. చింతా శోకప్రశమనం. ఆయుర్వర్ధనం. సమస్త ఆపదాపహరణం. రాముడు ఆచమించి ఆ మంత్రరాజాన్ని మూడు మార్లు జపించాడు. జ్యోతిర్గణాధిపతి, దినకరుడు, జయభద్రుడు, సహస్రాంశుడు, తమోఘ్నుడు, శత్రుఘ్నుడు అయిన ఆదిత్యునకు నమస్కరించాడు. ధనుస్సు ధరించి యుద్ధానికి సిద్ధపడ్డాడు. రావణ సంహారానికి దీక్ష పూనాడు.


*శ్రీరామ జయం*

రావణుని సారధి మళ్ళీ రధాన్ని రాముని ముందుకు తెచ్చాడు.

 సకలాయుధ సంపన్నమై, ఒక గంధర్వ నగరంలా ఉన్న ఆ రథం అప్రదక్షిణంగా వచ్చింది. ఇక రావణుని మరణం తప్పదని గ్రహించిన రాముడు తమ రధాన్ని ప్రదక్షిణ మార్గంలో పోనిమ్మని మాతలికి చెప్పాడు. సర్వ శక్తులనూ ఒడ్డి రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింప సాగారు. వారి బాణాలు ఆకాశాన్ని కప్పేశాయి. "రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. వారి రథాలు యుద్ధరంగమంతా కలియదిరిగాయి. రాముని బాణాలకు రావణుని పతాకం కూలింది. గుర్రాలు తొలగిపోయాయి.


మహా సర్పాలవంటి రాముని బాణాలకు రావణుని తల తెగిపడింది.

 కాని వెంటనే మరొకటి మొలిచి ఉంది. ఇలా నూటొక్కసార్లు రావణుని తలలు తెగగొట్టినా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.

 అప్పుడు రాముడు తనకు అగస్త్యుడిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. అది బుసలు కొడుతున్న సర్పంలా ప్రకాశిస్తున్నది. దాని వేగ సాధనములైన రెక్కలలో వాయువు, ములికిలో అగ్ని సూర్యులు, బరువులో మేరు మందర పర్వతాలు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. దాని శరీరం బ్రహ్మమయం.

 రాముడు ఆ దివ్యాస్త్రాన్ని వేదోక్తంగా అభిమంత్రించి, ధనుస్సును బాగుగా లాగి సావధాన చిత్తుడై విడచాడు. 

వజ్ర సంకల్పంతో, రాముని వజ్ర హస్తాలనుండి విడివ‌డిన‌ బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి,  భూమిలో ప్రవేశించి, సావధావంగా తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. 

రాముడు ఎరుపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు. సుగ్రీవ విభీషణ అంగదాదులు, లక్ష్మణుడు, ఇతర సహమిత్రులు విజయోత్సాహంతో రణాభిరాముడైన రాముని యధావిధిగా పూజించారు.

           

*సీత అగ్ని ప్రవేశం*


భీకరంగా జరిగిన యుద్ధంలో రావణుడు కడతేరాడు. 

రాముని ఆనతిపై విభీషణుడు రావణునికి అంత్య క్రియలు చేశాడు. పిదప విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాడు. విభీషణుని అనుజ్ఞతో హనుమ లంకలోనికి వెళ్ళి, విజయవార్తను సీతకు నివేదించాడు. విభీషణుని అంతఃపుర పరివారం సీతమ్మ‌కు మంగళ స్నానం చేయించి, పల్లకీలో రాముని వద్దకు తీసికొనివచ్చారు.

లోకానికి సీత‌మ్మ పాతివ్ర‌త్యాన్ని తెలియ‌జేయాల‌నుకున్నాడు శ్రీ‌రాముడు. అందుకు చిన్న‌స‌న్నివేశాన్ని సృష్టించాడు.

"సీతా,.... ఇక్ష్వాకుకుల ప్రతిష్ఠకోసం నేనీ యుద్ధం చేశాను.

 రావణుడు నిన్ను దుష్టదృష్టితో చూశాడు గనుక నేను నిన్ను స్వీకరించలేను.  నువ్వు యధేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళవచ్చును." అని అన్నాడు. ఆ మాట‌లు సీత‌కు పిడుగుపాటు లా అనిపించాయి.


సీత లక్ష్మణునివైపు తిరిగి "లక్ష్మణా,   అగ్నిని ప్రజ్వలింపజేయి" అన్నది.  రామునకు, దేవతలకు, దిక్పాలురకు మ్రొక్కి "నా హృదయం సదా రామచంద్రుడినే పూజిస్తున్నట్లయితే సర్వభక్షకుడైన అగ్ని నన్ను పునీతురాలిని చేయుగాక‌" అని పలికి మంటలలోనికి నడచింది. 

అందరూ హాహాకారాలు చేశారు. అప్పుడు బ్రహ్మ రాముని సమక్షంలో నిలిచి "రామా నువ్వు లోక కర్తవు. ఉత్తమ జ్ఞానివి. అలా చూస్తూ ఊరుకుంటావేం? ప్రాకృతునిలా సీతను ఉపేక్షిస్తావేమీ" అన్నాడు. నీవు విష్ణువు అవతారానివని చెప్పాడు.


అగ్ని, సీతను వెంటబెట్టుకొని రాముని వద్దకు వచ్చాడు.

 సీత అప్పుడు ఉదయసూర్యబింబంలా ఉంది.

 "రామా! ఇదిగో నీ సీత. ఈమె పునీత. పాపహీన. నిన్నే కోరిన సాధ్వి.

 ఈమెను అవశ్యం పరిగ్రహించు. " అని చెప్పాడు.

 అప్పుడు  రాముడు ,"సీత పరమపవిత్రురాలని నేనెరుగుదును. కాని దశరధ పుత్రుడనైన నేను కామాతురుని వలె ప్రవర్తింప జాలను. ఈమె మహిమను లోకం గుర్తించాలని అగ్ని ప్రవేశాన్ని మౌనంగా వీక్షించాను. నా పట్ల వాత్సల్యం కలవారు గనుక మీరు చెప్పినట్లే చేస్తాను" అని తన దక్షిణ హస్తాన్ని చాచి సీత చేతినందుకొన్నాడు.

 ఆకాశం నుంచి పుష్ప‌వ‌ర్షం కురిసింది.


*అయోధ్యకు పునరాగమనం*



, యుద్ధంలో చనిపోయిన వానరులందరినీ రాముని కోరికపై ఇంద్రుడు బ్రతికించాడు. సైన్యమంతా సంబరాలలో మునిగిపోయింది. అయోధ్య చేరాలన్న ఆతురతలో ఉన్న రాముడు విభీషణుని సత్కారాలను తిరస్కరించాడు. విభీషణుడు రాముని అనుజ్ఞతో వానరులను సత్కరించాడు.

 విభీషణుడు, వానరులు తోడు రాగా పుష్పక విమానంపై సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో తమ లంకా యుద్ధ, సీతాపహరణ, వనవాస ప్రదేశాలను చూసుకొంటూ కిష్కింధను, గోదావరిని, యమునను, గంగను దాటి భరద్వాజ ముని ఆశ్రమం చేరుకొన్నారు. వానరుల సంతోషం కోసం అకాలంలో కూడా వృక్షాలన్నీ తియ్యటి పళ్ళతో విరగబూసేటట్లుగా రాముని కోరికపై భరద్వాజ ముని వరమిచ్చాడు.


ముందుగా హనుమంతుడు నందిగ్రామం చేరుకొని హనుమంతుడు భరతునికి సీతారామలక్ష్మణుల పునరాగమన సందేశాన్ని అందించాడు. ఆనందంతో భరతుడు అయోధ్యను అలంకరింపమని ఆనతిచ్చాడు. రాముని పాదుకలు శిరస్సుపై ధరించి పరివారసహితుడై ఎదురేగి రామునికి, సీతకు, లక్ష్మణునికి ప్రణమిల్లాడు. సుగ్రీవాది వీరులను ఆలింగనం చేసుకొన్నాడు. సౌహార్దంవల్ల తమకు సుగ్రీవుడు ఐదవ సోదరుడని పలికాడు. రాముని పేరుతో తాను రాజ్య సంరక్షణ చేస్తున్నానని, రాజ్యభారాన్ని తిరిగి చేప‌ట్ట‌మ‌ని శ్రీరాముని ప్రార్థించాడు. గోశాలలు, ధాన్యశాలలు, ధనాగారం, సైన్యాలను పరీక్షించుకోమని కోరాడు. భరతుడే సారథ్యం వహించగా, శత్రుఘ్నుడు శ్వేతచ్ఛత్రం పట్టగా, లక్ష్మణ విభీషణులు వింజామరలు వీయగా, వానరవీరులు వెంటరాగా సీతారాములు పరివార సమేతులై శంఖభేరీ భాంకారాలతోఅయోధ్యలోనికి ప్రవేశించారు. తల్లులకు, పెద్దలకు, గురువులకు మ్రొక్కారు. వనవాస విశేషాలు, సీతాపహరణం, కిష్కింధలో సుగ్రీవుని మైత్రి, హనుమంతుని అసమాన కార్య సాధన, విభీషణ శరణాగతి, లంకాయుద్ధాది వివరాలు విని అయోధ్యాపౌరులు అత్యాశ్చర్యభరితులయ్యారు.

   

                *****

శ్రీ రఘురామ చారు తులసీదళ దామ శమక్షమాది శృం

గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు

ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో

త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ


      *****


రామవిశాల విక్రమ పరాజితభార్గవరామ సద్గుణ

స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద

శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో

ద్ధామ విరామ

 భద్రగిరి  దాశరథీ కరుణాపయోనిధీ!*

         ***

మనోజవం మారుత తుల్యవేగం

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం

వాతాత్మజం ,వానర యూధ ముఖ్యం

శ్రీరాందూతం మనసా స్మరామి


*(రేపు శ్రీరామ పట్టాభిషేక ఘట్టం)*

మొగలిచెర్ల

 *ఆదిత్య హృదయం అప్పజెప్పడం..*


*(మూడవరోజు)*


శ్రీధరరావు, ప్రభావతి దంపతులు ఆ యోగీశ్వరుడి ముందు స్థిమితంగా కూర్చున్నారు..వాళ్ళిద్దరినీ చిరునవ్వుతో చూస్తూ.."అమ్మా!..నన్ను మొదటి పిలుపులోనే "నాయనా"! అని పిలిచావు కదా?..నాలో నీ బిడ్డను చూసావా?.."అన్నారు..మొట్ట మొదటగా ఆ దంపతులిద్దరితో అడిగిన ప్రశ్న అది..


"ఔను నాయనా!..మా పెద్దబ్బాయిని చూసిన అనుభూతి కలిగింది..పైగా వయసుతో సంబంధం లేకుండా నాయనా అని పిలవడం నాకలవాటు.." చెప్పారు ప్రభావతి గారు..


"ఓహో!.. అమ్మా..ఈ మధ్య కాలంలో శ్రీధర రావు గారు నన్ను ఎన్నో మార్లు కలిశారు..నేను మౌనంలో వున్నా కానీ..ఆయన నాతో చాలా విషయాలే చెప్పారమ్మా..నీకు పూజలు ఎక్కువగా చేసే అలవాటు ఉందనీ..తెల్లవారుఝామునే లేచి..స్నానాధికాలు ముగించుకొని పూజ మొదలుబెడతావనీ..చెప్పారమ్మా..అంత ఘనంగా ఏ పూజలు చేస్తావు తల్లీ?.." అన్నారా యోగి..


ప్రభావతి గారికి లోపలినుంచి ఒక గర్వం బైటకు తన్నుకు వచ్చింది..తాను రోజూ ఎంతో నిష్ఠగా పూజ చేస్తాననే అహంకార పూరిత అజ్ఞానం ఆవిడను నిలువెల్లా కప్పేసింది..తాను చేస్తున్న పూజల లెక్క గబ గబా గుర్తుకుతెచ్చేసుకున్నది.."ఒకటేమిటి నాయనా!..తెల్లవారుఝామున స్నానం చేసి ఆదిత్య హృదయం మొదలుకొని..ఎన్నో సహస్రనామ స్తోత్రాలు..అష్టోత్తరాలు..అన్నీ నోటికి వచ్చు..విష్ణు, లలితా సహస్ర నామాలు..మా ఇలవేల్పు ఈ మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడి అష్టోత్తర, సహస్ర నామ, కవచాలు.. నోటికి వచ్చు..అన్నీ కూడా పనీ పాటా చేసుకుంటూ నాలో నేను చదువుకుంటూ వుంటాను..రోజు మొత్తంమీద ఓ పదో పదకొండో సహస్రనామ స్తోత్రాలు..అష్టోత్తర స్తోత్రాలు చేస్తాను నాయనా..ప్రతి స్తోత్రమూ నోటికొచ్చు కాబట్టి..సులభంగా చేస్తాను.." అని చెప్పారు..        ఈ "నోటికొచ్చు.." అన్నమాట పదే పదే గర్వంగా చెప్పారు..


ఆ యోగి..(ఇకనుంచీ "శ్రీ స్వామివారు" గా వ్రాస్తాను!) తాను కూర్చున్న అరుగుమీద నుంచి లేచి నుంచుని..అదే చిరునవ్వుతో.."అమ్మా!..అన్ని స్తోత్రాలూ ఔపోసన పట్టానన్నావు కదా..మొదట ఆదిత్య హృదయం తో నీ పూజ మొదలవుతుందని చెప్పావు కదా?..ఏది తల్లీ..ఒక్కసారి ఆ ఆదిత్య హృదయం నాకు వినిపించు..ఒక్కసారి చదువమ్మా.." అన్నారు..


ప్రభావతి గారు శ్రీధరరావు గారిని చూసారు.."చెప్పమంటారా?"..అన్నట్లు గా ఆయన ను కళ్ళతోనే సైగ చేసి అడిగారు..


ఆయన వెంటనే.."చదువు ప్రభావతీ..నీవు రోజూ చేసేదేగా!.." అన్నారు..


ప్రభావతి గారు మళ్లీ ఒక్కసారి సర్దుకు కూర్చుని..


"తతో యుద్ధ పరిశ్రాంతం..సమరే చింతయాస్థితం.."


అని చెప్పబోయారు..అంతే!..శ్లోకం అంతకంటే ముందుకు గుర్తురావటం లేదు..


మళ్లీ.."తతో యుద్ధ పరిశ్రాంతం..సమరే...."


అక్కడే ఆగిపోతోంది..ఆవిడ నాలుక మొద్దుబారి పోయినట్లు..అంతకంటే ఒక్క ముక్క కూడా ఆ శ్లోకం లో గుర్తుకురావటం లేదు..మళ్లీ..మళ్లీ...ఊహూ!..ఏమీ గుర్తులేదు..ప్రతిరోజూ చేసే ఆ స్తోత్రం..మొదటి శ్లోకంలోని మొదటి పాదం వద్దే ఆగిపోయింది..నిద్రలో లేపి అడిగినా..టక టకా చెప్పే ప్రభావతి గారికి వాక్భందం జరిగినట్లు మాట రాక ఆగిపోయారు..ఐదు నిమిషాల పాటు తంటాలు పడ్డారు..ఏమీ లాభం లేదు..


ప్రక్కనే ఉన్న శ్రీధరరావు గారు నిర్ఘాంతపోయి చూస్తున్నారు..ప్రతిరోజూ..ఇంట్లో పని చేస్తూ..పశువులకు మేత వేస్తూ..పాలు పితుకుతూ..మజ్జిగ చిలుకుతూ..ఇలా తన పని తాను చేసుకుంటూ కూడా అనుక్షణం స్తోత్రాలు వల్లే వేసే తన భార్య..ఇక్కడ ఈ నిమిషంలో..ఈ యోగిపుంగవుడి ముందు..ఏ స్తోత్రమూ అప్పజెప్పలేక సతమతమవుతోంది..ఏమిటీ మాయ?..అని ఆయన ఆలోచనలో పడ్డారు..


ఇక ప్రభావతి గారికైతే..తనకేమైందో తెలీదు..మొట్టమొదటి శ్లోకం కూడా గుర్తురానంతగా తన మెదడు మొద్దుబారిపోయింది..మెల్లిగా ఆవిడ అహంకారపు పొర తొలిగింది.."నాయనా!..నేను చెప్పలేకపోతున్నాను..నన్ను ఏదో శక్తి అడ్డగిస్తోంది..నేను అశక్తురాలినై పోయాను.."అని చెప్పి మౌనంగా కూర్చున్నారు..


అప్పటిదాకా వాళ్ళిద్దరి ముందూ నిలుచుని ఉన్న శ్రీ స్వామివారు..మళ్లీ పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేసి వచ్చి..అరుగుమీద పద్మాసనం వేసుక్కూర్చున్నారు..


ఇప్పుడు ఆయన మొహంలో ఒక తేజస్సు ఉట్టిపడుతోంది...


మంత్రోచ్ఛారణ..తత్వం..గురించిన బోధ రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

19, ఏప్రిల్ 2021, సోమవారం

కొత్త యుద్ధం*

 🦌🦌 *కొత్త  యుద్ధం*

 *సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బ్రతకగలదు*


*అది ఒక జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా నిర్భయంగా జీవిస్తున్నాయి .*


*ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారితప్పి వేరే అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి ఎన్నో కొత్త కొత్త జంతువులు, తోడేళ్ళను, పులులను, సింహాలను, నక్కలను తొలిసారి అక్కడే చూసింది.*


*అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై " ఓ జింక సోదరా ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే " అంది.*


*"అవును మాది జింకలవనం " అంది.*


*" ఈ అడవి మీ జింకల వనం లాంటిది కాదు. ఇక్కడ మనల్ని చంపి తినే క్రూర మృగాలు ఉన్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకసలు తెలియదు. కాబట్టి ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపో " అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళి పోయింది.*


*" పిరికి జింక నేనూ జింకనే అదెలా తప్పించుకుందో నేనూ అలాగే తప్పిచుకోగలను " అనుకుంటూ జింకల వనం జింక ముందుకు వెళ్ళింది.*


*అక్కడ చెట్టు కింద నిద్రపోతున్న సింహం కనిపించింది. జింక చిన్నగా దాని దగ్గరికి వెళ్ళి తన ముందరి గిట్టతో సింహం తోక తొక్కింది .*


 *సింహానికి మెలకువ వచ్చింది. బద్దకంగా లేస్తూ జింకను చూసి గర్జించింది. ఆ గర్జన విని జింకకు గుండె ఆగినంత పనయింది .*


*వెనుదిరిగి వచ్చిన దారినే పరుగు పెట్టింది. అడవిని దాటి జింకల వనం వైపు పరుగు తీస్తూనే  వుంది. జింకల వనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది. సింహం దాన్ని చంపి చీల్చి ఆరగించింది .*


 *తరువాత సింహం లేచి మెల్లగా జింకల వనంలోకి వెళ్ళింది. దానికి అది క్రొత్త ప్రదేశం . అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి. సింహం ఆనందానికి అంతు లేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తుంది .*


*కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడి పోయాయి.* *చెల్లాచెదురు అయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నాయి .*


*పొ‌రపాటున ఏ జింకయినా బయటికొస్తే చాలు సింహం దాన్ని పడగొట్టేస్తుంది .*


*అయితే ఆ జింకల్లో తెలివయిన కుర్ర జింక ఒకటుంది. దాని పేరు జ్ఞాన నేత్ర. జింకల పెద్దలు జ్ఞాన నేత్ర దగ్గరికి వచ్చి "దీనికి పరిష్కార మార్గం ఏమిటి " అని అడిగాయి.*


*" జింక పెద్దలారా నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఈ క్రూర జంతువును ' సింహం ' అని అంటారు. దీని పంజా నుంచి తప్పించుకొనే చాకచక్యం మనకు లేదు.*

*ఎటు ఆలోచించినా. . ఎంత యోచించినా ఒకే ఒక్క దారి కనిపిస్తుంది.*


*ఈ సింహం ఆహారం లేకుండా*

*14 రోజులు మాత్రమే బ్రతక గలదు. కానీ మనం 21రోజులు బ్రతకగలం.*


*కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14రోజులు బయటకు రాకుంటేచాలు దాని పీడ మనకు విరగడౌతుంది. మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా దాని జీవిత కాలం మరో 14 రోజులు పెంచినట్లే.*


*ఈ రోజు అమావాస్య ఇప్పుడే పొదల్లోకి దూరిపోదాం. పున్నమి నాటికి బయటకు వద్దాం. తమ పొదల నుండి బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పెద్దలదే" అంది.*


*జింకలన్నీ జ్ఞాన నేత్రం మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి.*


*పున్నమి వచ్చింది. జింకలన్నీ ఒక్కొక్కటే భయం భయంగా బయటకు వచ్చాయి. వనం మధ్య చెట్టు కింద చచ్చి పడి ఉన్న సింహాన్ని చూశాయి. ఆనందంతో అరిచాయి, గెంతాయి. జింకల కేరింతలతో వనం అంతా పులకరించింది.*


ఇది ప్రస్తుత పరిస్థితులకు కరెక్టుగా సరిపోయింది కదా.. 

అందుకే..

*ఇంట్లోనే ఉండండి* 

*కరోనా రక్కసి పనిపట్టండి*


మనం జింకలకన్నా తెలివైనవాళ్ళమేగా 🤔🙏🙏

శివునికి అభిషేకం

 శివునికి అభిషేకం చేయుట వలన ఫలితం వక పరిశీలన. జలం నారాయణ స్వరూపం. ప్రకృతిని ప్రకృతి పరంగా ఆరాధన. అనగా ప్రకృతి సిద్దమైన లింగం ప్రకృతిపరమైన జలంతో అభిషేకం. దీని ఫలితం అవభృధ స్నాన ఫలితం. యీ స్నానము అశ్వమేధ యాగంలో వక భాగం. యిది లేనిదే యాగ ఫలితం లేదు. అందుకే రుద్రంలో మంత్రపూరిత అభిషేకం అవభృధశ్చమే స్వగాకారశ్చమే యని కలదు. స్వయంగా దేహ ధారి యైన జీవునికి ప్రకృతిని వుపాశన చేయుట. అభిషేక ప్రక్రియ. లింగారాధన నిర్గుణ రూప ప్రకృతిని ప్రకృతిపరమైన జలం ద్వారా సగుణోపాశన వలన సృష్టి ధర్మమని తెలియుచున్నది. దీని ఫలితం ప్రకృతి చైతన్యం.జల తత్వం లక్షణ మైన భూమి నిర్వీర్యం మహా ప్రళయం. భూమి కూడా దహించబడి సూక్ష్మ రూపం దాల్చి హవిస్సు పూర్వకంగా మారుట. అనగా సర్వం నారాయణ తత్వం లో కలియుట.తిరిగి పునః సృష్టిలో సృష్టి నారాయణ సంకల్పంతో మాత్రమే. అనగా జల తత్వమే నారాయణ స్వరూపమని తెలియును. సృష్టి మూలం ముందు తెలియదు లేదు. సృష్టించిన తరువాతనే దాని లక్షణము తెలియును.అప్పుడే మాయతో అహంకారం ప్రబలును. యిది ఆదిలో నారాయణ తత్వం బ్రహ్మకుకూడా  తెలియలేదు. సాధన వలన దీనిని తెలిసికొని పిదప సృష్టి సంకల్పము. మనకు లింగారాధన ద్వారానే సృష్టి ధర్మం తెలియుట. నారాయణ తత్వం పరమేశ్వర తత్వం. దీనికి లింగభేదం లేదు. బ్రహ్మ సృష్టి తరువాతనే ప్రకృతి పరమైన లింగభేదం తెలిసినది. తెలుసుకుంటూనే వుందాం.

రామాయ‌ణం-యుద్ధ‌కాండ‌*

 శ్రీ శ్రీ శ్రీ

*రామాయణ దివ్యకథా పారాయణం*


*శ్రీ‌రామ‌న‌వ‌మి ప‌ర్వ‌దినం వ‌ర‌కు*

  

         *7 వ  రోజు*

  *రామాయ‌ణం-యుద్ధ‌కాండ‌*

               ***


శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం 

సీతాపతిం 

రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి.

                ****

అతులిత బలదామం, స్వర్ణ శైలాభ దేహం

దనుజ వన కృశానుం, జ్ఞానినా మగ్ర గణ్యం ।

సకల గుణ నిధానం, వానరాణా మధీశం

రఘు పతి ప్రియ భక్తం వాత జాతం నమామి.

                *****


హనుమంతుడు సీతాన్వేషణానంతరం ముందుగా "చూశాను సీతను" అని చెప్పి, ఆ త‌ర్వాత‌ తన సాగర లంఘనం, లంకా ప్రవేశం, సీతాన్వేషణ, సీతను ఓదార్చటం, రావణునితో సంభాషించ‌టం, లంకా దహనం గురించి రామ లక్ష్మణ సుగ్రీవాదులకు వివరించాడు. ఒక్క నెల లోపు రాముని చూడకుంటే తాను బ్రతుకనని సీత చెప్పినదన్నాడు.


*యుద్ధానికి సిద్ధం*


హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు,  "ఇంతటి క్లిష్టకార్యాన్ని మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణాల‌ను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనం కంటె నీకు నేనేమి బహుమానం ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొన్నాడు. సీత‌ప‌డుతున్న క‌ష్టాలను త‌ల‌చుకుని దుఃఖిస్తున్న‌ రామడిని ఓదార్చి  సుగ్రీవుడు ధైర్యం  చెప్పాడు. రాముడికి జయం తప్పదన్నాడు. హనుమంతుడు లంకా నగర రక్షణ వ్వవస్థను విశదంగా తెలిపాడు. తరువాత అందరూ తర్కించి యుద్ధానికి నిశ్చ‌యించారు.


సరైన సమయం చూసి, నీలుని నాయకత్వంలో బ్రహ్మాండమైన కపిసేన కోలాహలంగా దక్షిణ దిక్కుగా ప‌య‌న‌మైంది. రాముడి ఆజ్ఞపై ఆ వానర సేన జనావాసాలమీద పడకుండా జాగ్ర‌త్త‌గా అడవులు, కొండలు, గుట్టలు, నదులు, సరస్సుల మీదుగా నడచింది. రాముని ఆజ్ఞలో నడచిన ఆ సేనకు నీలుడు సేనా నాయకుడు. సుగ్రీవుడు పాలకుడు. 

హనుమంతుని భుజాలపైన రాముడు, అంగదుని భుజాలపైన లక్ష్మణుడు అధిరోహించారు. జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి, శతబలి, కేసరి, పనసుడు, గజుడు, అర్కుడు, వలీముఖుడు, ప్రజంఘుడు, జంభుడు, రభసుడు వంటి ఎందరో మహా వీరులు ఆ వానర భల్లూక సైన్యాన్ని ఉత్సాహపరుస్తూ ముందుకు సాగారు. రామకార్యం సాధించడానికి విక్రమోజ్వలులై ఉల్లాసంగా సాగరతీరం చేరుకొన్న ఆ సేన మరొక సాగరంలా ఉంది. వానర వీరులు ఒక చోట, గోలాంగూల వీరులు ఒకచోట, భల్లూకవీరులు మరొక చోట - ఇలా మూడు భాగాలుగా విడిది చేశారు.


*విభీషణ శరణాగతి*


అక్కడ లంకలో రావణుడికి రాముడు స‌సైన్యంగా యుద్ధానికి బ‌య‌లుదేరాడ‌న్న స‌మాచారం అందింది. ఈ విషయమై తనవారితో మంత్రాంగం నెరప సాగాడు. పుర భద్రత కట్టుదిట్టంగా ఉండాలని  ఆదేశించాడు. రాక్షస వీరులు రావణుని ప్రతాపాన్ని పొగిడారు.తమ శక్తి సామర్ధ్యాలను  తామే కీర్తించుకొని, త‌మ‌కు ఎదురులేద‌ని స‌ర్ది చెప్పుకున్నారు. ఒక్కొక్కరు తానే రామలక్ష్మణులను కడతేర్చగలమన్నారు. కాని రావణుని తమ్ముడైన విభీషణుడు రావణునితో విభేదించాడు. రామలక్ష్మణుల క్రోధాగ్నికి లంక భస్మమవ్వడం తథ్యమని, రావణుడు అనాలోచితంగా సీత అనే కాలనాగును తన మెడకు చుట్టుకొన్నాడని నచ్చచెప్పడానికి యత్నించాడు. సీతను రాముడికి అప్పగించి చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోమన్నాడు. మళ్ళీ రావణుని సౌధానికి వెళ్లాడు. చివ‌రి ప్ర‌య‌త్నం చేద్దామ‌నుకున్నాడు.  లంకలో అశుభ నిమిత్తాలనేకం ముప్పిరిగొన్నాయని, రానున్న విపత్తునుండి రాక్షసజాతిని కాపాడమని ప్రార్థించాడు.

మరునాడు రావణుడు మంత్రగృహంలో కొలువుతీరినపుడు సకల అమాత్య బంధుగణంతో పాటు కుంభకర్ణుడు కూడా ఉన్నాడు. రావణుడు పొరపాటు చేశాడని, అయినా తాను విజృంభించి అతని కార్యం సిద్ధింపజేస్తానని కుంభకర్ణుడు అన్నాడు. మళ్ళీ విభీషణుడు హితవు చెప్పబోగా ఇంద్రజిత్తు, రావణుడు అతనిని నిందించారు. ఇక రావ‌ణుడు మార‌డ‌ని తెలుసుకున్నాడు విభీష‌ణుడు. రావ‌ణ ప‌త‌నం త‌ప్పద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చాడు. వెంట‌నే  తనకు ఆప్తులైన నలుగురు రాక్షసులతోకలిసి విభీషణుడు అన్నగారి వ‌ద్ద‌ సెలవు తీసికొని ఆకాశానికి ఎగిరి, సాగరందాటి, రాముని శరణు వేడాడు.

 విభీష‌ణుడిని నమ్మవద్దని కపివీరులన్నారు. విభీషణుడు సౌమ్యుడని, నమ్మదగినవాడని హనుమంతుడు చెప్పాడు. శరణుకోరిన సకల భూతాలకు అభయం ఇవ్వడం తన వ్రతమని చెప్పి రాముడు, విభీషణునకు ఆశ్రయమిచ్చాడు. రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, ప్రహస్తుడు వంటి మహాయోధుల పరాక్రమాన్ని, లంకా నగరం పటిష్ఠతను విభీషణుడు వివరించాడు. సపుత్ర బాంధవంగా రావణుడిని చంపిగాని తాను అయోధ్యకు మరలనని రాముడు తన తమ్ములు ముగ్గురిమీదా ఒట్టుపెట్టి చెప్పాడు. కానున్న లంకాధిపతిగా విభీషణునికి సాగరజలాలతో  అప్ప‌టిక‌ప్పు డే అభిషిక్తుని చేయించాడు రాముడు.


తమ మధ్య వైరం ఏమీ లేదు గనుక రాముడికి సాయం చేయవద్దని, రావణుడు సుగ్రీవుడికి శుకుడనే దూత ద్వారా దౌత్యం పంపాడు. అందుకు సుగ్రీవుడు - "రావణా! నాకు నువ్వు చేసిన సాయం లేదు గనుక నాకు ప్రియుడవు కావు. రామునికి విరోధివి గనుక నాకు కూడా విరోధివే. రాముని కోపానికి గురైనందున నిన్ను రక్షించే శక్తి ఈ ముల్లోకాలలోనూ లేదు" అని సమాధానం పంపాడు.

 సముద్రం దాట‌డానికి మార్గం ఏమిటని హనుమంతుడు, సుగ్రీవుడు విభీషణుని అడిగారు. రాముడు సముద్రుడి సాయం కోసం అర్ధించాలని విభీషణుడు సలహా ఇచ్చాడు. సముద్రుడి సహాయం కోరి రాముడు మూడు రాత్రులు నియమంగా దీక్ష వహించినా సముద్రుడు ప్రత్యక్షం కాలేదు. కోపించి రాముడు సముద్రాన్ని ఎండగట్టేస్తానని ధనుస్సు ఎక్కుపెట్టాడు. సముద్రుడు వచ్చి, వినయంగా నమస్కరించి, తన స్వభావాన్ని త్యజింపలేనని మనవి చేశాడు. విశ్వకర్మ కొడుకైన నలుని ప్రజ్ఞతో వారధిని నిర్మింపవచ్చునని తెలిపాడు. సముద్రుడి కోరికపై రాముడు తన అస్త్రాన్ని ద్రుమకుల్యంలోని దస్యులపై విడిచిపెట్టాడు.


*సముద్రంపై వార‌ధి*


ఇక స‌ముద్రాన్ని దాటడానికి అద్భుతమైన వారధి నిర్మాణం నలుని పర్యవేక్షణలో ప్రారంభమైనది.  అయిదు రోజుల‌లో 100 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు గల వారధి నిర్మించారు. విభీషణుడు ఒక ప్రక్క వారధికి రక్షణగా నిలిచాడు. వానర భల్లూకసేనలు, రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు. నీలుని నాయకత్వంలో ఆ సేన మరో సాగరంలా  రామకార్యానికి సన్నద్ధమై ఉంది. దుంపలు, ఫలాలు, జలం పుష్కలంగా ఉన్నచోట  వారంతా విడిది చేశారు.


త్రికూట పర్వతం పైన లంకా పట్టణం  అద్భుతంగా క‌నిపిస్తున్న‌ది.. ఆ శోభను గమనించి రాముడు ఆశ్చర్య పోయాడు. 

రావణుడి గూఢ‌చారులైన‌ శుక సారణులు వాన‌ర‌సేన విడిది చేసిన ప్రాంతాన్నిగ‌మ‌నించారు.

 రామ, లక్ష్మణ, సుగ్రీవ, జాంబవంత, హనుమంతాది వీరుల పరాక్రమాన్ని రావణునికి వివరించారు. వానరసేన ఎంత ఉందో లెక్కపెట్టడం అసాధ్యమన్నారు. ఇంత సేనావాహిని లంకాన‌గ‌రం వెలుప‌ల వేచి ఉన్న‌ద‌ని ఇక ఇప్ప‌టికైనా  సీతమ్మ‌ను  రామునకప్పగించడం మంచిదని తమకు తోచింద ని విన‌యంతో రావ‌ణుడికి చెప్పారు. ప్రాసాదం పైకి తీసుకెళ్ళి వానరవీరుల సేనానాయకులలోని ముఖ్యులను చూపించారు -


రావణుడు పంపిన మరొక గూఢ‌చారి శార్దూలుడు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాడు. వానర భల్లూక వీరుల పరాక్రమం గురించి మరిన్ని విషయాలు చెప్పాడు. సీత‌మ్మ‌ను అప్ప‌గించ‌డ‌మే శ్రేయ‌స్క‌రం అన్నాడు. యుద్ధ‌మంటూ జ‌రిగితే ప‌ర్య‌వ‌సానాలు ఎలా ఉంటాయో తెలియ‌జెప్పాడు. అయినా రావ‌ణుడు ప‌ట్టించుకోలేదు. ఈ  ద‌శ‌లో సీత మ‌నోధైర్యాన్ని దెబ్బ‌తీయాల‌నుకున్నాడు రావ‌ణాసురుడు.


*యుద్ధానికి ముందు*


రావణుడు విద్యుజ్జిహ్వుడనే మాయలమారి రాక్షసుని పిలిపించి రాముని శిరస్సును పోలిన ఒక మాయా శిరస్సును, ధనుర్బాణాలను చేయించాడు. యుద్ధంలో రామలక్ష్మణులు, వానర సైన్యం నశించారని సీతతో చెప్పి ఆ మాయా శిరస్సును, ధనుర్బాణాలను చూపాడు. సీత కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. రావణుడు వెళ్ళిపోయాక విభీషణుని భార్య, సరమ అనే సాధ్వి సీతను ఓదార్చి అది మాయ అని, రహస్యంగా తాను అంతా విన్నానని చెప్పింది. యుద్ధానికి భల్లూక వానర సమేతంగా రాముడు 

 లంకా న‌గ‌రం వెలుప‌ల విడిది చేసి సిద్ధంగా ఉన్నాడని, సీతకు శుభ సౌభాగ్య సమయం ఆసన్నమయందని అనునయించింది. రావణుని వినాశనం అనివార్యమని చెప్పింది..


     సైన్యాన్ని సమాయత్తపరచి రక్షణకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయించాడు రావణుడు. తూర్ప ద్వారంలో ప్రహస్తుడు, దక్షిణాన మహాపార్శ్వ మహోదరులు, పశ్చిమాన ఇంద్రజిత్తు, ఉత్తరాన శుక సారణులు అప్రమత్తులై యున్నారు. విరూపాక్షుడు లంకానగరం మధ్యనున్నాడు. రావణుడు స్వయంగా ఇతర స్థలాలతో పాటు ఉత్తర ద్వారాన్ని పర్యవేక్షిస్తానని చెప్పాడు. 

      ఇవన్నీ విభీషణుని చారుల ద్వారా రాముడు తెలుసుకొన్నాడు. తూర్పు ద్వారం వైపు నీలుడు, దక్షిణానికి అంగదుడు, పశ్చిమం ప్రక్కకు హనుమంతుడు తమ సైన్యాలతో దండు వెళ్ళేలాగా నియమించాడు. తాను స్వయంగా ఉత్తర ద్వారం వైపు విజయం చేస్తానన్నాడు. సుగ్రీవుడూ, జాంబవంతుడూ, విభీషణుడూ సైన్యం మధ్యలో ఉండి అంతా చక్కబెడతారు. ఇలా నియమించి, సువేల శిఖరంపైకి ముఖ్య నాయకులతో వెళ్ళి రాముడు లంకానగరాన్ని పర్యవేక్షించాడు. దూరాన ఒక గోపురాగ్రాన రావణుడు కనిపించాడు. అతనిని చూడగానే క్రోధంతో సుగ్రీవుడు ఎగిరి వెళ్ళి భీకరమైన మల్లయుద్ధం చేశాడు. రావణుడు మాయలు ప్రయోగించడానికి సన్నద్ధమయ్యేసరికి ఒక్కగెంతున తిరిగి వచ్చేశాడు.


రాముడి త‌ర‌ఫున‌ అంగదుడు దూతగా వెళ్ళి చివరిసారిగా రావణునికి రాముని సందేశాన్ని వినిపించాడు. సీత నిచ్చి శరణు కోరితే రాముడు క్షమించి వదిలి వేస్తాడని చెప్పాడు. అంగదుడి సూచ‌న‌ను రావణుడు తిర‌స్క‌రించాడు. అంగదుడు రావణుని గోపుర శిఖరాన్ని కాలితో తన్ని పడగొట్టి తిరిగి వచ్చాడు.


*రామ లక్ష్మణ సుగ్రీవులకు జయం*


*జ‌యత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః*

*రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః*


అంటూ వానరసేన లంకను ముట్టడించింది. ముందుగా మట్టితోను, బండరాళ్ళతోను, చెట్లతోను అగడ్తను పూడ్చివేసి ప్రాకరాలు ఆక్రమించారు. గోపురాలు, ప్రాకార తోరణాలు పడగొట్టేశారు. వీరబాహువు, సుబాహుడు, నలుడు ప్రాకారాలు భేదించ సాగారు. కుముద, ప్రఘన, పనసులు తూర్పున, శతవలి దక్షిణాన, సుషేణుడు పడమర, మహాకాయ గవాక్ష ధూమ్రులు ఉత్తరాన ద్వారాలు బ్రద్దలుకొట్టసాగారు. ప్రళయకాల సముద్రంలాగా కాల మేఘాల్లాంటి రాక్షససేన సింహనాదాలతో, దుందుభి ధ్వానాలతో వానరులను ఎదుర్కొంది. మహాయద్ధంతో భునభోంతరాళాలు కంపిస్తున్నాయి. ఒక్క క్షణంలో యుద్ధం భీకరం అయి భూమి అంతా రక్త మాంసాలతో నిండిపోయింది.


వానర రాక్షస ప్రముఖుల మధ్య ద్వంద్వ యుద్ధాలు ఆరంభమయ్యాయి.  రాత్రి అయినా కొనసాగుతున్న యుద్ధం వల్ల రక్తం నదులుగా ప్రవహించింది. అది  కాళ‌రాత్రిగా మారింది.


*నాగపాశ విమోచన*


అంగదుని చేత పరాభవం పొందిన ఇంద్రజిత్తు ఒక్కసారిగా మాయమైపోయాడు. మాయాయుద్ధం ప్రారంభించి,  నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. రామలక్ష్మణుల దేహంపై ప్రతి అంగుళం బాణాలతో నిండిపోయింది. వానరసేన  పరుగులు తీసింది. అందరు వానర సైన్యాధిపతులూ ఇంద్రజిత్తు బాణాలతో గాయపడినవారే. ఆ నాగాస్త్ర బంధాలనుండి తప్పుకోవడం ఎవరివల్లా కాదని విజయ గర్వంతో ఇంద్రజిత్తు తండ్రివద్దకు వెళ్ళి తాను రామలక్ష్మణులను చంపి వానరసేనను నిర్వీర్యం చేసేశానని చెప్పాడు. రావణుడు ఆనందించి, ఆ రాఘవుల మృతదేహాలను సీతకు చూపమని ఆదేశించాడు. పుష్పకంపై సీతను తెచ్చి ఆ దృశ్యం చూపగా ఆమె విలపించ సాగింది. రామలక్ష్మణులు కేవలం మూర్ఛ‌పోయార‌ని, త్వరలో కోలుకొంటారని చెప్పి, త్రిజట సీతను ఊరడించింది.


భయభీతులైన వానరులంతా రామ ల‌క్ష్మ‌ణుల‌ చుట్టూ కూర్చుని దుఃఖించసాగారు.

సంపాతి, పనసుడు, హనుమంతుడు వెళ్ళి దివ్యౌషధాలను తెస్తే ప్రయోజనం ఉంటుందని సుషేణుడన్నాడు.


అంతా విషణ్ణులైన సమయానికి పెద్ద సుడిగాలి వీచి సముద్రం కల్లోలమయ్యింది. గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చాడు. అతని రాకతో శరరూపంలో రామ సౌమిత్రులను పట్టుకొని ఉన్న సర్పాలన్నీ పారిపోయాయి. గరుడుడు తన రెండు చేతులతోను రామలక్ష్మణుల సర్వావయవాలను నిమిరాడు. వెంటనే వారి గాయాలు మాయమై వారికి మునుపటికంటె ఎక్కువ తేజస్సు, బల వీర్య పరాక్రమాలు సమకూరాయి. వారిని కౌగలించుకొని గరుడుడు - "మీరు జాగరూకతతో ఉండండి. నేను మీకు స్నేహితుడనెలా అయ్యానో తరువాత తెలుస్తుంది. రామా! నువ్వు లంకను నాశనం చేసి రావణుని చంపి సీతను పొదడం తథ్యం" - అని చెప్పి, రామలక్ష్మణులకు ప్రదక్షిణం చేసి ఆకాశానికి ఎగిరి పోయాడు.


*రాక్షస వీరుల మరణం*


రామలక్ష్మణులు మూర్ఛ‌నుంచి తేరుకుని, వానరులు కుప్పిగంతులు వేస్తూ, సింహనాదాలు చేస్తూ, పరవళ్ళు తొక్కుతూ చెట్లు పీకి యుద్ధానికి సన్నద్ధులయ్యారు. తెల్లబోయిన రావణుడు ధూమ్రాక్షుని యుద్ధానికి పంపాడు. ధూమ్రాక్షుడు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకొని దక్షిణద్వారానికి వెళ్ళి వానరులను చెండాడసాగాడు. ప్రతి వానరవీరుడూ తన పేరు చెప్పుకొంటూ రాక్షసులను చావబాదసాగాడు. హనుమంతుడు విసిరి వేసిన పెద్ద గిరిశిఖరం క్రింద పడి ధూమ్రాక్షుడు పచ్చడి అయిపోయాడు.


*అకంపనుడు*

 మహావీరుడైన అకంపనుడు యుద్ధోత్సాహంతో, సముద్రంలాంటి తన సేనను వెంటబెట్టుకొని బయలుదేరాడు. వానరులు, రాక్షసులు ఒకరికొకరు తీసిపోకుండా భీకరమైన పోరు సాగించారు. . హనుమంతుడు అతనిని నిలువరించాడు. హనుమ పాదతాడనంతో భూమి కంపించింది. ఒక మహావృక్షాన్ని పెరికి దానితో అకంపనుని చూర్ణం చేసేశాడు. 


