```
*సుందరకాండ-హనుమ*
➖➖➖✍️
5 వ భాగం
*నమోస్తు రామాయ సలక్ష్మణాయ*
*దేవ్యైచ తస్యై జనకాత్మజాయై*
*నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో*
*నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః*
```
*బాలభానుని లేత కిరణాలు పుఢమిని పలకరిస్తున్న శుభోదయ ఘడియల్లో ఒక మహా ఉపాసకుడు, ధైర్యశాలి, సాధకుడు అయినటువంటి హనుమ సర్వశక్తులను పుంజుకుని ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరి ప్రయాణం చేయనారంభించారు. సకలదేవతలు ఇంద్రుడు, తండ్రి వాయుదేవుడు స్వామి చేపట్టిన రామకార్యంలో సఫలీకృతుడవ్వాలని ఆశీర్వదించారు. శరవేగంతో హనుమ ఆకాశమార్గాన దక్షిణాదికి పయనిస్తున్నారు.```
*ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపి మన్వయుః|*
*ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబన్ధుమివ బాన్ధవాః||47||*```
*అలా ఆకాశంలోకి ఎగిరిన హనుమతో పాటు ఆ మహేంద్రగిరి పర్వతంపై కొన్ని వందల సంవత్సరాల క్రితమునుండి పెరిగిన మహా వృక్షములు కూకటి వేళ్లతో పెకలింపబడి స్వామితో సమానంగా కొంతదూరం ప్రయాణించి సముద్రంలో పడిపోయాయి, ఆ చెట్లపై వున్న అనేకమైన రంగుల పుష్పాలు తమకు దక్కిన మహద్భాగ్యానికి అమితానందంతో స్వామి శరీరంపై అలంకృతమయిపోయాయి. ఆ సమయమున స్వామి ఆకాశములో పుష్పాలతో నిండిన మేఘములా కనిపిస్తున్నారు. శరవేగంతో పయనిస్తున్న స్వామి శరీరంపై వున్న పుష్పాలు సముద్రంలోకి జారిపడుతున్నాయి ఆ సుందర దృశ్యం చూస్తే ఆకాశం నుండి పూలవాన కురుస్తున్నట్లుగా వుంది.
*యధేచ్ఛగా స్వామి ఎగురుతూ వుండగా స్వామి బాహుమూలముల మధ్యనుండి వస్తున్న గాలి విచిత్రమైన రవం చేస్తోంది. సముద్రంపై అలలు ఉవ్వెత్తున పైకి లేచి స్వామిని అందుకోవడానికి ప్రయత్నించి విఫలమై కిందకు జారిపడుతున్నాయి. ఆ తాకిడికి సముద్రంలో వున్న జీవరాసులు ఉలిక్కిపడి తమ సహజమైనటువంటి గమనాన్ని మరచి ఏం జరుగుతోందో తెలియక అలల తాకిడి తమ శరీరానికి తాకడం వలన ఏర్పడిన బాధవలన వికృతంగా అరుస్తున్నాయి. మేఘమండలాన్ని చీల్చుకు వెడుతూ బయటకు వస్తూ శరవేగంతో, దివ్యకాంతులతో ప్రకాశిస్తూ వెళుతుండగా పౌర్ణమి చంద్రుడు వెన్నెల వెలుగులు చిందిస్తూ అతివేగంతో ఆకాశాన పయనిస్తున్నట్లుగా వుంది.```
*సన్ధ్యయా సమభిస్పృష్టం యథా తత్సూర్యమండలమ్ |*
*లాఙ్గూలం చ సమావిద్ధమ్ ప్లవమానస్య శోభతే ||61||*```
*అతివేగంతో పయనిస్తున్న స్వామి సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు మహర్షి. ముందునుంచి చూస్తే ముఖం ఎర్రగా, పగడాల గుంపుపోసినట్లు వున్న నాశికం, మధ్యమధ్యలో తన తోకను ఝుళిపిస్తున్నారు. మళ్ళి తోకను తన శిరస్సుపై వుంచుతున్నారు. ఆ సమయంలో ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏర్పడినట్లుగా వుంది. స్వామి యొక్క గమన శక్తికి అలలు ఉవ్వెత్తున పైకి లేచి కిందకు పడుతున్నప్పుడు ఎప్పుడూ ఎవ్వరికీ కనిపించని సముద్రంలో నివసించే జీవరాశులు అన్నీ కనిపిస్తున్నాయి. అల్లకల్లోలంగా వుంది సముద్రం.
*ఆవిధముగా ప్రయాణిస్తున్న హనుమను సముద్రుడు చూసి తనలో వున్న మైనాకుడిని పిలిచి, “ఓ మైనాకుడా అటుచూసావా రామ కార్యము చేపట్టిన హనుమ శరవేగంతో పయనిస్తున్నాడు, అసలు నేను, మిగిలిన సముద్రములు ఏర్పడడానికి కారణభూతులు ఇక్ష్వాకుల వంశానికి చెందిన సగరచక్రవర్తి. అదే ఇక్ష్వాకుల వంశానికి చెందిన శ్రీరామచంద్రమూర్తి భార్య సీతమ్మతల్లిని వెదకడం కోసం హనుమ లంకకు పయనమయ్యారు. నాకు ఇన్నాళ్ళకు ఆ ఇక్ష్వాకుల వంశీకులకు సహాయం చేసే మహద్భాగ్యం కలిగింది, నీవు నాయందె వున్నావు, నీలో అనేకమైన వృక్షములు తేనెపట్లు, సుమధురమైన ఫలములు వున్నాయి, కావున నీవు పైకి లేచి స్వామి హనుమ ముందు సాష్టాంగపడి తమ ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించు, స్వామి నీ పై కాసేపు విశ్రమించి నీ ఆతిథ్యం స్వీకరించి రెట్టించిన వుత్సాహంతో పయనమవుతారు, మహాత్ముడు హనుమ రాకముందే నీవు పైకి లే! అంజలి ఘటించు. స్వామి విశ్రాంతి తీసుకోవడాని సముచితమైన స్థానం కల్పించు”, అని పలుకగా మైనాకుడు సముద్రం నుండి పైకి లేచి స్వామికి ఎదురుగా వస్తున్న తేజోవంతుని చూసారు, శుభోదయ సమయాన సూర్యుని కిరణాలు మైనాకుడిని తాకగా స్వర్ణమయమైన మైనాకుడు బంగారు వెలుగులు జిమ్ముతూ అత్యంత సుందరముగా ప్రకాశిస్తున్నాడు.``` *“సుందరే కిం న సుందరం”* ``` సుందరకాండలో సుందరము కాని దేముంది అణువణువు సుందరమే. అకస్మాత్తుగా సముద్రం నుండి బంగారు పర్వతం పైకి లేవడం చూసి ఇటువంటి విఘ్నం కలిగిందేమిటి, నా ప్రయాణం ఆగకూడదు నా గమనాన్ని నేను వీడకూడదని శరవేగంతో తన గుండెలతో మైనాకుడ్ని బలంగా ఢీకొన్నారు హనుమ. ఆ తాకిడికి ఆ పర్వతం చూర్ణమయిపోయి సముద్రంలో రాలిపోగా నీలిరంగులో వున్నటువంటి సముద్రమంతా బంగారు రంగులోకి మారిపోయింది, బంగారంతో నిండిపోయిన సముద్రం ధగధగమని మెరిసిపోతూ ఎంతో సౌందర్యంగా కనిపిస్తోంది. ఇన్ని సౌందర్యాలతో కూడిన కాండకు ‘సుందరకాండ’కన్నా మరొక పేరు సముచితమా కానే కాదు!.✍️```(సశేషం)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి