16, జులై 2025, బుధవారం

తిరుమల సర్వస్వం -302*

 *తిరుమల సర్వస్వం -302*

చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-17


ఎవరు సమర్థులు ?

------------------------------

అయితే, అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఆలయ వ్యవహారాలపై ఆధిపత్యం బ్రిటీష్ వారినుండి ఎవరికి సంక్రమించాలి ? ఇంతటి గురుతరమైన బాధ్యతను అత్యంత సమర్ధవంతంగా ఎవరు నిర్వహించగలరు ? తిరుమలక్షేత్రం లోనే కాకుండా - తిరుపతి పట్టణంలోనూ, దాదాపు చిత్తూరు జిల్లా మరియు పరిసర ప్రాంతమంతటా అప్పట్లోనే శ్రీవారికి లెక్కలేనన్ని మడులు - మాన్యాలు ఉన్నాయి. వాటన్నింటిని సంరక్షించడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది ? ఇటువంటి క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం అంత సులభంగా దొరకలేదు. దానికోసం పెద్ద కసరత్తే జరిగింది..


అప్పట్లో - స్వామివారినే తమ సర్వస్వంగా భావించి, తమ జీవితాలను శ్రీవారిసేవకు అంకితం చేసిన వైష్ణవులలో అంకితభావానికి, సేవానిరతికి ఏమాత్రం కొరత లేదు. వారి నీతి - నిజాయితీలను, చిత్తశుద్ధిని ఏమాత్రం శంకించ నవసరం లేదు. అయితే, తంగళై - వడగళై అంటూ ఇరువర్గాలుగా చీలిపోయిన వైష్ణవులలో ఐకమత్యం లోపించి, పరస్పరం కలహించుకునే వారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం శాయశక్తులా ప్రయత్నించే వారు. కాబట్టి - వారికి అధికారం అప్పగిస్తే, పరస్పర స్పర్ధల కారణంగా వారు ఆలయ పరిపాలనా భారాన్ని సజావుగా నిర్వహించ గలగటం సందేహాస్పదమే !!


అలాగే, ఆలయంలో మరో బలమైన వర్గం - అనూచానంగా స్వామివారిని సేవించుకుంటున్నట్టి వంశపారంపర్య అర్చకులు. ఎల్లవేళలా పూజా పునస్కారాలలో మునిగి ఉండే అర్చకులలో పాలనా పాటవం అంతగా లేదు. పైగా, వారికి పాలనపగ్గాలు అప్పజెబితే వైదిక కార్యకలాపాలకు అంతరాయమేర్పడి, భక్తులలో ఆలయం పట్ల నిర్లిప్తత కలిగితే - కానుకల ద్వారా వచ్చే ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.  


జియ్యంగార్లు కూడా వైదికవిధుల నిర్వహణ - కైంకర్యాలకే పరిమితమయ్యేవారు కానీ, ఆర్థిక వ్యవహారాలలో ఏమాత్రం ఆసక్తి కనపరిచేవారు కాదు. పైగా - వారిపాత్ర, పాలకవర్గానికి - అర్చకగణాలకు మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరించేందుకే పరిమితం. వారికి ఇతరత్రా విధులు అప్పగిస్తే, జియ్యంగార్ల వ్యవస్థ యొక్క ముఖ్యోద్దేశం నెరవేరదు. 


ఇలా - ఆలయానికి సంబంధమున్న వారందరి సామర్థ్యాన్ని; వారి వల్ల దేవాలయానికి, కంపెనీ వారికి కలిగే లాభనష్టాలను బేరీజు వేసిన తర్వాత బ్రిటిష్ వారి దృష్టి మహంతులపై పడింది. కొన్ని సానుకూలమైన అంశాలు వారికి సహకరించాయి -


◆ వీరు సుదూర ప్రాంతానికి చెందిన ఉత్తరభారతీయులు. స్థానికంగా బలము - బలగము లేనివారు. అలాంటివారికి అధికారం అప్పగిస్తే కంపెనీవారు ఆలయం పై పరోక్షంగా తమ పెత్తనాన్ని కొనసాగించవచ్చు. 


◆ పైగా, మహంతుల పట్ల అధికారులకు, అర్చకులకు, జియ్యంగార్లకు, భక్తులకు - ఇలా ఆలయంతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సంబంధం ఉన్న వారందరికీ - విశేషమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. కాబట్టి వారికి అధికారాన్ని అప్పగిస్తే, ఆలయం లోని ఇతరవర్గాల వారికి కూడా అంతగా అభ్యంతరం ఉండదు.


◆ అంతే గాకుండా - మహంతు లందరూ సన్యాసాశ్రమం స్వీకరించిన వారే కాబట్టి, అధికారం వారి వారసులకు సంక్రమించే అవకాశం లేదు.  


◆ మహంతులకు అప్పటికే - విస్త్రృతంగా ధార్మిక కార్యకలాపాలు చేపట్టగలిగినటువంటి పటిష్ఠమైన వ్యవస్థ, అన్ని హంగులతో కూడుకున్న సువిశాలమైన మఠం, ఆ మఠాన్ని ఎన్నో ఏళ్ళుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్న అనుభవం - సమర్థత ఉన్నాయి. 


ఈ విషయాలన్నింటినీ అంతర్గతంగా చర్చించుకొన్న ఆంగ్లేయులు - కొంత వారి స్వార్థాన్ని, మరికొంత ఆలయ బాగోగులను దృష్టిలో ఉంచుకొని; ఆలయ నిర్వహణ బాధ్యతను మహంతులకే అప్పజెప్పాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. తదనంతరం చకచకా ఉత్తర్వులు జారీ అయ్యాయి.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

 *సౌప్తిక పర్వము ప్రథమాశ్వాసము*


*439 వ రోజు*


*అశ్వత్థామ ధృష్టద్యుమ్నుడిని వధించుట*


రధిక త్రయం పాండవ శిబిరాల వైపు బయలుదేరారు. అశ్వత్థామలో ఆవహించి ఉన్న ఈశ్వరుడిని ప్రమధగణాలు అదృశ్యరూపంలో వెంబడించ సాగాయి. కృపాచార్యుడు, కృతవర్మలను ముఖద్వారమున ఉంచి తాను మాత్రం పాండవశిబిరాలలో ప్రవేశించాడు. ముందుగా దుష్టద్యుమ్నుడి శిబిరంలో ప్రవేశించి మనసులో ఈశ్వరుడిని తలచుకొని, ఈశ్వర దత్తమైన కత్తి చేతబూని కసిగా ధృష్టద్యుమ్నుడిని చూసి ఇన్ని రోజులకు తన తండ్రిని చంపిన వాడిని చంపుతున్నానని సంతోషపడి ధృష్టద్యుమ్నుడిని తన్ని నిద్రలేపాడు. నేల మీదికిలాగి అతడి గుండెల మీద మోకాలు పెట్టి అదిమి అతడిని పిడికిళ్ళతో గుద్దాడు. అశ్వత్థామ చేస్తున్న అనుకోని ఈ హటాత్పరిణామానికి ధృష్టద్యుమ్నుడు నోట మాటలేక పడిపోయాడు. అశ్వత్థామ వింటి నారిని విప్పి ధృష్టద్యుమ్నుడి కంటానికి బిగించి పశువును చంపినట్లు చంపుతున్నాడు. చివరకు నోట పెగల్చుకుని " అశ్వత్థామా ! నన్ను నీ అస్త్రములు శస్త్రములు ప్రయోగించి చంపి నాకు ఉత్తమగతులు కల్పించు ఇలా నీచంగా చంపకు " అని ప్రార్ధించాడు. అశ్వత్థామ " వీలు లేదు నా తండ్రిని చంపిన వ్యక్తికి ఉత్తమగతులు కలుగకూడదు. నిన్ను ఇలాగే దారుణంగా చంపుతాను " అని పిడికిలితో గుద్దసాగాడు. అప్పటికే అక్కడ ఉన్న వారు మేల్కొన్నా ! అశ్వత్థామ భీకరాకృతి చూసి రాక్షసుడని ఎవరూ ముందుకు రాలేదు. అశ్వత్థామ తన కాళ్ళతో పిడికిలితో తన్నితన్ని మోదిమోది ధృష్టద్యుమ్నుడిని అతి కౄరంగా చంపి వింటినారిని తీసి వింటికి కట్టాడు. ధృష్టద్యుమ్నుడి శిబిరం విడిచి వేరొక శిబిరానికి వెళ్ళాడు.


*అశ్వత్థామ పాంచాల వీరులను సంహరించుట*


అప్పటి వరకు కళ్ళప్పగించి చూస్తున్నకాపలాదారులు పెద్దగా ఎలుగెత్తి కేకలు వేసారు. అది విని చుట్టుపక్కల శిబిరాలలో ఉన్న సైనికులు, రాజులు నిద్రలేచారు. ఏమి జరిగిందో అని అందరూ ఆందోళనకు గురి అయ్యారు. ఎవరో భయంకరాకారుడు వచ్చి ధృష్టద్యుమ్నుడిని చంపాడని కాపలాదారులు చెప్పారు. " వాడిని పోనీయకండి పట్టుకోండి పొడవండి " అన్న కేకలు మిన్నంటాయి. అందరూ అటువైపు పరుగెత్తారు. అందరూ కలసి అశ్వత్థామను పట్టుకున్నారు. అయినా అశ్వత్థామలో ప్రవేశించిన రుద్రుడి శక్తితో అశ్వత్థామ వారిని ఒక్క క్షణంలో చంపాడు. తరువాత ఉత్తమౌజుడి శిబిరంలో ప్రవేశించి అతడి జుట్టుపట్టుకుని ఈడ్చి నేల మీద పడవేసి కత్తితో అతడి తల నరికాడు. అది చూసిన యుధామన్యుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అదే కత్తితో అశ్వత్థామ యుధామన్యుడి తల తెగనరికాడు. అశ్వత్థామను అడ్డుకునే వారు లేక పోయారు. పాంచాల వీరులను వరుసబెట్టి నరుకుతున్నాడు అశ్వత్థామ. శరీరమంతా రక్తంతో తడిచి అత్యంత భీకరంగా కనిపిస్తున్న అశ్వత్థామను చూడగానే అనేకులు ప్రాణాలు విడిచారు. ద్రుపదకుమారుల శిబిరాలలో ప్రవేశించి వారి ప్రాణాలను యమపురికి పంపాడు అశ్వత్థామ. అశ్వశాలలో, గజశాలలో ప్రవేశించి ఏనుగులనూ గుర్రములనూ తెగనరికాడు. మనిషాపశువా అనే తేడా లేకుండా అడ్డువచ్చిన వారిని అడ్డంగా నరుకుతూ మృత్యుదేవతను తలపింప చేస్తున్నాడు అశ్వత్థామ ఒక్కొక్క శిబిరంలో ప్రవేశించడం అందులో నిద్రిస్తున్న వారిని నరకడం మరియొక శిబిరంలో ప్రవేశించడం ఆ విధంగా మారణకాండ సాగిస్తున్నాడు. అశ్వత్థామను చూసి అంతా " ఎవరో రాక్షసుడు వచ్చి నరుకుతున్నాడు " అని భీతి చెందుతున్నాడు.


*అశ్వత్థామ ఉపపాడవులను సంహరించుట*


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: తొమ్మిదవఅధ్యాయం

అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:


తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ 

అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున (19)


అర్జునా.. నేనే వేడి కలుగజేస్తున్నాను. వర్షాన్ని నిలుపుతున్నాను; కురిపిస్తున్నాను. అమృతమూ, మృత్యువూ నేనే. శాశ్వతమైన సత్తూ, అశాశ్వతమైన అసత్తూ నేనే.

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   శ్లో𝕝𝕝 *సుజీర్ణమన్నం సువిచక్షణః సుతః*

            *సుశాసితా స్త్రీ నృపతిః సుసేవితః౹*

            *సుచిన్త్య చోక్తం సువిచార్య యత్కృతం*

            *సుదీర్ఘ కాలోపిన యాతి విక్రియామ్౹౹*


తా𝕝𝕝 *బాగుగా జీర్ణమైన ఆహారం, వివేకియైన పుత్రుడు, సుశిక్షితురాలైన స్త్రీ, బాగుగా సేవింపబడిన రాజు, బాగుగా ఆలోచించి చెప్పిన మాట, విచారించి చేసిన పని ఇవన్నీ ఎంతకాలం గడిచినా మంచిఫలితాలనే ఇస్తాయి.....*


 ✍️🌹💐🌸🙏

అభివృద్ధి_సోపానాలు

 123b4;217c5;

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



          *అభివృద్ధి_సోపానాలు*

                 ➖➖➖✍️


*మనిషి గొప్పవాడు కావాలని నిరంతరం కలలు కంటుంటాడు.*

*ధనాశ కలిగినవాడు కుబేరుణ్ని మించి పోవాలనుకుంటాడు. అధికారదాహం కలవాడు అత్యున్నతస్థాయి కుర్చీని ఆక్రమించుకోవాలనుకుంటాడు. జ్ఞాని పరమజ్ఞానిగా, సాధకుడు సిద్ధుడిగా, శూరుడు యోధుడిగా, వైద్యుడు ధన్వంతరి సమంగా... ఇలా ఉంటాయి ఆశల కలలు.*


*కలలు వేరు, వాస్తవం వేరు!*


*ధాన్యాన్ని సంచుల్లోనే ఉంచుకుని, పదింతల పంటకోసం కలలు కనడం ఎంతవరకు సబబు?*


*హలాలతో పొలాలు దున్ని భూమాతను నమ్ముకుని తగినంతగా కృషి చెయ్యాల్సి ఉంటుంది. కలలు కృషితో జత కలిసినప్పుడే సత్ఫలితాలు లభిస్తాయి.*


*ఉద్యోగి తన ప్రజ్ఞకు పదును పెట్టుకుంటూ, అంకితభావంతో పనిచేసినప్పుడే పదోన్నతులు లభిస్తాయి. తన కళ్లముందు తనకంటే వెనకవాళ్లు అభివృద్ధి సోపానాలు ఎక్కుతుంటే అసూయతో రగిలిపోవడం మన ఆరోగ్యానికే చేటు.*


*అలాగే విద్యార్థులు కూడా. అమూల్యమైన సమయాన్ని ఆటపాటలు, వినోదాలతో వ్యర్థం చేసుకుంటే ఉత్తీర్ణతే కష్టం కావచ్చు. ఇక ఉన్నతశ్రేణికి అవకాశం ఎలా ఉంటుంది?*


*గతించిన కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కిరాదు. సర్వసమర్థుడైన భగవంతుడైనా కాలాన్ని వెనక్కితిప్పడు. కోట్లాది రూపాయలు గుమ్మరించినా గతించిన క్షణాల్ని తిరిగిపొందడం అసాధ్యం. కానీ, చాలామంది ఈ సత్యాన్ని గమనికలోకి తీసుకోరు.*


*‘నేను చాలా తప్పులు చేశాను. తల్లిదండ్రుల్ని హింసలుపెట్టాను. ఒక్కసారి వారికి మళ్ళీ సేవలు చేసే అవకాశం ఇవ్వు భగవంతుడా’ అని ఎంత మొత్తుకున్నా- పోయినవాళ్లు మళ్ళీ ప్రత్యక్షం కారు.*


*సమయం మన చేతుల్లో ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ధనం పుష్కలంగా ఉన్నప్పుడే దానధర్మాలు చెయ్యాలి*. 


