*శ్రీ మహావిష్ణు పురాణం*
➖➖➖✍️
201 వ భాగం
*శ్రీకృష్ణావతారము4.*
*బాల కృష్ణుని లీలలు -
*పూతన, శకటాసుర సంహారం:
```
గోకులంలో యశోద నందుల పుత్రుడి జన్మోత్సవం రంగ రంగ వైభవంగా జరిగింది. గర్గ మహర్షి నీలమేఘ శ్యామ స్వరూపం కాబట్టి యశోదా నందనునికి ‘శ్రీకృష్ణుడు’ అని నామకరణం చేశాడు.
బాల కృష్ణుడి బోసి నవ్వులకి గోకులం అంతా మైమరచి పోయింది. ఆ నవ్వులు చూడటానికి అందరూ నందుని ఇంటి దగ్గరే ఉండసాగారు.
యశోద నందనుని దివ్య సుందర రూపం, బోసి నవ్వు, చూసి తన్మయత్వం పొందినవారి వలన గోకులం చుట్టు పక్కల గ్రామాలకు తెలిసి పోయింది. అందరూ బాల కృష్ణుని దర్శనం కోసం గోకులం రాసాగారు. కంసుడి ఆదేశంతో మధుర రాజ్యమంతా తిరుగుతూ గ్రామాలలో పసిపిల్లలను విషము స్తన్యపు పాల ద్వారా ఇచ్చి చంపుతున్న పూతన అనే రాక్షసికి ఈ విషయం తెలిసింది.
కృష్ణుడి జన్మ వివరాలు తెలుసుకుంది. కంసుడు చెప్పిన బాలుడు కృష్ణుడే అని అర్ధమయ్యింది. నందుని ఇంటిలో అందరూ మైమరచి నిద్రపోతున్న అర్ధరాత్రి వేళ ప్రవేశించింది. బాల కృష్ణుడి దుష్టశిక్షణ ఆరంభమైంది. చిరునవ్వులు చిందిస్తూ పూతన కోసం ఎదురు చూడసాగాడు. ఉయ్యాల దగ్గరకు అందమైన గోపిక రూపంలో పూతన వచ్చింది.
బాల కృష్ణుడు పూతనను చూడగానే నవ్వుతూ ఎత్తుకోమన్నట్టు బుల్లి చేతులు చాచాడు. పూతన "నీ మరణం నా చేతిలోనే కన్నయ్యా" అంటూ ఎత్తుకుని బయటకు తీసుకెళ్లింది. రాత్రి సమయంలో రాక్షస మాయ చేత పూతన స్తన్యం ద్వారా త్రాగించే పాలు విషపూరితం అవుతాయి. పాలు త్రాగిన పసి పాపలు క్షణాలలో ప్రాణాలు విడుస్తారు.
పక్కకు తీసుకెళ్లి పూతన బాల కృష్ణుడిని హృదయానికి హత్తుకుని తన పాలు త్రాగించ సాగింది. బాల కృష్ణుడు కళ్ళతోనే నవ్వులు చిందిస్తూ పూతన చనుబాలు త్రాగసాగాడు. క్షణం బాగానే ఉంది. కృష్ణుడు చావడానికి బదులు పూతన ప్రాణాలు పాలతో పాటు త్రాగసాగాడు. పూతన పాదాల నుంచి పంచ ప్రాణాలు పైపైకి వెళుతుంటే ఊపిరాడక పూతన గిలగిలా కొట్టుకోసాగింది. కృష్ణుడి నోటి నుంచి తనను దూరం చేసే ప్రయత్నం చేసింది. కృష్ణుడి నోరు ఉడుము పట్టులా పూతన రొమ్ముని పట్టుకొని ఉంది.
ఆర్తనాదాలు బిగ్గరగా చేస్తూ రాక్షసి రూపంలోకి వచ్చి నేలపై పడి కొట్టుకుంటూ ప్రాణాలు వదిలేసింది.
పూతన అరచిన అరుపులకి నందుని ఇంటిలోని వారంతా మేల్కోని బయటకు వచ్చారు. భయంకరమైన ఆకారంతో మరణించి పడి ఉన్న పూతన రాక్షసిని, ఆమె వక్షస్థలం పై కేరింతలు కొడుతున్న బాల కృష్ణుని చూశారు. భయంతో నిశ్చేష్ఠులు అయ్యారు.
అంత పెద్ద రాక్షసాకారాన్ని గోకుల వాసులు మొదటిసారి చూశారు. ఎవ్వరూ దగ్గరకు వెళ్ళడానికి సాహసించలేదు. యశోద తేరుకుని దగ్గరకు వెళ్లి బాలకృష్ణుని ఎత్తుకుని దూరంగా వచ్చేసింది. “నారాయణుడి దయ వలన నీవు క్షేమంగా ఉన్నావు. అంతే చాలు” అనిముద్దులుపెట్టు కుంది. దిష్టి తీసింది. నందుడు నారాయణ రక్షాకవచం తెప్పించి బాలకృష్ణుని చేతికి కట్టాడు.
నందుడు పూతన భారి దేహాన్ని ఊరి బయటకు తీసుకెళ్లిదహనం చేయమని ఆదేశించడంతో గోకుల వాసులు అతి ప్రయత్నం మీద ఊరి బయటకు తీసుకెళ్ల గలిగారు. దహనం చేస్తున్న పూతన దేహం నుంచి సుగంధ పరిమళాలు రాసాగాయి. బాల కృష్ణుడు ఆమెలోని విషముతో పాటు చెడును కూడా శుద్ధి చేసాడు. అందుకే సుగంధ పరిమళాలు దహనమయ్యే శరీరం నుంచి వచ్చాయి. గోకుల వాసులు అంతా నారాయణుడి మహిమ అనుకున్నారు.
గోకులంలో పూతన చనిపోయిన వార్త చారుల ద్వారా విన్న కంసుడు తనను చంపేవాడు గోకులంలోనే ఉన్నాడు అని నిర్ధారించుకున్నాడు. మిగిలిన రాక్షసులను కూడా గోకులం వెళ్లమని ఆదేశించాడు. పూతన వంటి మహారాక్షసి చనిపోవడంతో మిగిలిన వారు జాగ్రత్తగా గోకులం లో కంసుని చంపే బాలుని వెతకాలి అనుకున్నారు.
బాలకృష్ణుడు మూడేళ్ల వాడు అయ్యాడు. గోకులంలో ఇళ్ళన్నీ తిరుగుతూ ఆడుకుంటుంటే గోకుల వాసులు మురిపెంగా చూసి ఆనందిస్తున్నారు. "కన్నయ్య ఈరోజు మా ఇంటికి వస్తాడు, మాఇంటికి వస్తాడు" అని తలుపులు తీసి ఉదయాన్నే గోపికలు,గోపాలురు ఎదురు చూసేవారు. కృష్ణుడు వచ్చిన ఇళ్ళవారు అదృష్టవంతులు అనుకుని, మిగతావారు తమ ఇంటికి మరుసటి రోజు రమ్మని కృష్ణుని బతిమాలుతూ పిలిచేవారు.
రోహిణి కుమారుడైన బలరాముడు కృష్ణుడి వెంట రక్షణగా ఉండే వాడు. కృష్ణుడు చేసే అల్లరి పనులన్ని యశోదకు చెప్పేవాడు. గోపబాలురుతో పాటు పెద్దలు కూడా బాలకృష్ణుని అల్లరికి ఆనందించేవారు.
కంసుడి అనుచరుడైన శకటాసురుడు బాలకృష్ణుని లీలలు విని నందుని ఇంటి ముందు శకటరూపం (బండి రూపం) దాల్చి కృష్ణుని చంపడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. బాలకృష్ణుడు చూసి వీడికి మోక్షం ఇవ్వాల్సిన సమయం వచ్చింది అనుకున్నాడు. గోపబాలురతో ఇంటిముందు ఆడుకుంటూ శకటాసురుడి బండి మీదకు ఎక్కాడు.
సమయం దొరికిందని శకటాసురుడు బండిని వేగంగా గిరగిరా తిప్పుతూ గాలిలోకి లేచాడు. చుట్టూ ఆడుతున్న గోపబాలురు భయపడి అరవసాగారు. కొంతమంది నంద యశోదలకు చెప్పడానికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. చూస్తుండగానే బండి ఆకాశంలో దూరంగా వెళ్లి పోయింది.
కనపడనంత దూరం వెళ్లిన తరువాత ఆకాశంలో బాల కృష్ణుడు కాలెత్తి బండిని గట్టిగా తన్నాడు. ఆ పాదపు దెబ్బ శకటాసురుడి గుండెల మీద పడింది. పెద్దగా ఆర్తనాదం చేస్తూ శకటాసురుడు ప్రాణాలు వదిలేశాడు. రాక్షస రూపంతో నేలపై పడ్డాడు. వాడి దేహం పై నుండి పక్కకు వచ్చి బాలకృష్ణుడు ఏమీ తెలియనట్టు చిరునవ్వుతో అందరి వంక చూస్తూ నిలబడ్డాడు.
గోపబాలురు చెప్పడంతో నందుడు, యశోద, ఇతర గోపికలు గోపాలురు పరుగున వచ్చి చూసి ఆశ్చర్యపడ్డారు. విరిగిన బండి, మరణించిన రాక్షసుడు, చిరునవ్వుతో చూసే కృష్ణుడు వారిని బిత్తరపోయేలా చేసింది. ఈ బాలునిలో ఏదో తెలియని గొప్పతనం, మహిమ ఉంది. పెద్ద పెద్దరాక్షసులితనిని చంపాలని వచ్చి చనిపోతున్నారు. నారాయణుడి కృప ఈ బాలునిపై పూర్తిగా ఉంది. నారాయణుడు తమను అన్ని విధాల కాపాడు తాడు అనే విశ్వాసం గోకులవాసులలో కలిగింది.
అందరూ నారాయణ స్మరణ చేసుకుంటూ తమ తమ ఇళ్లకు వెళ్లారు. నందుడు మాత్రం తన కుమారుడి రక్షణ కోసం గోకులం వదలి వెళ్లాలని అనుకున్నాడు. గోకుల వాసులతో చర్చించాలి అనుకుని సమావేశం ఏర్పాటు చేసాడు.✍️
*రేపటి భాగంలో ఆ కధ చదువుదాం..
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..
-సేకరణ:పెండ్యాల ఉపేంద్రరావు```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి