28, ఫిబ్రవరి 2026, శనివారం

ఋషులు సిద్ధులు సంపాదించారని ఎన్నో కథలు చదువుకున్నాం

  శ్రీరామ (97)


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


ఎండా, వానా లెక్కచేయకుండా తపస్సు చేసి ఋషులు సిద్ధులు సంపాదించారని ఎన్నో కథలు చదువుకున్నాం.

కానీ, ఆ! అవన్నీ కథలండీ, ఈ కాలానికి వర్తించేవి కావు అంటాం.

అంటే మనం చదివే పురాణాలు, వినే ప్రవచనాల మీద మనకు నమ్మకం లేదన్నమాట !

అవన్నీ కాలక్షేపానికే గాని, ఆచరణలో పెట్టేందుకు కాదు.


అంతేకాదు,

మనం చేసే కొద్దో గొప్పో పూజాదికమైనా,

 ఆ పూజకు, లేదా వ్రతానికి చెప్పబడిన నియమ, నిష్ఠలతో కూడి వుండదు. 

పైపెచ్చు,

ఇతరుల చేత గొప్ప అనిపించుకోడానికి చేసే

భారీ పిండి వంటలు మొదలైన ఆడంబరాలతో కూడి ఉంటుంది.

కానీ, ఎన్ని పూజలు చేసినా మాకు ఫలితం రావడంలేదని మాత్రం అంటాము.


ఇది దృష్టిలో పెట్టుకొని శ్రీ ధూర్జటి మహాకవి ఇలా అంటున్నారు : 


మ// దయ జూడుండని కొందరాడుదురు నిత్యంబున్ నినుంగొల్చుచున్/

నియమంబెంతొ ఫలంబు నంతియె కదా నీవీయ, పిండెంతో అం/

తియకా నిప్పటియుం దలంపనను బుద్ధింజూడ,నేలబ్బు ని/

ష్క్రియతన్ నిన్ను భజింప కిష్ట సుఖముల్ శ్రీకాళహస్తీశ్వర!//


(చాలామంది, ప్రతిరోజు నిన్ను పూజిస్తూ,"స్వామీ ! నీకు ఇంకా మామీద దయరాలేదు" అంటారు.

నిజానికి మన పూజలు ఫలితమివ్వడం అనేది చిత్తశుద్ధితో మనం పాటించే నియమాలపై ఆధారపడి ఉంటుంది.

పిండి ఎంతో రొట్టె (ఇప్పటి అనే పిండి వంట) కూడా అంతే ప్రమాణంలో వస్తుంది కాని అధికంగా రాదుగదా!

అలాగే మనం ఎంత శ్రద్ధతో నియమ నిష్ఠలు పాటిస్తామో అంత త్వరగా భగవదనుగ్రహం లభిస్తుంది.

 ఆ నియమ, నిష్ఠలు పాటించకుండా, ఆశించిన ఇష్ట సుఖములు ఎలా వస్తాయి? )


మనస్సు శుచిగా ఉంటే ఈ నియమ నిష్ఠలు అనవసరం అంటారు మేధావులమనుకొనే కొందరు అజ్ఞులు.

మనస్సు శుచి అవడానికే నియమ నిష్ఠలు అని ముందు తెలుసుకోవాలి.

శుచి అయిన మనస్సులోనే శ్రద్ధ, అనగా భగవంతుని మీద విశ్వాసం ఉదయిస్తుంది.

 శ్రద్ధతో చేసే భగవదారాధన మాత్రమే మనకు సత్వర ఫలితాలనిస్తుందని ధూర్జటిగారి భావం.


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

28-2-'26.

కామెంట్‌లు లేవు: