26, జులై 2020, ఆదివారం

అష్టాంగ యోగ

అహంకారాదులను వదిలించుకోవడానికి పాతంజలి యోగ పద్ధతులలో అష్టాంగ యోగమని ఒక ఉపాయమున్నది. 

*అవి యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అని ఎనిమిది అంగాలు.* 

*మొదటి ఐదు విషయాసక్తిని నిగ్రహించడానికి, చివరి మూడు భగవంతునికి దగ్గరవడానికిని పనికి వస్తాయి.*

1. యమం : 
యమమనగా ఈ కనిపించే ప్రపంచాన్ని ఈశ్వరమయంగా చూస్తూ అన్ని వస్తువులు ఆయనవేననే భావం కలిగి ఉండి తనది అంటూ దేనిమీద హక్కు లేకుండడం, అవసరమైన వాటిని భగవంతునివిగా భావించి ఇవన్నీ ఆయనవే అని, ఆయనకు నివేదించి తిరిగి భక్తుడి అవసరానికి ప్రసాదించమని ఆయనను వేడుకొనడం చేయాలి. నైవేద్యం, ప్రసాదం అనే వాటి అర్థం అదే. అంతేగాని మన వస్తువులు భగవంతుని కివ్వడమనే భావన సరికాదు.

ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్‌
తేన త్యక్త్యేన భుంజీథా, మాగృథః కస్యస్విద్ధనమ్‌ ||

దీని అర్థం అంతా ఈశ్వరమయమని భావిస్తూ మనకు అవసరమైన వాటిని, ఆయనను అర్థించి అనుభవించు అని.

ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని మన తలపులలో, మాటలలో, చేతలలో మన వలన ఎవరికీ కీడు కలుగరాదు. ఇదే అహింస. అబద్ధమాడరాదు. ఇతరుల వస్తువులను, శ్రమను దోచుకొనరాదు. అవినీతి, అక్రమ చర్యలు మానాలి. పరస్త్రీని తల్లివలె భావించాలి. సకల జీవరాసుల యెడల దయ కలిగి ఉండాలి. ఎట్టి దాపరికం లేకుండా నిజాయితీగా ఉండాలి. ఎవరెంత రెచ్చగొట్టినా ఓర్పు నశించక, సత్వ గుణంలోనే ఉండాలి. భేద భావన, శత్రు భావన మనలో ప్రవేశించరాదు. అరిషడ్వర్గాన్ని జయించి స్థైర్యం, ధైర్యం, నిగ్రహం సాధించాలి. మితాహారం, హితాహారం భుజించడం.  జిహ్వ చాపల్యం పనికిరాదు. భక్తి సాధనలో ఏకాగ్రత కుదురుటకు మన లోపల, బయట శుచిగా ఉండాలి.

2. నియమం : 
నియమమనగా నిరంతరం భగవచ్చింతన చేయడం, ప్రాపంచిక విషయాలను ఇష్టంగా చూడక, తప్పదు కదా అని పట్టించుకోవడం. అయ్యప్ప దీక్ష ఉద్దేశ్యం అదే. మనలోని కల్మషాలను తొలగించాలనే దీక్షను చేపట్టాలి. దాని కొరకు కొన్ని సత్కార్యాలు ఆచరించాలి. భాగవతోత్తములను, ఆచార్యులను చేరి సత్సంగం చేయాలి. వారి ఆజ్ఞలను, సూచనలను పాటించాలి. స్వార్థం, అహంకారం మనలో వ్యక్తం కాకుండా చూచుకోవాలి. అదే తపస్సు. ప్రాప్తించిన దానితో సంతోషపడి తృప్తిగా ఉండాలి. ఎంత కష్టపడినా లభించకపోతే, దుఃఖపడరాదు.

భక్తి కోసం, జ్ఞానం కోసం చేసే సాధనలలో భగవంతుడున్నాడని విశ్వాస ముండాలి. ఆయనతో ఐక్యమవడమే లక్ష్యంగా చేసుకోవాలి. చాలామంది భగవంతుడున్నాడని నమ్ముతారు గాని, దైవేచ్ఛ ప్రకారం నడచుకోరు. అందువలన దైవం గురించి వివరమైన దృఢమైన అవగాహన ఉండాలి.

ధన, శ్రమ, అవయవ దానాల వంటి త్యాగబుద్ధి ఉండాలి. ఇందులో ‘‘నేను చేశాను’’ అనే అహంకారం తలెత్తరాదు. అందరిలోనూ భగవంతుడున్నాడనే భావనతో ‘నారాయణసేవ’గా చేయాలి.

భగవంతుని పూజించడం, జప, తప ధ్యానాలన్నీ నియమబద్దంగా, క్రమ శిక్షణతో దీక్షగా చేయాలి. కర్మకాండయందు అంతరార్థ మెరిగి చిత్తశుద్ద్ధితో చేయాలి.

చేయకూడని పనులు చేయరాదు. అట్టి ఆలోచన వచ్చినంతనే సిగ్గుపడి, పశ్చాత్తాపపడి, నిగ్రహించుకోవాలి. సత్యవ్రతం, అహింసా వ్రతం, బ్రహ్మచర్య వ్రతం, అపరిగ్రహ వ్రతం, మౌనవ్రతం వంటివి, ఉపవాసాలు వీలునుబట్టి, వాటి యొక్క అర్థం తెలిసి చేయాలి. ఇవన్నీ మనలను మనం క్రమశిక్షణలో పెట్టు కోవడానికి అవసరమౌతాయి. అంతేగాని ఈ పనులు నేరుగా భగవంతుని వద్దకు చేర్చవు.

3. ఆసనం : 
పూజాది కార్యక్రమాలకు ఒక స్థిరమైన చోటును ఏర్పరచుకొని భక్తి, ఏకాగ్రత కుదిరేటట్లు కదలకుండా కూర్చునే పద్ధతిని ఆసనమంటారు. పద్మాసనం, అర్థ పద్మాసనం, సుఖాసనం ఏది కుదిరితే అదే ఆసనం.

4. ప్రాణాయామం : 
భాగవతులు, గురువులు ఉపదేశించిన మంత్రాన్ని శ్వాసతో అనుసంధానం చేస్తూ జపిస్తే ఏకాగ్రత లభిస్తుంది. దాని వలన మనలో ఉన్న భగవంతుని వద్దకు చేరగలం.

5. ప్రత్యాహారం : 
భగవద్భావాన్ని మనయందు నింపుకొని, అహంకార మమకారాలకు కారణమైన ఇంద్రియ, మనోబుద్ధులను లోనికి ముడుచుకోవాలి. అనగా తాబేలు తన అవయవాలను ముడుచుకొన్నట్లు చేసి, బయటి విషయాలలోకి పోనీయకుండడం.

6. ధారణ : 
భగవంతుని హృదయం నిండా నింపుకోవడమే ధారణ. ఈ ధారణ మధ్య మధ్యలో మనసు విషయాలమీదికి పోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మళ్ళీ ధారణ చేస్తూ ఉంటాం.

7. ధ్యానం : 
ధారణ ఖండ ఖండాలుగా జరుగుతూ, చివరకు అఖండ ధారణ జరిగితే అంతవరకు చేసే ప్రయత్నాన్ని ధ్యానం అంటారు.

8. సమాధి : 
ధ్యానం అఖండ ధారణగా మారినప్పుడు కలిగేది సమాధి. సమాధిలో దైవ సాక్షాత్కారమవుతుంది.

ఈ ఎనిమిదింటిలో యమ నియమాలు పునాది వంటివి. ఆసన, ప్రాణాయామాలు ఉపకరాణాలు. ప్రత్యాహార, ధారణ, ధ్యానాలు సాధనా మార్గాలు. పర్యవసానంగా కలిగే సమాధి ఫలరూపమైన పరాభక్తి అనబడుతుంది.

ఈ విధంగా జ్ఞాన, యోగ పద్ధతులలో కూడా భక్తుడు తనను తాను సంస్కరించుకొని సంసిద్ధుడవవచ్చును. అన్ని మార్గాలు ఉపయోగ పడేవే. ఏదో ఒక పద్ధతిలో యోగ్యత సంపాదించి, భగవదనుగ్రహం పొందే ప్రయత్నం భక్తులే చేసుకోవాలి. అంతేగాని, ఆయనను నిందించడం అవివేకం.

*శ్రీనరసింహ శతకము*

*(38) జందెమింపుగ వేసి సంధ్యవార్చిన నేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు*
*తిరుమణి శ్రీచూర్ణ గురురేఖ లిడినను విష్ణు నొందక కాడు వైష్ణవుండు*
*బూదిని నుదుటను బూసుకొనిన నేమి శంభు నొందక కాడు శైవజనుడు*
*కాషాయవస్త్రాలు గట్టి కప్పిన నేమి యాశపోవక కాడు యతివరుండు*
*ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన గురుని జెందక సన్ముక్తి దొరకబోదు*
*భూషణవికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర*

శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామీ!
నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు.
పాపములను పారద్రోలు వాడవు.
దుష్టులను శిక్షించువాడవు.

తండ్రీ! అందముగ జందెం వేసుకొని, సంధ్య వార్చినా బ్రహ్మమును తెలియని వాడు బ్రాహ్మణుడు కాడు.

తిరుమణి శ్రీచూర్ణములతో పెద్ద నామాలు (గురు రేఖలు) పెట్టుకున్నను విష్ణువును తెలియనివాడు వైష్ణవుడు కాడు.

లలాటమున విభూతి రేఖలను ధరించినా శివుని తెలియనివాడు శైవుడు కాడు.

కాషాయ వస్త్రాలు ధరించినా ఆశలుడగని వాడు సన్యాసి కాడు.

లౌకిక వేషాలు ఎన్ని ధరించినా గురువును ఆశ్రయించని వానికి ముక్తి లేదు.

*శుభంభూయాత్*

*సంస్కృతాంధ్ర సాహితీసౌరభం*

                                                                                                                                                                 *సుభాషితం - సత్యం మాతా పితా జ్ఞానం*                                                                                                                                                                                                                                                                                                                               
*శ్లోకం:*
*सत्यं माता, पिता ज्ञानं, धर्मो भ्राता, दया सखा, ।*
*शान्ति: पत्नी, क्षमा पुत्र:, षडेते मम बान्धवा: ।।*

*శ్లోకం:*                                                                                                                                                     *సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా ।*                                                                                                       *శాంతిః పత్నీ క్షమా పుత్రః షడేతే మమ బాంధవాః ।।*

*ప్రతిపదార్థం:*                                                                                                                                                                                 సత్యం = నిజం పలుకుట, మాతా = తల్లి, పితా = తండ్రి, జ్ఞానం = జ్ఞానము, ధర్మః = ధర్మము, భ్రాతా = సోదరుడు, దయా = భూత దయ కలిగి ఉండడం , సఖా = స్నేహితుడు,                                                                                                      శాంతిః = శాంతి అనగా సంఘర్షణలు లేకుండుట, పత్నీ = భార్య, క్షమా = క్షమించే గుణం, పుత్రః = కొడుకు,  ఏతే = ఈ, షట్ = ఆరు, మమ = నా యొక్క, బాంధవాః = బంధువులు,
*Meaning:*
If one considers the following “Truth” as mother, “Knowledge” as father, “Dharma: as brother, “Mercifulness” as friend, and “Calmness (peacefulness) as friend and “Forgiveness” as son, meaning these six qualities only are treated as kith and kin, the life of an individual will be on a righteous path. That gives ultimately peace and happiness for life to lead.

*తాత్పర్యం:*
సత్యం తల్లి, జ్ఞానం తండ్రి, ధర్మం సోదరుడు, దయా గుణం స్నేహితుడు, 
శాంతం సహధర్మ చారిణి, క్షమ గుణం కుమారుడు, ఈ ఆరునూ నా ఆత్మీయ బంధువులు. 
జీవనం సుఖముగా సంతోషముగా ఏ రకమైన ఒడుదుడుకులూ లేకుండా సాగిపోవడానికి తద్వారా సమాజము దేశమూ కూడా శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లడానికీ మార్గదర్శకముగా ఈ మంచి గుణాలని తన స్వంత బంధు మిత్రులుగా చేసుకుని జీవనం సాగించాలనియూ ధర్మపథంలో అందరూ పయనించాలనియూ ఈ సుభాషితములో సత్యాన్ని, జ్ఞానాన్ని, పరుల పట్ల దయాగుణాన్ని కలిగి ఉండడాన్ని, శాంత చిత్తముతో మెలగాలనియూ, ఇతరుల తప్పులని క్షమా గుణముతో ఓర్పు కలిగి ఉండాలనియూ, చెపుతూ ఈ ఆరు మంచి లక్షణాలనే నిజమైన స్వంత ఆత్మీయ బంధువులుగా పరిగణించాలనియూ ఉపదేశిస్తున్నది ఈ చక్కటి సుభాషితం.

నిజముగా అందరూ ఈ లక్షణాలని ఈ విధంగా కలిగి ఉంటే ప్రపంచ తీరు ఎల్లప్ప్డుడూ మరొక విధంగా అద్భుతంగా ఉంటుంది. ఇది అసాధ్యం.  వీటిలో కొన్నైనా ఇటువంటి అత్యుత్తమ లక్షణాలని కలిగి ఉండడం ఎంతైనా కావలసిన విషయం. 

కానీ, ఇటువంటి కొన్నిఅత్యుత్తమ లక్షణాలని కలిగి ఉన్నవారిని అక్కడక్కడా చరిత్రలో మనం చూస్తూ ఉంటాం.

జ్ఞాపకం





*గడచిపోయే కాలం అంతా జ్ఞాపకమే. స్మృతి శకలమే. జ్ఞాపకాలని పలవరించని వారు ఉండరు. సశైవం, బాల్యం, కౌమారం, యవ్వనం, నడిప్రాయం, వృధాప్యం...ఇలా ప్రతీ దశ జ్ఞాపకంగానే మిగిలిపోతుంది. మనుషులు వెళ్లిపోయినా వారి జ్ఞాపకాలు నిలిచిపోతాయి. అందుకే మనిషికి నిష్క్రమణ లేదు. వెళ్లిపోయినవాళ్ళు ఇతరుల జ్ఞాపకాల్లో జీవిస్తారు. రోడ్డు మలుము తిరిగిన ప్రతిసారి ఆ మూలమీద నిల్చున్న దృశ్యం మనసులో రూపుగడుతుంది. గడప ముందు నిలబడ్డ చిత్తరువు పదిలంగా ఉండిపోతుంది. ఒక పాట, ఒక మాట, ఒక దృశ్యం జ్ఞాపకాలని సజీవంగా నిలుపుతాయి. బుద్ధుడు, క్రీస్తు, అది శంకరుడు, మొహమ్మద్ ప్రవక్త, మర్క్స్ వంటి మహానుభావులకు మరణం లేదు. శతాబ్దాలు గడిచినా వారి ఆలోచనలు, భావాలు, బోధనలు మనల్ని ఉత్తేజితులను చేస్తూనే ఉన్నాయి. ఈ విధంగా ప్రతీ మనిషి మరొకరి జ్ఞాపకాల్లో సజీవంగా నిలిచే అవకాశం ఉంది. మనసులో, మాటలో, చేతలో అంతరం లేకుండా జీవించిన  మనిషికి మృత్యువు ఉండదు. ఏ ఆనవాలు లేకుండా అదృశ్యమవరు. నలుగురి నెత్తి కొట్టయినా బతకాలనుకునే వారిని లోకం సులువుగా మరచిపోతుంది. కుటుంబ సభ్యులు మరచిపోతారు. లోకంలో పదుగురికి మేలు చేసే జీవనరీతిని అలవాటు చేసుకున్న వారి జ్ఞాపకాలు పరిమళిస్తాయి. వారి మృతి తేజస్సును అందిస్తుంది. అందుకే జ్ఞాపకాలు ఎంతో పదిలమైనవి. వాటిని కాపాడుకోవడానికి మనుషులు అహరహం శ్రమిస్తారు. కళలు, సాహిత్యం, సమస్త సృజనాత్మక రూపాలు ఇందులో భాగంగానే ఆవిష్కృతమయ్యాయి. జ్ఞాపకాలకి ధన్యతని చేకూరుస్తున్నాయి.*

*సర్వేజనా సుఖినో భవంతు....మీ ఆకొండి రామ మూర్తి....26.07.2020...ఆదివారం....🙏

రామాయణమ్. 11

ఈ లోకములో ఏ ఏ అస్త్రములు అయితే వున్నవో అవి అన్నియు విశ్వామిత్రుని వద్ద ఉన్నవి .
.
అస్త్రములు అన్నీ కూడా భృశాస్వుని పుత్రులు .
భృశాస్వుడు ఒక ప్రజాపతి ,ఆయన దక్షప్రజాపతి కూతుళ్ళు జయ,సుప్రభలను వివాహమాడి కన్న సంతానమే అస్త్రములు!
వీటిని విశ్వామిత్రుడు పొందుతాడు!
.
అంతేకాదు విశ్వామిత్ర మహర్షికి గల అస్త్ర పరిజ్ఞానము అపారము (guided missiles).
ఈయన క్రొత్త అస్త్రములు ఎన్నింటినో పుట్టించగలడుకూడా  ! .
.
(శస్త్రము అంటే మామూలుగా గాయం చేసేది!
 అస్త్రము అంటే మంత్రపూర్వకముగా ప్రయోగించేది! .
bullet కు intercontinental ballistic missile కు ఉన్నంత తేడా అన్నమాట).
.
ఓ దశరధమహారాజా, విశ్వామిత్ర మహర్షి అమిత మేధోసంపన్నుడు! అతులిత పరాక్రమవంతుడు! ,ఆయన తన యాగసంరక్షణము తానే చేసుకోగల సర్వసమర్ధుడు! .
.
ఆయన అడుగుతున్నాడు నీ రాముడి ని పంపమని!
ఆయనవెంట వెళితే రామునకు మేలుకలుగుతుంది! మహర్షి ఉద్దేశ్యము అదే ! రాముడెవరో సంపూర్ణముగా తెలిసిన మహాజ్ఞాని ఆయన!
.
నీవు మనసులోని భయసందేహాలన్నింటినీ తొలగించుకొని రామచంద్రుని ఆయనవెంట పంపు సకల శుభాలు ఒనగూరుతవి!.
.
కులగురువు మాటలు విని దశరధుడి శరీరం ఉప్పొంగింది!
రాముని మహర్షివెంట పంపటానికి సంతోషంగాఒప్పుకొన్నాడు!.
.
స్వయముగా వెళ్ళి రామలక్ష్మణులను తీసుకొని వచ్చి ఒక్కసారి తన ప్రియపుత్రుని శిరస్సుముద్దిడుకొని ,మహర్షి చేతిలో పెట్టాడు !  .
.
మూపున విల్లమ్ములు ధరించి రాముడు,లక్ష్మణుడు మహర్షిని అనుసరించారు .
.
బ్రహ్మదేవుడు ముందువెడుతుండగా వెనుక ఇద్దరు అశ్వనీదేవతలనుసరించినట్లుగా కనపడుతున్నారు వారివురూ చూపరులకు!.
.
బాటలు నడిచారు,పేటలు గడిచారు నడుస్తూనే ఉన్నారు మహర్షి వెనుదిరిగి చూడలేదు.
ఆ విధంగా మొదటిసారి నగరువిడచి దుర్గమారణ్యాలలో కాలుమోపాడు కోదండపాణి సోదరసమేతుడై!.
.
అలా చాలా దూరం నడచిన తరువాత తనలోని ప్రేమంతా మాటరూపంలో బయలుపడేటట్లుగా "రామా" అని అత్యంత మధురంగా పిలిచాడు మహర్షి! .
.
అప్పటిదాకా ఆయన వెనుదిరిగిచూడలేదు, చూస్తే రాముని మధురమోహనరూపం కట్టిపడేస్తుంది, ముందుకు సాగనీయదు అనే భయం వల్లనేమో బహుశా!
.
సరయూనదీ దక్షిణతీరం చేరారు ! ఆ నది ఒడ్డున కాసేపు ఆగి నాయనలారా ఆచమనం చేయండి ! మీకు కొన్ని మంత్రములను ,"బల,""అతిబల "అను విద్యలను ఉపదేశిస్తాను! స్వీకరించండి!
.
ఈ విద్యలెటువంటివి అంటే! ఇవి తెలుసుకొన్న తరువాత నీకు శ్రమగానీ,జ్వరముగానీ,రూపములో మార్పుగానీ సంభవించదు!
నీవు నిద్రపోయినప్పుడుగానీ ,ఏమరపాటుగా ఉన్నప్పటికీ కూడా రాక్షసులు నిన్నేమీ చేయజాలరు!
.
రామా !బాహుబలములో నీతో సమానుడు
మూడులోకములలో ఎవడునూ లేడు ఇకముందు ఉండడు!
రామా! సౌందర్యము,సామర్ధ్యము, జ్ఞానము బుద్ధినైశిత్యములలో నీతో సరిసమానుడు ఈ లోకములో ఉండడు!.
.
ఈ విద్యలు బ్రహ్మదేవుని పుత్రికలు!
.
అంత శ్రీరాముడు శుచియై,శుద్ధాంతరంగుడై,ఆ మహర్షి నుండి విద్యలను ఆనందంగా స్వీకరించాడు!
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

#సెక్యులర్_విదానాలు

ఇతరదేశాల్లో #సెక్యులర్_విదానాలకు , మన దేశంలోని #దరిద్ర_సెక్యులర్_విధానాలకు తేడాలు .

#మొత్తంవ్యాసాన్ని ఓపికతో #తప్పక_చదవండి . 

#సెక్యులర్‌ వ్యవస్థలో అన్ని మతాలనూ సమానంగా చూసే తీరాలా ?
ఒక మతానికి ప్రత్యేక గౌరవస్థానం ఇచ్చి మిగతా మతాలను ద్వితీయ స్థానంలో చూస్తేతప్పా ?

#తప్పేమీ_లేదు !!!సెక్యులర్‌ రాజ్యం ఇలాగే ఉండాలి ,అందులో మతాల ప్రమేయం లేక ప్రాముఖ్యం ఈరకంగానే ఉండి తీరాలన్న నిబంధన ఎక్కడాలేదు . సెక్యులర్‌ దేశాల్లో మతాల హెచ్చుతగ్గులు ఉన్న దృష్టాంతాలు ,ఉదాహరణలు కావలసినన్ని వున్నాయి .

1)‘ది చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌’ ఇంగ్లాండులో ఆధికారమతం .దానికి సంబంధించిన ఇద్దరు ఆర్చిబిషప్పులకు 24 గురు సీనియర్‌ బిషప్పులకు బ్రిటిషు పార్లమెంటు ఎగువ సభ అయిన 
House of Lords లో ప్రత్యేక స్థానాలు కేటాయించబడ్డాయి .Lords Spiritual అని పిలవబడే వీరు చట్టసభ డిబేట్లలో పాల్గొంటారు .

యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యుకె) లో ఇంగ్లాండుతో బాటు ఉత్తరఐర్లండ్‌ ,వేల్స్‌ , స్కాట్లండ్‌లు కూడా చేరి ఉన్నాయి . అక్కడ వేరే చర్చిలది ప్రాబల్యం . అయినా సరే ‘ది చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌’కు చెందిన ఈ 26 మంది Lords Spiritual లు మొత్తం యునైటెడ్‌ కింగ్‌డమ్‌కి సంబంధించిన తీర్మానాల మీద ఓటు చేయగలరు .సభ కొలువుదీరగానే ఈ 26 మందిలో ఒకరు ప్రార్థనను నిర్వహిస్తారు .

బ్రిటన్‌ రాజు లేక రాణి పట్టాభిషేకాన్ని ఆర్చిబిషప్‌ (Archbishop of Canterbury) వెస్‌మినిస్టర్‌ అబ్బీ (abbey) లో జరిపిస్తారు .దేవుడి శాసనాల ప్రకారం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ప్రాటెస్టంట్‌ మతాన్ని నిలబెడతానని ,చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌నూ , దాని సిద్ధాంతాన్నీ ,పూజా విధానాన్నీ , క్రమశిక్షణను ,చర్చ్‌ పరిపాలనను పరిరక్షిస్తానని ఆ సందర్భంలో ప్రమాణం చేయిస్తారు .

కానీ #మనదేశంలో ?????

2)అర్జంటీనా సెక్యులర్‌ దేశమే .అక్కడ అధికారిక మతమంటూ ఏదీలేదు .
కాని ఆదేశ రాజ్యాంగం సెక్షన్‌ 2 ప్రకారం ‘ఫెడరల్‌ గవర్నమెంటు రోమన్‌ కాథలిక్‌ అపోస్తలిక్‌ మతాన్ని సపోర్టు చేస్తుంది’.

కానీ మనదేశంలో ?????

3)‘మలేసియా అధికారిక మతం ఇస్లాం . కాని ఇతర మతాలను కూడా పౌరులు అనుసరించవచ్చు’అంటుంది మలేసియా రాజ్యాంగం .

కానీ మనదేశంలో ?????

4)The Republic of Srilanka shall give to Buddhism the foremost place, and accordingly it shall be the duty of the State to Protect and foster the “Budda Shasana”(శ్రీలంక రిపబ్లిక్‌ బౌద్ధ మతానికి ప్రప్రథమస్థానం ఇస్తుంది.‘బుద్ధ శాసనా’న్ని రక్షించటం ,పోషించటం రాజ్య బాధ్యత) అని చాటుతుంది శ్రీలంక రాజ్యాంగం .

కానీ మనదేశంలో ?????

5)‘థాయ్‌ ప్రజల్లో అత్యధికులు అనుసరించే బౌద్ధ మతాన్ని సంరక్షించి , ప్రోత్సహించటం ప్రభుత్వ కర్తవ్యం’ అని థాయ్‌లాండ్‌ రాజ్యాంగం స్పష్టం చేస్తుంది .

కానీ మనదేశంలో ?????

6)రుమేనియాలో మత స్వాతంత్య్రం ఉంది .కాని ‘ఆర్థోడాక్స్‌ చర్చి’కి ప్రభుత్వ బడ్జెటు నుంచి నిధులు కేటాయిస్తారు . జార్జియా రాజ్యాంగం మత స్వాతంత్య్రానికి గ్యారంటీ ఇస్తుంది . కాని‘జార్జియన్‌ ఆర్థోడాక్స్‌ చర్చి’కి ప్రత్యేక ప్రతిపత్తినిస్తుంది .

కానీ మనదేశంలో ?????

7)ఫిన్లాండ్‌ తాను సెక్యులర్‌ అంటుంది . కాని అక్కడి "ఎవాంజలికల్‌ లూథరన్‌ చర్చ్‌","ఫిన్నిష్‌ అర్థోడాక్స్‌ చర్చిలకు" చర్చ్‌ టాక్స్‌ను రాబట్టే అధికారం ఉంది .
ఆ దేశంలో వ్యాపార సంస్థలు కూడా చర్చ్‌కి పన్ను చెల్లిస్తాయి .ఆయా చర్చ్‌లలో సభ్యులైన పౌరులనుంచి వ్యక్తిగతంగా వసూలు చేసే పన్నుగాక , ప్రైవేటు కంపెనీల నుంచి రాబట్టే సొమ్మును ప్రభుత్వం రెండు ఆధికారిక చర్చ్‌లకూ పంచుతుంది .

కానీ మనదేశంలో ?????

8)అదేవిధంగా ఆస్ట్రియా ,డెన్మార్క్‌ , జర్మనీ ,ఐస్‌లాండ్‌ ,ఇటలీ ,స్వీడన్‌ , స్విట్జర్లండ్‌ వంటి దేశాల్లోనూ చర్చ్‌టాక్స్‌ వసూలు చేస్తున్నారు .

కానీ మనదేశంలో ?????

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి .ఈ ఉదాహరణలను బట్టి అర్థమయ్యేదేమిటంటే ......
అఫీషియల్‌ మతం అంటూ దేన్నీ పేర్కొనకపోయినా ,కొన్ని మతాలకు ప్రత్యేక గుర్తింపు ,ప్రత్యేక హక్కులు ఇచ్చి పెద్దపీట వేయటం ప్రపంచంలో చాలా దేశాల్లో రివాజు .

మరి పైన పేర్కొనబడిన దేశాలలో సెక్యులరిజానికి ,మన సంకర సెక్యులరిజానికీ తేడా ఎక్కడ ?

ఇంగ్లాండ్‌లో చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ అయినా ,అర్జంటీనాలో రోమన్‌ కాథలిక్‌ అయినా ,రుమేనియా జార్జియాల్లో ఆర్థోడాక్స్‌ చర్చ్‌ అయినా , డెన్మార్క్‌ ,జర్మనీ ,ఇటలీ ,స్వీడన్‌ ,తదితర ఐరోపా దేశాల్లో వేరువేరు చర్చిలు అయినా ,

శ్రీలంక ,థాయ్‌లాండ్‌లో బౌద్ధం అయినా ఆయా దేశాల్లో మెజారిటీ ప్రజలకు విశ్వాసం ఉన్న మతాలు
""దేశప్రజల్లో అత్యధిక సంఖ్యాకులకు ప్రాతినిధ్యం వహించే మతాలకు రాజకీయంగా ,ప్రభుత్వపరంగా ప్రాధాన్యం ఇవ్వటం సమంజసమే , ప్రజాస్వామ్యబద్ధమే .

ఆచరణలో లోకమంతటా అనుసరిస్తున్న ఈ సాధారణ సూత్రాన్ని భారతదేశంలో లోనూ మన్నించదలిస్తే ఈ దేశంలో నూటికి 80 మంది అనుసరించే హిందూ ధర్మానికి గౌరవస్థానం ,అగ్రస్థానం ఇవ్వాలి .దాని ప్రయోజనాల రక్షణకు , అభివృద్ధికి ప్రభుత్వమే ప్రత్యేకశ్రద్ధ చూపాలి .

కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి , మనం చూస్తున్నది ఏమిటి ,
మనం చేసిందేమిటి ?

‘ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపికట్టెది ఇంకోదారి’ అన్నట్టు ప్రపంచంలో మన రూటేవేరు .
20 శాతానికి ప్రాతినిధ్యం వహించే మైనారిటీ మతాలను నెత్తిన పెట్టుకుంటాం .ప్రత్యేక హక్కులు ,
ప్రత్యేక సౌకర్యాలు ఉదారంగా సమకూరుస్తాం! .ప్రజల్లో నూటికి 80 మందికి విశ్వాసం ఉన్న అతిప్రధాన ,
అతిపెద్ద ధర్మాన్ని మాత్రం కాళ్లకింద తొక్కేస్తాం .మిగతా ప్రపంచ దేశాలు ప్రధాన మతానికి ప్రత్యేక గౌరవం ఇస్తూ అనుకూల వివక్ష చూపుతూంటే మనం మాత్రం ప్రధాన మతాన్ని ప్రత్యేక అగౌరవం చేస్తూ ,శాయశక్తులా సతాయిస్తూ ప్రతికూల వివక్షను కనపరుస్తున్నాం .

ఈ విచిత్ర మనస్తత్వం మనకు ఎవరి నుంచి సంక్రమించింది ?ఈవికృత ,వంకర అవ్యవస్థ ఎలా వచ్చిపడింది ?
దీనికి కారణం ఎవరు ?
పైకి సెక్యులరిజం కొంగజపం చేస్తూనే కరకు మతతత్వాన్ని పెంచిపోషించి , జాతి మూలాలను వేటువేసే ,చేటుచేసే , ధర్మ వినాశకర ,నికృష్ఠ రాజకీయ సంస్కృతి ప్రాచీన భరతభూమికి ఎలా దాపురించింది ?

దీన్ని అర్థం చేసుకోవాలంటే మొదట సెక్యులరిజం అనేది ఏ పరిస్థితుల్లో ఎలా పుట్టిందన్నది గమనించాలి .అసలు భావన ఏమిటో తెలిస్తేగానీ దానిని మన మహానుభావులు ఎలా భ్రష్ఠు పట్టించారన్నది తేటపడదు .

క్రీస్తుశకం 4వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకూ ఐరోపా దేశాలలో క్రిస్టియన్‌ చర్చికీ ,రాజ్య వ్యవస్థకూ నడుమ గట్టిబంధం ఉండేది .
ప్రతి దేశంలోనూ క్రైస్తవానికి శాఖ అయిన ఏదో ఒక చర్చితో అక్కడి ప్రభుత్వానికి లంకె ఉండేది .ప్రభుత్వం అనేది చర్చి యొక్క సెక్యులర్‌ అంగంగా వర్ణించబడేది .రోమన్‌ సామ్రాజ్యం అనేది ఆవిర్భవించింది మొదలుకొని చర్చి ఆధిపత్యం కొత్తకొత్త రాజ్యాలకు విస్తరించడానికి ప్రభుత్వాలు తోడ్పడేవి . సామ్రాజ్యవిస్తరణ కాంక్షతో ప్రభువులు చేసే దుర్మార్గపు దండయాత్రలకూ , జయించిన కొత్త ప్రాంతాల్లో విచ్చలవిడి దోపిడీలకూ ,రాక్షస కృత్యాలకూ చర్చి వత్తాసునిచ్చేది .దానికి ప్రతిఫలంగా సమాజంలో చర్చిని ధిక్కరించే పౌరులను పరమకిరాతంగా పీడించి ,చిత్రవధ చేసే పుణ్యకార్యాన్ని ప్రభుత్వాలు చేసిపెట్టేవి . 

వందేళ్ల యుద్ధాలు ,రెండొందలు ఏళ్ల యుద్ధాలు అంటూ ‘ఏకైక సత్యమతాన్ని’ వ్యాప్తి చేసే నెపంతో మతం ,రాజ్యం కుమ్మక్కయి యూరప్‌లో ఎన్ని ఘాతుకాలు చేశాయో ,సామూహిక జన సంహారాలకు ఎలా పాల్పడ్డాయో , అవిశ్వాసులు ,మంత్రగత్తెలు , విగ్రహారాధకులు ,అన్న నెపంతో ,అభియోగాలతో ఎన్ని లక్షలమందిని సజీవంగా తగలబెట్టి , దారుణంగా పొట్టన పెట్టుకున్నారో నెత్తురు ఏరులుగా పారిన ఐరోపా అంధయుగ అంధకార చరిత్ర చెబుతుంది ,నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది .

పౌరుల ప్రాపంచిక జీవితాన్ని పర్యవేక్షించి ,కంట్రోలు చేయడం మాత్రమే కాదు! పైలోకంలో వారికి ముక్తిని కలిగించటమూ ప్రభుత్వ బాధ్యతేనట!ఆ ముక్తికి కీలకమేమో చర్చి చేతుల్లో ఉంటుంది .ఎప్పటికప్పుడు చర్చి ప్రకటించే ప్రవర్తన నియమాలను ఎవరైనా ఉల్లంఘించినా ,ఎదురు తిరిగినా వారిని వెలివేసి ,స్వర్గలోకపు గేట్లను వారికి చర్చ్‌ మూసేస్తుంది .
ఆ తరువాత వారిని సజీవదహనం చెయ్యటమా ,చిత్రహింసలు పెట్టి ఖైదు చేయటమా ,చిత్రవధ చేయటమూ అనేది రాజ్యవ్యవస్థ బాధ్యత . అదేవిధంగా క్రీస్తును చంపిన పాపాత్ములు అని చర్చి ముద్రపడిన యూదులను , చర్చి జులుంను అంగీకరించని ఇతర వర్గాలను వేటాడటం ,భయానక అఘాయిత్యాలకు గురిచేయటం ఏలినవారి డ్యూటీ .ఆ ప్రకారం చర్చిసేవ చేసి ,అన్యమతాలను నిర్మూలించడంలో సహాయపడినంత వరకూ రాజులు ఎన్ని మహాపాపాలకు ఒడిగట్టినా చర్చి సమర్థించేది .

క్రైస్తవంలోకి బలవంతంగా మార్చబడని ప్రాంతాలు ,సమూహాలు ఐరోపాలో మిగిలినంతవరకూ చర్చికీ ,రాజ్యానికీ మధ్య అపవిత్ర అనుబంధం ,ఉభయ తారకంగా కొనసాగింది .క్రైస్తవేతరులను ఊచకోత కోయడానికి ,దారుణంగా హింసించి బలవంతంగా క్రైస్తవంలోకి మార్పించడానికి రాజులు కత్తులు దూశారు .నరకలోకపు అగ్నికుండాల నుంచి ‘పాగన్ల’ను రక్షించడానికీ ,వారి ఆత్మలను ఉద్ధరించడానికే అదంతా చేస్తున్నట్టు వారు బుకాయించేవారు . ‘గొప్ప పని చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు’ అని క్రైస్తవ మత గురువులు శ్లాఘించేవారు .
ఇలా రాజరికమూ ,క్రైస్తవమూ చేతులు కలిపి తమ ప్రాబల్యాన్ని ,సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోయే క్రమంలో ఘర్షణలు తలెత్తేవి .విరోధం కన్నా సహకారం శ్రేయస్కరం .కాబట్టి తాత్కాలిక సంక్షోభాలను ఏదో ఒకటి చేసి గట్టెక్కేవారు .

15వ శతాబ్దం చివరికల్లా మొత్తం ఐరోపా క్రైస్తవమయం అయిపోయింది .తమ అధికారాన్ని ,ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చర్చితో అవసరం రాజులకు తీరింది .చర్చి కబంధ హస్తాల నుంచి బయటపడాలన్న ఆరాటం రాజ్యానికి మొదలైంది .16వ శతాబ్దంలో చర్చిపై తిరుగుబాట్లు తీవ్రమయ్యాయి . క్రిస్టియానిటీ అనేక తెగలు గా చీలిపోయింది .సంస్కరణ పేర చీలిపోయిన తెగలు మరీ దుర్మార్గంగా చెలరేగాయి .

ఒకదేశంలో ప్రభుత్వం ఒక క్రైస్తవ తెగ కొమ్ముగాసి వేరొక తెగను క్రూరంగా అణచివేస్తే ,ఆ వేరొక తెగను ఇంకో రాజ్యం ఆదరించి ,దానికి గిట్టని తెగను వేటాడేది .దాంతో యూరోప్‌ ఖండం అంతటా మతం పేరిట భయానక రక్తపాతం జరిగింది .దేశాల నడుమ మత యుద్ధాలు ముమ్మరమయ్యాయి .

అదృష్టవశాత్తూ ఆ కాలపు యూరోపియన్‌ మేధావులకు , తత్వవేత్తలకు గ్రీస్‌ ,ఇండియా ,చైనా దేశాల ప్రాచీన సంస్కృతులతో పరిచయం కలిగింది .ఆ విశిష్ట నాగరికతలలోని మానవతావాదం , హేతువాదం ,విశ్వజనీన దృక్పథం వారిని గాఢంగా ప్రభావితం చేశాయి . 

క్రిస్టియానిటీలో జడలు కట్టిన మూఢత్వం మీద ,దాని అభివృద్ధి నిరోధక , అశాస్త్రీయ ,అనాగరిక పోకడల మీద బుద్ధిజీవులు తిరగబడ్డారు .
తర్క పరీక్షకు నిలబడే దమ్ములేక , మూఢత్వపు చీకట్లను చీల్చిన జ్ఞాన , విజ్ఞాన వెలుగు పుంజాలకు తాళలేక మహామూర్ఖ ,మహాక్రూర క్రైస్తవం కుప్పకూలింది .18వ శతాబ్దం ఆఖరులో ఫ్రెంచి విప్లవంతో క్రైస్తవ మతాధిపత్య పతనం వేగం పుంజుకుంది .

ఇదీ యూరప్‌ ఖండంలో సెక్యులరిజం ఆవిర్భావానికి నేపథ్యం .19వ శతాబ్దంలో ఐరోపాలోని ప్రతిదేశం చర్చి భల్లూకపు పట్టునుంచి బయటపడింది . పరలోకంలో పౌరుల ఆత్మలకు ముక్తికోసం ప్రభుత్వం పాటుపడాల్సిన పనిలేదు .ఎవరి ముక్తి సంగతి వారు ఆలోచించుకోగలరు .ప్రాపంచిక వ్యవహారాలు సజావుగా నడిచేటట్టు , సమాజపు కట్టుబాట్లు సరిగా ఉండేటట్టు ,ప్రజల అవసరాలు తీరేటట్టు ,శాంతిని ,భద్రతను రాజ్యం కాపాడితే చాలు .రాజ్యవ్యవస్థ మీద మత జోక్యానికి వీలులేదు .ఈ నూతన ఆలోచనాధార ఆసరాతో చర్చి బంధనాలను తెంచుకొని కొత్తరూపు ,కొత్త చూపు సంతరించుకున్న రాజ్యవ్యవస్థకు ‘సెక్యులర్‌ స్టేట్‌’ అని పేరు పెట్టారు .మతం ,రాజ్యం వేరువేరు ,దేని దారి దానిది ,దేని కార్యక్షేత్రం దానిది అన్న నవీన పాశ్చాత్య చింతనకు ‘సెక్యులరిజం’ అనివాడుక .

కానీ మొదటి నుంచి ధర్మ చింతనతో , సద్గుణాలతో ....
#సర్వే_భవంతు_సుఖినః
#సర్వే_సంతు_నిరామయా 
అంటూ ఆచరిస్తూ ,సనాతన జీవనవిధానంలో ఉంటున్న 
మన హిందూ ధర్మానికి #సెక్యులర్_పాఠాలు 
#సెక్యులర్_విధానాలు ఒకరితో చెప్పించుకునే అవసరం లేదు ,ఆచరింప అవసరం లేదు .        

జై_హింద్

ఎం .వి .ఆర్ .శాస్త్రి గారి రచనా సహకారంతో ..........

ఇంగ్లిష్ ఒక అవగాహన

 "సర్వ-భ్రష్టమైన ఇంగ్లీషు భాషకి" ఉదాహరణగా "హి వెంటెడ్ దేర్ వితౌట్ టోల్డింగ్ హర్ (He wented there without holding her)" అనే మాటను తరచుగా అనేవారు! 

మరో మాట - 1965 ప్రాంతంవరకూ ఈ "డాడీ, మమ్మీ" వగైరా పదాలు "అమ్మా, నాన్నా"వంటి మాటలను "ఓల్డేజ్ హోము"ల్లోకి గెంటేయలేదు!

{అన్నట్లు 1958లో ఒక తెలుగు మేస్టారు ఒక కుర్రాడికి "Daddy gave 5 rupees to mummy." అనే వాక్యానికి "డాడీ అనేవాడు మమ్మీ అనేవాడికి 5 రూపాయలిచ్చా"డని అర్థమంటూ చెప్పాడట! (యథార్థ సంఘటనే!)}

ఆ తర్వాత్తరవాత "#ఆంగ్లభాషను #నేర్చుకోవడంకంటే, అది తమకూ #బాగా #వచ్చునని #ప్రదర్శించుకోవడంపైన" ఎక్కువమంది దృష్టిపెట్టడం ఎక్కువైందనే విషయం మనకందరికీ తెలిసినదే!

{కాస్త ఇంగ్లీషు బాగానే వచ్చినవాళ్ళలో కొందరైతే "వాళ్ళు ఇంగ్లీషులోనే ఆలోచించగలరనీ, తదనంతరమే ఆ వాక్యాలను మాతృభాషలోకి అనువదిస్తారనీ" కూడా ఇతరులనుకునే విధంగా ప్రవర్తించడమనేదీ ఎప్పటినుంచో ఉందనుకోండి!}

ఏది ఏమైనా మనవాళ్ళలో ఈ #ఇంగ్లీషు #మోజు ఇతర రాష్ట్రాలవాళ్ళకంటే #ఎక్కువని చెప్పక తప్పదు!

అయితే మనలో చాలామంది "గ్రామర్ను గాలికొదిలేసి, గ్లామర్నే గట్టిగా పట్టేసుకోవడంవల్ల" ఒక్కోసారి వాళ్ళ "వాక్చాతుర్యం" వాళ్ళ మనసులోని మాటలకు విరుద్ధంగానూ, విపరీతశబ్దజాలంతోనూ పక్కదారులను పట్టించేస్తూంటుంది!

అది "#మిక్సెడ్" భాష కావచ్చు, "(#తామనకునే) #ప్యూర్ #ఇంగ్లీషూ" కావచ్చు!

కొన్ని #ఉదాహరణలను పరికించండి!

అ) “వాడికి అంత  #అన్-#సేటిస్-#ఫేక్షన్ ఎందుకో నాకు తెలియడం లేదు!”:

అయ్యా! ఇది పెద్ద #dis-#satisfaction కలిగించే విషయమండీ! అలాగే “అన్-డీసెంట్ బిహేవియర్” కాదు,     ‘ఇన్-డీసెంటే’నండీ!

మరో విషయం - “పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం” అన్నట్లుగా ఉండదు ఆంగ్లభాష! చచ్చినట్లు దేనికదే గుర్తుంచుకోక తప్పదు. (అందుకనేమో - విశ్వనాథవారు ‘విష్ణుశర్మ) ఇంగ్లీషు చదువు’ అనే పుస్తకంలో ‘put  పుట్ అయితే but బట్ ఎందుకవాలి?’ అంటూ ఇంగ్లీషుపైన  తన కోపాన్నంతా చూపెట్టారు!)

ఆ) “మా ఆవిడకి #గాస్ట్రికండీ!”:

‘పొట్టకు/ఉదరానికి సంబంధించిన…’ - ఏమిటది? "అల్సరా? పెయినా? మరొకటా?"

శిష్యా! ఇది అసంపూర్ణం, కేవలం విశేషణం (adjective) మాత్రమే! తరువాత ఏదో ఒక నామవాచకం ఉండకపోతే నువ్ పూర్తిగా చెప్పదలచుకున్నది ఏమిటో అవతలివాడికి అర్థం కాదు!

ఇ) ‘ఐ #కాంట్ #ఏబుల్ #టూ డూ దిస్.. ‘:

కాంట్(can’t/cannot) అంటేనే “నాకు చేతకాదు” అనే అర్థం వచ్చేస్తుంది. ‘పులగంమీద పప్పు’లాగ తిరిగి దీనిపైన ‘ఏబుల్’ కూడా ఎందుకు మిత్రమా?

ఈ) ‘హి హేజ్ ఎ లాట్ ఆఫ్ #హెడ్-స్ట్రెంగ్త్ (తలబిరుసు)(He has a lot of headstrength)!’:

Strong అనే విశేషణానికి  strength నామవాచకమైనంతమాత్రాన  -  అలాగే headstrongకి    'headstrength'  కాదన్నా! అది  '#headstrongness' మాత్రమే!

ఉ) "#వన్ #ఆఫ్ #మై  #బ్రదర్ ఈజ్ స్టేయింగ్ '#ఇన్ #ఎబ్రాడ్!" (One of my ‘brother’ is staying in abroad!):

తెలుగులో ఎలా చెప్తాం దీన్ని? ‘నా అన్నదమ్ములలో ఒకడు’ అనే కదా! అలాగే ఇంగ్లీషులో కూడా! One of my  brothers  (out of many - more than one) అనే అనాలి గానీ one of my brother అనకూడదు! పైగా abroad అంటేనే వేరే దేశం’లో’ అని! కాబట్టి  స్టేయింగ్ ‘ఇన్ ఎబ్రాడ్’ అనేదీ తప్పే!

 ####

గమనిక: ఈ మొదటి రకం విభాగంలోనే ఇంకా చాలా ఉన్నాయి. ఆంగ్లంలో లేకపోయినా విచ్చలవిడిగా మనం వాడేస్తున్న పదాలను, ప్రయోగాలను  పాఠకులు మరికొన్నిటిని నాకు చూపిస్తే వాటిని కూడా మనం అందరితో పంచుకోవచ్చు. సహకరించగలరు.
( *సత్య రామప్రసాద్ కల్లూరి* )

పోత‌న త‌ల‌పులో.....1


మ‌హాక‌వి బొమ్మెర పోత‌నా  మాత్యులు (1410-1470) శ్రీ మ‌హాభాగ‌వ‌తాన్ని తెలుగులో అందించి తెలుగుజాతికి మ‌హోప‌కారం చేశారు. ఆ భాగ‌వ‌తంలోని కొన్ని ప‌ద్యాలు మ‌రోసారి ....
శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారమ్భకు భక్తపాలన కళా సంరభకున్ దానవో
ద్రేక స్తంభకు గేళిలోల విలసద్ద్రుగ్జాలసంభూత నా
నాకంజాత భవాండ కుంభకు మహానందాంగానా డింభకున్ 
                             **
లో్క‌ర‌క్షా ప‌రాయ‌ణుడు, భ‌క్త‌పాల‌న‌మే ఒక క‌ళ‌గా ఆచ‌రించేవాడు,దాన‌వుల ఉధృతాన్ని అరిక‌ట్టేవాడు, లీలావ‌లోక‌న మాత్రంచేత అనేక బ్ర‌హ్మాండాల‌ను ఉద్బ‌వింప‌చేసేవాడు అయిన మ‌హానందున‌(నంద‌రాజు) ఇల్లాల (య‌శోద‌) ముద్దుల బిడ్డడైన (బాల‌కృష్ణుని) శ్రీ కైవ‌ల్య ప‌దం పొంద‌డానికి నేను ధ్యానిస్తున్నాను అన్నాడు. 
ఒక్క ప‌ద్యంలో కృష్ణ‌య్య జీవితాన్ని, ద‌శావ‌తార‌లాను స్ఫుర‌ణ‌కు వ‌చ్చేట్టు చేశాడు.
ఇది శ్రీమదాంద్ర మహా భాగవతము లోని మొదటిపద్యము. 
భాగవత రచన ఆరంభానికి  ముందు పోతన గారు చేసిన ప్రార్ధనఇది.
శ్రీ‌కైవ‌ల్య ప‌దం చేర‌డానికే మ‌హాభాగ‌వ‌త ర‌చ‌న అని ఆదిలోనే నివేదించాడు.
రామభద్రుడు కృతి కర్త , క‌థానాయ‌కుడు కృష్ణుడు.
 కావ్యం ఎందుకు రాస్తున్నాడో అందులో ఏముందో, ఏమి ఆసించాడో,అన్ని ఒక్క పద్యంలో ప్రార్ధనలోనే చెప్పిన ఘనత పోతనదే.
ఇది చ‌దివిన వారికి , నేర్చుకున్న వారికి, మ‌న‌నం చేసుకునే వారికి శ్రీ కైవ‌ల్య‌ప‌దం త‌ప్ప‌క సిద్ధిస్తుంది.
*పోత‌న‌ ప‌ద్యాలు-మాన‌వాళి ఉన్నంత వ‌ర‌కూ నిలిచే ప‌ద్యాలు, జాతికి వెలుగు చూపే దివిటీలు.*

శనీశ్వరుడు

శనీశ్వరుడు ఎప్పుడూ అధో దృష్టితోనే ఉంటాడు. దీనికి కారణమేమిటి? ఒకవేళ ఆయన నేరుగా ఎవరినైనా చూస్తే ఏమవుతుంది?

పూర్వం గణపతి పుట్టినప్పుడు జరిగిన కథ ఇది. గణేశుడు అవతరించారనగానే ఆ బాలుడిని చూడటానికి ఎందరెందరో దేవతలు, పార్వతీ పరమేశ్వరుల ఇంటికి వస్తూ ఉండేవారు. అలా ఆ ముచ్చటైన బాలుడిని చూసి ఆశీర్వదించి అంతా ఆనందంగా వెళుతుండేవారు. వారిలాగానే సూర్యుడి కుమారుడైన శని కూడా ఆ శిశువును చూడటానికి ముచ్చట పడుతూ వచ్చాడు. అయితే శని అందరిలాగా తల ఎత్తుకొని కాక తల దించుకొని నేల చూపులు చూస్తూ వచ్చాడు. అతడలా రావటానికి ముందు గోలోకంలో ఉన్న శ్రీకృష్ణుని మనసారా స్తుతించాడు. అలాగే ఆయన పక్కనే ఉన్న శ్రీహరిని, బ్రహ్మదేవుడిని, శంకరుడిని, ధర్మదేవత ను, సూర్యుడిని ఇతర దేవతలనందరినీ వినయంగా స్తుతించి నమస్కరించి ఆ తర్వాతనే శిశు రూపంలో ఉన్న గణపతిని చూడటానికి బయలుదేరాడు. ఆయన ముందుగా పార్వతీ దేవి అంతఃపురం ముందున్న శూలహస్తుడైన విశాలాక్షుడు అనే శివకింకరుడి దగ్గరకొచ్చి తల దించుకునే ఆ కింకరుడితో తానెవరో చెప్పి తనను లోపలకు పంపమన్నాడు.

విశాలాక్షుడు శనైశ్చరుడిని లోపలికి అనుమతించాడు. శని లోపలకు వెళ్ళేసరికి పార్వతీ దేవి రత్న సింహాసనం మీద కూర్చుని ఉంది. అయిదుగురు పరిచారికలు తెల్లని వింజామరలు వీస్తూ సేవిస్తూ ఉన్నారు. రత్నభూషణాలను అలంకరించుకొన్న ఆమె ఒళ్ళొ శిశురూప గణపతి ఉన్నాడు. అందరూ ఆ తల్లీ బిడ్డలను చూసి పలకరించి వెళుతున్నారు. రత్న సింహాసనం మీద ఉన్న పార్వతీదేవి దూరంగా తల దించుకొని నిలుచున్న శనీశ్వరుడిని చూసింది. ఆమెకు ఆయనొక్కడే అలా చాలా సేపటి నుంచి తలదించుకొనే ఉండటం విచిత్రమనిపించి అలా ఉండటానికి కారణమేమిటో చెప్పమని అంది. అప్పుడు శని అది తన కుటుంబానికి సంబంధించిన విషయమని, అయినా జగత్తుకంతటికీ తల్లిలాంటిదైన పార్వతీదేవి అడిగినప్పుడు చెప్పటమే ఎంతో మేలైన విషయమని అంటూ తన స్వవిషయాన్ని వివరంగా ఇలా చెప్పాడు.

తాను సూర్యుడి కుమారుడినని, తనకు యుక్త వయస్సు రాగానే సూర్యుడు చిత్రరథుడి కుమార్తెతో తనకు వివాహం చేశాడని అన్నాడు. తాను చిన్నప్పటి నుంచి నిరంతరం శ్రీహరినే ధ్యానిస్తూ ఉండేవాడినని, హరి ధ్యానమే తప్ప వేరొకటి తెలియని తనకు మళ్ళీ తనలాగే భక్తి పరురాలైన భార్య దొరికినందుకు ఆనందించానన్నాడు. తన భార్య కూడా ఎప్పుడూ అలా ధ్యానంలోనే ఉండేదని, అయితే ఓసారి ఆమె రుతుస్నాత అయి సంతానార్థం తన దగ్గరకు వచ్చి నిలిచినా తానామె వైపు కనీసం చూడలేదన్నాడు. అందుకామెకు బాగా కోపం వచ్చి ఆనాటి నుంచి తాను నేరుగా ఎవరిని చూస్తే వారు నశిస్తారని శపించిందని పార్వతీ దేవికి శనీశ్వరుడు చెప్పాడు. ఆ తర్వాత ఆమెను తాను ప్రసన్నురాలిని చేసుకున్నా ఆ శాపం మాత్రం విముక్తి కాలేదని, తాను ఎవరి వైపు నేరుగా చూస్తే వారు నశిస్తున్నారు కనుక అధో దృష్టితో కాలం గడుపుతున్నానన్నాడు శనైశ్చరుడు.

పార్వతీమాత ఆ మాటలు విని శని పరిస్థితికి బాధ పడింది. అయినా జరిగేదంతా భగవదేచ్ఛ ప్రకారం, కర్మను అనుసరించి జరుగుతుంటాయి కదా, మరేమీ ఇబ్బంది లేదు, మా ఇద్దరి వంక నీవు చూడవచ్చు అని పార్వతీ దేవి శనితో అంది. శని ఒకవేళ అలా చూడకపోతే ఆమెకు కోపం వచ్చి శపిస్తే మళ్ళీ ఎక్కడ ఆ శాపాన్ని అనుభవించాలో అని భయపడి ఆ తల్లి ఒళ్ళొ ఉన్న శిశువు వంక చూశాడు. ఆ మరుక్షణం లోనే ఆ శిశువు తల తెగి గోలోకంలోని శ్రీకృష్ణుడిలో లీనమైంది. శని చెబుతున్న విషయాన్ని పట్టించుకోక పార్వతీ మాత అలా పుత్ర శోకానికి గురైంది. శోకిస్తున్న ఆమెను ఓదార్చి శ్రీహరి గజ శిరస్సును తెచ్చి మళ్ళీ గణపతికి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. ఈ కథా సందర్భంలో శని అధో దృష్టికి సంబంధించిన ఆమె భార్య శాపం, అలాగే పార్వతీ సుతుడు గణపతికి గజాననం రావటానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి.

కొన్ని పురాణాలలో శివుడు గజ ముఖాన్ని తెచ్చి బాల గణపతికి అమర్చినట్లు కనిపిస్తుంది. అయితే ఇక్కడ శ్రీహరి అలా చేసినట్లుంది. ఇది కల్ప భేదాన్ని అనుసరించి జరుగుతుండే విషయమని, ఒకే కథ ఒక్కో కల్పంలో కొద్దిపాటి తేడాతో మరోలాగా కూడా కనిపిస్తుండటం సహజమని పురాణజ్ఞులు వివరిస్తున్నారు.

చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతున్న వారు , అవకాశాలు నోటి కాడికి వచ్చి వెనక్కి వెళుతున్నాయి అని బాధపడే వారు ..... ఏలిన నాటి శని వలన ఇబ్బందులు పడుతున్నా ........

సేకరణ

మనం మనలాగే ఉండాలి.. విజ్ఞానం


అది బ్రిటిష్ కాలం.. ఒక పిల్లవాడు స్కూల్ నుండి ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. " స్కూళ్ళో కొందరు పోకిరీ పిల్లలు పిలక పంతులు అని వెక్కిరిస్తున్నారమ్మా .. పిలక తీసేస్తానమ్మా " అని చెప్పి ఏడ్చాడు.
చూడు నాన్నా.. " నీ పిలక వలన వాళ్ళకి ఏ నష్టమూ లేదు. పిలక ఉన్నందుకు నువ్వు బాధ పడక్కరలేదు. ఎవరో మూర్ఖులు ఏదో అన్నారని మన అస్తిత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు. వాళ్ళు వెక్కిరించారని నువ్వు పిలక తీసేస్తే నీ మీద నీకు గౌరవం లేనట్టే. అవన్నీ పట్టించుకోకుండా చదువు మీద దృష్టిపెట్టు నీ వలన దేశానికి చాలా ఉపయోగముంది." అంది.
కొంతకాలం తరువాత .." అమ్మా  స్కూళ్ళో పిల్లలు నన్ను జంధ్యం మాష్టారు .. జంధ్యం మాష్టారు అంటూ వెక్కిరిస్తున్నారు.. అస్తమానూ జంధ్యం పట్టుకొని లాగుతూ అల్లరి చేస్తున్నారు " అంటూ మళ్లీ ఏడ్చాడు.
" నీ జంధ్యం బయటకు రాకుండా చొక్కాలు కుట్టిస్తాను నాయనా.. బాధపడకు. వాళ్ళ చేతలు ,వాళ్ళ మాటలు పట్టించుకోకు. నువ్వు గొప్పవాడివి కావాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కుమిలిపోకూడదు. రాళ్లు
అడ్డొచ్చాయని ప్రవాహం ఆగిపోతుందా.. ?  " అని అనునయించింది.
మరికొంత కాలం గడిచాక ఆ పిల్లాడు ఇంకా పెద్ద చదువులు చదవడానికి దూరప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ అలాంటి సమస్యే ఎదురయ్యింది. " అమ్మా ! ఇక్కడి వాళ్ళు కోడిగుడ్లు తినమని  నన్ను పొరుపెడుతున్నారు.
బెదిరిస్తున్నారు. సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నేను తినే భోజనంలో కోడిగుడ్డుని కలిపేస్తున్నారు. మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా " అని ఉత్తరం రాసాడు.
"వాళ్ళు ఎన్నిరకాల పన్నాగాలు పన్నినా నువ్వు చలించకు. వాళ్ళు కాకుల వలే గోలచేస్తే చెయ్యనీ , దోమల వలే రొదపెడితే పెట్టని..  వాళ్ళు అలాగే మిగిలిపోతారు. కానీ నువ్వు దేశచరిత్రలో మహానుభావుడిలా నిలిచిపోవాలి.  ఏకాగ్రత కోల్పోకు.. నీ చదువుని ఒక తపస్సులా భావించు.
ఉదయాన్ని చూడాలంటే చీకటిని భరించాలి.ధృఢమైన సంకల్పంతో ముందుకెళ్లు.  " అని ఆమె తిరుగు ఉత్తరం రాసింది.
తల్లి రాసిన ఉత్తరం చదివిన అతడు కొండంత బలంతో చదువు పూర్తిచేశాడు. కేంబ్రిడ్జి కి వెళ్ళాడు. ప్రపంచదేశాలు నివ్వెరపోయేలా భారతదేశపు ఖ్యాతిని ఆకాశంలో నిలబెట్టాడు.
అతడే విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త
 " సి.వి.రామన్ " . తన తల్లి చెప్పిన విలువలను , హితోక్తులను ఆయన తన జీవితకాలం పాటించారు. విదేశాలకు వెళ్లినా , ప్రోఫెసర్ గా పనిచేస్తున్నా, మద్రాస్ ఐ.ఐ.టి. కి వైస్ ఛాన్సేల్లెర్ గా ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ తన పిలకని తీయలేదు. భారతీయతను వదిలిపెట్టలేదు. అందుకే తలపాగా ధరించేవారు.
" Raman the great."
అమ్మ
ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి రామన్ గారికి తన తల్లి మాట అంటే శిరోధార్యమే.
🙏🙏