*శ్రీమద్భాగవతం - 38/42*🙏
*శమంతకమణి కథ & శ్రీకృష్ణుని అష్టమహిషులు*
ఓం నమో భగవతే వాసుదేవాయ!
మన భాగవత అధ్యయనం లో నిన్న రుక్మిణి కళ్యాణ ఘట్టం స్మరించి తరించాము, ఈరోజు శ్యమంతకోపాఖ్యానం, మిగిలిన వివాహా ఘట్టాలు స్మరించే ప్రయత్నం చేద్దాం.
*ప్రద్యుమ్నుని జననం – శంబరాసుర సంహారం*
పూర్వం పరమశివుని నేత్రాగ్నికి భస్మమైన మన్మథుడు, కొంతకాలానికి శ్రీకృష్ణ-రుక్మిణుల ప్రథమ సంతానంగా "ప్రద్యుమ్నుడు" అనే పేరుతో అవతరించాడు.
అయితే ప్రద్యుమ్నుడు పుట్టిన పది రోజులకే, తనకు కాబోయే శత్రువని గ్రహించిన శంబరాసురుడనే రాక్షసుడు ఆ శిశువును అపహరించి సముద్రంలో పడేశాడు. ఆ పసిబిడ్డను ఒక మహా మత్స్యం (చేప) మింగింది.
ఆ చేప జాలరుల వలలో చిక్కగా, వారు దానిని శంబరాసురుని వంటశాలకు కానుకగా ఇచ్చారు. ఆ చేప కడుపును చీల్చగా లభించిన దివ్య బాలుడిని చూసి, శంబరాసురుని ఇంట దాసిగా ఉన్న రతీదేవి (మాయావతి పేరుతో ఉన్నది) నారద మహర్షి ఉపదేశంతో ఆ బాలుడే తన పతి అయిన మన్మథుడని గ్రహించి అల్లారుముద్దుగా పెంచింది. భర్త భావంతోనే పెంచింది.
శంబరాసుర సంహారం:
ప్రద్యుమ్నుడు యుక్తవయస్కుడయ్యాక, మాయావతి అతనికి సకల మాయా విద్యలను, యుద్ధ తంత్రాలను ఉపదేశించి అసలు వృత్తాంతం చెప్పింది. అనంతరం ప్రద్యుమ్నుడు శంబరాసురునితో ఘోర యుద్ధం చేసి, తనపై ప్రయోగించిన మాయాస్త్రాలన్నింటినీ తిప్పికొట్టి వాడియైన ఖడ్గంతో వాడి తల నరికి సంహరించాడు.
శంబరాసురుని వధించిన తర్వాత ప్రద్యుమ్నుడు మాయావతితో కలిసి ఆకాశమార్గంలో ద్వారకకు చేరుకున్నాడు. అచ్చం శ్రీకృష్ణుడి రూపలావణ్యాలతో ఉన్న ప్రద్యుమ్నుడిని చూసి అంతఃపుర స్త్రీలు మొదట శ్రీకృష్ణుడేమోనని భ్రమపడ్డారు. రుక్మిణీ దేవికి పుత్రప్రేమ ఉప్పొంగింది. నారద మహర్షి వచ్చి అసలు విషయం చెప్పడంతో ద్వారకానగరం అంతా ఆనందోత్సవాల్లో మునిగిపోయింది.
అప్పుడు పరీక్షితు మహారాజు సత్రాజిత్తు వృత్తాంతం వివరంగా చెప్పమని అడుగగా, శుక మహర్షి దాన్ని ప్రారంభం చేశాడు..
*సూర్యభగవానుని శమంతకమణి & సత్రాజిత్తు*
ద్వారకలో నివసించే యాదవ శ్రేష్ఠుడైన సత్రాజిత్తు సూర్యభగవానుని ఉపాసించి మెప్పించాడు. సూర్యుడు ప్రసన్నుడై తన మిత్రుడు అయిన సత్రాజిత్తు కు తన తేజోవంతమైన 'శమంతకమణి'ని ప్రసాదించాడు. అతడు ఆ మణి మెడలో ధరిస్తే సాక్షాత్ సూర్యుని వలె తేజరిల్లుతూ ఉండేవాడు,ఆ వెలుగులో సాధారణ జనులు అతన్ని గుర్తుకూడా పట్టేవారు కాదు. (ఆ వెలుగుకు దూరం నుండే కళ్ళు మూతలు పడేవి)
**మణి ప్రభావం:** ఆ మణిని నిత్యం శుచిగా పూజిస్తే ప్రతిరోజూ ఎనిమిది బారువుల (దాదాపు 80 తులాల పైగా) బంగారాన్ని ప్రసాదిస్తుంది. ఆ మణి ఉన్న చోట క్షామం, వ్యాధులు, పాములు, అకాల మరణాలు,మానసిక, శారీరక సమస్యలు, చోర బాధలు ఉండవు.
**కృష్ణుని సూచన & సత్రాజిత్తు తిరస్కారం:**ఒకానొక సమయంలో ప్రజాహితం దృష్ట్యా ఆ దివ్య మణిని చక్రవర్తియైన ఉగ్రసేనునికి సమర్పించమని శ్రీకృష్ణుడు సూచించాడు, సత్రాజిత్తు లోభంతో అందుకు నిరాకరించాడు.
ప్రసేనుని మరణం & శ్రీకృష్ణునిపై అపనింద
అనంతరం ఒకరోజు సత్రాజిత్తు సోదరుడైన ప్రసేనుడు ఆ శమంతకమణిని మెడలో ధరించి వేట కోసం అడవికి వెళ్లాడు. అడవిలో ఒక సింహం ప్రసేనుడిని, ఆయన గుర్రాన్ని చంపి ఆ ప్రకాశవంతమైన మణిని నోట కరచుకుని ఒక కొండగుహ వైపు వెళ్ళిపోయింది.
**జాంబవంతుని చేతికి మణి:**అప్పుడు ఆ మణిని ఆశించి సింహాన్ని రామాయణ కాలం నాటి భక్తాగ్రేసరుడు, భల్లూకరాజైన **జాంబవంతుడు** సంహరించి, ఆ మణిని తన గుహలోకి తీసుకువెళ్లి తన చిన్ని కుమారుడైన సుకుమారుడికి ఆటవస్తువుగా ఇచ్చి వేశాడు.(ఊయల మీద కట్టాడు)
**నీలాపనింద:**ఎంతకూ అడవి నుండి ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో, ద్వారకలో సత్రాజిత్తు అతని కొరకు దుఃకింప సాగాడు. మణిని కంఠం లో ధరించి అడవికి వెళ్ళిన నా తమ్ముని బహుశా ఆ
*"శమంతకమణిని లాక్కోవడానికి కృష్ణుడే చంపించి ఉంటాడు"* అని నిరాధారమైన నిందను ప్రచారం చేశాడు.
ఆ వార్త క్రమంగా శ్రీకృష్ణుని చేరింది శ్రీకృష్ణుడు తనపై వచ్చిన నిందను బాపుకోవడానికి కొందరు ప్రముఖులతో/పౌరులతో కలిసి అడవికి ప్రసేనుడు వెళ్ళిన మార్గంలోనే బయలుదేరాడు.
జాంబవంతునితో 28 రోజుల యుద్ధం & రామ దర్శనం
వారు కొంత దూరం వెళ్లిన తదుపరి సింహం చే చంపబడిన
ప్రసేనుని శవాన్ని, అతని గుర్రాన్ని.మరి కొంత దూరంలో ఎలుగుబంటి చేతికి చచ్చిన సింహాన్ని చూస్తూ ఆ అడుగుజాడల వెంట వెళ్లి శ్రీకృష్ణుడు జాంబవంతుని చీకటి గుహదగ్గరకు వెళ్ళాడు, ప్రజలను బయటే ఉంచి తాను ఒంటరిగా లోపటికి ప్రవేశించాడు.
గుహలోకి వెళ్ళిన పిదప ఆ దివ్యమణి ఒక బాలునకు ఆటవస్తువు గా ఉండటం గమనించాడు,ఆ మణిని తీసుకోవడం కోసం బాలుని సమీపించి అక్కడ నిలబడ్డాడు.
అప్పుడు ఇక దాది కృష్ణుడిని చూసి అరవగా,అది విన్నంతనే జాంబవంతుడు క్రోధంతో కృష్ణునిపైకి లంఘించాడు.
* **28 రోజుల ద్వంద్వ సమరం:** శ్రీకృష్ణ-జాంబవంతుల మధ్య రాళ్లు, చెట్లు, పిడిగుద్దులతో రాత్రింబగళ్లు నిరంతరాయంగా **ఇరవై ఎనిమిది రోజుల పాటు** భీకర ద్వంద్వ యుద్ధం జరిగింది.
చివరకు పరమాత్మ పిడిగుద్దుల దెబ్బకు జాంబవంతుని అవయవాలు అన్ని నుగ్గునుగ్గయ్యాయి అతని బలం మొత్తం క్షీణించి పోయింది.
ఆశ్చర్యానికి లోనైన జాంబవంతుడు
*"ఈ సమస్త బ్రహ్మాండంలో నన్ను బాహుయుద్ధంలో ఓడించగల సమర్థుడు నా ఆరాధ్య దైవమైన **శ్రీరామచంద్రుడు** తప్ప మరొకరు లేరు!"అని భావించి
వెంటనే యుద్ధం ఆపి, కృష్ణుని పాదాలపై పడి కన్నీళ్లతో ప్రార్థించాడు. శ్రీకృష్ణుడే రాముడు అని గ్రహించాడు.స్వామి జాంబవంతుని అనుగ్రహించాడు.
అప్పుడు స్వామి జాంబవంతుని వెన్ను తట్టి జాంబవంత జనులు ఈ మణి నేనే దొంగిలించాను అని నింద వేశారు,అది తొలగించుకోవడం కోసమే నేను ఈ గుహలోకి వచ్చాను అన్నాడు
అంతట జాంబవంతుడు పరమానందంతో శమంతకమణితో పాటు తన ముద్దుల కుమార్తెయైన **జాంబవతీదేవిని**శ్రీకృష్ణునికి సమర్పించి పరిణయం జరిపించాడు.
ఇటు జనులు 12 రోజులు వేచి చూసినా స్వామి బయటకు రాలేదా అని తీవ్ర దుఃఖం తో ద్వారకకు తిరిగి వెళ్ళారు, దేవకి వసుదేవులకు విషయం చెప్పారు, ప్రజలంతా సత్రాజిత్తు ను తిట్టి పోశారు, స్వామి క్షేమంగా రావాలి అని దుర్గా ఆరాధన చేపట్టారు సరిగా అదే సమయంలో.....
సత్యభామా కళ్యాణం & శమంతకమణి కథ ముగింపు
ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు నీ చూసి జనులు ఎంతయో ఆనందం పొందారు
శ్రీకృష్ణుడు సత్రాజిత్తు ను ఉగ్రసేన మహారాజు సభను పిలిపించి, మణి లభించిన విధానం తెలిపి ఆ శమంతకమణిని సత్రాజిత్తుకు అప్పగించి నిజం నిరూపించాడు.
* **సత్రాజిత్తు పశ్చాత్తాపం:** నిష్కారణంగా పరమాత్మపై నింద మోపినందుకు భయపడి దీనికి నిష్కృతి ఏమి అని ఆలోచించి, తన సౌందర్యవతియైన కుమార్తె **సత్యభామాదేవిని**, శమంతకమణితో సహా కృష్ణునికి సమర్పించాడు.
* శ్రీకృష్ణుడు సత్యభామను అర్ధాంగిగా స్వీకరించి, శమంతకమణిని మాత్రం సత్రాజిత్తు వద్దనే ఉంచుకోమని తిరిగి ఇచ్చివేశాడు.
(ఒకానొక సమయంలో పాండవులు లక్క ఇంట్లో కాలిపోయారూ అన్న వార్త విని బలరామ కృష్ణులు హస్తినాపురం వెళ్తారు అప్పుడు శతధన్వుడు సత్రాజిత్తును చంపి మణిని దాచగా, కృష్ణుడు శతధన్వుడిని సంహరించి మణిని నిష్కళంకుడైన అక్రూరుని వద్ద సురక్షితంగా ఉంచాడు
5. శ్రీకృష్ణుని అష్టమహిషుల వైభవం
* 1. కాళింది (యమున):
శ్రీకృష్ణుడు లక్క ఇంటి నుండి క్షేమంగా బయట పడ్డ పాండవల వడ్డే నాలుగు నెలలు ఉన్నాడు ఆ సమయంలో ఒకరోజు అర్జునుడితో కలిసి యమునా తీరంలో విహరిస్తుండగా, పరమాత్ముడే పతిగా రావాలని ఘోర తపస్సు చేస్తున్న సూర్యపుత్రిక 'కాళింది' కనిపించింది. ఆమె భక్తికి మెచ్చి కృష్ణుడు ఆమెను వివాహం చేసుకున్నాడు.
* 2. మిత్రవింద:
అవంతీ దేశపు రాజకన్య (శ్రీకృష్ణుని మేనత్త కూతురు). ఆమె మనసులో కృష్ణుడినే కోరుకుంది. కానీ ఆమె సోదరులు విందుడు, అనువింధుడు దుర్యోధనుడికి స్నేహితులు ఆమెను అతనికే ఇవ్వాలని చూశారు. దాంతో స్వయంవర సభ నుండే శ్రీకృష్ణుడు ఆమెను రథంపై తీసుకొచ్చి ధర్మబద్ధంగా పరిణయమాడాడు.
* 3. సత్య (నాగ్నజితి):
కోసల దేశపు రాజు నగ్నజిత్తు... "ఎవరైతే తన ఏడు క్రూరమైన కొమ్ములు తిరిగిన ఎద్దులను లొంగదీస్తారో వారికే తన కూతురు సత్యను ఇస్తానని" షరతు పెట్టాడు. శ్రీకృష్ణుడు ఏకకాలంలో ఏడు రూపాలు ధరించి, క్షణాల్లో ఆ ఏడు ఎద్దులను బంధించి ఆమెను చేపట్టాడు.
* 4. భద్ర:
కేకయ దేశపు రాజకన్య (శ్రీకృష్ణుని మరో మేనత్త శ్రుతకీర్తి కుమార్తె). ఆమె సోదరులే స్వయంగా సంతోషంతో కృష్ణుడి వద్దకు తీసుకొచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు.
లక్షణ (మద్రరాజ పుత్రిక):
మద్రదేశాధిపతి అయిన బృహత్సేనుని కుమార్తె లక్షణ. ఆమె స్వయంవరంలో ఉన్న సమయంలో, శ్రీకృష్ణుడు గరుడుడు అమృతాన్ని తెచ్చిన రీతిలో, సభలోని రాజులందరినీ ఎదిరించి ఒంటిచేత్తో ఆమెను తీసుకువెళ్ళి వివాహం చేసుకున్నాడు.
ఇలా శ్రీకృష్ణునికి ప్రధానంగా ఎనిమిది మంది పట్టపురాణులు (అష్టమహిషులు) ఉన్నారు. వీరంతా భగవంతుని వివిధ శక్తుల దివ్యాంశలు..
ఈ అష్టమహిషులతో పాటు శ్రీకృష్ణుడు నరకాసురుని చెర నుండి విడిపించిన **16,100 మంది దివ్య కన్యలను** కూడా లోకాపవాదు నుండి రక్షించి, వారికి సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించడానికి ఏకకాలంలో అన్ని వేల రూపాలను ధరించి వారిని వివాహమాడాడు.
🌟ఆ లీల గురించి రేపు తెలుసుకుందాం, అనేక అనుమానాలు తొలగిపోతాయి తప్పక చదవండి..🌟
📝 నేటి అంతరార్థం
1. **వినాయక చవితి శమంతకోపాఖ్యానం:** భాద్రపద శుక్ల చవితి నాడు ప్రమాదవశాత్తు చంద్రుడిని చూసినవారికి నీలాపనిందలు రాకుండా ఉండటానికి ఈ 'శమంతకమణి కథ'ను పఠించి అక్షతలు శిరస్సున ధరించడం సంప్రదాయమైంది.(ఈ విషయం ఇక్కడ చెప్పలేదు కానీ వేరొక చోట ఉన్నది)
2. **భక్త వాత్సల్యం:** త్రేతాయుగంలో శ్రీరామునితో బాహుయుద్ధం చేయాలన్న జాంబవంతుని చిరకాల కోరికను ద్వాపరంలో శ్రీకృష్ణుడు 28 రోజుల యుద్ధం ద్వారా తీర్చి అనుగ్రహించాడు.
3. **అష్టమహిషుల అంతరార్థం:** భగవంతుని అష్టమహిషులు కేవలం ప్రాపంచిక భార్యలు కారు; వారు పరమాత్మ యొక్క అష్ట ప్రకృతి శక్తులు (భూమి, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం). అష్టమూర్తి తత్వమే అష్ట భార్యలు.
.....సశేషం
🌹🙏🌹
🙏*న్యాయపతి*🙏
*నరసింహారావు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి