*శ్రీమద్భాగవతం - 37/42*
*రుక్మిణీ కళ్యాణం*
ఓం నమో భగవతే వాసుదేవాయ!
మన భాగవత అధ్యయనం లో ఈరోజు అత్యంత శక్తివంతమైన ఘట్టం రుక్మిణి కళ్యాణం గురించి తెలుసుకుని సకల శుభాలు పొందుదాం రండి.
గుహలో కాయవనుడు మరణించాక
ముచుకుందునీ అనుగ్రహించిన పరమాత్మ తిరిగి మధురా నగరానికి వచ్చాడు, నగరం చుట్టూ కాలయవనుని సైన్యాలు భారీ సంఖ్యలో మోహరించి ఉన్నాయి వారిని అంతం చేసి ఎద్దుల బండ్ల పై వారి వద్ద ఉన్న అపార ధన రాశులను ద్వారకకు తరలించారు.
అదే సమయంలో అపార సైన్యంతో జరాసంధుడు మళ్ళీ దాడి చేయగా బల రామకృష్ణులు ప్రవర్శనగిరి అనే పర్వతం వైపు పరుగు తీశారు, అక్కడ ఎంత వెతికినా వీరి జాడ దొరకలేదు అని మొత్తం పర్వతానికి నిప్పు పెట్టాడు జరాసంధుడు, బల రామకృష్ణులు ఎగిరి 11 యోజనాల ఎత్తునుండి దూకి, ద్వారక చేరారు,అది తెలియని జరాసంధుడు బలరామ కృష్ణులను అంతం చేసాను అనుకుని తన సైన్యం తో రాజ్యానికి వెళ్లిపోయాడు.
ఆ సమయంలోనే కొంత కాలానికి ఆనర్త దేశాన్ని పాలించిన రైవతుడు (కకుద్మి) అనే రాజు తన కుమార్తె అయిన రేవతితో కలిసి బలరాముని వద్దకు వచ్చాడు.
గతంలో (కృతయుగంలో) రైవతుడు తన కుమార్తెకు తగిన వరుని నిర్ణయించమని బ్రహ్మదేవుని వద్దకు వెళ్లగా, అక్కడ గడిచిన కాసేపట్లోనే భూలోకంలో 27 చతుర్యుగాలు గడిచిపోయాయి. అప్పుడు బ్రహ్మదేవుడు, "రాజా! కాలం మారిపోయింది, ప్రస్తుతం భూమిపై శ్రీమహావిష్ణువు అంశగా బలరాముడు అవతరించి ఉన్నాడు. ఆయనకే నీ కుమార్తెను ఇచ్చి వివాహం చెయ్యి" అని ఆజ్ఞాపించాడు.
బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం రైవతుడు రేవతిని ద్వారకకు తీసుకువచ్చాడు. అనంతరం సకల పెద్దల సమక్షంలో రేవతీ-బలరాముల వివాహం అత్యంత వైభవంగా జరిగింది.(ఈ విశేషాలు నవమ స్కంధంలో వివరంగా ఉంటాయి)
1. రుక్మిణీదేవి అనురాగం & రుక్మి కుతంత్రం
విదర్భ దేశాన్ని పాలించే భీష్మక మహారాజు రాజధాని కుండిన నగరం. ఆయనకు ఐదుగురు కుమారులు (రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మమాలి) మరియు సాక్షాత్తు లక్ష్మీదేవి అంశయైన రుక్మిణీదేవి ఏకైక కుమార్తె.
యదువీరుడైన శ్రీకృష్ణునియొక్క అందచందములను, బలపరాక్రమములను, గాంభీర్య, ఔదార్యాది సద్గుణములను, భోగభాగ్యములను గూర్చి తమ ఇంటికి వచ్చినవారు ప్రశంసించుచుండగా విని, ఆ కన్యకామణి ఎంతయు ముగ్ధురాలగుచుండెడిది. అందువలన ఆ స్వామియే తనకు తగిన వరుడని ఆమె నిశ్చయించుకొనెను.
శ్రీకృష్ణుడును తన కడకు విచ్చేసిన మహాత్ములవలన రుక్మిణీదేవియొక్క బుద్ధికౌశలమును, శుభలక్షణములను, ఔదార్యమును, రూపసౌభాగ్యమును, సచ్ఛీలమును, ఉత్తమగుణములను గూర్చి వినియుండెను. ఆ కారణముగా ఆ సుందరియే 'తనకు తగిన వధువు' అని అతడు నిర్ణయించుకొనెను. ఈవిధముగా ఆ ఇరువురును పరస్పర ప్రేమానురాగబద్ధులైరి.
రుక్మిణీదేవి తన మనస్సును పరిపూర్ణంగా శ్రీకృష్ణునికే అర్పించింది. తండ్రి భీష్మకుడికి ఇతర సోదరులకు కూడా కృష్ణునికి ఇచ్చి వివాహం చేయాలని ఇష్టముంది.
కానీ పెద్ద కుమారుడైన రుక్మి కృష్ణునిపై ద్వేషంతో, తన మిత్రుడైన చేది దేశపు రాజైన శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించాడు. వివాహానికి నిశ్చయ తాంబూలాలు ఇచ్చి, జరాసంధ, సాల్వ, దంతవక్త్రాది దుష్ట రాజులందరినీ ఆహ్వానించారు.
2. అగ్నిద్యోతనుని రాయబారం.
వివాహానికి కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో రుక్మిణీదేవి తీవ్రమైన ఆవేదన చెందింది. సమయస్పూర్తి గల ఆ దేవి
వెంటనే ఒక నమ్మకమైన, తనకు హితం కోరే ఒక వృద్ధ బ్రాహ్మణోత్తముడైన అగ్నిద్యోతనుడిని (సుదేవుడిని) పిలిచి, శ్రీకృష్ణునికి ఒక రహస్య లేఖను (సందేశ పత్రికను) ఇచ్చి ద్వారకకు పంపింది.
బ్రహ్మణ్యదేవుడైన (భూసురోత్తములయెడ భక్తినిరతిగల) శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణుని జూచినంతనే తన ఉన్నతాసనమునుండి దిగెను. పిమ్మట ఆయనను సముచితాసనమునందు కూర్చుండబెట్టి, దేవతలు తనను కొలిచినట్లుగా ఆ స్వామి ఆ విప్రోత్తముని పూజించి, మంచి చెడులు అడిగి తెలుసుకుని తాము ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటి అని అడిగాడు.
ఆ బ్రాహ్మణుడు ప్రభు నా పేరు అగ్నిద్యోతనుడు రుక్మిణి దేవి పంపగా ఈ లేఖ తీసుకుని వచ్చాను అని స్వామికి లేఖను అందించాడు
ఈ లేఖలో రుక్మిణీదేవి రాసిన **ఏడు శ్లోకాలు** భాగవతంలో పరమ పవిత్రమైన భక్తి ప్రపత్తులకు నిదర్శనం:
**రుక్మిణీ దేవి సందేశ సారాంశం:**(నిత్య పారాయణ చేత వివాహ సంబంధ దోషాలు తొలగిపోతాయి)
1. **రూప గుణ శ్రవణం (హృదయార్పణ):**
"ఓ భువన సుందరా! చెవుల ద్వారా ప్రవేశించి తాపత్రయాలను పోగొట్టే నీ దివ్య గుణాల గురించి, కనులకు ఆనందాన్నిచ్చే నీ సౌందర్యం గురించి విని నా మనసు సిగ్గు విడిచి నీయందే లగ్నమైంది."
2. **ఆత్మసమర్పణ:**
"ఓ ముకుందా! ఉత్తమ వంశం, రూపం, గుణం, విద్యా వివేకాలు, సంపదలు కలిగిన ఏ స్త్రీ మాత్రం నిన్ను పతిగా కోరుకోదు? అందుకే నా మనసుతో నిన్ను భర్తగా ఎప్పుడో వరించాను. నా శరీరాన్ని, ప్రాణాన్ని నీకే సమర్పిస్తున్నాను."
3. **హక్కును రక్షించుకోమనే వేడుకోలు:**
"ఓ కమలాక్షా! సింహం పాలుపంచుకోవలసిన భాగాన్ని నక్క (కుక్క) వచ్చి తాకడానికి చూసినట్లుగా... నీకు చెందవలసిన నన్ను చేదిరాజు శిశుపాలుడు తాకకముందే వచ్చి నీ సొంతం చేసుకో."
4. **సాహసంతో కూడిన మార్గం (యుద్ధ సవాలు):**
"నేను పూర్వజన్మల్లో లేదా ఈ జన్మలో ఇష్టాపూర్తములు, యజ్ఞాలు, దానాలు చేసి పుణ్యం సంపాదించి ఉంటే... ఆ పుణ్యఫలంగా నీవే నాకు పతివి కావాలి. శిశుపాల జరాసంధుల సైన్యాలను ఓడించి, నన్ను నీ పరాక్రమంతో గెలుచుకో."
5. **అంతఃపుర సమస్య – ఉపాయం:**
"మా అన్న రుక్మి నా వివాహాన్ని శిశుపాలునితో నిశ్చయించాడు. నన్ను అంతఃపుర స్త్రీల మధ్య నుండి బంధువులను చంపకుండా ఎలా తీసుకువెళ్లాలా అని ఆలోచించవద్దు... దానికి ఒక సులువైన ఉపాయం ఉంది."
6. **పార్వతీ పూజా ఘట్టం (తరుణం):**
"పెళ్లికి ముందు రోజు కులదేవత అయిన పార్వతీదేవి (గిరిజ) దర్శనార్థం వధువు నగరం వెలుపల ఉన్న ఆలయానికి ఊరేగింపుగా వెళ్లడం మా ఆచారం. నేను ఆ పార్వతీదేవి గుడికి వచ్చే సమయానికి నీవు వచ్చి, నన్ను నీ రథంపై ఎక్కించుకుని తీసుకువెళ్లు."
7. **చివరి ప్రతిజ్ఞ:**
"ఒకవేళ నీ పాదపద్మ ధూళిని పొందే భాగ్యం నాకు దక్కకపోతే, వ్రతాలు నియమాలతో నా శరీరాన్ని కృశింపజేసి ప్రాణాలైనా విడుస్తానే తప్ప మరొకరిని వరించను. ఎన్ని జన్మలకైనా నీ పాదసేవనే కోరుకుంటాను."
3. శ్రీకృష్ణుని కుండిన నగర ప్రవేశం & అంబికా పూజ (53వ అధ్యాయం)
లేఖను చదివిన శ్రీకృష్ణుడు అగ్నిద్యోతనుని చేతులు పట్టుకుని: "విప్రోత్తమా! రుక్మిణిపై నా మనస్సు కూడా అలాగే లగ్నమై ఉంది" అంటూ వెంటనే రథాన్ని సిద్ధం చేయించి, దారుకుని రథసారథ్యంలో అగ్నిద్యోతనుని ముందు ఉంచుకుని వాయువేగంతో కుండిన నగరానికి చేరుకున్నాడు.
అయితే శ్రీకృష్ణునికి వైరులు అయిన జరాసంధుడు, దంత్రవక్త్రుడు,విధూరధుడు,పౌండ్రకుడు వేలాదిగా శిశుపాలుని వెంట వచ్చారు, ఎలాగైనా రుక్మిణీ దేవి నీ శిశుపాలునికే దక్కేలా చేయాలి శ్రీకృష్ణుడు వస్తె అడ్డు పడాలి అని వారి తంత్రం.
ఆ విషయం తెలుసుకున్న బలరాముడు కూడా యాదవ సైన్యంతో బయలుదేరాడు.
భీష్మకునికి శ్రీకృష్ణ పరమాత్మ యందు వైరభావం లేకున్న పెద్ద కుమారుడి మాటను కాదనకుండ వివాహం జరిపిస్తూ ఉన్నాడు, రాజ్యం మొత్తం అంగ రంగ వైభవంగా అలంకరింప బడి ఉంది.
కుండిన నగరంలో వివాహ బాజాలు మోగుతున్నాయి. అటు రుక్మిణి దేవి అయ్యో ఇక ఒక్క రాత్రి మాత్రమే మిగిలి ఉంది సందేశం పంపిన బ్రాహ్మణుడు రాలేదు, శ్రీ కృష్ణుడు రాలేదు అని చింతిస్తూ ఉంటుంది.అదే సమయంలో ఆమెకు అనేక శుభ శకునాలు కలుగుతాయి.అదే సమయంలో బ్రాహ్మణుడు కూడా వచ్చి అమ్మా శ్రీకృష్ణుడు వచ్చి ఉన్నాడు నిన్ను తీసుకుని వెళ్తాడు అని చెప్పాడు. మహానుభావ నీవు చేసిన మేలుకు నేను ప్రత్యుపకారం చేయలేను అని ఆ బ్రాహ్మణుడికి సాష్టాంగ నమస్కారం చేసింది.
భీష్మకుడు కూడా బలరామ కృష్ణులు నగరానికి వచ్చిన సంగతి తెలుసుకుని , కుమార్తె వివాహానికి వచ్చినందుకు సంతోషించి అనేక కానుకలు సమర్పించాడు.వారికి తగిన విడిది గృహం ఏర్పాటు చేశాడు.ఆ నగరం లోనీ ప్రజలంతా స్వామీనీ చూసి ఎంతో ఆనందం పొందారు.మా చక్కని తల్లి రుక్మిణి కి ఈ చక్కని స్వామే తగినవాడు కదా,వారిద్దరి జంట బాగుంటుంది అలా చూసే భాగ్యం కలిగితే బాగుండు కదా అని వాళ్ళలో వారు అనుకున్నారు.
ఇంతలో రుక్మిణీదేవి సఖీమణులతో, రాజభటుల రక్షణ నడుమ నగరం వెలుపల ఉన్న అంబికాలయానికి నడుస్తూ వచ్చింది. అక్కడ పార్వతి దేవిని ప్రార్ధించింది.(పూజ చేసింది)
* **రుక్మిణీ ప్రార్థన:**
"నమస్యే త్వాంబికేఽభీక్ష్ణం స్వసంతానయుతాం శివామ్ |
భూయాత్ పతిర్మే భగవాన్ కృష్ణస్తదనుమోదతామ్ ||
*"తల్లీ జగన్మాతా! పరమేశ్వరా! శ్రీకృష్ణుడే నాకు పతి అయ్యేలా అనుగ్రహించు!"* అని భక్తితో పూజించి. ముత్తైదువలు అయిన విప్ర వనితలకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీసులు పొందింది.
4. రుక్మిణీ హరణం & రాజుల పరాభవం
పూజ ముగించుకుని రుక్మిణీదేవి ఆలయం వెలుపలికి వచ్చింది. ఆమె సౌందర్యాన్ని చూసి అక్కడున్న రాజులందరూ చేతుల్లోని ఆయుధాలు జారిపడి మంత్రముగ్ధులయ్యారు.
అదే క్షణంలో శ్రీకృష్ణుడు ఆ రాకుమారి తన రథం ఎక్కుటకు సుముఖంగా ఉంది అని గమనించి మెరుపులా దూసుకువచ్చి, సమస్త రాజులు చూస్తుండగానే రుక్మిణీదేవి చేయి పట్టుకుని తన రథంపైకి ఎక్కించుకున్నాడు.
అప్పుడు శిశుపాలుడు, జరాసంధుడు మొదలైనవారు తమ సైన్యాలతో కృష్ణుడిని అడ్డుకోవడానికి రాగా, అప్పటికే అక్కడికి చేరుకున్న శ్రీ బలరాముడు మరియు యాదవ సైన్యం వారిని చిత్తుచిత్తుగా ఓడించి తరిమికొట్టింది.
5. రుక్మి గర్వభంగం & ద్వారకలో దివ్య పరిణయం
తన సోదరిని తీసుకెళ్తున్నాడని తెలిసి రుక్మి తీవ్ర క్రోధంతో: "కృష్ణుడిని చంపకుండా, రుక్మిణిని తీసుకురాకుండా కుండిన నగరంలో అడుగుపెట్టను!" అని శపథం చేసి కృష్ణుని రథాన్ని వెంబడించాడు.
శ్రీకృష్ణుడు సునాయాసంగా రుక్మి రథాన్ని విరిచి, అతన్ని సంహరించడానికి ఖడ్గాన్ని ఎత్తాడు. రుక్మిణీదేవి కన్నీళ్లతో
"ప్రభూ! నీవు పరమయోగుల యొక్క హృదయములయందు నివసించువాడవు, దేహాభిమానులైన మూఢులు నిన్ను తెలిసికొనజాలరు. నీవు బ్రహ్మాది దేవతలకును దేవుడవు, జగన్నాథుడవు. తిరుగులేని భుజబలము గలవాడవు, కల్యాణ స్వరూపుడవు. (మంగళప్రదమైన కల్యాణము చేసికొనబోవు చున్నవాడవు. ) ఎంత దుష్టుడైనను ఇతడు నాకు అగ్రజుడు, నీకు బావమఱది. ఇతడు నిన్ను శరణుగోరకున్నను ఇతని పక్షమున నేను శరణువేడుచున్నాను. కావున ఇతని చంపుట యుక్తముగాదు.అని వేడుకుంది.
శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవి మాటను మన్నించి, రుక్మిని చంపకుండా ఊరుకున్నాడు అయిన అతని మూర్ఖ చేష్టలు మానలేదు దానితో
ఆయన అహంకారానికి శిక్షగా బందించి ఖడ్గంతో తలమీద, మీసాలపై కొన్ని చోట్ల జుట్టును గొరిగి (విరూపం చేసి)వదిలివేశాడు.
అపార సేనలను చెల్లాచెదురు చేశారు. రుక్మిణి దేవి తన అన్నకు ఇలా అవమానం జరిగినందుకు ఎంతో పరితాపం పొందింది కానీ బలరాముని బోధ చేత కుదురుకుంది
అటు అవమానంతో ఎప్పటి వరకైతే కృష్ణుని వధించి రుక్మిణి ని తీసుకు వస్తానో అప్పటి వరకు కుండిన నగరంలో అడుగు పెట్టను అని రుక్మి కుండిన నగరానికి వెళ్లలేక 'భోజకటం' అనే నూతన నగరాన్ని నిర్మించుకుని అక్కడే ఉండిపోయాడు.
* **కళ్యాణ మహోత్సవం:**
అలా శ్రీకృష్ణుడు అందరిని జయించి రుక్మిణీ సమేతుడై సువర్ణ ద్వారకకు చేరుకున్నాడు. సమస్త దేవతలు, మునులు, బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య **శ్రీకృష్ణ-రుక్మిణుల దివ్య కళ్యాణం** అత్యంత వైభవంగా జరిగింది. సమస్త ద్వారకా నగర ప్రజలు పరమానందంతో ఉత్సవాలు జరుపుకున్నారు.
📝 నేటి ముఖ్య విషయాలు:
1. **అనన్య శరణాగతి:** రుక్మిణీదేవి సందేశం జీవాత్మ పరమాత్మను చేరడానికి అత్యుత్తమ నిదర్శనం. భగవంతుని రూప, గుణాలను శ్రవణం చేయడమే భక్తికి మొదటి మెట్టు.
2. **గురుకృప – బ్రాహ్మణ దూత:** అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుడు (గురువు) జీవాత్మ (రుక్మిణి)ని పరమాత్మ (శ్రీకృష్ణుడు) వద్దకు చేర్చే దివ్య వారధిగా నిలిచాడు.
3. **రుక్మిణీ కళ్యాణ ఫలశ్రుతి:** భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని శ్రవణం చేసినా లేదా పఠించినా సమస్త గ్రహబాధలు తొలగి, సకల మంగళాలు, దాంపత్య సౌఖ్యం లభిస్తాయని విశ్వాసం. వివాహం అవ్వని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది.
.....సశేషం
🌹🙏🌹
🙏*న్యాయపతి*🙏
*నరసింహారావు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి