15, జూన్ 2026, సోమవారం

సుందరకాండ-హనుమ*



         *సుందరకాండ-హనుమ*

                  ➖➖➖✍️

                   23 వ భాగం 


*నమోస్తు రామాయ సలక్ష్మణాయ*

*దేవ్యైచ తస్యై జనకాత్మజాయై*

*నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో*

*నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః*


*సీతమ్మ తల్లి శోకం*```

*సీతమ్మ తల్లి అశోకవనములో నిస్సహాయురాలై కృంగి కృశించి పోయి భయంతో వణుకుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కూర్చుంది. ఏకజట, హరిజట, ప్రఘన, వికట, దుర్ముఖి, వికృత, పింగళ, కలహప్రియ మొదలగు రాక్షస స్త్రీలందరూ సీతమ్మను నానా విధములుగా ప్రలోభపెడుతున్నారు. అందరకీ ఒకే మాటతో సమాధానం చెప్పింది సీతమ్మ తల్లి. అక్కడ వున్న హరిజట, నేను సీతను చూసిన మరుక్షణం నుండి నాకు యీమెను భక్షించాలని కోరిక కలుగుతోంది, కత్తులు తీసుకురండి, యీమెని ఇప్పుడే నరికి ముక్కలు చేసి భక్షిద్దాం, ఉపవాసం చేయడం వలన మరణించిందని మన ప్రభువుతో చెప్పండి. యిప్పుడే చెబుతున్నా, శిరస్సు గుండె నాది, చేతులు నీవి, కాళ్ళు నీవు యని సీతమ్మను వధించి భాగాలు యెలా పంచుకోవాలో భాగాలు వేసింది. భయంకరమైన రూపాలతో వున్న వారందరినీ చూసి భయంతో కంపిస్తూ అశోక వృక్షం యొక్క కొమ్మలను పట్టుకుని విలపిస్తూ వుంది.


*శ్రీరామచంద్రా, లక్ష్మణా, కౌసల్యాదేవీ, సుమిత్రా దేవి, నాకెందుకీ దైన్యమైన స్థితి పట్టింది, రామునికి దూరమైన ఈ బ్రతుకు విషస్పర్శం తగిలిన దేహంలా వుంది. రాముడు వస్తాడనే ఆశ నశిస్తోంది. యిక నేను ఆత్మాహుతి చేసుకోవడం మేలు, యింత దుఃఖంలో కూడా నేను మరణించలేదంటే బహుశా నా గుండెను బ్రహ్మదేవుడు రాతితో చేసి వుంటాడు. ఏది యేమైనా నా యెడమ కాలు గోటితో కూడా రావణుని తాకను. శరణాగతవత్సలుడైన నా నాధుడు యింకా యెందుకు రాలేదో అర్థం కావడం లేదు. రావణుడు నను అపహరించుకు వచ్చిన క్షణం నుండి ఆయన నామమే జపిస్తున్నా, రావణుని సంహరించగల సామర్థ్యం కల నా రాముడు యెందుకింత ఆలస్యం చేస్తున్నాడు. బహుశా నేనిక్కడ వున్న విషయం నా రామునికి తెలియదేమో, తెలిసివుంటే యీపాటికి రావణ సంహారం చేసి నను రక్షించేవాడు, రామునికి రావణుడు అపహరించాడనే వార్త తెలియజేయడానికి లేకుండా రావణుడు జటాయువును సంహరించాడే, యీనాడు నేను శోకిస్తున్నట్లు వీరంతా విలపిస్తారు. శ్రీరాముని కంటబడిన ఉత్తరక్షణం లంకా నగరం దహనం కావడం తథ్యం. యీ లంకలో యింటింటా త్వరలో ఆర్తనాదాలు తప్పవు. రామబాణం నుండి జ్వలించే అగ్నికి ఈ రావణ కుంభకర్ణ మొదలగు వీరులందరు నశిస్తారు. యింతవరకు శ్రీరామునికి నేను బ్రతికి వున్నానో లేదో తెలియదు. నేను లేని జీవితం వ్యర్ధమని తలచి అస్త్ర సన్యాసం చేసి వానప్రస్థం స్వీకరించాడా, లేక యీ రావణుడు మాయచేసి నను తీసుకువచ్చిన విధముగా వారిని మాయచేసి సంహరించాడా, యిటువంటి దుర్దశ నాకెందుకు కలిగింది. రాముడు లేని జీవితం నాకెందుకు. యింత బాధలో నాకు మరణం యెందుకు సంభవించడం లేదు. మనోనిగ్రహ సంపన్నులు, రాగద్వేషాతీతులు, పాపరహితులు అయినటువంటి మహర్షులు యెంతటి ధన్యజీవులు, దుర్మార్గుడైన ఈ రావణుని చేతిలో మరణం కన్నా ఆత్మాహుతి మేలు" అని విలపించసాగింది. యీ మాటలు విన్న కొంతమంది రాక్షసి స్త్రీలు రావణునికి యీ మాటలు చేరవేయడానికి వెళ్ళారు. యివన్నీ చూసిన స్వామి హనుమ మనసు చలించి పోయింది. దుఃఖం పొర్లిపోయింది. అయ్యో శ్రీరాముని పట్టమహిషి జానకీ మాతకు యెంతటి కష్టం కలిగింది. పది నెలలు పాటు యీ భయంకర రాక్షసి మూక మధ్య యెన్ని బాధలు భరిస్తూ ఉపవాసం చేస్తూ జీవిస్తోందని చింతించారు స్వామి.✍️(సశేషం)```

*జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్*

*జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్*

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

కామెంట్‌లు లేవు: