3, మార్చి 2026, మంగళవారం

శ్రీమహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*సోమవారం 2 మార్చి 2026*


        *శ్రీమహావిష్ణు పురాణం*                

             *13వ భాగం*


*అష్టాక్షరీ మంత్ర విశిష్టత*```


బ్రహ్మ ఆదేశాన్ని పాటించి విశ్వకర్మ భూమండలాన్ని సప్త ద్వీపాలుగా సప్త సముద్రాలు పరివేష్టితమై ఉండేటట్టు చేశాడు. భూమండలానికి ఊర్థ్వలోకాలకి మధ్యగా భూమి ఉపరితలం పై లోకాలోక పర్వతం ఏర్పడింది. భూమికి అంతరిక్ష లోకాలకి మధ్య ఉండటం చేత ఈ పర్వతానికి లోకాలోక పర్వతం అని పేరు వచ్చింది.


బ్రహ్మదేవుని మానసోత్తర పర్వతం నుంచి సుమేరు పర్వతం దాక చిత్రవిచిత్రమైన బంగారు కాంతులతో ప్రకాశించే భూమి ఉంది. ఈ ప్రదేశంలోకి ప్రవేశించిన ఏ ప్రాణి తిరిగి కన్పించదు. మాయమై పోతుంది. కనుక ఇది నిర్జన ప్రదేశం. ఎవ్వరూ ఉండరు.  ముల్లోకాలకు వారథిగా నిర్మితమైన ఈ పర్వతశిఖరాలను తాకుతూ సూర్య చంద్ర నక్షత్రాది గ్రహ కాంతులు ముల్లోకాలలో ప్రసరిస్తూ ఉంటాయి.

బ్రహ్మదేవుడులోకాలోకపర్వతపు నాలుగు దిక్కులలో  ఋషభం, పుష్పఛూడం, వామనం, అపరాజితం అనే నాలుగు దిగ్గజాలను నిలిపాడు. సమస్త లోకాలకు ఇవి స్థితి హేతువులు. ఈ దిగ్గజాల పైన నిర్మితమైన వైకుంఠం లో ఏడు ద్వారాల తరువాత భగవంతుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై ఆదిశేషువు పై పవళించి ఉంటాడు. విష్వక్సేనుడు మొదలైన పరివారం వారిని సేవిస్తుంటారు.


విశ్వకర్మ సహాయంతో పద్నాలుగు లోకాలు బ్రహ్మదేవుడు సృష్టించిన తరువాత ఆలోచనలో పడ్డాడు.


"పద్నాలుగు లోకాలలో నివసించే  వారిని ఎలా సృష్టించాలి? తనకు పద్నాలుగు లోకవాసులను సృష్టించే శక్తి ఉందా? విశ్వకర్మను సహాయంగా పంపినట్టే శ్రీమహా విష్ణువుని  పద్నాలుగు లోకాల జీవుల సృష్టిలో సహాయం చేయగలవారిని పంపమని అడగాలి" అని మనస్సుని స్థిర పరుచుకుని బ్రహ్మదేవుడు అష్టాక్షరి మంత్రమైన ‘ఓంనమోనారాయణాయ’ జపిస్తూ ధ్యానంలోకి వెళ్లాడు. 


శౌనకాది మునులు సూత మహామునిని అష్టాక్షరి మంత్ర విశిష్టతను చెప్పమని కోరారు. 

సూత మహర్షి చెప్పసాగాడు..

‘అష్టాక్షరి మంత్రం’ మహత్మ్యం  పూర్తిగా చెప్పగలవారు ముల్లోకాలలో లేరు. ఒకటి మాత్రం సత్యం. కలియుగంలో సులభంగా మానవులకు మోక్షం ప్రసాదించగల శక్తి ఈ నారాయణ మంత్రానికి మాత్రమే ఉంది. లయకారుడైన మహేశ్వరుడు సదా ఈ నారాయణ మంత్రం జపం చేస్తారు. 


"ఓం నమో నారాయణాయ"


ఎనిమిది బీజాక్షరాలతో ఈ మంత్రం ఉండటం వలన అష్టాక్షరీ మంత్రం అయ్యింది. 

ఈ మంత్రంలో "ఓం" ఆత్మ స్వరూపాన్ని, "నమః" బుద్దిని,  "నారాయణాయ" పంచేంద్రియాల తో కూడిన జీవుని సూచిస్తున్నాయి. అష్టాక్షరీ మంత్రం వ్యాపక మంత్రం. ఆకాశ తత్త్వంపై ఆధారపడి ఉంటుంది. అందు వలన ఈ మంత్ర జపం చేసే సాధకుడి మనస్సంతా నారాయణ మంత్రం వ్యాపించి పోతుంది.


అష్టాక్షరీ మంత్రంలో ప్రధమాక్షరం ‘ఓంకారం’ సూక్ష్మంలో మోక్షం ప్రసాదించే సాధనం. ఓం కార జపం వలన అనేక ప్రయోజనాలు కలుగు తాయి. విశ్వంలో శ్రీమహావిష్ణువు నుంచి వెలువడిన ఆది ప్రణవ నాదం ఈ ‘ఓం’కారం.


రెండవ అక్షరం ‘న’ అంటే నశింప చేయడం. ఐహిక భౌతిక సుఖాల పైగల మోహాన్ని నారాయణుడు నశింప చేస్తున్నాడు.


మూడవ అక్షరం ‘మో’ అంటే నారాయణుడు మనలో గల మోహాన్ని నశింప చేసి, సత్య దర్శనం చేయించి, జ్ఞాన జ్యోతి వెలిగించి, జననమరణ చక్రబంధం నుండి విముక్తి కలిగించి ‘మోక్షం’ ప్రసాదిస్తాడు.


నాలుగవ అక్షరం ‘నా’ అనగా ఆద్యంతాలు లేని నాద స్వరూపుడు నారాయణుడు. 

నారాయణ స్వరూపం తెలియ జేస్తుంది.


#ఐదవ అక్షరం "రా"  జనులందరిని రజింప చేయువాడు నారాయణుడు అని సూచిస్తుంది. రామచంద్రునిగా అవతారం ధరించి సకల జగత్తును రమింప చేశాడు.


#ఆరవ అక్షరం ‘య’ కారం యజ్ఞ సూచకం. యజ్ఞ స్వరూపుడైన భగవంతుని స్వరూపం తెలియజేస్తుంది.


*ఏడవ అక్షరం ’ణా’ నారాయణుని విశ్వ వ్యాపకత్వం తెలియజేస్తుంది.  అన్నిటిలో తనే ఉంటూ తనలోనే జగత్తును దాచుకునే తత్త్వ స్వరూపుడు.


#ఎనిమిదవ అక్షరం ‘య’ రెండవసారి ఎందుకు వచ్చిందంటే, యజ్ఞ కర్త, యజ్ఞ భోక్త  నారాయణుడే కదా! యజ్ఞ స్వరూపము శ్రీహరే! యజ్ఞ ఫలం స్వీకరించేది శ్రీహరే!


ఇక అక్షర ఫలం వినండి. ‘న’ అక్షరం పలకడం వలన స్వర్గ భోగాలు లభిస్తాయి. ‘ర’ అక్షరం పలకడం వలన రామరాజ్యం లోని భోగాలు పొందవచ్చును.  ‘య’ అక్షరం వలన కుబేరుని వలె సర్వ సౌభాగ్యాలు పొంద వచ్చును. ‘ణ’ అక్షరం పలకడం వలన మోక్ష మార్గము సుగమం అవుతుంది.```


*#అష్టాక్షరీ మంత్ర జప విధానం:* ```


సంకల్పం, కరన్యాస అంగ న్యాసాల తరువాత ధ్యాన మంత్రంతో ధ్యానచేయాలి.  అష్టాక్షరి మంత్రాన్ని సాధకులు శక్త్యానుసారము కనీసం 108 సార్లు జపించాలి.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: