2, సెప్టెంబర్ 2023, శనివారం

శక్తి పీఠం - శివాని మాత ఆలయం

 🕉 మన గుడి : నెం 166




⚜ ఛత్తీస్‌గఢ్ : కంకేర్


⚜ శక్తి పీఠం - శివాని మాత ఆలయం



💠 కాశీ క్షేత్రంలో శివుడు మరియు అన్నపూర్ణ కలిసి ఉన్నారు... కానీ వేరు వేరు ఆలయాల్లో ఉంటారు.

ఒకే ఆలయంలో ఒకే విగ్రహంలో రెండు దేవతా స్వరూపాలు కలిగి ఉండడం చాలా అరుదు ...అదే విధంగా సగం దుర్గామాత మరియు ఇంకొక సగం కాళీ మాతను కలిగి ఉన్న విగ్రహం కల ఆలయం ఒకటి ఉంది.

అదే శివాని మాత ఆలయం- కంకేర్.

ఈ ఆలయం చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో కంకీర్ జిల్లా కేంద్రం అయిన కంకేర్ నగరంలో ఉంది.  


💠 ఈ ఆలయాన్ని శివాని మా ఆలయం అంటారు.  

అమ్మవారి విగ్రహం అద్భుతమైనది.  

ఒక పురాణం ప్రకారం, ఇది కాళీ మాత మరియు దుర్గామాత యొక్క రెండు విగ్రహాల కలయిక.  

అందులో సగం కాళీదేవికి, మిగిలిన సగం దుర్గాదేవికి చెందుతుంది.  

ఈ రకమైన విగ్రహం మొత్తం ప్రపంచంలో కేవలం రెండు మాత్రమే ఉన్నాయి.  

ఒకటి కోల్‌కతాలో, మరొకటి కాంకేర్‌లో ఉంది.  


💠 ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఉత్సాహంగా జరుగుతాయి.

ఈ ప్రాంతంలో అన్ని మతాల వారికి ఈ దేవాలయంపై నమ్మకం ఉంది.

ఈ పండుగ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి మరియు భారతదేశం అంతటా వేలాది మంది పర్యాటకులు కంకేర్‌ను సందర్శిస్తారు.


💠 కంకేర్ జిల్లా ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ ప్రాంతంలో ఉంది.

పూర్వం ఇది పాత బస్తర్ జిల్లాలో భాగంగా ఉండేది. కానీ 1998లో జిల్లాగా గుర్తింపు పొందింది.

 

💠 ఈ ప్రాంతం అంతటా చిన్న కొండ ప్రాంతం కనిపిస్తుంది.  

ఈ ఆలయ పరిసరాల్లో ప్రధానంగా ఐదు నదులు ప్రవహిస్తున్నాయి - 

దూద్ నది, 

మహానది, 

హుక్కుల్ నది, 

సిందూర్ నది మరియు 

తురు నది.

అందువలన ఈ ఆలయ ప్రాంతానికి పంచనది సంగమ్ అని కూడా అంటారు


🔅 చరిత్ర 🔅


 

💠 సతీదేవి శివుని భార్య.  

 భర్తకి చేసిన అవమానాన్ని తట్టుకోలేక తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకుంది.  

దీంతో శివుడు ఆగ్రహానికి గురై ఆమె విగత శరీరాన్ని చేతుల్లో పెట్టుకుని భయంకరమైన రీతిలో ప్రళయ తాండవ నృత్యం చేయడం ప్రారంభించాడు.  

ఈ చర్యకు దేవతలతో సహా ప్రపంచం మొత్తం చాలా భయపడింది.  

అప్పుడు శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని అనేక భాగాలుగా ఖండించారు మరియు ఆమె శరీరంలోని వివిధ భాగాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పడిపోయాయి. ఆమె శరీరంలోని భాగం పడిపోయిన ప్రతి ప్రదేశంలో ఒక ఆలయం నిర్మించబడింది.

అది శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి.

అమ్మవారి కుడి రొమ్ము ఈ పవిత్ర స్థలంలో పడింది.


💠 కంకేర్ వాసులు శ్రీ శ్రీ యోగమాయ కనకేశ్వరి దేవి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి కొండపై ఆలయాన్ని నిర్మించారు మరియు జూలై 2, 2002 న, మా యోగమాయ దుర్గా విగ్రహాన్ని నగరంలోని ప్రముఖుల సమక్షంలో సక్రమంగా ప్రతిష్టించారు. కాంకేర్ నివాసితుల పూజ్యమైన దేవతగా ఈ అమ్మవారు కొలవబడుతున్నారు.


💠 కంకేర్ జిల్లా సంస్కృతిలో స్థానిక మతం మరియు స్థానిక ప్రజల నమ్మకాలు ఉన్నాయి. కాంకేర్ జిల్లా సంస్కృతి ప్రధానంగా గిరిజనులకు చెందినది, ఎందుకంటే ఈ ప్రాంతంలో ప్రధానంగా అనేక గిరిజన సంఘాలు ఉన్నాయి. బస్తర్ మరియు కంకేర్ ప్రావిన్సులలో దాదాపు 62 కులాలు ఉన్నాయి. 

 

💠 ఆలయ సమయాలు : ఉదయం 6:00 నుండి రాత్రి 8 వరకు.

ఉదయం పూజ మరియు హారతి 06:00 AM నుండి ప్రారంభమవుతుంది మరియు 08:30 AM నుండి అమ్మవారికి స్తోత్రం నిర్వహించబడుతుంది.

రాత్రి 8:00కి ఏకాంత సేవతో ఆ నాటి దర్శనానికి విరామం.


💠 ధామ్తరి రైల్వే స్టేషన్ సమీప రైలు మార్గం (50 కి.మీ

Jai sri ram


 

Panchaag


 

Bahu


 

Geeta


 

నవగ్రహా పురాణం🪐* . *15వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *15వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*సూర్యగ్రహ జననం - 6*


బాలసూర్యుడు ఆరోగ్యంగా పెరుగుతూ , రోజు రోజుకీ అదితి కశ్యపుల ఆనందాన్ని పెంచుతూ పెద్దవాడవుతున్నాడు.


వినతా , కద్రువా , దితీ , దనూ - మొదలైన అదితి చెల్లెళ్ళు బాల సూర్యుణ్ణి నేల మీద ఉండనివ్వడం లేదు. దిగే చంకా , ఎక్కే చంకా అయిపోయింది బాలసూర్యుడి పని !


బాలసూర్యుడు బోర్లా పడ్డాడు... పాకుతున్నాడు... దోగాడుతున్నాడు. బాలసూర్యుడు ఆశ్రమంలో కదిలితే , ఏదో మసక వెల్తురు తనతో బాటు కదలాడుతున్న అనుభూతి కలుగుతోంది అందరికీ. బాలసూర్యుడు రాగానే , అప్పటిదాకా అక్కడ వున్న వెల్తురు , వత్తి ఎగదోసిన దీపం కాంతిలా పెరుగుతున్నట్టునిపిస్తోంది. తల్లిదండ్రులకూ పినతల్లులకు అదితి అరుగుమీద కూర్చుని పూల మాలికలు అల్లుతోంది. *"అక్కా అదితీ ! అక్కా"* అంటూ కంగారుగా వచ్చింది సింహిక , ఆమె చేతుల్లో బాలాదిత్యుడున్నాడు. *"అబ్బ ఎంత వేడిగా ఉందో వీడి వొళ్ళు ! ఇందమ్మా ! తీసుకో ! నా వల్ల కాదు ! అంటూ సింహిక బాలాదిత్యుడ్ని అదితి చేతుల్లోకి విసిరినంత పని చేసింది.


*"అంత వేడిగా లేదు. సింహికా !"* బాలుణ్ని తాకిచూస్తూ అంది అదితి. *"ఏమో తల్లీ... నా చేతులేమో మండి పోతున్నాయి !"* అంది సింహిక అరచేతుల్ని చూసుకుంటూ.


కశ్యపుడు వచ్చాడు. బాలాదిత్యుడిని ముట్టుకుని చూశాడు.


*"వేడిగానే ఉంది , అదితీ ! జ్వరం వచ్చినట్టుంది. పసివాడికి !"* అంటూ కొడుకుని తీసుకుని ఆశ్రమంలోకి నడిచాడు.


అదితి ఆయన వెనకే వెళ్ళింది.


నాలుగు రోజులు గడిచాయి. శరీరం వేడిగా వున్నా కూడా బాలసూర్యుడు ఆడుకుంటూనే వున్నాడు.


*"ఇదేదో మొండి అనారోగ్యమే , అదితి. ఏం చేద్దాం ?"* అయిదో రోజు ఉదయం సూర్యుడి శరీరాన్ని తాకి చూసిన కశ్యపుడు అన్నాడు.


అదితి కళ్ళల్లో ఆందోళన స్పష్టంగా కస్తోంది. *"నాకు... భయంగా వుంది , స్వామీ...."* అందామె విచారంగా. *"నాధా ! నారదముని మీ కోసం వచ్చారు !"* అంది వినత అక్కడికి వస్తూ..


కశ్యపుడు ఆశ్రమం వెలుపలికి నడిచాడు. ఎదురుగా నిలుచున్న నారద మహర్షికి నమస్కరించాడు. *"నారాయణ"* నారదుడు దీవిస్తూ అన్నాడు..


*"దయ చేయండి !"* అరుగునూ , అరుగు మీదున్న దర్భాసనాన్నీ చూపిస్తూ ఆహ్వానించాడు కశ్యపుడు. *"రాకరాక వచ్చారు ! చిన్నవాడి నామకరణ సందర్భంలో వచ్చారు. మళ్ళీ ఇంత కాలానికి వచ్చారు."*


*"బాలసూర్యుడు బాగున్నాడు కద !"* నారదుడు ప్రశ్నించాడు. 


*"ఈ మధ్య ఉష్ణాధిక్యతతో బాధ పడుతున్నాడు ! మాకు కొంచెం ఆందోళనగానే ఉంది !"* కశ్యపుడు సమాధానం చెప్పాడు.


*"అలాగా ? పదండి... చూద్దాం !"* నారదుడు అరుగుమీంచి లేస్తూ అన్నాడు. కశ్యపుడు ఆశ్రమంలోనికి దారి తీశాడు. ఇద్దరూ లోపలి కక్ష్యలోకి వెళ్ళారు. బాలసూర్యుడు అంతటా కలయదిరుగుతూ ఆడుకుంటున్నాడు. అదితి లేచి నారదుడికి ప్రణామం చేసింది.


*"ఇక్కడ ఏదో కాంతి సంచరిస్తున్నట్టుంది !"* నారదుడు బాలసూర్యుణ్ణి చూస్తూన్నాడు.


*"పుట్టినప్పట్నుంచీ అంతే , మహర్షీ ! పసివాడి చుట్టూ పసిడి కాంతులు పల్చగా కనపడుతూ ఉంటాయి.”* కశ్యపుడు బాలసూర్యుణ్ణి ఎత్తుకొని , నారదుడికి అందించాడు. *"చూడండి ! శరీరం కాలిపోతోంది."*


*“నారాయణ ! నారాయణ !"* అంటూ నారదుడు బాలసూర్యుణ్ని ఎత్తుకుని , పరమానందంతో చిన్నారి మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు.


*“మహర్షీ...!"* బాలకుడి స్పర్శతో స్పందించకుండా చిరునవ్వు నవ్వుతున్న నాదరుడి వాలకానికి ఆశ్చర్యపోతున్న కశ్యపుడు అన్నాడు. *"అలా ఆశ్రమం ముందు కూర్చుందాం !"* అంటూ నారదుడు బాలసూర్యుణ్ణి ఎత్తుకుని అవతలకి నడిచాడు. అదితి , కశ్యపుడు అనుసరించారు.


బాలుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకొని , అరుగు మీద కూర్చున్న నారదుడు ఆ దంపతుల వైపు చిరునవ్వుతో చూశాడు. *"బాగుంది ! అయితే జన్మించిన నాటినుంచీ మన బాలసూర్యుడు లీలగా కాంతిని ప్రసరిస్తున్నాడన్నమాట !"*


*"పాపడు పెరిగే కొద్దీ ఆ వెలుగూ పెరుగుతూ వస్తోంది మునీంద్రా !”* అదితి బాలుణ్ణి చూస్తూ అంది.


నారదుడు చిన్నగా నవ్వాడు. *"బాగుంది తల్లీ ! వెలుగు ఆయన సహజ లక్షణం కదా !!*


*"అదే అనుకున్నాం మేమంతా !"* కశ్యపుడు వినయంగా అన్నాడు.


*"నారాయణ ! వెలుగునేమో బాలకుని సహజ లక్షణంగా భావించి స్వీకరించారు. బాగానే ఉంది ! అలాగే వెలుగుతో పాటు ఆయనగారి వేడిమినీ స్వీకరించాలి కదా ?”*


*"మహర్షీ !"* కశ్యపుడు ఆశ్చర్యంగా అన్నాడు.


*"ఔను కశ్యపా ! వెలుతురులాగే , వేడిమి కూడా బాలసూర్యుడి సహజ లక్షణం !"*


*"అలాగా !”* కశ్యపుడు ఆశ్చర్యపోతూ అన్నాడు. *"ఔను కదా ! అదితీ , నేనూ ఇద్దరం అలా ఆలోచించలేకపోయాం ! ఆందోళనలో మునిగిపోయాం !"*


*"సంతానం పట్ల ఉన్న వాత్సల్యం ఆలోచనా శక్తిని మాయలో కప్పివేసింది !"* నారదుడు నవ్వుతూ అన్నాడు అదితి వైపు చూస్తూ. అదితి కళ్లు చెమ్మగిల్లాయి. *“వేడి స్పర్శతో భయపడిపోయాను స్వామీ !”*


*"తల్లీ ! లోకాలకు వెలుగునూ , వేడిమినీ అందించే వేలుపు నీ బిడ్డగా , నీ ఒడిలో ఆడుతున్నాడు. మరిచిపోయావా ?”* నారదుడు చిరునవ్వుతో ప్రశ్నించాడు. 


*"మీ రాకతో నాలుగు రోజులుగా నన్ను కలిచివేసిన ఆందోళన దూరమైంది ,”* అదితి నమస్కరిస్తూ అంది.


నారదుడు బాలసూర్యుణ్ణి అదితికి అందించాడు. అదితి లోనికి వెళ్లింది.


*"కశ్యపా ! సకాలంలో బాలసూర్యుడికి విద్యాభ్యాసం ప్రారంభించు ! నాలుగు వేదాలతో పాటు నీవు నేర్చిన సకల శాస్త్రాలు సూర్యునికి బోధించు. సూర్యుడు నీ అధ్యాపకత్వంలో సకల విద్యాపారంగతుడు కావాలి !”* అన్నాడు నారదుడు.


*"తమ ఆజ్ఞ !"* కశ్యపుడు వినయంగా అన్నాడు. *"అదితేయులకూ , దైత్యులకూ , దానవులకూ , ఇతర పుత్రులకూ నా విద్య సంపూర్ణంగా నేర్పలేకపోయాను. సూర్యుణ్ణి సకల శాస్త్ర విశారదుణ్ణి చేస్తాను.”*


*“మంచిది ! విద్యార్జనలో , విద్యలో , విద్యాబోధనలో సూర్యుడు నిన్ను మించిపోవాలి సుమా !"* నారదుడు నవ్వుతూ అన్నాడు.. 


*"నా కోరికా అదే ! తనయుడు తనను మించినవాడుగా ఎదగాలి అన్న ఆశ తండ్రిలో సహజంగా జన్మిస్తుంది మునీంద్రా !"*


*"ఔను ! అది పితృ సహజమైన ఆశ !"* నారదుడు నవ్వుతూ అన్నాడు..


కశ్యపుడు బరువుగా నిట్టూర్చాడు. *"మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి దేవ , రాక్షస సామ్రాజ్యాలు స్థాపించుకున్న నా పుత్రుల విషయంలో తండ్రిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించ లేకపోయాను...”*


*“నారాయణ !”* నారదుడు తేలిగ్గా అన్నాడు. *“అది ఆ విధి సంకల్పం కశ్యపా ! కలిసి మెలిసి ఉండలేకపోయినప్పటికీ , గర్భ శత్రువులుగా ఉన్నప్పటికీ , నీ పుత్రులైన దేవ , రాక్షసులు ఎవరికి వారు వివాహాలు చేసుకొని వైభవంతో జీవిస్తున్నారు. ఎవ్వరికీ ఏ లోటూ లేదు !".*


*"వాళ్ళకు మీ దర్శనం అనుగ్రహించారా , ఇటీవల ?"* కశ్యపుడు ఉత్సాహంగా అడిగాడు.


*"నా వ్యాపకం నిత్య సంచారం కదా ! విషయ సేకరణ లేకపోతే సంచారం సారహీనంగా ఉంటుంది. విషయం కావాలంటే , వైరి బృందాలను తక్కువ వ్యవధానంలో కలుస్తూ ఉండాల్సిందే. నిజం చెప్పాలంటే నా సంచారం , దేవ దానవ సామ్రాజ్యాల మధ్యే అధికంగా ఉంటుంది !”*


*"అది వాళ్ళ అదృష్టం ! దితిజులనూ , దనుజులనూ వారి సోదరులనూ కొంచెం కనిపెట్టి ఉండండి ," కశ్యపుడు అర్థిస్తున్నట్లు అన్నాడు. “నారాయణ ! అందుకు ఈ నారదుడు చాలడు !”* నారదుడు చిరునవ్వుతో అన్నాడు.


*"వాళ్ళను వాళ్ళే కనిపెట్టుకుంటారు.”*


కశ్యపుడు మౌనంగా చూశాడు.


*"కశ్యపా ! శ్రీమహావిష్ణువు దక్షిణ నేత్రంలో ఉండే సూక్ష్మ సూర్యుడు , నీ పుత్రుడుగా అవతరించాడు. తల్లిదండ్రులకు నిత్య సంతోషం కలిగించే కుమార సూర్యుని ఆలనలో , పాలనలో నిమగ్నుడై ఆనందం అనుభవించు. వేయిమంది అయోగ్యులకు విద్య నేర్పడం కన్నా , ఒకే ఒక్క యోగ్యునికి విద్యాబుద్ధులు నేర్పడం మంచింది. చెప్పానుగా ! సూర్యుణ్ణి సకల విద్యా పారంగతుణ్ణి చేయి !”*


కశ్యపుడు అలాగే అన్నట్లు తలవంచి నమస్కరించాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*


🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-34🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-34🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


విష్ణుమూర్తి, శివుడు, కుమారస్వామి, శక్తి వంటి వివిధ దేవతారూపాల్లో ఎవరిది అన్న ప్రశ్నపై వేర్వేరు సంప్రదాయాలకు చెందిన భక్తులు వివిధ అభిప్రాయాలు ఏర్పరుచుకున్నారు.




ఎంతమాత్రమున నెవ్వరు దలచిన అంతమాత్రమే నీవు

అంతరాంతరములెంచిచూడ పిండంతేనిప్పటియన్నట్లు


కొలుతురు మిమువైష్ణవులు కూరిమితో విష్ణుడని

పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు

తలతురు మిము శైవులు తగినభక్తులను శివుడనుచు

అలరిపొగడుదురు కాపాలికులు ఆది భైరవుడవనుచు


సరినెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు

దరిశనములు మిము నానావిధులను తలపుల కొలదుల భజింతురు

సిరులమిమ్మునే యల్పబుద్ధి దలచిన వారికి నల్పంబవుదువు

గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు


నీవలన గొరతేలేదు మరి నీరుకొలది తామెరవు

ఆవల భాగీరథిదరి బావుల ఆజలమే వూరినట్లు

శ్రీవేంకటపతి నీవైతే మము జేకొని వున్నదైవమని

యీవలనే నీశరణని యెదను యిదియే పరతత్త్వమునాకు


 క్రీ.శ.11వ శతాబ్దిలో జరిగిన వాదోపవాదాల్లో వైష్ణవ మతాచార్యుడు రామానుజాచార్యుడు ప్రమాణయుతంగా వాదించి విష్ణువు విగ్రహమేనన్న వాదాన్ని గెలిపించి నేడు అనుసరిస్తున్న వైష్ణవ ఆగమాలను స్థిరపరిచినట్లు సాహిత్యాధారాలు చెబుతున్నాయి.


విగ్రహాన్ని ఏ ప్రాతిపదికలపై వివిధ సంప్రదాయాల వారు వేర్వేరు దేవీమూర్తులదిగా భావించారన్న విషయం ఇలా క్రోడీకరించవచ్చు:

శివుడు: తిరుమలలోని ధృవబేరాన్ని శివునిగా కొందరు భావించడానికి ముఖ్యకారణాలు విగ్రహానికి దీర్ఘకేశాలుండడం, ధనుర్మాసంలో నెలరోజుల పాటుగా బిల్వపత్రపూజ జరగడం వంటివి. విగ్రహం భుజాలపై నాగాభరణాలు ఉండడం కూడా ఈ సందేహానికి బలమిచ్చింది. ఈ పర్వతంపై శివుడు తపస్సు చేసినట్లు పురాణాలు చెప్తూండడమూ ఒక కారణం.


కుమారస్వామి: వామన పురాణంలో కుమారస్వామి రాక్షసవధ అనంతరం బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకునేందుకు తిరుమలలో తపస్సు చేసినట్టుగా ప్రస్తావన ఉంది. పవిత్రమైన కొలనులో స్నానమాచరించి పునీతం చేసినట్టుగా ఉంది. తిరుమలలోని మూలవిరాట్టుగా ఆ కుమారస్వామే నిలిచారనే వాదన బలంగా వినిపించారు. తిరుమలలోని వేంకటేశ్వర ఆలయం పక్కనే ఉన్న స్వామి పుష్కరిణి అనే పుణ్య తీర్థంలోని స్వామి అన్న పదం ఏర్పడేందుకు స్వామి పదంతో ప్రసిద్దుడైన సుబ్రహ్మణ్యస్వామి పేరుతోనే ఏర్పడిందని భావించారు. విగ్రహానికి ఉన్న జటాజూటాలు, నాగాభరణాలు కుమారస్వామికి కూడా ఉంటాయని ప్రసిద్ధి.



పార్వతీదేవి: తిరుమల మూలవిరాట్టును శక్తిరూపంగా కూడా భావించారు. దీర్ఘమైన కేశాలు ఉండడం, శుక్రవారం పసుపుతో అర్చించడం ఈ ప్రతిపాదనలకు మూలకారణం. ధృవబేరానికి ఆరడుగుల పొడవైన చీరవంటి వస్త్రాన్ని కట్టడం కూడా శాక్తేయులు సమార్థనగా చూపించారు. ఆలయప్రాకారంపై సింహాలున్నాయి. సింహాలు శక్తిపీఠంపైనే ఉంటాయని వాదించారు.


ఇతర దైవాలు: విష్ణుమూర్తి నాభిలో కమలం ఉండి ఆ కమలం నుంచి బ్రహ్మ జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. కాగా తిరుమల ఆలయంలోని విగ్రహానికి నాభికమలం లేకపోగా కమలపీఠంపై విగ్రహం ఉండడంతో బ్రహ్మ కూడా కావచ్చని కొందరు, కాలభైరవుని విగ్రహమేమోనని మరికొందరు వాదించారు.



క్రీ.శ.పదకొండవ శతాబ్ది వరకూ విగ్రహానికి శంఖచక్రాలు ఉండేవి కాదు. శంఖమూ, చక్రమూ ధరించినట్టుగా చేతులు ఎత్తి వేళ్లను పైకి చూపిస్తూన్న భంగిమలో ఉండేది తప్ప శంఖచక్రం ఉండేదికాదు. విష్ణుమూర్తి విగ్రహమే అయ్యిఉంటే శంఖచక్రాలు ఉండేవి కదా అన్న వాదన జరిగింది. ధృవబేరానికి వందల సంవత్సరాలుగా వైఖానస ఆగమ పద్ధతులలోనే విష్ణుమూర్తి రూపమనే భావనతో ఆరాధనలు జరుగుతూన్నా శైవులు, శాక్తేయులలో వైష్ణవమూర్తి కాదనే నమ్మకం బలపడి క్రీ.శ.పదో శతాబ్ది నాటికి గందరగోళం నెలకొంది.



రామానుజాచార్యులు ధృవబేరం శివుడు, కార్తికేయుడు, శక్తి వంటి దేవతారూపాలు కాదని నిర్ధారణగా శ్రీమహావిష్ణువేనని నిరూపించారు. వేద పురాణ ప్రమాణాలను చూపి శైవుల వాదనలు ఖండించి అప్పటివరకూ కొనసాగుతున్న వైఖానస ఆగమంలో వైష్ణవ పూజా విధానాలు స్థిరపరిచారు.



అంతకుమునుపు శైవులు తమ వాదనలను క్రీ.శ.పదకొండవ శతాబ్ది నాటి స్థానిక యాదవరాజు వద్దకు తీసుకువెళ్ళారు. యాదవరాజుకు తమ ప్రతిపాదనలు, వాదనలు వివరించి శైవారాధనలు ప్రారంభించేందుకు అనుమతించమని కోరారు. అప్పటికే శైవులు, శాక్తేయులు విగ్రహాన్ని ఇతర దేవతావిగ్రహంగా ఆపాదించడమే కాక, ఎవరి సంప్రదాయాలను అనుసరించి వారు రకరకాల పూజలు ఆలయప్రాంగణంలో నిర్వహించుకోవడం, బలులు ఇవ్వడం వంటివి యాదవరాజుల కాలానికి తారాస్థాయికి చేరుకొన్నాయి 



ఆ స్థితిగతుల మధ్య విశిష్టాద్వైత భాష్యకారుడు రామాజాచార్యులు తిరుమల ప్రాంతానికి చేరుకుని యాదవరాజు ముందు శ్రుతి (వేదం), పురాణాల నుంచి సాక్ష్యాధారాలను చూపించి వాదించారు. శివుడు, కార్తికేయుడు, శక్తి కాదని, విష్ణుమూర్తి విగ్రహమేనని నిర్ధారణ చేసేలా ప్రమాణయుతంగా నిరూపించారు.


దివ్య సుదేహ గోవిందా, శ్రీ రమా లోల గోవిందా, శ్రీ స్మిత వదన గోవిందా, శ్రీ నిర్మలా కార గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||34||


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 28*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 28*

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩


శ్రీరామకృష్ణుల ఆదర్శాలు మన జీవితంలో పాటింపబడినప్పుడు జీవితం ఉన్నతమవుతుంది.


కాని ఇక్కడ ఒక మాట గుర్తుంచుకోవాలి. నేడు ప్రతి ఆధ్యాత్మిక గ్రంథంలోనూ ఈ భావనలు సామాన్యంగా కానవస్తాయి. పలువురు ఆచార్యులూ, గురువులూ ఇలాంటి భావనలనే బోధిస్తున్నారు. కనుక నేడు మనం అనేక చోట్ల చూస్తూన్న ఈ భావనలు శ్రీరామకృష్ణుల నుండే సంక్రమించాయని మరువరాదు. 


వెన్న లభించే దుకాణాలు ఎన్నో ఉంటాయి. కాని పాలను పెరుగుగా మార్చి, దానిని చిలికి వెన్న తీయవచ్చునని కనుగొన్న మొట్టమొదటి వ్యక్తి తెలివిని మనం సామాన్యంగా గుర్తుంచుకోము. అదే విధంగా శ్రీరామకృష్ణులకు పూర్వం ఉండిన భావనలు ఇంత స్పష్టంగా, సరళంగా విపులీకృతం కాలేదు. ఆయనే ప్రప్రథమంగా వీటిని విడమరచి, విభజించి సూత్రాలలా అందజేశారు; నేడు మనం చూస్తూన్నది వాటి భాష్యాలే.


 వాన చినుకును తనలో పదిలపరచుకొని ఆల్చిప్ప సముద్రపు లోతులలోకి పోయి దానిని ముత్యంగా రూపొందిస్తుంది. ముత్యంగా రూపొందించడంతో దాని పని పూర్తవుతుంది. ఆ ముత్యాన్ని వెలు పలికి తీసి లోకానికి అందించే పనిని ఇతరులు చేసినట్లు, అవతార పురుషులు తమ మహత్తర తపోమయ జీవితం ద్వారా ఆవిష్కరించిన సత్యాలను వారి శిష్యులు తమ జీవితాలలో చాటిచూపి, లోకానికి అందిస్తారు.


వేదకాలం నాటి ఋషివరేణ్యులు ఆవిష్కరించిన సత్యాలను ప్రత్యక్షంగా దర్శించిన ఒక మహాత్ముని కోసం నరేంద్రుడు అన్వేషిస్తున్నాడు. అలాంటి మహాత్మునిగా విరాజిల్లడం మాత్రమే కాక, తాము దర్శించిన సత్యాలను లోకానికి చాటి చెప్పడానికి ఒక క్రొత్త సన్న్యాసి సంఘాన్ని రూపొందించే సమర్థుడైన వ్యక్తి కోసమూ శ్రీరామకృష్ణులు ఎదురుచూస్తున్నారు. వారిద్దరి సమావేశమూ కాలావశ్యకమయింది.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శారదా దేవి దివ్య స్వరూపం



శారదా దేవి దివ్య స్వరూపం!  


ఉ:  "  అంబ!  నవాంబుజోత్పల  కరాంబుజ  శారద!  చంద్ర  చంద్రికా


          డంబర  చారుమూర్తి; !  ప్రకట స్ఫుట భూషణ  రత్నదీపికా 

          

           చుంబిత  దిగ్విభాగ , శ్రుతి  సూక్తి  వివిక్త  నిజప్రభావ,   భా

            

           వాంబర  వీధి   విశ్రుత  విహారిణి!  నన్ గృపజూడు  భారతీ!


                 హరివంశము- అవతారిక - ఎఱ్ఱాప్రగ్గడ ;


మాత  సరస్వతిని  కవులందరూ  స్మరించారు. కానీ , కవిత్రయంలో  తృతీయుడు  ఎఱ్ఱన  ప్రస్తుతించిన  తీరు అబ్బురమైనది.

ఆమూర్తిలోని  అంతస్ఫూర్తి  ,నింత గొప్పగా  ఆవిష్కరించిన  కవి  మరియొకఁడు  కానరాడు. బాహిర స్వరూపము నొక్కింత తడవుచు ఆతల్లి యక్షరామృత  వితరణా శీలమును  యెఱ్ఱన  యీపద్యమున  రూపు గట్టించినాడు.

    

         కఠినపదములకు అర్ధము:- అంబుజము-పద్మము; ఉత్పలము-కలువ; చంద్రిక-వెన్నెల;  చారు మూర్తి-  మనోహరాకారము కలది; రత్నదీపిక- రత్న దీపము; చుంబిత -ముద్దిడుకొను ; శ్రుతి-వేదము; సూక్తి-మంచిమాట;

వివిక్త- విశ్లేషణ;( కాళీప్రదేశమని మరొక అర్ధముంది) భావాంబరము- మనస్సనే యాకాశము; విశ్రుత విహారిణి: ప్రసిధ్ధినొందిన విహారముగలది;


           అప్పుడే వికసించిన పద్మములను,కలువలను బోలిన కరములు గలదానా! చంద్రుని వెన్నెలను బోలిన  మనోహర స్వరూపిణీ! ఆభరణములందు గల దీప సదృశములగు రత్నకాంతులను దిగంత పరివ్యాప్త మొనరించుదానా! వేదవాక్యములయందు  నిరూపింపబడు మహా ప్రభావ శాలినీ!  హృదయాకాశమునందు  స్వేఛ్ఛావిహారమొనరించు  మాతా! 

భారతీ!  నన్ను  దయజూడుము;  అని భావము.


                    ఈపద్యంలో 1  నవాంబుజోత్పల కరాంబుజ!


                                        2భూషణ  రత్నదీపికా చుంబిత  దిగ్విభాగ!

   

                                        3 శ్రుతి సూక్తి  వివిక్త  నిజప్రభావ!

       

                                        4 భావాంబర వీధి విశ్రుత విహారిణి!                      అనే యీనాల్గు  విషయాలూ  విశ్లేషింప దగినవి.

మొదటిది: ఆమె కరములు  అంబుజములట! అంబుజములు రెండురకములు .పగటికి తామరలు పద్మములు.రేయికి కలువలు. ఆమెహస్తము లీ  రెంటిని బోలి యుండునట. రేయింబవళ్ళు  ఆమెచేతులకు పని. యేమిపని? జ్ఙానామృతమును పంచుపని.అక్షరామృతమునందించుపని, పద్మమునందు  మకరంద ముండును.మాత సరస్వతి హస్తమున  జ్ఙానామృతముండును. దానినామె నారాధించువారికి  రేయింబవళ్ళు వితరణ మొనర్చును. ఆహా! ఎఱ్ఱనగారి యూహ యెంత గొప్పది!!!


               ఇఁక రెండవ యంశము: ఆమెభూషణములు  రత్నదీపములట!ఔను రత్నదీపికలే! శ్రుతులే యామెకు నిజభూషణములు. వాటిప్రభావము విశ్వ వ్యాప్తమేగదా! భారతీయ జ్ఙాన వికాసమునకు వాని వెలుగులే  యాధారము.


            3శ్రుతి సూక్తి  వివిక్త  నిజప్రభావ! వేద సూక్తుల యందు ఆమెప్రభావము  అడుగడుగునా ప్రస్ఫుట మగుట మనకు విదితమే"  అక్షరం పరమంపదం"- ఆఅక్షరమైన పరంబ్రహ్మ  స్వరూపావిష్కరణకు  అక్షరం అవసరంగదా! ఆఅక్షరమే ఆమెరూపము, ఆమెస్వభావము, ఆమెప్రభావము. 


                        4  భావాంబర వీధి  విశ్రుత విహారిణి! హృదయాకాంశంలో  తిరుగు లేని సంచారంచేసే తల్లి.ఆమాట నిజమే!

కానీ, భావాంబరమని  " అంబర"- శబ్దాన్ని యెఱ్ఱన ప్రయోగించుటలో  నేదో ప్రత్యేకత యున్నది. అంబరము అనుపదమునకు 

ఆకాశము  అను నర్ధమేగాక  వస్త్రము  అను నర్ధముకూడా ఉన్నది. హృదయమనే కేన్వాసుపై  చెరగని ముద్రవైచుకొని  యెటుబోయిన నటువచ్చు(మూవీ) స్వరూపముగలదట! ఈచిత్ర మెంత చిత్రము!


                               మనము  మరియొక దాని నుపేక్షించితిమి ." శారద  చంద్ర చంద్రికా డంబర  చారుమూర్తి" శరత్కాలమునందలి చంద్రుని వెన్నెలను బోలిన చల్లని మనోహర రూపిణి! మాత  సరస్వతి  చల్లనిది. ఆమెకరుణ సూర్యాతపమువంటిదికాదు, చంద్రాతపమును బోలి చల్లనిది. వెన్నెలను జ్ఙానముగా పెద్దల సూచన! అందుచేత చల్లగ మెల్లగ జ్ఙాన సంపదను యిచ్చుతల్లీయని కవియను చున్నాడు.


                              ఇటులీ పద్యము  అనవద్యము  హృద్యమునై  చదువుల తల్లి యంతః సత్త్వమును వ్యక్తమొనర్చు

పరమామ్నాయ  సదృశమై  యొప్పారు చున్నది.


                                                                  స్వస్తి!🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ముహూర్తం అంటే

 *ముహూర్తం అంటే ఏమిటి? దానికి బలం అనేది ఉంటుందా? ఎలా నమ్మాలి? దేనికి నమ్మాలి?*


*విజయనగర సామ్రాజ్య స్థాపన కోసం విద్యారణ్య స్వామి హరిహర బుక్కరాయల తో మంచి స్థలం కోసం గాలిస్తున్నారు. వారు ఒక ప్రాంతం చేరగానే వారికి ఒక వింత దృశ్యం కనిపించింది. కొన్ని కుందేళ్లు వేటకుక్కలను తరుముతున్న దృశ్యం చూడగానే మ్రాన్పడిపోయారు. ఆ బలం కుందేళ్ళది కాదు అని, అది ఆ నేలలో ఉన్న మహత్తర శక్తి అని విద్యారణ్య స్వామి గ్రహించారు. అక్కడ రాజధానిని నిర్మిస్తే, శక్తివంతమైన సైనికులు, ఆర్ధిక పరిపుష్టి కలిగిన వ్యాపారులు, మేధావులైన అధికారగణం, నిజాయితీపరులైన ప్రజలతో రాజ్యం విలసిల్లుతుంది అని భావించారు.*


*రాజ్య నిర్మాణానికి ఒక దివ్యమైన ముహూర్తాన్ని నిశ్చయించారు. తెల్లవారుజామున ఒక ఘడియ లో చంద్రుడు ఏవో నక్షత్రాలకు సమీపిస్తాడు ట. అది అత్యద్భుతమైన ముహూర్తం అని భావించారు. హరిహర. బుక్క రాయల తో "నేను ఆ సమీపం లోని కొండపైకి ఎక్కి చంద్రగ్రహ కదలికలను గమనిస్తూ, సరైన ముహూర్త సమయం రాగానే శంఖాన్ని పూరిస్తాను. ఆ శబ్దం వినపడింది మరుక్షణమే మీరు ఇక్కడ పునాది ని తవ్వాలి. ఆ సమయంలో పడిన పునాది విజయనగర సామ్రాజ్యాన్ని వెయ్యి సంవత్సరాలు ఆ ముహూర్తబలం కాపాడుతుంది" అని చెప్పి స్వామి కొండపైనున్న శిఖరాగ్రానికి వెళ్లారు.*


*రాయల సోదరులు ఇరువురూ గునపాలు చేబూని సిద్ధంగా ఉన్నారు. తెల్లవారు జామున పూర్ణచంద్రుడు తేజోమయంగా నభో మండలం లో నిశ్చలంగా పరిభ్రమిస్తున్నాడు. నక్షత్రాలు మిరుమిట్లు గొలుపుతున్నాయి. సరిగ్గా అదే సమయం లో ఒక జంగం దేవర నదీస్నానం చెయ్యడానికి వెళ్తూ పెద్దగా శంఖాన్ని పూరించాడు. అది స్వాములవారు పూరించినదే అని భ్రమించి రాయలసోదరులు భూమిలోకి గునపాలు దించారు. ఒక్క అడుగు తవ్వగానే శంఖం మరోసారి మోగింది. ఇది స్వామి పూరించింది. ఆ శబ్దం వినగానే సోదరులు ఇద్దరూ దిగ్భ్రాంతి చెంది అచేతనంగా నిలబడి పోయారు.*


*ఇంతలో స్వామి కొండదిగి వచ్చారు. ఆయన రాగానే "గురుదేవా.. ఎందుకు శంఖాన్ని రెండుసార్లు పూరించారు?" అని ప్రశ్నించారు సోదరులు. స్వామి ఆశ్చర్యంగా అదేమిటి? నేను ఇప్పుడే శంఖనాదం చేసాను. పునాది తీసారా? అని ఆత్రంగా ప్రశ్నించారు. "లేదు గురుదేవా.. కొన్ని ఘడియల క్రితం శంఖనాదం వినిపించింది. అది మీరే పూరించారు అని అప్పుడే పునాది తీసాము" చెప్పారు సోదరులు.*


*అప్పుడే మళ్ళీ శంఖం ఊదుకుంటూ జంగందేవర వెళ్ళిపోతున్నాడు. అతడిని చూడగానే స్వామి ఖిన్నుడు అయ్యారు. "అయ్యో... తొలిసారి పూరించింది నేను కాదు. ఆ జంగం దేవర...ఎంత పొరపాటు అయింది... మీరు పునాది తీసిన ఘడియ అంత బలమైనది కాదు. ఆ ముహూర్తం లో తీసిన పునాది ఎక్కువకాలం నిలబడదు. రెండు వందల సంవత్సరాలలో ఈ సామ్రాజ్యం కూలిపోతుంది. విదేశీయులకు మనవాళ్ళు బానిసలు అవుతారు. కుట్రలు, కుతంత్రాలతో రాజకుటుంబం పతనమై పోతుంది.. అంతా విధి రాత" అన్నారు బాధగా...*


*ఆయన చెప్పినట్లే విఆయనగర సామ్రాజ్యం రెండువందల ఏళ్లకే పతనమై పోయి చివరకు ఆంగ్లేయుల స్వాధీనం లోకి వెళ్ళిపోయింది.*


*ముహూర్త నిర్ణయం లో అంత శక్తి ఉన్నది.*


*శాస్త్రం ఏ విషయాన్నైనా నిష్కర్షగా కర్కశంగా చెప్తుంది.*

🙏🌞🌞🌞🌞🌞🌞🌞🌞🙏

*-గురుప్రసాదం🙏👆*

🙏🕉️🌞🌞🌞🌞🌞🌞🕉️🙏