20, సెప్టెంబర్ 2020, ఆదివారం

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 226 🌹*


రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 

50. అధ్యాయము - 5


*🌻. సంధ్య యొక్క చరిత్ర - 2 🌻*


బ్రహ్మో వాచ |


అహం స్వతనయాం సంధ్యాం దృష్ట్వా పూర్వమథాత్మనః | కామాయాశు మనోsకార్షం త్యక్తా శివ భయాచ్చ సా || 14


సంధ్యా యాశ్చలితం చిత్తం కామబాణ విలోడితమ్‌ | ఋషీణామపి సంరుద్ధ మానసానాం మహాత్మనామ్‌ || 15


భర్గస్య వచనం శ్రుత్వా సోపహాసం చ మాం ప్రతి | ఆత్మనశ్చలితత్వం వై హ్యమర్యాదమృషీన్‌ ప్రతి || 16


కామస్య తా దృశం భావం మునిమోహకరం ముహుః | దృష్ట్వా సంధ్యా స్వయం తత్రోపయమా యాతి దుఃఖితా || 17


బ్రహ్మ ఇట్లు పలికెను -


పూర్వము నేను నాకుమార్తె యగు సంధ్యను చూచి వెంటనే ఆమెను కామించితిని. కాని శివుని భయము వలన అధర్మమును వీడితిని (14). 


మన్మథుడు బాణములచే ప్రహారము చేయగా, సంధ్య యొక్క మనస్సు చలించెను. మనోనిగ్రహము గలవారు, మహాత్ములునగు ఋషులకు కూడ మనో వికారము కలిగెను (15).


 శివడు నాతో పరిహాస పూర్వకముగా పలికిన మాటలను సంధ్య విన్నది. తాను పొందిన మనోవికారమును, ఋషుల విషయములో జరిగిన అమర్యాదను కన్నది (16). 


మునులకు కూడా మోహమును కలిగించే కాముని సామర్థ్యమును పరిశీలించినది. ఆమె మిక్కిలి దుఃఖితురాలై అచట నుండి వెళ్లిపోయెను (17).


తతస్తు బ్రహ్మణా శ##ప్తే మదనే చ మయా మునే | అంతర్భూతే మయి శివే గతే చాపి నిజాస్పదే || 18


అమర్ష వశమా పన్నా సా సంధ్యా మునిసత్తమ | మమ పుత్రీ విచార్యైవం తదా ధ్యాన పరాsభవత్‌ || 19


ధ్యాయంతీ క్షణమేవాశు పూర్వం వృత్తం మనస్వినీ | ఇదం విమమృశే సంధ్యా తస్మిన్‌ కాలే యథోచితమ్‌ || 20


ఓ మహర్షీ! నేను మన్మథుని శపించి అంతర్ధానమైతిని. శివుడు తన ధామకు వెళ్లెను (18).


 ఓ మహర్షీ! ఆ సంధ్య జరిగిన వృత్తాంతమును సహించలేక పోయెను. నా కుమారైయగు సంధ్య అపుడు ఇట్లు తలపోసి, ధ్యానమగ్నురాలు అయెను (19). 


అభిమానవతియగు ఆ సంధ్య జరిగిన వృత్తాంతమును ధ్యానము చేయు చున్నదై, ఆ కాలమునకు ఉచితమగు విధానములో, ఇట్లు విమర్శ చేసుకొనెను (20).


సంధ్యో వాచ |


ఉత్పన్న మాత్రాం మాం దృష్ట్వా యువతిం మదనేరితః | అకార్షీత్సాను రాగోsయమభిలాషం పితా మమ || 21


పశ్యతాం మానసానాం చ మునీనాం భావితాత్మనామ్‌ | దృష్ట్వై వ మామమర్యాదం సకామమభవన్మనః || 22


మమాపి మథితం చిత్తం మదనేన దురాత్మనా | యేన దృష్ట్వా మునీన్‌ సర్వాంశ్చ లితం మన్మనో భృశమ్‌ || 23


ఫలమేతస్య పాపస్య మదనస్స్వయమాప్తవాన్‌ | యస్తం శశాప కుపితః శంభోరగ్రే పితామహః || 24


సంధ్య ఇట్లు పలికెను -


నేను యువతిగా జన్మించిన మరుక్షణములో, మన్మథునిచే ప్రేరితుడైన నా తండ్రి నన్ను మన్మథ వికారముతో కామించెను (21). 


మానసపుత్రులు, అంతః కరణ శుద్ధి గల మునులు చూచుచుండగా ఆయన నన్ను మర్యాద లేని విధముగా చూచి, మనస్సులో కామనను పొందినాడు (22). 


దుర్మార్గుడగు మన్మథుడు నా మనస్సును కూడ కల్లోల పెట్టగా , ఆ మునుల నందరినీ చూచుచున్న నా మనస్సు మిక్లిలి చలించెను (23). 


ఈ పాపమునుకు ఫలమును మన్మథుడు పొందినాడు. శంభుని యెదుట పితామహుడు కోపించి వానిని శపించినాడు (24).


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

మనుషులం

 మనం మనుషులం. కావున మనం

మనుషులని ప్రేమించాలి,

వస్తువులను వాడుకోవాలి !


కానీ వాస్తవానికి మనం

మనుషులను వాడుకుంటున్నాం,

వస్తువులని ప్రేమిస్తున్నాం !!


నేడు ... వస్తువులకు ఉన్నటువంటి "విలువ"

మనుషులకి లేదు.


నేడు మనుషులకి "మానవత్వం" లోపించింది కాబట్టే

"మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ"

అని పాట రాసి, పాడారు.


స్వార్ధపూరిత మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం.


అంగీకరించాల్సిన వాస్తవమేమిటంటే ఈరోజుల్లో మనుషులందరూ చాలా "కమర్షియల్" అయిపోయారు.


నేటి సమాజంలో "డబ్బుంటేనే మనిషికి విలువ" . మనిషికి ఎంత ఎక్కువ డబ్బుంటే

అంత ఎక్కువ విలువ.


"స్టేటస్" ని బట్టే గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి.


స్నేహం, ప్రేమ, ఆప్యాయత, పలకరింపులు ... ఇవన్నీ

నటన/డ్రామా అయిపోయాయి.

చాలా మంది మనుషులు నటిస్తున్నారు.


చివరిగా ఒక మాట ... ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన జీవి ఏదైనా ఉంది అంటే అది "మనిషే" !

మంచిమాట


*_తీపి ఉండాలే కానీ చీమల కేం కొదవా...?_*

*_కాసులుండాలే కానీ చుట్టాలకేం కొదవా...?_*

*_ఉప్పు తగిలితే చెదిరిపోవా చీమలు...!_*

*_నొప్పి తగిలితే బెదిరిపోరా చుట్టాలు...!!_*

*_ఎంతటి బలవంతులైనా,_*

*_అన్ని విషయాల్లో..._*

*_విజయం సాధించటం అన్నది సాధ్యపడదు._*

*_కొన్నికొన్ని సార్లు,_*

*_సృష్టి లోపాల కారణంగా,_*

*_ఓటమి పాలుకాక తప్పదు...!_*


*_కాలంతో గడియారం ముల్లులా పోటీ పడకు,_* 

*_అలుపు వచ్చిన ఆగలేవు, సాగలేవు.._*

*_జీవితం అంటే సంపదలు, పేరుప్రఖ్యాతులు, కుటుంబం మాత్రమే కాదు.._*

*_నీకు తృప్తి ఇచ్చేలా బతకడం,_*

*_వెనక్కి తిరిగి చూస్తే నీ ప్రయాణం అలసటగా కాదు స్వాంతనగ ఉండాలి.._*

*_ఈ ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన వ్యక్తులు,_* 

*_కేవలం సాటివారికి సహాయం చేసేవారు మాత్రమే.._*

*_మంచిని పంచండి, ఆ కర్మ మీకు తప్పక మీకు మంచిని తిరిగిస్తుంది.._*


*_☘శుభోదయం🌹🦚_*

*_✡సర్వేజనాః సుఖినోభవంతు._*

*_🕉లోకాసమస్తా సుఖినోభవంతు_*   

*_☸శుభమ్ భుయాత్,_* 

*_శుభమస్తు_*.          

🌻🌻🌻🌻🌻

*_....✍️ మీ స్వామి_*

#తోబుట్టువుల విలువ చెప్పిన శ్రీరాముడు



ఈనాడు మానవసంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్నాయి. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు చిన్న చిన్న కారణాలతో, అహంకారంతో, మనస్పర్ధలతో విడిపోతున్నారు. ఇటువంటి సమయంలో రామాయణం మొత్తం మానవాళికి ఒక ఆశాజ్యోతి. రాముడు తోబుట్టువుల గొప్పతనం గురించి రామాయణంలో చెప్పిన మాట అందరూ గుర్తించుకోదగినది.


ఇంద్రజిత్తు (మేఘనాధుడు) తో యుద్ధం చేసిన #లక్ష్మణుడు అతడు చేసిన అస్త్రప్రయోగంతో మూర్ఛపోతాడు. రక్తపుమడుగులో ఉన్న తమ్ముడిని చూసిన రాముడికి ఎక్కడలేని దుఃఖం వచ్చి సుశేషునితో ఈ విధంగా అంటాడు.


నా ప్రాణానికి ప్రాణమైన లక్ష్మణుని ఈ స్థితిలో చూసి నా శక్తి క్షీణించిపోతోంది. ఒకవేళ లక్ష్మణుడు మరణిస్తే, నా జీవితానికి, సంతోషానికి అర్దమేముంది? నా వీరత్వం సిగ్గుపడుతోంది. చేతి నుంచి ధనుస్సు పడిపోయినట్టుంది. బాణాలు జారిపోతున్నాయి. కన్నీరుతో కళ్ళు నిండి దృష్టి కూడా కనిపించడంలేదు. నేను మరణించాలనుకుంటున్నాను అని రాముడు ఎంతో ఏడుస్తాడు.


ఓ శూరుడా! లక్ష్మణా! విజయం కూడా నన్ను తృప్తి పరచలేదు. దృష్టి కోల్పోయిన వ్యక్తికి జాబిల్లి (చంద్రుడు) ఏ విధంగా సంతోషాన్ని ఇవ్వగలడు. ఇప్పుడు నేను పోరాడి సాధించేది ఏంటి? లక్ష్మణుడు మరణించి ఉంటే, నేను యుద్ధం చేసి లాభం ఏంటి? నువ్వు నన్ను ఏ విధంగా వనవాసానికి ముందు అనుసరించావో, అలాగే ఇప్పుడు నేను నిన్ను మృత్యువులో అనుసరిస్తాను. యముని వద్దకు నీ వెంట వస్తాను.


దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః |

తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతః సహోదరః ||


భార్యలు ఏ దేశంలోనైన దొరుకుతారు, బంధువులు కూడా అంతే. కానీ ఏ దేశానికి వెళ్ళిన తోబుట్టువులు మాత్రం దొరకరు. వారిని కోల్పోకూడదు అంటాడు #శ్రీరాముడు.


నేను ఇక్కడే, ఈ యుద్ధభూమిలోనే మరణిస్తాను, తిరిగి అయోధ్యకు వెళ్ళను, నాకు నీ కంటే ఎవరు ఎక్కువ కాదు అంటూ లక్ష్మణుని చూస్తూ రాముడు రోదిస్తాడు.


ఇది వాల్మీకి #రామాయణం యుద్ధకాండ 101 సర్గలో ఉంది.


తోడబుట్టిన వారి విలువ ఎంత చక్కగా చెప్పాడు శ్రీ రాముడు. అహంకారాలకు పోయి వారిని దూరం చేసుకుంటారా? కొత్తగా పెళ్ళై వచ్చిన జీవిత భాగస్వామి కోసం వారిని విడిచిపెడతారా? శ్రీ రాముడు మనకు ఆదర్శం కావాలి. బంధువులు, బంధుత్వాలు ఎన్నైనా కలుపుకోవచ్చు. కానీ తోబుట్టువులను తీసుకురాలేరు. వారితో కూడా కాలం గడపాలి, ప్రేమను పంచుకోవాలి. రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులులాగా అప్యాయతతో జీవించాలి...

*శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ*



ఇదేంటి విష్ణు రూపం శివుడేంటి అన్న ప్రశ్న అందరికి వొస్తుంది 


మనకి తెలియనని ఎన్నో విశేషాలు తిరుమల లో దాగి వున్నాయి . ప్రతి ప్రదేశం ఆపురూపం, ప్రతి చోట ఒక విశ్వాసం  


ప్రతి దేవాలయానికి ఒక క్షేత్ర పాలకుడు ఉంటారని అందరికి తెలుసు 


ఎన్నో విశేషాలను తనలో దాచుకున్న తిరుమల లో మరి క్షేత్ర పాలకుడు ఎవరో మీకు తెలుసా . సాధారణం గా అందరు వరాహస్వామి అనుకుంటారు . కానీ ఈ తిరుమల లో 

క్షేత్ర పాలకుడు శివుడు .


అందుకే శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ అన్నది 


ఈ శివుడు తిరుమలలో ఎక్కడ వున్నదని సందేహం అందరికి వొస్తుంది . ఎక్కడ ఉన్నదంటే మనం తిరుమల ఆలయం లో కి ప్రవేశించినప్పుడు ధ్వజస్థంభం దగ్గరలో ఈ శివుడు కొలువయి వున్నాడు .  


ఒకప్పుడు ఇక్కడ ఒక చిన్న కోడలా ఉండేదని చెపుతారు , తరువాత కాలక్రమేణా ఇక్కడ ఉన్న శివుణ్ణి గోగర్భం 

 అనే ప్రదేశం లో ఉంచి రుద్ర పూజ చేస్తున్నారు 

కానీ క్షేత్ర పాలక రూపం లో ఒక చిన్న శివలింగాకారం , ద్వజస్థం దగ్గరలో వుంది .


సాధారణం గా మనం లోపాలకి వెళ్లి స్వామిని దర్శించి ప్రసాదం కోసం పరిగెడతాం 


కానీ ఈ ఆలయం లో ఎన్నో విశేషాలున్నాయి . ఈ సారి అదృష్టం బాగుంది మళ్ళీ తిరుమల దర్శిస్తే ఈ శివయ్యను కూడా దర్శించండి . ఎందుకంటే ఈ ఆలయం లో అయినా క్షేత్ర పాలక దర్శనం జరగనిదే దర్శనం పూర్తి కాదని అంటారు .


వెంకట + ఈశ్వర = వెంకటేశ్వర 


ఈ సారి ఆ కేశవునితో పాటు శివుణ్ణి కూడా దర్శనం చేసుకోవటం మర్చిపోకండి .


*జంధ్యాల శ్రీశైలపతి శర్మ*

ఆదిపర్వము – 25

 ఆదిపర్వము – 25


ధృతరాష్ట్రుడి వివాహం


ధృతరాష్ట్రుడు, పాండు రాజు, విదురుడు భీష్ముని సంరక్షణలో పెరుగుతున్నారు. భీష్ముడు వారందరికి ఉపనయన సంస్కారం చేయించాడు. ముగ్గురు కుమారులు అన్ని విద్యలలో ఆరితేరారు. తరువాత భీష్ముడు ధృతరాష్ట్రునికి యౌవ్వ రాజ్య పట్టాభిషేకం చేసాడు. విదురుని బుధ్ధి బలంతోనూ తన పరాక్రమంతోనూ, కౌరవ రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తున్నాడు.


ధృతరాష్ట్రునికి వివాహం చేయాలని సంకల్పించాడు భీష్ముడు. గాంధార దేశాధీశుని కుమార్తె గాంధారిని తగిన కన్యగా నిశ్చయించాడు. విదురునితో చర్చించాడు.


“విదురా, గంధారి తనకు నూర్గురు పుత్రులు ఒక పుత్రిక కలిగేటట్టు వరం పొందింది. అందువల్ల కురు వంశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గాంధారిని మన ధృతరాష్ట్రునికి ఇచ్చి పెళ్లి చెద్దాము” అని అన్నాడు. విదురుడు సరే అన్నాడు. వెంటనే పురోహితులను గాంధార రాజు వద్దకు పంపాడు.


గాంధార రాజు సుబలుడు ఈ వివాహానికి సంతోషంగా అంగీకరించాడు. గాంధారిని ధృతరాష్ట్రునకు ఇచ్చి వివాహం చేస్తానని వాగ్ధానం చేసాడు. కాని బంధువులు ఒప్పుకోలేదు. పుట్టు గుడ్డికి పిల్లను ఇవ్వటం ఏమిటన్నారు.


ధృతరాష్ట్రుని వివాహం చేసుకోవడానికి గాంధారి అంగీకరించింది. తండ్రి మాట ఇచ్చాడు కాబట్టి ధృతరాష్ట్రుడే తన భర్త అని నిశ్చయించుకుంది. భర్తకు కళ్లు లేవు కాబట్టి తను కూడా కళ్లకు గంతలు కట్టుకుంది.


గాంధార రాజు సుబలుడు తన కుమారుడు శకునిని, కుమార్తె గాంధారిని సకల లాంచనాలతో హస్తినా పురానికి పంపాడు. భీష్ముడు దగ్గర ఉండి ధృతరాష్ట్రునకు గాంధారికి వివాహం జరిపించాడు. ధృతరాష్ట్రుడు గాంధారి చెళ్లెళ్లు పది మందిని అదే ముహుర్తానికి వివాహమాడాడు. భీష్ముడు మరొక నూరు మంది కన్యలను తీసుకు వచ్చి ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు. నూట పదకొండు మంది భార్యలతో ధృతరాష్ట్రుడు సకల భోగాలు అనుభవిస్తున్నాడు.

ఆంజనేయుడు

 పంచభూతాలను తన వశం చేసుకున్న పరమాత్ముడు ఆంజనేయుడు. అలాగే జ్ఞానేంద్రియాలను కూడా నియంత్రణలో వుంచుకోగలిగిన మహాశక్తిశాలి.. హనుమంతుడు. శ్రీ రాముడు లంకకు చేరుకునేందుకు గాను.. రామసేతు నిర్మాణంలో ఆంజనేయుడు నిమగ్నమై వుండగా.. శనిభగవానుడు హనుమంతుడిని బంధించేందుకు వచ్చాడు. రెండున్నర గంటసేపు హనుమను పట్టేందుకు వచ్చిన శనీశ్వరుడికి ఆంజనేయుడు చుక్కలు చూపించాడు. 

 

''రెండున్నర గంట పాటు హనుమా నిన్ను చెరపట్టాలి. 

నీ శరీరంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని నాకివ్వమని అడుగుతాడు. అయితే రామసేతు నిర్మాణంలో తానుండగా.. చేస్తున్న పనికి ఆటంకం కలిగిస్తున్నావని హనుమ చెప్తాడు. అయినా నీకు నా తలభాగం ఇస్తాను. అక్కడ ఎక్కి కూర్చోమంటాడు. అంతే శని కూడా హనుమంతుడి తలపై ఎక్కి కూర్చుంటాడు. 

 

కానీ ఆంజనేయుడు రాళ్లను, కొండలను తన తలపై మోసాడు. భారం తాళలేక శనిభగవానుడు గగ్గోలు పెట్టగా, మాట తప్పకూడదు. రెండున్నర గంట సేపు అలానే వుండాల్సిందేనని షరతు విధిస్తాడు. ఆ రెండున్నర గంటకు తర్వాతే హనుమంతుడు శనీశ్వరుడు తల నుంచి శనీశ్వరుడిని కిందికి దించుతాడు. ఆపై రామ భక్తులను, ఆంజనేయ భక్తులను శనీశ్వరుడు ఇక్కట్లకు గురిచేయకూడదని హెచ్చరించాడు'' అలా శనీశ్వరుడి చెర నుంచి హనుమంతుడు తప్పుకున్నాడు. 

 

అలాంటి మహిమాన్వితుడైన హనుమంతునికి తులసీ మాలను సమర్పించుకుంటే శనిగ్రహ బాధల నుంచి గట్టెక్కవచ్చు. ఆంజనేయునికి రామనామం అంటే మహాప్రీతి. హనుమజ్జయంతి రోజున ''రామ రామ రామ'' అనే మంత్రాన్ని పఠించడం చేయొచ్చు. 

 

''ఓం ఆంజనేయాయ విద్మహే

వాయుపుత్రాయ ధీమహి

తన్నో హనుమాన్ ప్రచోదయాత్'' 


అనే మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా శనీశ్వర గ్రహ దోషాల నుంచి గట్టెక్కవచ్చు. హనుమజ్జయంతి రోజున తులసీమాల సమర్పించడం, తులసీ ఆకులతో అర్చన చేయడం ద్వారా సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆ రోజున వడమాల సమర్పించడం, వెన్నతో ఆంజనేయుడిని అలంకరించడం, అన్నదానం చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. 

 

మనోబలం, బుద్ధిబలం, శరీరబలం, ప్రాణ బలం కోసం ఆంజనేయ స్వామిని స్తుతించడం చేయాలి. ఆంజనేయ ఆరాధన ద్వారా వీరం, వివేకం పెంపొందుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు

శివామృతలహరి

      .శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;


మ||

పలలంబస్తులు జీము నెత్తురుల ముంపై బుద్బుదప్రాయమై

మలినంబై కొరమాలినన్ నరుడు సమ్మానించు శ్రద్ధాళువై

పలువర్ణంబుల రత్నభూషణములన్ పాటీరశాటీ తతిన్

జిలుగుం దేహము; జీర్ణమౌటెరిగియున్ ; శ్రీ సిద్ధలింగేశ్వరా !

భావం;(నాకు తెలిసినంత వరకు)


మాంసము,ఎముకలు, చీము, నెత్తురులతో నిండి, మాలిన్యంతో కూడుకుని,నీటి బుడగలాగా నశించిపోయే,అల్పమైన, చివరకి ఎందుకు పనికి రాకుండా పోయే ఈ శరీరానికి,

మనిషి,రంగు రంగుల రత్నాలను పొదిగివున్న హారాలు వేసుకొని, పట్టు వస్త్రాలు ధరించి సుగంధ పరిమళాలు పూసుకొని

బాగా అలంకరించు కోవటానికి శ్రద్ద చూపుతాడు గానీ,

శాశ్వతము, నిత్యము అయిన పరమపదమును పొందే మార్గం వైపు దృష్టి సారించడు గదా స్వామీ! సిద్ధ లింగేశ్వరా!

సూర్యాష్టకం

*ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర* 


 *దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే* 


 *సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం* 


 *శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం* 


 *లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం* 


 *మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం* 


 *త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం* 


 *మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం* 


 *బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ* 

 *ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం* 


 *బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం* 


 *ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం* 


 *విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం* 


 *మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం* 


 *తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం* 


 *మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం* 


 *సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం* 


 *అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్* 


 *ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే* 


 *సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా* 


 *స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే* 


 *న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి* 


 *ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం* 


🕉️🌞🌎🏵️🌼🚩

*బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు

 ఈరోజు (20-9-2020) *ఆంధ్రపత్రిక* సంపాదకీయం🌹 *బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు*// తెలుగువారి ఇలవేలుపు తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. వేంకటేశుని సన్నిధిలో ప్రతిరోజూ వేడుకే. ఆది నుండీ, శ్రీ వేంకటేశ్వరునికి నిత్యకల్యాణము పచ్చతోరణమే. బ్రహ్మోత్సవాలకు విభిన్నమైన అర్ధాలు చెబుతారు.సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వయంగా ఆరంభిస్తాడు కాబట్టి బ్రహ్మోత్సవాలయ్యాయని కొందరు అంటారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను నవబ్రహ్మలలోని ఒక్కొక్క బ్రహ్మ ఒక్కొక్క రోజు జరిపిస్తాడు కాబట్టి ఈ పేరు వచ్చిందని మరో అర్ధంలో మరికొందరు భావిస్తున్నారు. పరబ్రహ్మస్వరూపుడైన వేంకటేశ్వరునికి జరిపే వేడుకగా భావించి బ్రహ్మోత్సవాలుగా కొందరు అభివర్ణిస్తారు. బ్రహ్మాండనాయకుడిని తలుస్తూ, కొలుస్తూ బ్రహ్మాండంగా చేసే ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు అని, మరి కొందరు భావిస్తారు. "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు.... " అని అన్నమయ్య అన్నట్లుగా, ఏ రీతిన కొలిచినా ఇవి బ్రహ్మోత్సవాలే. శ్రీవారికి జరిపే ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు రమణీయంగా, కమనీయంగా జరుగుతాయి. ప్రతి ఏటా ఎక్కడెక్కడి నుండో భక్తులు తండోప తండాలుగా తరలి వస్తారు. ఈ సంవత్సరం కరోనా వైరస్ సృష్టించిన కష్టాలు, నిబంధనల వల్ల బ్రహోత్సవం ఏకాంతంగా జరుపుకుంటున్నారు. జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు జరుపడం స్వాగతించవలసిన అంశమే. ఇప్పటికే అనేకమంది పూజారులు, అధికారులు, సిబ్బంది కరోనా వైరస్ సోకి బాధపడుతున్నారని విన్నాం. ఈ నేపథ్యంలో అందరి మేలుకోరి ఈ సంవత్సరం ఇలా జరుపుకోవడంలో ఎటువంటి తప్పూ లేదు. భగవంతుడు ఎప్పుడూ భక్తుల శ్రేయస్సునే కోరుకుంటాడు. వచ్చే సంవత్సరం రంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుకోవచ్చు. అప్పటికి కరోనా వైరస్ నూటికి నూరు శాతం కట్టడిలోకి వస్తుందని విశ్వసిద్దాం.ఆలయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈ అంశాన్ని సానుకూలంగా భావిద్దాం. శ్రీ విష్వక్సేనుడి వద్ద తొలి రోజు పూజలు జరిపి అంకురార్పణ చేశారు. వేద పండితుల దివ్య వేద ఘోష మధ్య,వేంకటనాయకుని వేడుక శుభారంభమైంది. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. శనివారం నాడు ధ్వజారోహణంతో మొదలైన ఈ సంబరాలు చక్రస్నానంతో ముగుస్తాయి. సెప్టెంబర్ 19వ తేదీ నుండి 27వ తేదీ వరకూ 9రోజులపాటు జరుగుతాయి. గరుడసేవ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సుందరకాండ పారాయణం కూడా విశేషంగా జరుగనుంది. ఇందులో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సారి బ్రహ్మోత్సవాలు విభిన్నంగా సాగినా, అది లోకహితమే అవుతుందని పండితులు భావిస్తున్నారు.అంకురార్పణకు ఒక విశిష్టత వుంది. యాగశాలలో మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో శాలి, వ్రహి, యవ,ముద్గ, మాష, ప్రియంగ మొదలైన నవధాన్యాలను పోసి పూజిస్తారు. ఈ కార్యక్రమానికి చంద్రుడు అధిపతి. శుక్లపక్ష చంద్రుని వలె నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందాలని ప్రార్ధనలు జరుపుతారు. అందుకే, ఈ ఉత్సవాలు శుక్లపక్షంలో జరుగుతాయి. పాళికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్న కుండలాలను నిర్మిస్తారు.తరువాత, పూర్ణకుంభ ప్రతిష్ఠ చేస్తారు.పాళికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరు పోస్తారు. అవి పచ్చగా మొలకెత్తుతాయి.అంకురాలను ఆరోపింపచేసే కార్యక్రమం కాబట్టి దీన్ని అంకురార్పణ అంటారు.మొదటి రోజు ధ్వజారోహణం, రెండవరోజు శేషవాహనం, మూడవరోజు సింహవాహనం, నాల్గవరోజు కల్పవృక్ష వాహనం, ఐదవ రోజు మోహినీ అవతారం,గరుడవాహనం, ఆరవరోజు గజవాహనం, ఏడవరోజు సూర్యప్రభ వాహనం, ఎనిమదవ రోజు రధోత్సవం, తొమ్మిదవ రోజు చక్రస్నానం జరుగుతాయి. చక్రస్నానాలు పూర్తయిన తర్వాత, సాయంకాలం శ్రీవారి ఆలయ ధ్వజస్థంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణ చేస్తారు. అంటే దించుతారు. ఈ అవరోహణతో బ్రహ్మోత్సవాలకు వచ్చిన సర్వ దేవతలకు వీడ్కోలు పలికినట్లే. దీనితో బ్రహ్మోత్సవాలు మంగళప్రదంగా పరిపూర్ణమైనట్లు భావిస్తారు. మళ్ళీ ఇదే కాలంలో సంవత్సరం తర్వాత మళ్ళీ బ్రహోత్సవాలు జరుపుతారు. ఇలా ప్రతి ఏటా వేంకటేశ్వరునికి విశేషరీతిలో వేడుకలు జరపడం కొన్ని వందల సంవత్సరాల నుండీ జరుగుతోన్న ఆనవాయితీ. ఏనాడూ ఈ ఉత్సవాలు ఆగలేదు. ఆగవు కూడా. "వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి" అన్నట్లు ఇంతటి బ్రహ్మోత్సవాలు ఎక్కడా జరుగవు, ఒక్క వేంకటేశ్వరునికి తప్ప. ఉమ్మడి మద్రాస్ నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మనకు దక్కిన గొప్ప క్షేత్రం తిరుమల. ఇది క్షేత్రరాజం. నిత్య పూజనీయ స్థలం. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి రెట్టింపు ఉత్సాహంతో బ్రహోత్సవాలు జరగాలని కోరుకుందాం. జరుగుతాయని విశ్వసిద్దాం. -మాశర్మ🙏