15, జూన్ 2026, సోమవారం

పరిపూర్ణ వికాస దిశగా

 *సందర్భం: జూన్ 15వ తేదీ పాఠశాలల పునఃప్రారంభం*


*పరిపూర్ణ వికాస దిశగా …*

*-డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు* 


ఇక్కడి గోడలు

తిమిర నిర్మూలనకు

కంకణం కట్టుకున్న

విజ్ఞాన కేంద్రాలు


నోట్లోని శ్వేత కుడ్యాల చాటు నుండి

బుజ్జి నాలుకలు

లోపలికీ బయటికీ

కిందికీ పైకీ

లేలేత పెదాలు పైకీ కిందికీ

కదులుతూ

ఇక్కడి పరిసరాల్లో

అనునిత్యం జరిగే శబ్దప్రసారం  

అడుగడుగునా చేతనకు కారణమవుతుంది.


నోటి నుండి వెలువడే శబ్దానికి

రూపం కల్పిస్తూ

పలకపై రాసిన అక్షరాన్ని

మెదడు ఛాయాచిత్రంగా భద్రపర్చుకుంటుంది

ఆ ఛాయాచిత్రమే డీకోడ్ అయి

తిరిగి పెదవుల గుండా

పరావర్తనమవుతుంది


నల్లబల్లపై చిత్రితమయ్యే

అక్షరమాలలు

అరవై అవతారాలెత్తి  

ఒకేసారి అరవై గమ్యాలకు

ప్రయాణం చేస్తాయి  


ఇంటర్వెల్ బెల్లు కొట్టగానే

పరుగులు తీసే చిట్టి కాళ్లు

పాదముద్రలతో

బడినేలపై హాజరు వేసుకుంటాయ్


ఇక్కడే

చిట్టి నెమళ్లు

పరిసరాల్ని మరచి

పురివిప్పుకుని ఆడతాయ్  

చదువులూ

ఆటలూ

పాటలూ

పోటాపోటీగా కొనసాగుతాయ్  

సమగ్ర మూర్తిమత్వమూ

పరిపూర్ణ వికాసమూ

గమ్యాలుగా

అడుగులు కదులుతాయ్

కామెంట్‌లు లేవు: