శ్రీరామ (100)
శుభోదయం.
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం ఎవరికి సులభంగా రాదు.
ఎప్పుడైనా, మనకు అపకారం చేసిన వారెవరైనా ఆపదలలో చిక్కుకుంటే " భగవంతుడు ఉన్నాడండీ. చేసిన పాపం ఊరికే పోతుందా "
అంటాము.
ఆ మాట కూడా భగవంతుడి మీద నమ్మకంతో చెప్పింది కాదు.
మనకు అపకారం చేసినవాడిపై ఉన్న కసితో అన్నది.
ధూర్జటి మహాకవి కూడా, ఎంత వేదాధ్యయనం చెసినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, భగవంతుడు వున్నాడా, అన్న విషయంలో తనకు ఇంకా సందేహం తీరలేదు అంటున్నారు.
అంతేకాదు ఆ నమ్మకం కూడా నీవే కలిగించాలి స్వామి ! అని శ్రీకాళహస్తీశ్వర స్వామిని ఇలా వేడుకుంటున్నారు :
మ// పరిశీలించితి మంత్ర తంత్రములు చెప్పన్ వింటి సాంఖ్యాది యో/
గ రహస్యంబులు, వేద శాస్త్రములు వక్కాణించితిన్ శంక వో/
దరయం గుమ్మడి కాయలోని యవ గింజంతైన, నమ్మించి సు/
స్థిర విజ్ఞానము త్రోవ జెప్పగదవే,
శ్రీ కాళహస్తీశ్వరా//
(ఎన్నో మంత్ర శాస్త్రములు, తంత్ర శాస్త్రములు, క్షుణ్ణంగా పరిశీలించాను.
సాంఖ్యము, యోగము,మొదలైన శాస్త్ర రహస్యాలనన్నింటినీ, గురువుల యొద్ద చక్కగా శ్రవణం చేసాను.
వేదములు, శాస్త్రములు అభ్యసించి, వాటిమీద ఉపన్యాసములు ఇచ్చాను.
అయినా నీ ఉనికి విషయంలో నా సందేహం పోలేదు.
నా అజ్ఞానం గుమ్మడికాయంత ఉంటే, ఇన్ని శాస్త్రాలు చదివినా ఒక ఆవ గింజంత అయినా నా సందేహం తీరలేదు.
ఏ నిదర్శనమైనా చూపించి భగవంతుడు ఉన్నాడన్న గట్టి నమ్మకం నాకు కలిగించు స్వామీ.
ఓ ! శ్రీకాళహస్తీశ్వరా ! దయతో నాకు సుస్థిర విజ్ఞానం కలుగజేసి నన్ను అనుగ్రహించు).
కాబట్టి ఈశ్వరుని శరణు పొందటమే అన్ని సమస్యలకు పరిష్కారం అని మనం గ్రహించాలి.
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
3-3-'26
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి