17, నవంబర్ 2021, బుధవారం

శివుడు లయకారుడు

 శివుడు లయకారుడు.. 

    ఎందుకంటే జన్మించిన ప్రాణి మరణించక తప్పదు. మరణించిన తర్వాత జన్మించక తప్పదు’ ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు ముగ్గురు. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీరు ముగ్గురు సర్వ స్వతంత్రులు అయినప్పటికీ.., ఒకరి విధి నిర్వహణలో మరొకరు తల దూర్చరు. ‘బ్రహ్మ’...సృష్టి ధర్మానికి రక్షకుడు. ప్రాణికోటిని సృష్టించడమే ఈయన ధర్మం. ‘విష్ణువు’...సృష్టిని పోషించి, రక్షించడమే ఈయన ధర్మం. ఈ ధర్మరక్షణ కాస్త కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఒక కుటుంబాన్ని పోషించి, రక్షించడానికి.., యజమాని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది., మోసాలు చేయాల్సి వస్తుంది. 


కేవలం ఒక్క కుటుంబ రక్షణే ఇంత కష్టతరం అయినప్పుడు.., మరి ఈ మాయాజగత్తును పోషించి, రక్షించడమంటే మాటలా! ఈ ధర్మరక్షణ కోసమే ‘శ్రీ మహావిష్ణువు’ ఎన్నో అవతారాలు ఎత్తాడు..,ఎన్నో మాయలు పన్నాడు.., మరెన్నో మోసాలు చేసాడు. ఎలా రక్షించాడు అన్నది అప్రస్తుతం. ఇక్కడ రక్షణే ప్రధానాంశం. ‘మహేశ్వరుడు’...లయకారకత్వం ఈయన ధర్మం. ‘లయం’ అంటే ‘ నాశనం’ అని ఓ తప్పుడు అర్ధాన్ని చెప్పేస్తారు. ఇంగ్లీషు భాషలో ‘destroyer’ అనే పదాన్ని వాడతారు. అది తప్పు. ‘absorber’ అనే పదాన్ని వాడాలి. ‘శివుడు’ నాశనకారుడా? ఎంత తప్పు భావన అది. ‘లయం’ అంటే లీనం చేసుకోవడం, లేదా తనలో కలుపుకోవడం. ఈ సృష్టిచైతన్యాన్ని లయం చేసుకోవడం అంటే మాటలా? ధానికి ఎంతో తపశ్శక్తి కావాలి. అందుకే శివుడు ఎప్పుడూ తపస్సమాధి స్థితిలో ఉంటాడు. సృష్టికి, రక్షణకు నాశనం ఉంది. ‘లయం’కు నాశనం లేదు. అది శాశ్వతం. భౌతికంగా కనిపించేది ప్రతీదీ నాశనం అయ్యేవే. అభౌతికమైనవే శాశ్వతంగా ఉండేవి.


ఏది అభౌతికమైనది అంటే..‘ఆత్మే’ అభౌతికమైనది. దీనికి చావు పుట్టుకలు ఉండవు. ఈ ఆత్మ దేహధారణ చేస్తే ‘జీవాత్మ’ అవుతుంది. ‘జీవాత్మ’ దేహత్యాగం చేస్తే ‘ఆత్మ’గా మిగిలిపోతుంది.పాంచభౌతికమైన శరీరం మరణించిన తర్వాత భూతత్వం..భూమిలోను., అగ్నితత్వం.. అగ్నిలోను., జలతత్వం., జలములోను., వాయుతత్వం..వాయువులోను., శబ్దతత్వం.. ఆకాశంలోను., లయమౌతాయి. ఇక మిగిలివున్న ‘ఆత్మ’ను శివుడు లయం చేసుకుంటాడు. ఎలా? ఉదాహరణకు..., ఒక దీపాన్ని ఊదేస్తే ఏమవుతుంది? ఆరిపోతుంది. ఆరి.. ఎక్కడకు పోతుంది? తన ఉత్పత్తి స్ధానమైన దీపంలోకే వెళ్లి లయమైపోతుంది. తిరిగి దీపాన్ని వెలిగించాలంటే.. దీపం నుంచే దీపాన్ని వెలిగించాలి. అలాగే ఒక మనిషి మరణిస్తే.. ‘చనిపోయాడు’ అంటాం. ‘చని’ అంటే ‘వెళ్లుట’ అని అర్థం. ఎక్కడకు వెళ్లాడు..అంటే..తను వచ్చినచోటుకే వెళ్లాడు. తిరిగి రావాలంటే.. అక్కడనుంచే రావాలి.అంటే.. లయంనుంచే సృష్టి ప్రారంభమౌతున్నదన్నమాట. దీనిని బట్టి మనకు ఏమర్థమౌతోంది? 


దేహం నుంచి విడివడిన ‘ఆత్మ’ తన ఉత్పత్తిస్ధానమైన శివునిలో లయమైపోతుంది. కనుకనే ఆయనను లయకారుడన్నారు. వ్యామోహం లేనివాడే విరాగి. మమకారం ఉన్నచోట స్వార్ధం ఉంటుంది. స్వార్దం ఉన్నచోట లయానికి తావులేదు. కష్ట సుఖాలయందు సమదృష్టి కలవాడే విరాగి. అట్టి విరాగే సర్వాన్ని సమానంగా తనలో లీనం చేసుకోగలుగుతాడు. శివునకు తన దేహంమీదే మమకారంలేదు. చితాభస్మాన్ని పూసుకుంటాడు.. దిగంబరంగా తిరుగుతాడు..భిక్షాటన చేస్తాడు. పుర్రెలో భుజిస్తాడు. రుద్రాక్షలు, పాములు ధరిస్తాడు. శ్మశానంలో నివసిస్తాడు. ఇంతటి విరాగి కనుకనే ఆయన లయకారుడయ్యాడు. సృష్టి, స్ధితులకు ఆద్యుడయ్యాడు. సర్వజగత్తుకు ఆరాధ్య దైవమయ్యాడు.


#హారహారమహాదేవ్ #ఓంనమఃశివాయ 


       ॐ సర్వం శివమయం జగత్ ॐ


           ॐ ఓం నమఃశివాయ ॐ


🚩🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏🚩

భారతీయత ఔన్నత్యం*

   *భారతీయత ఔన్నత్యం*


🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


కారుమేఘాలు కమ్ముతుఃన్నాయి 

ఏక్షణంలో అయినా... 

వర్షం విపరీతంగా కురుస్తుంది...! 

వేసే ముగ్గు..వర్షంలో కలుస్తుంది !అయినా..ఆమె ముగ్గువేస్తోంది... !

      *అదీ..సంప్రదాయం!* 🙏

             ....................


అంతర్జాతీయ ఖ్యాతినార్జించి

అమెరికాలో ఉంటున్న వైద్యుడు. సొంతూరు వచ్చినప్పుడల్లా 

పాఠాలు చెప్పిన పంతులుకు 

పాదాభివందనం చేస్తాడు…! 

        *అదీ .. సంస్కారం !* 🙏

              .....................


ఖగోళ శాస్త్రాన్ని 

నమిలి మింగిన నిష్ణాతుడు.  

నిష్టగా ఉంటూ

గ్రహణం విడిస్తేగానీ... 

ఆహారం గ్రహించడు…! 

       *అదీ .. నమ్మకం !* 🙏

             ....................


పరమాణు శాస్త్రాన్ని 

పిండి పిప్పిచేసిన పండితుడు. 

మనవడి పుట్టు వెంట్రుకలు 

పుణ్యక్షేత్రంలో తీయాలని 

పరదేశం నుండి పయనమై వస్తాడు…! 

        *అదీ .. ఆచారం !* 🙏

            ..............................


అంతరిక్ష విజ్ఞానాన్ని

అరచేతబట్టిన అతిరధుడు. 

 అకుంఠిత నిష్ఠతో

పితృదేవతలకు 

పిండ ప్రదానం చేస్తాడు…!

 *అదీ .. సనాతన ధర్మం!* 🙏

           ........................


అత్తింటికి వెళ్లేముందు 

ఇంటి ఆడబడుచు 

పెద్దలందరికీ 

పాదాభివందనం చేసి 

పయనమవుతుంది…! 

       *అదీ .. పద్ధతి !* 🙏

         ........................


పెద్ద చదువులు చదివినా 

పెద్ద కొలువు చేస్తున్నా 

పేరు ప్రఖ్యాతులున్నా 

పెళ్లి పీటలమీద .. వధువు

పొందికగా ఉంటుంది…!

     *అదీ .. సంస్కృతి!*🙏

       ..............


భార్య పక్షవాతానికి లోనయ్యింది. 

మంచం దిగలేని పరిస్థితి 

తనంతట తానుగా.. 

తనువీడ్చలేని స్థితి.

భర్త భరోసాగా నిలచి..భారమంతా మోస్తాడు-అన్నీతానై .. అలిని సాకుతాడు…!

       *అదీ .. దాంపత్యం!* 🙏

             .....................


బ్రతికే అవకాశం తక్కువ

వెంటిలేటర్ పై వేచిచూస్తే

బ్రతికితే బ్రతకొచ్చు!

లక్షల ఖర్చు భరిస్తూ

వెంటిలేటర్ పై పెడతారు… !

          *అదీ .. అనుబంధం!* 🙏


 

*ఇవి భారతీయుల తరతరాల ఆచారాలు, సంప్రదాయలు, విలువలు, ఔన్నత్యం కొన్ని మాత్రమే* 


*ఇది భారతీయల ఆత్మ తత్త్వం* 


*సమస్త లోక సుఖినోభవంతు*


‌🙏🙏🙏🙏🙏

విజయం అంటే

 *_ ఒక ప్రొఫెసర్ అడిగిన ప్రశ్న... విజయం అంటే ఏమిటి ???....._*


*మన దేశం నుండి ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక కాలేజీ లో విద్యార్థులతో మాట్లాడుతూ '' విజయం అంటే ఏమిటి? '' అని అడిగితే ఒక యువతి '' విజయం అంటే దండిగా డబ్బు* *సంపాదించడం , '' అంది*. 

*అపుడు ఆ ప్రొఫెసర్ '' అయితే ఇరవైఏళ్ళక్రితం ప్రపంచంలో అత్యంత ధనవుంతుడు ఎవరో చెప్పండి? '' అంటే ఎవరూ చెప్పలేదు. [ఎందుకటే ప్రతి ఏడాదికీ అది మారిపోతూవుంటుంది కాబట్టి] బ్రతకడానికి కొంత డబ్బు కావాలి కానీ , డబ్బే బ్రతుకు కాదు*. *అంటే విజయమంటే డబ్బు సంపాదన కాదు అన్నమాట.*   

*మరో యువకుడు లేచి '' విజయం అంటే బలం / శక్తి '' అన్నాడు. అలా అయితే అలెగ్జాండర్ ,* *నెపోలియన్ ,ముస్సొలిని ,హిట్లర్ , స్టాలిన్ , బిన్ లాదెన్ ... వీళ్ళంతా బలవంతులు , ప్రపంచాన్ని గెలవాలని అనుకొన్నవారే కదా , వీళ్ళు జీవితం లో సంతోషంగా వుండగలిగారా ? వీళ్ళ జీవితాలు ఎలా గడిచి , ముగిశాయో చరిత్ర చెపుతున్నది కదా! తన బలంతో , తన* *ముష్టిఘాతాలతో మహా* *బలవంతులను* *మట్టికరిపించిన మహమ్మద్ అలీ అనే ప్రపంచ చాంపియన్ బాక్సర్ , తరువాత కొన్నేళ్ళకు పార్కిన్ సన్ వ్యాధి వల్ల కాఫీకప్పును కూడా పట్టుకోలేక పోయాడు. అయితే* *విజయమంటే బలం / శక్తి సంపాదన కాదు అన్నమాట.* 

*మరో యువతి '' విజయమంటే ప్రఖ్యాతి , అందం ,'' అనింది. అయితే కేట్ మోస్ , జీన్ ష్రింప్టన్ , సోఫియాలారెన్ , మార్లిన్ మన్రో ...లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా వుండేవో చాలామందికి తెలియదు. భారత్ విషయానికొస్తే , పర్విన్ బాబీ అనే ఒక హిందీ హీరోయిన్ వుండేది. ఆమె ఎంత అందగత్తే అంటే , అమితాబ్ బచ్చన్ తో సహా , ఆమెను పెళ్ళి చేసుకోవాలి అని అనుకొనని హిందీ సినిమా హీరో నే లేడు. డానీ, కబీర్ బేడీ , మహేష్ భట్ లతో ఆమె ప్రేమ , పెళ్ళి నడిచి అవన్నీ విఫమయ్యాయి. ధర్మేంద్ర , రాజేష్ ఖన్నా , అమితాబ్ బచ్చన్ .. ఇలా అందరూ ఆమె వెంట పడ్డవారే. కొద్దిరోజులకు ఆమెకు జీవితం అంటే శూన్యం అని తెలిసిపోయి , నమ్మిన వాళ్ళు మోసం చేస్తే , తాగుడుకు బానిస అయ్యి , ఒక దశలో కాలికి కురుపు లేచి , అది ఒళ్ళంతా ప్రాకి , ఏ శరీరం కోసం అయితే అంతమంది మగ వాళ్ళు పిచ్చిక్కెపోయారో , అదే శరీరమే కంపు వాసన కొడుతూవుంటే , ఆమెకు ఏదో వింతవ్యాధి వచ్చిందని , జనం ఆమెను తాళ్ళతో కట్టి , ముంబాయి వీధుల్లో లాగుకొంటూ తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పడేస్తే ఆఖరుకు పక్కింటి వాళ్ళు ఆమె ఇంట్లోనుండి భరించలేనంత కంపు వస్తోందని కంప్లైంట్ చేస్తే , కార్పొరేషన్ వాళ్ళు వచ్చి 3 రోజులక్రితమే చనిపోయిన ఆమెను చూసి తీసుకెళ్ళి పూడ్చేసారు.* *అయితే అందం , ప్రఖ్యాతి అనేవి విజయం కావన్నమాట.* 


*మరోసారి మరొకరు ''* *విజయమంటే అధికారం '' అని అన్నారు. అయితే '' కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లు అన్నీ వ్రాయండి '' అని అంటే వున్న 50 మందిలో 39 మంది అందరు ప్రధానుల పేర్లూ వ్రాయలేకపోయారు. మా అనంతపురంలో ఒకప్పుడు రాష్ట్రపతి గా వెలిగిన సంజీవరెడ్డి గారి ఇంటిదగ్గర ఇపుడు పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి , పందులు దొర్లుతున్నాయి*. *విజయం అంటే అధికారం కాదు అన్న మాట.* 


*చివరగా ఆదే ప్రొఫెసర్ భారత్ లో మరో యూనివర్సిటీ లో యువతీ యువకులను ఇదే ప్రశ్న వేసారు - '' విజయం అంటే ఏమిటి ? '' అందరూ మౌనంగా వుంటే అపుడు ఆయన అన్నారు , '' మీ అవ్వ తాతల పేర్లు మీకు తెలుసా ? '' అందరూ '' తెలుసు '' అన్నారు. '' వాళ్ళ అవ్వ , తాతల పేర్లు తెలుసా ? ''అని అడిగితే అయిదారుమంది ''తెలుసు ''* *అన్నారు. '' వాళ్ళ అవ్వ తాతల పేర్లు తెలుసా ? '' '' తెలియదు '' అన్నారు.* 

*అపుడు ప్రొఫెసర్ గారు ''* *శ్రీరాముడు , శ్రీకృష్ణుడు ,* *బుద్ధుడు , ఆదిశంకరుడు ,* *అందరూ '' ఓ , తెలుసు '' అని ముక్తకంఠం తో బదులిచ్చారు. ''* *మీకు మీ స్వంత అవ్వ తాతలు గుర్తుకులేరు కానీ మీరు ఎన్నడూ చూడని వీళ్లంతా ఎలా గుర్తుకున్నారు ? ''* 

*అని అడిగినపుడు పద్మిని అనే ఒక యువతి , ప్రొఫెసర్ గారు అంతదాకా చేసిన గొప్ప ఉపన్యాసానికి చాలా ఎమోషనల్ అయ్యి కళ్లలో నీరు తిరుగుతుండగా ఇలా అనింది : '' సార్ , మీ ప్రశ్నకు నేను జవాబు చెపుతాను. మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం , రాముడు , కృష్ణుడు , బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తువుండటానికి కారణం ఇదే : '*

 *తమ కోసం, తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరచిపోతుంది, ఇతరులకోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుకుపెట్టుకొనేవుంటుంది. ఇదే విజయం అంటే ! ''* 


*''నా గురించి నేను దు:ఖించకపోవడమే నా ఆనందానికి కారణం '' అని 2600 ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన మాట , '' ఇతరులకోసం జీవించేవారే నిజంగా జీవించినట్టు , అలా చేయని ఇతరులు జీవించివున్నా మరణించినట్టే లెక్క''* 


*[ Only They Live Who Live For Others , The Others Are More Dead Than Alive ]* 

*అని వివేకానంద 1896 లో అన్న మాట ఇదే కదా.*

పొడుపు కథ.!

 అచ్చమైన పొడుపు కథ.!


ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు. ఎనిమిది ప్రశ్నలు?

వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు.

ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ.

.

“ రాముడెవ్వానితో రావణు మర్దించె? 

పర వాసు దేవుని పట్నమేది ? 

రాజమన్నారుచే రంజిల్లు శరమేది ? 

వెలయ నిమ్మ పండు విత్తునేది? 

అల రంభ కొప్పులో అలరు పూదండేది? 

సభవారి నవ్వించు జాణ యెవడు? 

సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది? 

శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు? 

.

అన్నిటను జూడ ఐదేసి యక్షరములు 

ఈవ లావాల జూచిన నేక విధము 

చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి” 

లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !”

.

పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు. 

తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.(క్లూస్) 

మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని, 

నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన.

ఇక జవాబుల సూచికలు-

ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి,

ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి. (ఉదా;- “ కిటికి”వలె ).

1.రాముడు ఎవరిసాహాయంతో రావణుని చంపాడు?

2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి?

3.రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఎమిటి?(శరము=బాణము)

4. నిమ్మ పండు విత్తనం పేరు ఏది?

5.రంభ జడలో పెట్టుకొన్న పూలదండ పేరు?

6.సభలో నవ్వించే కవిపేరు ఏది?

7.సీత పెండ్లికి సుల్కంగా పెట్టిన విల్లు ఏది? ( ఓలి=శుల్కం)

8.శ్రీకృష్ణుడు ఎవరి యింట పెరిగేడు?

ఈ క్రింది జవాబులు చూడండి.

.

1.తోకమూకతో! ( వానరాలకి ఇంకొక పేరు.)

2.రంగనగరం! ( శ్రీరంగం )

3.లకోల కోల! ( కోల= బాణం)

4.జంబీర బీజం! ( జంబీరం=నిమ్మపండు. బీజం=విత్తనం)

5.మందార దామం! ( దామం అంటే దండ)

6.వికట కవి! ( హాస్యకవి తెనాలి రామ కృష్ణుడు)

7.పంచాస్య చాపం! ( శివుని విల్లు)

8.నంద సదనం! ( నందుని ఇల్లు)

-

పై జవాబులు ఐదు అక్షరాలతో, ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటాయి. 

అదే ఈ చాటు పద్యంలోని చమత్కారం. ఇట్టి చాటువుల ద్వారా భాషా జ్ఞానం, పద జ్ఞానం వృద్ది చెందుతాయి. ఇలాంటివి ఇంకా చదవాలని కుతూహలం పెంచుతాయి.

పెద్దలు చదివి, పిల్లలకి కూడా తెలపగలరు.

16, నవంబర్ 2021, మంగళవారం

అద్భుతాలతో


మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ... ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.. ఇది చాలా అద్భుతమని ఆశ్చర్యపోతుంటాం!! 


మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు .


🌷 *1* . *తల్లి* 


మనల్ని ఈలోకానికి పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన... 👩‍🦱తల్లి మొదటి అద్భుతం. 


🌷 *2* . *తండ్రి* 


మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు  

మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు 

దుఃఖాన్ని తాను అనుభవిస్తూ..😎 సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం. 


🌷 *3* . *తోడబుట్టిన* *వాళ్ళు* 


మన తప్పులను వెనుకెసుకురావాడానికి...  

మనతో పోట్లాడడానికి... మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు... 

తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం 😥🥴☺


🌷 *4* . *స్నేహితులు*  


మన భావాలను పంచుకోడానికి..  

మంచిచెడు అర్థం అయ్యేలా చెప్పడానికి...

ఏది ఆశించకుండా.. మనకు దొరికిన స్నేహితులు నాలుగో అద్భుతం. 🌚🌝👨‍✈️🕺


 *🌷5* . *భార్య* / *భర్త* 


ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను... ఎదిరించేలా చేస్తుంది 

కలకాలం తోడు ఉంటూ...🌛 ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే... ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది 🌜

భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే ఐదో అద్భుతం మన సొంతం .


🌷 *6* . *పిల్లలు* 


మనలో స్వార్థం మొదలవుతుంది..  

మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది...  

వారి ఆలోచనలే ఎప్పుడూ చుట్టూ ఉంటాయి..  

వారికోసం మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది.. 

వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని... తల్లి తండ్రులు అసలు ఉండరు... 🙏

పిల్లలు ఆరో అద్భుతం 


అన్ని అయిపోయాయి ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?


🌷 *7* . *మనవళ్ళు* *మనవరాళ్లు* 


వీరికోసం ఇంకా కొన్నిరోజులు బతకాలనే ఆశపుడుతుంది.. 

వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతం 

మళ్ళీ పసిపిల్లలం...🏃🏃‍♀️👩‍🔧👨‍💼👨‍🎓👩‍🎓 అయిపోతాం  

వీరు మన జీవితానికి దొరికిన.. ఏడో అద్భుతం 🌹🌺🌷🥀


🌹ఇలా అద్భుతాలన్నీ మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం... 

కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు మన సొంతం అవుతాయి  

చిన్న పలకరింపు చాలు... మనల్ని ఆ అద్భుతంగా చూడడానికి.  

అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి మరో అద్భుతాన్ని సృష్టించేద్దాం ...


ఇప్పుడు మన మధ్య ఉన్న మనిషి తెల్లవారేసరికి వుంటాడో లేదో తెలియని కాలం ఇది అందుకే ఉన్న దానిలో సర్దుకుపోయి ఆయిగా జీవించడం లోనే ఆనందం...🌹🌹🌹

ఎవడింజను వాడిదే

 ఔరా! ఏమి చోద్యం:

(ఓ సెటైర్ యూట్యూబ్ వీడియోలపై)


వారం రోజులు గా సుబ్బారావు కి కడుపులో నొప్పి, బొడ్డు చుట్టూ మెలితిప్పి నట్టు బాధ. నిద్రపోయే అర్దరాత్రి వేళ గుండెల్లో గ్యాసు తన్నుకొస్తోంది.

మోషన్ అయితే ఔతోంది, కాకపోతే కావట్లేదు.

ఇంట్లో వాతావరణం కాలుష్యం చేస్తూ నిరంతరం అపాన వాయువు.వేడినీళ్ళు,వామునీళ్ళు, జీలకర్ర నీళ్ళు తాగు తూనే ఉన్నా ఏదో కాస్త ఉపశమనం ఉన్నా బాధ యథాతధం.


ఇది పనికాదని ప్రముఖ లివర్ స్పెషలిస్ట్ డా...కాలేయ గారి ఎపాయింట్ మెంటు తీసుకున్నాడు.ఆయన ఆన్లైన్లో. చేయించి వలసిన టెస్ట్ లు చెప్పగా అవన్నీ చేయించి ఆ ఫైలు తీసుకొని

అపాయింట్మెంట్ రోజు న కలిసాడు డా..కాలేయ గారిని.


రిసెప్షనిస్ట్ రిపోర్ట్ లన్నీ తీసుకుని టోకెన్ ఇచ్చి మిమ్మల్ని ఓ అరగంట లో పిలుస్తారు కూర్చోండి అంది.


తన టర్మ్ రాగానే లోపలికి పోయాడు సుబ్బారావు

డా..కాలేయ గారు రిపోర్ట్ పరిశీలించి మీకు కడుపులో

బాగా అజీర్ణం ఉంది ఇది బాగా పేటీ లివర్ వల్ల, ఆహారం అరగక పోవడం వల్ల,కొంత ఇన్ఫెక్షన్ వల్ల, ఏర్పడింది.పచ్చివి తిన్నట్టు న్నారు బహుశా అన్నాడు.


మీ సమస్యలన్నీ మీకు అరుగుదల సరిగా లేకపోవడం వల్ల,చక్కగా ఉడికినవి, సులువుగా అరిగేవి తినండి.ఓఫ్లాస్కు కొనుక్కుని తరచుగా వేడినీళ్లు తాగుతూ ఉండండి.పచ్చికూరలు,గింజలు, కొబ్బరి నూనె తాగడం, నెయ్యి నాకేయడం,

ఇలాంటివి కొన్నాళ్ళు మానేసి ఉడకపెట్టినవి

సులువుగా జీర్ణం అయ్యేవి తినండి.మందులు రాస్తున్నా అని మందులు రాస్తుండగా, డా....కాలేయ గారి వెనుక గోడమీద ఉన్న నాలుగురు ఫోటోలు చూసి ఆశ్చర్యపోయాడు సుబ్బారావు.


ఆ ఫోటోలు ఒకటి పకృతి వీర్రాజు ది,బాదాం బాలనాయుడిది,ఆకు కూరలు అప్పలర్రాజుది,అరికె పాషాది.


సుబ్బారావు డాక్టర్ గారూ మీరుకూడా వీరి అభిమానులా వీరి ఫాలోయర్సా అనడిగాడు.

డా... కాలేయ నవ్వుతూ వీరి ఫాలోయర్స్ సగం మంది నా ఫాలోయర్స్.నా వైద్యం అభి వృద్ధికి వీరే కారణం.యూట్యూబుల్లో మీలాగే వీరిని ఫాలో అయ్యేవారు లో సగంమంది జీర్ణవ్యవస్థ దెబ్బ తిని నాదగ్గరకు వస్తారు అందుకే వీరు నాకు ప్రాతస్మరణీయులు అన్నాడు.


చివరగా సుబ్బారావు గారూ మీకో మాట.ఎవరికో

మొలకలు సరిపోతాయని మీకు సరిపోవు.మనుషులందరూ ఒక్కటే అయినా

ఎవడి ఇంజను వాడిదే.ఈ వయసులో ప్రయోగాలు వద్దు.తేలికగా అరిగే వి తింటూ వాకింగ్ చేయండి.

నెల రోజుల తర్వాత రండి.


అలాగే వింటూ బయటికొచ్చిన సుబ్బారావుకి మనసులో మారు మోగుతున్న డా...కాలేయగారి మాట:


*మనుషులంతా ఒక్కటే--కానీ ఎవడింజను వాడిదే


నిజమే కదా.😊

15, నవంబర్ 2021, సోమవారం

మధుమేహం

 మధుమేహం గురించి సంపూర్ణ వివరణ - 


        మధుమేహము మహారోగములలో ఒకటిగా పేర్కొనబడినది . అధిక ప్రమాణమున మాటిమాటికి మూత్రము ఈ వ్యాధి నందు వెడలుటచే ఇది మేహరోగం అనబడును. ఈ రోగం జనించుటకు ప్రధానకారణాలు గురించి ప్రాచీన ఆయుర్వేద వైద్యులు అనేక కారణాలు తెలియజేసారు. 


              సుఖముగా ఉండు ఆసనము పైన ఆసీనుడై యుండి ఏ పనిచేయక సోమరిగా ఉండుట , ఎక్కువసేపు సుఖముగా నిద్రించుట , పెరుగు , జలచరమాంసాదులు , పాలు , బెల్లం , తీపివస్తువులు , కఫవర్ధక పదార్థాలు ఎక్కువుగా సేవించుట , కొవ్వుపదార్ధాలు అధికంగా తీసుకొనుట , శరీరానికి శ్రమ లేకపోవుట , పగటినిద్ర మరియు శీతల , మధుర , స్నిగ్ధ ద్రవముగా ఉండు అన్నపానాదులు అధికంగా సేవించుట వలన ప్రమేహము వచ్చును. 


              ఆరోగ్యవంతుని యందు ఒక పగలు , రాత్రి అంటే 24 గంటల కాలమున విసర్జించబడు మూత్రము యొక్క ప్రమాణము 800 - 2500 మీ.లీ గా ఉండును. పైన పేర్కొనబడిన సాధారణ ప్రమాణము కన్నా అధికముగా మూత్రవిసర్జన జరిగినచో అది ప్రమేహం అనబడును. ఉదాహరణకు ఉదకమేహము ( Daibetes insipidus ) అను సమస్య నందు 5 - 10 లీటర్లు మూత్రము 24 గంటల కాలంలో విసర్జించబడును. ప్రమేహము నందు మూత్రము నిర్మలముగా ఉండక కలుషితమై కలకపరి ఉండును. 


     

         మధుమేహము కారణములను ఆధారం చేసుకుని రెండు విధములుగా పేర్కొనబడినది . 


      1 - సహజము .


      2 - అపథ్య నిమిత్తజము . 


 * సహజము - 


        సహజముగా కలుగు ప్రమేహము తల్లితండ్రుల బీజదోషము వలన కలుగును. శిశువు జన్మకు కారణం అయిన బీజము , శుక్రము యొక్క దోషములు సామాన్యముగా సహజ వ్యాధులకు కారణము. కావున మధుమేహము కూడా బీజదోషముల వలనే జనించును. 


 * అపథ్య నిమిత్తజము - 


        ఇది బీజదోష రహితముగా , జన్మించిన తరువాత అపథ్య ఆహార అలవాట్ల వలన జనియించును. ప్రమేహవ్యాధి జనియించినప్పుడు సరైన చికిత్స చేయక ఉపేక్షించిన యడల ప్రమేహములు ( 20 రకాలు ) అన్నియు మధుమేహములుగా మారును. 


                         మధుమేహము నందు మూత్రము కషాయ , మధుర రసములు కలిగి తెలుపుగా ఉండును. ఈ వ్యాధిని నిర్ధారించుటలో మూత్రపరీక్ష మరియు రక్తపరీక్షలు దోహదపడును. ఈ పరీక్షల ఆధారముగా వ్యాధితీవ్రత మరియు చికిత్సా ఫలితములను అంచనా వేయుట సాధ్యపడును. 


       కడుపులో చిన్నపేగు మొదటి భాగమునకు ( Duodenum) , పిత్తాశయం ( Gallblader ) నకు మధ్యభాగములో పైత్యనాళము (Bileduct ) పక్కగా క్లోమము ( Pancrease ) అను వినాళగ్రంధి ఉండును. ఇందులో ఎంజైములు మరియు హార్మోనులు ఉండును. ఎంజైములు ఆహార జీర్ణక్రియలో పాల్గొనును. ఇన్సులిన్ మరియు గ్లూకాగాన్ అను రెండు హార్మోనులు ఈ క్లోమగ్రంధి యందు ఉండి రక్తములోని గ్లూకోజ్ ప్రమాణమును నియంత్రించుతూ శరీర అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూడును . మధుమేహ రోగికి పలుకారణాల వలన ఇన్సులిన్ అనే హార్మోన్ చురుకుగా లేకపోవడం , కావలిసినంత ప్రమాణముగా అందుబాటులో లేకపోవటం వలన రక్తములో గ్లూకోజ్ స్థాయులు పెరుగును . రక్తములో అధికంగా ఉన్న గ్లూకోజ్ మూత్రపిండాల ద్వారా మూత్రములో బయటకు వెళ్ళును. ఈ విధముగా శరీరంలో పలు జీవక్రియలకు ఆధారమైన మరియు శక్తిని సమకూర్చే గ్లూకోజ్ నిలువలు క్రమేణా తరిగిపోవడం మరియు శరీర అవయవాలు ఉపయోగించుటకు వీలులేని వాతావరణము నెలకొనుట మూలముగా క్రమముగా మధుమేహరోగి కండరాలు క్షీణించి నరముల బలహీనత , కంటిచూపు తగ్గుట మరియు మూత్రపిండముల సామర్ధ్యము తగ్గుట మొదలగు ఉపద్రవములతో మరణించును . సక్రమమైన ఆహారవిహారాలు , క్రమం తప్పకుండా ఔషధసేవన పాటించడం వలన రోగికి వ్యాధి లొంగుబాటులో ఉండి ఆయువును పెంపొందించును. 


                  మధుమేహా సమస్య నివారణలో ఔషధ సేవనతోపాటు ఆహార నియమాలు కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి. ఇప్పుడు మీకు తినవలసిన మరియు తినకూడని ఆహారనియమాల గురించి వివరిస్తాను. 


   తినవలసిన ఆహారపదార్ధాలు - 


       యవలు , గోధుమలు , కొర్రలు , రాగులు , పాతబియ్యపు అన్నం , పెసలు , చేదు గల కాయగూరలు , మరియు ఆకుకూరలు , చేదుపోట్ల , కాకరకాయ , మెంతులు , దొండకాయ , వెలగపండు , మారేడు , నేరేడు విత్తనాలు , ఉసిరిక పండు , పసుపు , అడివిమాంస రసములు ఎక్కువుగా వాడవచ్చు . 


  తినకూడని ఆహార పదార్దాలు - 


      కొత్త బియ్యపు అన్నం , అధిక నూనె కలిగిన ఆహారాలు , బెల్లపు పదార్దాలు , నెయ్యి వంటకములు , మద్యము , గంజి , చెరుకు రసము , పుల్లటి పదార్థాలు , చింతపండు , పెరుగు , వెన్న , జున్ను , దుంప కూరలు , కొవ్వులు అధికంగా ఉండు పదార్దాలు వాడకూడదు. అదేవిధముగా పగలు నిద్రించరాదు , ధూమపానం , రాత్రి సమయములో మేల్కొని ఉండటం నిషిద్దం . మలమూత్ర వేగాలను నియంత్రించరాదు.   


        పైన చెప్పిన నియమాలు పాటిస్తూ మధ్యాహ్న సమయంలో మజ్జిగ అన్నంలో 50 గ్రాముల ఉల్లిపాయని నంజుకొని తినండి. పలుచటి మజ్జిగని మాత్రమే వాడవలెను. శరీరం నందు వేడిమి పెరగకుండా జాగ్రత్తవహించండి. నేను రాసిన గ్రంధాల నందు పెద్ద పెద్ద అనారోగ్యాలకు కూడా చిన్నచిన్న చిట్కాల సహాయంతో తగ్గించుకునే విధముగా అత్యంత సులభయోగాలు ఇచ్చాను . ప్రతి ఇంటి నందు ఉండవలసిన గ్రంధములు . తప్పక చదవగలరు.


                       * సంపూర్ణం *

  

 మధుమేహ నివారణా చూర్ణం నాదగ్గర లభ్యం అగును . నన్ను సంప్రదించగలరు .

విస్తరాకులలో తింటే

 భోజనం చేయుటకు ఉపయోగపడే ఆకులు - వాటిలోని ఔషధ గుణాలు - 


        కొంతకాలం క్రితం ఒక గ్రామము నందలి బాలురు తీవ్రమైన అతిసార వ్యాధితో బాధపడుతున్నారు. వారికి ఎంత మంచి చికిత్స అందించినను వ్యాధి తీవ్రత తగ్గటం లేదు . వారిని పరిశీలించుటకు వచ్చిన శాస్త్రవేత్తలు వారు ఆహారం తీసికొనుటకు ఉపయోగించుచున్న అల్యూమినియం పాత్రలను ప్రయోగశాలకు పంపినప్పుడు వారి రోగానికి కారణం వారు భుజించు ఆహారం కాదు వారు ఆహారాన్ని వండటానికి ఉపయోగించుచున్న అల్యూమినియం పాత్రలే కారణం అని నిర్దారణకు వచ్చారు. ఈ అల్యూమినియం పాత్ర యందు వండబడిన ఆహారం విషపూరితం అగును. అది శరీరం పైన ఒక్కసారిగా తన ప్రభావాన్ని చూపించదు. కొంచం కొంచంగా మనిషి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బ తీయును .


              అల్యూమినియం పాత్ర యందు ఆహారాన్ని ఉడికించడం మూలాన ఆహారం నందలి ఆమ్లములు , అల్యూమినియం లోహము పైన ప్రభావం చూపి అనేక విషసంభంధ రోగాలకు ప్రధానకారణం అగును. ముఖ్యంగా చర్మ సంబంధ , నరాల సంబంధ సమస్యలు అధికంగా వచ్చును. శరీరం నందు కేన్సర్ కూడ వృద్ధిచెందును. 


          పైన చెప్పినటువంటి సమస్యలు రాకుండా ఉండుటకు ముందుగా మనం ఆహారాన్ని వండే వంట పాత్రలను మార్చవలెను. అదేవిధముగా మనం ఆహారాన్ని భుజించుటకు విస్తరాకులు వాడటం ఎంతో మంచిది . ఇప్పుడు మీకు ఎటువంటి ఆకులతో చేసిన విస్తరాకులలో తింటే ఎటువంటి ఫలితాలు వస్తాయో వివరిస్తాను.


 * అరటి ఆకు -


      ఇందు భుజించటం మిక్కిలి శ్రేష్టం. కఫవాతములను హరించును . బలమును , ఆరోగ్యమును పెంచును. శరీరకాంతిని , సంభోగ శక్తిని పెంచును. ఆకలిని , దంతకాంతిని కలిగించును. పైత్యశాంతిని కలుగచేయును . శ్లేష్మ సంబంధ దోషాలు పోవును . శరీరం నొప్పులు తగ్గించును . ఉదరము నందలి పుండ్లు అనగా పెప్టిక్ అల్సర్ ను నయం చేయును .


 * మోదుగ విస్తరి -


      ఇందులో భుజించుటచే గుల్మరోగం , మహోదరం , క్రిమిరోగం , రక్తసంబంధ రోగాలు , పిత్తరోగములు నశించును. బుద్దిని పెంచును.


 * మర్రి ఆకు విస్తరి -


      దీని యందు భుజించిన క్రిమి రోగ నివారణ , జఠరాగ్ని వృద్ది , కుష్ఠు వ్యాధి నివారణ అగును. నేత్రదోష నివారణ అగును. వీర్యవృద్ధి కలుగును.


 * పనస -


      దీని విస్తరి యందు భుజించిన అగ్నివృద్ధి , పిత్తహర గుణములు ఉండును.


 * రావి -


      ఇది పిత్తశ్లేష్మ నివారణ , అగ్నివృద్ది కలిగించును. వీర్యవృద్ధి కలుగచేయును . విద్యార్జనకు మనసు కలుగచేయును .


 * వక్క వట్ట -


      ఇది అగ్నివృద్ధిని కలుగచేయును . వాత,పిత్త రోగాలని హరించును . 


      పైన చెప్పిన ఆకులలో భోజనం చేయడం వలన ఆయా ఆకులలో ఉండు ఔషధ గుణాలు అన్నియు మన శరీరం నందు చేరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును. 


    

                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

14, నవంబర్ 2021, ఆదివారం

శ్రీమద్భాగవతము

 *11.11.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2319(౨౩౧౯)*


*10.1-1462*


*శా. రోలంబేశ్వర! నీకు దౌత్యము మహారూఢంబు; నీ నేరుపుల్*

*చాలున్; మచ్చరణాబ్జముల్ విడువు మస్మన్నాథపుత్రాదులన్*

*లీలం బాసి పరంబు డించి తనకున్ లీనత్వముం బొందు మ*

*మ్మేలా పాసె విభుండు? ధార్మికులు మున్నీ చందముల్ మెత్తురే.* 🌺



*_భావము: భ్రమరేశ్వరా! మకరందం త్రావి త్రావి మదించియున్నావు. నీకు రాయబారాలు నడపటం బాగా అలవాటనుకుంటాను. నీ గడసరి తనము మాను. చమత్కారములు చాలించు. మా పాదాలు వదులు. మేము మా భర్తలను, కొడుకులను, ఇతర బంధువులందరిని అలక్ష్యము చేసి, మోక్షము మాటే తలపెట్టక, ఆయనలో ఐక్యమవ్వాలనే కాంక్ష తో వస్తే, మమ్ములను తృణీకరించి దూరమయ్యాడు ఆ శ్రీకృష్ణ ప్రభువు. ఈ చేష్టలను ధర్మ నిష్ఠ కల ప్రభువులు మెచ్చుకుంటారా?"_* 🙏



*_Meaning: "O king of the bees! You have become arrogant and fully intoxicated by drinking nectar from flowers. You are used to conducting mediation and Intercessions and are very adept at these. Enough with your shrewdness and stop your artfulness. Leave our feet and get away. We neglected and abandoned our husbands and children, never thought of Moksha but were completely involved in uniting with the Supreme being Sri Krishna. He made light of us and distanced from us, the ardent followers and puppets. Would the Supreme being approve of such misdemeanor?."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan kumar (9347214215).*

ఉన్మత్తుడు..ఉద్యోగి..

 *ఉన్మత్తుడు..ఉద్యోగి..*


"కొండారెడ్డీ! గురుబ్రహ్మం ఉన్నాడా?.." 

" ఉన్నాడు సార్ ..అన్నదానం వంటకు సరుకులిస్తున్నాడు.."


    " పరమేషూ..ఈరోజు లడ్లు చేయించే దగ్గర ఎవరున్నారు?.." 

" గురుబ్రహ్మమున్నాడు సార్..


  "అన్నదానం దగ్గర వడ్డనకు నేనూ, గురుబ్రహ్మం వెళుతున్నాము..మీకు చెప్పి వెళదామని వచ్చాము.." 


           "వెంకన్న గారూ..మీరు లీవు పెడితే, కౌంటర్ ఎవరు చూసుకుంటారు?..ఉన్న ఇద్దరూ సరుకులకెళుతున్నారు.." 


   మాట ముగించేలోపలే వచ్చే సమాధానం గురుబ్రహ్మం ఉన్నాడు అనే! 


       అర్చక స్వాములు, భక్తులకు ఇచ్చే కుంకుమను చక్కగా పోట్లాలుగా చుట్టి పెడుతూనో..లేదా..భక్తులకు ప్రసాదంగా తయారు చేసిన లడ్లు కవర్లలో ప్యాక్ చేస్తూనో..పల్లకీ సేవ కు మైక్ ఏర్పాటు చేస్తూనో...ఆలయం లో ఉన్నంత సేపూ ఏదో ఒక పని లో నిమగ్నుడై,.... మా దత్తాత్రేయ స్వామి మందిర వ్యవస్థ లో ఇంతగా మమేకం అయిన వ్యక్తీ...గురుబ్రహ్మం అనబడే సన్నగా రివటలా ఉండే వ్యక్తీ ....ఎనిమిరెడ్డి గురుబ్రహ్మారెడ్డి..


     2004 వ సంవత్సరం లో తన అమ్మగారికి ఆరోగ్యం సరిగా లేక, తల్లి వెంబడి మొదటిసారి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి వచ్చాడు..ప్రకాశం జిల్లా, పెద చెర్లో పల్లి మండలం, పోతవరం గ్రామ నివాసి..వాళ్ళ కులదైవం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు..ఇద్దరు సోదరులు..తల్లి, తను..


       కొన్నాళ్ళు ఇక్కడ వుండి, తల్లికి స్వస్థత చేకూరగానే తిరిగి వాళ్ళ వూరు వెళ్ళిపోయాడు..I.T.I. పాస్ అయ్యాడు..B.A., డిగ్రీ పూర్తీ చేసాడు.. 2006 వ సంవత్సరంలో AP TRANSCO లో హెల్పర్ గా ఉద్యోగం లో చేరాడు..


        అంతవరకు బాగానే ఉన్న గురుబ్రహ్మారెడ్డి మానసిక స్థితి క్రమంగా మారిపోయింది..2007 నాటికి అతను ప్రపంచం దృష్టిలో ఒక మానసిక రోగి..అంతుచిక్కని ఆరోగ్య సమస్య..సోదరుల ప్రయత్నాలన్నీ నిష్పలం అయ్యాక, వారికి చివరిగా తోచిన ఉపాయం మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సన్నిధి..తీసుకొని వచ్చి ఆ దత్తుడి పాదాల చెంత వదిలిపెట్టారు..తమ బిడ్డ మళ్లీ మామూలు మనిషిగా మారుతాడనే నమ్మకం ఆ కుటుంబ సభ్యుల్లో సన్నగిల్లే సమయం అది..ఆ పరిస్థితి లో గురుబ్రహ్మారెడ్డి ని శ్రీ స్వామివారి సన్నిధికి తీసుకొచ్చారు..


        ఎప్పుడు ఏవిధంగా ప్రవర్తిస్తాడో తెలీని స్థితి..యెంత శాంతంగా ఉన్నట్టు కనిపిస్తాడో, మరుక్షణం విపరీత రౌద్రం..ఉన్మత్త స్థాయి కి పరాకాష్ట గా మారిపోయే స్వభావం..వంటి మీద బట్టలు సైతం తీసి గిరాటు వేసేవాడు..క్షణానికో రకంగా మారిపోయే తత్వం..తనలో తానే మాట్లాడుకోవడం..పూర్తి ఉన్మత్త లక్షణాలు..సరిగ్గా అవధూతల గురించి చెప్పిన "బాలోన్మత్త పిశాచ వేషాయా.." అన్న పరిస్థితి కి తగ్గట్టుగా ఉన్నది అతని ప్రవర్తన..


 కుటుంబ సభ్యులు సహనం తో పట్టుబట్టి, శ్రీ స్వామివారి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేయించసాగారు.. క్రమంగా మార్పు రావడం మొదలు పెట్టింది..2008 డిసెంబర్ నాటికి, గురుబ్రహ్మం మామూలు స్థాయికి వచ్చాడు..దేవాలయం లో పనులు చేసుకుంటూ..సాటివారి పనుల్లో సహాయం చేస్తూ.. స్వామి సన్నిధి లోనే కాలం గడపసాగాడు..


2009 లో శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి నైట్ వాచ్ మాన్ హఠాన్మరణం తో, ఖాళీ ఏర్పడింది..అంతకుముందు నుంచీ గురుబ్రహ్మాన్ని దగ్గరగా పరిశీలిస్తూ ఉన్నాను కనుక, అతను ఆ ఉద్యోగం చేస్తాడో..లేదో..అని..అడిగి చూద్దామనుకున్నాను.. ఇతరులనూ సలహా అడిగి, చివరిగా గురుబ్రహ్మాన్ని సంప్రదించాను..."ఈ దత్తాత్రేయుడి దగ్గర ఏ పని చెప్పినా చేస్తాను" అని చెప్పాడు..అలా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిర ఉద్యోగుల్లో ఒకడిగా మారిపోయాడు..దేవాదాయ శాఖ వారి అనుమతీ తీసుకున్నాము..


 ఈ నాటికి సుమారు పది పదకొండు సంవత్సరాలు దాటిపోయింది గురుబ్రహ్మం శ్రీ స్వామివారి మందిరం లో ఉద్యోగిగా చేరి..మానసిక రోగి, మామూలు వ్యక్తిగా మారి, మాలో ఒకడుగుగా ఒదిగిపోయాడు..అదే మొగలిచెర్ల లో సిద్ధిపొందిన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయుడి లీల!..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా.. పిన్ : 523114...సెల్..94402 66380 & 99089 73699).