శ్రీరామ (100)
(భక్తి ఒక్కటే ముక్తికి మార్గం - ప్రహ్లాదుడు)
శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం/
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం//
(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).
---------
మనకు ఇష్టం లేకపోయినా "కష్టాలు, దుఃఖాలు" వస్తున్నాయి.
అదేవిధంగా "సుఖాలు" కూడా మనం కోరకుండానే, పూర్వజన్మ కర్మననుసరించి, కాలానుగుణంగా వస్తాయి,
అని ప్రహ్లాదుడు తన తోటి విద్యార్థులకు ఇలా బోధ చేస్తున్నాడు.
ఓ బాలకులారా!
"మానవ జన్మ లభించడం చాలా కష్టం.
అదృష్టవశాత్తు లభించిన ఈ జన్మను వ్యర్థం చేసుకోకూడదు.
మానవుని ఆయుర్దాయం నూరు సంవత్సరములే.
అందులో సగము నిద్రకే పోతుంది.
మిగిలిన యాభై సంవత్సరాలలో, పసివాడుగా, బాలుడుగా, ఇరవై సంవత్సరాలు గడిచిపోతాయి.
మిగిలిన ముప్ఫై సంవత్సరాలు మానవుడు ఇంద్రియ సుఖాలకు వశుడై, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, అనే బంధాలలో చిక్కుకుంటాడు.
వాటినుండి బయట పడలేక జీవితం అంతా వ్యర్థంగా గడుపుతాడు.
ప్రాణం కంటే ప్రియమైన " కామము (కోరిక)" నకు దాసుడవుతాడు.
కోరికల కారణంగా ఇతరుల ధనం అపహరించాలని చూస్తాడు.
ధనం కోసం ప్రాణాలను కూడా లెఖ్ఖచెయ్యడు.
రహస్యంగా " స్త్రీ సౌఖ్యం" కోరుకుంటాడు.
కాళ్ళకు బంధాలు వేసే భార్యలు ఏర్పడుతారు.
తియ్య తియ్యని,జిలిబిలి పలుకులతో, ఆనందింపజేసే శిశువులు పుడతారు.
అందమైన కూతుళ్ళూ, వినయ విధేయతలతో కూడిన కొడుకులూ,
అన్నివిధాలా సహకరించే సోదరులు,
ప్రేమతోను,మమకారంతోను, కూడిన తల్లిదండ్రులు,
సహృదయంతో కూడిన బంధువులు,
ఈ విధంగా రక రకాలుగా ఆకర్షణీయంగా ఉన్న బంధాలలో కట్టుబడి పోతాడు.
డబ్బు,బంగారం, ఆభరణాలు, భవనాలు, వాహనాలు, పాడిపంటలు, సేవకులు, మొదలైన సంపదలను వదిలిపెట్టలేక,
మానవుడు సంసారంలో పూర్తిగా మునిగి పోతాడు.
సాలీడు గూటిలో చిక్కుకొని బయటపడలేక పోతున్న కీటకం లాగా, మానవుడు ఈ సంసారమనే సంకెళ్ళ నుండి బయట పడలేడు.
కుటుంబ పోషణలో పడి, ముక్తిని పొందే మార్గం కనుగొన లేక,తర,తమ భేదాలు పాటిస్తూ అజ్ఞానం అనే చీకటిలో ఉండిపోతాడు.
కాబట్టి దుర్లభమైన మానవ జన్మ లభించినప్పుడు, చిన్నప్పటినుండే భగవంతునియందు అనురక్తుడయే "భాగవత ధర్మాన్ని" అనుష్ఠించాలి.
మనకు ఇష్టం లేకపోయినా "కష్టాలు, దుఃఖాలు" వస్తున్నాయి.
అదేవిధంగా "సుఖాలు" కూడా మనం కోరకుండానే, పూర్వజన్మ కర్మననుసరించి, కాలానుగుణంగా వస్తాయి.
వాటి కోసం విలువైన జీవిత కాలాన్ని వృథా చేసుకో కూడదు.
ఆ శ్రీహరిని నమ్ముకుంటే ముక్తి వస్తుంది.
ఆయనే ప్రాణులందరికీ అధిపతి.
ఆ పరమ పురుషుని పాదపద్మములను భావించి,సేవించటం ఒక్కటే ముక్తికి మార్గం.
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు,
28-2-'26.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి