*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*755 వ రోజు*
ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము
ధర్మరాజు చేసిన అశ్వమేధయాగము గురించి విన్న జనమేజయుడు వైశంపాయనుడిని " మహర్షీ ! అ విధముగా పితృపితామహుల నుండి సంక్రమించిన రాజ్యసంపదను స్వీకరించిన పాండవులు ధృతరాష్ట్రుని పట్ల ఏవిధముగా ప్రవర్తించారు. కుమారులు, మిత్రులు, అమాత్యులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు, అష్టైశ్వర్యాలు పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు ఆయన భార్య గాంధారి ఏ విధంగా ప్రవర్తించారు వివరించండి " అని అడిగాడు.
ధర్మరాజు ధృతరాష్ట్రుడి పట్ల వహించిన శ్రద్ధ
వైశంపాయనుడు " జనమేజయమహారాజా ! ధర్మరాజు అతడి తమ్ములు ధృతరాష్ట్ర గాంధారులను ఏ లోపము లేకుండా గౌరవప్రదంగా చూసుకుంటున్నారు. పాండవులు రోజూ ధృతరాష్ట్రుడిని కలుసుకుని ఆయన ఆదేశాలను స్వీకరిస్తున్నారు. విదురుడు, యుయుత్సుడు ఆయనను ఏమరక సేవిస్తూ అతడికి కావలసినవి అడిగి అందిస్తున్నారు. ధృతరాష్ట్రుడు గాంధారి కూడా పాండవుల పట్ల ప్రేమాభిమానాలతో ప్రవర్తిస్తున్నారు. కుంతీదేవి కూడా అక్క గాంధారిని ప్రతి రోజూ వచ్చి పలకరిస్తూ ఉంది. ద్రౌపది, సుభద్ర అత్తగారైన గాంధారిని సేవిస్తున్నారు. ఆమెకు విలువైన కానుకలను సమర్పిస్తున్నారు. ఉలూపి, చిత్రాంగదలు కూడా గాంధారిని సేవిస్తున్నారు. ధర్మరాజు అనుమతితో ధృతరాష్ట్రుడు ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నాడు. దేవాలయములు కట్టించాడు, సత్రములు నిర్మించాడు, చెరువులు తవ్వించాడు, బ్రాహ్మణులకు అగ్రహారాలు, మిగిలిన జాతుల వారికి గ్రామములు నిర్మించాడు. చక్రవర్తి ధర్మరాజును చూడవచ్చే సామంతరాజులు ముందుగా ధృతరాష్ట్రుడిని చూసి తరువాత ధర్మరాజును చూసే వారు. ధర్మరాజు కూడా అందుకు ఎంతో సంతోషించేవాడు. పెదనాన్నకు కుమారులు లేని కొరత లేకుండా ధర్మరాజు ఎంతో జాగ్రత్తవహించ సాగాడు. అది కాక ధర్మరాజు తన తమ్ములకు, అమాత్యులకు, సైన్యాధిపతులకు ఇలా ఆదేశాలు ఇచ్చాడు. " పెదనాన్న, పెదతల్లి గారు పుత్రులను పోగొట్టుకుని దుఃఖంతో ఉన్నారు. వారికి ఏ లోటు రాకుండా చూడండి. నాకు ఏవిధమైన గౌరవ మర్యాదలు ఇస్తారో అదే విధమైన గౌరవ మర్యాదలు వారికి ఇవ్వండి " అని ఆదేశించాడు. ధర్మరాజు మాటలను తమ్ములు, అమాత్యులు, సేవకులు పాటించారు.
ధృతరాష్ట్రుడి పట్ల భీముడి ప్రవర్తన
ధర్మరాజు మీద ఉన్న గౌరవంతో భీముడు ధృతరాష్ట్రుని మీద గౌరవము ఉన్నట్లు నటించినా మనసుమాత్రము ధృతరాష్ట్రుని చూడగానే ఉడికిపోయేది. ధృతరాష్ట్రుడిని చూడగానే భీముడికి మాయాజూదము వలన తాము పడిన బాధలు, అరణ్య అజ్ఞాత వాసముల వలన తాము అనుభవించిన బాధలు గుర్తుకు వచ్చేవి. మనసు మండి పోయేది. భీముడు మాత్రము ధృతరాష్ట్రుడిని చూడగానే మండిపడే వాడు. ధర్మరాజు మాత్రము అందుకు భిన్నంగా ఉండేవాడు. సుయోధనుడు అతడి తమ్ములకు శ్రాద్ధకర్మలు ఆచరించే సమయములో ధృతరాష్ట్రుడి చేత అనేక దానధర్మములు చేయించే వాడు. ధృతరాష్ట్రుడికి తనకుమారులు ఉన్నప్పటికంటే ఇప్పుడు రాచమర్యాదలు అధికంగా జరిగేవి. ధర్మరాజు ధృతరాష్ట్రుడి వలన అతడి కుమారుల వలన తాము అనుభవించిన కష్టాలను, వారి తమకు చేసిన అపకారాలను మనసులోకి రానిచ్చేవాడు కాదు. ధర్మరాజు మనసెరిగి మిగిలిన వారు ధృతరాష్ట్రుడి గురించి కాని, అతడి కుమారుల గురించి కాని, వారి దుష్ప్రవర్తన గురించి కాని చెడ్డగా చెప్పేవారు కాదు. ప్రజలు కూడా ధృతరాష్ట్రుడికి ధర్మరాజుకు బేధము చూపక ఇరువురిని సమానంగా గౌరవించే వారు. ధృతరాష్ట్రుడు కూడా క్రమముగా తన కుమారులను మర్చిపోయి ధర్మరాజు మీద ప్రేమాభిమానాలు కురిపించే వాడు. కాని భీముడిని చూసినప్పుడు ధృతరాష్ట్రుడి గుండె మండిపోయేది. కారణము భీముడు తన కుమారులను చంపాడని అతడు మరచి పోలేకపోవడమే. వారిరువురు ఒకరి మీద ఒకరు మండి పోతున్నా పైకి మాత్రము మర్యాదగా మాట్లాడుకునే వాళ్ళు. అయినా భీముడు మాత్రము ఒక్కోసారి ధృతరాష్ట్ర గాంధారులు వింటూ ఉండగా " ఈ గుడ్డివాడి కొడుకులందరిని చంపేశాను. నా పాలబడ్డ వాడు ఎవడైనా చావకుండా బయట పడ్డాడా. ఆ కౌరవులు బుద్ధిలేక మాతో యుద్ధానికి వచ్చారు కాని నా సంగతి తెసినవారు ఎవరైనా మాతో పెట్టుకుంటాడా ! సుయోధన, దుశ్శాసనులను మట్టు పెట్టిన ఈ భుజాలను నేను పూజచేస్తాను. కౌరవులను సమూలంగా నాశనము చేయడానికి అనుకూలించిన ఆదైవానికి శతకోటి వందనాలు " అని అంటూ ఉండేవాడు. భీముడు అలా అంటూ ఉండేవాడని ధర్మరాజుకు, అర్జునుడికి, కుంతీదేవికి, ద్రౌపదికి తెలియదు. నకులసహదేవులు మాత్రము భీముని మాటలకు సంతోషించే వారే కాని ధర్మరాజుకు భయపడి బదులు చెప్పేవారు కాదు. ధృతరాష్ట్ర, గాంధారులు మాత్రము ఏమీ అనలేక మనసులో బాధపడుతూ ఊరుకుండే వారు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి