18, ఆగస్టు 2026, మంగళవారం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



శ్రీ భగవానువాచ ।

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ ।

అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ।। 35 ।।



ప్రతిపదార్థ:


శ్రీ భగవాన్ ఉవాచ — శ్రీ కృష్ణ పరమాత్మ పలికెను; అసంశయం — నిస్సందేహముగా; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; మనః — మనస్సు; దుర్నిగ్రహం — నిగ్రహించుటకు కష్టమైనది; చలం — చంచలమైనది; అభ్యాసేన — అభ్యాసం చేత; తు — కానీ; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; వైరాగ్యేణ — వైరాగ్యముచే; చ — మరియు; గృహ్యతే — నియంత్రించవచ్చు.



తాత్పర్యము: 


శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు: ఓ మహా బాహువులుగల కుంతీ పుత్రుడా, నీవు చెప్పింది నిజమే; మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ, అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు.



వివరణ:


శ్రీ కృష్ణుడు అర్జునుడి మాటలకు జవాబు చెప్తూ, అతన్ని 'మహాబాహో' అంటే ‘గొప్ప బాహువులు కలవాడా.’ అని అంటున్నాడు. దాని అర్థం ఏమిటంటే, ‘ఓ అర్జునా, నీవు యుద్ధములో అత్యంత సాహాసోపేత వీరులను ఓడగోట్టావు, ఈ మనస్సుని ఓడించలేవా?’ అని.


శ్రీ కృష్ణుడు, ఇలా, ‘అర్జునా, ఏంటి అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నావు? మనస్సుని సునాయాసముగా నియంత్రించవచ్చు.’ అని చెప్పి ఈ సమస్యను ఖండించలేదు. పైగా, నియంత్రించటానికి మనస్సు నిజంగా క్లిష్టతరమైనది అన్న అర్జునుడి మాటలతో ఏకీభవించాడు. కానీ, ప్రపంచంలో కష్టతరమైన పనులు ఎన్నో ఉన్నాయి, అయినా మనం అధైర్య పడకుండా ముందుకు సాగుతాము. ఉదాహరణకి, సముద్రం ప్రమాదకరమైనది మరియు భయంకర తుఫానులు వచ్చే అవకాశం ఉంటుంది అని నావికులకు తెలుసు. అయినా, ఒడ్డునే ఉండిపోయేలా చేయటానికి ఈ కారణాలు వారికి తగినట్టు ఎప్పుడూ అనిపించలేదు. కాబట్టి, శ్రీ కృష్ణుడు, అర్జునుడికి, వైరాగ్యము మరియు అభ్యాసము ద్వారా మనస్సుని నియంత్రించవచ్చు అని హామీ ఇస్తున్నాడు.


వైరాగ్యము అంటే ఆంగ్లములో డిటాచ్మెంట్ (detachment). అనంతమైన పూర్వ జన్మల నుండీ ఉన్న మమకారాసక్తుల చేత, మనస్సుకు, తనకు అనురక్తి ఉన్న వస్తువిషయముల దిశలో పరుగులు పెట్టడం అలవాటైపోయింది. ఈ మమకార-ఆసక్తిని తీసివేయటం అనేది మనస్సు యొక్క అనవసరమైన పరిభ్రమణాన్ని నిర్మూలిస్తుంది.


అభ్యాసము అంటే ఆంగ్లములో ప్రాక్టీసు (practice). అంటే, పాత అలవాట్లను మార్చి, కొత్త వాటిని పెంపొందించుకునే ఏకాగ్రతతో కూడిన పరిశ్రమ. అభ్యాసము అనేది సాధకులకు ఒక ముఖ్యమైన పదం. సమస్త మానవ పరిశ్రమలలో, నైపుణ్యానికి, ప్రావీణ్యతకి, శ్రేష్ఠతకి దారితీసే ప్రముఖ విషయం ఈ అభ్యాసమే. ఉదాహరణకి ఒక అతి సామాన్య విషయమైన టైపింగ్ తీసుకోండి. మొదటి సారి టైపింగ్ ప్రారంభిస్తున్నప్పుడు, ఒక నిమిషానికి ఒక పదమే టైపు చేయగలుగుతారు. కానీ, ఒక సంవత్సరం టైపు చేసిన తరువాత, వారి చేతివేళ్లు సునాయాసంగా తిప్పుతూ నిమిషానికి ఎనభై పదాలు టైపు చేయగలుగుతారు. ఈ నైపుణ్యం కేవలం అభ్యాసం ద్వారానే సాధ్యము. ఇదే విధంగా, మూర్ఖమైన మరియు అల్లకల్లోలమైన మనస్సుని అభ్యాసము ద్వారా ఆ భగవంతుని చరణారవిందముల పైనే నిలుపాలి. మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరంగా తీయాలి - ఇదే వైరాగ్యము - మరియు - మనస్సుని భగవంతుని మీదే నిలుపాలి - ఇది అభ్యాసము. పతంజలి మహర్షి ఇదే ఉపదేశం చెప్పాడు:


అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః (యోగ దర్శనం 1.12)


‘నిరంతర అభ్యాసము, వైరాగ్యముల ద్వారా మనస్సు యొక్క ఆందోళనలను నియంత్రించవచ్చు.

పాదారవింద శతకం - 2*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 49*


*భవాంభోధౌ నౌకాం జడిమవిపినే పావకశిఖా-*

*మమర్త్యేంద్రాదీనామధిముకుటముత్తంసకలికామ్ ।*

*జగత్తాపే జ్యోత్స్నామకృతకవచఃపంజరపుటే*

*శుకస్త్రీం కామాక్ష్యా మనసి కలయే పాదయుగలీమ్ ॥*


*భావము :*


*తల్లీ! ఈ సంసారము ఒక మహా సాగరమైతే, దానిని దాటించే నౌక నీ పాదములు. మా బుద్ది హీనతను తొలగించే, ఔషధము నీ పాదములు. దేవతల కిరీటమునకు అలంకారములు, నీ పాదములు. వేదములనే పంజరములోని ఆడ చిలుక నీ పాదములు. అలాంటి పాద యుగళమును ధ్యానిస్తాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

17, ఆగస్టు 2026, సోమవారం

దాంపత్యం

 *దాంపత్యం*

               ➖➖➖✍️


▪️దాంపత్యం అంటే ఫోటోలలో నవ్వుతూ కనిపించే రెండు ముఖాల కథ కాదు. ఒకే ఇంట్లో వేలసార్లు మనస్పర్థలు వచ్చినా, బయటివారికి తెలియకుండా మళ్లీ మళ్లీ కలిసిపోయే రెండు హృదయాల ప్రయాణమే దాంపత్యం.`


`▪️ ```భార్యాభర్తల మధ్య ప్రేమ మాత్రమే ఉండదు. కోపం ఉంటుంది. అహంకారం ఉంటుంది. బాధ ఉంటుంది. రోజుల తరబడి మాట్లాడుకోని మౌనం కూడా ఉంటుంది. “ఇతను ఎప్పటికీ మారడు” అనే భార్య వేదన ఉంటుంది. “ఆమె నన్ను అర్థం చేసుకోవడం లేదు” అనే భర్త మనోవేదన కూడా ఉంటుంది.`


`▪️అయినా చూడండి... అదే భార్య, భర్త ఆలస్యంగా ఇంటికి వస్తే తలుపు తెరుచుకున్న శబ్దానికి మేల్కొంటుంది. అదే భర్త, భార్య భోజనం చేయలేదని తెలిస్తే.. కోపంలో ఉన్నప్పటికీ ఆమె ముందు భోజనం పెడతాడు.`


`అదే దాంపత్యం!`


`▪️పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు సందడిగా ఉంటుంది. వారి చదువు, పెళ్లి, ఉద్యోగం, పిల్లలు... ఇలా వారి జీవితాల్లో తల్లిదండ్రులు పూర్తిగా మమేకమైపోతారు. కానీ ఒక రోజు పిల్లలు తమ తమ జీవితాల్లో ముందుకు వెళ్లిపోతారు. ఇల్లు క్రమంగా నిశ్శబ్దమవుతుంది.అప్పుడు మిగిలేది ఇద్దరే.`


`▪️ఒకప్పుడు చిరాకుగా అనిపించిన అదే గురక, ఒకరోజు వినిపించకపోతే కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది. “ఇంకా మాట్లాడొద్దు” అని మందలించిన అదే స్వరం, ఒకరోజు శాశ్వతంగా వినిపించకపోతే ఇంటి గోడలే వెలితిగా అనిపిస్తాయి. ఒకరు దూరమైన తర్వాత చాలామంది వచ్చి ఓదార్పు మాటలు చెబుతారు. కానీ రాత్రి మంచం మీద ఖాళీగా మిగిలిన ఆ స్థలాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. మందు ఇచ్చే చేయిని, “భోజనం చేశావా?” అని అడిగే స్వరాన్ని, కోపంలోనూ దాగి ఉన్న ఆప్యాయతను ఎవరూ తిరిగి తీసుకురాలేరు.`


`▪️అందుకే గుర్తుంచుకోండి... అత్యుత్తమ జంట అంటే ఎప్పుడూ గొడవపడని జంట కాదు. గొడవల తర్వాత కూడా ఒకరినొకరు విడిచి వెళ్లని జంటే నిజమైన దాంపత్యానికి నిదర్శనం.`


`▪️దాంపత్యంలో ప్రేమకంటే గొప్పది అన్యోన్యత. అన్యోన్యతకంటే గొప్పది సహనం. సహనం కంటే గొప్పది... చివరి వరకు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలనే మనసు.`


`▪️చిలిపితనం, సిగ్గు, గొడవలు, మౌనం, కష్టాలు, సుఖాలు, కన్నీళ్లు, నవ్వులు, పరస్పర అవగాహన—ఇవన్నీ కలిసి దాంపత్యాన్ని పవిత్రంగా నిలబెడతాయి.`


`▪️ ```జీవించి ఉన్నప్పుడే జీవిత భాగస్వామి విలువను గుర్తించండి. ఎందుకంటే వారు లేనప్పుడు కార్చే కన్నీటి కంటే, వారు ఉన్నప్పుడే చూపే ప్రేమ, గౌరవం, ఆదరణ మరింత పవిత్రమైనవి.`


🔷*గుర్తుంచుకోండి......*


`▪️జీవితంలో పరిపూర్ణమైన జీవిత భాగస్వామి ఎవరూ దొరకరు. కానీ ఒకరి లోపాలను మరొకరు అంగీకరించి, చివరి వరకు చేయి విడవకుండా కలిసి నడిచే జీవిత భాగస్వామి కంటే గొప్ప అదృష్టం మరొకటి లేదు.✍️ 


🕉️*మీరు చేసుకునే పుణ్య + పాప కర్మల్ని బట్టే - మీకు భార్యగా, జీవిత భాగస్వామిగా - తల్లిగా - తండ్రిగా - సోదరుడిగా - తనయుడు గా -కుమార్తెగా -మీయింటి పశువుగా -కుక్కగా వస్తుంది. ఏరూపంలో నైనా రావచ్చు. అందుకే: మీరు చేసే పనులు సక్రమంగా -చక్కగా చెయ్యండి. అందర్నీ ప్రేమగా చూడండి. అన్నీ బాగానే జరుగుతాయి. ఇక్కడ భగవంతుడు తప్ప వేరే ఏమీలేదు+ ఎవ్వరూ లేరు. అందర్నీ భగవంతుని స్వరూపాలుగానే చూడండి. అన్నీ బాగానే జరు గుతాయి*.✍️

.

శంకరంబాడి సుందరాచారి

  ఆధునిక తెలుగు కవులలో సుందరకవి గా , భావకవిగా , ప్రసన్న కవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారి జయంతి 10 ఆగష్టు. ఆ మహానుభావున్ని గుర్తు చేసుకుంటూ.. 

హైదరాబాద్‌లో 1975 ఏప్రిల్ 12న ఉగాదినాడు తొలి తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమై ఆరురోజుల పాటు వైభవంగా జరిగాయి. ఆ సభ ప్రారంభంలో మా తెలుగుతల్లికి గీతాన్ని ఆలపించడానికి టంగు టూరు సూర్యకుమారిని ఇంగ్లండ్ నుంచి పిలిపించి పాడించారు. ఆ సమయంలో సదరు గేయకర్త ఎవరు అనే ప్రశ్న అక్కడున్న వారికి వచ్చింది. అక్కడే సభలో దూరంగా వెనుకవైపు ఒక వ్యక్తి చిరిగిన బట్ట లతో, దయనీయ స్థితిలో నిలబడి ఉన్నాడు. ఆయ నెవరో కాదు శంకరంబాడి సుందరాచారి. అక్క డున్న కొంతమంది ఆయనను గుర్తించారు. వేదికపై ఉన్న మహాసభల నిర్వాహకులు మండలి వెంకట కృష్ణారావు స్వయంగా సుందరాచారిని వేదికపైకి తీసుకెళ్లి సత్కరించి, ప్రభుత్వం తరపున 250 రూపాయల జీవితకాల గౌరవవేతనం ప్రకటించింది.

ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించినధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా ఎదురు ప్రశ్నించింది శంకరంబాడి సుందరాచారి. 

తన పై ఉన్నతాధికారి తిరుపతికి వచ్చి చేతి సంచిని అందివ్వబోతే తిరస్కరించి, ఆఫీసు జవానుకు, ఇన్‌స్పెక్టరుకు తేడా తెలియని వ్యక్తి విద్యాశాఖలో ఉండటం గర్హనీయమంటూ వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆత్మాభిమానం ఆయనది.

 ఉద్యోగం కోసం, హోదా కోసం, పేరు కోసం ఎవరినీ యాచించని, చేయిచాపని ఈ గుణం వల్లే జాతి మాతకు మల్లెపూదండలు గుచ్చి రచించిన ఆ రసరమ్య గీతకర్త ఎవరో కూడా దశాబ్దాల పాటు కనుమరుగైపోవడం నాటి చరిత్ర.

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా 10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లె బెసెంట్ థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చదువు పూర్త య్యాక తిరుపతిలోనే ఆంధ్రపత్రిక కార్యాలయంలో చేరి ఉపసంపాదకుడి స్థాయికి ఎదిగాడు. కళావని శీర్షికతో ఆం ధ్రపత్రికలో తను రాసిన వ్యాసాలు మం చి గుర్తింపు పొందాయి. 1939 లో చిత్తూరు బోర్డు హైస్కూలులో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మధ్యలో రెండేళ్లు సెలవు పెట్టి చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో దీన బంధు చిత్రానికి మాటలు, పాటలు రాశారు. 

తర్వా త జూనియర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా లభించిన పదవిని సైతం విద్యాశాఖ డెరైక్టర్ చేతి సంచినిచ్చి అవమానించినందుకు నిరసనగా వదిలే సుకున్నారు. 

తన పన్నెండో ఏటనే తెలుగులో కవి త్వం రాయటం ప్రారంభించిన సుందరాచారి గేయ, గీత, బుర్రకథ, నాటక, ఖండకావ్య, కథారచనలే కాక, వేలాది ఉపన్యాసాలు కూడా చేశారు. 

నాస్వా మి, గీతాంజలి వంటి కావ్యరచనలు, కెరటాలు, సుందర సుధాబిందువులు వంటి ఖండకృతులు, గాలిమేడలు, అరాచకం వంటి దృశ్య కృ తులలో నాటకాలు, బుద్ధగీత, ఏకలవ్యు డు వంటి ప్రబోధ రచనలు, శాంతి దూ తలు, రంగిరాస్యం వంటి జానపద రచ నలు చేశారు.

ఎన్ని రచనలు చేసినప్పటికీ వీరి ప్రతిభకు తార్కాణంగా నిలిచిన రచనే ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’. భారతదేశానికి ‘జనగణమన’ జాతీయ గీతమైనట్లే, ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ తెలుగు జాతికి రాష్ట్రగీతమైంది. 1975లో జరిగిన తొలి తెలుగు ప్రపంచ మహా సభలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి, విద్యాలయాల తరగతులు ప్రారంభించ డానికి ముందు విధిగా పాడాలని ఆదేశించింది.

 సుందరాచారి చివరిరోజులు చాలా దుర్భ రంగా గడిపారు. తిరుపతి వీధుల్లో బికారిగా తిరు గుతూ జీవించారు. చివరి దశలో తన శిష్యుడు మన్న వ భాస్కరనాయుడు ఇంట్లో ఉండేవారు. అనారో గ్యంతో 1977 ఏప్రిల్ 8న తుదిశ్వాస వదిలారు. మా తెలుగుతల్లికి మల్లెపూదండ గేయం తెలుగు ప్రజలు పాడుకుంటున్నంత కాలం ఆయన ఏనాటికైనా తెలు గువారికి చిరస్మరణీయుడే. ....,

ఎన్నడూ కీర్తి ప్రతిష్టలు ఆశించక నిరాడంబరుడిగా సాహిత్య సేవలే జీవితలక్ష్యంగా వ్యక్తిగత జీవితంతో నిరంతరం పోరాటం సాగించిన సుందరా చారి ఆయన వ్రాసిన ”మా తెలుగు తల్లికి ప్రార్థనా గీతం మన తరంతరం నిరంతరం ఆలపిస్తాము. ఆయన ప్రతి తెలుగువారి హృదయాలలో శాశ్వత స్థానం పొందారు.

నమస్కార – విధానము

  ⚘ నమస్కార – విధానము ⚘ 🙏


“నమః” అంటే ఏమిటి?


• “నమః” అనే పదానికి శరణాగతి, సమర్పణ, అహంకారత్యాగం అనే గంభీరమైన భావాలు ఉన్నాయి.


• భగవంతుని ఎదుట నమస్కరించేటప్పుడు “నేను నీ శరణు పొందాను; నీవే నా ఆధారం” అనే భావన మనస్సులో ఉండాలి.


• నమస్కారం కేవలం శరీరాన్ని వంచే శారీరక చర్య కాదు. మనస్సు, వాక్కు, శరీరం — ఈ మూడింటినీ భగవంతునికి సమర్పించే సాధన.


నమస్కారంలోని అంతరార్థం ~


• నమస్కారం ద్వారా మనిషిలోని అహంకారం తగ్గి, వినయం పెరుగుతుంది.


• “నేనే చేశాను”, “నాకే అన్నీ తెలుసు” అనే అహంభావానికి బదులుగా “నీవే కర్త, నీవే రక్షకుడు, నేను నీ శరణాగతుడను” అనే భావన కలగాలి.


• వినయం ద్వారా సేవాభావం, సేవాభావం ద్వారా భక్తి, భక్తి ద్వారా భగవంతునిపై ప్రేమ మరియు ఆరాధనాభావం పెరుగుతాయి.


🙏 నమస్కారం — మూడు విధాలు ~


• కాయిక నమస్కారం: శరీరంతో చేసే నమస్కారం. చేతులు జోడించడం, శిరస్సు వంచడం, సాష్టాంగం లేదా పంచాంగంగా ప్రణామం చేయడం ఇందులోకి వస్తాయి.


• వాచిక నమస్కారం: “నమః”, “నమస్కారం” అని పలకడం, దేవతా నామస్మరణ, స్తోత్రపఠనం మొదలైన వాటి ద్వారా భక్తిని వ్యక్తం చేయడం.


• మానసిక నమస్కారం: శరీరంతో నమస్కరించే అవకాశం లేకపోయినా, మనస్సులో భగవంతుని స్మరించి “భగవంతుడా! నీకు నా నమస్కారం” అని భావించడం.


కాయక నమస్కారంలోని నాలుగు విధానాలు ~


• అష్టాంగ నమస్కారం


• పంచాంగ నమస్కారం


• త్ర్యంగ నమస్కారం


• ఏకాంగ నమస్కారం


అష్టాంగ నమస్కారం ~


ఉరసా శిరసా దృష్ట్యా

మనసా వచసా తథా ।

పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం

ప్రణామోఽష్టాంగ ఉచ్యతే ॥


• ఈ శ్లోకంలో వక్షస్థలం, శిరస్సు, దృష్టి, మనస్సు, వాక్కు, రెండు పాదాలు, రెండు చేతులు, రెండు చెవులు — ఈ ఎనిమిది అంగాల సమర్పణతో చేసే ప్రణామాన్ని అష్టాంగ నమస్కారం అంటారు.


• కొన్ని సంప్రదాయాల్లో శరీరాన్ని నేలకు తాకించే అంగాలను శిరస్సు, వక్షస్థలం, రెండు చేతులు, రెండు మోకాళ్లు, రెండు పాదాలుగా వివరించి, దృష్టి–మనస్సు–వాక్కును అంతరంగ సమర్పణగా భావిస్తారు.


• అందువల్ల సాష్టాంగ నమస్కారం అంటే కేవలం శరీరాన్ని నేలపై ఉంచడం కాదు; సర్వాంగ సమర్పణ భావంతో భగవంతుని శరణు పొందడం.


పంచాంగ నమస్కారం ~


• శిరస్సు, చేతులు, మోకాళ్లు మొదలైన ఐదు ప్రధాన అంగాల సమర్పణతో చేసే నమస్కారాన్ని పంచాంగ నమస్కారం అంటారు.


• శారీరకంగా సాష్టాంగ నమస్కారం చేయలేని సందర్భాల్లో ఈ విధానాన్ని అనుసరించే ఆచార సంప్రదాయాలు ఉన్నాయి.


• ఇందులో శరీర భంగిమ కంటే భక్తి, వినయం, శరణాగతి భావమే ముఖ్యమైనది.


త్ర్యంగ నమస్కారం ~


• రెండు చేతులను జోడించి తలపై ఉంచి నమస్కరించడం త్ర్యంగ నమస్కారంగా కొన్ని ఆచార సంప్రదాయాల్లో వివరించబడుతుంది.


• చేతులు జోడించడం, శిరస్సు వంచడం ద్వారా భక్తి మరియు గౌరవాన్ని వ్యక్తపరుస్తారు.


ఏకాంగ నమస్కారం ~


• తలను మాత్రమే వంచి నమస్కరించడం ఏకాంగ నమస్కారం.


• సంపూర్ణంగా నమస్కరించడానికి అవకాశం లేని సందర్భంలో ఈ విధంగా గౌరవాన్ని వ్యక్తపరచవచ్చు.


• సాధ్యమైనప్పుడు చేతులు జోడించి, వినయపూర్వకంగా నమస్కరించడం శ్రేయస్కరం.


గురువుకు నమస్కారం ~


«వ్యత్యస్తపాణినా కార్యమ్

ఉపసంగ్రహణం గురోః ।

సవ్యేన సవ్యః స్ప్రష్టవ్యో

దక్షిణేన చ దక్షిణః ॥»


• మనుస్మృతిలో గురువును గౌరవించే సందర్భంలో గురువు పాదాలను విధిగా స్పృశించి నమస్కరించే సంప్రదాయం ప్రస్తావించబడింది.


• కుడిచేతితో గురువు కుడిపాదాన్ని, ఎడమచేతితో గురువు ఎడమపాదాన్ని స్పృశించే విధానం అని భావం.


• కేవలం పాదస్పర్శ మాత్రమే కాదు; “గురుదేవా! మీ జ్ఞానమే నాకు మార్గదర్శకం. మీ పాదాలే నాకు శరణు” అనే భక్తి భావమే ప్రధానమైనది.


నమస్కారంలో మనస్సు పాత్ర ~


• భగవంతునికి నమస్కరిస్తూ మనస్సు ఇతర విషయాల్లో తిరుగుతూ ఉంటే నమస్కారం యాంత్రికమైన చర్యగా మారుతుంది.


• అందుకే కాయేన — శరీరంతో, వాచా — వాక్కుతో, మనసా — మనస్సుతో భగవంతునికి సమర్పణ భావం కలిగి ఉండాలి.


• వాక్కుతో స్తుతి, మనస్సుతో ధ్యానం, శరీరంతో ప్రణామం — ఇవి కలిసినప్పుడు నమస్కారం మరింత అర్థవంతమవుతుంది.


దేవాలయంలో నమస్కారం ఎలా చేయాలి ?


• తొందరపాటుగా కాకుండా ప్రశాంతంగా నిలబడాలి.


• రెండు చేతులను సంపూర్ణంగా జోడించాలి.


• చేతులను హృదయస్థానంలో లేదా సంప్రదాయం ప్రకారం నుదుటి వద్ద ఉంచవచ్చు.


• భగవంతుని స్మరించాలి.


• “నేను నీ శరణాగతుడను” అనే వినయ భావాన్ని కలిగి ఉండాలి.


• శారీరక పరిస్థితికి, ఆచార సంప్రదాయానికి అనుగుణంగా నమస్కారం చేయాలి.


• నమస్కారం చేసిన వెంటనే లేచి వెళ్లిపోకుండా క్షణకాలం భగవంతుని ధ్యానించడం మంచిది.


స్త్రీలు, పురుషుల నమస్కార విధానం ~


• కొన్ని సంప్రదాయాల్లో పురుషులకు సాష్టాంగ నమస్కారం, స్త్రీలకు పంచాంగ నమస్కారం చేయాలని ఆచారంగా చెబుతారు.


• అయితే ఇది సంప్రదాయానుసారం మారే ఆచారం; అన్ని హిందూ సంప్రదాయాలకు ఒకే విధమైన సార్వత్రిక నియమంగా పేర్కొనడం సముచితం కాదు.


• కాబట్టి ఆయా కుటుంబ, మఠ, దేవాలయ, ఆగమ సంప్రదాయాలను గౌరవించడం ఉత్తమం.


నమస్కారానికి నిజమైన పరిపూర్ణత ~


• శిరస్సు వంగితే — అహంకారం వంగాలి.


• చేతులు జోడిస్తే — మనస్సు సమర్పించాలి.


• మోకాళ్లు వంగితే — దురభిమానం తగ్గాలి.


• భగవంతుని పాదాలను ఆశ్రయిస్తే — శరణాగతి భావం కలగాలి.


ముగింపు ~


• నమస్కారం ఒక సాధారణ ఆచారం కాదు.


• అది అహంకారానికి నమస్కారం కాదు — అహంకారానికి సమర్పణ.


• అది శరీరం వంగడం మాత్రమే కాదు — మనస్సు వంగడం.


• అది దేవుని ఎదుట నిలబడటం మాత్రమే కాదు — దేవుని శరణు పొందడం.


🙏 “నమః” — అంటే నా అహంకారాన్ని విడిచి, నిన్ను శరణు పొందుతున్నాను అనే పవిత్ర సమర్పణ భావం. 🙏

సరైన* *పనిముట్లు*

🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥“ *జీవితానికి* *సరైన* *పనిముట్లు* ”!🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥

వంటగదిలోని కుళాయి మళ్లీ లీక్ అవుతోంది. విసుగ్గా ఒక ప్లంబర్‌కు ఫోన్ చేశాను.


కొద్దిసేపటికి మధ్యవయస్కుడైన ఒక వ్యక్తి వచ్చాడు. ప్రశాంతంగా, నిదానంగా ఉన్నాడు. చేతిలో పాతబడిపోయిన ఒక పనిముట్ల సంచి ఉంది.

అతను పని చేయడం గమనిస్తున్నాను. ఒక రెంచ్ తీసుకున్నాడు. దాని పిడికిలి భాగం పగిలిపోయి ఉంది.

“ఇలాంటి రెంచ్‌తో ఇతను ఏం బాగు చేయగలడు?” అని మనసులో అనుకున్నాను.

కానీ అతనేమీ పట్టించుకోలేదు. ఎంతో నిశ్చలంగా పైపు విప్పడం మొదలుపెట్టాడు. తుప్పుపట్టిన ఒక భాగాన్ని కత్తిరించాల్సి వచ్చింది. వెంటనే తన సంచిలో నుంచి ఒక చిన్న రంపాన్ని తీశాడు. దానిలో సగం భాగమే ఉంది!

ఇక నాకు నమ్మకం వచ్చేసింది—పని కోసం తప్పు మనిషిని పిలిచాను!


కానీ పది నిమిషాల్లోనే లీకేజీ ఆగిపోయింది. కుళాయి మెరిసిపోతోంది. ఒక్క నీటి బొట్టు కూడా బయటకు రావడం లేదు.

అతనికి ₹200 ఇవ్వబోతే, అతను తల ఊపుతూ,

“వద్దమ్మా… ఇందులో సగం చాలు” అన్నాడు.

నేను ఆశ్చర్యంగా చూశాను.

“ఈ రోజుల్లో ఎక్కువ డబ్బు ఇస్తే వద్దనేవాళ్లు ఎవరున్నారు?”

అతను ప్రశాంతంగా నవ్వాడు.

“అమ్మా, ప్రతి పనికీ ఒక న్యాయమైన విలువ ఉంటుంది. ఈ రోజు ఎక్కువ తీసుకుంటే, రేపు కూడా అంతకంటే ఎక్కువ రావాలని ఆశిస్తాను. అలా రాకపోతే అసంతృప్తి కలుగుతుంది. అందుకే నాకు న్యాయంగా అనిపించినంత మాత్రమే తీసుకుంటాను. అలా ఉంటే మనసు ప్రశాంతంగా, సంతృప్తిగా ఉంటుంది.”

నేను మెల్లగా తల ఊపాను.

“కనీసం నీకోసం ఒక కొత్త రెంచ్, కొత్త రంపం కొనుక్కో. అవి ఉంటే పని సులభంగా అవుతుంది కదా!” అన్నాను.

అతను చిన్నగా నవ్వాడు.

“అమ్మా… పనిముట్లు అరిగిపోవడమే వాటి విధి. కానీ అవి పగిలినా, చెరిగినా తమ పని మాత్రం చేస్తూనే ఉంటాయి. మనిషి జీవితంలో కూడా అంతే కదా! పెద్దవాళ్లకు కొన్ని గాయాలు, కొన్ని మచ్చలు ఉండవచ్చు. అంతమాత్రాన వాళ్లు పనికిరానివాళ్లు అయిపోరు.”

అతను కాసేపు ఆగి మళ్లీ అన్నాడు:

“మీరు ఆఫీసులో రాసేటప్పుడు ఏ పెన్ను వాడుతున్నారన్నది ముఖ్యమా? ఖరీదైన పెన్నా, సాధారణమైన పెన్నా అన్నది కాదు. రాయడం మీకు తెలిస్తే ఏ పెన్నుతోనైనా చక్కగా రాయగలరు. రాయడం రాకపోతే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెన్ను ఇచ్చినా ప్రయోజనం ఉండదు. అసలు నైపుణ్యం పనిముట్టులో కాదు… దాన్ని ఉపయోగించే చేతిలో ఉంటుంది.”


నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. అతని మాటలు నా మనసులో లోతుగా నాటుకుపోయాయి.

ఆ వయసు మోసిన ముఖంలో కనిపించిన సంతృప్తి, ప్రశాంతత—డబ్బుతో కొనలేనిది.

ఆలోచించాల్సిన విషయం!

సంపద, సౌకర్యాల కోసం మనం చేసే అంతులేని పరుగులో, జీవితానికి నిజమైన “పనిముట్లను” మనం తరచూ మర్చిపోతున్నాం.

అవి నిజాయితీ, కష్టపడే తత్వం, కృతజ్ఞత, సంతృప్తి.

ఇవి మనలో ఉన్నంతకాలం, పాతబడిన పనిముట్లతో కూడా అద్భుతాలు సృష్టించవచ్చు.

కానీ ఇవే మనలో లేకపోతే, ప్రపంచంలోని ఎంతటి సంపద ఉన్నా… మనలో ఏర్పడిన లోపాలను, మన జీవి

తంలోని “లీకేజీలను” సరిచేయలేరు.



ఈ సందేశం జీవితానుభవంతో ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరికీ అంకితం.🙏🙏🙏🙏🙏

పాదారవింద శతకం - 2*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 48*


*నఖాంకూరస్మేరద్యుతివిమలగంగాంభసి సుఖం*

*కృతస్నానం జ్ఞానామృతమమలమాస్వాద్య నియతమ్ ।*

*ఉదంచన్మంజీరస్ఫురణమణిదీపే మమ మనో*

*మనోజ్ఞే *కామాక్ష్యాశ్చరణమణిహర్మ్యే విహరతామ్ ॥*


*భావము :*


*అమ్మా! చిరునవ్వుతో కూడిన మొగ్గలవంటి నీ పాద నఖముల కాంతులు, మణిదీపములవలే ప్రకాశిస్తున్న నీ కాలి అందియలతో కూడిన నీ పాదములు నా హృదయములో నిత్యము వసించుగాక.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

16, ఆగస్టు 2026, ఆదివారం

గ్యాస్ సమస్య

 తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం  -


    ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రమైన గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైనవేళల్లో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం . ఇప్పుడు నేను చెప్పబోవు ఈ అద్భుత చిట్కా మిమ్మల్ని గ్యాస్ సమస్య నుంచి మిమ్మల్ని అద్భుతంగా బయటపడవేయును.


      వాము  ౨50 గ్రాములు .


      జీలకర్ర  ౨50 గ్రాములు .


      ధనియాలు  ౨50 గ్రాములు . 


         మూడింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించి మూడింటిని కలిపి మెత్తటి చూర్ణంగా చేయవలెను . ఆ చూర్ణమును ఒక డబ్బా యందు గాలి పోకుండా నిలువ చేసుకొనవలెను . ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి పొయ్యి మీద నుంచి కిందకి దింపిన తరువాత ౨ స్పూనుల చూర్ణాన్ని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టవలెను కొంచం ఆగి గోరువెచ్చగా అయినతరువాత వడకట్టుకొని తాగవలెను. ఇలా ప్రతి ఉదయం బ్రష్ చేసిన వెంటనే మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు మరలా చేసుకుని తాగవలెను.


            పైన చెప్పిన యోగం 40 రోజులపాటు చేసినచో మీ గ్యాస్ సమస్య సంపూర్ణంగా పోవును . అలాగే ఆహారం తీసికొనుటకు అర్థగంట ముందు చిన్న అల్లం ముక్క కు ఉప్పు అద్ది నోటి యందు ఉంచుకుని రసం మింగుతూ ఉండవలెను . దీనివలన జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అగును.


  అజీర్ణరోగముతో బాధపడువారు పాటించవలసిన ఆహార నియామాలు  -


  పాటించవలసిన నియామాలు  -


      తేలికయిన పాతబియ్యపు అన్నం . పాతబియ్యపు నూకల జావ , బార్లీ జావ , పెసలు , పేలాలు , పెసరకట్టు , మేక మాంసం , చిన్న చేపలు , అల్లం , ఉప్పు , తక్కువ కారం , లేత ముల్లంగి , వెల్లుల్లి , ఉల్లిపాయ , లేత అరటికాయలు , లేత మునగ కాయ , పొట్లకాయ , బీరకాయ , లేత వంకాయ , కాకరకాయ , నక్క దోసకాయ , చుక్కకూర , పెరుగు తోటకూర , పొన్నగంటి కూర , మెంతికూర , ఉశిరికాయ , దానిమ్మ , నారింజ పండు , బత్తాయి , మజ్జిగ , పలచని మిరియాల చారు , తాంబూలం , వేడినీరు , తేనె , చేదు , నూనె పలచటి పదార్దాలు , వగరు , చేదుగల పదార్దాలు తీసికొనవలెను . వ్యాయమం చేయవలెను .


 పాటించకూడనివి  -


       కొత్త బియ్యపు అన్నం , పెద్ద చేపలు , బచ్చలికూర , అధికంగా నీరు తాగరాదు , ఆలస్యముగా జీర్ణం అయ్యే పదార్ధాలు . కంద , పెండలం , చామ , ఆలుగడ్డ , నేరేడు పండ్లు , గోధుమలు , పాలు , పాలతో చేసిన పదార్థాలు , చారపప్పు , జీడిపప్పు , నూనె అధికంగా ఉపయోగించి చేసే పదార్దాలు , వేపుళ్లు , పాతపచ్చళ్లు , ఉడకని పదార్దాలు , ముందు తినిన ఆహారం జీర్ణం కాక మునుపే మరలా తినరాదు . అమిత భోజనం , నిద్ర మేలుకుని ఉండటం , మలమూత్ర నిరోధం . టీ మరియు కాఫీ నిషిద్దం 


          పైన చెప్పిన ఆహారనియమాలు పాటిస్తూ నేను చెప్పిన యోగాన్ని పాటించుచుండిన అతి త్వరగా మీ సమస్య నుంచి విముక్తి పొందగలరు.


   విరేచనం సాఫీ లేనప్పుడు కూడా గ్యాస్ వచ్చును . దానికొరకు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఆహారం + మీరేదన్న ఇతర సమస్యలకు ఔషధాలు వాడుచున్న  అవన్నీ తీసుకున్న గంటన్నర తరువాత ఒక చిన్న స్పూన్ త్రిఫల చూర్ణం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి లోపలికి తీసుకోవలెను. మీరు తీసుకున్న ఆహారం మరియు మీరు నిద్రించడానికి మధ్య సమయం కనీసం 2 గంటలు ఉండాలి . 


       మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    

ధర్మో రక్షతి రక్షితః*

 *ధర్మో రక్షతి రక్షితః*


*ధర్మాన్ని కాపాడిన వారిని ధర్మమే కాపాడుతుంది.*


*ఈ  మహావాక్యం మన భారతీయ సంస్కృతికి మూలస్తంభం. ఈ వాక్యం మనుస్మృతిలో ప్రసిద్ధిగా పేర్కొనబడింది.*


*మన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు అన్నీ మానవుడు ధర్మమార్గంలో నడవాలని బోధిస్తాయి. సంపద, అధికారం, కీర్తి, విద్య కంటె ధర్మమే గొప్పదని మన ఋషులు చెప్పారు.*


*ధర్మం అంటే ఏమిటి ?*


*ధర్మం అంటే కేవలం పూజలు, యజ్ఞాలు చేయడం మాత్రమే కాదు. సత్యం మాట్లాడటం, ఇతరులకు హాని చేయకుండా జీవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, నిస్వార్థంగా సేవ చేయడం, న్యాయంగా ప్రవర్తించడం, తన కర్తవ్యాన్ని నిజాయితీతో నిర్వర్తించడం  ఇవన్నీ ధర్మమే.*


*ఈ సృష్టిలో ధర్మాచరణను మించిన మహిమాన్వితమైన కార్యం మరొకటి లేదని మన పెద్దలు చెప్పారు.*


*ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది.*


*ఈ ప్రపంచానికి నీవు ఏమి ఇస్తావో, అదే నీకు తిరిగి వస్తుంది.*


*ప్రేమ ఇస్తే ప్రేమ లభిస్తుంది.*

*సహాయం చేస్తే సహాయం లభిస్తుంది.*

*మోసం చేస్తే మోసమే ఎదురవుతుంది.*

*బాధ కలిగిస్తే బాధనే అనుభవించాల్సి వస్తుంది.*


*సమాజానికి కీడు చేసి, తనకు మాత్రమే మంచి జరగాలని కోరుకోవడం ధర్మానికి విరుద్ధం. ధర్మం ఎప్పటికైనా తన ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది.*


*కర్మఫలం తప్పదు.*

*మనిషి చేసే ప్రతి పనికీ ఫలితం ఉంటుంది.*

*మంచి చేస్తే మంచి ఫలితం.*

*చెడు చేస్తే చెడు ఫలితం.*

*కొన్నిసార్లు ఫలితం ఆలస్యంగా రావచ్చు. కాని, అది తప్పకుండా వస్తుంది. ధర్మం ఆలస్యం చేయవచ్చు కాని, అన్యాయం చేయదు.*

*మంచి ఆలోచనలు, మంచి పనులు, మంచి మాటలు మన జీవితాన్ని సంతోషంతో నింపుతాయి. ఇదే సృష్టి ధర్మం. సత్ప్రవర్తనే రక్షణ.*

*మన సత్ప్రవర్తనే మనకు నిజమైన రక్ష.*


*సత్యం, నిజాయితీ, వినయం, దయ, క్షమ, ప్రేమ వంటి గుణాలు కలిగినవారికి జీవితంలో చివరికి విజయం తప్పకుండా లభిస్తుంది.*

*ఆధ్యాత్మిక జీవితానికి ధర్మమే పునాది.*

*మనిషికి ఆధ్యాత్మిక చైతన్యం కలిగించేది ధర్మం.*

*ఆత్మజ్ఞానం, భగవద్భక్తి, సద్గుణాలు, శాంతి, ఆనందం అన్నీ ధర్మాచరణ ద్వారానే లభిస్తాయి.*


*ధర్మాన్ని కాపాడడం అంటే :*

*ప్రతి పనిలో నిజాయితీగా ఉండటం.*

*ఇతరులకు హాని చేయకపోవడం.*

*న్యాయాన్ని పాటించడం.*

*తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం.*

*సత్యాన్ని విడవకపోవడం.*


*అప్పుడు ఆ ధర్మమే మన జీవితాన్ని కాపాడుతుంది.*

*మనుస్మృతి ప్రకారం :*

*ధర్మం మనిషిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది.* *అధర్మం పతనానికి కారణమవుతుంది.*


*మహాభారతం మనిషి ఎలా జీవించాలో విపులంగా బోధించింది.*


*"నీకు ఇష్టం లేని పని ఇతరులకు చేయవద్దు" అనే ధర్మసూత్రం మహాభారతంలోని గొప్ప బోధలలో ఒకటి.*

*నన్నయ భారతాన్ని ధర్మశాస్త్రంగా అభివర్ణించారు.*

*ఎందుకంటే జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితికీ ధర్మబద్ధమైన మార్గాన్ని మహాభారతం చూపిస్తుంది.*


*వ్యాస మహర్షి ధర్మసారాన్ని సంక్షిప్తంగా వివరించారు.*

*ఇతరులకు మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం కలుగుతుందని చెప్పారు.*

*ధర్మాచరణే పరమ తపస్సు.*


*మహాత్ములు చెప్పినట్లు :*

*ధర్మాచరణమే పరమ ధర్మం.*

*సచ్ఛీలతే తపస్సు.*

*సద్చరిత్రే పరమ జ్ఞానం,*


*ఉత్తమ ధర్మం :*


*మనం ధర్మాన్ని ఆచరించడం మాత్రమే కాదు, ధర్మంగా జీవించే వారికి తోడ్పడటం కూడా ఉత్తమ ధర్మమే.*


*త్యాగం – సద్గుణాల మార్గం :*

*ధర్మం మనకు*

*భోగాల కంటే త్యాగం,*

*అహంకారం కంటే వినయం,*

*ద్వేషం కంటే ప్రేమ,*

*స్వార్థం కంటే సేవ*

*ఎక్కువ గొప్పవని బోధిస్తుంది.*


*మానవతా ధర్మం :*

*నిస్సహాయులకు, వృద్ధులకు, అనాథలకు, బాధలో ఉన్నవారికి సహాయం చేయడం మానవతా ధర్మం.*


*నిజమైన ధర్మం :*


*నీవు ఇతరుల నుండి ఏ విధమైన ప్రవర్తన ఆశిస్తున్నావో, అదే ప్రవర్తనను నీవు ఇతరుల పట్ల చూపడం నిజమైన ధర్మం.*


*ధర్మవంతులకు జయం*


*ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారికి చివరికి విజయం తప్పకుండా లభిస్తుంది.*

*కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడువకూడదని మన పురాణాలు బోధిస్తున్నాయి.*


*మనిషి జీవితాంతం ఎంత సంపాదించినా, మరణానంతరం ఒక్క రూపాయి కూడా వెంట తీసుకెళ్లలేడు.*


*భార్య ఇంటి గుమ్మం వరకు మాత్రమే వస్తుంది.*

*బంధువులు శ్మశానం వరకు మాత్రమే వస్తారు.*

*శరీరం కూడా బూడిదైపోతుంది.*

*కాని, జీవితంలో చేసిన ధర్మం, పుణ్యకార్యాలు మాత్రమే మన వెంట వస్తాయి.*


*ధర్మం అనేది కేవలం గ్రంథాల్లో ఉండే మాట కాదు; ప్రతి రోజూ మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో ఆచరించాల్సిన జీవన విధానం.*


*ధర్మాన్ని అనుసరించినవారికి మనశ్శాంతి, సమాజంలో గౌరవం, భగవంతుని అనుగ్రహం, చివరికి శాశ్వత ఉపకారం లభిస్తాయి.*


*ధర్మాన్ని కాపాడుదాం... ధర్మమే మనలను కాపాడుతుంది.*

🙏🙏🙏

15, ఆగస్టు 2026, శనివారం

వృద్ధాప్యంలో

 వృద్ధాప్యంలో మీరు ఒంటరిగా మిగిలిపోకూడదని, ఎవరికీ భారం కాకూడదని అనుకుంటే, ఇప్పుడే ఈ విషయాలను గ్రహించండి. 


01. భూమి గొడవల్లో చిక్కుకోకండి:"పక్కింటి వాడికి బుద్ధి చెప్పాలి" అనే ఒకే ఒక్క మొండి పట్టుదలతో మీ జీవితాన్ని కోర్టు మెట్ల చుట్టూ వృథా చేసుకోకండి. ఆ కేసు తెమలక ముందే మీ ఆయుష్షు తీరిపోవచ్చు. మీరు పోరాడి ఆ భూమిని గెలిచినా, అనుభవించడానికి మీరుండరు — అక్కడ శాశ్వతంగా స్థిరపడేది కేవలం లాయర్లు మాత్రమే.


2. పాత వాహనాలు భారం కావచ్చు:ఐదు లక్షల లాభం వస్తుందనే ఆశతో పాత వాహనాన్ని ఇంటికి తెచ్చే తప్పు చేయకండి. ఆ బండి రోడ్డు మీద కంటే ఎక్కువ రోజులు గ్యారేజీలోనే గడిపితే, గుండెపోటు ఆ వాహనానికి రాదు — మీకే వస్తుంది.


3.. ఆస్తులను ఇప్పుడే పిల్లల పేరిట రాయకండి:ఈ రోజు మీ పిల్లలు మీకు "దైవ సమానులు"గా కనిపించినా, మీ ఆస్తి మొత్తాన్ని వారి పేరిట రాసిచ్చిన మరుక్షణమే, అదే ఇంట్లో మీరు ఒక "పనికిరాని వస్తువు"లా మారిపోవచ్చు. పిల్లలు చెడ్డవారు కాదు, కానీ ఈ ప్రపంచం చాలా క్రూరమైనది. మీ చివరి శ్వాస వరకు ఏదో ఒకటి మీ పేరు మీదనే ఉంచుకోండి.


 04. మీ చివరి పొదుపును జాగ్రత్తగా దాచుకోండి:30 ఏళ్ల కష్టార్జితమైన మీ పెన్షన్ డబ్బును పిల్లల వ్యాపారాల కోసం ఇచ్చేయకండి. చివరికి మీ మందుల ఖర్చుల కోసం కూడా అదే పిల్లల ముందు చేతులు చాచాల్సిన పరిస్థితి రావచ్చు.


 05. పిల్లల జీవితాల్లో అతిగా తలదూర్చకండి:"మన పిల్లలే కదా" అని వారి వ్యక్తిగత విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. అతిగా దగ్గరవడం వల్ల మీ ప్రేమ వారికి చికాకుగా మారవచ్చు. మీకంటూ ఒక చిన్న స్థానాన్ని ఏర్పరచుకుని, స్వతంత్రంగా జీవించడం అలవాటు చేసుకోండి.


 06. తీర్థయాత్రలకు తీసుకెళ్తారని పిల్లల కోసం ఎదురుచూడకండి:"పిల్లలకు సెలవులు దొరికినప్పుడు తీసుకెళ్తారు" అని ఆశగా కూర్చోకండి. వారికి సమయం దొరికే సరికి, కనీసం మీరు నడవలేని స్థితికి చేరుకోవచ్చు. ఒంట్లో సత్తా ఉన్నప్పుడే మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లండి — అవసరమైతే ఒంటరిగానైనా సరే ప్రయాణించండి.


 07. తినాలనిపించింది ఈ రోజే తినండి:మోతాదు మించకుండా!

 08. మీకంటూ కాస్త విశ్రాంతిని కేటాయించుకోండి:చనిపోయే రోజు వరకు బాధ్యతల భారాన్ని మోస్తూనే ఉండకండి. పొద్దున్న నుంచి రాత్రి వరకు నిరంతరం పరిగెడుతూనే ఉంటే, చివరికి మీరు సాధించేది ఏమీ ఉండదు. మీ శరీరానికి కావలసిన విశ్రాంతిని ఇవ్వండి.


 09. నిద్రను మించిన మందు లేదు:అనవసరమైన ఆలోచనలతో నిద్రలేమిని కొనితెచ్చుకోకండి, ప్రశాంతంగా నిద్రపోండి. రేపు మీరు అనారోగ్యానికి గురైతే, మీ బాధను ఎవరూ పంచుకోలేరు — మీరే ఒంటరిగా భరించాలి.


 10. మీరు ఒంటరిగానే వచ్చారని ఎన్నడూ మరువకండి:ఎవరైనా మీ కోసం ఏదో ఒకటి చేస్తారనే అంచనాలను తగ్గించుకోండి. ఒకరోజు మీ నీడ కూడా మిమ్మల్ని వదిలేస్తుంది. మరణం కూడా ఒంటరిగానే వస్తుంది — కాబట్టి ఒంటరిగా ఉన్నా సంతోషంగా జీవించడం నేర్చుకోండి.   ఆనందం అనేది ఎవరో ఇచ్చేది కాదు; అది మీ అంతట మీరే అంతరంగంలో సృష్టించుకోవాల్సింది.


11. మీ భార్య లేదా భర్త ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఇంట్లోని చిన్న పెద్ద పనులన్నీ మీ స్వహస్తాలతో చేసుకోవడం నేర్చుకోవడానికి వెనుకాడకండి.


12.  మీరు ఒకవేళ విల్లు (Will) రాసినప్పటికీ, దానిని ఎప్పుడైనా మార్చే పూర్తి హక్కు మీకు ఉంటుందని గుర్తుంచుకోండి.


13. మీ వారసులు మిమ్మల్ని వేధిస్తున్నా లేదా వేలెత్తి చూపిస్తున్నా, ఈ రోజు చట్టం మరియు జిల్లా యంత్రాంగం (డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్) మీ వైపు ఉన్నాయని మరువకండి.


14.. ప్రతిరోజూ నడకను అలవాటు చేసుకోండి. మీ పాత స్నేహితులు లేదా బంధువులు ఉంటే, వారితో కలిసి మీ చిన్ననాటి తీపి గుర్తులను పంచుకోవడానికి వెనుకాడకండి.


15. ఏ రోజైనా జీవితపు లెక్కలు ముగిసిపోతాయని గుర్తుంచుకోండి, ఆ చివరి రోజు కోసం మానసికంగా ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.


16. చివరికి మీరు ఈ ప్రపంచం నుండి ఏమీ తీసుకెళ్లలేరని గ్రహించండి, అందుకే అందరితో ప్రేమగా, స్నేహపూర్వకంగా మెలగండి. అవసరమైన వారికి సహాయం చేస్తూ మిమ్మల్ని మీరు ఒక మంచి మనిషిగా  జీవించేలా చేసుకోండి.  🙏🙏

Revathi MS Goud 

Bengaluru 💞


సేకరణ 🌹