 *ప్రహస్తుడు*

ఇప్పుడేమి చేయాలని రావణుడు ప్రహస్తుని అడిగాడు. ప్రహస్తుడు రావణుని సేనానాయకుడు. శస్త్రాస్త్రవేది. మహావీరుడు.


శత్రుభీకరమైన మహోన్నత సేనను సమకూర్చుకొని తూర్పు ద్వారంవైపు యుద్ధానికి బయలుదేరాడు. మేఘంపైకి సుడిగాలిలాగా నీలుడు ప్రహస్తుని మీదకురికాడు. ఇద్దరూ మదపుటేనుగుల్లాగా కలియబడ్డారు. ఒక పెద్ద బండరాతితో నీలుడు ప్రహస్తుని తల బద్దలుకొట్టి చంపేశాడు. రాక్షససేన కట్టతెగిన నదీప్రవాహంలాగా లంకలోకి పారిపోయింది.


*రావణునికి పరాభవం*


ఇక లాభం లేదనుకొని రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని దివ్యరథంపై యుద్ధానికి బ‌య‌లుదేరాడు. అతనివెంట రాక్షససేన కదలి వచ్చే కాటుక కొండలలాగా ఉంది. ఆ సైన్యం అగ్ర భాగాన ముందు సూర్యబింబంలా ప్రజ్వలించే అకంపనుడు,  ఇంద్రజిత్తు, వింధ్యపర్వత సదృశ దేహుడైన మహోదరుడు, పిడుగులాంటి పిశాచుడు, మెరుపులాంటి శూలం పట్టుకొన్న త్రిశిరుడు, సర్ప ధ్వజుడైన కుంభుడు, వజ్రాలు పొదిగిన పరిఘను పట్టుకొన్న నికుంభుడు, అగ్నిలాంటి రథం అధిరోహించిన నరాంతకుడు రణోత్సాహులై ఉన్నారు. వారి మధ్య శ్వేతఛత్ర ధారియై రావణుడు ప్రచండ భానునిలా మెరిసిపోతున్నాడు. రావణుని తేజస్సును చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. సీతను అపహరించిన పాపానికి రావణునికి అంత్యకాలం సమీపించిందని చెబుతూ రాముడు ధనుస్సు ఎక్కుపెట్టాడు.


లంకా నగర రక్షణార్ధమై తక్కిన రాక్షస నాయకులను రావణుడు వెనుకకు పంపేశాడు.హనుమంతుని అరచేతి చరుపుకు రావణుడు, రావణుని పిడికిలి పోటుకు హనుమంతుడు కంపించిపోయారు. నీలుడు అంగుష్ఠమాతృడై రావణుని చికాకు పరచాడు. నీలుడు అగ్ని పుత్రుడు గనుక రావణుని ఆగ్నేయాస్త్రం నీలుని సంహరించలేకపోయింది. లక్ష్మణుడి బాణాలతో రావణుడి ధనుసు విరిగిపోయింది. రావణుడి శక్తితో లక్ష్మణుడు తెలివి తప్పాడు. అతనిని రావణుడు ఎత్తలేకపోయడు. హనుమంతుడు లక్ష్మణుని ఎత్తి రామునివద్ద పడుకోబెట్టాడు. హనుమంతుని గుద్దుకు రావణుడు నెత్తురు కక్కి మూర్ఛిల్లాడు. తెలివి తెచ్చుకొని మళ్ళీ శరాఘాతం ప్రాంభించాడు.


హనుమంతుని భుజాలపై అధిరోహించి రాముడు రావణునిపై పోరు సాగించాడు. రావణుని వాడి బాణాలకు ఆంజనేయుడు జంకలేదు. అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని రథం, గుర్రాలు, ఛత్రం, ధ్వజం ధ్వంసమయ్యాయి. కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణునికి చెప్పాడు. సిగ్గుతో రావణుడు లంకలోకి వెళ్ళిపోయాడు.

🌸🌸🌸🌸🌸


చరితం రఘునాథస్య

శతకోటి ప్రవిస్తరమ్

ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్

జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్

సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్

స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుమ్

రామరక్షాం పఠేత్ప్రాఙ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్


*(యుద్ధకాండ* 

*తరువాయి భాగం రేపు)*

మొగలిచెర్ల

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..*


*(రెండవరోజు)*


రాబోయే సంక్రాంతి పండుగ తరువాత తాను మౌనం వీడుతానని ఆ యువకుడు వ్రాసి చూపిన తరువాత..శ్రీధర రావు గారు తిరిగి మొగలిచెర్ల గ్రామానికి వచ్చేసారు..ఇంటికి రాగానే భార్య ప్రభావతి తో..తాను మాలకొండలో ఒక దిగంబర యోగిపుంగవుడిని చూశాననీ.. అతన్ని చూసిన మరుక్షణమే ఒక మహాత్ముడిని చూసిన అనుభూతి కలిగిందనీ.. ఈసారి తాను వెళ్ళేటప్పుడు..తనతో పాటు ఆమెను కూడా తీసుకెళతాననీ..ఎంతో ఉద్వేగంతో చెప్పారు..నిజానికి శ్రీధరరావు గారికి ఇంకా ఆ సాధకుడిని చూసినప్పుడు కలిగిన అనుభూతి వెంటాడుతూనే ఉంది..మాలకొండ నుంచి, మొఫలిచెర్ల దాకా ఎద్దులబండి లో దాదాపు రెండు గంటల ప్రయాణం చేసి వచ్చినా..ఆయన మనసంతా పార్వతీదేవి మఠం లో తాను ఆ సాధకుడి తో గడిపిన ఆ కొద్దిక్షణాల కాలమే గుర్తుకొస్తోంది..


శ్రీధరరావు గారు చెప్పిన మాటలు విన్న ప్రభావతి గారు చాలా తేలిగ్గా తీసుకున్నారు..


"ఈరోజుల్లో.. యోగులు!..మహర్షులు!!..అయ్యోరామ!..ఎవడో వేషం వేసుకొని వచ్చి ఉంటాడు..  ..ఇదిగో మీ లాటి వాళ్ళను తెలివిగా బుట్టలో వేసుకొని..ఈ రకంగా నాలుగు డబ్బులు వెనకేసుకొని..వెళ్ళిపోతారు..వీళ్లంతా కాంతా కనకాలకు ఆశపడే వాళ్లే..నేను రాను!..మీరూ ఊరికే వెళ్లి అతన్ని కలవకండి!..ఏదో ఆ నరసింహ స్వామి దయవల్ల ఇలా హాయిగా బ్రతుకుతున్నాము..మనఇద్దరికీ పూర్వజన్మ సుకృతం వల్ల, ఆ లక్ష్మీనారసింహుడి సేవ చేసుకొనే అవకాశం వచ్చింది..కొండమీదకు ఆ రోడ్డు వేయిస్తే..ఎంతో మందికి స్వామిని దర్శించుకోవడం సులభం అవుతుంది..మీరు ముందాపని చూడండి..ఇటువంటి కుహనా యోగుల చుట్టూ తిరక్కుండా వుండండి.. మరోమాట..మనం సన్యాసులం కాదు..బాధ్యత గల సంసారులం.." అని సున్నితంగా కాదు గట్టిగానే చెప్పారు..


శ్రీధరరావు గారికి, ఆవిడ చేసిన ఈ బోధ రుచించలేదు..కాల,మాన పరిస్తితులనుబట్టి, ఆవిడ ఆవిధంగా ఊహించడంలో తప్పులేదు కానీ..అందరినీ ఒకే గాట కట్టటం తగదని ఆయన నచ్చచెప్పబోయారు..ప్రభావతి గారు చాలా సేపటి దాకా సమాధాన పడలేదు..

చివరకు.."సరే నండీ!..మీరంతగా చెపుతున్నారు కదా!..తరువాత చూద్దాం..ఎప్పుడో వీలున్నప్పుడు.." అని దాటవేశారు..

కానీ..శ్రీధరరావు గారు మాత్రం మాలకొండ కు వెళ్లినప్పుడల్లా..పార్వతీదేవి మఠం వద్దకు వెళ్లి, ఆ యోగి వచ్చేదాకా ఎదురుచూసి.. ఆయనను కలిసి రావడం ఒక నియమంగా పెట్టుకొని ఆచరించసాగారు..అలాగే..తాను ఆ యోగిని కలిసివచ్చిన తరువాత తన అనుభూతి ని ప్రభావతి గారితో పంచుకోవడమూ చేసేవారు..


శ్రీధరరావు గారు పదే పదే చెపుతున్న మాటల వల్ల కావొచ్చు..సహజమైన కుతూహలం వల్ల కావొచ్చు..తాను ఈసారి శ్రీధరరావు గారితో పాటు మాలకొండ వస్తానని ప్రభావతి గారు చెప్పేసారు..ఆ తరువాత  రెండు మూడు రోజుల్లోనే సంక్రాంతి ఉంది..ఎలాగూ మౌన వ్రతం అయిపోతుంది కదా అని..ఆ దంపతులు పండుగ నాడు తమ గూడు బండిలో..మాలకొండకు ప్రయాణమయ్యారు..దారి పొడవునా..శ్రీధర రావు గారు ఆ యోగి గురించి చెపుతూనే వున్నారు..మాలకొండ క్రింద బండి ని ఆపేసి, బండితోలే అతనికి అక్కడే వుండమని చెప్పి..ఇద్దరూ పార్వతీదేవి మఠం వద్దకు మెట్లెక్కి వెళ్లారు..


సన్నగా వర్షం మొదలైంది..దంపతులిద్దరూ పార్వతీదేవి మఠం ముందున్న చిన్న పందిరిలో నిలబడి వున్నారు..అమ్మవారి ఆలయం తలుపులు వేసేసి ఉన్నాయి..ఆ యోగి ఆలయం లో ఉన్నాడా?..లేక వేరేచోటికి వెళ్లాడా?..అని ఆలోచిస్తూ నిలబడ్డారు..


ఇంతలో..పై నున్న శివాలయం గుహ వద్ద నుంచి..మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ యోగి, ఆ రాళ్ళ మధ్య నుంచి దిగి వస్తున్నాడు..నడుముదాకా వ్రేలాడుతూ..నీళ్లు కారుతున్న జుత్తు.. తెల్లటి మేని ఛాయ.. ఆరడుగుల శరీరం..చల్లటి చూపు..చిరునవ్వు తో కలిసిన విగ్రహం..ఒక చేతిలో దండము, మరో చేతిలో కమండలమూ..మొలకు కట్టుకున్న చిన్న అంగవస్త్రం తో దిగి వస్తున్నాడు..నేరుగా వచ్చి ఆ దంపతుల ముందు కొద్దిదూరంలో నిలుచున్నాడు..చేయెత్తి ఆశీర్వదిస్తున్నట్లుగా ఊపి..పార్వతీదేవి ఆలయం తలుపు తీసుకొని లోపలికి వెళ్లి..లోపలే ఉన్న చిన్న అరుగుమీద కూర్చుని ప్రక్కనే ఉన్న మరో చిన్న వస్త్రాన్ని అందుకుని..తెల్లటి పాదాలను తుడుచుకోసాగాడు..


శ్రీధరరావు గారు ముందుగా వెళ్లి..ఆయన పాదాలకు నమస్కారం చేశారు..చిరునవ్వుతో ఆశీర్వదించారు..ప్రభావతమ్మ కూడా నమస్కరించబోయింది..చటుక్కున తన పాదాలను వెనక్కు తీసేసుకున్నాడా యోగి..ప్రభావతి గారికి ఒక్కసారిగా మనస్సు చివుక్కుమనిపించింది..తనకు నమస్కారం చేసే అర్హత లేదా అనే ఒకానొక అహంకారపు ఆలోచన మనసులో తన్నుకొచ్చింది..


"నాయనా!..నిన్ను మొదటిసారిగా ఇదే నేను చూడటం ..నా భర్త గారు నమస్కరిస్తే..ఆశీర్వదించావు..అదే నేను నమస్కారం చేస్తే..తిరస్కరిస్తున్నావు..మేమిద్దరమూ సమానమే గదా..ఈలోపల నీకీ తేడా ఎందుకు?.." అని నేరుగా అడిగేసింది..


ఒక్కక్షణం పాటు ప్రభావతి గారిని నవ్వుతూ చూసి..తాను కూర్చున్న అరుగు మీదనుండి లేచి..పార్వతీ అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్లి, భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి..ఆ అమ్మవారి విగ్రహం పాదాలవద్ద..ఈశ్వరుడు, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్న ఈశ్వర కుటుంబం ఫోటో చూపి, అందులో ఉన్న పార్వతీదేవితో ప్రభావతి గారు సమానమనీ..తాను వినాయకుడితో సమానమనీ..తల్లి ఎప్పుడూ బిడ్డకు నమస్కరించరాదనీ...సైగలతో చెప్పి..మరలా పార్వతీదేవి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి..వచ్చి..అరుగుమీద కూర్చున్నాడు..


"అమ్మా!..ఈనాటితో నా మౌనం పూర్తి అయింది..ఇక మీతో మాట్లాడతాను!.." అన్నారా యోగి మొదటిసారిగా ఆ దంపతులతో..ఇద్దరూ ఆయన కూర్చున్న అరుగుకు అభిముఖంగా పద్మాసనం వేసుక్కూర్చున్నారు..సాక్షాత్ దక్షిణామూర్తి తమ ఎదురుగా ఉన్న అనుభూతి కలిగిందా దంపతులకు!..


ఆదిత్య హృదయం అప్పజెప్పడం..స్వామి వారి బోధ..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523 114... సెల్..94402 66380 & 99089 73699).

ధ్యానం చేస్తుంటే

 ఓ కరుణా సముద్రుడైన శంకరా! నేను నా చేతుల వలన, పాదాల వలన, మాటల ద్వారా, మరియు శరీరం వలన గాని, వినికిడి వలన గాని, చూచుట వలన గాని, మనస్సు వలన గాని, తెలిసి గాని, తెలియక గాని, ఏదయినా అపరాధం చేసి నట్లయితే అవన్నీ క్షమించవలసినది.


🙏🏻🙏🏻🙏🏻


నిద్రకు ఉపక్రమించే ముందు కాసేపు భగవన్నామ స్మరణ చేసి ఈరోజును ముగిద్దాం. మీ ఇష్టదైవాన్ని కాసేపు తప్పక ప్రార్ధించండి .. రోజు మన దేహాన్ని శుభ్రం చేసుకున్నట్టు మన మనసుని కూడా నిద్రించే ముందు భగవన్నామ స్మరణతో పరిశుభ్రం చేసుకోవాలి . రోజు ధ్యానం చేస్తుంటే క్రమేణా జీవితం లో సకల సౌభాగ్యాలు సమకూరుతాయి .  మనసుకి ధ్యానం అలవాటు చేయండి