1, నవంబర్ 2025, శనివారం

ఏది ఉచితంగా రాదు

 

ఏది ఉచితంగా రాదు  

మనం ఉంటున్న ప్రపంచం ఒక చిత్రమైనదిగా తోస్తుంది. బాహ్యంగా కనపడేది ఒకటి ఉంటే అంతరంగికంగా ఇంకొక విధంగా ఉంటుంది. కొన్ని సమయాలల్లో బాహ్యానికి అంతర్యానికి పూర్తిగా వ్యతిరేకంగా భిన్నంగా వుండే సంఘటనలు కూడా లేకపోలేదు

ఒక వ్యాపార ప్రకటన ఇట్లా ఉంటుంది మీరు రెండు కొంటె ఒకటి ఉచితం అని వ్రాసి ఉంటుంది. విషయం ఏమిటంటే రెండు కొంటె ఒకటి అనే పదాలను చిన్న అక్షరాలలో పేర్కొని ఉచితం అనే పదాన్ని మాత్రం పెద్దగా వ్రాస్తారు. తీరా నీవు అక్కడికి వెళ్లి చుస్తే స్టాకు పూర్తిగా పాతది పారేయటానికి మాత్రమే పనికి వచ్చేదిగా వుండి వుంటుంది. చౌకగా వస్తుంది అని నీవు వస్తువు సామర్ధ్యాన్ని గణనలోకి తీసుకోకుండా నీకు సదరు వస్తువు అవసరమా కాదా అనేది కూడా ఆలోచించకుండా తీసుకొని వస్తావు చివరకు నీ భార్య ఆగ్రహానికి లోనౌతావు. తరువాత వాటిని తీసుకొని వాపసు ఇవ్వటానికి దుకాణానికి వెళితే సారీ సారూ క్లీరెన్సు సేలు వాపసు తీసుకోము అని చెప్పి పంపిస్తాడు. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే నిజానికి షాపువాడు ఒక్కటి కూడా నీకు ఉచితంగా ఇవ్వలేదు. ఒక తక్కువ నాణ్యత కలిగిన వస్తువును అమ్ముకోవటానికి వేసిన పధకం అని తరువాత మనకు తెలుస్తుంది. కాబట్టి ఏదయినా వస్తువు కొనేటప్పుడు దాని ధర చౌకగా వున్నదని వైపోచించకుండా దాని నాణ్యత అది ఎంతవరకు మనకు ఉపయోగకరం అనే విషయాలను కూడా అలోచించి కొనటం చాలా అవసరం. రోజుల్లో ప్రలోభాలకు గురిచేసే వ్యాపార ప్రకటనలు అనేకం మనం చూస్తున్నాము వాటి ప్రభావానికి లోనయి నష్టపోయిన సందర్భాలు ప్రతి మనిషికి అనుభవమే.

మనషులలోని మానసిక బలహీనతలను ముఖ్యంగా మధ్యతరగతి మనుషులను గురిచేసి వ్యాపారవేత్తలు ఇలాంటి ప్రలోభాలకు గురిచేస్తుంటారు.మధ్యతరగతి వారికి ఎన్నిసార్లు మోసపోయిన మరల మరల తెలియకుండా మోసపోతూనే వుంటారు

బజారులో చిన్న చిన్న సంచులలో కేవలం బత్తాయి పండ్ల బైటి వైపు మాత్రమే కనిపించే విధంగా ఉంచి అమ్ముతారువాటిని చూసి పండ్లు మంచివని అనుకోని మనం కొనుక్కొని వస్తాము. సంచి చించి చుస్తే అన్ని పండ్లు క్రుళ్ళి పోయి ఉంటాయి. మన కళ్ళను మైమరిపింపచేసి చెడిపోయిన వస్తువులను అమ్మటం వాళ్ళు మోసం అనుకోవటం లేదు అది వారి చాకచక్యం అని తలుస్తూ విశేష లాభాలను గణిస్తున్నారు

మార్కెట్లో కూరగాయలు కొనటానికి వెళితే అక్కడ ఒక్కడు మిగిలినవారి కన్నా తక్కువ ధరకు అమ్ముతుంటారు. కూరలు చుస్తే తాజాగా కనిపిస్తాయి వాటిని చూసి నీవు తక్కువ ధరకు లభిస్తున్నాయని అక్కడ కొంటావుతీరా ఇంటికి వస్తే నీ భార్య ఏమండీ వంకాయలు కిలో తెచ్చారా అరకిలో తెచ్చారా అంటే కాయలు తాజాగా ఉన్నాయని కిలో తెచ్చాని నీవు బదులు ఇస్తావుమిమ్మల్ని కూరగాయలవాడు మోసం చేసాడు నిజానికి ఇవి కిలో లేవు అని ఆమె చెపితే ప్రక్కనే వున్న కిరాణాషాపుకు వెళ్లి తూకంవేయిస్తే 600-700 గ్రాములు మాత్రమే ఉంటాయి. అప్పుడు నీకు కళ్ళు తెరుచుకుంటాయి వ్యాపారి తక్కువ ధరకు ఎందుకు అమ్మాడో అని

వ్యాపారవేత్తలు వారి వారి లాభాలకొరకు ప్రజలను మోసం చేయటం పరిపాటే కానీ ఇతరులు అలా కారు అని అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. ప్రస్తుతం రాజకీయ నాయకులు కూడా మనకు ఉచితాలను చూపెట్టి తమ పబ్బం కడుపుకుంటున్నారు. ఒక సమర్ధమైన ప్రభుత్వం ప్రజలలో ఎలాంటి విభేదాలను చూడకుండా లేక చూపకుండా అందరిని తన కన్నా పిల్లలవలె పరిపాలించాలి అని కదా రాజనీతి తెలుపుతుంది. మరి ఆలా జరుగుతున్నదా అంటే లేదు అని ప్రతి మనిషికి తెలుసు పూర్తిగా స్వార్ధపూర్తితంగా, వోటురాజకీయంగా రాజకీయ నాయకులు తమ తమ స్థానాలను గెలవటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల సంక్షేమం కన్నా స్వా సంక్షేమానికే వారు విలువని ఇస్తున్నారు. ఉచితంగా ఇవ్వాలి అంటే యెంత దానం ప్రభుత్వానికి కావలి అని మనం ఆలోచించకుండా ఉచిత పథకాలకు అలవాటు పది ఓటువేసి పన్నుల ఊబిలో కూరుకొని పోతున్నామురాత్రి 8 గంటల సమయంలో ప్రతి కూడలిలో పోలీసువారు వాహనాలను అపి జరిమానాలు విధించటం మనమెరుగుదము. అవి ఉచిత పథకాల ప్రభావమే కావచ్చు.

కొందరు అనవచ్చు తల్లిదండ్రుల ప్రేమలో స్వార్ధం ఉండదు అది కేవలం ఉచితంగా లభిస్తుంది  అని. అట్లా అనుకుంటే పొరపాటే అవుతుంది  అదెట్లో పరిశీలిద్దాం. బాల్యంలో తల్లిదండ్రులు పిల్లలను ఏంతో ప్రేమగా చూసుకొని వేలు, లక్షలు ఖర్చు పెట్టి విద్యావంతులను చేస్తారుఅదంతా ఉచ్చితమే అని పిల్లలు అనుకోవచ్చు కానీ నిజనికి తల్లిదండ్రులు వృద్దులు అయినప్పుడు వారిని ప్రేమతో చూసుకొని వారసంతోషానికి పాత్రులు కావలి. ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకుంటున్నారన్నది మనం రోజు చూస్తున్నాము. ఎప్పుడో శతక కారుడు చెప్పాడు 

తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు 

పుట్ట నేమి వాడు గిట్టనేమి

పుట్టలోని జెదలు పుట్టవా? గిట్టవా?

విశ్వదాభిరామ వినురవేమా!

 చిన్నతనంలో తల్లిదండ్రులు చూపిన ప్రేమకు పర్యవసానంగా వాళ్ళు వృద్దులు అయినప్పుడు పిల్లలు వారి తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవటం కనీస బాధ్యత బాధ్యతను ప్రతివారు విస్మరించకుండా ఉండాలి

కొందరు తల్లిదండ్రులు బాల్యంలో వారి పిల్లలపట్ల ప్రేమాభిమానాలు సరిగా చూపకపోవటంతో వారు పెద్దవారైనాతరువాత పిల్లల్నుండి ప్రేమను పొందలేక బాధపడితే ప్రయోజనం ఉండదు. కాబట్టి తల్లి దండ్రులు ఎల్లప్పుడూ బిడ్డలను కంటికి రెప్పగా చూసుకోవాలి అప్పుడు మాత్రమే వారి పిల్లల ప్రేమను పొందటానికి అర్హులు అవుతారు

నిజానికి భూమి మీద మనకు గాలి నీరు కూడా ఉచితంగా లభించదు అది ఎట్లాగో చూద్దాం. పరిసరాలలో వున్న గాలిని మనం మన శక్తిని వుపయోగించి మాత్రమే పొందుతాము. ఊపిరితిత్తులు వాటి శక్తిని వాడకపోతే గాలి శరీరానికి వెళ్ళదుశక్తి కావాలంటే ఆహరం తీసుకోవాలి ఆహరం సంపాయిస్తేనే వస్తుంది అది మనకు తెలుసుఇక నీటి విషయానికి వస్తే నీరు భావిలోనో లేక నదిలోనో వున్నాయనుకోండి అప్పుడు కూడా మీరు మీ శక్తిని ఉపయోగించి మాత్రమే నీటిని పొందగలరు. రోజుల్లో మనం త్రాగే నీటిని కొనుక్కొని త్రాగుతున్నామన్నది సర్వులెఱింగినదే

ప్రపంచంలో ఏది కూడా ఉచితంగా లభించదు మనం ఒకటి పొందాలంటే ఒకటి కోల్పవాలి అన్నది అనాదిగా వస్తున్న నానుడి. ఇది ముమ్మాటికీ నిజం. ఆహరం ఎక్కడ ఉచితంగా లభిస్తుంది అంటే ఎలుకల బోనులో అని ఒకడు అన్నదాత దాని అర్ధం బోనులోకి ఎలుకలను రప్పించటానికి ఆహారాన్ని ఉంచారన్నది విషయంకాబట్టి ఏదయినా ఉచితంగా వస్తున్నది అంటే నిజానికి అది ఉచితం కాదు దాని వెనుక నీకు తెలియని ఒక విషయం దాగి వున్నది అని తెలుసుకోవాలి.. 

ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ

 

 

కరక్కాయ గురించి

 కరక్కాయ గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .

  

 కరక్కాయ అందరికి సుపరిచితమే . ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. కరక్కాయ ఐదు రసములతో కూడుకుని ఉన్నదిగా , జఠరదీప్తిని పెంచునిదిగా , బుద్ధిబలముని ఇచ్చునిధిగా , నేత్రములకు మేలుచేయునిదిగా ఆయుర్వేదం పేర్కొన్నది. కరక్కాయ ఆయుర్వృద్దిని ఇచ్చును. ధాతువుని వృద్దిచేయును. కడుపులోని వాయువుని బయటకి పంపును. శ్వాసని , దగ్గును , ప్రమేహమును , మొలలను , కుష్ఠును, గొంతులోని నంజును తగ్గించును .

               

       ఉదరమును శుద్దిచేయును. బొంగురుగొంతును మంచిగా చేయును . గ్రహణి రోగమును నయం చేయును . మలబద్దకం పోగొట్టును . విషమజ్వరమును నయం చేయును కడుపులోని గుల్మాలను పోగొట్టును . కడుపుబ్బరం పోగొట్టును . దాహమును , వాంతిని , ఎక్కిళ్ళను , దురదని , గుండెజబ్బుని , కామెర్లని , నొప్పిని , ప్లీహారోగమును నయం చేయును . మూత్రకృచ్చం , మూత్రఘాతరోగం ని నయం చేయును . 

             

       శరీరంలోని పిత్తమును హరించును . కరక్కాయకి పులుపుదనం ఉండటం చేత వాతమును హరించును . తీపి , చేదు రసములు ఉండటం చేత పిత్తము హరించబడును . కారం వగరు రసం కలిగి ఉండుటచేత కఫమును హరించును . ఈ విధంగా కరక్కాయ త్రిదోష హరమైనది. పైన చెప్పిన విధముగా అయిదు రకాల రుచుల కరక్కాయలో సమ్మిళితం అయి ఉంటాయి. కరక్కాయ పప్పునందు మధురరసం , యేశల యందు పులుపురసం , బెరడు నందు చేదురసం , చర్మం యందు కారంగా , గింజపైన పేడు యందు వగరు రసం కలిసి ఉంటాయి.

            

     అందరూ కరక్కాయ ఒకే రకం అనుకుంటారు . కాని కరక్కాయలో 7 రకాలు ఉన్నాయి . వాటిగురించి ఇప్పుడు మీకు వివరిస్తాను.

 


కరక్కాయలో రకాలు -

       

 విజయ, రోహిణి, పూతనా , అమృతా, అభయా , జీవంతి , చేతకి ఈ విధంగా 7 రకాలుగా ఉండును.   

        

       ఇప్పుడు మీకు వీటి గురించి వివరిస్తాను.

                

    విజయ కరక్కాయ వింధ్య పర్వతం పైన పుట్టుచున్నది. చేతకి కరక్కాయ హిమాలయ పర్వతముల యందు జనించును.పూతనా కరక్కాయ సింధూనది ప్రాంతముల యందు పుట్టుచున్నది. రోహిణి కరక్కాయ అన్ని ప్రాంతములలో పుట్టును . అమృత కరక్కాయ , అభయ కరక్కాయ చంపారణ్యం నందు పుట్టును . జీవంతిక కరక్కాయ మహారాష్ట్ర నందు పుట్టును . 

 

   లక్షణాలను బట్టి కరక్కాయ జాతి కనుగొనుట - 

      

 సొరకాయవలె పొడువుగా ఉండునది విజయ కరక్కాయ, గుండ్రముగా ఉండునది రోహిణి కరక్కాయ , బీజము పెద్దదిగా ఉండి పై చర్మము పలుచగా ఉండునది పూతన కరక్కాయ , బీజములు చిన్నవిగా ఉండి పైన పేడు మందముగా ఉండునది అమృత కరక్కాయ , అయిదు రేఖలు కలిగినది అభయ కరక్కాయ , బంగారు రంగుగా ఉండునది జీవంతిక కరక్కాయ , మూడు రేఖలు కలిగినది చేతకీ కరక్కాయ . 

         

  పైన చెప్పిన విధముగా తగు జాగ్రత్తతో బుద్దిని ఉపయోగించి కరక్కాయలోని జాతిభేదాలు తెలుసుకొనవలెను. 

 

* కరక్కాయ ప్రయోగవిధి - 

     

    విజయ కరక్కాయ సర్వరోగముల యందు ఉపయోగించవచ్చు . రోహిణి కరక్కాయ వ్రణములను హరించునది. పూతన కరక్కాయ లేపన క్రియల యందు ఉపయోగించవచ్చు. అమృత కరక్కాయ శరీర శోధన కొరకు వాడొచ్చు . అనగా విరేచనములు ద్వారా శరీరంలోని వ్యర్ధాలను బయటకి పంపు ప్రక్రియలో వాడవచ్చు . అభయ కరక్కాయ నేత్ర రోగముల యందు వాడవచ్చు . జీవంతిక కరక్కాయ సర్వరోగములను హరించును . చేతకి కరక్కాయ చూర్ణములకు ప్రసిద్ధి.

        

      చేతకి కరక్కాయలో మరలా రెండు రకములు కలవు. తెలుపు రంగు, నలుపు రంగు. తెల్ల చేతకి కరక్కాయ ఆరంగుళముల పొడవు ఉండును. నల్ల చేతకీ కరక్కాయ ఒక అంగుళం పొడవుగా ఉండును. చేతకి కరక్కాయ చెట్టు కింద యే మనుష్యులు కాని లేక పశు పక్ష్యాదులు కాని తిరిగిన తక్షణం విరేచనాలు కలుగును. చేతకీ కరక్కాయ హస్తము నందు ఎంతవరకు ఉంచుకొందునో అంతవరకు ఆ కరక్కాయ ప్రభావం వలన నిశ్చయముగా విరేచనాలు అగును. చేతకీ కరక్కాయ సుకుమారులు , బలహీనులు , ఔషదం నందు ద్వేషం కలిగినవారు చేత పట్టకూడదు. ఇది అతి ప్రశస్తమైనది. సుఖవిరేచనం కలిగించును. 

             

         కరక్కాయలో ఏక కరక్కాయ ప్రశస్తమైనది 

జిగట కలిగి ఉండి , గుండ్రంగా ఉండి బరువు కలిగి నీటిలో వేసిన మునిగినచో అది ప్రశస్తమైనదిగా గుర్తించవలెను. బరువు 20 గ్రాములు ఉండవలెను . 

 

* కరక్కాయని ఋతువులలో ఉపయోగించు విధానం - 

     

     కరక్కాయని వర్షఋతువు యందు సైన్ధవ లవణం చేర్చి , శరదృతువు నందు పంచదార చేర్చి , హేమంత ఋతువు నందు శొంఠిని చేర్చి , శిశిర ఋతువు నందు పిప్పిలి ని చేర్చి వసంత ఋతువు నందు తేనెని చేర్చి , గ్రీష్మఋతువు నందు బెల్లము చేర్చి లోపలికి తీసికొనవలెను.

 

కరక్కాయలోని ఔషధ గుణాలు -

 

* కరక్కాయని నమిలి పుచ్చుకొనిన జఠరదీప్తిని కలిగించును. నూరి పుచ్చుకొనిన విరేచనం కలిగించి మలాశయం శుద్ది చేయును .

 

* కరక్కాయ వేయించి తినిన త్రిదోషములను హరించును .

 

* కరక్కాయను భోజనంతో పాటు పుచ్చుకొనిన బుద్ధిబలమును పెంచును. శరీర బలమును కలిగించును. పిత్తమును, కఫమును , వాతమును నిర్మూలించును.మలము, మూత్రములను దేహము నుంచి వెడలగొట్టును.

 

* కరక్కాయని భోజనాంతరం తినిన అన్నపానములు వలన కలిగిన దోషములను నివారించును. వాత పిత్త కఫ సంబంధ దోషములను నివారించును.

 

* కరక్కాయను లవణము తో చేర్చి భక్షించిన కఫమును, పంచదారతో చేర్చి భక్షించిన పిత్తమును , నెయ్యితో చేర్చి భక్షించిన వాతరోగములను , బెల్లముతో చేర్చి పుచ్చుకొనిన సర్వరోగములను హరించును .

 

* కరక్కాయ విత్తనపు చూర్ణం నేత్రములకు బలం చేకూర్చును . వాతాన్ని , పిత్తాన్ని హరించును .

 

* కరక్కాయ నుంచి తీయు తైలం చర్మరోగ నివారణగా ఉండును. సర్వరోగాలను నివారించును.


 కరక్కాయ పుచ్చుకోకూడనివారు -

  

 నడిచినడిచి అలసిపోయినవారు, బలహీన శరీరం కలిగినవారు , చిక్కి శల్యమైన వారు , ఉపవాసం వల్ల బలహీనం అయినవారు , శరీరం నందు అమిత వేడి కలిగినవారు , గర్భవతులు, రక్తం తీయబడిన మనుజులు కరక్కాయను సేవించరాదు .  


*********** సమాప్తం ************* 


మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .

 


 గమనిక -

      


నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

31, అక్టోబర్ 2025, శుక్రవారం

Panchaag


 

కార్తికమాసం-విశ్వావసు*

 *శివస్తుతి - కార్తికమాసం-విశ్వావసు*


సీ॥

అభిషేకమును జేతు నభవు నార్తిని గొల్తు 

త్రిభువనాధిపతిని తీరు గొల్తు 

హిమవంతునల్లుని హిమజాత మగనిని 

సుమమాల నర్పించి మమత గొల్తు 

త్రిపురాసురుల జంపి తీవ్రసంక్షోభమ్ము 

వరలకుండగ జేయు వాని గొల్తు 

లింగమూర్తిని గొల్తు సంగరహితు గొల్తు 

భ్రమరాంబవల్లభు భక్తి గొల్తు 

తే.గీ.

చిచ్చుకంటిని ముదమార చేరి గొల్తు 

మచ్చకుత్తుక కలవాని మెచ్చి గొల్తు 

మచ్చగలవాని నెత్తిన నిచ్చగించి 

కులుకుచుండెడి వానిని కోరి గొల్తు -12

*~శ్రీశర్మద*

30, అక్టోబర్ 2025, గురువారం

పురుషుడు భార్యని

 *పురుషుడు భార్యని ఎలా* 

                                    *చూసుకొవాలి?*


* *స్త్రీ వివాహమైన వెంటనే కోటి ఆశలతో అత్తవారింట్లొ అడుగుపెడుతుంది. తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను, బంధువులను అందరిని విడచి వివాహము చేసుకొన్న భర్తపై నమ్మకంతో అత్తవారింట్లొకి అడుగుపెడుతుంది. భర్త ,భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకొంటాడు. కానీ భార్య భర్త గౌరవాన్ని, సంతానాన్ని, ధనాన్ని, కాపాడుతుంది. సేవకురాలిగా, తల్లిగా, స్నేహుతురాలిగా, మంత్రిగా, వీటన్నింటికి మిoచి ప్రేమగా, భక్తిగా చూసుకుంటుది.*


* *అందువలన భార్యను హక్కుగా భావించి తిట్టరాదు. ఆమె బంధువులతో చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వరాదు.*


* *భార్య వడ్డించిన పదార్ధాలను తినకుండా విమర్శించరాదు.*


* *ఇంటిని భార్య జైలులా భావించే పరిస్తితులు లేకుండా వారానికి ఒక్కసారైనా బైటికి తీసుకెళ్ళాలి.*


* *పిల్లలతొ సరళ సంభాషణలు* *చేయాలి.*


* *పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదు.* 


* *ఏకగదిలో కాపురం ఉంటున్నవారు పిల్లలని గమనించి కలవాలి.*


* *భార్యకి ఎంతో కొంత ఆర్ధిక స్వేచ్హ ఇవ్వాలి.*


* *ఆమె అభిప్రాయలను గౌరవించాలి.*


* *భార్యను పరులముందు అవమానించే విధంగా ప్రవర్తించరాదు.*


* *భార్యను ఇంటి యజమానిరాలుగా చూడాలి గాని, అనుమానించే వ్యక్తిగా చూడగూడదు.*


* *భర్త తను తుదిశ్వాస వదిలేవరకు, భార్యను కంటికి రెప్పలాగ, సంతొషంలోనూ, బాధలలోను చేదొడువాదోడుగా ఉండాలి.*


* *భర్త తను మరణించిన తరువాత గూడ, భార్య ఇతరుల మీద ఆధారపడకుండా, కష్ఠాలు పడకుండా ముందు జాగ్రతలు తీసుకొని ఆమెకు తగిన భద్రత మరియు జీవనోపాది కొరకు తగిన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయలి...*

వంకాయ కూర

 వంకాయ కూర 

అబ్బో వంకాయ కూర అనగానే మీకు నోరూరుతుంది కదా అవును నాకు తెలుసు వంకాయ కూరను  తినమనే వారు   ఇష్టపడని  వారు ఉండరన్నది అందరు ఎరిగిన సత్యమే. మీ ఇంట్లో ఏం చేశారు అని ఎవరినైనా అడిగితె వాడు కనుక వంకాయకూర అని అన్నాడా అబ్బా వీడు నన్ను కూడా భోజనానికి పిలిస్తే ఎంతబాగుండును అని అనుకోని వారు ఎంతమంది వుంటారు చెప్పండి. ఇంకా కొంతమంది సిగ్గు విడిచి అరె ఇవాళ మీ ఇంటికి భోజనానికి వస్తారా అని మరి వాళ్ళ ఇంటికి వెళ్లి వంకాయ కూరను ఆరగించి వచ్చేవారు ఎంతమంది లేరు చెప్పండి. అందుకే కొంతమంది ఇవాళ మీ ఇంట్లో ఏమి చేశారు అని అడిగితె ఏరా నీవు భోజనం చేశావా అని అడిగి వాడు తిన్నాడని నిర్ధారణ చేసుకున్న తరువాత చిన్నగా అప్పుడు చెపుతాడు మా ఇంట్లో వంకాయ కూర అని. అబ్బా ఈ విషయం కొంచం ముందు చెపితే నేను కూడా మీ ఇంట్లోకి భోజనానికి వచ్చేవాడిని కదరా అని అప్పుడు నాలుక కరుచుకుంటాడు. ఇట్లా ఎన్నో సంగతులు వంకాయ కూర మీద ఉంటాయి. వంకాయ కూర రుచిని ఆస్వాదించి ఆనందించి సంతృప్తి చెందిన ఒక కవిగారు ఊరుకొక ఇలా ఒక చక్కని కంద పద్యాన్ని వ్రాసాడు అది మనందఱకు తెలిసిందే 

"వంకాయ వంటి కూరయు, 

పంకజముఖి సీత వంటి భామామణియున్, 

శంకరుని వంటి దైవము, 

లంకాధిపు వైరివంటి రాజును గలడే?" 

ఇందులో కవిగారు ఏమంటారంటే , "వంకాయలాంటి కూర, తామరపుష్పం వంటి ముఖం కల సీత వంటి భార్య, శివుడి వంటి దేవుడు, రావణుడికి శత్రువైన రాముడి వంటి రాజు" వంటివి ఉన్నాయా అని అంటున్నాడు. ఇది అక్షర సత్యం ఒక వంకాయ కూరను సాక్షాత్తు లోకమాత అయిన సీతాదేవితోటి శ్రీ రామచంద్రునితోటి మరియు పరమ శివునితోటి పోల్చి చెప్పాడంటే ఆ కవిగారు వంకాయకూరను తిని పొందిన అనుభూతి  ఎంతదో చెప్పకనే చూపుతున్నది. ఇదండీ ఒక కవిగారి ఆనందంతో తన కలంనుండి జాలువారిన అమృత కవితా ధార . 

ఇక వంకాయకూర గురించి చెప్పాలంటే వంకాయ కూర ఒక కూర కాదండి అది ఒక కూరల సంపుటి. వంకాయలను తరిగి, తరిగిన ముక్కలను నీళ్లలో వేసి పోపు చేసి ముక్కలను వేసి అల్లం పచ్చిమిరపకాయ ముక్కలను వేసి చేసే కూర సాదారణ కూరే కానీ దాని రుచి మాత్రం అమోఘం. ఇది అతి సాధారణంగా చేసే వంకాయకూర 

ఇంకా పల్లీల పొడి ధనియాలపొడి, శనగపిండి, వాము జీలకర్ర పొడులు అన్నే కలిపి పొడుగాటి వంకాయలను తీసుకొని దానిని నిలువుగా నాలుగు పాయలుగా తరిగి మధ్యలో ఈ మసాలాను నూరి గిన్నెలో నూనె వేసి దానిలో వేసి వేయించి తీసిన గుత్తివంకాయ కూర రుచి అద్భుతం , అద్వితీయం. దీనిని తింటూవుంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లు ఉండదా చెప్పండి. 

ఇదికాక ఇటీవల కాలంలో అనేక విధాలైన వంకాయ కూరలు మన పాక శాస్త్రజ్ఞులు కనుగొన్నారన్నది అతిశయోక్తి  కాదు. వంకాయ గ్రేవీ కూర వంకాయ కారం కూర, వంకాయ మసాలా చల్లిన కూర అదోరకం కూర ఇదోరకం కూర అని అనేక అనేక కూరలను చేస్తున్నారు టీవీలలో చూపిస్తున్నారు. యూట్యూబులల్లో చూస్తూ చేస్తున్నారు కూడా 

వంకాయకూరకు దాసుడైన ఒక సినిమా దర్శకుడు తన సినిమాలో ఒక పాటను వంకాయమీద పెట్టి హీరో హీరోయిన్లతో నాట్యం చేయించిన విషయం తెలియని తెలుగువారు లేరు. 

వేద వ్యాసుడు మన తెలుగువారికి సరిగా న్యాయం చేయలేదు అని ఒక సుబ్బారావు ఒక రామారావుతో అన్నాడు. అదేమి పాపం వ్యాస భగవానులు వేదాలను విభజించి వేద వ్యాసుడుగా పేరొందారు, అష్టాదశ పురాణాలను వ్రాసారు, మహా భారతాన్ని రచించారు ఇంకా అయన చేయకుండా మిగిలింది ఏమిటి. ఇప్పటికి పండితులు వ్యాస ఉత్తిష్టం కానిది లేదంటుంటే  మీరు ఇంకా వ్యాసులవారు ఏదో వ్రాయలేదని అంటారేమిటని రామారావు అన్నాడు. దానికి సుబ్బారావు నీకు తెలియదా వంకాయ కూరను వ్యాసులవారు ముట్టుకోలేదు అని అసలు విషయం తెలిపాడు సుబ్బారావు. బలే వున్నది సుబ్బారావుగారు అయితే మీరు భారతం పూర్తిగా చదివినట్లు లేదు అని అన్నాడు రామారావు. భారతంలోనా ఎక్కడ చెప్పండి అన్నాడు. నేను చెప్పేది ఏముంది చాలా బాగా సుస్పష్టంగా వ్యాస భగవానులు వంకాయ కూరను వ్రాస్తేను అని అన్నాడు. అప్పుడు అదేమిటో తెలుసుకోవాలని కుతూహలం సుబ్బారావుకు కలిగింది. అయితే చెప్పండి మహాప్రభూ ఆ కథను అని అన్నాడు. 

అప్పుడు రామారావు సాక్షాతూ శ్రీ కృష్ణ భగవానుడిలాగా ఫోజు పెట్టి అర్జనునికి గీతను బోధిస్తున్నట్లుగా సుబ్బారావుకు చెప్పటం మొదలు పెట్టాడు. నాయనా లక్క  గృహ దగ్డం అయిన తరువాత కుంతీమాతతో సహా పాండవులు ఏకచ్చేక్రపురం అనే గ్రామంలో తలదాచుకున్నారు కదా అవును తెలుసు అన్నాడు అప్పుడు జరిగింది ఏమిటో తెలుసుకదా తెలుసు పాండవులు వున్న ఇంటివాని కుమారుని బకాసురునికి ఆహారంగా పంపటానికి ఆ తల్లిదండ్రులు బాధ పడుతూ బండిమీద బాలుని సాగనంపుతుంటే అవును సాగనంపుతుంటే కుంతీ మాత ఆ తల్లిదండ్రులకు ఊరట కలిగించి ఆ బాలునికి బదులుగా తన కుమారుని పంపుతానని భీముని పంపింది ఇందులో వంకాయ కూర ప్రసక్తి ఎక్కడవుందని సుబ్బారావు అన్నాడు. 

అప్పుడే నాయనా వంకాయకూర వచ్చింది అని రామారావు ఇలా చెప్పాడు. ఆ క్రితం రోజు ఊరివారంతా సమావేశమై బకాసురిని బారి నుంచి తప్పించుకోవటం మన వల్ల కాదు కనీసం వాడిని సమ్మోహితుణ్ణి అయినా చేసి కొంతకాలం వాడు మన ఊరివైపు రాకుండా చేద్దామని అందరు కలిసి వారిలో చక్కగా వంకాయ కూర వండగల సమర్థులను ఎంచుకొని ఒక బాండీ నిండా వంకాయ కూరను వండి మరుసటి రోజు బకాసురిడికి విందుగా పంపే బండిలోకి ఎక్కించారు. నిజానికి తల్లిగారు చెప్పినా బకాసురిడి వద్దకు వెళ్ళటానికి ఇష్టపడని భీముడుగారు ఆ వంకాయ కూర  ఘుమ ఘుమలు ఉరిస్తూవుంటే దానిని సంతృప్తిగా ఆరగించాలని తాను బకాసురిని వద్దకు వెళ్ళాడు. బకాసురుడు చూస్తూఉండగా ఆ కూరను అన్నంలో కలుపుకొని తింటూ వాడిని కూడా ఊరించాడని వాడు అది చూసి సహించక ఓరి మానవ నాకు ఆహారంగా తెచ్చిన వంకాయ కూరను నీవు ఆరగిస్తావా, తిని తిను నీవు తిన్నతరువాట్ నిన్ను నీ కడుపులోని వంకాయకురాను తినేది నేనే కదా అని హా హా కారాలు చేస్తూ భీముని మీద లంకిస్తే ఆకలితో వున్న బకాసురుని వంకాయ కూరను ఆరగించిన భీమసేనుడు అతి సునాయాసంగా  మట్టు పెట్టిన సంగతి అత్యంత రసవత్తరంగా వ్యాసభగవానులు వ్రాసారని దానిని నన్నయ భట్టారకుడు హ్రుద్యంగగా తెలుగించిన విషయం నీకు తెలియదటోయ్ అని సుబ్బారావుతో రామారావు అనేసరికి రామారావు నోరెళ్లపెట్టాడు. అవునండి మీరు చెప్పింది నిజమే వ్యాసభగవానులు వంకాయకూరకు ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇచ్చారు అని ఏదో కొత్త విషయం తెలుసుకున్నట్లుగా మొహం పెట్టి చెప్పాడు. దీనిని  బట్టి తెలిసేది యేమిటంటే వంకాయకూర ఈ నాటిది కాదు ఇతిహాసాల నాటిదని అర్ధమవుతుంది. అని అన్నాడు సుబ్బారావు.

అంతే కాదు సుబ్బారావు వంకాయకూర గురించి కధ ఒకటి అక్బర్ బీర్బలులది కూడా వున్నది అది నీకు తెలియదా అని ఆంటీ చెప్పు చెప్పు అని చెవులు నిక్కపొడుచుకొని వినటానికి సంసిద్దుడైనాడు  ఆ కధ ఏమిటంటే అని చెప్పసాగాడు రామారావు  ఒకసారి చక్కటి వంకాయకూరతో విందు భోజనం చేసిన అక్బరు బాదుషా ఆ ఆనందాన్ని తట్టుకోలేక బీర్బల్ తో బీర్బల్ వంకాయ కూర ఎంతరుచిగా ఉందొ తెలుసా వంకాయ కూర తినని వాడి జన్మ జన్మే కాదు అని అన్నాడట దానికి మన బీర్బల్ జహాపనా మీరు చెప్పింది నిజం వంకాయను కూరలలో రాజు అని పేరు.   అందుకే భగవంతుడు వంకాయను ప్రత్యేకంగా చూసాడు అంతేకాదు దాని తలమీద కిరీటాన్ని పెట్టాడు అని అన్నాడట. అట్లానా  అని బాదుషా బీరుబలును, వంకాయను మెచ్చుకున్నాడట.

సుబ్బారావూ  వంకాయకూర గురించి చెప్పాలంటే ఎంతసేపైనా పడుతుంది. నీకు తెలుసుకదా మన బెజవాడ బెంజ్ సర్కిలులొ వంకాయ విలాస్ అనే ఆంధ్రభోజాన హోటలు వుంది అది వంకాయ కూరకు పెట్టింది పేరు. ఆ హోటల్లో భజనం చేయని బెజవాడ వాస్తవ్యుడు లేదంటే నమ్మండి. ఇంట్లో భార్య వంట సరిగా చేయకపోతే వెంటనే వంకాయ విలాసకు వెళ్లి భోజనం చేసే పురుషపుంగవులు ఎంతమందో నీకు తేలుసా.   ఇటీవల భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకొవటంతో వాళ్లకు దొరికినప్పుడల్లా వంకాయ విలాస్ హోటలు నుంచి భోజనము తెప్పించుకొని తింటూవున్నారు. అందుకే ఇప్పుడు జొమాటో, స్విగ్గి లాంటి సంస్థలు తమ తమ వ్యాపారాలని వృద్దిచేసుకుంటున్నాయంటే దానికి కారణము వంకాయ కూర అంటే నమ్మండి అని అన్నాడు. . హైదరాబాదు నుండిబెజవాడమీదుగా తిరుపతి పెళ్లే యాత్రికులు ఒక పూట బెజవాడలో దిగి వంకాయ విలాసులో వంకాయ కూరతో భుజించి వెళ్ళటం పరిపాటి.  ఇటీవల బెజవాడ వంకాయ విలాస్ హోటలు వాళ్ళు హైదరాబాదులో డిలీషకానగరులో ఒక బ్రాంచి తెరిచారు.  అంతేకాదు మండపేటలో చాలా చోట్ల వీధి బండ్లమీదఁ వంకాయలో మసాలా పెట్టివంకాయ బాజ్జెలు చేస్తారు అవి ఒకసారి తింటే చాలు మళ్ళి మళ్ళి  తినాలనిపిస్తుంది.

మా వూళ్ళో నాగభూషణం అనే వకీలు ఒక ఆయన  అయన దగ్గరికి విడాకులు తీసుకోవటానికి వచ్చే దంపతులకు సర్దిచెప్పి భార్యకు వంకాయకురా మహత్యం చెప్పి చక్కగా వంకాయకూర చేయటం నేర్పించి అది వాళ్ళ భర్తలకు తినిపించమని సలహా ఇచ్చేవాడట అట్లా చేయటం వలన భార్య చేతి వంకాయ కూర తిన్న భర్త భార్యమీద ప్రేమను పెంచుకొని ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారని. ఇలా సలహా ఇచ్చినందుకు ఆయన వసులు చేసిన పీజులతో ఒక మూడు అంతస్తుల భవనం నిర్మించాడని దానికి వంకాయ నివాస్ అని పేరు పెట్టాడని చెపుతారు. ఈ విషయం తెలుసుకున్న అనేకమంది భార్యలు తమ తమ భర్తలను వశం చేసుకోవటానికి చక్కగా వంకాయ కూర చేయటం నేర్చుకొని వాళ్ళ భర్తలకు తినిపించి భర్తలను కొంగుకు కట్టుకుంటున్నారని ఒక వదన్తి. 

వకీళ్ళకే కాదు డాక్టర్లకు కూడా వంకాయ కూర కల్పవృక్షం లాంటిది అని రామారావు అన్నాడు అది యెట్లా అన్నాడు సుబ్బారావు నాకు తెలిసిన డాక్టరును నేను నీ ప్రాక్టీస్ ఇంత బాగా వృద్ధిలోకి రావటానికి కారణమ్ ఏమిటని అడిగాను.  దానికి ఆయన నీవు ఎవ్వరికీ చెప్పానంటే చెపుతాను అని నాతొ ప్రామిస్ చేయించుకొని మరి చెప్పాడు అది వంకాయ కూర అని అన్నాడు. అదేమిటి వంకాయ కూరకు నీ ప్రాక్టీసుకు ఏమిటి సంబంధం అని నేనన్నాను. వంకాయ కూర అందరు ఇష్టంగా తింటారా లేదా చెప్పు అన్నాడు తింటారు అని అన్నాను నేను. . అప్పుడేమవుతుంది, ఏమవుతుంది వంట్లో వాతం కఫం అజీర్తి పిత్తం అన్నే ముదిరి సంపూర్ణ ఆరోగ్యంగా వున్న వాడు కాస్త అడ్డం పడతాడు. వాళ్ళ వాళ్ళ వయసుని పట్టి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వారి వారి రోగాలు ఆధారపడతాయి. ఇక యెంత చెట్టుకు అంత గాలి అన్నట్లు యెంత రోగానికి అంత ఫీజు నేను వసులు చేస్తాను అని ఆ డాక్టరుగారు చెప్పారు. పేషంటు రాగానే వెంటనే సెలైన్ పెట్టి ముప్పైఆరు రకాల టెస్టులు చేయించి నలభై రకాల మందులు వ్రాసి నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉంచుకొని వేలు లక్షలలో ఫీజులు గుంజి వదిలి పెడతాను అని తన వృత్తి రహస్యం చెప్పాడు డాక్టరుగారు. ఎవ్వరికీ చెప్పనని ప్రమాణం చేసాను కాబట్టి నీకు మాత్రమే నేను చెపుతున్నాను అని అన్నాడు రామారావు.  

రామారావు  అంతటితో ఆగలేదు ఇంకా ఇట్లా చెప్పటం మొదలు పెట్టాడు. పెండ్లి చూపుల్లో పిల్లవాడి తల్లి అమ్మాయితో నీకు వంట వచ్చా సంగీతం వచ్చా, డాన్సు వచ్చా టైపింగ్ వచ్చా కంప్యూటర్ వచ్చా అని సవాలక్ష ప్రశ్నలు వేస్తూ వుంటారు కానీ సమర్థురాలైన పిల్లవాని తల్లి ఒకే ఒక ప్రశ్న వేస్తుంది. అదేమిటంటే అమ్మాయి నీకు వంకాయ కూర వండటం వచ్చా వస్తే వంకాయను ఎన్ని రకాలుగా వండుతారు చెప్పమని అడుగుతుంది. అని అన్నాడు. 

ఆ తరువాత రామారావు సుబ్బారావుని నీకు వంకాయలలో రకాలు తెలుసా అని అడిగాడు.  నాకు తెలియదు. అయితే విను మాములుగా మనకు తెలిసిన వంకాయ వంకాయ రంగు వంకాయలు అవి పొడుగుగా ఉంటాయి. అవి కాక గుండ్రటి వంకాయలు, తెల్ల గుండ్రటి వంకాయలు, చారల గుండ్రటి వంకాయలు, తెల్ల వంకాయలు, బొండం వంకాయలు, బజ్జే వంకాయలు ఇంకా కొన్ని కొత్త వంగడాలను మన శాస్త్రవేత్తలు కనిపెడుతున్నారని చెప్పాడు. 

పాఠక మిత్రమా ఇదండీ వంకాయ చెరిత్ర. ఇంకా ఈ రచయితకు తెలియని వంకాయ కూర గురించి మీకు తెలిస్తే చెపితే ఇంకా విస్తృతంగా ఈ రచను చేయగలడు. 

గమనిక: వంకాయను తప్ప ఇతర కూరలను నిందించటం ఈ రచయితా ఉద్దేశ్యం కాదు. కేవలం వంకాయ కూర ప్రాముఖ్యాన్ని తెలపటం మాత్రమే అని తెలుసుకోగలరు.  

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ వంకాయ కూర ప్రియుడు. 

చేరువేల భార్గవ శర్మ 





శుక్రాచార్యుడు

 రాక్షస గురువు శుక్రాచార్యుడు, అతను చెడును కదా ప్రోత్సహించేవాడు,మరి బృహస్పతి వంటి గురువుల కోవలోకి ఎలా చేర్చారు?


~~ జ్ఞానం మరియు తపస్సు :


~ శుక్రాచార్యుడు భృగు మహర్షి కుమారుడు. ఆయన బ్రహ్మ మానసపుత్రుడైన భృగువు వంశంలో జన్మించారు.


~ ఆయన వేదాలు, ధర్మశాస్త్రాలు, నీతిశాస్త్రాలు, రాజనీతి మరియు అనేక శాస్త్రాలలో అపారమైన పరిజ్ఞానం కలిగిన మహాజ్ఞాని. బృహస్పతి కూడా ఇదే విధంగా జ్ఞాన సంపన్నుడు.


~ అపారమైన తపస్సు చేసి, శివుని నుండి మృత సంజీవని విద్యను పొందారు. ఈ విద్య ఆయన గొప్ప శక్తికి, తపస్సుకు నిదర్శనం.


~ రాక్షసులకు గురువుగా ఉన్నప్పటికీ, ఆయన వారికి కేవలం యుద్ధ విద్యలను మాత్రమే కాకుండా, ధర్మాన్ని, రాజనీతిని బోధించారు. కొన్ని సందర్భాలలో, రాక్షసులు ధర్మం తప్పినప్పుడు వారిని మందలించడం లేదా శపించడం కూడా చేశారు ఉదా: యయాతి కథలో శాపం.


~~ గురువుగా అతని స్థానం - దైవత్వం:


~ హిందూ పురాణాలలో గురువు అనే పదానికి వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా విద్య, జ్ఞానం బోధించే పవిత్రమైన స్థానం ఉంది. శుక్రాచార్యుడు, బృహస్పతి ఇద్దరూ తమ శిష్యులయిన దేవతలు లేదా ఆసురులకు అత్యున్నతమైన జ్ఞానాన్ని బోధించారు, కాబట్టి వారిద్దరూ గురు పీఠానికి అర్హులే.


~ నవగ్రహాలలో, శుక్రుడు అంటే శుక్రాచార్యుడు మరియు గురుడు అంటే బృహస్పతి అత్యంత ముఖ్యమైన స్థానాలను కలిగి ఉన్నారు. శుక్రుడు సంపద, ఐశ్వర్యం, కళలు, ప్రేమకు అధిపతి. బృహస్పతి జ్ఞానం, బుద్ధి, శుభాలకు అధిపతి. ఇద్దరూ దైవత్వాన్ని పొందినవారు, అత్యున్నత శక్తి సంపన్నులు.


~~ రాక్షసులకు గురువుగా మారడానికి గల కారణం:


~ శుక్రాచార్యుడు మొదట్లో దేవతలకు లేదా మరే ఇతర పక్షానికి వ్యతిరేకి కాదు. ఆయన గురువైన అంగీరస మహర్షి తన కుమారుడైన బృహస్పతి పట్ల పక్షపాతం చూపించారనే భావనతో కలత చెందారు.


~ ముఖ్యంగా, విష్ణుమూర్తి ఒకానొక సందర్భంలో శుక్రాచార్యుని తల్లియైన కావ్యమాతను లేదా ఉశనస భార్యను చంపడం జరిగింది. ఆ పగతోనే శుక్రాచార్యుడు దేవతలపై కోపంతో అసురులకు గురువుగా ఉండాలని నిర్ణయించుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే, ఆయన వైరాగ్యానికి, అసురులకు మద్దతుగా నిలవడానికి వ్యక్తిగత కారణాలు, వైష్ణవంతో వచ్చిన విభేదాలు ఉన్నాయి, కానీ ఆయన స్వతహాగా "చెడు"ను ప్రోత్సహించేవారు కాదు, జ్ఞానాన్ని బోధించే గురువు.


~ శుక్రాచార్యుడు అసురులకు గురువుగా ఉన్నప్పటికీ, తన శిష్యుడైన కచుడికి ( బృహస్పతి కుమారుడు, దేవతల పక్షం ) కూడా పవిత్రమైన మృత సంజీవని విద్యను బోధించారు. ఇది ఆయనలోని గురు ధర్మానికి నిదర్శనం.


~~ ధర్మ పరిరక్షణ :


కొన్ని సందర్భాలలో, శుక్రాచార్యుడు శిష్యులకు పక్షపాతం చూపినా, ధర్మాన్ని నిలబెట్టడానికి కృషి చేశారు. ఉదాహరణకు, కచుడిని చంపి, మదిరలో కలిపి త్రాగడం ద్వారా జరిగిన అనర్థాన్ని గ్రహించి, ఆపైన రాక్షసులకు సురాపానాన్ని (మద్యం సేవించడాన్ని) నిషేధించారు. అలాగే, మహాబలి చక్రవర్తి వామనుడికి దానం చేసేటప్పుడు, ఆ దానం చేయడం సరైనది కాదని తెలిసినా, ధర్మబద్ధమైన దానం చేయడాన్ని ఆపడానికి యత్నించడం ఆయన రాజనీతిజ్ఞతను తెలియజేస్తుంది.


ముగింపులో,,,,, శుక్రాచార్యుడు రాక్షసులకు గురువైనప్పటికీ, ఆయన ఒక మహర్షి, అపారమైన జ్ఞాని, తపశ్శక్తి సంపన్నుడు. ఆయనలోని 'అసుర గురు' అంశం కేవలం దైవ-దానవ యుద్ధంలో ఒక పక్షాన్ని ఎంచుకోవడం వల్ల వచ్చింది తప్ప, ఆయన గురుత్వం లేదా జ్ఞానం తక్కువైనది కాదు. అందుకే, బృహస్పతి వలె ఆయన కూడా గురు పరంపరలో అత్యున్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నారు.

29, అక్టోబర్ 2025, బుధవారం

విభూతి ధారణ

 విభూతి ధారణ ప్రాముఖ్యత


విభూతిని ధరించి నప్పుడు మనకు ఈశ్వరుడు స్మరణకు వస్తాడు. బ్రహ్మ మన లలాటంపై లిఖించిన కీడు ఈశ్వరుని కరుణవలన తొలగి మన బాధలు నశిస్తాయి.


కనుక ప్రతివాడు ప్రాతఃకాలంలో లేచి స్నానాది కాలకృత్యాలు నెరవేర్చుకొని, ఫాలభాగంపై విభూతిని ధరించి సంధ్యావందనం, దేవతారాధనచేసి ఈశ్వరకృపకు పాత్రుడై దినచర్యలకు సమాయత్తం కావాలి.


విభూతి ధారణ పరమేశ్వరుని స్ఫురింపజేస్తుంది.


""విభూతిర్భూతిరైశ్వర్యమ్‌''


విభూతి అంటేనే ఐశ్వర్యం. లక్ష్మీ నిలయమైన గోవు పృష్ఠభాగాన్నుండి వెలువడే ఆవుపేడతో విభూతి తయారు చేసికోవాలి. లక్ష్మీ గోవు యొక్క పృష్ఠభాగంలో వున్నట్లే ఇతరదేవతలు కూడ గోవు యొక్క వివిధ శారీరక భాగాల్లో వుంటారు. కనుక గోమలానికి విశేషమైన ప్రాముఖ్యం వున్నది. దానినుండి తయారు కాబడే విభూతి సంపదకు చిహ్నం.


లక్ష్మీ ప్రధానంగా ఐదు ప్రదేశాల్లో నివసిస్తుంది. గోవు యొక్క పృష్ఠభాగం, వివాహిత స్త్రీ యొక్క పాపటభాగం, గజం యొక్క కుంభస్థలం, పద్మము, బిల్వదళాలు.


“వినా భస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయా ! పూజితో పి మహాదేవో నా భీష్ట ఫలదాయక!!


భస్మం నొసట మూడు రేఖలు ధరింపనిదే .రుద్రాక్ష మాలను కంతమున ధరింపనిదే శంకరుని పూజించినను భక్తుల కోరికలు నెరవేరవు.


అమరేశ్వరునికి ప్రీతిపాత్రమైన విభూతిని ధరించి అశుతోషుడైన పరమేశ్వరుని కన్నీటి ధార నుండి వెలువడిన రుద్రాక్ష ధారణ చేసి, ఎవరైతే శివప్రీతికరమైన పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారో వారిని అదృష్టం వెన్నంటి ఉంటుందంటారు.


విభూతి - భసితరి, భస్మ, క్షారము రక్షక పర్యాయ వాచక పదాలు. ఆణిమ, మహిమ, గరిమ, లఘుమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం, వశిత్వం అనే అష్టసిద్దులను బాసింపచేస్తుంది. కనుక భసితమైందనీ, పాపాలను భజించడంవల్ల భస్మమైంది. ఆపదల నుండి కాపాడడంవల్ల క్షారమైంది. భూత, ప్రేత పిశాచాది గ్రహ బాధల నుండి సర్వదా రక్షించేది కాబట్టి రక్ష అయ్యింది. ‘విభూతి’ని శరీరంపై పూసుకోవటంవల్ల తిర్వక్త్రిపుండ్రం పెట్టుకోవడంవల్ల స్నానం చేసిన ఫలం లభిస్తుందని వేద ప్రమాణముండడంచే సదానొసట విభూతిని ధరించి తీరాలని, మనం పూజా కార్యక్రమాలాంటివి చేయకపోయినా నిత్యం విభూతి ధరిస్తే శివపూజతో సమానమని మన శాస్త్రాలు ధృవీకరిస్తున్నాయి.


విభూతి ధారణవల్ల అజ్ఞాన స్వరూపమైన అవిద్య పూర్తిగా నశించి విద్యా స్వరూపమైన విజ్ఞానం సులభతరం అవుతుందని శృతులు తెల్పితే, విభూతి ధరించేవారు దీర్ఘవ్యాధులు లేకుండా పూర్ణాయుర్దాయ వంతులై జీవించి సునాయాస మరణాన్ని పొందుతారని, దుఃఖాలు, రోగాలు, తొలగి శుభాలను కల్గిస్తుందని పురాణాల ద్వారా మనకు విదితవౌతుంది.


విభూతి మూడు విధాలు. ‘శ్రౌతము’ అంటే చెప్పబడిన విధి విధానంతో, అంటే వేదములలో నిర్ణయింపబడినట్లుగా యజ్ఞ యాగాదులు చేసి, ఆ హోమాదులవల్ల ఏర్పడిన భస్మం. ‘స్మార్తము’ అంటే నిత్యాగ్ని హోత్రాదులు చేయగా ఏర్పడిన భస్మం. ‘లౌకికము’ ఆవు పేడను కాల్చడం ద్వారా తయారైన భస్మము. ఇలా మూడు విధాలైన భస్మములను పవిత్రమైన ‘విభూతి’గా భావిస్తారు.వైరాగ్యమునకు, నిర్లిప్తతకు ప్రతీకగా భస్మమును భావించి త్రిపుండ్ర ధారణ చేయుట సర్వోత్తమము.


సర్వసృష్టికి హేతుభూతమైన నిత్యచైతన్య శక్తికి చిహ్నంగా మనం విభూతిధారణ చేస్తాం. ప్రపంచంలో ప్రతివిషయం శివమయమని, అదేమనకు అంతిమలక్ష్యమని విభూతి విశదీకరిస్తుంది. ఒక వస్తువును కాలిస్తే, అది ముందు నల్లగా మారుతుంది. దానినింకా కాలిస్తే అది తెల్లటి బూడిదగా పరిణమిస్తుంది. దాన్ని ఇంకాకాల్చిన దానిలో మార్పు ఏమీ సంభవించదు. కనుక అన్నిరకాలైన దేహాల యొక్క చరమస్థితి బూడిద మాత్రమే. కనుక భౌతికరంగంలోని విభూతి ఆధ్యాత్మిక రంగంలో శివునితో సామ్యస్థితి కల్గియున్నది. విజ్ఞానమనే అగ్నిగుండంలో మనం ప్రతివస్తువును కాలిస్తే చివరకు మిగిలేది శివుడు లేక పరబ్రహ్మము మాత్రమే.

తానికాయ గురించి

 తానికాయ గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .

 

తానికాయని విభీతక , విభీతకి , కర్షఫల అని సంస్కృతంలో అంటారు.


  తానికాయ ఉపయోగాలు -

    

 * తానికాయ కారముగా , చేదుగా , వగరుగా ఉండును. 


 * తానికాయ వేడితత్వం కలది. కఫాన్ని హరించును . 

 

* నేత్రములకు మేలు చేయును . 

 

* వెంట్రుకలు ఆకాలంలో తెల్లబడుటను నిరోధించును. 


 * మధురాపక్వముగా , తేలికగా ఉండును. 


 * గొంతుబొంగురును పొగొట్టును. 


 * ముక్కురోగాలను నివారించును.


 * రక్తదోషమును నివారించును.


 * కంఠరోగమును పోగొట్టును .


 * బుగ్గన పెట్టుకుని రసం మింగుచున్న దగ్గు తగ్గును.


 * క్రిమి రోగాన్ని హరించును .


 * క్షయరోగాన్ని నివారించును .

 

* కుష్టురోగాన్ని హరించును .


 * తానికాయలోని పప్పు వెంట్రుకలకు అమిత హితమైనది.


 * తానిచెట్టు నుంచి తీసిన కల్లు కొంచం వేడి చేయును . కొంచం మత్తు కలిగించును. తేలికగా ఉండును. వ్రణరోగులు , పాండురోగులు , కుష్టురోగులు కి అనుకూలమైనది.

 

* తానికాయలో పప్పు దాహమును , వాంతిని , కఫమును హరించును .

 

* శరీరముకు తేలికగా ఉండును. వగరు కలిగి ఉంటుంది.

 

* తానికాయ తైలం మధురముగా ఉండును. శరీరముకు చలవ చేయును .

 

* తానికాయ తైలం ధాతువులను వృద్దిచేయును . కఫాన్ని పెంచును. వాతాన్ని, పిత్తాన్ని హరించును .

    

ఈ తానిచెట్టు చాలా పెద్ద వృక్షము . దీని ఆకులు ఇప్ప ఆకుల కన్నా కొంచం చిన్నవిగా ఉండును. పూలు గుత్తులుగా పూచి వేలాడుతుండును. కాయ ఆకారం పైన డిప్పవలవని జాజికాయ మాదిరిగా ఉండును.ఈ కాయలు ఫాల్గుణ మాసం మొదలు పండుట ఆరంభించును. చైత్రమాసంలో సంగ్రహించిన బాగుగా పండి సారవంతంగా ఉండును.బాగుగా పెరిగి పండిన కాయ ఒక తులము వరకు బరువు ఉండును. వాడుక యందు ఈ కాయ పైన బెరడు ఉపయోగిస్తారు. ఇది అరణ్యములలో ఉండును. గింజ లోపలి పప్పు నేత్రములకు అద్భుతంగా పనిచేయును .

   

*********** సమాప్తం ************* 


  మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .  


గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034