🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*గురువారం 28 మే 2026*
*శ్రీమహావిష్ణుపురాణం*
*102వ భాగం*
*శ్రీకృష్ణావతారము-5*
*బాలకృష్ణుని లీలలు*
*మద్దిచెట్ల రూపంలో పెరటిలోవున్న యక్షులకు శాప విమోచనం*```
నందుడు గోకులవాసులతో సమావేశం జరిపాడు. బాల కృష్ణుని కోసం కంసుడు పంపే రాక్షసులు, వారు చనిపోవడం గురించి చర్చించారు. మరొక్కసారి జరిగితే గోకులం వదిలి సురక్షిత ప్రాంతానికి నివాసం మార్చుతానని నందుడుచెప్పగా, గోకులవాసులు కూడా నందుని వెంట గోకులం వదలి వస్తామని అన్నారు.
బాల కృష్ణుడు వయస్సుపెరగటం తో పాటు అల్లరి పెరగసాగింది. గోకుల వాసులు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తమ పిల్లలకు కూడా పెట్టకుండా మధురలో అమ్మేటందుకు పంపడం గమనించాడు. గోకులవాసులు తమ పిల్లలకు వెన్న పెరుగు పాలు పెట్టకపోతే ఏం చేస్తారో వారికి బుద్ధి చెప్పాలని గోపబాలురతో ఒక బృందం ఏర్పాటు చేశాడు.
గోపాలుర, గోపికల ఇళ్లల్లోకి పగలు ఇంట్లో లేనప్పుడు, రాత్రి నిదుర పోయినప్పుడు తన బృందంతో దూరేవాడు. వారు అందకుండా పైన ఉట్టి మీద పెట్టిన వెన్నముంతలు, పాలు పెరుగు కుండలు అన్నీ గోపబాలుర భుజాల పైకి ఎక్కి కిందకు దించేవాడు. తను తిని బలరాముడికి, గోపబాలురు, గోపబాలికలకు సంతృప్తిగా తినిపించేవాడు. రోజుకో ఇల్లు నిశ్చయించుకుని వెన్న దొంగతనాలు చేసేవాడు.
పడుకున్న భార్యభర్తలను, తల్లి కూతుళ్ళను వారి వస్త్రాలతో కట్టేసేవాడు. పొరపాటున శబ్దానికి లేచినా, వారు కట్లు విప్పుకునేలోపు తన బృందంతో పారిపోయేవాడు. క్రమంగా ఒక్కరి ఇంట్లో కూడా అమ్మడానికి వెన్న నెయ్యి పెరుగు పాలు మిగలటం లేదు. ఎవరైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తే దొరకకుండా పారిపోయేవాడు. గోపాలుడు గాని, గోపిక గాని గట్టిగా బంధిస్తే, వారి బుగ్గల మీద ముద్దు పెట్టి నవ్వేవాడు. కన్నయ్య ముద్దుకి, చిరునవ్వుకి తన్మయులై వారు పట్టుసడలించేవారు. క్షణంలో చటుక్కున పారిపోయేవాడు.
రోజురోజుకి బాలకృష్ణుని ఆగడాలు, అల్లరి ఎక్కువ అవ్వడంతో గోపికలందరూ యశోద వద్దకు వెళ్లి చెప్పి కృష్ణుని కట్టడి చేయమని గట్టిగా అడిగారు.
యశోద నమ్మలేదు. “మా ఇంట్లో కావలసినంత వెన్న ఉంటే వాడికి దొంగతనం చేసే అవసరం ఏముంది" అని కృష్ణుని వెనకేసుకొచ్చేది.
కృష్ణుడు కూడా “అడిగితే ముద్దు పెట్టలేదని గోపికలు చాడీలు చెబుతున్నారు. నేను ఎవరింటికీ వెళ్లలేదు. దొంగతనం చేయలేదు. నీ వద్దనే పడుకున్నా కదమ్మా" అని
అమాయకంగా అనేవాడు.
యశోద గోపికలను తిట్టి పంపేసేది. ఇలాకాదని గోపికలందరూ కూడబలుక్కుని వాళ్ళింట్లో వెన్న తింటూ మూతికి అంటిన కృష్ణుని బంధించి కుండతో సహా యశోద ముందుకు తెచ్చారు.
నలుగురి మందు తన పరువుతీసిన కన్నయ్య పై యశోదకు మొదటిసారి కోపం వచ్చింది. "ఇక ముందు ఇలా చేయకుండా కన్నయ్యను గట్టిగా దండిస్తాను" అని పెరటిలోకి తీసుకెళ్లి నడుముకి గట్టిగా త్రాడు బిగించి, ఆ త్రాడును అక్కడి రోలుకి కట్టివేసి కోపంగా లోపలికి వెళ్లింది.
బాలకృష్ణుడు గోపికలవంక దిగులు గా జాలిగా అమాయకంగా చూడటంతో వారి మనస్సులు కదలిపోయాయి. “మీ వలనే కదా మా అమ్మ కట్టేసింది” అన్నట్టు కన్నయ్య చూసే చూపు వారి హృదయాల్లో సూటిగా గ్రచ్చుకుంది. అందరూ కృష్ణుని ప్రేమించేవారే. మా ఇంట్లో వెన్న కన్నయ్య తినాలి అని తలుపులు గడియ వేయకుండా ఉంచేవారే. వారి భర్తలు, తండ్రులు, కొడుకులు అమ్మకానికి వెన్న లేకుండా చేస్తున్నారని తిట్టడం వలన యశోదకు ఫిర్యాదు చేయడానికి వచ్చారుతప్ప కన్నయ్య మీద కోపంతో కాదు.
కన్నీరు ఉబుకుతున్న కళ్ళతో తమ వంక జాలిగా చూస్తున్న కృష్ణుని వంక చూడలేక పోయారు. వారి మనస్సులు ద్రవించిపోతున్నాయి.“ఛీ!పాపిష్టివాళ్ళం. సదా చిరునవ్వు తో ఉండే కన్నయ్యను బాధపెట్టాము" అని తమని తాము తిట్టుకుంటూ యశోద దగ్గరకు వెళ్లి కృష్ణుని కట్లు విప్పి వదిలేయమని ప్రార్ధించారు.
యశోద తల్లి మనస్సు కూడా కన్నయ్యను అలా శిక్షించినందుకు తల్లడిల్లి పోతోంది.
బింకంగా గోపికల వంక చూసి "మీరే నా కన్నయ్య వెన్న దొంగిలిస్తున్నాడు, శిక్షించి బుద్ది చెప్పమని అడిగారు కదా! ఇప్పుడేమో వదిలేయ మంటున్నారు! మా కన్నయ్య రేపటి నుండి మీ ఇంటి ఛాయలకు కూడా రాడు. వెళ్లండి. సుఖంగా ఉండండి" అని గదమాయిస్తూ వెళ్లమంది.
గోపికలు కృష్ణుని క్షమించమని దండాలు పెడుతూ మనస్సులో మాత్రం "మా ఇంటికి తప్పక రా కన్నయ్యా! నీకోసం కొత్తవెన్న తీసి పెడతాం" అనుకుంటూ దిగాలుగా వెళ్లారు.
అంతవరకు బుంగమూతి పెట్టి జాలిగా చూస్తున్న బాలకృష్ణుడు చిరునవ్వు నవ్వసాగాడు. అటూ ఇటూ చూసాడు. రోలుకు కట్టేసిన యశోద ఇంటి పనిలో నిమగ్నమై ఉంది. పెరటిలోకి కొద్ది దూరంలో రెండు మద్ది చెట్లు పక్కపక్కనే కనిపించాయి. వాటి మధ్యకు వెళ్లితే రోలుకి కట్టిన త్రాడుని తెంచుకోవచ్చును అనుకున్నాడు. ముందుకు పాకసాగాడు. రోలు నేలపై పడింది.
కృష్ణుడు ముందుకు పాకుతూ వెళుతుంటే వెనుక రోలు దొర్లుతూ రాసాగింది. తనను పరిహసించిన ఇద్దరు యక్షులను మద్దిచెట్లగా మారి అక్కడ ఉండ మని శపించిన నారద మహర్షి అక్కడకు వచ్చాడు. శాప విమోచనం చెప్పమని బతిమాలిన యక్షులకు నారాయణుని బాల రూపంతో విమోచనం కలుగుతుందని అప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఆ దృశ్యం చూడటానికి వచ్చాడు.
అలాగే కంసుడు పంపిన ఇందీవరుడు అనే రాక్షసుడు కూడా అదృశ్యరూపంలో వచ్చి రోలుని లాగుతున్న కృష్ణుని చూశాడు. తాను రోలుని ఆవహించి లాగుతున్న బాలుడి పై బలంగా పడేసి చంపవచ్చును అనుకుని రోలుని ఆవహించాడు. లీలామానుష వేషధారి అయిన బాలకృష్ణుడు గమనించి నవ్వుతూ వేగంగా రోలు లాగుతూ మద్దిచెట్ల వైపు వెళ్లసాగాడు. బాలుడి బలానికి రాక్షసుడు ఆశ్చర్యపడుతుంటే, బాలకృష్ణుడు బలంగా రోలు ఈడ్చుకుంటూ మద్దిచెట్ల మధ్యకు వెళ్లిపోయాడు. రోలు బలంగా మద్దిచెట్ల మొదలు లో తాకి ఇరుక్కుని ఆగిపోయింది.
కన్నయ్య ఒక్కసారి వెనక్కు చూసి త్రాడును బలంగా నడుముతో లాగాడు. దేవదేవుని బలానికి రెండు మద్ది చెట్లు ఫెళఫెళమని భయంకర శబ్దం చేస్తూ విరిగి నేలపై పడిపోయాయి. రోలుని ఆవహించి ఉన్న రాక్షసుడు చెట్ల కింద పడి భూమిలోపలకి కూరుకుపోయి మరణించాడు.
శాపవిమోచనం పొందిన యక్షులు చెట్ల నుండి బయటకు వచ్చి కృష్ణునికి నమస్కరించి "జగన్నాథా! ఈ క్షణం కోసం యుగాలుగా వేచి చూస్తున్నాం. మీ దయ వలన శాపవిమోచనం లభించింది" అని ధన్యవాదాలు తెలిపి యక్షలోకం వెళ్లి పోయారు.
చెట్లు విరిగిన శబ్దానికి నంద యశోదలు, గోప గోపాలికలు పెరటిలోకి వచ్చి కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు, భయపడి పోయారు."తరతరాలు గా బలంగా ఉన్న రెండు మహా వృక్షాలు కృష్ణుడి రోలు తాకిడికి కూలిపోవటమేమిటి? కన్నయ్య వాటి మధ్య ఏ దెబ్బతగలకుండా చిరునవ్వు నవ్వుతూ ఉండట మేమిటి?". అక్కడకు వచ్చివున్న నారద మహర్షి "నారాయణుడి దయ కృప ఉండటం చేత బాలునికి ఏమి జరగలేదు, జరగబోదు" అని చెప్పి వారి భయం దూరం చేసే ప్రయత్నం చేసాడు.
యశోద "కఠిన హృదయంతో రోలుకి కట్టేసి కన్నయ్యను అపాయానికి గురి చేసాను" అనుకుంటూ, తనను తాను తిట్టుకుంటూ, కన్నీళ్లు కారుస్తూ కన్నయ్య కట్లు విప్పి గుండెలకు హత్తుకుంది. "ఎవరు ఏమి నీ గురించి చెప్పినా వినను. నిన్ను శిక్షించను. కన్నా నన్నుక్షమించు!" అని కన్నయ్యను గట్టిగా కౌగిలించు కుంది.
"అమ్మా! నాకు ఏమీ కాలేదు! చూడూ! చిన్న దెబ్బ కూడా తగలలేదు. ఈ ఆట బావుంది. కావాలంటే రోజూ నన్ను ఇలా కట్టేయి" అని కన్నీళ్లు తుడుస్తూ అమాయకంగా నవ్వుతూ అంటూన్న కన్నయ్యను చూసి యశోదకు మాతృప్రేమ ముంచుకు వచ్చింది. నా కన్నయ్య ఎంత మంచివాడో అని హృదయానికి హత్తుకుంది. కన్నయ్య ఒదిగి పోయాడు.
నందుడు మాత్రం ఆలోచనలో పడ్డాడు. ఆపద ఇప్పుడు ఇంటి పెరటిలోకి వచ్చేసింది. కంసుడి రాక్షసులు చెట్ల రూపంలో దాడి చేసారు. వీరి నుండి తప్పించుకో వడానికి త్వరగా గోకులం వదలి వెళ్లాలి అని నిర్ణయించుకున్నాడు. ఊరివాళ్ళతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి అనుకుని సేవకులను పిలిచి పడిన చెట్లను తొలగించమని ఆదేశించాడు. నారద మహర్షి నందుని ఆలోచనలు గమనించి దగ్గరకు వచ్చి "నందా! యమునా తీరానికి సమీపంలో ఉన్న బృందావనం మీకు సురక్షితంగా ఉంటుంది" అని మార్గదర్శనం చేసి ఆశీర్వదించి వెళ్లి పోయాడు.
*తరువాత కథ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి