15, అక్టోబర్ 2023, ఆదివారం

వేణుగానం



వేణుగానం!


"ఏది మరొక్కసారి,హృదయేశ్వర!,గుండెలు పుల్కరింపఁగా/

ఊదగదోయి!ఊదగదవోయి!సుధామయ యుష్మదీయ వే /

ణూదయ రాగడోలికల నూయలలూగుచు విస్మృతిలో విలీనమై /

పోదును; నాదుక్రొవ్వలపుపువ్వుల ముగ్ధపరీమళమ్ముతో;


కరణామయి-ఉదయశ్రీ-

జంధ్యాలపాపయ్యశాస్త్రి.


        ఈపద్యంవింటే రాధికయేగాదు మనంగూడా తన్మయులమైపోతాం.శాస్త్రిగారి కవితాశక్తియలాంటిది!

         హే హృదయేశ్వరా! కృష్ణా! మరోసారి వేణువూదవా! మరోసారి,ఆఁహః కాదుకాదు మరోసారి,బృందావనిలోనీవు వేణువూదుతుంటే,ఆవలపుగానంలో నాతనువూ మనసూ మరచి తన్మయస్ధితిలోలీనమై, నాతొలివలపుల తీయనియూహలు మదిలో నూగుచుండగా,నీకోసంఈ రాధపరవసిపోతుంది.నీకోసం పలవరిస్తుంది.

మరొక్కసారి వేణువు నూదవయ్యా!కృష్ణా! నాకోసం,కాదుకాదు, మనకోసం;

          ఇదీ ఈపద్యంలోని రాధపిలుపు.శాస్త్రిగారి పద్యంలో వలపు రవంతైనా మీకు అందించగలిగానా నాజన్మధన్యమే!

                             స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🌷

శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రరత్నమ్*

 *ॐ          శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రరత్నమ్*


*1. శ్రీదేవీ సంబోధనమ్*


    ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః - ఓం నమస్త్రిపురసుందరి! 


*2. న్యాసాంగదేవతాః*


    హృదయదేవి! - శిరోదేవి! - శిఖాదేవి! - కవచదేవి! - నేత్రదేవి! - అస్త్రదేవి! 


*3. తిథినిత్యాదేవతాః* 


    కామేశ్వరి! - భగమాలిని - నిత్యక్లిన్నే! - భేరుండే! - వహ్నివాసిని!- మహావజ్రేశ్వరి! - శివదూతి! - త్వరితే! - కులసుందరి! - నిత్యే! - నీలపతాకే! - విజయే! - సర్వమంగళే! - జ్వాలామాలాని! - చిత్రే! - మహానిత్యే! 


*4. దివ్యౌఘగురవః* 


    పరమేశ్వరపరమేశ్వరి! - మిత్రేశమయి! - షష్ఠీశమయి! - ఉద్దీశమయి! - చర్యానాథమయి! - లోపాముద్రామయి! - అగస్త్యమయి! 


*5. సిద్ధౌఘగురవః* 


    కాలతాపనమయి! - ధర్మాచార్యమయి! - ముక్తకేశీశ్వరమయి! - దీపకళానాథమయి! 


*6. మానవౌఘగురవః* 


    విష్ణుదేవమయి! - ప్రభాకరదేవమయి! - తేజోదేవమయి! - మనోజదేవమయి - కల్యాణదేవమయి! - వామదేవమయి! - వాసుదేవమయి! - రత్నదేవమయి! - శ్రీరామానందమయి! 


*7. శ్రీచక్ర ప్రథమావరణదేవతాః*  


    అణిమాసిద్ధే! - లఘిమాసిద్ధే! - గరిమాసిద్ధే! - మహిమాసిద్ధే! - ఈశిత్వసిద్ధే! - వశిత్వసిద్ధే! - ప్రాకామ్యసిద్ధే! - భుక్తిసిద్ధే! - ఇచ్ఛాసిద్ధే! - ప్రాప్తిసిద్ధే! - సర్వకామసిద్ధే! 

    (ఇతి భూపుర ప్రథమ రేఖాయామ్) 


    బ్రాహ్మి! - మాహేశ్వరి! - కౌమారి! - వైష్ణవి! - వారాహి! - మాహేంద్రి! - చాముండే! - మహాలక్ష్మి! 

    (ఇతి భూపుర ద్వితీయ రేఖాయామ్) 


    సర్వసంక్షోభిణి! - సర్వవిద్రావిణి! - సర్వాకర్షిణి - సర్వవశంకరి! - సర్వోన్మాదిని! - సర్వమహాంకుశే! - సర్వఖేచరి! - సర్వబీజే! - సర్వయోనే! - సర్వత్రిఖండే! 

    (ఇతి భూపుర తృతీయ రేఖాయామ్) 


    త్రైలోక్యమోహనచక్రస్వామిని! - ప్రకటయోగిని! 


*8. శ్రీచక్ర ద్వితీయావరణ దేవతాః* 


    కామాకర్షిణి! - బుద్ధ్యాకర్షిణి! - అహంకారాకర్షిణి! - శబ్దాకర్షిణి! - స్పర్శాకర్షిణి! - రూపాకర్షిణి! - రసాకర్షిణి! - గంధాకర్షిణి! - చిత్తాకర్షిణి! - ధైర్యాకర్షిణి! - స్మృత్యాకర్షిణి! - నామాకర్షిణి - బీజాకర్షిణి - ఆత్మాకర్షిణి - అమృతాకర్షిణి - శరీరాకర్షిణి! 


    సర్వాశాపరిపూరకచక్రస్వామిని! - గుప్తయోగిని! 


*9. శ్రీచక్ర తృతీయావరణ దేవతాః* 


    అనంగకుసుమే! - అనంగమేఖలే! - అనంగమదనే! - అనంగమదనాతురే! - అనంగరేఖే! - అనంగవేగిని! - అనంగాంకుశే! - అనంగమాలిని! 


    సర్వసంక్షోభణచక్రస్వామిని! - గుప్తతరయోగిని! 


*10. శ్రీచక్ర చతుర్థావరణ దేవతాః* 


    సర్వసంక్షోభిణి! - సర్వవిద్రావిణి! - సర్వాకర్షిణి! - సర్వాహ్లాదిని! - సర్వసమ్మోహిని! - సర్వస్తంభిని! - సర్వజృంభిణి! - సర్వవశంకరి! - సర్వరంజని! - సర్వోన్మాదిని! - సర్వార్థసాధికే! - సర్వసంపత్తిపూరణి! - సర్వమంత్రమయి!సర్వద్వంద్వక్షయంకరి! 


    సర్వసౌభాగ్యదాయకచక్రస్వామిని! - సంప్రదాయయోగిని! 


*11. శ్రీచక్ర పంచమావరణ దేవతాః* 


    సర్వసిద్ధిప్రదే! - సర్వసంపత్ప్రదే! - సర్వప్రియంకరి! - సర్వమంగళకారిణి! - సర్వకామప్రదే! - సర్వదుఃఖవిమోచని! - సర్వమృత్యుప్రశమని! - సర్వవిఘ్న(ghna)నివారిణి! - సర్వాంగసుందరి! - సర్వసౌభాగ్యదాయిని! 

    

    సర్వార్దసాధకచక్రస్వామిని! - కుళోత్తీర్ణయోగిని! 


*12. శ్రీచక్ర షప్ఠావరణ దేవతాః* 


    సర్వజ్ఞే! - సర్వశక్తే! - సర్వైశ్వర్యప్రదాయిని! - సర్వజ్ఞానమయి! - సర్వవ్యాధివినాశిని! - సర్వాధారస్వరూపే! - సర్వపాపహరే! - సర్వానందమయి! - సర్వరక్షాస్వరూపిణి! సర్వేప్సితఫలప్రదే! 


    సర్వరక్షాకరచక్రస్వామిని! - నిగర్భయోగిని! 


*13. శ్రీచక్ర సప్తమావరణ దేవతాః*  


    వశిని! - కామేశ్వరి! - మోదిని! - విమలే! - అరుణే! - జయిని! - సర్వేశ్వరి! - కౌళిని! 


    సర్వరోగహరచక్రస్వామిని! - రహస్యయోగిని! 


*14. శ్రీచక్రాష్టమావరణ దేవతాః* 


    బాణిని! - చాపిని! - పాశిని! - అంకుశిని! - మహాకామేశ్వరి! - మహావజ్రేశ్వరి! - మహాభగమాలిని! - మహాశ్రీసుందరి! 


    సర్వసిద్ధిప్రదచక్రస్వామిని! - అతిరహస్యయోగిని! 


*15. శ్రీచక్ర నవమావరణ దేవతాః*  


    శ్రీశ్రీమహాభట్టారికే! 


    సర్వానందమయచక్రస్వామిని! పరాపరరహస్యయోగిని! 


*16. నవచక్రేశ్వరీ నామాని* 


    త్రిపురే! - త్రిపురేశి! - త్రిపురసుందరి! - త్రిపురవాసిని! - త్రిపురాశ్రీః! - త్రిపురమాలిని! - త్రిపురాసిద్ధే! - త్రిపురాంబ! - మహాత్రిపురసుందరి! 


*17. శ్రీదేవీవిశేషణాని - నమస్కారనవాక్షరీచ* 


    మహామహేశ్వరి! - మహామహారాజ్ఞి! - మహామహాశక్తే! - మహామహాగుప్తే! - మహామహాజ్ఞప్తే! - మహామహానందే! - మహామహాస్కంధే! - మహామహాశయే - మహామహా శ్రీచక్రనగరసామ్రాజ్ఞి! 


         *నమస్తే - నమస్తే - నమస్తే - నమః*  


                            =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

భావమేమిటంటే

 మనం శివాలయానికి వెళితే అక్కడ పరమశివుని లింగం పైన

చుక్క చుక్కగా నీరు పడుతూ ఉంటుంది. పక్కనే అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది.


దీనికి భావం మనకి కలుగుతుందా.

ఇక్కడ భావమేమిటంటే  ఓ భక్తా!  ఈ చుక్క చుక్క నీరు లాగా నీ జీవితం కూడా క్షణక్షణం ఆయువు కరిగిపోతూ ఉంటుంది. పడిన నీటి చుక్క వృధాపాలుకాక భగవంతుని సన్నిధిని ఎలా చేరుతుందో అలాగే నువ్వు కూడా భగవంతుని అనుక్షణం జ్ఞాపకం చేసుకో. పక్కనున్న అఖండ దీపం వలె నీ  జ్ఞానతేజస్సు పెంచుకొని మరల జన్మ జన్మ రాకుండా చూసుకో.🙏🙏🙏

బతుకమ్మ చరిత్ర

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹బతుకమ్మ చరిత్ర - పండుగ  విశిష్టత🌹*


సెప్టెంబరు , అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు , ఇటువైపు అంతా పండుగ సంబరాలు , కుటుంబ కోలాహలాలు , కలయకలుతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ , మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం , తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక పండుగ.


రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు  పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ , సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు , ప్రేమ , స్నేహం , బంధుత్వం , ఆప్యాయతలు , భక్తి , భయం , చరిత్ర , పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు , భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని , తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు.. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటల వెనుక ఉండే మర్మం ఇదే..


ఈ పండుగ వర్షాకాలపు చివరిలో , శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు  రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు , తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి , చేమంతి , నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు (షిత్పొలా పండ్లు అంటారు) కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. సీతాఫలాన్ని పేదవాని ఆపిల్ అంటారనేది తెలిసినదే. అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి  సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు


తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది.


_*బతుకమ్మ పండుగ కథ*_


తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులకు , రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతంచేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. అప్పటి వేములవాడ (ప్రస్తుత కరీంనగర్ జిల్లా)లో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందరచోళా కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు.

ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ.


క్రీస్తు శకం 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బ్రిహదేశ్వరాలయంలో ప్రతిష్టించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బ్రిహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి , బ్రిహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది.బృహదమ్మ(పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను , తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు. *బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే*. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలాగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు.


బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో , జలవనరులు  సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి , భూమితో , జలంతో , మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు *"బొడ్డెమ్మ"* (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు.


బతుకమ్మ పండుగ జానపదులు తమసంతు దక్కాలని అమ్మదేవతలకు మొక్కుకునే ఆనవాయితీ పురాతనమైనది. పుట్టిన పిల్లలను చల్లగా చూడమని అమ్మదేవతల ముందు కట్టిన ముడుపులు , మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది పుట్టినపిల్లలు పుట్టినట్లు చనిపోతుంటే , పిల్లలు పుట్టిన వెంటనే పెంట మీద వేసి తెచ్చుకుని *‘పెంటమ్మ లేదా పెంటయ్య’* అని పేరు పెట్టుకుంటారు. మరి కొందరు పుట్టినపిల్లల్ని ఎవరికైనా ఇచ్చి *‘బిచ్చంగా’* తిరిగియ్యమని కోరుకుంటారు. అట్లా తీసుకున్న పిల్లలకు *‘భిక్షపతి , భిక్షమ్మ’* లని పేరు పెట్టుకుంటారు. వాళ్ళే బుచ్చపతి , బుచ్చమ్మలుగా పిలువబడుతుంటారు. ఇట్లాంటి సందర్భాల్లోనే బతుకనిపిల్ల బారెడనే సామెతలు పుట్టాయి. పిల్లల్ని బతికించమనే వేడుకునే దేవతల్లో మన బతుకమ్మ ఒక దేవత. ఆ దేవత వరాన బతికితే బతుకమ్మ , బతుకయ్యలని పేర్లు పెట్టుకుంటారు. సమ్మక్క మేడారంలో బతుకయ్య పేరున్న వాళ్ళు ఇపుడు కూడా వున్నారు.


ఈ పూలపండుగ బతుకమ్మ ఎంగిలిపూలతో మొదలుపెట్టి సద్దులబతుకమ్మతో ముగిసిపోతుంది. బొడ్డెమ్మపండుగ నాడు *‘బొడ్డెమ్మ బొడ్డెమ్మా వలలో , బిడ్డాలెందారే.. వలలో’* అని పాడే పాట సంతానం గురించే కదా. నాటి రోజుల్లో నీళ్ళాడే(ప్రసవ)సమయాల్లో శిశుమరణాలు జాస్తిగా వుండేవి. నీటిరేవులే ఆనాటి తల్లులకు ప్రసూతి స్థలాలు. నీళ్ళల్లో ప్రసవించే సమయంలో తల్లులు తమసంతు బతికినందుకు ప్రతీకగా నీటివారనపెరిగే తంగేడు , గునుగు పూలముద్దలను నిమజ్జనం చేసివుంటారు. ఆ తల్లుల ఆచారమే బతుకమ్మపండుగగా మారి వుంటుంది. ఇది తెలంగాణా ప్రాంతానికే చెందడం మనగొప్పసంస్కృతికి సాక్ష్యం. ఎవ్వరికన్న ఐదారుగురు కన్నా ఎక్కువమంది పిల్లలుంటే ఆ తల్లిని గౌరవించేవాళ్ళు. మానవజాతి పిల్లలవల్లనే కదా ఇన్ని వేలయేండ్లుగా మనగలిగింది. అందుకే తల్లికంత గౌరవం. అమ్మతనం మీద భక్తి. ఆ భక్తే అమ్మదేవతలను కల్పించింది. పూజించింది. అమ్మదేవతల పూజల్లో ఒక ఆరాధనా రూపమే మన బతుకమ్మ.


బౌద్ధంలో ముందు చెడ్డదేవతగా , పిల్లల్ని ఎత్తుకపోయే రాక్షసిగా పిలువబడ్డ హారీతి బుద్ధునివల్ల మంచిదానిగా , పిల్లల్ని రక్షించే దేవతగా మారిపోయింది. ఆమెనే పిల్లలదేవతగా కొలుస్తారు. పుట్టిన తమ పిల్లలు బతుకాలని , రోగాలు , రొష్టులు లేకుండ వుండాలని హారీతిని ఆరాధించేవారు. ఈ దేవతను గురించి బౌద్ధజాతక కథల్లో చదువగలం. వివిధ చారిత్రకదశల్లో ఈ దేవత విగ్రహాలు వేర్వేరు రూపాల్లో అగుపిస్తున్నాయి. చాళుక్యులు తమను తాము హారీతిపుత్రులుగా శాసనాల్లో చెప్పుకున్నారు.2వ శతాబ్దంలో ఇక్ష్వాకుల కాలం నుండి హారీతి శిల్పాలు కనిపిస్తున్నాయి.12వ శతాబ్దందాకా శాసనాల్లో హారీతిపేరు ప్రస్తావించబడ్డది. పిల్లల్ని బతికించే దేవత హారీతినే బతుకమ్మగా భావించినారేమో.


కూష్మాండిని దేవతకు ప్రతీకగా గుమ్మడిపువ్వును పూజించే ఆచారమే బతుకమ్మ పండుగగా మారిందని కొందరి అభిప్రాయం. మనపూర్వీకులు ఇనుము - ఉక్కు తయారీకి తంగేడుచెక్కను వాడేవారని , తోలు తయారీకి తంగేడు ఎంత అవసరమో అందరికి తెలుసు. గునుగుకు నీళ్ళను శుభ్రపరిచే గుణముంది. తమకు నిత్యజీవితాసరాలైన తంగేడు , గునుగుపూలతో మనపూర్వీకులు తమ అమ్మదేవత(కూష్మాండిని ?) ని పూజించే రూపమే పరిణామంలో జాతరగా మారి వుంటుంది.

గునుగు , తంగేడుపువ్వులతో కొప్పురం రూపంలో పూలబతుకమ్మను పేర్చి , శిఖరం లేదా సిగమీద గుమ్మడి పువ్వుంచి , పసుపు , కుంకుమలతో అలంకరిస్తారు. పూజ పువ్వులను తొక్కుట్లవెయ్యని ఆచారమే బతుకమ్మలను నీళ్ళలో వదిలే సంప్రదాయమైంది.


దసరా పండుగ సందర్భంగా కొలిచే హిందూదేవత నవదుర్గారూపాల్లో కూష్మాండిని ఒకటి. ఎనిమిదవ రోజున కూష్మాండినిని అర్చిస్తారు. అదేరోజు బతుకమ్మలాడుతారు. కొన్ని ప్రాచీన ఆచారాలను మతాలు స్వంతం చేసుకున్న క్రమం చరిత్రలో కనిపిస్తుంది మనకు. ఈ పండుగకు కూడా కులాల మసిపూయడం అనాచారం. ఇది ఎక్కువ (పెద్దకులాల) వాళ్ళ పండుగ కాదు తక్కువ(చిన్నకులాల , జాతుల) వాళ్ళదే. గిరిజనులదే. తొలి మొలకలను , తొలిపూతను కొలిచే ఆచారం గిరిజనులదే. పువ్వంటే రేపటి ఫలమని వాళ్ళకు తెలుసు.ఆడపిల్లలను , పువ్వుల్ని కొలిచే పండుగే మన బతుకమ్మ. ఈ పండుగకు మతం లేదు. మతాచారాలు రుద్దబడ్డాయి. మనప్రాంతంలో కూష్మాండిని ఆరాధన జైనులవల్ల వచ్చింది. జైనమతానుయాయులైన కాకతీయులవల్ల ప్రోత్సహించబడ్డది. జైనంలో 22వ తీర్థంకరుని శాసనదేవత , యక్షిణి అంబిక(అంబ=అమ్మ) లేదా కూష్మాండిని (గుమ్మడితీగె , గుమ్మడిపువ్వు). ఈమె ప్రతిమాలక్షణంలో చేతుల్లో ఫలాలతో , ఇద్దరు పిల్లలతో , మామిడిచెట్టుకింద కూర్చొనివున్నట్టు వుంది. అంబిక కూడా ఒక అమ్మదేవతే. ఈ దేవతలకు ప్రతిమారూపాలు క్రీ.శ.5వ శతాబ్దం నుంచే కల్పించబడ్డాయి. అంతకు ముందున్నట్టు చారిత్రకాధారాలు లేవు.


బతుకమ్మల తయారీలో కూడా చాలా భేదాలు కనిపిస్తాయి. బతుకమ్మలు స్తూపాల ఆకారంలో వుంటాయి. లింగాల తయారీలో కూడా ఇటువంటి సంప్రదాయముందని చాలాచోట్ల చెప్పబడింది. పూర్వం బౌద్ధులు తమ ఆరాధనలో భాగంగా చేసుకున్న స్తూపాలను పూలు , మట్టి , ఇసుక , పేడ , రాయి , ఇటుకలతో తయారుచేసుకునేవారు. బౌద్ధభిక్షుకులు నిరంతరం ప్రయాణిస్తుండడం వల్ల స్తూపారాధనకు తమకు దొరికిన వాటినే స్తూపాలుగా చేసుకుని బుద్దునికి ప్రతీకగా నమస్కరించేవారు. పూలు , ఇసుక , మట్టి , పేడ స్తూపాలను నీటిలో కలిపేసేవారు మర్యాదగా. వాళ్ళు తిరుగాడిన ప్రదేశాల్లోని ఎన్నో వాగులు , ప్రవాహాలు భిక్కేరులుగా పిలువబడుతున్నది ఒక్క తెలంగాణలోనే. అందువల్లనే తొలుత బౌద్ధులైన గిరిజనులు , వనజనులు ఈ ఆచారాన్ని కొనసాగించివుంటారు. దానికి వారి కోరికలు మన్నించిన అమ్మదేవతకు ప్రతీకగా తర్వాత చేసుకుని వుంటారు. పిదప కాలాల్లో వచ్చిన మతపరిణామాలవల్ల ఈ దేవతలను తమ , తమ మతదేవతలుగా చేసుకున్నారు. ఆ దేవతలే బౌద్ధంలో హారీతిగా , జైనంలో ఆమ్రకూష్మాండినిగా , హిందూమతంలో అంబికగా పూజింపబడ్డారు. తెలంగాణాలో అతిప్రాచీనమైన అమ్మదేవతల ఆరాధనమే తల్లులరూపంలో ఏ దేవతవచ్చినా తమదేవతల్లో కలుపుకున్న సంప్రదాయమే బతుకమ్మ జాతరగా నిలిచిపోయింది. దసరాపండుగతో బతుకమ్మను కలుపడం , అమ్మదేవతలను కాకుండా పితృదేవతలను పూజించే ఆచారంగా మారడం ‘పెత్రామాస’(పితృ అమావాస్య)ను ఈ పండుగలో చేర్చడం తర్వాతి కాలాల్లో వచ్చిన పరిణామమే.


జనపదుల ఆచారాలు చాలా ప్రాచీనమైనవి. అవి వేలయేండ్ల పూర్వపువి. ఒక్కో జాతికి , ప్రాంతానికి పరిమితమైనవి. బతుకమ్మ మనకు , మన తెలంగాణాకే పరిమితమైంది. ప్రపంచంలో మరెక్కడా లేని పూలపూజ మన సంస్కృతి. బతుకమ్మ జానపదుల పండుగ. బతుకమ్మ ఆటలో గుస్సాడి నృత్యం , చప్పట్లలో జానపదుల పాట , ఆటల కలయిక మనమూలాలను ఎరుకపరిచే మంచి సాంప్రదాయం. బతుకమ్మ అచ్చతెలుగు మాట. దాన్ని సంస్కృతీకరించి పౌరాణికం చెయ్యొద్దు.


*తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు*

🧆🥗🍲🍛


9 రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం  తయారీలో యువకులు , యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.


*ఎంగిలి పూల బతుకమ్మ:*


మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు , బియ్యంపిండి , నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.


*అటుకుల బతుకమ్మ :*


ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు , బెల్లం , అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.


*ముద్దపప్పు బతుకమ్మ :*


ముద్దపప్పు , పాలు , బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.


*నానే బియ్యం బతుకమ్మ :*


నానేసిన బియ్యం , పాలు , బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.


*అట్ల బతుకమ్మ :*


అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు..


*అలిగిన బతుకమ్మ :*


ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.


*వేపకాయల బతుకమ్మ :* 


బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.


*వెన్నముద్దల బతుకమ్మ :*


నువ్వులు , వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.


*సద్దుల బతుకమ్మ :*


ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం , చింతపండు పులిహోర , లెమన్‌ రైస్‌ , కొబ్బరన్నం , నువ్వులన్నం. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు , జొన్నలు , సజ్జలు , మినుములు  , శనగలు , పెసర్లు , పల్లీలు , నువ్వులు , గోధుమలు , బియ్యం , కాజు , బెల్లం , పాలు ఉపయోగిస్తారు.


*తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో*


మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని , చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. . ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి , ప్రతీ సాయంత్రం వాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.అయితే చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడు , గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు , తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి.


ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం) లో వలయాకారంగా , రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు , పూలు పళ్లెంలో లేదా తాంబోలంలో పేర్చుతారు , ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో , అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను దరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం  చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.


ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం , సత్తుపిండి ( మొక్కజొన్నలు , లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం , నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు) లను ఇచ్చి పుచ్చుకొని తింటారు.


మలీద - చక్కెర , రొట్టెతో చేసిన పిండివంటకం చివరి రోజు సాయంత్రం , ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు , అభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత , సోదరభావం , ప్రేమను కలిపి రంగరిస్తూ మానవ హారం ఏర్పరిచి పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టు పక్కలా ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి.


చీకటి పడుతుంది అనగా , స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు గానీ , తటాకంవైపు గానీ ఊరేగింపుగా  బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకిరించుకున్న స్త్రీలు , బతుకమ్మలతో అత్యంత సుందరంగా , వైభావయానంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ , జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్న తరువాత , మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ , ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత "మలీద" (చక్కెర , రొట్టెతో చేసినది) అనే పిండి వంటకాన్ని బంధు మిత్రులకు పంచిపెడతారు. ఆ తరువాత ఖాళీ తాంబలంతో పాడుతూ , బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. ఈ తొమ్మిది రోజులూ , ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకూ వీధులలో మారు మ్రోగుతూనే ఉంటాయి.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేంకటేశ్వర అవతారానికి🌹* *3 ప్రధానమైన కారణాలు?*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹వేంకటేశ్వర అవతారానికి🌹*


*3 ప్రధానమైన కారణాలు?*


1. ఒక నాడు నారద ముని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి అడిగారుట. కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు, భగవంతుడి మీద అస్సలు మనస్సు లేదని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారుట, నేను వారి పాపాలని కడగడానికి, వారిని ఉద్ధరించడానికి శ్రీ వేంకటేశ్వరునిగా అవతరిస్తాను. వారు ఒక్కసారి నా కొండకి వచ్చి, తల నీలాలు సమర్పించి, నా దర్శనం చేసుకుని, ఒక్క ఆర్జిత సేవ చేసినా (కలియుగంలో అశ్వమేథయాగం చేసినంత పుణ్యం. అసలు కలియుగంలో చెయ్యడం చాలా కష్టం మరియు నిషిద్ధం కూడా) వారి పాపాలని నేను తీసేస్తాను. వారి డబ్బు వెయ్యకపోయినా సరే, తల నీలాలు సమర్పిస్తే చాలు.


2. ద్వాపర యుగంలో యశోదమ్మ చిన్నికృష్ణున్ని పెంచే అదృష్టం కలిగింది. ఈ లోకంలో యశోదమ్మవంటి అదృష్టవంతురాలు ఇంక ఎవ్వరులేరు. యశోదమ్మ అడక్కుండా రెండు మూడు సార్లు విశ్వరూప దర్శనభాగ్యం ఆమెకి మాత్రమే కలిగింది. కృష్ణుడి బాల్య క్రీడలు అంత సాధారణమైనటువంటివి కావు. వ్యాస భగవానుడు సంస్కృతంలో భాగవతాన్ని రాస్తే, పోతనాచార్యుల వారు తెలుగులోకి ఆంధ్రీకరించారు. కానీ యశోదమ్మకి ఒక కోరిక మిగిలి పోయింది. రుక్మిణి కల్యాణం చూడలేకపోయింది. అప్పుడు ఆమె అడిగితే, కృష్ణుడు వాగ్థానం చేశాడుట నేను కలియుగంలో వేంకటేశ్వరునిగా అవతరిస్తాను, నీవు వకుళమాతగా వచ్చి నా కల్యాణం చేయించు అని.


 

3. వేదవతిని పరిగ్రహించాలి (వివాహ మాడాలి)

సీతమ్మ దొరికినట్లుగానే, ఈమె కూడా దర్భల మీద దొరికింది. నెమ్మదిగా పెరిగి యుక్త వయ్యస్సులోకి రాగానే, ఆమె తండ్రి వివాహం చేద్దామని సంకల్పించారు. అప్పుడు ఆమె చెప్పిందట నేను సాక్షాత్తు శ్రీనివాసుడిని వివాహమాడతాను అని. అప్పుడు తండ్రిగారు అన్నారు, శ్రీనివాసుడిని పరిణయమాడడమంటే మాటలా. పార్వతి దేవి చూడు ఎంత తపస్సు చేసింది శంకరుడు గురించి. అప్పుడు వేదవతి కూడా హిమవత్ పర్వతానికి వెళ్లి తపస్సు చేసిందిట. ఆమె తపస్సు చేస్తుంటే, రావణాసురుడు వచ్చి ఎత్తుకుపోవాలని చూస్తే, వేదవతి వాడిని శపించి (నువ్వు ఒక స్త్రీ వల్లే నాశనం అవుతావని, ఆమెయే సీతమ్మ) అగ్ని ప్రవేశం చేసింది. ఆ సమయంలో అగ్నిహోత్రుడు  ఆమెను కాపాడి, కూతురిగా స్వీకరించాడు. కొన్నాళ్ళ తరువాత, రావణుడు సీతమ్మని ఎత్తుకు పోతుండగా అగ్నిహోత్రుడు తారసపడ్డాడు. రావణాసురుడు నమస్కారం కూడా చేయలేదని ఆగ్రహించి అన్నాడుట, నీ రథంలో ఉన్న సీత నిజ మైన సీత కాదు, మాయ సీత అని. అసలు సీత నా దగ్గర ఉందని. అప్పుడు రావణాసురుడు చాలా సంతోషపడి, అగ్ని హోత్రుడి దగ్గర ఉన్న మాయాసీతని నిజమైన సీత అనుకుని లంకకి తీసుకుపోయాడు. నిజమైన సీత మాత్రం అగ్ని హోత్రుడి దగ్గర ఉండిపోయింది. అసలుసీత తరపున వేదవతి అశోక వనంలో 12 నెలలు ఉండి, రాముడిని రప్పించి, రావణ వాత చేయించింది. వేదవతి తన కార్యం పూర్తి అయ్యాక, అగ్నిహోత్రుడు దగ్గరకి వెళ్ళిపోయింది.


 


వేదము యొక్క స్వరూపమే సీత. సీతమ్మ స్వరూపమే వేదవతి. నిజానికి ఇద్దరు లేరు, ఉన్నది ఒక్కరే. రావణాసురుడి గురుంచి చెబుతూ, రావణుడు వేదాలు చదివాడు, క్రమం తప్పకుండా సంధ్యా వందనం చేసేవాడు. చాలా తపస్సు చేసాడు కాని శ్రద్ధ లేదు, వక్ర బుద్ధి పోలేదు. అందుకే రాముడి చేతిలో మరణించాడు. శంకరుడుకి చాలా పూజలు చేసాడు కానీ, సీతయే పార్వతి అని తెలుసుకోలేక పోయాడు.  తన కులదేవత స్వరూపాన్నే కావాలనుకున్నాడు. 12 నెలలు సీతమ్మ తరపున వేదవతి అశోకవనంలో ఉంది కనుక, అగ్నిహోత్రుడు రాముడితో వేదవతిని కూడా భార్యగా స్వీకరించమన్నాడు. అప్పుడు రాముడన్నాడు, ఈ అవతారం లో నేను ఏకపత్ని వ్రతున్ని. నేను కలియుగంలో శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించి వేదవతిని (పద్మావతి అమ్మవారు) పరిణయమాడతానన్నాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం🪐* . *54వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *54వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*శనిగ్రహ జననం - 5*


ఛాయ అడుగులో అడుగు వేసుకుంటూ , సూర్యుడి వద్దకు నడిచింది. సూర్యుడు ఆమె వైపు చిరునవ్వుతో చూశాడు. గర్భ భారం ఆమెలో అలసత్వాన్ని పెంచింది. వేగాన్ని తగ్గించింది.


*"గర్భం నీ దేహకాంతిని ద్విగుణీకృతం చేసింది సంజ్ఞా !"* ఆమె చూస్తూ అన్నాడు సూర్యుడు.  శరీరాన్ని మెప్పుగా చూస్తూ అన్నాడు సూర్యుడు.


*"మీ దగ్గరగా వచ్చానుగా , మీ కాంతి నా మీద పడి ప్రతిఫలిస్తోంది !"* ఛాయ నవ్వుతూ అంది. 


*"నీ శరీరాన్ని ప్రకాశింపజేస్తున్న ఆ కాంతి నాదీ , నీదీ కాదు ! నీ గర్భంలోని మన పుత్రుడిది !"* సూర్యుడు చిరునవ్వుతో అన్నాడు.


*"నా కుమారుడు మీలాగా కమల వర్ణంలో ఉంటాడో , నాలాగా కనక వర్ణంలో ఉంటాడో - చెప్పండి చూద్దాం !”* అంది ఛాయ. 


"కమల వర్ణం , కనక వర్ణం రెండూ కలిసిన నూతన కాంతిలో మెరిసిపోతూ ఉంటాడు !"* సూర్యుడు నవ్వుతూ అన్నాడు.


*"ఔను ! నాకూ అలాగే అనిపిస్తోంది !"* అంది ఛాయ గర్వంగా.


అది ప్రమోదూత నామ సంవత్సరం. పుష్య మాసం. కృష్ణ పక్షం. స్వాతీ నక్షత్రంతో కూడిన అష్టమి తిథి.


ఆ సమయంలో ఛాయ మగ శిశువుకు జన్మనిచ్చింది. ఛాయా సూర్యుల ఊహలను తల క్రిందులు చేస్తూ , నల్లటి దేహకాంతితో పుట్టాడు ఆ బాలుడు. కాటుక ముద్దలాంటి శరీరం ! గోరోచనం గుళికల్లాంటి కళ్ళు ! బలహీనంగా అవుపిస్తున్న సన్నటి ఆకారం...


అనాకారిగా , సన్నగా కనిపిస్తున్న కుమారుణ్ణి తదేకంగా చూసి , ఛాయ సూర్యుడి వైపు అర్థం కానట్టు చూసింది. సూర్యుడు ఆమె ఆలోచన అర్థమైనట్టు చిన్నగా నవ్వాడు.


*"ఏమిటి దేవీ , నాలాగా ధగధగలాడే రంగులో లేడని ఆలోచిస్తున్నావా ? బాలుడు నా కుమారుడు ! అందుకే అలా నల్లగా ఉన్నాడు. నిలువు తెలుపు , నీడ నలుపు ! సహజమే కదా !!*


మనవడి నామకరణ మహోత్సవానికి అదితి , కశ్యపులూ , విశ్వకర్మ దంపతులూ వచ్చారు. వాళ్లనూ , సూర్యుడినీ ఆశ్చర్యానందాలలో ముంచివేస్తూ త్రిమూర్తులూ , నారదుడు వచ్చారు.


*"నీ కుమారుడు చాలా నెమ్మదిగా , అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తాడు. అతని సంచారం చాలా నిదానంగా ఉంటుంది. మందగమనం. అందుచేత బాలునికి అర్ధవంతమైన నామధేయం సూచిస్తున్నాను..."* శ్రీమహా విష్ణువు సూర్యుడితో అన్నాడు. 


*"అవశ్యం ! అది మా చిన్నవాడి అదృష్టం!"* అన్నాడు సూర్యుడు వినయంగా.


*"నీ కుమారుని నామధేయం, "శనైశ్చరుడు'!"* విష్ణువు అన్నాడు.


బాలుడికి శాస్త్ర సమ్మతంగా అదే పేరు పెట్టారు. త్రిమూర్తులు బాలకుణ్ణి దీవించారు. భవిష్యత్తులో బాలుడు నవగ్రహ దేవతలలో ప్రముఖుడవుతాడనీ , విద్యాబుద్ధులు నేర్పుతూ చక్కగా పెంచి పెద్దవాణ్ణి చేయమనీ శివుడూ , బ్రహ్మా సూర్యుడికి చెప్పారు. తన సంతతి పరంపరలో ఇద్దరు నవగ్రహాదేవతలు ఆవిర్భవించినందుకు కశ్యప ప్రజాపతి మహానంద భరితుడయ్యాడు.


శనైశ్చరుడు ఛాయ ప్రత్యేక పోషణలో పెరుగుతున్నాడు.


కాలక్రమాన ఛాయకు ద్వితీయ పుత్రుడు జన్మించాడు. తండ్రి సూర్యుడి దేహవర్ణంతో 'సవర్ణుడు'గా జన్మించిన బాలునికి సూర్యుడు 'సావర్ణి' అని నామకరణం చేశాడు. ముడవ సంతానంగా ఛాయకు ఒక పుత్రిక పుట్టింది. కుమార్తెకు 'తపతి' అనే పేరు నిర్ణయించాడు సూర్యుడు.


సంజ్ఞ సంతానమూ , ఛాయ సంతానమూ - ఆరుగురూ ఛాయ అదుపాజ్ఞలలో పెరగసాగారు. తన బిడ్డలైన శనైశ్చరుడూ , సావర్ణి , తపతీ క్రమంగా వృద్ధి చెందే కొద్దీ , ఛాయలో సంజ్ఞ బిడ్డల పట్ల మమతానురాగాలు క్షీణించసాగాయి.


*"ఇప్పుడు నవగ్రహాలలో అష్టమగ్రహమైన రాహువు జన్మగాథ చెప్తాను , సావధానంగా వినండి !"* అన్నాడు శని జన్మ వృత్తాంతం ముగించిన నిర్వికల్పానంద.


*"గురువుగారూ ! రాహువును 'సింహికాగర్భసంభూతుడు' అంటారు కదా ! అంటే రాహువు కశ్యప ప్రజాపతి భార్య అయిన సింహిక పుత్రుడనేనా అర్ధం ?"* శివానందుడు అడిగాడు.


*"ఔను ! రాహువు దక్షప్రజాపతి పుత్రికా , కశ్యప ప్రజాపతి ధర్మపత్ని అయిన సింహిక పుత్రుడే ! రాహువు జన్మ వృత్తాంతంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు ఏవీ లేవు. సూర్యుణ్ణి కబళించే మహాశక్తివంతమైన గ్రహంగా రూపొందిన మన రాహువు జననం సర్వసాధారణంగా జరిగింది. ఆ వృత్తాంతం తెలుసుకోవడానికి మనం కశ్యపాశ్రమానికి వెళ్ళాలి..."* అంటూ కథనం కొనసాగించాడు నిర్వికల్పానంద.



*రేపటి నుండి రాహుగ్రహ జననం ప్రారంభం*

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 64*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 64*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*విధి ఇలా ఉన్నప్పుడు ఎవరిని ఎందుకోసం నిందించాలి?*


అవినీతి మార్గాలు చూపిన వారితో కూడా  సన్న్యాస జీవిత మహత్వాన్ని గురించి నరేంద్రుడు చెప్పేవాడు. అయినప్పటికీ వారు మాత్రం మళ్లీ అతణ్ణి లౌకిక విషయాల వైపు లాగడానికే ప్రయత్నించేవారు. "జీవితంలో ఎలాంటి నిర్ణయానికి రాకుండా ఎందుకు ఇలా ఉన్నావు? ధనం సంపాదించే ప్రయత్నంలో తీవ్రంగా మునిగిపో. అప్పుడే కదా సుఖమయ జీవితం గడపగలవు!' అంటూ ఉపదేశించేవారు. 


అందుకు నరేంద్రుడు, “నాకూ అలాంటి ఆలోచనలు రాకపోలేదు. కీర్తి ప్రతిష్ఠలు, పదవీ ఐశ్వర్యమూ, అంతస్తులతో కూడిన జీవితం గడపాలనే ఆలోచన నాలో తరచు కలగడం కద్దు. కాని, బాగా లోతుగా ఆలోచించినప్పుడు, ఈ ధ్యేయం అర్థరహితమని తోచేది. 


మరణం అనేదొకటి ఈ లోకంలో ఉన్నదే! దాని కబంధ హస్తాల నుండి ఎవరైనా తప్పించుకోగలరా? సన్న్యాసులు మరణపు పిడికిలి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సత్యమైన, శాశ్వతంగా మార్పులేని వస్తువును అన్వేషిస్తున్నారు. కనుక సన్న్యాస జీవితమే సర్వోత్కృష్టమైనదిగా "నేను భావిస్తున్నాను" అన్నాడు. అయినప్పటికీ మిత్రులు వదలిపెట్టలేదు. 


వారిలో ఒకడు, "దక్షిణేశ్వరంలోని వృద్ధుడే నరేంద్రుణ్ణి పాడుచేస్తున్నాడు. ఇతడి 

భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు" అన్నాడు. తరువాత నరేంద్రుణ్ణి చూసి, “నరేన్! నీకు సొంత బుద్ధి అనేది ఉంటే, ఆయన వద్దకు వెళ్లడం మానుకో. లేకపోతే నీ చదువు, భవిష్యత్తు నాశనమయిపోతాయి. నువ్వు ప్రతిభావంతుడివి; జీవితం వైపు మనస్సును మరలిస్తే నువ్వు సాధించలేనిది ఏదీ ఉండదు. కనుక దక్షిణేశ్వరానికి  స్వస్తి చెప్పు" అని సలహా ఇచ్చాడు. 


"ఇలా చూడండి! ఆయన గురించి మీకు ఏమీ తెలియదు; నాకు పెద్దగా ఏమీ అర్థం కాలేదు; కాని, నేను ఆ వృద్ధుణ్ణి. శ్రీరామకృష్ణులను అమితంగా అభిమానిస్తున్నాను" అని గద్గద స్వరంతో చెప్పాడు నరేంద్రుడు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 54*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 54*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*పవిత్రీకర్తుం నః పశుపతిపరాధీన హృదయే*

*దయా మిత్రై ర్నేత్రై రరుణధవళ శ్యామరుచిభిః |*

 *నదశ్శోణో గంగా తపనతనయేతి ధ్రువ మయం*

 *త్రయాణాం తీర్థానా ముపనయసి సంభేద మనఘమ్ ‖*  



పవిత్రీకర్తుం నః = అమ్మా, నీ చల్లని చూపులు మమ్ములను పవిత్రం చేయుగాక!


పశుపతి పరాధీన హృదయే = పశుపతికి 

(పాశములతో బంధింపబడ్డ మానవులు పశువులు, శివుడు పశుపతి.ఈ పశువులకు అధిపతి, పాశములను తొలగించువాడు) పరాధీనమైన హృదయము కల తల్లీ


దయా మిత్రై ర్నేత్రై = దయతో కూడియుండే నీ చూపులు


అరుణ ధవళ శ్యామ రుచిభిః = ఎరుపు, తెలుపు, నలుపు రంగులతో కూడినవి.

 క్రిందటి శ్లోకంలో చెప్పుకున్నాము. ఈ వర్ణాలు త్రిగుణములకు, వాటిని కలిగి సృష్టి స్థితి లయములు చేసే త్రిమూర్తులను నియంత్రించే అమ్మవారి కన్నుల వర్ణములకు సంకేతములని.


నదశ్శోణో గంగా తపనతనయేత్ ధ్రువ మయం = పవిత్రమైన శోణ, గంగ, యమునా (సూర్యుని కుమార్తె యమున, కుమారుడు యముడు) నదుల ప్రవాహాలు మా తాపాన్నీ, దాహాన్నీ, తాపత్రయాలనూ పోగొట్టి మమ్ములను పునీతులను చేయునట్లుగా వున్నాయి. ఈ మూడు నదుల సంగమం యొక్క మహిమను నీ చూపుల ద్వారా పొందుతున్నామని భావం.


ఇతః పూర్వం చెప్పుకున్నాము జంబుకేశ్వర క్షేత్రంలో అఖిలాండేశ్వరి అమ్మవారి నేత్ర దృష్టి తీవ్రముగా వుండటము, ఆ తీవ్రతను ఆదిశంకరులు మంత్ర యుక్తముగా ఉపసంహరించి, శ్రీచక్ర యంత్రములుగా ఆమె తాటంకములలో నిక్షిప్తము చేయటము. ఆమె చూపులు ఉగ్రముగా వున్నా, పుత్ర వాత్సల్యంతో చల్లబడుతాయని ఆమె విగ్రహానికి ఎదురుగా విఘ్నేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠాపన చేయటము చెప్పుకున్నాము. 


శోణా నదిలో (బీహారులో) ఎర్రని గణపతి శిలలు దొరుకుతాయి, పంచాయతనములో పూజించటానికి.    

మిగతా నాలుగు ఇవీ


నర్మదా నదిలో శివ లింగాలు

గండకీ నదిలో విష్ణు సాలగ్రామాలు 

సువర్ణముఖిలో అంబికా రూపాలు

గుజరాత్ లో లభించే స్ఫటికాలలో సూర్యరూపములు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻



*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

Panchaag


 

వేదాశీర్వాదములు

 *ది.15-10-2023, భానువాసరే, శ్రీ శోభకృత్ నామ సంవత్సరే, దక్షినాయనే, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్ల పక్షం,* 

*తిథి:- పాడ్యమి రా.11-28 వరకు,* 

*నక్షత్రం:- చిత్ర సా.6-20 వరకు.* 


*శరన్నవరాత్రి/దేవీ నవరాత్రుల ప్రారంభం.* 

*బ్రహ్మశ్రీ గుళ్లపల్లి శివ శర్మ గారి వేదాశీర్వాదములు* 


https://youtube.com/watch?v=WU6us5ex67g&feature=shared