*సుందరకాండ-హనుమ*
*9వ భాగం*
*నమోస్తు రామాయ సలక్ష్మణాయ*
*దేవ్యైచ తస్యై జనకాత్మజాయై*
*నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో*
*నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః*
************************
*ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నతస్థితికి ఎదగాలన్నా, సభాపూజ్యత పొందాలన్నా, నలుగురికి మార్గదర్శకునికిగా నిలవాలన్నా, తన జీవిత గమ్యం చేరుకోవాలన్నా, ధృతి, దృష్టి, మతి మరియు దాక్ష్యం అనబడే ఈ నాలుగు లక్షణాలు ఖచ్చితంగా వుండి తీరాలి.
ఈ లక్షణములు లేని వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తన గమ్యాన్ని చేరుకోలేరు.
*వాల్మీకి అందించిన రామాయణ శ్లోకాలలో, రచించిన శైలిలో అంతకన్నా గొప్పగా శీలం వైభవాన్ని ఆవిష్కరించగలిగిన మహర్షులు మరొకరు లేరు అన్నది వాస్తవం.
మాట చెప్పడమే కాకుండా కధాభాగంలో ఆ శ్లోకాలను అన్వయం చేసి చూపించగలిగే నేర్పరితనం వాల్మీకి మహర్షికే చెల్లును. రామాయణం కల్పిత గాధ కాదు యదార్థ గాధను చెబుతూ ఈ లక్షణాలు మానవులకు ఎంతో అవసరమని తీర్పు చెబుతారు మహర్షి. ఒక జరిగిన కధ రచన చేస్తున్నప్పుడు ఆ సన్నివేశాలో ఆయా వ్యక్తుల మనసులో వున్నటువంటి ఆలోచనలను చెదరనీయకుండా ఆవిష్కరించారు మహర్షి. శ్రీరామచంద్రుని ఏకపత్నీ వ్రతం, సీతమ్మతల్లి పాతివ్రత్యం, హనుమ యొక్క స్వామిభక్తి మొదలగు అంశాలను అత్యంత వైభవంగా అందించారు మహర్షి.
*సాగర లంఘనం సామాన్యమైన విషయం కాదు, దానవులతో సర్పములతో నిండివుంటుంది. భయంకరంగా ఘోషిస్తున్న తరంగాలతో వుంటుంది. అటువంటి క్లిష్టమైన కష్టమైన అవరోధాలను వివేకవంతుడై, ప్రజ్ఞావంతుడై దాటుకొని వచ్చారు స్వామి హనుమ. లంబపర్వతంపై దిగిన హనుమ లంకా వైభవాన్ని పరికిస్తున్నారు. త్రికూట పర్వతం మధ్య ఆకాశంలో వేలాడుతున్నట్టుగా వుంది లంకా నగరం, అంత సౌందర్యంగా నిర్మించారు విశ్వకర్మ. బంగారంతో మెరిసిపోతోంది లంక. ఇక్కడ వాల్మీకి మహర్షి హనుమకు లంకను చూడగానే ఎటువంటి భావనలు కలిగాయో ఆ భావాలను చతుర్ముఖ బ్రహ్మగారి ద్వారా పొందిన వరప్రసాదంతో, హనుమ దృష్టికి కనిపించిన లంకను ఆవిష్కరించారు.
*కాంచన లంక హనుమకు దేవేంద్రుని అమరావతి నగరంలా కనిపించింది, సర్వం స్వర్ణమయమై దేదీప్యమానంగా వెలుగుతోంది లంకానగరం. అమరావతి నగరాన్ని పోలిన లంకానగరం యొక్క సౌందర్యాన్ని చూసి ఆకర్షితుడై నిశ్చేష్టులై నిలిచిపోలేదు హనుమ, తను వచ్చిన కార్యాన్ని మరిచిపోలేదు. ఎంతటి సౌందర్యాన్ని చూసినా ఎటువంటి ఆటంకాలు ఎదురైనా తన గమ్యాన్ని మరువలేదు హనుమ.
*ఇక సీతమ్మ తల్లి, రావణుడు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఐశ్వర్యాన్ని చూపి ఆశ కల్పించి ప్రయత్నించినా తలొగ్గని మహాపతివ్రతా సౌందర్యం సీతమ్మ తల్లిది. ఇన్ని సౌందర్యాలు కలబోసిన కాండ సుందరకాండ.
*లంకా నగరం త్రికూటమనే పర్వతంపై వుంది. లంక అంటే మన శరీరం, ఆ లంకలోనే వుంది బ్రహ్మవిద్యాస్వరూపిణి, ఆదిపరాశక్తి, లోకపావని, ఆవిడకు మరొక పేరు త్రిపురసుందరి, ఈశ్వరుడు త్రిపురాంతకుడు, వీరిరువు ఆదిదంపతులు. ఇక త్రికూటమనగా జాగ్రత్, స్వప్నము, సుషుప్తి అవస్థలు. మనిషి యొక్క మనసు నిరంతరము ఈ మూడు అవస్థలయందు సంచరిస్తూ వుంటుంది, లంకను నిత్యం కెరటములు వచ్చి తాకుతూ వుంటాయి ఆకలి, దప్పిక, శోకము మోహము, మరణము ఇవి కెరటముల రూపములలో మనసుని నిత్యం తాకుతూ వుంటాయి. ఈ అవస్థలను దాటి, లంకయనబడే ఈ శరీరములో అంతర్ముఖ ప్రయాణం చేస్తూ ఆదిపరాశక్తిని చేరుకోవాలి. ఇదే మానవ జీవిత పరమార్థమని గ్రహించాలి. మానవుడు సంసారమనే సాగరంలో సవ్యంగా ప్రవర్తించి, లంక అనబడే శరీరంలో ప్రయాణిస్తూ అరిషడ్వర్గాలను దాటి, త్రికూటమనే మూడు అవస్థలను దాటి తనలోనే అంతర్లీనమై క్రీడిస్తున్న త్రిపురసుందరీ మాతను చేరుకోవడం, అనగా మోక్షాన్ని పొందగలగడం. తన జీవిత గమ్యంలో తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ వైరాగ్యమును పొంది భగవంతుని సన్నిధి పొందడం కోసం నిత్య సాధన చేసే సాధకులకు, ఉపాసకులకు మాత్రమే ఇది సాధ్యమని గ్రహించాలి.```
*(సశేషం)*``
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