*
*శ్రీమద్భాగవతం - 29/42*
*బ్రహ్మమోహన లీల & బ్రహ్మదేవుని దివ్య స్తుతి*
ఓం నమో భగవతే వాసుదేవాయ!
మన భాగవత అధ్యయనం లో భాగంగా నిన్న అఘాసుర సంహారం వరకు వచ్చాం,ఈ అఘాసుర సంహారం కౌమార ప్రాయం లో జరిగితే ప్రౌగండ ప్రాయంలో గోపాలకులు బృందావనం లో చెప్పారు అని శుక మహర్షి అంటే అదేమిటి అంత కాలం వారు ఎందుకు దాచి ఉంచారు అని పరీక్షిత్తు మహారాజు అడిగాడు దానికి సమాధానంగా బ్రహ్మమోహన లీల గురించి చెప్పాడు శుక మహర్షి.
1. బ్రహ్మదేవుని భ్రమ & దూడలు-గోపబాలురు మాయమగుట
అఘాసురునీ సంహరించిన తరువాత శ్రీకృష్ణుడు గోపబాలురను, గోవులను యమునానది తీరానికి తీసుకుపోయి, ఇక్కడ పచ్చిక,నీరు సమృద్ధి గా ఉంది ఆవు, దూడలు నీరు త్రాగి, దానిని మేస్తాయి,
మధ్యాహ్న సమయం అయింది కనుక మనం కూడా చల్దులను ఆరగిద్దాం అన్నాడు.అందరూ తమ ఇళ్ల నుండి తెచ్చుకున్న చద్దన్నాలను ఆనందంగా తింటున్నారు.
యజ్ఞభోక్త అయిన పరమాత్మ గోపబాలురమధ్య గూర్చుండి, తన చతురోక్తులతో (హాస్యోక్తులతో) వారిని నవ్వించుచు చల్దులు ఆరగిస్తూ ఉన్నాడు ఎడమ అఱచేతియందు మీగడ పెఱుగుతో, నేతితో కలిపిన చల్టిముద్దను, వ్రేళ్లమధ్యలో ఊరగాయ ముక్కలను పెట్టుకొనెను. ఈవిధముగా కొనసాగుచున్న ఆయన బాల్యక్రీడలను స్వర్గలోకమునందలి దేవతలు ఆశ్చర్యానందములతో తిలకించిరి. గోప బాలురు లోకాన్ని మరచి శ్రీకృష్ణ లీలలలో మునిగి పోయారు.
ఇంతలో ఆవుధూడలు పచ్చని గడ్డి మేస్తూ దూరంగా ఉన్న వనం లోకి వెళ్ళిపోయాయి అప్పుడు శ్రీకృష్ణుడు తన చుట్టూ ఉన్న దూడలు కనిపించకపోవడాన్ని గమనించి, "నేను ఇప్పుడే వెళ్లి దూడలను వెతికి తెస్తాను"మీరు కంగారు పడకండి, హాయిగా చల్దులు ఆరగించండి అని చేతిలో చల్ది ముద్ద ఉంచుకొనే లేచాడు.
* నిజానికి ఇది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పరీక్ష. అఘాసుర సంహారం చేసిన సమయంలో దేవతలు చేసిన స్తుతులు విని "ఈ బాలుడు నిజంగానే పరమాత్మ అయితే, ఈయన మహిమను పరీక్షిస్తాను" అని భావించిన బ్రహ్మదేవుడు, గోపబాలురు మేపుతున్న దూడలన్నింటినీ అదృశ్యం చేసి ఒక గుహలో దాచిపెట్టాడు.
*ఎంత వెతికిన దొరకలేదు అడవి అంతటా వెతికాడు.కొంతసేపటికి తిరిగి వచ్చేసరికి బాలురు కూడా అదృశ్యమయ్యారు. దాంతో గోవులు, గోప బాలుర కోసం వెతుకుతూ అంతటా తిరిగాడు ఎక్కడా కనపడలేదు.
వనం లో ఎక్కడ జాడ కనపడక పోవడంతో
బ్రహ్మదేవుడే వీరందరినీ దాచిపెట్టాడని సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు తన దివ్యదృష్టితో క్షణంలో గ్రహించాడు.(ఆయన అప్పుడే వాటిని విడిపించ గల సమర్ధుడు కానీ బ్రహ్మగారికి తగులుకున్న మొహం మాయ తొలగాలి కదా అందుకే అలా చేయకుండా)
2. శ్రీకృష్ణుడే స్వయంగా అందరూ అగుట
గోపబాలురు, దూడలు లేకపోతే గోకులంలోని తల్లులు, గోవులు తీవ్రమైన శోకంతో కుమిలిపోతారు. వారిని కాపాడటం కోసం శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన లీల చేశాడు.
* తన దివ్య శక్తితో (మాయతో) పోగొట్టుకున్న ఆ గోపబాలురు ఎంతమంది ఉన్నారో, ఏ రూపాలతో, ఏ వస్త్రాలతో, ఏ అలంకారాలతో, ఏ స్వభావాలతో ఉన్నారో... అలాగే ఖచ్చితంగా వారందరి రూపాలను తానే స్వయంగా ధరించాడు! అలాగే అన్ని దూడల రూపాలను కూడా తానే అయ్యాడు.(సర్వం విష్ణుమయం జగత్ అను శృతి వాక్యం సార్ధకం చేశాడు)
దూడలను ఇండ్లకు మఱలింపుడు' అని ఆజ్ఞాపించె నాయకుడు, మఱలించే గోపబాలురు, మఱలే ఆవుదూడలు అన్ని తానేయై, శ్రీకృష్ణుడు తన దివ్యలీలలను ప్రసరింపజేయుచు, ఆడుచు, పాడుచు బృందావనమునకు చేరెను.
పరీక్షిన్మహారాజా! ఈవిధముగా శ్రీకృష్ణుడు బాలుర, దూడల రూపములలో మసలుచు గోపవాటికలో ప్రవేశించి, వారివారి దొడ్లలో ఆయా దూడలను యథాస్థానములకు చేర్చెను. గోపబాలుర రూపములతో వారి ఇండ్లలో ప్రవేశించెను
* అందరూ శ్రీకృష్ణుడే అయినప్పటికీ, ఎవరికీ ఆ విషయం తెలియలేదు. బాలురు ఇంటికి వెళ్లినప్పుడు వారి తల్లులకు కృష్ణునిపై ఉన్న ప్రేమే తన పిల్లలపై ఉప్పొంగింది. గోవులు కూడా ఆ దూడలను తమ సొంత దూడలుగా భావించి పాలిచ్చాయి. ఈవిధముగా చిన్నికృష్ణుడు బాలుర రూపములను, దూడల ఆకారములను దాల్చి, (ఆ బాలురను, ఆ దూడలను కాపాడుచుండుటయే గాక) తనను తాను రక్షించుకొనుచు, గోపాలకునివలె మసలుచుండెను. ఇట్లు ఆ స్వామి తన అద్భుతమైన మహిమచే బృందావనమునందును, వనమునందును దాదాపు ఒక ఏడాదిపాటు విహరించెను.
3. బ్రహ్మదేవుని ఆశ్చర్యం & సత్యదర్శనం
ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు "ఇప్పుడు ఆ గోపాలురు, దూడలు ఎలా ఉన్నారో చూస్తాను" అని సత్యలోకం నుండి గుహ వద్దకు వచ్చి చూశాడు.(ఆయనకు క్షణం కానీ భూలోక సమయం సంవత్సరం)అక్కడ వారు అలాగే గాఢ నిద్రలో ఉన్నారు.
వెంటనే బృందావనానికి వెళ్లి చూసేసరికి... అప్పుడు తాను ఏ బాలురైతే దాచిపెట్టాడో, అక్కడా అవే రూపాలతో, అదే సంఖ్యలో గోపబాలురు, దూడలు కృష్ణుడితో కలిసి ఆడుకుంటూ కనిపించారు!
* బ్రహ్మదేవుడు అయోమయంలో పడిపోయాడు. "అక్కడ గుహలో ఉన్నది వీరే కదా! మరి ఇక్కడ ఆడుకుంటున్నది ఎవరు?" అని అయోమయంతో ఆలోచిస్తుండగా...
* ఆడుకుంటున్న గోపబాలురు, దూడల అందరి ముఖాలలోనూ బ్రహ్మదేవునికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు యొక్క దివ్య తేజస్సు, చతుర్భుజ రూపాలు, శంఖ చక్రాలు సాక్షాత్కరించాయి!
* చూస్తుండగానే చరాచర సృష్టిలోని ప్రతి అణువు, సమస్త దేవతలు, బ్రహ్మ రుద్రాది మూర్తులు అందరూ శ్రీకృష్ణుని రూపంలోనే దర్శనమిచ్చారు.మిక్కిలి ఆశ్చర్యకరమైన ఈ దృశ్యమును గాంచి, బ్రహ్మదేవుడు నిశ్చేష్టుడాయెను. అతని పదకొండు ఇంద్రియములును (ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు) క్షోభకు గుఱియై చేష్టలు ఉడిగెను. ఆ జ్యోతిస్వరూపులముందు
అతడు (బ్రహ్మ) వ్రజభూమియొక్క అధిష్ఠానదేవతముందు
(శ్రీకృష్ణుని ముందు) ఒక బొమ్మవలె నిలిచిపోయెను.
బ్రహ్మదేవుని మొహాన్ని, అశక్తతను తెలుసుకుని తన మాయ తొలగించాడు స్వామి,(తాను తీసుకున్న ఆ గోవు,గోపాలుర రూపాలు వెనక్కి తీసుకున్నాడు)
అప్పుడు మృతి చెందిన జీవుడు సజీవుడు అయినట్టు అతి కష్టం మీద బ్రహ్మగారు తేరుకుని, బృందావనం చూశాడు, శ్రీ కృష్ణ పాదాస్పర్శ చేత అక్కడి పక్షులు, పశువులు , మృగాలు అన్ని వైర భావం వీడి స్నేహ భావంతో ఉండటం చూసి మొహం తొలగి..
4. బ్రహ్మదేవుని సాష్టాంగ నమస్కారం & పశ్చాత్తాపం
బ్రహ్మదేవుడు తన అహంకారాన్ని విడిచిపెట్టి, శ్రీకృష్ణుని చరణాల వద్ద సాష్టాంగ నమస్కారం చేశాడు. కన్నీళ్లతో స్వామి పాదాలను అభిషేకించి, లేవలేక అలానే కూర్చుని పరమ పవిత్రమైన 'బ్రహ్మస్తుతి' చేశాడు:
"ఓ పరమాత్మా! నీవు సమస్త ప్రాణులకు ఆత్మవు, నిత్యుడవు, పరమేశ్వరుడవు! నిన్ను పరీక్షించాలనే నా అజ్ఞానాన్ని క్షమించు. నా తపస్సు, నా సృష్టి శక్తి నీ మాయ ముందు కేవలం ఒక చిన్న దీపపు కాంతి వంటిది. నన్ను నీ దాసుడిగా అనుగ్రహించు!"
5. బ్రహ్మదేవుని నిష్క్రమణ & గోపబాలుర ప్రత్యక్షత
శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని ప్రార్థనకు ప్రసన్నుడై చిరునవ్వు నవ్వి, ఆయన గర్వాన్ని పోగొట్టి: "బ్రహ్మదేవా! వెళ్ళి నీ సృష్టి కర్తవ్యంలో నిమగ్నమవ్వు" అని ఆశీర్వదించాడు. బ్రహ్మదేవుడు ప్రదక్షిణ చేసి సత్యలోకానికి వెళ్లిపోయాడు.
అప్పుడు కృష్ణుడు గుహలో దాచబడిన నిజమైన గోపబాలురను, దూడలను బయటకు తీసుకువచ్చాడు. బ్రహ్మదేవుడు వారిని దాచిన కాలమంతా వారికి ఒక నిమిషంలాగా గడిచింది. అందరూ కలిసి పూర్వం వలె, బ్రహ్మ దేవుడు మాయం చేసినపుడు శ్రీకృష్ణుడు ఎలా చేతిలో ముద్ద పట్టుకుని ఉన్నాడో అలానే ఆవు దూడల కోసం వెతుకుతూ వెళ్ళి వాటిని తీసుకుని వస్తున్న కృష్ణుడు ఆ గోపబాలురకు దర్శనం ఇచ్చాడు,ఆ గోప బాలురు అలాగే చల్దులు ఆరగిస్తూ ఉన్నారు. కృష్ణుడు దరహాసం చేయుచు వారితో చల్దులు ఆరగించాడు(వారికి మద్యలో జరిగింది ఏది గుర్తుకు లేదు)ఆ ప్రభువు వారికి అఘాసురుని శరీరం చూపి వనం నుండి బృందావనం కి బయలు దేరాడు
పల్లెకు చేరిన పిమ్మట గోపకుమారులు 'అరణ్యములో ఒక కొండచిలువ మమ్ములను మ్రింగివేసినది. అంతట యశోదమ్మ ముద్దుల కొడుకైన మన కన్నయ్య ఆ మహాసర్పమును చావగొట్టి, మమ్ములను రక్షించెను!' అని అంతటను చాటిచెప్పిరి.
మహాత్మా! గోపాలురకును, గోపవనితలకును ఇంతవఱకూ తమ సంతానము పైగూడ కలుగనట్టి ఇంతటి ప్రేమ యశోదానందుల కుమారుడైన కృష్ణయ్యపై ఎట్లు కలిగెను? దయతో తెల్పుము”.అని అడగ్గా
మహారాజా! లోకములోని సమస్త ప్రాణులకును తమ సంతానము, గృహము, బంగారము మొదలగువాటి కంటెను తమ 'ఆత్మయే' మిక్కిలి ప్రీతికరము. సకలజీవులకు తమ ఆత్మపై ఉన్నంతప్రేమ, మమకారముతో పెనవైచుకొనిన తమ పుత్రులపైగాని, ధనముమీదగాని, ఇండ్లు మొదలగువాటి పైగాని ఉండదు. అందుకే ఆత్మ స్వరూపుడు అయిన పరమాత్మ యందు వారిని అంతటి ప్రీతి,ఆ ప్రేమ అనే మాయలో వారిని ఉంచి ఇన్ని లీలలు చేసాడు స్వామి. ఆయన్ని నమ్మితే ఏదైనా సాధ్యమే.... శ్రీ కృష్ణ శరణం మమ
📝 నేటి ముఖ్య విషయాలు:
* సర్వాంతర్యామి తత్త్వం: బృందావనంలో గోపబాలురుగా, దూడలుగా సంచరించింది సాక్షాత్తు పరబ్రహ్మమే. భగవంతుడు మనలో, మన చుట్టూ ఉన్న ప్రతి రూపంలోనూ ఉన్నాడనే సత్యానికి బ్రహ్మమోహన లీల నిదర్శనం.
* అహంకార వినాశనం: బ్రహ్మదేవుడైనప్పటికీ, పరమాత్మ తత్త్వాన్ని పరీక్షించాలని చూస్తే భ్రమలో పడక తప్పదు. కేవలం శరణాగతి మాత్రమే భగవంతుని చేరుస్తుంది.
* జీవ-బ్రహ్మ అభేదం: గోపబాలురే సాక్షాత్తు పరమాత్మ రూపాలు కావడం ద్వారా, జీవునికి పరమాత్మకు భేదం లేదనే అద్వైత సిద్ధాంతాన్ని భాగవతం చాటుతుంది.
ఎంత రాసిన అరె ఇంకా చెప్పాల్సినది ఉన్నదీ కదా,ఈ విషయం కూడా చెప్తే బాగుండేది అనిపిస్తూ ఉంటాయి శ్రీకృష్ణ లీలలు ప్రతి శ్లోకానికి అర్దం ఇవ్వలేను కదా అందుకే ఏదో స్వామి ఇంతే అనుగ్రహించాడు అని తృప్తి చెందడం అంతే కానీ సర్వ వ్యాపి అయిన పరమాత్మ లీలలు సంపూర్ణంగా చెప్పటం, వివరించడం సాధ్యమేనా అసాధ్యం...
....సశేషం
🙏🌹🙏
🙏*న్యాయపతి*🙏
*నరసింహారావు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి