*రేపటికి పునాదులు*
*-డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు,*
ఎండలు మండిన కాలానంతరం
బడుల్లో నవ క్రాంతి
భవిత కేంద్రాలకు కొత్త కాంతి
కొన్ని ఆశలు
హరివిల్లులై సాక్షాత్కరిస్తాయి
కొన్ని ఆశయాలు
గాలిపటాలై
అక్కడి వినువీధుల్లో
కనువిందు చేస్తాయి
కొన్ని కలలు
అక్కడ రంగురంగుల
రంగవల్లికలై
భూమాత హృదయానికి
రంగుల కలలద్దుతాయి
కొన్ని మెలకువలు
కిలకిలరావాలై
అక్కడ గాలి చేసే నృత్యానికి
నేపథ్య రాగాలవుతాయి
కొన్ని నెమళ్లు
అక్కడ పురివిప్పి
నృత్యాలు చేస్తాయి
కొన్ని సీతాకోకచిలుకలు
అక్కడ మనసులకు రెక్కలిస్తూ
పరిసరాలకు
ఆహ్లాదపు లేపనమద్దుతాయి
కొన్ని కంఠాలు
దోస్తులను దూరం చేసిన
సెలవులను
నవ్వుల పువ్వులు
వెదజల్లుతూ వెక్కిరిస్తాయి
ఇప్పుడు అక్కడ
పాత వెలుగులు
కొత్త మెరుగులు దిద్దుకుంటాయి
రేపటికి పునాదులు వేసుకుంటాయి
*(తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి