31, మే 2023, బుధవారం

గర్భస్రావం అవుతున్న స్త్రీల కొరకు -

 తరచుగా గర్భస్రావం అవుతున్న స్త్రీల కొరకు  - 


   కొంత మంది స్త్రీలకు తరచుగా గర్భస్రావం అవుతూ ఉంటుంది . అటువంటి స్త్రీలకు రావిచెట్టు బెరడు చూర్ణం రెండున్నర గ్రాముల మోతాదుగా వెన్న, పంచదార కలిపి రోజుకు నాలుగయిదు సార్లు ఇస్తుంటే గర్భస్రావం కాకుండా ఆగిపోతుంది 


 

 మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     

యోగవాసిష్ఠ రత్నాకరము*

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-41


ప్రమార్జితేఽ హ మిత్యస్మిన్పదే స్వయమపి ద్రుతమ్‌ 

ప్రమార్జితా భవన్త్యేతే సర్వ ఏవ దురాధయః.


ఈ అహంకారమును సమూలముగ తొలగించి వైచినచో, దుష్టమానసిక పీడలన్నియు స్వయముగనే శీఘ్రముగ తొలగిపోవును. 


1-42


దోషైర్జర్జరతాం యాతి సత్కార్యాదార్య సేవవాత్ 

వాతాన్తః పిచ్ఛలవవచ్చేతశ్చలతి చంచలమ్‌. 


మనస్సు సత్కార్యములను, మహాత్ముల సేవను విడిచి కామాది దోషముల నాశ్రయించి శక్తినిఁ గోల్పోవుచున్నది. మఱియు నెమిలిపింఛపు తుదికొన గాలిలో నూగులాడునట్లు చంచలమై చలించుచున్నది. 


1-43


ఇతశ్చేతశ్చ సువ్యగ్రం వ్యర్థమేవాభిధావతి 

దూరాద్దూరతరం దీనం గ్రామే కౌలేయకో యథా. 


గ్రామమున కుక్క అటునిటు తిరుగులాడునట్లు, కారణము లేకుండగనే మనస్సు వ్యాకులమైన దీనభావమున దూరప్రదేశములందు తిరుగులాడుచుండును.


1-44


న ప్రాప్నోతి క్వచిత్కించిత్ప్రప్తైరపి మహాధనైః 

నాన్తః సంపూర్ణతామేతి కరణ్డక ఇవామ్బుభిః.



చిత్తము ఇటునటు పర్విడినను ఎచటను ఏమియు పొందుటలేదు. మఱియు, నీటిచే రంధ్రములుగల బుట్ట నిండనట్లు, మహాధనములు సంప్రాప్తించినను ఆ చిత్తము లోన సంపూర్ణత్వము నొందుట లేదు. 


1-45


మనో మనన విక్షుబ్ధం దిశో దశ విధావతి మందరాహననోద్ధూతం క్షీరార్ణవపయో యథా.


మందరపర్వతముచే మధింపబడిన క్షీరసముద్రమందలి నీటివలె, విషయాను చింతనముచే భిన్నమైన యీ మనస్సు దశదిశలకు పరుగు లిడుచున్నది. . 


1-46


భోగదూర్వాజ్కురాకాంక్షీ శ్వభ్రపాతమచింతయన్‌ 

మనో హరిణకో బ్రహ్మన్‌ దూరం విపరిధావతి. 


మహాత్మా! భోగములను తృణముల కాంక్షించు మనస్సను లేడి గోతిలో (నరకములో) పడుటనుగూర్చి చింతింపకయే విషయములను గూర్చి దూరముగ పరువు లిడుచున్నది.


*యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-47


చేతశ్చంచలయా వృత్త్యా చిన్తానిచయచంచురమ్‌ ధృతిం బధ్నాతి నైకత్ర పంజే కేసరీ యథా.


మనస్సు చంచలవృత్తితో గూడుకొని యున్నది. అది అన్యచింతలతో మరింత చంచలమై యున్నది. కావున బోనులో నుంచఁబడిన సింహమువలె అది ఒకచోట కుదుర్కొని యుండుట లేదు. 


1-48


చేతః పతతి కార్యేషు విహగః స్వామిషే ష్వివ

క్షణేన విరతం యాతి బాలః క్రీడనకాదివ.  


పక్షులు మాంసమును జూచిన ఆకాశమునుండి దిగి దానిమీద బడునట్లు, చిత్తము విషయములపై వ్రాలుచున్నది. బాలుడు అటలు దొఱికినపుడు చదువును విడచిపెట్టునట్లు చిరాభ్యస్తములగు ధ్యానాది వ్యాపారములను ఈ మనస్సు క్షణములో విడిచి పెట్టుచున్నది. 


1-49


అప్యబ్ధిపానాన్మహతః సుమేరూన్మూలనాదపి

అపి వహ్న్యశనాత్సాధో విషయశ్చిత్తనిగ్రహః. 


ఓ సాధూ! సముద్రమును పానముచేయుటకంటెను, గొప్పదగు సుమేరు పర్వతమును పెల్లగించుటకంటెను, అగ్నిని భక్షించుటకంటెను చిత్తమును నిగ్రహించుట కష్టతరమైనది.


1-50


చిత్తం కారణమర్థానాం తస్మిన్సతి జగత్త్రయమ్‌ తస్మిన్‌క్షీణే జగత్‌క్షీణం తచ్చికిత్స్యం ప్రయత్నతః. 


సమస్త పదార్థములకును కారణము చిత్తమే అయియున్నది. అది యుండినచో ముల్లోకములు నుండును. అది క్షీణించినచో జగత్తున్ను క్షీణించును. కాబట్టి అట్టి చిత్తమును ప్రయత్నపూర్వకముగ చికిత్స చేయవలెను. (నిగ్రహించవలెను). 


1-51


చిత్తాదిమాని సుఖదుఃఖ శతాని నూన 

మభ్యాగతాన్యగవరాదివ కాననాని, 

తస్మిన్వివేకవశత స్తనుతాం ప్రయాతే 

మన్యే మునే నిపుణమేవ గలన్తి తాని.


ఓ మునీంద్రా! గొప్ప పర్వతమునుండి యరణ్యము లుద్భవించునట్లు, నిక్కముగ చిత్తమునుండియే యనేక సుఖదుఃఖము లుద్భవించుచున్నవి. మఱియు ఆ చిత్తము వివేకవశమున నెపుడు క్షీణించునో, అపుడు సుఖదుః:ఖము లన్నియు లెస్సగ క్షీణించిపోవునని నేను తలంచుచున్నాను. 


1-52


అన్తర్గ్రథితయా దేహే సర్వదుశ్ఛదయాఽ నయా 

రజ్జ్వేనాశు బలీవర్దస్తృష్ణయా వాహ్యతే జనః,


ముక్కు త్రాటిచే ఎద్దు ఈడ్వబడునట్లు, లోన మనస్సునకు కట్టబడి, త్రెంచుటకు కష్టసాధ్యమైనట్టి తృష్ణ (ఆశ) చే మనుజుడు శీఘ్రముగ నీడ్వబడుచున్నాడు.


*యోగవాసిష్ఠ రత్నాకరము*


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-53


పుత్రమిత్రకలత్రాది తృష్ణయా నిత్యకృష్టయా 

ఖగేష్వివ కిరాత్యేదం జాలం లోకేషు రచ్యతే.  


నిత్యము జనుల నాకర్షించునట్టి తృష్ణ పక్షులకొరకు కిరాతునివలె ప్రపంచమున పుత్ర, మిత్ర, భార్యా, ధనాది రూపమగు వలను జనులందు విస్తరింపజేయుచున్నది. 


1-54


ప్రయచ్ఛతి పరం జాడ్యం పరమాలోకరోధినీ 

మోహం నీహారగహనా తృష్ణా జలదమాలికా. 


మంచుతో గూడిన మేఘముల సమూహము చలిని గలిగించి, సూర్యుని గప్పి వేయునట్లు, మోహముతో గూడిన తృష్ణ అజ్ఞానమును గలిగించి, ఆత్మజ్ఞానమును గప్పివేయుచున్నది. 


1-55


లోకోఽ యమఖిలం దుఃఖం చిన్తయోజ్ఝ తయోజ్ఝతి 

తృష్ణవిషూచికామంత్రశ్చిన్తా త్యాగో హి కథ్యతే. 


చింతా త్యాగముచేతనే జనులు సమస్త దుఃఖములనుండి విడివడుచున్నారు. మఱియు అట్టి చింతాత్యాగమే తృష్ణయను విషూచికను నశింపజేయు మంత్రమని చెప్పబడినది.


1-56


రోగార్తిరంగనా తృష్ణా గంభీరమపి మానవమ్‌ 

ఉత్తానతాం నయన్త్యశు సూర్యాంశవ ఇవాంబుజమ్‌.


రోగబాధ, స్త్రీ, తృష్ణ -- ఈ మూడును గంభీరమైన (ధీరుడగు) మానవుని గూడ సూర్యకిరణములు కమలమునువలె - శీఘ్రముగ వ్యాకుల మొనర్చుచున్నవి. 


1-57


అహో బత మహచ్చిత్రం తృష్ణామపి మహాధియః దుశ్ఛేదామపి కృన్తన్తి వివేకేనామలాసినా.


ఆహా! బహుచిత్రమైన విషయము! గొప్ప బుద్ధిమంతులగు మహాత్ములు ఛేదించుటకు కష్టసాధ్యమైనట్టి ఈ తృష్ణను వివేకమను తమ నిర్మల ఖడ్గముచే ఛేదించివైచుచున్నారు! 


1-58


అపిమేరుసమం ప్రాజ్ఞమపి శూరమపి స్థిరమ్‌ తృణీకరోతి తృష్ణైకా నిమేషేణ నరోత్తనుమ్‌.


మేరువువలె గంభీరుడును, శూరుడును, స్థిరబుద్ధియుతుడును, ప్రజ్ఞావంతుడు నగు ఉత్తమ మనుజుని గూడ తృష్ణ యొక్కటియే నిమిషకాలములో తృణసమానునిగ గావించివైచుచున్నది.


*యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-59


ఆర్ద్రాంత్ర తంత్రీ గహనో వికారీ పరిపాతవాన్‌ 

దేహః స్ఫురతి సంసారే పోఽ పి దుఃఖాయ కేవలమ్‌. 


తడిసిన ప్రేగులు, నాడులచే భయంకరమైనదియు, అనేక వికారములతో గూడినదియు, క్షణభంగురము నగు దేహ మెయ్యది యీ ప్రపంచమున స్ఫురించుచున్నదో, అదియు కేవలము దుఃఖము కొరకే యగును.


1-60


తాత సంతరణౌర్థేన గృహీతాయాం పునః పునః నావిదేహలతాయాం చ కస్య స్వాదాత్మభావనా.


మునీంద్రా! సంసారమను సముద్రమును దాటుటకై మరల మరల గ్రహింపబడినటువంటి ఈ దేహమను నౌకయం దెవనికి ఆత్మ భావన యుండగలదు? (దేహము ఆత్మ (తాను) కాదనుట). 


1-61


మాంసస్నాయ్వస్థివలితే శరీరపటహేఽ దృఢే మార్జారవదహం తాత తిష్ఠామ్యత్ర గతధ్వనౌ.  


మాహాత్మా! చినిగి, డొల్లపడి, ధ్వనింపని డోలునందున్న పిల్లివలె -  నేను మాంసము, 

నరములు,ఎముకలచే నిర్మింపబడిన అదృఢ శరీరమునందున్నాను. ఇద్దానినుండి బయటపడు ఉపాయవాక్యమును వినే వీలు కలుగుటలేదు.


1-62


త్వక్సుధాలేపమసృణం యత్రసంచారచంచలమ్‌ మనః సదాఖునోత్ఖాతం నేష్టం దేహగృహం మమ. 


ఈ శరీరమను గృహము చర్మమను సున్నము పూయబడియున్నది. మఱియు యంత్రమువలె చలించుచు సంచరించుచున్నది. మనస్సను ఎలుక ఎల్లవేళల ఈ యింటికి కన్నము త్రవ్వుచున్నది. ఇట్టి శరీరమను గృహము నాకిష్టము కాదు. 


1-63


కిం శ్రియా కిం చ రాజ్యేన కిం కాయేన కిమీహితైః

దినైః కతిపయైరేవ కాలః సర్వం నికృన్తతి. 


ధనము (ఐశ్వర్యము)చే గాని, రాజ్యముచేగాని, శరీరముచే గాని, చేష్టలచే గాని, లేక మనోరథములచేగాని యేమి ప్రయోజనము? ఏలయనిన కొలది రోజులలోనే వాని నన్నింటిని కాలము త్రుంచివేయుచున్నది. 


1-64


రక్తమాంసమయస్యాప్య సబాహ్యాభ్యంతరం మునే 

నాశైక ధర్మిణో బ్రూహి కైవ కాయస్య రమ్యతా.  


మునీంద్రా! రక్తమాంసమయ మైనదియు, కేవలము నాశమే ధర్మముగా గలదియునగు ఈ శరీరముయొక్క బాహ్యాభ్యంతరములను విమర్శించి చూచి ఇందు రమ్యత్వ మేమి గలదో వచింపుడు? (ఏమియును లేదని భావము.)


*యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-65


మరణావసరే కాయా జీవం నానుపరన్తియే 

తేషు తాత కృతఘ్నేషు కైవాస్థా వద ధీమతామ్‌. 


మునీశ్వరా! చక్కగ పోషింపబడి, పెంచబడినను మరణకాలమున జీవుని అనుసరింపని యీ కృతఘ్న శరీరమునందు నమ్మక మెవరుంచుదురు? 


1-66


మత్తేభకర్ణాగ్ర చలః కాయో లమ్బాంబు భంగురః

న సంత్యజతి మాం యావత్తావదేనం త్యజామ్యహమ్‌.


మదించిన ఏనుగుయొక్క చెవియొక్క కొనలో వ్రేలాడు నీటిబొట్టువలె క్షణభంగుర మైనదియునగు ఈ శరీరము నన్ను విడిచిపోవుటకు పూర్వమే నేను 

దీనిని విడిచివైచుచున్నాను. 


1-67


భుక్త్వా పీత్వా చిరం కాలం బాలపల్లవ పేలవామ్‌ తనుతామేత్యయత్నేన వినాశమనుధావతి. 


చిరకాలము ఉత్తమ పదార్థములను భుజించినను, త్రాగినను గూడ ఈ శరీరము కోమలపత్రమువలె అప్రయత్నముగనే కృశించి వినాశము వైపునకు పరుగిడుచున్నది.


1-68


దహనైకార్థ యోగ్యాని కాయకాష్ఠాని భూరిశః సంసారాబ్దా విహోహ్యాన్తే కించిత్తేషు నరం విదుః. 


కేవలము దహనము కొఱకు యోగ్యము లైనట్టి శరీరములను కట్టెలనేకము లీ సంసారమను సముద్రమున కొట్టుకొని పోవుచున్నవి. అందొకానొక కట్టె మనుజుడని చెప్పబడుచున్నది.


1-69


బద్దాస్థా యే శరీరేషు బద్దాస్థా యే జగత్థ్సితౌ 

తన్మోహమదిరోన్మత్తాన్‌ ధిగ్‌ధిగస్తు పునః పునః. 


ఎవరు శరీరములందును, 

జగత్స్థితి

యందును అవి సత్యములని, చిరకాల ముండునవి యని విశ్వాసము గలిగియుందురో, అజ్ఞానమను కల్లుత్రాగి ఉన్మత్తులైయున్నట్టి జనులకు మరల మరల ధిక్కారమగు గాక! 


1-70


నాహం దేహస్య నో దేహో మమనాఽయమహం తథా 

ఇతి విశ్రాన్తచిత్తా యే తే మునే పురుషోత్తమాః. 


ఓ మునీంద్రా! 'జడమగు ఈ దేహము నేను కాను, నేను దానికి సంబంధించినవాడను కాను, నాకు దేహము లేదు' అని విచారించి ఆత్మయందు విశ్రాంతి నొందువారే మనుజులలో నుత్తములు.

*జేష్ఠ శుద్ధ పౌర్ణమి

 *జేష్ఠ శుద్ధ పౌర్ణమి* ని  ఈ మాసమంతటికి ప్రత్యేక రోజుగా చెప్పుకోవచ్చు.. ఈరోజును *మహా జేష్ట* అంటారు. ఈరోజు సూర్యారాధన,  సూర్య నమస్కారాలు, సూర్యుని యొక్క 

విశేష ఆరాధనకు చాలా మంచి రోజు. ఈ సంవత్సరం  ఆదివారము పౌర్ణమి కావడము, తెల్లవారుజాము వరకు జేష్ఠా నక్షత్రం ఉండడం  విశేషం..., 

 

ఇలాంటి విశేషమైనటువంటి రోజున అనంతపురము జిల్లా,  ఉరవకొండ మండలం, బూదగవి గ్రామము  నందు వెలసిన ప్రపంచంలోనే 

ఏకైక దక్షిణాభిముఖంగా ఉన్న సూర్యనారాయణ దేవాలయము నందు మాజీ Chief Screatary of Andhra pradesh అయినటువంటి  

*గౌ|| శ్రీ ఎల్వి  సుబ్రహ్మణ్యం IAS* గారి ఆధ్వర్యంలో పరమ పూజ్య *శ్రీ శ్రీ శ్రీ అర్కరిషి* మహా గురువారి అమృత హస్తాలతో  వైష్ణవ సంప్రదాయం ప్రకారం  

జేష్టాభిషేకము, అర్చన పూజ కైంకర్యాలు (*June 4th Sunday morning 6am to 10am*) జరుపబడును. కావున యావన్మంది భక్తాదులు సకాలంలో విచ్చేసి స్వామివారిని దర్శించి  తీర్థ ప్రసాదాల ను 

స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు  కావలెనని  కోరడమైనది ..



ఇట్లు ...

శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయ ఆలయ కమిటీ మరియు 

బూదగవి గ్రామ ప్రజలు..

*ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 76*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 76*


యుద్ధానికి సంబంధించిన ఆందోళనలేవీ లేకుండా నందులు, జీవసిద్ధి, భద్రభట, బాగురాయణాదులు తాపీగా ప్రశాంతంగా ఫలహారాలు ఆరగిస్తున్నారు. రాక్షసామాత్యుని అడుగుల చప్పుడు విని కొందరు తలెత్తి చూసి మరల పలహారాలు ఆరగించడంలో మునిగిపోయారేగానీ అతని రాకరు పట్టించుకున్న వాళ్లు, పలకరించిన వాళ్లు లేరు. 


రాక్షసునికి చాలా బాధ కలిగింది. ఆ అవమానంతో తల కొట్టేసినట్లయ్యింది. ఇదివరకు రాక్షసుడు కనిపిస్తే చాలు, నందులు లేచి ఎదురు వెళ్లి పలకరించి గౌరవించే వాళ్ళు. మరి యిప్పుడో... ?


'వెనక్కి తిరిగి వెళ్లిపోదామా ?' అనుకున్నాడు రాక్షసుడు. కానీ మహాపద్మనందుడికి తాను ఇచ్చిన మాటజ్ఞప్తికి వచ్చీ, తానే రాజ్యానికి ప్రధానామాత్యుడు అవడం చేతనూ, ఆ అవమానాన్ని బలవంతంగా గొంతులో దిగమింగుకుంటూ ఖాళీగా ఉన్న ఆసనం మీద చతికిల పడ్డాడు. 


జీవసిద్ధి పలహారాన్ని ముగించి తలెత్తి చూస్తూ 

"ఆ ! వచ్చారా రాక్షసామాత్యా ! మీ కోసమే ఎదురుచూస్తున్నాము" అని నవ్వి "చంద్రగుప్త మౌర్యుడు రణభేరి మ్రోగిస్తూ హెచ్చరిక లేఖ పంపించాడు... మగధ సామ్రాజ్యం తన తండ్రి మహానందుల వారిదట... వారసత్వంగా తనకి సంక్రమిస్తుందట... నందుల మీద బుడతడు యుద్ధం ప్రకటించాడు ... యుద్ధం ..." అని ఫక్కున పగలబడి నవ్వాడు. అందరూ అతని నవ్వుతో శృతి కలిపారు. 


వాళ్ల ప్రవర్తన రాక్షసునికి చిర్రేత్తించింది. అయినా సమయం కాదు కనుక మౌనం వీడలేదు. జీవసిద్ధి మందహాసం చేసి "బూ బుడతడి తోడుగా ఇద్దరు మహాబలులు తరలివస్తున్నారట... ఒకడు అలెగ్జాండర్ దెబ్బకి దుంపనాశనమైపోయిన పురుషోత్తముడట ... మరొకడు, ఒకప్పుడు నందుల దాటికి తాళలేక తోకముడిచి స్నేహం చేసుకున్న కృతఘ్నుడు పర్వతకుడట ... ఆ ! రానివ్వండి చూద్దాం ..." అన్నాడు వ్యంగంగా. మళ్లీ అందరూ నవ్వారు. 


రాక్షసుడు అగ్రహాన్ని లోలోపలే అణచుకుంటూ "ఇప్పుడైనా మనం యుద్ధ సన్నాహాలు చేసుకోవాలి. మగధకి నలువైపులా వున్న మన సామంత దుర్గాధీశులకు ఇక్కడి నుంచి అదనపు బలగాలు పంపించి, శత్రువులు మగధపొలిమేరల్లో అడుగుపెట్టగానే, అక్కడే..." అంటున్నాడు. 


"ఎందుకూ, డబ్బు దండగ..." మధ్యలో అడ్డుపడ్డాడు జీవసిద్ధి. 


రాక్షసుడు ఆగ్రహంతో అతడివైపు కొరకొర చూసాడు. 


జీవసిద్ధి చాలా నిర్లక్ష్యంగా "మగధకి నాలుగు దిక్కుల నుంచీ మార్గాలున్నాయి. శత్రువులు ఏ మార్గాన్ని అనుసరిస్తారో మనకు తెలియదు. మన దగ్గరున్న సైనిక బలగాలను నాలుగువైపులకీ తలా కాస్త పంపించి పాటలీపుత్రాన్ని బలహీనపర్చుకుంటామా ? పైగా ఇలా బలగాలను అటూ ఇటూ తరలించడానికి బోలెడంత డబ్బు ఖర్చు..." అన్నాడు. 


రాక్షసుడు ఉక్రోషంగా చూస్తూ "అందుకని .... ?" ప్రశ్నించాడు. 


జీవసిద్ధి ఏమాత్రం తొణక్కుండా శత్రువుల లక్ష్యం పాటలీపుత్రం. వాళ్ళు ఏ మార్గంలో వచ్చినా ఇక్కడికే వస్తారు. కనుక మన బలగాలన్నీ ఇక్కడే వుంచుతాం. ఇక్కడే శత్రువుల మీది దాడి చేస్తాం. ఇందువల్ల డబ్బు, ఖర్చు తగ్గుతుందని, అందువలన బలగాలని అటూ ఇటూ తిప్పాల్సిన అవసరం ఉండదని... ప్రభువులూ, మంత్రులూ, సేనానులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. మేమూ సరెనన్నాం ... " అని చెప్పాడు. 


"అవును. ఈ వ్యూహమే మాకూ నచ్చింది. దీనినే ఆమోదిస్తున్నాం. ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం" అని చెప్పి లేచి, తమ్ముళ్ళతో కలిసి వెళ్లిపోయాడు సుకల్పనందుడు. జీవసిద్ధి వాళ్ళని అనుసరించాడు. మంత్రులు, సేనానులు ఎవరి దారిన వాళ్ళు జారుకున్నారు. 


రాక్షసుడొక్కడే....  ఒంటరిగా మిగిలిపోయాడు వ్యధతో. అవమానంతో... 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఈ రోజు పద్యము

 176వ రోజు: (సౌమ్య వారము) 31-05-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


నిన్ను తిట్టినట్టి నీ శత్రులకెపుడు

భయము పడగ వద్దు బ్రతుకునందు 

నిన్ను మెచ్చుహితుల నెప్పుడు కనిపెట్టు 

తెలిసి మెలగ మేలు తెలుగు బాల


బ్రతుకులో ఎవరైన నిన్ను ఏ విషయములోనైనా తిట్టిన (కోపగించుకొనిన) వారిని శత్రువులుగ చూసి వారికి భయపడి వారి నుంచి దూరముగా వెడలవలదు. నిన్ను మెచ్చు హితులకు ఎప్పుడు దగ్గరగా ఉంటూ వారు నీయందు చూపిన కోపతాపాలు, రాగద్వషాలను అవగాహన చేసికొని తగిన సంయమనముతో జీవితం సాగించవలెను. 

 

ఈ రోజు పదము. 

ఒంటె (Camel): అధ్వగము, ఉష్ట్రము, ఒంటియ, కంటకభక్షకము, కంఠాలము, క్రమేలకము, జాంఘికము, దాసేరము, దీర్ఘజంఘము, ధూమ్రశూకము, మహాంగము, లొట్టిపిట్ట, వాసంతము, స్థూలి.

జకారా: పంచ దుర్లభా

 జామాతా, జఠరం, జాయా, జాతవేదా,  జలాశయ:

పూరితేనైవ పూర్యన్తే జకారా: పంచ దుర్లభా:|| (దుర్భరా)


లోకములో తృప్తి అనేది వేటికి  వుండదు? అని ఆలోచించి ఒక కవి యిలా అన్నాడు... 


ఈ లోకం లో ఐదు 'జ' కారాలున్నాయి. వాటికి ఎంత చేసినా తృప్తి అనేది వుండదు. అవి ఏమిటంటే... 


(1) 'జామాతా' అంటే అల్లుడు. ఎంత యిచ్చినా చాలు అని అనని వాడు.

(2) 'జఠరం' అంటే కడుపు. దీనికీ అంతే ఎంత తిన్నా మరునాటికి మామూలే.

(3) 'జాయా' అంటే భార్య. ఈవిడ కూడా అంతే. ఎంత మంచిగా ఉన్నా ఎప్పుడూ కోపమే.

(4) 'జాతవేదా' అంటే అగ్ని. ఎన్ని వస్తువులు వేసినా కాలిపోతూ వుంటాయి.

(5) 'జలాశయ' అంటే సముద్రము. ఎంతనీరు వచ్చిపడినా తృప్తి లేదు.

ఈఐదు 'జ' కారాలనూ తృప్తి పరచటం కష్టం.

శాశ్వతమైన జఠరాలు. అసంతృప్తి తప్ప, తృప్తి అనేదే ఉండదు.

                                 *సేకరణ*

*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

నిర్జల ఏకాదశి

 నిర్జల ఏకాదశి 


నిర్జల ఏకాదశిని జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున జరుపుకుంటారు. 

 ఏడాది కాలంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయని మనకు తెలుసు. వీటిలో నిర్జల ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది.


నిర్జల ఏకాదశి దివ్యమైన ఏకాదశి. భీమసేనుడు ఈరోజున ఉపవాసం ఉన్నందున దీనిని భీమసేని ఏకాదశి అని కూడా అంటారు. నిర్జల ఏకాదశి ఒక్క రోజు ఉపవాసం చేయడం వల్ల సంవత్సరంలోని అన్ని ఏకాదశులకు ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుందని నమ్ముతారు. ఈరోజు సూర్యోదయం నుంచి ద్వాదశి సూర్యోదయం వరకు నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయాల్సి ఉంటుంది. అందుకే దీనిని నిర్జల (జలం కూడా స్వీకరించని) ఏకాదశి అంటారు. విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఈ ఉపవాసం చేయాలి. నిర్జల ఏకాదశి ఉపవాసం ఆచరిస్తే మానవ జన్మకు మోక్షం లభిస్తుందని విశ్వాసం.

సంవత్సరంలో 24 ఏకాదశులకూ ఉపవాసం చేయలేని వారు ఈ ఒక్క నిర్జల ఏకాదశి రోజూ నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు.

ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. విష్ణు సహస్ర నామం, అష్టోత్తర శతనామావళి వంటివి పారాయణం చేయాలి. నిర్జల ఏకాదశి రోజున చేసే దానధర్మాలు విష్ణుమూర్తి కృపాకటాక్షాలకు పాత్రులవుతారు. నిర్జల ఏకాదశి ఉపవాసం సకల పాపాల నుంచి విముక్తి కలిగిస్తుంది.

ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. విష్ణు సహస్ర నామం, అష్టోత్తర శతనామావళి వంటివి పారాయణం చేయాలి. నిర్జల ఏకాదశి రోజున చేసే దానధర్మాలు విష్ణుమూర్తి కృపాకటాక్షాలకు పాత్రులవుతారు. నిర్జల ఏకాదశి ఉపవాసం సకల పాపాల నుంచి విముక్తి కలిగిస్తుంది.


నిర్జల ఏకాదశిని పాండవ భీమ ఏకాదశి లేదా పాండవ నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. హిందూ ఇతిహాసం మహాభారతం ఐదుగురు పాండవ సోదరులలో రెండవ మరియు బలమైన భీముడు నుండి ఈ పేరు వచ్చింది . బ్రహ్మ వైవర్త పురాణం నిర్జల ఏకాదశి వ్రత ప్రతిజ్ఞ వెనుక కథను వివరిస్తుంది . భోజన ప్రియుడైన భీముడు అన్ని ఏకాదశి ఉపవాసాలను ఆచరించాలనుకున్నాడు, కానీ తన ఆకలిని అదుపు చేసుకోలేకపోయాడు. అతను మహాభారత రచయిత అయిన వ్యాస ఋషిని సంప్రదించాడు మరియు పరిష్కారం కోసం పాండవుల తాత. నిర్జల ఏకాదశిని ఆచరించమని, సంవత్సరంలో ఒకరోజు సంపూర్ణ ఉపవాసం పాటించాలని ఋషి సలహా ఇచ్చాడు. భీముడు నిర్జల ఏకాదశిని ఆచరించడం ద్వారా మొత్తం 24 ఏకాదశుల పుణ్యాన్ని పొందాడు. 

నిర్జల ఏకాదశి నాడు, నీరు కూడా తీసుకోకుండా సంపూర్ణ ఉపవాసం పాటించబడుతుంది. వేడి భారతీయ వేసవిలో రోజు వస్తుంది కాబట్టి నీరు-తక్కువ ఉపవాసం అనుసరించడం చాలా కష్టంగా పరిగణించబడుతుంది మరియు అందువల్ల ఇది చాలా పవిత్రమైన కాఠిన్యంగా పరిగణించబడుతుంది. 


మార్కండేయపురాణం మరియు విష్ణు పురాణం ప్రకారం , ఏకాదశి రోజు విష్ణు స్వరూపం. ఈ రోజున చేసే వ్రతం అన్ని పాపాలను పోగొడుతుందని చెబుతారు. నిర్జల ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసిన వ్యక్తి విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందాలని పేర్కొనబడ్డాడు, అతను అతనికి సంతోషం, శ్రేయస్సు మరియు పాప క్షమాపణలను ప్రసాదిస్తాడు. భక్తుడు సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశిలను ఆచరించడం ద్వారా పొందిన పుణ్యాన్ని పొందుతాడని వివరించబడింది.

పిల్లాడి రుద్రయ్య

సీరికిన్_జెప్పడు

 #సీరికిన్_జెప్పడు....

       అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహిపాహి యనగుయ్యాలించి సంరంభియై!!

   

ఎక్కడో వైకుంఠపురం లోపల వున్నాడు. బయట సనక సనందనాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు – ఆయన ధనుస్సు, కౌమోదకి అనబడే గద – అన్నీ పురుషాకృతులలో బయట ఎదురు చూస్తున్నారు.


ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరం. దాని ప్రక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడిన పర్యంకము మీద అంతా అలంకారం చేయబడి పరచబడిన అరవిరిసిన కలువపువ్వులు, ఆ పువ్వుల మధ్యలో పడుకున్న లక్ష్మీ దేవి. ఆ లక్ష్మీదేవి ప్రక్కన కూర్చుని, ఆవిడ పైట కొంగును చేతితో పట్టుకొని వేళ్ళకు చుట్టుకొని చంటి పిల్లవానిలా ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు.


అలాంటి స్థితిలో ఉన్నా సరే తనని ఎవరయినా పిలిస్తే ఒక్కసారి మనఃస్ఫూర్తిగా పిలిస్తే పరుగెత్తుకు వచ్చే లక్షణము ఉన్నవాడు, ఏనుగు తనను రక్షించమణి దీనముగా ప్రార్థించేసరికి శరణాగతి చేసి దాని దురవస్థను గమనించాడు.


సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే పరివారంబును జీర డభ్రగపతిం

బన్నింప డాకర్ణికాంతర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు

గజ ప్రాణావనోత్సాహియై!!


లక్ష్మీదేవికి చెప్పలేదు. చెప్పకుండా పమిట కొంగు పట్టుకుని అలాగే వెళ్ళిపోతున్నాడు. శంఖము, చక్రము, గద, పద్మము ఇవేమీ లేవు. నాలుగు చేతులు ఖాళీగా ఉన్నాయి. వెనక వస్తున్న పరివారంతో ఒకమాట మాట్లాడడు. తనను అధిరోహించమని గరుత్మంతుడు ఎదురువస్తున్నాడు. ఆయనని తోసి అవతల పారేస్తున్నాడు. ఆయనవి పెద్ద పెద్ద కళ్ళు. జుట్టు ఆ కళ్ళమీద పడిపోతోంది. ఆజుట్టును వెనక్కి తోసుకోవడం కానీ వెనక్కి సర్దుకోవడం కానీ చేయడం లేదు.’


అయ్యయ్యో! అలా పమిట పట్టుకు వెళ్ళిపోతున్నారేమిటి – వదలండి’ అని వెనుకనుండి లక్ష్మీదేవి అంటోంది. కానీ ఆయన ఆమె మాట వినిపించుకోవడం లేదు. ఆ ఏనుగు ప్రాణములు రక్షించడం కోసమని ఆయన అలా వెళుతున్నాడు. ఒక్కనాడు పూజ చేయని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమమునకు స్వామి లొంగిపోయాడు. స్వామి ఎంత సౌజన్యమూర్తియో కదా!


తన వెంటన్ సిరి, లచ్చివెంటనవరోధ వ్రాతమున్, దానివెన్కను బక్షీంద్రుడు,

వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చక్రనికాయంబును,

నారదుండు, ధ్వజినీ కాంతుండు,

రావచ్చి రొయ్యన వైకుంఠ పురంబునం

గలుగువా రాబాల గోపాలమున్!!


ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. పచ్చని పట్టు పీతాంబరం కట్టుకుని అమ్మవారి కొంగు పట్టుకొని వెళ్ళిపోతుంటే, ఆవిడ తన కొంగును రెండు చేతులతో పట్టుకుని ఆయన వెనుక ఆవిడ గబగబా వెళ్ళిపోతుంటే ఆవిడ వెనుక అంతఃపుర కాంతలు అందరూ పరుగెడుతున్నారు. ఆ వెనుక గరుడ వాహనం పరుగెడుతోంది. శంఖము, చక్రము, కౌమదకి, శార్ఙ్గమనే ధనుస్సు, బాణములు పెట్టుకునే తూణీరము, ఇవన్నీ కూడా ఆయన వెనుక పురుష రూపమును దాల్చి పరుగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి.


విష్వక్సేనుడు, నారదుడు వచ్చేస్తున్నారు. ఆ వైకుంఠములో ఉన్న పిల్లవాని దగ్గరనుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఆకాశంలో వచ్చేస్తున్నారు.


వాళ్ళు అమ్మవారి దగ్గరకు వెళ్ళి ‘అమ్మా! ఆయన సంగతి నీకు తెలుస్తుంది కదా! అసలు ఆయన ఎక్కడికి వెళుతున్నాడు? అలా ఇంతకు పూర్వం ఎప్పుడయినా వెళ్ళాడా?’ అని అడిగారు.


అపుడు అమ్మవారు –‘ఆయన అలా వెళ్ళిపోతున్నారు అంటే ఎవరో ఖలులు వేద ప్రపంచమును సోమకుడు తస్కరించినట్లు తస్కరించి ఉండవచ్చు. లేకపోతే ఏదయినా సభలలో ఆర్తి చెందిన కాంతలు గోవిందా అని ప్రార్థన చేస్తే వెడతారు. చిన్న పిల్లలను పట్టుకుని ఏదిరా పరమాత్మ ఎక్కడ ఉన్నాడో చూపించమని పెద్దవాళ్ళు ధిక్కరిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలను రక్షించడానికి వెడుతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి సందర్భములు ఏమైనా వచ్చినవేమో! అందుకని అలా స్వామి పరుగెడుతున్నారు’ అంది.


అడిగెదనని కడువడి జానూ,

నడిగిన దన మగుడ నుడువడని నడ యుడుగున్

వెడ వెడ సిడి ముడి తడబడ, నడు గిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!!


అలా వెడుతున్న అయ్యవారి కాళ్ళల్లో అమ్మవారి కాళ్ళు పడిపోతూ, ఈ అడుగుతున్నా వాళ్ళ మాటలకు జవాబులు చెప్పలేక, అమ్మవారి అడుగులు తడబడుతూ, అయ్యవారి వెనకాతల నడిచింది. అలా వెళ్ళిపోతుంటే చెవులకు పెట్టుకున్న తాటంకములు ఊగుతున్నాయి. అవి అమ్మవారి ఎర్రటి చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి.


ఇంతలో దేవలోకములలో ఉన్నవాళ్ళు, మనుష్య లోకంలో ఉన్నవాళ్ళు ఏమిటో ఇంత వెలుతురుగా ఉన్నదేమిటని ఆకాశం వంక చూశారు. ఒక్కసారి ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడి పోయారు. తపస్సులు చేస్తే కనపడని వాడు ఈవేళ ఇలా వెళ్ళిపోతున్నాడు చూడండి చూడండి అని చూపిస్తున్నారు. జనులందరూ అలా వెళ్ళిపోతున్న వారిని చూస్తూ ‘నమో నారాయణా’ అంటూ నమస్కారములు చేస్తూ నిలబడ్డారు.


కానీ పరమాత్మ మాత్రం తొందరగా వెళ్ళి ఏనుగుని రక్షించాలని గబగబా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరకు వెళ్ళి నిలబడి సుదర్శన చక్రమును పిలిచి, వెళ్ళి ఆ మొసలి కుత్తుకను కత్తిరించమని చెప్పాడు. వెంటనే సుదర్శన చక్రం నీళ్ళలో పడింది. గుభిల్లుమని శబ్దం వచ్చింది. సుదర్శన చక్రం మొసలి కుత్తుకను కత్తిరించేసింది. సుదర్శన చక్రం మొసలి తలకాయను కోస్తుంటే మకరము అనే పేరు గలవి అన్నీ మిక్కిలి భయపడ్డాయి.


మకర రాశి సూర్యుని చాటుకు వెళ్ళి నక్కింది. నవ నిధులలో ఒక నిదియైన మకర నిధి భయపడిపోయి కుబేరుని చాటుకు వెళ్ళి దాగుంది. మొసలి అని పేరున్న ప్రతి మొసలి కూడా భయపడి అవి ఆదికూర్మం చాటుకు వెళ్ళి దాక్కున్నాయి.


ఎప్పుడయితే సుదర్శనం మొసలి కుత్తుకను కత్తిరించి స్వామి చేతిని అలంకరించిందో ఆ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుని నావాడన్న వాడు, ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈయన ఒక్కడే. మిగిలినవి అన్నీ కృతకములే అని తెలుసుకుంది. అలా తెలుసుకున్నదై కాలు నొకసారి విదుల్చుకొని మెల్లగా ఒక తామరపువ్వును తీసుకుని మెల్లగా అడుగులు వేస్తూ గట్టెక్కుతోంది. గజరాజు బ్రతికేశాడని కబురు వెళ్ళింది. అంతే మరల అందరూ వచ్చేశారు.


ఒక తామర పువ్వును తీసుకు వెళ్ళి శ్రీమన్నారాయణుడి పాదముల మీద పెట్టి కుంభస్థలమును వంచి నమస్కరించింది. దానిలో ఉన్న జ్యోతి బయలు దేరి శంఖచక్రగదాపద్మములతో శ్రీమన్నారాయణుని రూపమును పొంది ఆయన పక్కన వైకుంఠమునకు వెళ్ళిపోయింది. మొసలి చనిపోయినపుడు ఒక గంధర్వుడు బయటికి వచ్చాడు. ఆ గంధర్వుడు గంధర్వ లోకమునకు వెళ్ళాడు.


ఆ ఏనుగుకు అంత పుణ్యం ఎలా వచ్చిందో చెప్పమని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగాడు. అపుడు శుకుడు ఇలా చెప్పాడు.


ఒకనాడు ఇంద్రద్యుమ్న మహారాజు గారు ద్రవిడ దేశమును పరిపాలించేవాడు. అష్టాక్షరీ మంత్రోపదేశమును పొంది అంతఃపురంలో అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదని ఊరికి చివరగా ఉన్న పర్వత శిఖరం మీద కూర్చుని అష్టాక్షరీ మంత్రం ఉపాసన చేద్దామని అక్కడికి వచ్చి మంత్రజపం చేస్తున్నాడు. అక్కడికి అగస్త్య మహర్షి వచ్చారు. తాను మంత్రజపం చేసుకుంటున్నాడు కదా అని రాజు లేవలేదు, పూజించలేదు. అగస్త్య మహర్షికి ఆగ్రహం వచ్చి మంత్రజలములను తీసి నీవు తమో గుణముతో ప్రవర్తించావు కాబట్టి ఏనుగు యోని యందు జన్మించెదవు గాక అని శపించారు.


అగస్త్యునికి పూజ చేసి వుంటే ఆ జన్మలోనే మోక్షం పొంది ఉండేవాడు. మహా పురుషులయిన వారు మీ యింటికి ఏనాడు వస్తారో ఆనాడు మీపూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి. అందుకని ఈనాడు ఏనుగుగా పుట్టి గతజన్మలో చేసిన మంత్రానుష్టాన ప్రభావం వలన ఈ జన్మలో ప్రాణం పోయేటప్పుడు శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు. కాబట్టి ఒంట్లో ఓపిక వుండగా పుణ్యం చేసి నామం చెప్పుకోవడం నేర్చుకోవాలి.


మొసలి లోంచి వచ్చిన గంధర్వుని పేరు ‘హూహూ’. ఆయన ఒకనాడు గంధర్వ కాంతలతో కలిసి నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు. మద్యపానం చేసి ఉన్నాడు. పక్కన అప్సరసలు ఉన్నారు. మదోన్మత్తుడై ఉన్నాడు. అదేసమయంలో దేవల మహర్షి వచ్చి స్నానం చేస్తున్నారు. ఆయన తపస్వి. ఉరః పంజరం బయటకు వచ్చేసి బక్క చిక్కిపోయి ఉన్నాడు.


అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాను కదా – హాస్యం ఆడితే వాళ్ళు నవ్వుతారనుకుని – మహర్షిని చూసి హాస్యం ఆడాడు. వాళ్ళని బాగా సంతోష పెడదామని నీటి కిందనుండి ఈదుతూ వచ్చి దేవల మహర్షి కాళ్ళు పట్టి లాగేశాడు. ఆయన అర్ఘ్యం ఇస్తూ నీళ్ళలో పడిపోయారు. పడిపోయి లేచి అన్నారు ‘నీకు నీటి అడుగునుండి వచ్చి కాళ్ళు పట్టి లాగడం చాలా సంతోషంగా ఉన్నది కనుక, నీళ్ళ అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటు వున్న మొసలివై జన్మించెదవు గాక’ అని శపించారు.


మహాత్ముల జోలికి వెళితే అలాంటివే వస్తాయి. కాబట్టి మొసలి అయి పుట్టాడు. ఈ జన్మలో శ్రీమన్నారాయణుని చక్రధారల చేత కంఠం తెగిపోయింది. మోక్షము రాలేదు. శాపవిమోచనం మాత్రమే అయింది. అందువలన గంధర్వుడై గంధర్వ లోకమునకు వెళ్ళిపోయాడు.


ఇప్పటివరకు భాగవతములో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు. ఒక్క గజేంద్రమోక్షం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ గజేంద్రమోక్షమును చెప్పి ఒడ్డున నిలబడిన శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పారు –‘ఎవరయితే ఈ గజేంద్ర మోక్షణమనే కథను శ్రద్ధగా వింటున్నారో, లేదా చేతులు ఒగ్గి నమస్కరిస్తూ ఈ స్వామి కథను వింటున్నారో అటువంటి వారికి దుస్స్వప్నముల వలన వచ్చే బాధలు పోతాయి. రోగములు పరిహరింపబడతాయి. దరిద్రము తొలగిపోతుంది. ఐశ్వర్యము కలిసివస్తుంది. గ్రహదోషముల వలన కలిగే పీడలు తొలగిపోతాయి. అపారమయిన సుఖము కలిగి మనశ్శాంతితో ఉంటారు. ఇంట్లో అస్తమాను మంగళ తోరణం కట్టి శుభకార్యములు చేస్తూనే ఉంటారు. అందునా విశేషించి గొప్ప గొప్ప వ్రతములు ఏమయినా చేసిన పిమ్మట గజేంద్ర మోక్షమును వినడం ద్విగుణీకృతమయిన పుణ్యం.


ప్రతిరోజూ ఏ కోరికా లేకుండా ఈ పద్యములను అలా చెప్పుకునే అలవాటు వున్న బ్రాహ్మణుడు ఎవడు ఉన్నాడో అటువంటి బ్రాహ్మణుడు అంత్యకాలము నందు యమదర్శనము చేయడు. అతను శ్రీమన్నారాయణుని  దర్శనమును పొంది ఆయన విమానంలో వైకుంఠమును చేరుకుని మోక్షమును పొందుతాడు అని శ్రీమన్నారాయణుడే స్వయంగా ఫలశ్రుతిని చెప్పారు..

దుర్మార్గునకు ఒళ్లంతా విషముండును.

 .

                _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*వృశ్చికస్య విషం పుచ్చం* 

*మక్షికస్య విషం శిరః!*

*తక్షకస్య విషం దంష్ట్రాం* 

*సర్వాంగం దుర్జనే విషం!!*



తా𝕝𝕝

తేలునకు విషము కొండిలోనూ, ఈగకు తలలోనూ, పామునకు కోరలందును విషముండును. కానీ దుర్మార్గునకు ఒళ్లంతా విషముండును.

సముద్ర లంఘన సందేశం:*

 *హనుమ…*


     *సముద్ర లంఘన సందేశం:*

🔥🔥🔥🔥🔥🔥🔥


*రామాయణంలో - అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ఘట్టాల్లో ఒకటి ఆంజనేయుడి సముద్ర లంఘనం.* 


*సీతాన్వేషణలో భాగంగా అంగదుడి నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు మొదలైనవారు దక్షిణ దిశకు వెళ్తారు.*

*మారుతి మీదున్న నమ్మకంతో తన గుర్తుగా సీతకు ఇవ్వమని చెప్పి అంగుళీయకాన్ని హనుమంతుడికి ఇస్తాడు రాముడు.* 


*జంబుద్వీపం దక్షిణ కొసకు చేరుకున్న వానర సైన్యానికి విశాలమైన సముద్రం ఎదురైంది, దాంతో లంకను చేరుకోలేమేమో అన్న సందేహం ఏర్పడింది.*


*చివరికి సంపాతి సాయంతో లంకా ద్వీపం జాడ తెలుసుకుంటారు, అయితే శతయోజన పర్యంతం విస్తరించిన సముద్రాన్ని ఎలా దాటాలి? వానరులు, జాంబవంతుడు అంతా తమ అశక్తతను వెల్లడిస్తారు.*

 

*అంగదుడు నాయకుడు కాబట్టి అతను వెళ్లకూడదు, దాంతో మిగిలిన ఒకే ఒక్కడు హనుమంతుడికి అతని బలం గురించి జాంబవంతుడు గుర్తుచేస్తాడు.*


*అలా సముద్రాన్ని ఆకాశమార్గంలో దాటడానికి సిద్ధమవుతాడు మారుతి. ఇలా ఉంటే నిత్యజీవితంలో తలపెట్టే     ఏకార్యమైనా సరే ఆటంకాలు లేకుండా కొనసాగుతుంది అనుకోవద్దు...*

 

*కష్టాలను దాటుకొని సాధించిన దానినే గెలుపుగా పరిగణిస్తారు, ఆంజనేయుడికి కూడా సముద్ర లంఘనంలో అయిదు ఆటంకాలు ఎదురయ్యాయి.*❓️


*1. మొదటిది విశాలమైన సముద్రాన్ని దాటడం!*


*జాంబవంతుడి ప్రోత్సాహం మేరకు మహేంద్రగిరి మీదినుంచి ఆకాశంలోకి ఎగిరినప్పుడే మొదటి ఆటంకాన్ని దాదాపుగా అధిగమించినట్లయింది.*


*2. ఆకాశంలో విష్ణుచక్రంలా దూసుకుపోతున్న హనుమంతుడికి మైనాకుడు అనే🌻 పర్వతం రూపంలో రెండో ఆటంకం ఏర్పడుతుంది.*


*మారుతిని అడ్డగించిన మైనాకుడు తన ఆతిథ్యం స్వీకరించమంటాడు. అయితే హనుమంతుడు తాను రామకార్యం మీద లంకకు వెళ్తున్నానని, మధ్యలో ఆగనని చెబుతాడు. లక్ష్యంపట్ల ఆంజనేయుడికి ఉన్న చిత్తశుద్ధికి మైనాకుడు సంతోషిస్తాడు. అలా మంచిదే అయినప్పటికీ ప్రయాణంలో ఆలస్యానికి❓️ కారణమయ్యే రెండో ఆటంకాన్ని దాటుతాడు.*


*3. ఆ తర్వాత దేవతలు మరో పరీక్ష పెడతారు.*

*హనుమను అడ్డగించమని నాగమాత సురసను అడుగుతారు. దాంతో మారుతి గమనానికి అడ్డుపడుతుంది సురస. తనకు ఆహారం కాకుండా ఎవ్వరూ తననుంచి తప్పించుకోలేరని అంటుంది.*

*తాను సీతాన్వేషణలో ఉన్నానని, విషయం రాముడికి చేరవేసిన తర్వాత స్వయంగా ఆహారం అవుతానంటాడు. ఆమె ఒప్పుకోదు, దాంతో హనుమంతుడు తన దేహాన్ని విపరీతంగా పెంచుతాడు.*


*సురస కూడా తన నోటిని పెంచుతూపోయింది. ఇంతలో హనుమ తన దేహాన్ని సూక్ష్మంగా చేసుకొని సురస నోటిలోకి ప్రవేశించి, వెంటనే బయటికి వస్తాడు. మారుతి తెలివికి ఆశ్చర్యపడిన సురస అతని కార్యం సఫలమవుతుందని దీవిస్తుంది. అలా తెలివితో మూడో ఆటంకాన్నీ అధిగమిస్తాడు ఆంజనేయుడు.*


*4. ఇంతలో సింహిక రూపంలో నాలుగో ఆటంకం ఎదురవుతుంది, ఆమె ఛాయాగ్రాహి, ఆకాశంలో ఎగురుతున్న జీవుల నీడను పసిగట్టి వాటిని తన నోట్లోకి లాక్కుంటుంది.*

*హనుమంతుణ్నీ అలానే చేయబోతుంది, అయితే ఆయన తన శరీరాన్ని పెంచుతూ పోయి సింహిక ఆయువుపట్టును గుర్తిస్తాడు. ఆమె నోట్లో ప్రవేశించి ఆయువుపట్టును బద్దలుకొట్టి బయటికి వస్తాడు.*

*తన ప్రాణాలకే ప్రమాదంగా పరిణమించిన సింహికను పూర్తిగా మట్టుపెడతాడు మారుతి.* 


*5. సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకున్న వాయుపుత్రుడికి లంకిణి రూపంలో అయిదో ఆటంకం అడ్డుపడుతుంది. లంకిణిని ఒక్క పిడిగుద్దుతో అడ్డు తొలగించుకొని హనుమ లంకా నగరంలోకి ప్రవేశిస్తాడు. దాంతో రావణుడికి అంతిమ ఘడియలు సమీపిస్తాయి...*


*బాలుడిగా ఉన్నప్పుడే సూర్యుడిని అందుకునేందుకు ఆకాశానికి ఎగిరాడు హనుమ.*

*అలాంటిది శ్రీరామచంద్రుడి ముద్రిక దగ్గర ఉంచుకొని సముద్రాన్ని దాటి, లంకకు చేరుకోవడం ఆశ్చర్యం కలిగించే అంశం కాదంటాడు తులసీదాసు హనుమాన్‌ చాలీసాలో.*


*దీనినే…*

 *‘ప్రభు ముద్రికా మేలి ముఖ మాహి/ జలధి లాంఘి గయే అచరజ నాహి’ అని అక్షరీకరించాడు.*


*కార్యసాధనలో మనం కూడా తెలివి, ధైర్యం, నిశితమైన పరిశీలన, బలం, నేర్పుతో ఆంజనేయుడిలా ఆటంకాలను అధిగమించాలన్న సందేశం ఇస్తుంది సముద్ర లంఘన ఘట్టం...*


*⭐సర్వేజనాసుఖినోభవంతు ⭐*