*యౌవనంలో ఉండగానే తీర్థయాత్రలు చేయాలి. బాలుడిగా ఉన్నప్పుడే శ్రద్ధగా విద్యాభ్యాసం చేయాలి. మనసు మనమాట వినే సమయంలోనే ఆధ్యాత్మిక సాధన చేయాలి. మంచిచెడుల విచక్షణ కల్పించే జ్ఞానాన్ని సదా రక్షించుకోవాలి*.


*కుబేరుడు శ్రీనివాసుడికి రుణం ఇచ్చిన కథ ఉంది. అంతటి ధనసంపన్నుడూ ఎవరికీ ఎక్కడా దానధర్మాలు చేసిన కథలు కనిపించవు. అందువల్ల కుబేరుడికి భక్తులుండరు.*


*సిరుల దేవత శ్రీమహాలక్ష్మిని ఎందరో ఆరాధిస్తారు. ఆ తల్లి చల్లనిచూపు పడితే చాలనుకుంటారు. ఎందుకంటే ఆ మహాదేవి అనుగ్రహమే అమోఘదానంతో సమానం.*


*ప్రపంచంలో కుబేర సమానులెంతమంది ఉన్నా- సత్కార్యాలు, దానధర్మాలు చేయనిదే వాళ్లకు గుర్తింపు ఉండదు.*


*కాబట్టి, తన సంపదను పంచడంతోపాటు, తోటివారిని ఆదుకునే తత్వాన్ని పెంచుకోవాలి! అవధులెరుగని దాత అనిపించుకోదగినవాడు భగవంతుడొక్కడే. ఆయన దాతలకే దాత.*


*ఎదుగుదలను భౌతికంగా, సిరిసంపదలు, అధికారహోదాలకు, విద్యాధిక్యత, జ్ఞానసంపదకు ముడిపెట్టుకున్నంత కాలం మనిషి సత్యానికి దూరంగా ఉంటాడు.*


*అసలు సత్యమేమిటంటే, మనలోని సంస్కారం ఒక్కో మెట్టు ఎదగాలి. సంపూర్ణ సంస్కారవంతుడికి ఎవరి ఎదుగుదలపట్లా అసూయ, ద్వేషాలు ఉండవు.*


*తులసి మొక్క సర్వలోకపూజిత. అది ఎప్పుడూ చిన్నదిగానే ఉంటుంది. తాడిచెట్టు చాలా ఎత్తుగా ఉంటుంది. కానీ, తులసి మొక్క పవిత్రత ముందు అది ఎందుకూ కొరగాదు.*


*అభివృద్ధి సోపానాలు ఎక్కడానికి ఆరాటపడటం కంటే మన అర్హతలు పెంచుకునేందుకు కృషిచేయడం చాలాముఖ్యం. ఎవరో మనల్ని మించిపోతున్నారనే దుగ్ధ మన ఎదుగుదలకు ప్రధాన అవరోధం కనుక, ఆ భావాన్ని మనలోకి రానివ్వకూడదు. మనం మనంగానే ఉండాలి. మనకు లభించాల్సినవి లభిస్తూనే ఉంటాయి. పెరగాల్సింది సంస్కారం. మరేవీ కావు. ఇదే జీవన విజయసూత్రం!*✍️

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు 🙏

భగవంతుడు మనకు దాసుడు?*

 123b6;306c4;167e5;

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



*భగవంతుడు మనకు దాసుడు?*

             ➖➖➖✍️


```

భగవంతుడు ఎల్లప్పుడూ తన భక్తులకు దాసుడే.


చాలా ఉదాహరణలున్నాయి.


*శ్రీ వేంకటేశ్వరుడు అన్నమయ్య భక్తికి దాసుడై సకుటుంబముగా అన్నమయ్య వివాహానికి తరలివెళ్లి, అన్నమయ్య పల్లకీని, తనభుజాలమీద మోయలేదా?


*పాహి పాహి ఇతహః పరంబెరుంగ, అని గజేంద్రుడు ప్రార్ధిస్తే...అలవైకుంఠ పురంబులో అమూలసౌధంబులో, ఉన్న పరమాత్మ, పరుగెత్తి రాలేదా?


అదీ ఎలావచ్చాడు?


*సిరికించెప్పడు, శంఖచక్రయుగముల్ చేదోయి సంధింపడు, అలా ఆగమేఘాలమీద పరుగు పరుగున పరుగెత్తి…! ఎవరికోసం వస్తాడండీ? ఆయన దీనజన బాంధవుడు. త్రికరణ శుద్ధిగా భక్తితో ప్రార్ధిస్తే భక్తికి దాసానుదాసుడు.


*కుచేలోపాఖ్యానములో కుచేలుడు (పరమ ప్రీతితో భక్తితో ) తెచ్చిన అటుకులకు పరవశించి అష్టైశ్వర్యములు ప్రసాదించలేదా


*కురుమహాసభలో ‘అన్నా నీవేదిక్కు’ అని ద్రౌపతి తన రెండు చేతులూ పైకి ఎత్తి ప్రార్ధించగానే శ్రీ కృష్ణపరమాత్మ తామర తంపరగా వస్త్రములను ప్రసాదించలేదా?


*శ్రీ త్యాగయ్య భక్తికి పరవశుడైన 

శ్రీ సీతా రామచంద్రులవారు, లక్ష్మణ స్వామీ, అంజయనేయ స్వామి సమేతంగా త్యాగయ్య ఇంటికివచ్చి విందారగించలేదా ?


*శ్రీ రామదాసు భక్తికి దాసుడై, చనిపోయిన రామదాసు పుత్రుణ్ణి బ్రతికించాలేదా ?


*’ఈ స్తంభములో నీ విష్ణువు ఉన్నాడా?’ అని హిరణ్యకశిపుడు అడుగగా, ప్రహ్లాదుడు ‘ఉన్నాడు!’ అని, ‘ఇందుగలడందులేడని సందేహమేల, ఖచ్చితంగా ఉన్నాడు.’ అని చెప్పి ప్రహ్లాదుడు ప్రార్దించగా తన భక్తుని మాటకోసం, తన భక్తుని మాట నెలబెట్టడంకోసం స్వామి స్తంభమునుండి బయటకు రాలేదా?వచ్చి హిరణ్యకశిపున్ణి సంహరిచలేదా?


*శ్రీ తులసీదాసు భక్తికి తులసీదాసు తల్లి దగ్గర, రామయ్య వీపు వాతలు పడేలా దెబ్బలుతినలేదా?


*వైర భక్తి పరాకాష్టకు నిదర్శనంగా హిరణ్యకశిపుడు, జరాసంధుడు, కంసుడు, శిశుపాలుడు, రావణాసురుడు వీరంతా మోక్షాన్ని పొందాలేదా ?


*మూఢ భక్తికి నిదర్శనంగా తిన్నడు (కన్నప్ప ) తన కాలి చెప్పుతో, శివలింగము పై నిర్మాలిన్యాన్ని తీయగా, తిన్నడు శివునకు కన్ను పెట్టడానికి, కన్ను గుర్తుకోసం తన కాలి బొటనవ్రేలును ఉంచి తనకన్నును తనశరీరము నుండి పెకలించి పెట్టగానే మోక్షాన్ని ప్రసాదించలేదా ?


*ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నోనిదర్శనములు ఉన్నాయి. ఒక విషయం ఆలోచించండి పైన ఉదహరించిన వారందరూ మానవ మాత్రులు కారా? మరి మనమూ మానవులమేకదా, మరి వారికి మనకు ఎక్కడుంది తేడా? వారికి పలికిన భగవంతుడు మరి మనకెందుకు పలకడు? ఎందుకు మాట్లాడడు? ఎవరికోసం పలుకుతాడండీ, ఎవరికోసం మాట్లాడుతాడు? మనలో ఆ భక్తి పారవశ్యమేది?


*అసలు దాస్యం అంటే ఏమిటి అంటే సేవ అంటే ఏమిటి? దాస్యం ఎలాచేయాలి? సేవలు ఎలాచేయాలి ?తెలుసుకుంటే అలా చేస్తే భగవంతుడు మనకు దాసుడౌతాడా లేదా అనే విషయం తెలుస్తుంది.


*మహాభారతంలో పాండవుల పురోహితులైన శ్రీ ధౌమ్యుల వారు…. “ఓ ధర్మరాజా మీరింతవరకూ సేవలు చేయించుకొన్నవారే కానీ దాస్యం చేయడం, సేవలు చేయడం మీకు తెలియదు. మీరు విరాటరాజు కొలువులో సేవక వృత్తి, దాస్య వృత్తి చేయాలి. సేవ, దాస్యము అంటే ఒక తల్లి తనబిడ్డకు ఏ ఏ పనులు చేస్తుంది? బిడ్డ అడిగితేనే చేస్తుందా? లేక ఏది తనబిడ్డకు అవసరమో అవి చేస్తుందా? తల్లికి తెలుసు. స్నానపానాదులే కాక ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ కంటికి రెప్పలా తాను చూచుకొంటుంది కదా“ అంటూ...

*పాండవులకు సేవలుచేసే విధానాల గురించి పాండవుల పురోహితులైన శ్రీ ధౌమ్యుల వారు సవివరంగా వివరించారు.


*అలా మనము కూడా భగవంతునికి, త్రికరణ శుద్దిగా, పంచేద్రియాలను ఒకటిచేసి, తపన,ఆర్తితో దాస్యం, సేవ(శరణాగతి) చేస్తే, భగవంతుడు మనకు దాసుడవడం ఖాయం.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774.

లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

శ్రీమద్భాగవత కథలు*

 167e4;

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀3️⃣```ప్రతిరోజూ...

మహాకవి బమ్మెర పోతనామాత్య..

```

         *శ్రీమద్భాగవత కథలు*

                ➖➖➖✍️```

 

2.1. రఘువంశము: 


విశుద్ధమగు సూర్యవంశమున పరమ ప్రతాపుడును, యశస్వియును, దీర్ఘబాహుడును, పుణ్యశ్లోకుడును అగు ఖట్వాంగుడను రాజు పృథివిని పాలించుచుండెను. అతని పరిపాలన ప్రజలకానందము కలిగించుటయేకాక, ప్రజలు ప్రభువునే దైవముగా భావించి, విశ్వసించి గౌరవించుచుండిరి. మహారాజునకు ఏకైక పుత్రుడు కలడు. అతడే దిలీపుడు. 

కుమారుడైన దిలీపుడు దినదినాభివృద్ధిగాంచుచు, 

మహా తేజోవంతుడై తండ్రితో పాలన విషయాదులందు పాల్గొనుచు, దేశమందలి మంచిచెడ్డలను గమనించుచు, విచారించుచు, అతిశ్రద్ధాళుడై ప్రజలమధ్య పెరుగుచుండెను. కుమారుడు పెద్దవాడగుట చూచి యుక్తవయస్సుననే వివాహముజేసి కొంత పరిపాలనా బాధ్యత అతని తలపై పెట్టవలెనని సంకల్పించి, అన్నింటికీ సరిపడునట్టి కోడలు కావలెనని విచారించి, కడకు మగధ నందినియగు సుదక్షిణ అను కన్యతో అత్యంత వైభవముగా వివాహము జరిపించెను. సుదక్షిణ మహాగుణవంతురాలు. సాధ్వియును, సరళ హృదయయునై, పతిననుసరించుచు, ప్రాణసమముగ ప్రేమించి సేవించుచుండెను. పతియగు దిలీపుడు కూడను, మహా గుణవంతుడగుటచే ఆమెకెట్టి లోటునూ లేకుండ చూచుకొనుచు, పరిపాలనా విషయమున తండ్రిననుసరించుచు క్రమక్రమముగా తండ్రి బాధ్యతలన్నింటిని తానే చూచుకొనుచు కొంత విశ్రాంతిని కలిగించుచుండుట ఖట్వాంగుడు గమనించి తనలో తాను కుమారుని తెలివితేటలకును, శక్తి సామర్థ్యములకును ఎంతో సంతసించుచుండెడివాడు.


ఈవిధముగ కొంతకాలము గడచెను. ఖట్వాంగుడు సుముహూర్తమును నిర్ణయించి దిలీపునకు రాజ్యపాలనా పట్టము గావించెను. నాటినుండియు దిలీపు మహారాజను నామముతో సప్తద్వీపవతియగు వసుంధరకు ప్రభువై ధర్మపాలన జరుపుచుండ, సకాల వర్షము కురిసి, సస్యశ్యామలమై సమృద్ధిగా పండి పాడిపంటలకెట్టి కొరతయు లేక నిత్యకల్యాణములతో, వేద పారాయణములతో, శాస్త్రసమ్మతమైన యజ్ఞయాగాది క్రతువులతో అన్ని జాతులవారు హాయిగా జీవించుచుండిరి.


కానీ మహారాజునకు దినములు సంవత్సరములు గడచుకొలది తనలో ఏదో అశాంతి బాధించుచుండినటుల అతని ముఖవర్చస్సు తెలుపుచుండెడిది. కొన్ని సంవత్సరములు గడచెను. ఇచ్ఛ నెరవేరునను ఆశ దినదినమునకు నీరసించెను.


ఒకనాడు తన రాణియగు సుదక్షిణతో తనలోని చింతను ఈరీతిగా వెలిబుచ్చెను: “ప్రియా! మనకింత వరకును సంతానము లేకపోవుటచే కొడుకులు లేరను చింతకంటెను ఇక్ష్వాకు వంశ ప్రసారమెట్లు కాగలదను విచారము నన్ను మరింత బాధించుచున్నది. దీనికి నేనొనరించిన ఏ పాపఫలమో కారణమయి ఉండ వచ్చును. దాని పరిహారార్ధమై ఏమి చేయవలెనో నాకు తోచుటలేదు. దైవ కరుణా కటాక్షమును అందుకొనుటకు తగిన మార్గమేదియో మన కులగురువగు వసిష్ఠులవారిని అడిగి తెలిసికొన వలెనని ఈనాడు నా మనసు తత్తరపడుచున్నది. ఇందుకు నీ ఉద్దేశ్యమేమి?” అని దిలీపుడు అడుగ సుదక్షిణ ఆలస్యము చేయక, ఆలోచించక, “నాథా! ఇదే ఆలోచన నాలోను చాలా దినములనుండి బాధించుచున్నప్పటికిని పతి ఆజ్ఞ లేక నా తలంపును బైట పెట్టుట తప్పగునేమో అని నాలోనే నేను అణచుకొంటిని. తమ ఇచ్ఛననుసరించుటకు నేనెల్లప్పుడు సిద్ధమే అనునది తమకు విదితమే కదా. ఇందుకు ఆలస్యమెందుకు?” అని రాణి తన అంగీకారమును తెలుపగనే, దిలీపుడు రథమును సిద్ధము చేయించి, “ఈనాడు నావెంట పరివారము, రక్షక భటు లెవ్వరును రానక్కరలేద”ని ఆజ్ఞాపించి తానే రథమును నడుపుకొని గురుదేవులగు వసిష్ఠులవారి ఆశ్రమము చేరెను.


రథ శబ్దము వినగనే వెలుపలనున్న ఆశ్రమవాసులు లోనికి వెళ్లి గురువుగారికి తెలుప, వసిష్ఠులవారు ద్వారము చెంతకు వచ్చి దిలీపుని ఆశీర్వదించి కుశల ప్రశ్నలు గావించుచుండ, రాణి సుదక్షిణ చెంతనేయున్న అరుంధతీదేవికి నమస్కరించెను. అంత అరుంధతి ఆమెను ఆశీర్వదించి, ప్రేమతో కుశల ప్రశ్నలు గావించుచు లోనికి తీసుకొని వెళ్లెను. అంత, రాజుకూడను ప్రభు ధర్మము ననుసరించి, “ఆశ్రమ జనులకుకానీ, యజ్ఞ యాగాది సత్కర్మలకుకానీ, లేక ఆహార విహారములకుకానీ, ఎట్టి ఇబ్బందియు లేక అరణ్యమునందు క్రూర మృగముల బాధలులేక, తమతమ నిత్యానుష్ఠానములు సక్రమముగ జరుగుచున్నవి కదా?” అని గురువైన వసిష్ఠులవారిని, ఆశ్రమవాసులను కుశల ప్రశ్నలు గావించుచు, లోనికి వెళ్లి వారివారి ఆసనములు వారు స్వీకరించిరి.


అంత వసిష్ఠులవారు అచటున్న ఆశ్రమవాసులను తమతమ వసతులకు వెళ్ళమని ఆజ్ఞాపించి, రాజు తన ఆశ్రమమునకు రాణీ సమేతుడై వచ్చిన కారణమును తెలుపుమని అడుగ, రాజు తనకుగల కొరతను, విచారమును, వినయముతో విన్నవించి, తమ అనుగ్రహము తప్ప, ఇందుకు అన్యమార్గము లేదని ప్రార్థించెను.✍️

(సశేషం)

    🙏శ్రీ రామ రక్ష సర్వజగద్రక్ష🙏

జ్వాలా వారి విశిష్ట వ(ర)చనామృతం ‘శ్రీమద్భాగవత కథలు’ ```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

చెన్నై - కంచి*

 ప్రతిరోజూ…

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…

132a;167e2. నడిచే దేవుడు…

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌼P0268.పరమాచార్య పావన గాధలు…



                *చెన్నై - కంచి*

               ➖➖➖✍️

```

ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ తన జీవితంలో జరిగిన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు..


నేను చెన్నైలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఆటోమొబైల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాను. ఈ సంఘటన 2005లో నేను కుంబకోణం నుండి చెన్నైకు తిరుగుప్రయాణం చేస్తున్నప్పుడు జరిగింది. నేను నా కుటుంబంతో సహా వేసవి సెలవుల కోసం అక్కడికి వెళ్ళాము. మా బంధువుల ఇళ్ళకు వెళ్ళాము మరియు కుంబకోణంలో ఉన్న అన్ని దేవాలయాలను సందర్శించడం కూడా మా ప్రణాళికలో భాగమే. 


మా తిరుగు ప్రయాణం కోసం మే 24వ తేది ఉదయం 8 గంటలకు టికెట్స్ బుక్ చేసుకున్నాము. తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించడం చాలా సంతోషం కలిగించే విషయం. తమిళనాడులో ఆలయ నగరముగా పేరుగాంచిన కుంబకోణంలోని దేవాలయాలు దర్శించడం నా చిరకాల వాంఛ.


మేము కుంబేశ్వర ఆలయం, సారంగపాణి ఆలయం మరియు 

శ్రీ ఒప్పిలిఅప్పన్ ఆలయాలు దర్శించాము. 


ఈ యాత్రలో చివరిగా కంచి మఠంను దర్శించటం మా ప్రణాళిక. మఠంలో ఉండగా నేను పొందిన అనుభూతి అనిర్వచనీయమైనది. మేము అక్కడ ఉండగా పరమాచార్య స్వామి వారి గురించి మఠం ధర్మకర్తలతో కొద్దిగా మాట్లాడాము. దాంతో నాకు వారి గురించి తెలుసుకోవాలని ఉత్సాహము మరియు ఆసక్తి కలిగి కొన్ని పుస్తకాలు తీసుకొన్నాను. తిరుగుప్రయాణంలో చదువుటకు నిశ్చయించుకున్నాను. 


ఆ రోజు రాత్రి నా కలలో మహాస్వామి వారు స్వప్న దర్శనమిచ్చారు. వారు నాతో “నా వద్దకు రండి” అని చెప్పారు. 

నేను మధ్యలోనే నిద్రలేచి సమయము చూస్తే ఉదయం 4 గంటలు. ఆ తరువాత నేను నిద్రపోలేదు. స్వామి వారు నిద్రలో చెప్పిన దానిగురించే ఆలోచిస్తున్నాను. సుమారు ఉదయం 5:30 అప్పుడు నేను నా పిల్లలను భార్యను నిద్ర లేపి, సామాను సర్దుకొని తయారు అవ్వమన్నాను. ఎనిమిది గంటలకు మా తిరుగు ప్రయాణం కాబట్టి. అందరం అల్పాహారం ముగించుకొని మా అమ్మ, నాన్న మరియు బంధువులందరికి వీడ్కోలు పలికి కారులో బస్సు ప్రాంగణానికి బయలుదేరాము. 


కారులో కూర్చున్న తరువాత నా భార్యతో, చెన్నైకి వెళ్ళేముందు కంచి వెళ్ళి కామకోటి మఠాన్ని దర్శించాలని ఉంది అని చెప్పాను. మరునిమిషములో మా ప్రణాళికను మార్చుకుని కంచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఉదయం 7:30 ప్రాంతములో టికెట్ కౌంటరుకి వచ్చి కాంచీపురం వెళ్ళడానికి బస్సుల గురించి అడుగగా, 8:30కి ఉంది అని చెప్పారు. 


మేము చెన్నైకి పోయే బస్సు టికెట్స్ రద్దు చేసుకోవడం కుదరలేదు. కాంచీపురం బస్సు రావడంతో వెళ్ళి కంచి కామకోటి మఠంను సందర్శించాము. అక్కడకు వెళ్లగానే నా మనస్సుకు ఏదో తెలియని పులకరింతకలిగింది. అక్కడ చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా అనిపించింది. ఒక గంటసేపు అక్కడ ఉండి మేము చెన్నైకి తిరుగు ప్రయాణం అయ్యాము. 


మేము ఇంటికి వెళ్ళాక T.V చూస్తే ఒక వార్తవిని చాలా ఆశ్చర్యానికి లోనయ్యాము. మేము చెన్నై రావడానికి టికెట్స్ తీసుకున్న బస్సుకి ప్రమాదం జరిగి, దానిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఇది చాలా విషాదకరమైన సంఘటన. 


కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం “హఠాత్తుగా ఎందుకు మా ప్రణాళిక మార్చుకున్నాము?” అని. 


ఆనాటినుండి నేను మహాస్వామి వారికి లొంగిపొయాను. నా జీవితాన్ని వారి పాదపద్మముల సేవకు అంకితం చేసాను. ఈరోజు వరకు లేవగానే నేను చేసే మొదటి పని పరమాచార్య స్వామి వారి పాద పద్మములు చూసి నమస్కరించడం. ✍️```

             --- మూలం : స్వస్తిక్ టివి.

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*

```

#KanchiParamacharyaVaibhavam # “కంచిపరమాచార్యవైభవం”🙏

. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

            🌷🙏🌷


🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - కృష్ణ పక్షం -‌ షష్ఠి - ఉత్తరాభాద్ర -‌‌ సౌమ్య వాసరే* (16.07.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

15, జులై 2025, మంగళవారం

నన్ను నేను వెతుక్కుంటున్నా...

 *నన్ను నేను వెతుక్కుంటున్నా...!!*


సమస్త విశ్వానికి వెలుగు రేఖలా

నా ఆత్మ జ్యోతిని మండించుకుంటూ

అందులో నన్ను నేను వెతుక్కుంటా 

కీర్తి శిఖరానికి చేరుకుంటా...


ప్రపంచమంతా ఒకటే గీతికగా 

అందులో జాతుల వరసలు కలుపుకుంటూ 

ఖండాంతరాలు దాటుకుంటూ 

నా ఊపిరిని విశ్వమంతా నింపుతా..


ఆత్మవిశ్వాసాన్ని గుండె నిండా నింపుకొని 

కాంతి రేఖల వెలుగులను సృష్టించుకుని 

భూమిపైన మొలకలా నిలబడుతూ 

మహావృక్షమై నీడనియ్యాలని తపిస్తా..


అడుగున పడ్డ బడుగు జీవిలా కదులుతూ 

మట్టిలోని విత్తనాల్తా పైకి లేస్తూ 

పుష్పించి పండునై రాలిపోతూ 

జీవిత గమ్యాన్ని చేరేందుకు ప్రయత్నిస్తా...


మనసు నిండా దయా ఫలాలను నింపుకొని 

మానవత్వపు కోణాన్ని పెంచుకుంటూ 

మనిషిలో మంచితనాన్ని వెతుక్కుంటూ 

వింత నాటకంలో విరాగిగా తిరుగుతా...


నా జీవిత పరమార్ధం తెలుసుకుంటూ 

అక్షరాలతో నా వేదన తీర్చుకుంటూ 

ప్రతినిత్యం వాక్యాలను సృష్టించుకుంటూ 

నన్ను నేను మర్చిపోతూ సాగుతున్నాను...


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235