3, మార్చి 2026, మంగళవారం

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము


* 667వ రోజు*

పురాణగాధ

ధర్మరాజు సందేహాలు ఇక లేనట్లు " పితామహా ! అందరికీ వినిపించేలా ఒక ప్రాచీన గాధ ఒకటి వినిపించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నీకు ఉమామహేశ్వర సంవాదము వినిపిస్తాను. ఈ సంవాదం శ్రీకృష్ణుడి సన్నిధానంలో వినిపించడం నా పూర్వ పుణ్యపుణ్యవిశేషంగా భావిస్తున్నాను. శ్రీకృష్ణా ! నీ అనుమతితో ఈ కథను ధర్మరాజుకు వినిపిస్తున్నాను. పుత్రసంతానంకోరి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితోసహా హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ 12 సంవత్సరములు అత్యంత దీక్షతో వ్రతంచేసాడు. వ్రతదీక్షవలన శ్రీకృష్ణుడు చాలా నలిగిపోయాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడిని చూడడానికి నారదుడు, వ్యాసుడు, వాల్మికి, దేవలుడు, కశ్యపుడు మొదలగు వారు తమ తమతమ శిష్య బృందముతో అక్కడకు వచ్చారు. వారికి శ్రీకృష్ణుడు అర్ఘ్యము పాద్యము ఆసనము ఇచ్చి సత్కరించి ఇష్టాగోష్టి జరుపుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడి ముఖము నుండి ఒక మహాగ్ని వెలువడింది. ఆ అగ్ని అక్కడ ఉన్న అడవిని కాల్చింది. ఆ అడవులలోఉన్న మృగములు, పక్షులు, తపస్సు చేసుకుంటున్న సిద్ధులు, సాధ్యులు, మునులు ఆందోళన చెందుతున్నారు. అది గమనించిన శ్రీకృష్ణుడు తన శుభప్రథమైన చూపులతో ఆ మంటలను ఆర్పి వేసాడు. అడవులు మరలా యధాస్థితికివచ్చాయి. ఈ సంఘటన చూసి మునులందరూ ఆశ్చర్యపోయారు. వారిని చూసి శ్రీకృష్ణుడు " మీరు ఈ అగ్నిని చూసి ఏమనుకున్నారు ఉన్నది ఉన్నట్లు చెప్పండి " అని అడిగాడు. మునులంతా ముక్త కంఠముతో ఇలా అన్నారు. దేవా ! ఈ సమస్త జగతి నీ నుండి సృష్టించబడి నీలోనే లయం ఔతుంది. సకల చరాచరజీవజాలము నీ ఆధీనములో ఉన్నాయి కదా. అంతా నీ సంకల్పము వలనే జరిగిఉంటుంది. కనుక ఇది ఎలా జరిగిందో నీవు చెపితే కాని మాకుతెలియదు. అందుకే ఇది చూసి ఆశ్చర్యపోయాము " అని అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు " మహా మునులారా ! మీరు ప్రసన్నంగా ఉండడమే ఈ సృష్టికి ఆధారము. కనుక మీకు ఆ అగ్ని గురించి చెప్తాను వినండి. పూర్వము అస్త్రవిద్యా ప్రవీణుడైన ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడి అస్త్రవిద్య నా ముఖం నుండి వచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళింది. బ్రహ్మదేవుడు నాకు మన్మధుడిని కొడుకుగా ప్రసాదించాడు. నా ముఖం నుండి పుట్టిన అగ్ని పోతూ పోతూ ఈ అడవిని కాల్చింది. నేను నా చల్లని చూపులతో తిరిగి ఈ అడవిని పునరుజ్జీవింప చేసాను. మీరు చూసింది అదే " అని అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: