14, జూన్ 2026, ఆదివారం

సుందరకాండ-హనుమ*

  


      *సుందరకాండ-హనుమ*

                ➖➖➖✍️


*నమోస్తు రామాయ సలక్ష్మణాయ*

*దేవ్యైచ తస్యై జనకాత్మజాయై*

*నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో*

*నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః*

```

*రావణుడు తన మధుర వాక్కులతో ప్రణయ ప్రార్థన ప్రారంభించాడు.. 

“ఓ సుందరీ నీకెందుకింత భయం? భయంతో నీ సౌందర్యాన్ని దేనికి దాచుకుంటావు? సర్వలోకాలనూ ఆకర్షించే నీ అందాన్ని అర్థిస్తున్నాను. నన్ను ఆదరించి ప్రేమించు. ఇక్కడ మానవ ప్రాణి లేదు. వీరికెవ్వరికీ కామరూప శక్తి లేదు. మీ లాగే మాకు కూడా ధర్మభీతి చాలా వుంది. పరస్త్రీలను బలాత్కరించడం, వారితో భోగించడం రాక్షస జాతి ధర్మం. ఈ ధర్మ నిర్వహణలో నేను అప్రమత్తంగా వుంటాను. నీ మనసు నన్ను కోరేవరకు నిన్ను నేను తాకను, మదన తాపం నా మనసును యెంత వేధించినా నేను నిన్ను ముట్టను. 

నీకు అంగీకారం అయ్యే వరకు వేచియుంటాను. ఎందుకింత భయం? సుఖంగా నన్ను ప్రేమించు. భోగాలు అనుభవించు. కటిక నేలపై మలిన వస్త్రంతో నిష్కారణంగా ఉపవాసాలతో ఏకవేణితో, యెందుకు దీర్ఘాలోచన చేస్తున్నావు. హాయిగా నా మాట విని నన్ను ఆదరించు. స్వర్ణాభరణాలు, సుగంధ, సుమమాలలు, చీనాంబరాలు, మణిమయ పీఠాలు, మధురమైన పానీయాలు, నృత్యాలు, గానాలు, వినోదాలు, హంసతూలికా తల్పాలు అన్నీ అనుభవించు. వెనక్కి రాని నదీ ప్రవాహంలా పోయిన యవ్వనం మళ్ళీ రాదు. సృష్టికర్త సర్వసౌందర్యరాశిగా నిన్ను సృష్టించి విశ్రాంతి తీసుకున్నాడా? పితామహుడైన బ్రహ్మకు కూడా కన్ను చెదిరే అందం నీది. నీ శరీరంలో అణువణువూ అత్యంత మనోహరమైన నా కనులకు బంధం వేస్తున్నది. నన్ను కాదనకు, నా మాట విని నన్ను గ్రహించి నా రాణీ వాసానికి పట్టమహిషి వై వుండు. దిగ్విజయ యాత్రలో నేను సాధించిన ఐశ్వర్యమంతా నీ ముందు వుంచుతాను, నేను నీ ఆధీనంలో వుంటాను. ఈ భూమండలంలో నన్నెదిరించి నిలిచే వీరుడు లేడు. నాకు శత్రువై బ్రతికిన వాడు లేడు.

ఈ మలిన వస్త్రమును వీడి సర్వాలంకార భూషితవై యదేచ్ఛగా నాతో కూడి పానక్రీడలు సాగించు. 

నీ చిత్తం వచ్చినట్లు దాన ధర్మాలు చేయు. నా సంపదలను ఐశ్వర్యాన్ని చూసావుగా యిన్ని భోగాలను అనుభవించక నారవసత్రంతో అడవుల్లో తిరిగే రామునికోసం బాధపడతావెందుకు. రామునికి సంపదలేదు, వనవాసం, కటిక నేలపై శయనం. నాకు చిక్కిన నీవు రాముని పొందలేవు. ఓ చారునేత్రీ గరుత్మంతుడు సర్పములు పట్టినట్లు నీవు, నీ సౌందర్యం నన్ను హరిస్తున్నాయి. ఈ దశలో నిను చూసిన తరువాత నా మనసు వికలమై నా అనుంగు భార్యలను కూడా ఆదరించలేకపోతున్నాను. దేవలోకంలో లక్ష్మీదేవిని ఆరాధించినట్లు నా నారీజనం నిను పూజిస్తారు, ఆదరిస్తారు, గౌరవిస్తారు. నా ఐశ్వర్యం కుబేరుని కన్నా మించి వుంది. అదంతా నీ సొంతం చేస్తాను. నా తపోబల శక్తికి కాని, సంపదలకు గాని రాముడు నాకు ఏ మాత్రం సరితూగడు. ఓ లలనా, హాయిగా స్వేచ్ఛగా నాతో కలిసి విహారాలు చేస్తూ భూమండలంలో కనీవినీ ఎరుగని సమస్త భోగభాగ్యాలను అనుభవించు. నీతో పాటు నీ బంధుకోటికి ఈ సమస్త భోగాలను అనుభవించే అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించు. సర్వాలంకారభూషితవై నాతో సర్వసుఖాలు అనుభవించు," యని పెక్కు విధముల రావణాసురుడు సీతమ్మను ప్రలోభపెట్టి తన వశం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కాని సీతమ్మ తల్లి తనకున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో శ్రీరాముని పాదములను మనసులో వుంచి తపస్సు చేస్తూ వుంది. పది నెలలు గడిచినా మనుష్యకాంతగా జీవిస్తోంది. ఆమెకు దేవేంద్రుడు ప్రతి దినం పాయసాన్ని దేవతలచే పంపించగా ఈ భూమండలం పై యెక్కడా వున్నా రామలక్ష్మణులకు చెందుగాక యని వారి ప్రీత్యర్థం కొంత పాయసాన్ని భూమిపై వుంచి మరికొంత కేవలం తన రాముడు వచ్చే వరకు జీవించడం కోసం, శరీరాన్ని నిలబెట్టడం కోసం కొంత పాయసాన్ని భుజిస్తూ రామునికోసం ఎదురుచూస్తోంది. 

పది నెలలు గడిచినా రావణాసురుని ఆధీనంలో వున్న సీతమ్మ ఒక్క పండు కాని ఒక మెతుకు కాని ముట్టుకోలేదు. ఇది అనర్థం, తన యింట వున్న సాధ్వీ మణి ఉపవాసం చేస్తున్నది అది నీ లంకకు చేటు అని ఎందరు చెప్పినా వినని మూర్ఖుడు రావణుడు కామాంధుడై బుద్ధి నశించిన వాడై విజ్ఞతా విచక్షణలు మరచి ప్రవర్తిస్తున్నాడు రావణుడు.✍️(సశేషం)

*జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్*

*జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్🙏*```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

కామెంట్‌లు లేవు: