15, జూన్ 2026, సోమవారం

శ్రీమహావిష్ణుపురాణం

 



         *శ్రీమహావిష్ణుపురాణం*

                ➖➖➖✍️ 

                119 వ భాగం 


*శ్రీకృష్ణావతారము-21.*

*కౌరవ పాండవుల కలహం - *శకుని మాయాజూదం - 

*ద్రౌపదికి అవమానం - 

*పాండవుల అరణ్య అజ్ఞాతవాసాలు -

*కురుక్షేత్రం - 

*ధర్మరాజు పట్టాభిషేకం```

రాజసూయ యాగంలో పాండవుల ఐశ్వర్యవైభోగం చూసి దుర్యోధనుడు బాగా అసూయ చెందాడు. మయసభలో జరిగిన అవమానం మరింత రగిలేటట్టు చేసింది. తన సహచరులైన శకుని, కర్ణుడు, దుశ్శాసనులతో దుర్యోధనుడు “పాండవులను రాజ్య సంపదలు తీసుకుని బికారులను చేయాలి! ద్రౌపది చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి! ఇందుకు ఏమి చేయాలన్న చేస్తాను! చెప్పండి!" అని అడిగాడు. 


కర్ణుడు పాండవుల పై యుద్ధం చేసి గెలిచి రాజ్యం తీసుకుంటామని చెప్పగా శకుని "కృష్ణుడి అండ ఉండగా, పాండవులను జయించటం కష్టమని" అన్నాడు. 


రాజసూయంలో కృష్ణుడు మహా వీరుడైన జరాసంధుని, శిశుపాలుని వధించిన విషయం గుర్తు చేసాడు. తనకు మాయాజూదం వచ్చునని, ఎవరైనైనా జూదంలో ఓడించగలనని చెప్పాడు. కృష్ణుడు పాండవుల దగ్గర లేని సమయంలో ధర్మరాజుని జూదక్రీడకు హస్తినాపురం రమ్మని 

ధృతరాష్ట్రుడి ద్వారా ఆహ్వానం పంపమన్నాడు.


ధర్మరాజుకి జూదం ఆడే అలవాటు ఉంది. రాజుగా పెదనాన్న ధృతరాష్ట్రుడు పంపిన ఆహ్వానం తిర స్కరించలేక హస్తినాపురం వస్తాడు. జూదంలో రాజ్యం, పాండ వులైదుగురితో పాటు ద్రౌపదిని పందెంగా పెట్టించి గెలిచి దుర్యో ధనుడికి కానుకగా ఇస్తాను. మయసభలో చేసిన అవమానానికి ద్రౌపది పై నిండుసభలో ప్రతీకారం తీర్చుకోవచ్చును" అని మాట ఇవ్వడంతో దుర్యోధనుడికి ఆనందం కలిగింది.


శకుని ప్రతిపాదనకు అంగీకరించిన దుర్యోధనుడు తండ్రి ధృతరాష్ట్రుని ఒప్పించి విదురుని ఇంద్రప్రస్థం పంపి జూద క్రీడకు హస్తినాపురం రమ్మని ఆహ్వానించాడు.  


ధర్మరాజు అంగీకరించి పాండవులు, ద్రౌపది, కుంతీదేవితో కలసి హస్తినాపురం వెళ్లాడు. 

భీష్మ ద్రోణాదులు "దాయాదుల మధ్య జూదం మంచిది కాదు" అని ధృత రాష్ట్రునికి హితబోధ చేసినా పట్టించుకోకుండా, పుత్రవ్యామోహంతో దుర్యోధనుడి మాట మేరకు జూదక్రీడ ఏర్పాటు చేసాడు.


పాండవుల తరపున ధర్మరాజు, కౌరవుల తరపున శకుని జూద క్రీడలో పాల్గొన్నారు. మొదట చిన్న చిన్న పందాలు ధర్మరాజు గెలిచేలా చేసి శకుని ధర్మరాజు అతిశయాన్ని పెంచాడు. తరువాత కౌరవుల రాజ్య సంపదలు పందెంగా పెట్టి శకుని ధర్మరాజుని పాండవుల రాజ్య సంపదలు పందెంగా పెట్టించాడు. మాయా పాచికలతో శకుని పందెం గెలిచి పాండవుల రాజ్యం, సంపదలు గెలిచాడు. తరువాత ధర్మరాజుని ప్రేరేపిస్తూ పాండవులైదుగురిని ఒక్కొక్కరుగా పందెం పెట్టించి గెలిచాడు. చివరికి ద్రౌపదిని కూడా ధర్మరాజు చేత పందెంగా పెట్టించి గెలిచాడు.


దుర్యోధనుడు "నాడు మయ సభలో తనను చూసి నవ్విన ద్రౌపదిని నిండుసభకు పిలిపించి అవమానించి ప్రతీకారం తీర్చు కుంటానని" ప్రకటించాడు. దుశ్శాసనుని ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభకు ఈడ్చుకు రమ్మని ఆదేశించి పంపాడు. భీష్మ ద్రోణాదులు, విదురుడు మొదలైన పెద్దలు ఏమి చేయలేక తలలు వంచుకుని మౌనంగా కూర్చున్నారు. ఓడిన పాండవులు తలలు దించుకుని కూర్చున్నారు.


నిండుసభలో దుర్యోధనుడి ఆదేశం ప్రకారం దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రములు బలవంతంగా లాగివేసి వివస్త్రను చేసే ప్రయత్నం చేశాడు. ద్రౌపది కృష్ణుని ప్రార్ధించడంతో ద్రౌపదికి అనంతమైన వస్త్రములను ప్రసాదించాడు. దుశ్శాసనుడు వస్త్రములన్ని లాగలేక, విప్పలేక అలసి సృహతప్పి పడ్డాడు. కృష్ణుడి లీలకు భయపడిన ధృతరాష్ట్రుడు ద్రౌపదికి పాండవులను బానిసత్వం నుండి విముక్తులను చేసి రాజ్యసంపదలతో కలిపి తిరిగి ఇచ్చేశాడు.


కోపంగా ఉన్న భీముడు యుద్దంలో ద్రౌపదిని అవమానించిన దుశ్శా సనుని రొమ్ము చీల్చి వచ్చిన రక్తంతో ద్రౌపది కురులను సవరిస్తానని, ఊరువులపై వచ్చికూర్చోమని సంజ్ఞ చేసిన దుర్యోధనుడి తొడలు విరుస్తానని సభలో అందరిముందు ప్రతిజ్ఞ చేసాడు. భీముడి ప్రతిజ్ఞకు ధృతరాష్ట్రుడు భయపడ్డాడు.  

అది చూసిన శకుని పాండవులకు రాజ్యసంపదలు లేకుండా చేస్తే వారు బలహీనులై దుర్యోధన దుశ్శాసనులను ఏమీ చేయలేరని చెప్పి ధర్మ రాజుని తిరిగి జూదానికి ధృతరాష్ట్రుడు ఆహ్వానించేలా చేశాడు.


"ఈ సారి పందెంగా జూదంలో ఓడి పోయిన వారు పన్నెండు ఏళ్లు అరణ్యవాసం, ఒక ఏడు అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాత వాసంతో దొరికిపోతే తిరిగి అరణ్యవాసానికి వెళ్ళాలి. పాండవులు ఈవిధంగా ఎప్పటికి రాజ్యం లభించక అరణ్యంలోనే ఉంటారు. యుగ నియమం ప్రకారం పదమూడు ఏళ్ళు దూరంగా ఉన్నవారు వారసత్వ హక్కు, ఆస్తి హక్కు కోల్పోతారు. కనుక మీ కుమారులు దుర్యోధనుడికి, దుశ్శాసనునికి భీముడి వలన ప్రాణహాని ఉండదు" అని శకుని చెప్పడంతో ధృతరాష్ట్రుడు జూదానికి, జూద నియమానికి అంగీకరించాడు.


శకుని మాయాజూదంతో ధర్మరాజు సర్వస్వం ఓడి తమ్ముళ్ళు, ద్రౌపదితో అరణ్యవాసానికి బయలుదేరి వెళ్లాడు. కుంతీదేవి విదురుని ఇంటిలో ఉండసాగింది. 


కృష్ణుడు సత్యభామతో వచ్చి అరణ్యవాసంలో ఉన్న పాండవులను కలిసి ధైర్యం చెప్పాడు. ధర్మానికి, నీతికి, న్యాయానికి కట్టుబడిన వారికే అంతిమ విజయం లభిస్తుంది అని ప్రకటించాడు. 


రాబోయే కౌరవ పాండవుల యుద్ధంలో గెలవడానికి అర్జునుడు దివ్య ఆయుధాలు కలిగి ఉండాలి. కావున శివుని అనుగ్రహం పొంది పాశుపతాస్త్రం సంపాదించమని తపస్సుకి అర్జునుని కృష్ణుడు పంపాడు. 


శివుడు తన కోసం తపస్సు చేస్తున్న అర్జునుని కిరాతుడి రూపంలో వచ్చి పరీక్షించి కోరిన పాశుపతాస్త్రం ఇచ్చాడు. ఇంద్రాది దేవతలు కూడ ప్రత్యక్షమై అర్జునుడికి తమ పేరులతో ఐంద్రాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వరుణాస్త్రం, వాయువ్యాస్త్రం మొదలైనవి ఇచ్చారు.


ఇంద్రుడు తన అంశగా జన్మించిన అర్జునుని కొన్ని రోజులు తనతో గడపమని స్వర్గలోకం తీసుకు వెళ్లాడు. అక్కడ ఊర్వశిని అర్జునునికి నాట్యం నేర్పించమని ఆదేశించాడు. ఊర్వశి నాట్యం నేర్పతూ అర్జునుడిపై మోహం చెంది తనతో గడపమనగా అర్జునుడు తిరస్కరించాడు. ఆగ్రహించిన ఊర్వశి అర్జునుని నపుంసకుడివి కమ్మని శాపం ఇచ్చింది. 

ఇంద్రుడు వచ్చి ఊర్వశి శాపం ఒక సంవత్సరం ఉంటుందని, అజ్ఞాతవా సంలో శత్రువులు గుర్తు పట్టకుండా ఆ శాపాన్ని ఉపయోగించుకొమ్మని శాపవిమోచనం చెప్పాడు.


పాండవులు అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసం చేయడానికి విరాట దేశం వెళ్లారు. అక్కడ మారువేషాలలో విరాటరాజు కొలువులో చేరారు. విరాటుడు బావమరిది అయిన కీచకుడు (సింహబలుడు) మహారాణి వద్ద సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని మోహించి తన దగ్గరకు పంపమన్నాడు. భీముడు ఆడవేషంలో వెళ్లి కీచకుని సంహరించాడు.


అరణ్య అజ్ఞాతవాసాలు దిగ్విజయంగా పూర్తి చేసిన పాండవులు తమ రాజ్య భాగం ఇవ్వమని కృష్ణుని రాయబారిగా దుర్యోధనుడి వద్దకు పంపారు. కృష్ణుడు ధృతరాష్ట్ర భీష్మ ద్రోణ దుర్యోధనాదులకు పాండవుల రాజ్యం ఇచ్చివేస్తే కౌరవ పాండవులు ప్రశాంతంగా జీవించవచ్చును అని చెప్పాడు. యుద్దంవలన అపార జన నష్టం జరుగుతుంది. ఎవరికి ప్రయోజనం ఉండదు. కనీసం ఐదుగురు పాండవులకు ఐదు ఊళ్ళైనా ఇమ్మని అడిగాడు.


దుర్యోధనుడు సంధి ప్రతిపాదన తిరస్కరించి యుద్దానికి సిద్దం అని ప్రకటించాడు. రాయబారిగా వచ్చిన కృష్ణుడినే బంధించటానికి ప్రయత్నించాడు. కృష్ణుడు విశ్వ రూపం ప్రదర్శించి దుర్యోధనాదులను సృహ తప్పించి "యుద్దంలో కౌరవుల సర్వనాశనం తప్పదు" అని ధృతరాష్ట్రుని హెచ్చరించి వచ్చేసాడు.


పాండవులు ఏడు అక్షోహిణిల సైన్యంతో, కౌరవులు పదకొండు అక్షౌహిణల సైన్యంతో కురుక్షేత్రంలో యుద్దానికి సిద్దమైయ్యారు. భీష్ముడు కౌరవ సేనాధిపతిగా ధృష్టద్యుమ్నుడు పాండవుల సేనాధిపతిగా సేనలను నడిపించారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారధిగా ఉండి యుద్దతంత్రం నడిపించాడు. పద్దెనిమిది రోజులు జరిగిన యుద్దంలో భీష్మ ద్రోణ కర్ణ అభిమన్యదుశ్శాసనాది వీరులందరు మరణించారు.


పాండవులు ఐదుగురు, కృష్ణుడు పాండవుల పక్షాన, దుర్యోధనుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ నలుగురు కౌరవుల పక్షాన మిగిలారు.


ప్రాణభీతితో సరస్సులో దాగిన దుర్యోధనుని కృష్ణుడు ధర్మరాజు చేత రెచ్చగొట్టించి బయటకు రప్పించాడు. భీముడికి దుర్యోధనుడికి ద్వంద్వ గదా యుద్దం ఏర్పాటు చేశాడు. భీమునికి ద్రౌపది అవమానం చేసిన సమయంలో చేసిన ప్రతిజ్ఞ గుర్తుచేసి గదతో దుర్యోధనుడి తొడలు విరగ గొట్టించాడు. దుర్యోధనుడు మరణించాడు. హస్తినాపురం పాండవులతో వెళ్లి ధర్మరాజుని పట్టాభిషిక్తుని చేశాడు. పాండవులతో కొంతకాలం గడిపి కృష్ణుడు ద్వారక చేరుకున్నాడు.✍️```

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం..

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..

-సేకరణ:పెండ్యాల ఉపేంద్ర రావు

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

కామెంట్‌లు లేవు: