17, నవంబర్ 2024, ఆదివారం

మధ్యతరగతి మందహాసాలు

 *మధ్యతరగతి మందహాసాలు* 


బాల్యంలో అంటే 60, 70 ప్రాంతాల్లో  మన మధ్యతరగతి ఇళ్లల్లో తరచుగా వినపడే మాటలు..


బంధువులు ఊరినుంచి రాగానే మంచినీళ్లిచ్చి, కుశల ప్రశ్నలు వేసినాక *"పొద్దున్న ఎప్పుడనగా బయలు దేరారో ఏమో, కాళ్ళు కడుక్కోండి వడ్డించేస్తాను"* అనే ఇల్లాలు 


పొద్దున్నే పాలవాడు గిన్నెలో పాలు పోయగానే 

"*ఈమధ్య  బొత్తిగా నీళ్ల పాలు పోసేస్తున్నావు"*


పక్క వీధి పిన్నిగారితో "*మీ కోడలు నీళ్ళోసుకుందిటగదా.. ఇప్పుడు ఎన్నో నెల?"*

అనే ఎంక్వయిరీ లు 


*"ఈరోజు మా తాతగారి తద్దినం. నాలుగు అరిటాకులు అడిగి కోసుకు రమ్మంది మా అమ్మ ?"* పక్కింటి పిల్లాడి అభ్యర్ధన 


*"వెళ్ళేటప్పటికి బాగా రాత్రి అవుతుంది కదా!*

*కాస్త పులిహోర, పెరుగన్నం చేసిస్తాను. రైలులో తిందురుగాని"* ప్రయాణమవుతున్న బంధువులతో  ఆప్యాయంగా ఇల్లాలు 


"*మీ పిల్లకు సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా లేక మేనరికాలు ఉన్నాయా?*" పొరుగింటి పిన్నిగారి ఆరా 


"*ఈ నెల నుంచి అద్దె ముప్పై పెంచుతానంటున్నారు*

*ఇంటాయన*" బెంగగా అద్దె ఇంటాయన 


*"ముందు ఆ బాత్ రూమ్ తలుపు రిపేర్ చేయించి పెంచమనండి"* ఇంటామే ఇచ్చిన హింటు 


"*పరీక్షలు దగ్గిర పడుతున్నాయి. ఇక ఆటలు ఆపి చదవండి*" నాన్నగారి హుంకరింపు 


"* తెల్లారగట్లే అయిదింటికి లేపుతా*.. *నాతోబాటే లేచి చదవండి. తెల్లారగట్ల చదివితే బాగా వస్తుంది చదువు"* అమ్మ బుజ్జగింపు 


"*ఏమండి.. బియ్యం తేవాలి. ఇక రెండు రోజులే వస్తాయి"* ఇల్లాలి అల్టిమేటం 


" *మీరు చదవడం అయిపోతే ఈ వారం ప్రభ  ఒకసారి ఇవ్వండి పిన్ని గారూ... జీవనతరంగాలు చదివి ఇచ్చేస్తాను"* పక్కింటావిడతో ఇంటావిడ 


" *వెంకటేశా లో మాయాబజారు సినిమా మార్నింగ్ షోలు వేస్తున్నారుట. రేపు ఉదయం పిల్లలు స్కూళ్లకి, అన్నయ్య గారు ఆఫీస్ కి వెళ్ళాక వెళ్లొద్దామా వదిన గారూ?"* పక్కింటావిడ ప్రపోజల్ 


"*వారంలో ఒక్కరోజైనా నాగా పెట్టకుండా ఉండవు గదా నువ్వు*?" పనిమనిషితో  కోపంగా ఇంటి ఇల్లాలు 


"*పెద్దాడు ఇంకా మణియార్డర్ పంపలేదేమిటో?"*

ఓ పెద్దాయన ఆరాటం 


*"పంపుతాడు లెండీ. జీతాలు ఇచ్చారోలేదో "*

కొడుకుని వెనకేసుకొస్తూ పెద్దాయన భార్య 


ఎవరన్నా బంధువులు ఇంటికి వస్తే, వారిని ఆదరంగా ఆహ్వానిస్తూ *"పొద్దున్న కాకి ఒకటే అరుస్తుంటే, ఇవాళ ఎవరో ఇంటికి వస్తారు అని అనుకుంటూనే ఉన్నాను. రండి రండి"*


"*సరే... జీతాలు రానీ.. కొందాం"*  నెలాఖరులో అందరి నాన్నల స్టాక్ డైలాగ్ 


అప్పటి టెలిగ్రాములలో మచ్చుకి కొన్ని 


"Start immediately. Father not well"


"Arriving by tenth circar"


"Lakshmi delivered male child  on fifth. Both are safe"


"*ఈసారి పండగ కి రేషన్ కార్డు మీద ఇంకో కిలో పంచదార ఎక్కువ ఇస్తున్నారుట"* అమ్మ ఆనందం 


"*కిరసనాయిలు కూడా ఇస్తే బాగుండును. కరెంట్ అస్తమానూ పోతోంది"* పక్కింటి పిన్నిగారి ఆశాభావం 


"*మొన్న ద్రోణంరాజు గారింట్లో పట్టపగలే గోడ దూకి దండెం మీద ఆరేసిన బట్టలు,*  ఇత్తడి 

డేగిసా  ఎత్తుకుపోయారుట!" అమ్మలక్కల పిచ్చాపాటి.


*"అయినా  చోద్యం కాకపొతే ఇత్తడి డేగిసా అలా బయట వదిలేస్తారా ఎవరైనా.. ఎత్తుకెళ్లిపోరూ మరి?"* ఒక పిన్నిగారి మూతి విరుపు 


"*ఏంట్రా ఈ మార్కులు... హాఫ్ ఇయర్లీ కి కూడా ఇలాగే వస్తే  చెప్తా నీ సంగతి*" నెత్తి మీద నాలుగు పీకి ప్రోగ్రెస్ కార్డు సంతకం పెడుతున్న నాన్నగారు 


"*నాన్నగారు అన్నవరం క్యాంపు కి వెళ్ళివచ్చారు. ప్రసాదం ఇచ్చిరమ్మంది అమ్మ*"  సత్యనారాయణ స్వామి ప్రసాదం పొట్లం ఇస్తూ పక్కింటి పిల్ల. 

కళ్లకద్దుకుని మరీ తీసుకున్న ఇల్లాలు.


"*నాన్న గారి తిధి మళ్ళా ఆదివారమే. పచారీ సామాను ఏం కావాలో  చూసి లిస్టు రాయి. సాయంత్రం వెళ్లి శాస్త్రి గారికి చెప్పి వస్తా*" అంటున్న నాన్నగారి మాటలు విని  తాతగారి తద్దినానికి వచ్చే మేనత్త పిల్లలు, బాబాయ్ పిల్లలతో ఆడుకోవొచ్చనే పిల్లల ఆనందం 


*"నల్లులు ఎక్కువైపోయాయి. నల్లుల మందు తెండి. రేపాదివారం మందు కొట్టి  మంచాలు ఎండలో పడేద్దాం"* ఇప్పుడు దోమల్లాగ అప్పుడు నవారు మంచాల్లో నల్లుల బాధ 


"*ఈ బియ్యం తీసుకెళ్లి మరాడించుకుని రారా. శనివారం ఫలహారం ఉప్పుడుపిండి చేయాలి"*

కొడుకుతో తల్లి.


*"అలాగే ఆ చేత్తోటే  ఓ మెట్టవంకాయ కాల్చి పులుసుపచ్చడి పెట్టమ్మా.  మీ ఆయనకు పిండిలోకి ఇష్టం"* కొడుకు ఇష్టం తెలిసిన తల్లి గారు కోడలుతో 


"*మీ అబ్బాయికి  బ్యాంకు ఉద్యోగం వచ్చిందిట గదా... సంతోషం. ఇక పెళ్లి చేసేయొచ్చు*" కుర్రాడి తండ్రితో పక్కింటాయన.


*"ఏదీ ఇంకా జాయినే కాలేదు. అప్పుడే పెళ్ళా?"*

కుర్రాడి తండ్రి.


"*ఇప్పుడే కాదులెండి. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా... మా బావమరిది కూతురు ఉంది. బంగారుబొమ్మ.  డిగ్రీ చదువుతోంది. కాస్త దృష్టిలో పెట్టుకోండి"* పిల్ల మేనత్త మొగుడు కర్చీఫు వేసేసి కాఫీ తాగి వెళ్ళాడు 😃😃


ఇప్పటి మన జీవితాలతో పోల్చుకోండి. చాలా తక్కువ వినబడుతున్నాయి ఈ సంభాషణలు,

 ఆ ఆప్యాయతలు. 😢😢


అన్నీ చదవడం ద్వారా అప్పటి మన మధ్యతరగతి ఇంటి వాతావరణాన్ని మళ్ళీ సృష్టించుకుందాం.


🙏🌷🙏🌷🙏

కామెంట్‌లు లేవు: