27, ఆగస్టు 2020, గురువారం

దీపాన్ని ఎలా వెలిగించాలి.. ఎలా కొండెక్కించాలి*


దీపాన్ని కొండెక్కించడం.. ఆర్పేందుకు కొన్ని పద్ధతులున్నాయి. గృహంలోని పూజాగదిలో దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతి దేవిల శక్తులుంటాయి. దీపకాంతి ఇంట్లోని దుష్టశక్తులను తరిమికొడుతుంది. దీపారాధానకు ఉపయోగించే దీపపు కుందిలో త్రిమూర్తులు నివాసం వుంటారు. దీపారాధన కుందిలో నూనె లేదా నెయ్యి పోసి ఆ నెయ్యి వున్నంత వరకు దీపాన్ని వెలిగించాలి.
వత్తులు పూర్తిగా మండుకోక ముందే దీపాన్ని కొండెక్కించాలి. దీపాన్ని వెలిగించినప్పటి నుంచి కొండెక్కించేంత వరకు నూనె ఆ దీపంలో వుండేలా చూసుకోవాలి. దీపాన్ని కొండెక్కించేటప్పుడు నోటితో వూదడం చేయకూడదు. పువ్వులతో దీపాన్ని కొండెక్కించాలి. దీపంలో మహాలక్ష్మి, దీపకాంతిలో సరస్వతి, దీపంలో వెచ్చదనంలో పార్వతీ దేవి కొలువైవుంటారు.

అందుకే దీపాన్ని వెలిగిస్తే.. త్రిమూర్తులను, ముగ్గురమ్మలను కొలిచినవారమవుతాం. ఇంకా నేతి దీపాన్ని వెలిగించిన వారికి సకలశుభాలు చేకూరుతాయి. అగ్గిపుల్లతో నేరుగా కుందులలో దీపాన్ని వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా లేదా ఏకహారతి ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి. దీపారాధన కుందిలో ఐదు వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి.

ఈ ఐదు వత్తుల్లో మొదటితి భర్త, సంతానం సంక్షేమం కోసం, రెండో వత్తి అత్తమామల సంక్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల క్షేమానికి, నాలుగోది గౌరవ ధర్మ వృద్ధులకు, ఐదోది వంశాభివృద్ధికి అని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా వుండాలి. ఇంటి ముందు తులసి మొక్క ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే.. ఇంట్లోకి దుష్ట శక్తులు రావు.
ముఖ్యంగా వెండి ప్రమిదల్లో నేతితో గానీ, నువ్వుల నూనెతో కానీ, పొద్దు తిరుగుడు నూనెతో కానీ దీపారాధన చేస్తే వారికి అష్ట నిధులు చేకూరుతాయని విశ్వాసం. కొన్ని ప్రాంతాల్లో దీపాన్ని విఘ్నేశ్వరుడిగానూ కొలుస్తారు. దీపారాధన సమయంలో విఘ్నేశ్వర స్తుతులు పాడితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. దీపారాధన చేస్తే మేధస్సు పెరుగుతుంది. స్వాతిక మార్గంలో సంపాదన చేకూరుతుంది.
******************

పోత‌న త‌ల‌పులో....(32)



సంసార బంధాలు తొల‌గించి,
మాన‌వుల‌ను నారాయ‌ణుని
పాదాల చెంత‌కు చేర్చేది భాగ‌వతం.....

                                       ****
అవనీచక్రములోన నే పురుషుఁ డే యామ్నాయమున్ విన్న మా
ధవుపై లోకశరణ్యుపై భవములం దప్పింపఁగాఁ జాలు భ
క్తివిశేషంబు జనించు నట్టి భువనక్షేమంకరంబైన భా
గవతామ్నాయము బాదరాయణుఁడు దాఁ గల్పించె నేర్పొప్పగన్.
                                        ****

ఈ విశాల భూమండలంలో ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రం చేతనే సంసారబంధాలు సమసిపోయి జగన్నాథుడైన నారాయణునిపై అచంచలమైన భక్తి ఆవిర్భవిస్తుందో, అట్టి లోకకల్యాణకరమైన మహాగ్రంథాన్ని, వేదస్వరూపమైన భాగవతాన్ని బాదరాయణ మహర్షి ఓర్పుతో నేర్పుతో రూపొందించాడు

*🏵️పోత‌న ప‌ద్యం-🏵️
  🏵️వేద స్వరూపం🏵
******************

తెలుగు భాష

తెలుగు భాషని మన ఇళ్లలోనే వాడటం మానేసాం.
ఇప్పుడు బళ్ళలో కూడా...

ఎప్పుడో కొన్నేళ్ళక్రితం
నాయని జయశ్రీ రాసిన వ్యాసం....

"డోర్ లాక్ చెయ్యకండి"

‘నేను వెళ్తున్నా, డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ?’
ఇందులో ‘కార్’ తప్ప అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు.
కానీ మనం వాడం.

ఎందుకు?
ఇది ఈరోజు నాకు హఠాత్తుగా వచ్చిన ఆలోచన కాదు.
చాలా రోజుల నుంచీ మనసులో నలుగుతున్న ప్రశ్నే.
ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే,
తలుపు తాళం వేసుకో,
గడిపెట్టుకో అనే వాళ్ళం.
ఇవేకాదు,
చిన్నతనంలో వినిన, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్నమొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లలకి నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం?

మన తెలుగులో మాటలు లేవా?
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి.
కానీ మనం పలకం.

వంటింటిని కిచెన్ చేసాం.
వసారా వరండాగా మారింది.
ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం.

మన ఇళ్ళకి చుట్టాలు, బంధువులు రావడం మానేసారు.
గెస్ట్‌లే వస్తారు.
ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు.
ఏ లంచో, డిన్నరో చేస్తారు.
భోజనానికి కూర్చొన్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం.
అందులో వడ్డించేవన్నీ రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై, చికెన్, మటన్ వగైరాలే.

అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, కోడికూర, మాంసం తినండి అంటే ఇంకేమన్నా ఉందా, 
వాళ్ళేమనుకుంటారో అని భయం.
అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసికెళ్ళం.
బ్యాగ్ పట్టుకుని షాప్‍కి వెళ్తున్నాము.
అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము.
కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.

ఏమండీ మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడని అడిగా.
ఏంటమ్మా డెలివరీ అయిందా అనకుండా నువ్వింకా కానుపు అంటావేంటి? అని ఎదురు ప్రశ్న వేసింది.
బిత్తరపోవడం నావంతయింది.

టీవీలో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు,
వంటా-వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళకి అలవోకగా ఆంగ్లపదాలు పట్టుబడతాయి మరి.
అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు.

టీవీ వంటల కార్యక్రమంలో ఒకావిడ మనకి వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది.
అది ఏ భాషో మీరే చెప్పండి.
‘కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి,
ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి,
స్టౌవ్ ఆఫ్‍చేసి మసాలాపౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి.’ ఇలా సాగుతుంది.
మరి మన కూరలకి అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల రుచులు ఎలా తగుల్తాయి?

నిన్న మా పక్కింటాయన వచ్చి
‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి,
ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’
అని చెప్పి వెళ్ళాడు.
మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం?
అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం.
అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న
అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు.
ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు.

పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం.
స్కూల్‍కే పంపిస్తాం.
సరే బడికి వెళ్ళాక వాళ్ళకి ఎలాగూ ఇంగ్లీషులో మాట్లాడక తప్పదు.
ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము.

మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలని వదిలేస్తున్నాం?
ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకి సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా?
తెలుగు మాటలు మనకి మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి?
ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు.
నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు,
నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం,
ఇతరులు అనుకోవాలన్న భావన.

ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి.
ఒకప్పుడు సంస్కృతం పట్ల ఇదే దృక్పథం అలవరచుకున్న తెలుగు వాళ్ళు
తూర్పు పడమర మిగిల్చారు
కానీ ఉత్తరం దక్షిణం మరచిపోయారు.
ఈ కాలంలో ‘వడ’, ‘తెన్ను’ అంటే ఎవరికి తెలుస్తుంది?
‘జనని సంస్కృతంబె ఎల్ల భాషలకును’
అని భావించిన గొప్పగొప్ప పండితులు
వారి పాండిత్య ప్రకర్ష కోసం తెలుగు మాటలు వదిలేసి సంస్కృతం వాడటం మొదలుపెట్టారు.
వారి దగ్గర పాఠం వల్లెవేసిన వాళ్ళకి అదే గీర్వాణం వంటబట్టింది.

అదే వరవడిలో మనకి పగలు మిగిలింది, మావు చీకట్లో కలిసిపోయింది.
ఉసురుకి ప్రాణం పోయింది.
ఎడం దూరం అయింది.
అన్నం తినడం మొదలు పెట్టాక కూడు చద్దిపట్టింది. ప్రస్తుతం మనం సంతోష పడాలన్నా,
బాధ పడాలన్నా,
ఆఖరికి భయపడాలన్నా
సంస్కృతంలోనే పడుతున్నాం.
ఇలా చెబుతూ పోతే వీటికి అంతే లేదు. 

వివిధ జానపద కళారూపాలలో ఉన్న ఆనాటి తెలుగు సాహిత్యం,
శాసనాలు దేశీయ ఛందస్సు లోనే ఉండేవి.
తెలుగు కవులు దేశి కవిత్వాన్ని వదిలి మార్గ కవిత బాట పట్టడంతో చాప కింద నీరులా భాషలో మార్పు వచ్చింది.
ఇంత జరిగినా మన పల్లె పట్టుల్లో మాత్రం
జానపద కళలు నిన్న మొన్నటి వరకు బతికే ఉన్నాయి.
వారి నోట అచ్చ తెనుగు మాటలే వినిపించేవి.

ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.

ఈ మధ్య ఓ సారి ప్రయాణం మధ్యలో
ఒక చిన్న పల్లెటూర్లో కారు ఆపి
ఇక్కడ మంచినీళ్ళ సీసాలు ఎక్కడ అమ్ముతారు బాబూ అని ఒకతన్ని అడిగా.
అతడు కొంచెం వింతగా నావైపు చూసి,
మినరల్ వాటర్ బాటిల్సా మేడం? అన్నాడు.
అవునయ్యా అన్నా.
అలా చెప్పండి మేడం అర్థం అవుతుంది,
అని అవి అమ్మే చోటు చూపించాడు. మూలమూలలకి విస్తరించిన టివి ప్రసారాలు,
ఇంటర్నెట్ల ప్రభావం వలన ఈ మార్పు చాల త్వరగా జరుగుతూ ఉంది.

భాషలో లేని పదాలను
పరభాషల నుంచి తెచ్చుకొని వాడుకోవడం వల్ల
ఆ భాష పరిపుష్టమౌతుంది.

అలాగని వాడుకలో ఉన్నమాటలని వదిలేసి
పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించిపోతుంది. ఇంకా సమయం మించిపోలేదు. ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు మాటలు
అంతరించి పోకుండా ఉండాలంటే మనం వీలైనంత వరకు తెలుగు మాటలే వాడాలి.

బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా,కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం. అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి, అచ్చ తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం.

-జయశ్రీ నాయని
******************

శ్రీమన్నారాయణీయం

1-3- శ్లో.

సత్త్వం యత్తత్ పరాభ్యామపరికలనతో నిర్మలం తేన తావత్
భూతైర్భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యమ్
తత్ స్వచ్ఛత్వాద్యదచ్ఛాదిత
పరసుఖచిద్గర్భనిర్భాసరూపం
తస్మిన్ ధన్యా రమంతే శ్రుతిమతిమధురే సుగ్రహే విగ్రహే తే||

భావము -
 పంచభూతములు, ఇంద్రియములతో ఆవిష్కృతమయున నీ రూపమునకు, త్రిగుణాతీతము నిర్మలము అయిన శుద్ధసత్వగుణ రూపమైన పరతత్వమే కారణమని, వ్యాస భగవానునిచే చెప్ప బడిన వాక్యము వలన తెలియుచున్నది. గుణములచే ఆవరింపబడనిదియు, స్వచ్ఛమయినదియు, ఙ్ఞానానందముచే ప్రకాశించునదియు అయిన నీ రూపమును స్మరించుటలో ఆనందమును; భావన చేయుటలో మాధుర్యమును అనుభవించు నీ భక్తులు ధన్యులు. 

వ్యాఖ్య  - ఈశ్లోకంలో ఒకవైపు స్వామి వారి  త్రిగుణాతీత, నిర్మల,  శుద్ధసత్వగుణరూప పరతత్వం శ్లాఘించబడితే మరోవైపు స్వామి వారు గీత అ.9 శ్లో.14లో చెప్పిన భక్తుడి లక్షణాలు కనబడుతున్నాయి. అదేంటో చూద్దాం.

ఈ శ్లోకంలో వచ్చిన పరతత్వం గురించి మహాభారతం  శాంతి పర్వం షష్టమాశ్వాసంలో యాజ్ఞవల్కుడు వివరిస్తూ "వేదాలలో అర్ధము, సారము తెలుసుకున్న పండితుడు క్షరము అక్షరమైన పరతత్వము గురించి తెలుసుకోగలడు. అప్పుడు క్షరమును వదిలి పెట్టి అక్షరయోగము కొరకు ప్రయత్నిస్తాడు. 

25వ తత్వమైన అక్షరతత్వం  తెలుసుకున్నవాడు పరతత్వము గురించి తెలుసుకుంటాడు.  25వ తత్వము అయిన అక్షర తత్వము 26వ తత్వమైన పరతత్వము ఒకటే. 26వ తత్వమే పరమేశ్వరుడు. అతడే పురుషోత్తముడు. అది నిరంజన, నిత్య, జ్ఞాన, ఆనంద స్వరూపం.

అవ్యక్తమైన మైన ప్రకృతి, పురుషుడు వేరు అని తెలుసు కదా ! పురుషుడు ప్రకృతితో చేరి అనేక రూపములు పొందుతూ జనన మరణ చక్రంలో ఇరుక్కు పోతూ ఉంటాడు. పురుషుడిని జీవుడు అంటారు. ప్రకృతి పురుషుడిని చూడలేక పోయినా పురుషుడు ప్రకృతిని చూస్తూ అందులో లీనమై ఇక పరమాత్మ వైపు చూడ లేడు. కాని పరమాత్మ ఈ పురుషుడిని ప్రకృతిని సాక్షీ భూతంగా చూస్తూ ఉంటాడు. పురుషుడు పరమాత్మను దర్శించే ఉపాయము చెప్తాను. 

పురుషుడు ప్రకృతితో స్నేహం చేస్తూ ప్రకృతే తాను అనుకుని క్రమంగా ప్రకృతిలో లీనమౌతాడు. అందువలన అహంకారం పెరుగుతుంది. ప్రకృతిలోని వస్తువుల మీద మమకారం పెరిగి వాటిని పొందాలన్న కోరిక పెరుగుతుంది. పురుషుడు ప్రకృతిని చూస్తున్నంత కాలం పరమాత్మను దర్శించ లేక జీవుడిగా మిగిలి పోతాడు. ఎప్పుడైతే పురుషుడు తానే ప్రకృతి ప్రకృతే తాను అన్న భావన విడిచి నీటిలో ఉన్న తామరలా తాను వేరు నీరు వేరు అనుకుంటాడో అప్పుడు ప్రకృతిలో సంచరిస్తున్న పురుషుడు తాను వేరు ప్రకృతి వేరు అని తెలుసుకుని పరమాత్మను దర్శిస్తాడు. 

పురుషుడికి జనము, వృద్ధాప్యము, మరణము తప్పవని తెలుకుని యోగి సాంఖ్యమును, యోగమును ఆశ్రయించి మమకారాన్ని వదిలి పునర్జన్మ లేని పరతత్వాన్ని పొందుతాడు. ప్రకృతి వేరు తాను వేరని పురుషుడు భేదం గ్రహించినప్పుడే పరమాత్మను చేరగలడు. 

పురుషుడు వేరు పురుషోత్తముడు వేరని సామాన్యులు అనుకుంటారు కాని విజ్ఞులకు అభ్యాసం వలన ఇద్దరూ ఒకరే అని గ్రహించగలుగుతారు. అజ్ఞాని మాత్రం పురుషుడు వేరు పురుషోత్తముడు వేరని అనుకుంటారు. మమకారమును పోగొట్టుకున్నప్పుడు పురుషోత్తముడిని గురించి తెలుసుకోగలుగుతారు " అని చెప్పాడు.

ఇక భట్టతిరి గారి స్థితి ఏమిటో తెలియాలంటే భగవద్గీతలోని అ.9 శ్లో.14  స్వామి మాటలే చెప్తాయి. 

సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః ।
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ।। 

ఎల్లప్పుడూ నా దివ్య లీలలను గానం చేస్తూ, ధృడ సంకల్పముతో పరిశ్రమిస్తూ, వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ, నిరంతరం వారు నన్ను ప్రేమ యుక్త భక్తి తో ఆరాధిస్తుంటారు.

భగవద్గీత ఆరవ అధ్యాయంలో చెప్పినట్టు, మనస్సు అనేది గాలి వలె చంచలమైనది, మరియు సహజంగానే ఒక ఆలోచన తరువాత ఇంకో ఆలోచనకి తిరుగుతూనే ఉంటుంది. శ్రవణము మరియు కీర్తనము జ్ఞానేంద్రియాలను భగవత్ దృక్పథంలో నిమగ్నం చేస్తాయి, మనస్సుని పదేపదే దాని తిరుగుడు నుండి వెనక్కు తీసుకురావడానికి అవి సహాయం చేస్తాయి. 

భట్టతిరి గారి స్థితి అదే కాబట్టి స్వామి సాక్షాత్కరించి స్వయానా ఆయనకి గ్రంథ రచనలో సహకరించారు.

 స్వస్తి

🙏🙏🙏
సేకరణ

ధర్మము-సంస్కృతి
🙏🙏🙏

*హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం*
మన ధర్మాన్ని రక్షిద్దాం*

*ధర్మో రక్షతి రక్షితః*
🙏🙏🙏

పోతనామాత్యుడి జయంతి

లోకంబులు లోకేశులు
లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్
భావం:--
లోకాలు, లోకాధిపతులు, లోకులు నశించిన తరవాత, లోకమనేది లేనప్పుడు
ఏర్పడే దట్టమైన చీకటికి అవతల ఏ పరమపురుషుడు ఒకే ఆకారంతో ప్రకాశిస్తాడో
అతనిని మాత్రమే నేను సేవిస్తాను...

ఈ రోజు పోతనామాత్యుడి జయంతి బమ్మెర గ్రామంలో (తెలంగాణ లో) చేస్తున్నారు
********************

కర్మ కారకత్వం




కర్మకు కర్తయున్ , మరియు
           కారకుడయ్యడివాడు గూడ , యా
కర్మకు ప్రేరకుండగుచు
       కర్మనుదెల్సినవాడు గూడ , యా
కర్మను  చేయుచున్  మిగుల
        కర్మమునందుననుండువాడు , యా
కర్మ ఫలంబులన్ గొనెడి
        కర్మము దప్పదు మంచి చెడ్డలున్
*

రణత్-

రణత్-క్షుద్రఘణ్టానినాదాభిరామం
చలత్తాణ్డవోద్దణ్డవత్పద్మతాలమ్ ।
లసత్తున్దిలాఙ్గోపరివ్యాలహారం
గణాధీశమీశానసూనుం తమీడే ॥1॥
మ్రోగుచున్న చిరుగజ్జల సవ్వడిచే మనోహరుడు , తాళముననుసరించి ప్రచండ తాండవము చేయుచున్న పాదపద్మములు కలవాడు , బొజ్జపై కదులుచున్న సర్పహారములున్నవాడు , ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.
ధ్వనిధ్వంసవీణాలయోల్లాసివక్త్రం
స్ఫురచ్ఛుణ్డదణ్డోల్లసద్బీజపూరమ్ ।
గలద్దర్పసౌగన్ధ్యలోలాలిమాలం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 2 ॥
ధ్వని ఆగుటచే వీణానాదమందలి లయచే తెరచిన నోరు కలవాడు , ప్రకాశించు తొండముపై విలసిల్లు బీజపూరమున్నవాడు , మదజలం కారుచున్న బుగ్గలపై అంటుకొన్న తుమ్మెదలు కలవాడు . ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.
ప్రకాశజ్జపారక్తరన్తప్రసూన-
ప్రవాలప్రభాతారుణజ్యోతిరేకమ్ ।
ప్రలమ్బోదరం వక్రతుణ్డైకదన్తం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 3 ॥
జపాపుష్పము , ఎర్రని రత్నము , పువ్వు , చిగురుటాకు , ప్రాతఃకాల సూర్యుడు వీటన్నిటివలే ప్రకాశించుచున్న తేజోమూర్తి , వ్రేలాడు బొజ్జ కలవాడు , వంకరయైన తొండము , ఒకే దంతము కలవాడు , ఈశ్వర పుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.
విచిత్రస్ఫురద్రత్నమాలాకిరీటం
కిరీటోల్లసచ్చన్ద్రరేఖావిభూషమ్ ।
విభూషైకభూశం భవధ్వంసహేతుం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 4 ॥
విచిత్రముగా ప్రకాశించు రత్నమాలా కిరీటము కలవాడు , కిరీటముపై తళతళలాడుచున్న చంద్రరేఖాభరణమును ధరించినవాడు, ఆభరణములకే ఆభరణమైనవాడు , సంసార దుఃఖమును నశింపచేయువాడు , ఈశ్వర పుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.
ఉదఞ్చద్భుజావల్లరీదృశ్యమూలో-
చ్చలద్భ్రూలతావిభ్రమభ్రాజదక్షమ్ ।
మరుత్సున్దరీచామరైః సేవ్యమానం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 5 ॥
పైకెత్తిన చేతుల మొదలులు చూడ దగినట్లున్నవాడు , కదులుచున్న కనుబొమ్మల విలాసముతో ప్రకాశించు నేత్రములు కలవాడు , దేవతాస్త్రీలచే చామరములతో సేవించబడుచున్నవాడు , ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.
స్ఫురన్నిష్ఠురాలోలపిఙ్గాక్షితారం
కృపాకోమలోదారలీలావతారమ్ ।
కలాబిన్దుగం గీయతే యోగివర్యై-
ర్గణాధీశమీశానసూనుం తమీడే ॥ 6 ॥
ప్రకాశించుచున్నవి , కఠినమైనవి , కదులుచున్నవి , పింగళవర్ణము కలవి అగు కంటిపాపలు కలవాడు , కృపచే కోమలుడై ఉదారలీలా స్వరూపుడు , కలాబిందువు నందు ఉన్నవాడుగా యోగి వరులచే స్తుతింపబడువాడు , ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.
యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం
గుణాతీతమానన్దమాకారశూన్యమ్ ।
పరం పరమోఙ్కారమాన్మాయగర్భం ।
వదన్తి ప్రగల్భం పురాణం తమీడే ॥ 7 ॥
ఏ గణాధీశుని ఏకాక్షరము , నిర్మలము , నిర్వికల్పము , గుణాతీతము , ఆనందస్వరూపము , నిరాకారము , సంసారసముద్రమున కవతలి తీరమునందున్నది , వేదములు తనయందు కలది అగు ఓంకారముగా పండితులు చెప్పుచున్నారో, ప్రగల్భుడు , పురాణపురుషుడు అగు ఆ వినాయకుని స్తుతించుచున్నాను.
చిదానన్దసాన్ద్రాయ శాన్తాయ తుభ్యం
నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యమ్ ।
నమోఽనన్తలీలాయ కైవల్యభాసే
నమో విశ్వబీజ ప్రసీదేశసూనో ॥ 8 ॥
జ్ఞానానందముతో నిండినవాడవు , ప్రశాంతుడవు అగు నీకు నమస్కారము. విశ్వమును సృష్టించువాడవు , సంహరించువాడవు అగు నీకు నమస్కారము. అనంతమైన లీలలు కలిగి ఒకడిగానే ప్రకాశించు నీకు నమస్కారము . ప్రపంచమునకు బీజమైనవాడా! ఈశ్వరపుత్రుడా! ప్రసన్నుడవగుము.
ఇమం సుస్తవం ప్రాతరుత్థాయ భక్త్యా
పఠేద్యస్తు మర్త్యో లభేత్సర్వకామాన్ ।
గణేశప్రసాదేన సిధ్యన్తి వాచో
గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే ॥ 9 ॥
ఉదయముననే నిద్రలేచి భక్తితో ఈ మంచి స్తోత్రమును ఏ మానవుడు పఠించునో అతడు అన్ని కోరికలను పొందును. గణేశుని అనుగ్రహముచే వాక్కులు సిద్ధించును. అంతటా వ్యాపించిన గణేశుడు ప్రసన్నుడైనచో పొందలేనిది ఏముండును?
॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం శ్రీగణేశభుజఙ్గమ్ సమ్పూర్ణమ్
************************

💫 పలకరింపు 💫

మనుషులకు మాత్రమే వున్న వరమిది. మానవీయ సంబంధాల వారధి. మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది.

పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది. పలకరింపు అనేది మనిషితనానికి, కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది.

నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల, విలాసాలననుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు. ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు. ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు. కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు.

ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు. ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. ఒక ఆశను చిగురింపచేయొచ్చు. మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు !

పలకరింపుకు అంత శక్తి వుంది. పలకరించడమనే సమస్య నేడు ఇండ్లల్లో వృద్ధులు విపరీతంగా ఎదుర్కొంటున్నారు. తమ జీవితమంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి, వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో వున్న పెద్దల్ని పనికిరాని వస్తువుల్ని చూసినట్లు చూస్తున్నారు. వారి శ్రమఫలమే వర్తమానపు మన కళ అని మరిచి పోతున్నారు. అట్లాంటి పెద్దలను ఆప్యాయంగా పలకరించాలి.

ఒక మాట మాట్లాడాలి. ఒక్కసారి పలకరింపుతో వాళ్ళను కదిపి చూడండి. బండెడు అనుభవాలను మీ ముందుంచుతారు. ఆ అనుభవాలు ఇప్పటికీ మనకు దివిటీలా పని చేస్తాయి.

పలకరింపులు పెద్దలకు ఆరోగ్యాన్నిచ్చే మందులా పని చేస్తుంది. పెద్దలనే కాదు ఎవరినైనా పలకరిస్తూ వుండాలి. దాంతో స్నేహం, బంధం, ప్రేమ, అనుబంధం పెరుగుతూ వుంటుంది. ఇవి కేవలం మనుషులు సాధించేవి.

ప్రముఖ కథా రచయిత్రి ఇల్లిందల సరస్వతీ దేవిగారు తీయని పలకరింపు అని ఒక కథను రాశారు. అందులో ఒక రిటైర్డు పెద్దాయన, పలకరింపులు లేక పడుతున్న బాధను చక్కగా చిత్రించారు. ''నేను డబ్బులు బాగా సంపాదిస్తూ ఉద్యోం చేస్తున్నపుడు నన్ను చాలా మందే పలకరించేవాళ్ళు. ఉద్యోగ విరమణ చేసి, ఆదాయం తగ్గిపోయిన క్షణం నుంచి పనికిరాని వాడిలా పలకరింపుకు నోచుకోలేక వృద్ధాశ్రమం చేరాను'' అని పాత్రలో వివరిస్తుంది.

డబ్బులు మాత్రమే ముఖ్యంగా మారిన నేటి తరాలకు మనుషుల మధ్య సంబంధాలు అప్రధానమై పోయి ఈ పరిస్థితులు దాపురించాయి. ఇది లాభాల ఆర్జన కోసం సరుకుల మీద వ్యామోహాన్ని పెంచిన సాంస్కృతిక దాడి ఫలితం. దీన్ని మార్చకపోతే మనమూ ఒకప్పటికి బాధితులుగా మిగులుతాం.

లాక్‌డౌన్‌ మూలానా ఇంట్లోనే అందురున్నప్పటికీ వారి మధ్య దూరాలేవీ తగ్గలేదు. మరింత పెరుగుతూనే వున్నాయి. ఎవరి చేతుల్లో వాళ్ళు సెల్‌ఫోన్‌లతో యియర్‌ ఫోన్లతో తమలో తామే, తమకు తామే గడిపేస్తున్నారు. కుటుంబ సంబంధాల్లో విపరీత దూరాలు పెరుగుతున్నాయి.

మనసుల్లో దాగిన భావాలు, అభిప్రాయాలు పలకరించి అడిగితేనే తెలుస్తాయి. తెలిసినపుడే వాటిని సరిచేయడమో, చర్చించి మనం సరికావడమో చేయవచ్చు. కొన్ని అపోహలూ తొలిగిపోవచ్చు. కుటుంబంలోనే కాదు ఇంటి పక్కన వాళ్ళను, దూరానవున్న మిత్రులను ఖాళీ సమయం దొరకగానే ఒకసారి పలకరించండి.

కరోనా బాధితులను, దాని వల్ల భయపడుతున్న వాళ్ళను పలకరించాలి. పది మందితో గల సంబంధమే జీవితం.

నాకు తెలిసిన ఒక పెద్దాయన అన్ని హంగులు ఉండి కూడా, తాను, తన భార్యాబిడ్డలు, సన్నిహితులతో ఏసి లాంటి సకల సౌకర్యాలు అనుభవిస్తూ, వృద్ధురాలు తన తల్లిని మాత్రం ఔట్ హౌస్ కొట్టుగదిలో ఉంచాడు. తనని పలకరించితేనే భార్య అనుగ్రహానికి దూరమైపోతానేమో అని భావించి, దూరంగానే ఉంచిన ప్రబుద్ధుడు.

''నాకేమీ పెట్టాల్సిన అవసరం లేదు. నేనేమీ అడగటమూ లేదు. రోజు ఏం చేస్తున్నావమ్మా, ఏం తిన్నావు, బాగున్నావా'' అని నన్ను అడిగితే చాలని ఎనభై యేండ్ల తల్లి నాతో చెబుతూ దు:ఖించింది. అంటే పలకరింపుల విలువేమిటో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆమె పోయిన తరువాత అతను కార్చిన మొసలికన్నీరుకి ఏ అవార్డు ఇవ్వొచ్చో అర్థం కాలేదు !

_*✅ అందుకే.. పలకరించండి. పలుకులేమీ బంగారం కాదు. మనిషి మంచి తనానికి ఆనవాళ్ళు
*******************

మనసా...వాచా...కర్మణా... 🌼🌿






శ్రీ ఆది శంకరాచార్యుల వారు , శిష్యులతో కాశి విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు.

గంగా నదిలో స్నానము చేసి, దర్శనానికి ఆలయము లోపలకి వెళ్లి, విశ్వేశరుని ఎదుట, “నేను 3 దోషములు/పాపములను చేశాను, నన్ను క్షేమించండి ” అని ప్రాధేయ పడ్డారు. ఇది విన్న శిష్యులు “ఆచార్యులవారు, ఏమి పాపమలు చేశారని ప్రాయశ్చిత్త పడుతున్నారు ?” అని అనుకున్నారు.

ఒక శిష్యుడు,ఏమిటి ఆ పాపము నేను తెలుసుకోవాలి అని , ఆచార్యుల వారిని అడిగాడు.
దానికి శ్రీ ఆది శంకరాచార్య ఇలా సమాధానము చెప్పారు.

1. “నేను భగవంతుడిని సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను. సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేస్వరుడిని చూడడానికి మటుకు కాశి నగరానికి వచ్చాను. అంటే మనసా వాచా కర్మణా నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేక పోయాను. అది నా నేను చేసిన మొదటి దోషము “అని సమాధానమిచ్చారు.

2. తైత్త్రియ ఉపనిషద్ లో “యతో వాచో నివర్తన్తే , అప్రాప్య మనసా సః ” భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు” ఇది తెలిసి కూడా శ్రీ కాశి విశ్వనాధ అష్టకం వ్రాశాను.”ఇది నేను చేసిన మొదటి తప్పు!

3. నిర్వాణ శతకం లో
“న పుణ్యం న పాపం, న సౌఖ్యం న దుఖం.
న మంత్రో న తీర్తం, న వేదా న యజ్ఞః
అహం భోజనం, నైవ భోజ్యం న భోక్త. చిదానందరూపం శివోహం శివోహం “అని వ్రాశాను
అర్థము :
నాకు పాప పుణ్యములు సుఖ దుఖములు లేవు .మంత్ర జపములు తీర్థసేవలు , వేద యజ్ఞములు లేవు. భోజన పదార్థము ,భోజనము , భోక్త ( భుజించేవాడు) నేను కాదు!నేను చిదానంద స్వరూపుడను , శివుడను ,శివుడను!



ఇంత వ్రాసికుడా నేను తీర్ద యాత్రలు చేస్తున్నాను .
అంటే నేను వ్రాసినవి, చెప్పినవి నేనే పాటించటంలేదు. అందుకనే నేను చేసిన ఈ మూడు తప్పులని మన్నించమని ,ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను.

నీతి :

మన ఆలోచన , తీరు , మాటా అన్ని ఒకే లాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి కథ మనకి తెలియజేస్తోంది.
బైట ప్రపంచం మన పని తీరుని మటుకే చూస్తుంది. భగవంతుడు మాత్రం మన పని వెనక సంకల్పాన్ని , ఉద్దేశాన్ని కూడా చూస్తారు.
“మనస్ ఏకం , వచస్ ఏకం , కర్మణ్యేకం!”

ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో మహాత్ములు, స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధి తో ,ఆచరించి మనకు చూపించిన యధార్ధమైన మార్గము .

నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.🙏🙏🙏
***************

26, ఆగస్టు 2020, బుధవారం

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*



*652 నామ మంత్రము*

*ఓం వేద్య వర్జితాయై నమః*

తెలుసుకోవలసిన, తెలుసుకోబడని విషయములు ఏవియు లేని సర్వజ్ఞ, విజ్ఞాత్రి అయిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *వేద్య వర్జితా* అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం వేద్య వర్జితాయై నమః* అని ఉచ్చరిస్తూ విజ్ఞానస్వరూపిణి అయిన జగన్మాతను భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులు తల్లి కరుణచే   అఖండ విద్యాసంపన్నులై చక్కని జీవితంలో మంచి అధికారహోదాలో రాణిస్తారు

జగన్మాత  *సర్వజ్ఞా (అన్నియు తెలిసి ఉన్నది), జ్ఞానదాయని (జ్ఞానమును ప్రసాదించునది),  జ్ఞానవిగ్రహా (జ్లానమే తనరూపము),   జ్ఞానముద్రా (చూపుడు,బొతన వ్రేళ్మను కలుపగా ఏర్ఫడు జ్ఞానమద్రా స్వరూపిణి), జ్ఞానగమ్యా (జ్ఞానమునకు మార్గమయినది) జ్ఞానజ్ఞేయ (జ్ఞానము, జ్ఞానముచే తెలియదగునది)* అయినది పరాశక్తి. ఇంక తల్లికి తెలియవలసినది ఇంక ఏదియు లేదు అని భావము. అందుకే శ్రీమాత *వేద్యవర్జితా* అని వశిన్యాదులే నామ మంత్రమును అమ్మ నామావళిలో ఉంచారుఅమ్మకు ఇంక తెలియ వలసింది లేదు. *సర్వవేదాంత సంవేద్య* అనగా వేదాలలోను వేదాంగాలలోనూ  తెలియబడుచున్నది. అంటే తల్లి అన్నిటికీ అతీతమైనది, తల్లికి తెలియవలసినది ఇంక  ఏమియు లేదు గనుకనే జగన్మాత *వేద్య వర్జితా* యని స్తుతింపబడుచున్నది

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం వేద్య వర్జితాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతోవివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. *శ్రీలలితా సహస్రనామ తత్త్వవిచారణ* (శ్రీలలితా సహస్రనామములకు భాష్యముఅను గ్రంథము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, (జడ్చర్ల) శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* తపోవనం ఆశ్రమంలో లభించును.
************************


*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

*75 నామ మంత్రము*

*ఓం మంత్రిణ్యంబా  విరచిత విషంగ వధ తోషితాయై నమః*

విషంగుడు, విశుక్రుడు అను భండాసురుని సోదరులలో విషంగుని తన మంత్రిణి అయిన శ్యామలాదేవి (రాజశ్యామలా) సంహరించుటతో సంతోషించిన దేవి లలితాంబకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా* యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితాయై నమః* అని ఉచ్చరిస్తూ లలితాంబను ఉపాసించిన సాధకుడు తల్లికరుణచే విషయలోలత్వానికి, ఐహికసుఖములకు, ప్రాపంచిక విషయములయందు ఆసక్తికి, అజ్ఞానమునకు దూరముగలవాడై, బ్రహ్మజ్ఞానసంపన్నుడై తరించును.

మహిషాసురుడు, నరకాసురుడు, భండాసురుడు, రావణుడు, హిరణ్యకశిపుడు మొదలైన వారు విషయాసక్తులు ఐహికభోగ లాలసులు, అజ్ఞానులు అరిషడ్వర్గములకు ప్రతిరూపులు. ఇలాంటి ప్రవృత్తులచేత అసురలయారు. లేకుంటే తపోబల సంపన్నులు, మహాబలవంతులు. బలానికీ, తపోబలానికీ కూడా దేవతలతో సమానులు. భండాసురుడు అతని పుత్రులు విషంగుడు, విశుక్రుడు కూడా అంతటివారే. రాక్షస ప్రవృత్తి గలవారు నేడుకూడా ఉన్నారుమహామాయావులుకూడా. భండాసుడైన  విషంగుని రూపంలో ఉన్న అజ్ఞానాన్ని, విషయాసక్తిని, అరిషడ్వర్గం పైకి తన  మంత్రిణీ అయిన శ్యామలను జగన్మాత పంపినది. శ్యామలాదేవీ విషంగుని వధించినది. వార్త వినిన తోడనే శ్రీమాత సంతోషించింది

విషంగుడు అంటే మనలో విషయలంపటాన్ని రెచ్చగొట్టేవాడు. విషయ లంపటం అనేది అరిషడ్వర్గము(కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యము) లకు సంబంధించినదే. అటువంటి విషయలంపటాన్ని నాశనంచేయగల సమర్థత శ్యామలాదేవికి గలదు గనుకనే శ్రీమాత విషంగ సంహారానికీ శ్యామలాదేవిని పంపింది. శ్యామలాదేవిని రాజశ్యామలా అంటారు. శ్యామలామంత్రోపాసన వలన అరిషడ్వర్గములు నశిస్తాయి. అజ్ఞానం పటాపంచలవుతుంది. విషంగుని వధించినది మంత్రిణి శ్యామలాదేవి. విషంగ సంహారంతో జగన్మాతలో సంతోషం కలిగింది.
అందుకే జగన్మాతను *మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా* యను నామ మంత్రంతో వశిన్యాదులు జగన్మాతను ప్రస్తుతించారు

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మంత్రిణ్యంబా విరచిత  విషంగ వధ తోషితాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతోవివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. *శ్రీలలితా సహస్రనామ తత్త్వవిచారణ* (శ్రీలలితా సహస్రనామములకు భాష్యముఅను గ్రంథము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, (జడ్చర్ల) శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* తపోవనం ఆశ్రమంలో లభించును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏నేడు బుధ (సౌమ్య) వారము🔱🔱🔱బుధ (సౌమ్య) వారమునకు అధిపతి బుధుడు🌻🌻🌻 రోజు గణపతిని, షణ్మఖుని ఆరాధించుదుము🌹🌹🌹ఆధ్యాత్మికంగా శ్రీమహా విష్ణువుకు రోజు  చాలా ప్రీతికరము🌸🌸🌸ఓం గం గణపతయే నమః🚩🚩🚩ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిప్రచోదయాత్.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదిహేడవ అధ్యాయము*

*భగవంతుడు ప్రత్యక్షమై అదితికి వరమును ప్రసాదించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*17.10 (పదియవ శ్లోకము)*

*ఆయుః పరం వపురభీష్టమతుల్యలక్ష్మీర్ద్యోర్భూరసాః సకలయోగగుణాస్త్రివర్గః|*

*జ్ఞానం కేవలమనంత భవంతి తుష్టాత్త్వత్తో నృణాం కిము సపత్నజయాదిరాశీః॥6967*

అనంతా! నీవు ప్రసన్నుడవైనచో మానవులకు బ్రహ్మదేవునియంతటి దీర్ఘాయువు, అతనితో సమానమైన దివ్యశరీరము కూడా ప్రాప్తించును. అంతేగాదు, వారు కోరుకొనిన వస్తువులు, అనంత సంపదలు, స్వర్గమర్త్యపాతాళలోకములు, యోగసిద్ధులు, ధర్మార్థకామములు, ఇంకను ఆత్మజ్ఞానము గూడ ప్రాప్తించును. ఇంక శత్రువులపై విజయము, మొదలగు చిన్న చిన్న లాభములు కలుగునని చెప్పవలసిన పనియే లేదు".

*శ్రీశుక ఉవాచ*

*17.11 (పదకొండవ శ్లోకము)*

*అదిత్యైవం స్తుతో రాజన్ భగవాన్ పుష్కరేక్షణః|*

*క్షేత్రజ్ఞః సర్వభూతానామితి హోవాచ భారత॥6968*

*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! అదితి విధమగా కమలాక్షుని స్తుతింపగా, సకల ప్రాణుల హృదయములలో నిలిచి వారి గతులను, స్థితులను ఎరిగిన భగవానుడు ఆమెతో ఇట్లనెను-

*శ్రీభగవానువాచ*

*17.12 (పండ్రెండవ శ్లోకము)*

*దేవమాతర్భవత్యా మే విజ్ఞాతం చిరకాంక్షితమ్|*

*యత్సపత్నైర్హృతశ్రీణాం చ్యావితానాం స్వధామతః॥6969*

*శ్రీభగవానుడు పలికెను* "దేవమాతా! అదితీ! నీ చిరకాలవాంఛను నేను ఎరుగుదును. శత్రువులు నీ సుతుల  సంపదలను లాగికొనిరి. వారి స్థానములనుండి వారిని వెళ్ళగొట్టిరి.

*17.13 (పదమూడవ శ్లోకము)*

*తాన్ వినిర్జిత్య సమరే దుర్మదానసురర్షభాన్|*

*ప్రతిలబ్ధజయశ్రీభిః పుత్రైరిచ్ఛస్యుపాసితుమ్॥6970*

యుద్ధమునందు నీ పుత్రులైన దేవతలు బలగర్వితులైన అసురులను జయించివిజయలక్ష్మిని పొందవలెనని నీవు అభిలషించుచున్నావు. నీవు నీ పుత్రులతో కలిసియుండుటకు కోరుచున్నావు.

*17.14 (పదునాలుగవ శ్లోకము)*

*ఇంద్రజ్యేష్ఠైః స్వతనయైర్హతానాం యుధి విద్విషామ్|*

*స్త్రియో రుదంతీరాసాద్య ద్రష్టుమిచ్ఛసి దుఃఖితాః॥6971*

ఇంద్రుడు మొదలగు నీ పుత్రులు శత్రువులను వధింపవలెననియు దుఃఖితులైన అసురుల భార్యలు ఏడ్చుచుండవలెననియు దానిని నీవు చూడవలెననియు కోరుచున్నావు.

*17.15 (పదునైదవ శ్లోకము)*

*ఆత్మజాన్ సుసమృద్ధాంస్త్వం ప్రత్యాహృతయశఃశ్రియః|*

*నాకపృష్ఠమధిష్ఠాయ క్రీడతో ద్రష్టుమిచ్ఛసి॥6972*

అదితీ! నీ పుత్రులు తమ సంపదలను, శక్తిని పొందవలెననియు, వారు కీర్తిని, ఐశ్వర్యములను తిరిగి పొందవలెననియును, వారు స్వర్గముపై ఆధిపత్యములను పొంది, మునుపటివలె విహరింపవలె ననియు నీవు కోరుచున్నావు.

*17.16 (పదునారవ శ్లోకము)*

*ప్రాయోఽధునా తేఽసురయూథనాథా  అపారణీయా ఇతి దేవి మే మతిః|*

*యత్తేఽనుకూలేశ్వరవిప్రగుప్తా విక్రమస్తత్ర సుఖం దదాతి॥6973*

కాని, దేవీ! ఇప్పుడు అసుర సేనాపతులను జయించుట సాధ్యముకాదని నా అభిప్రాయము. ఏలయన, కాల స్వరూపుడైన పరమేశ్వరుడు, భృగువంశ బ్రాహ్మణులు వారికి అనుకూలముగా ఉన్నారు. సమయమున వారితో యుద్ధము చేసినను మనకు జయము లభింపదు.

*17.17 (పదిహేడవ శ్లోకము)*

*అథాప్యుపాయో మమ దేవి  చింత్యః సంతోషితస్య వ్రతచర్యయా తే|*

*మమార్చనం నార్హతి గంతుమన్యథా శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్॥6974*

దేవీ! ఐనను విషయము ఏదేని ఒక ఉపాయమును ఆలోచింపవలసియున్నది. నీవు పయోవ్రతమును ఆచరించుటవలన నేను మిక్కిలి ప్రసన్నుడనైతిని. నా ఆరాధన ఎన్నడును వృథాకాదు. శ్రద్ధకు తగినట్లుగా ఆరాధనకు తప్పక ఫలము లభించును.

*17.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*త్వయార్చితశ్చాహమపత్యగుప్తయే పయోవ్రతేనానుగుణం సమీడితః|*

*స్వాంశేన పుత్రత్వముపేత్య తే సుతాన్ గోప్తాస్మి మారీచతపస్యధిష్ఠితః॥6975*

నీవు పుత్ర రక్షణ కొరకే విధ్యుక్తముగా పయోవ్రతము ద్వారా నన్ను పూజించి స్తుతించితివి. కనుక నేను నా అంశతో కశ్యపుని తపస్సునందు ప్రవేశింతును. నీకు పుత్రునిగా జన్మించి, నీ సంతానమును రక్షించెదను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదిహేడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
*******************