శ్రీనాథమహాకవికి బమ్మెర పోతరాజునకు బావమరదుల సంబంధము చెప్పబడుచున్నది. శ్రీనాథుడు కావ్యములను వ్రాసి రాజులకునిచ్చి ధనముగొనుటలో యిష్టుడు. పోతన మాత్రము ఇట్టి కార్యమును నీచమైనదిగా భావించువాడు. పోతన దారిద్య్ర బాధల ననుభవించినప్పటికిని కావ్యము రాజదత్తము కానిచ్చుట కిష్టపడని వాడు. శ్రీనాథుడీ దరిద్ర బాధలు జూచి పోతనకు కావ్యము రాసి ధనము సంపాదించుమని సలహాయిచ్చినాడు.
కం. “కమ్మని” గ్రంథంబొక్కటి
యిమ్ముగ నే నృపతికైన గృతి యిచ్చినఁ "గై
కొమ్మని” యీయరె యర్ధం
బిమ్మహి దున్నంగనేల యిట్టి మహాత్ముల్?
దానికి పోతన జవాబిచ్చినాడు.
ఉ: బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్
కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్
హాలికులైననేమి గహనాంతర సీమల కందమూలకౌ
ద్దాలికులైననేమి నిజదారసుతోదర పోషణార్ధమై.
శ్రీనాధుని సలహాకు జవాబుగా పోతన చెప్పినాడన్న ఈ చాటువు మంచన “కేయూర బాహు చరిత్ర”యoదున్నది.
పోతన్న పొలము దున్నుకొని బతికినాడని శ్రీనాథుని చాటువు వలనను, పోతన జవాబు (పై రెండు పద్యముల) వలనను తెలియుచున్నది. కావ్యము "బాల రసాలసాల నవపల్లవ కోమలయైన కన్య” వలె పోతనకు దోచినది. స్వంత కుమార్తెను దుర్మార్గులైన రాజులకిచ్చి వివాహముచేయుట కిచ్చగింపడు పోతన. రాజదూషణ మునుబట్టి సర్వజ్ఞ సింగ భూపాలునికి పోతనతో వైరము కథగా చెప్పబడుచున్నది.
💥💥💥💥💥💥💥💥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి