శ్రీరామ (22)
( వాల్మీకి రామాయణం - 15 )
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
(25-3-'26 ' మధ్యాహ్నం ' పోష్టు తరువాయి భాగము)
జనకుని మాటలు విని, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అతనితో ఇలా అన్నారు.
" ఇక్ష్వాకు వంశము, మీ విదేహ వంశము,చాలా గొప్పవి.
మీ వంశములు వియ్యమందటము, అందరికి క్షేమం కలిగిస్తుంది.
నీ తమ్ముని కుమార్తెలయిన మాండవీ, శ్రుతకీర్తులను, దశరథ పుత్రులైన, భరత, శత్రుఘ్నులకు భార్యలుగా మేము వరించుచున్నాము.
ఈ వివాహ సంబంధము వల్ల మీ ఇరువురి వంశములు దృఢమైన బంధముకలవి అగుగాక" అన్నారు.
జనకుడు, కుశధ్వజుడు, మహర్షులు చెప్పినదానికి చాలా సంతోషంతో అంగీకరించారు.
శ్లో//ఏవం భవతు భద్రం వః కుశధ్వజ సుతే ఇమే/
పత్నీ భజేతాం సహితౌ శతృఘ్న భరతావుభౌ/
ఏకాహ్నా రాజపుత్రీణాం చతసౄణాంమహామునే/
పాణీన్ గృహ్ణన్తు చత్వారో రాజపుత్రా మహాబలాః//
(అట్లే అగుగాక.మీకు భద్రమగు గాక.ఈ కుశధ్వజుని కుమార్తెలగు "మాండవీ" "శృతకీర్తులు" ఎప్పుడూ సన్నిహితంగా మెలిగే ఈ భరత శతృఘ్నులకు(వరుసగా) భార్యలై వారిని సేవించెదరు గాక.
ఓ మహామునీ! మహాబలశాలులగు ఈ రాజపుత్రులు నలుగురు ఒకే దినమున నలుగురు రాజపుత్రికలను వివాహమాడుదురు గాక).
దశరథ మహారాజు అప్పుడు జనకుని వద్ద సెలవు తీసుకుని,వసిష్ఠ,విశ్వామిత్రులతొ
తన విడిదికి వెళ్లి, యథా శాస్త్రముగా చేయవలసిన కార్యములు నిర్వర్తించాడు.
మరుసటి రోజు ప్రాతః:కాలంలో, స్నాతకము, గోదానము మొదలైన విహిత కృత్యములను నిర్వహించాడు.
ఆ రోజు,భరతుని మేనమామ, కేకయమహారాజు కుమారుడు, అయిన యుధాజిత్తు అక్కడకు వచ్చాడు.
మేనల్లుడైన భరతుని చూచుటకు తాను అయోధ్యాపట్టణానికి వెళ్లాననీ, అక్కడ రాముని వివాహవిషయం తెలిసి ఇక్కడకు వచ్చాననీ, చెప్పాడు.
అతని రాకకు అందరూ చాలా సంతోషించారు.
శ్లో// అథ రాజా దశరథః ప్రియాతిథి ముపస్థితమ్ /
దృష్ట్వా పరమ సత్కారైః పూజార్హం సమపూజయత్//
(పిమ్మట దశరథుడు వచ్చిన ఆ ప్రియాతిథిని చూచి పూజార్హుడైన అతనిని అనేక సత్కారములు చేసి గౌరవించాడు)
అందరూ మరుసటిరోజు జరగబోయే వివాహ విషయాలు ముచ్చటించుకుంటూ ఆ రాత్రి సుఖంగా గడిపారు.
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.
ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః.
( సశేషం )
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
25-3-'26
(రేపు స్మార్తులకు శ్రీరామనవమి.
ఆ సందర్భంగా శుభప్రదమైన సీతారామ కళ్యాణం చెప్పుకుందాము)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి