30, జూన్ 2020, మంగళవారం

కృష్ణ నామం

కృష్ణనామం శతకోటి జన్మల పాపాలను సైతం హరించివేస్తుందని పురాణాల్లో చెప్పబడింది. ధర్మాచరణ దుర్లభామయిన ఈ కలి యుగంలో, కేవలం ఒక్క దైవనామస్మరణ మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తుందని చెప్పబడింది. తన అవతారం చాలిస్తున్నప్పుడు, శ్రీ కృష్ణ పరమాత్మ తన-దివ్య తేజస్సును, శక్తులను శ్రీమద్భాగవతములో ప్రవేశింప చేసి, " నేను ఈ భాగవతంలోనే నివసిస్తుంటాను." అని అభయమిచ్చారు.

విష్ణుగాధా శ్రవణముచే పరీక్షిత్తు, కీర్తనచే శుకుడు, స్మరణచే ప్రహ్లాదుడు, పాద సేవచే లక్ష్మిదేవి, పూజలచే పృధు చక్రవర్తి, అభివందనముచే అక్రూరుడు, దాస్యముచే హనుమంతుడు, సఖ్యముచే అర్జునుడు సర్వస్వమూ ఆత్మ సమర్పణము చేసి బలిచక్రవర్తి, ఈ నవ విధ భక్తులచే క్రుతార్దులయినారు. శ్రీ కృష్ణ భక్తి అంత గొప్పది.

ఎన్నో పాపాలు చేసిన 'అజామిళుడు' చివరి క్షణం లో 'నారాయణా!' అని యధాలాపంగా తన కొడుకుని పిలచి, శాశ్వత వైకుంఠప్రాప్తి పొందాడు. ఈ కధ 'భాగవతం' లోని షష్ఠ స్కందం లో ఉంది.

'ఎన్నో పాపాలు చేసిన యితడు వైకుంటానికి ఎలా వస్తాడు? పైగా యితడు పిలచినది తన కొడుకునే గానీ, శ్రీమన్నారాయణుడిని కాదు!' అన్న యమ దూతలతో, విష్ణు దూతలు ఇలా అంటున్నారు. పేరు పెట్టి పలికినా, పరిహాసంగా పలికినా, వెక్కిరిస్తూ హేళనగా పలికినా, ఊత పదంగా పలికినా, యే విధంగా అయినా భగవన్నామాన్ని ఉచ్చరిస్తే పాపాలన్నీ నిశ్శేషంగా నశించి పోతాయి.

పై నుండి పడినప్పుడు కాని, ఎముకలు విరిగినప్పుడు కాని, పాము, తేలు లాంటివి కరచినప్పుడు కాని, వళ్ళు కాలినప్పుడు కాని, జ్వరతీవ్రతలో కాని, అమ్మ బాబోయ్ అని అరచే బదులు శ్రీహరీ, కేశవా, రామా, నారాయణా, శివా అని భగవంతుని నామాలను స్మరిస్తే, యాతనను అనుభవించవలసి ఉండదు. ఔషధము యొక్క గుణము తెలిసి వాడినా, తెలియక వాడినా పని చేస్తుంది కదా!

మీ మనసుకి నచ్చిన దైవ నామాన్ని, గురు నామాన్ని స్మరించండి - తరించండి.

షడ్దర్శనములు



హిందూమత సాంప్రదాయంలో జీవితము, ధర్మము, మోక్షము వంటి కొన్ని క్లిష్టమైన తాత్వికసమస్యలకు పలువిధాలైన సమాధానాలు వివిధ తత్వవేత్తలచే ప్రతిపాదింపబడినవి. వారి ప్రతిపాదనలే దర్శనములు.

దర్శనాలలో పరిశీలింపబడిన కొన్ని ప్రశ్నలు - మరణానంతరము శరీరమునుండి విడివడిన జీవుడేమగును?

మోక్షస్వరూపం ఎలాంటిది?
జీవుడు లోకాంతరములకు వెళ్ళు మార్గం ఏమిటి?

ఇటువంటి ప్రశ్నలకు దర్శనాలలో సమాధానాలు చెప్పబడ్డాయి. వాటిలో ఆరు ముఖ్యమైనవి వాటినే షడ్దర్శనములు అంటారు.

సాంఖ్య దర్శనము:
కపిల మహర్షిచే ప్రవర్తింపజేయబడినది. ప్రకృతి లేక మూల ప్రకృతి విశ్వసృష్టికి కారణమని సాంఖ్య సిద్ధాంతము. ప్రకృతి సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలతో కూడి ఉంది. ప్రకృతి, పురుష సంయోగమువలన బుద్ధి జనించును. పురుషుడు బుద్ధిచేయు చేష్టలను తనవిగా భావించుకొని సంసారములో బంధింపబడును. ప్రకృతి, పురుషుల స్వభావమును గ్రహించి, ఈ బంధమునుండి విడివడుటయే మోక్షము.

యోగ దర్శనము: పతంజలి మహర్షి యోగదర్శనమును రచించెను. ఇందులో మనసును నిగ్రహించుటకు తగిన ఉపాయములు బోధింపబడినవి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యఅహారము, ధ్యానము, ధారణ, సమాధి అను పది రకములైన అభ్యాసములచే మానవుడు ప్రకృతి-పురుష వివేకము పొంది ముక్తుడగును.

న్యాయ దర్శనము:
న్యాయ దర్శనము శాస్త్రములకు శాస్త్రమని అర్ధము. దీనికి మరో పేరు తర్కశాస్త్రము. అంత మాత్రము చేత న్యాయ దర్శనమును తర్క శాస్త్రము అని అనరాదు.
తాత్విక సమస్యలపై వాదోపవాదాలకు అవసరమైన నియమ నిబంధనలే న్యాయ దర్శనముగా గౌతమ మహర్షి సూత్రబద్దం చేసాడు. దీనిలో మొత్తం 524 సూత్రాలు ఉన్నాయి.
న్యాయదర్శనం యొక్క పదహారు పదార్థాలను (షోడశపదార్థములు) తెలుసుకుంటే నిశ్శ్రేయసం (మోక్షం) ప్రాప్తిస్తుందని వాగ్దానం చేస్తుంది. అవి: ప్రమాణం, ప్రమేయం, సంశయం, ప్రయోజనం, దృష్టాంతం, సిద్ధాంతం, అవయవం, తర్కం, నిర్ణయం, వాదం, జల్పం, వితండం, హేత్వాభాసం, ఛలం, జాతి, నిగ్రహ స్థానం.

వైశేషిక దర్శనము:
వైశేషిక దర్శనమును కణాద మహర్షి ప్రవర్తింపజేశారు. ఈ రెండు దర్శనాలలో చాలావిధాలుగా పోలికలున్నాయి. ప్రపంచము పరమాణువులచే నిర్మించబడినది. కుండను చేయడానికి కుమ్మరి ఉండాలి గదా! అలాగే సృష్టిని చేసేవాడొకడుండాలి. అతడే భగవంతుడు. అని న్యాయదర్శనములో చెప్పారు.
జీవులు కర్మ బద్ధులై సుఖదుఃఖములను అనుభవిస్తున్నారు. సత్కర్మలను భగవత్ప్రీతి కోసం చేసేవారికి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. వారికి యోగమార్గంలో మోక్షం లభిస్తుంది.

పూర్వమీమాంస: వేదముల మొదటి భాగం ఆధారంగా ఏర్పడింది పూర్వ మీమాంస దర్శనము. ఈ దర్శన కర్త జైమిని మహర్షి. ఇది వేదములలో చెప్పిన యజ్ఞయాగాది కర్మలకు ప్రాముఖ్యము ఇస్తుంది. వేద నిషిద్ధములైన కర్మలు చేసేవారు నరకానికి వెళతారు. లేదా క్రిమికీటకాది నీచ జన్మలు పొందుతారు. వేదాలలో చెప్పిన యజ్ఞయాగాది కర్మలు చేసేవారు స్వర్గానికి వెళతారు. కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు భగవంతుడు అనే వాదాన్ని పూర్వమీమాంస అంగీకరింపదు.

ఉత్తరమీమాంస: వేదముల ఉత్తరభాగము ఆధారముగా వెలువడినది ఉత్తరమీమాంసా దర్శనము. దీనినే వేదాంత దర్శనము అనీ, బ్రహ్మసూత్రములు అనీ అంటారు. ఇది వేదముల చివరి భాగమైన ఉపనిషత్తులనుండి ఉద్భవించినది. ఇది ఆరు దర్శనములలోను ప్రముఖ స్థానము ఆక్రమించుచున్నది. ఈ దర్శనము జీవాత్మకు, పరమాత్మకు గల సంబంధమును ప్రతిపాదించును. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రములను వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడినవి. వాటిలో అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము - అనే మూడు సిద్ధాంతములు ప్రసిద్ధములు.

ఇవన్నీ వేదములు ప్రమాణంగా చెప్పబడిన దర్శనాలు. ఇవే కాక వేదములను అంగీకరింపని వారు (చార్వాకులు, బౌద్ధులు, జైనులు ఇలాంటి వారు) చెప్పిన దర్శనాలు కూడా ఉన్నాయి

పంచ గయలు



మన దేశంలో మొత్తం 5 గయలు ఉన్నాయని చెబుతారు.


1. శిరోగయ, 2. నాభిగయ, 3. పాదగయ, 4. మాతృగయ, 5. పితృగయ.

 🔹1. శిరోగయ : బిహార్ రాష్ట్రంలో ఫల్గుణీ నదీ తీరంలో “శిరోగయ” గా వెలసింది. దీనినే బుద్ధగయ అని కూడా అంటారు.

 🔹2. నాభిగయ : జాజాపూర్, ఒరిస్సా రాష్ట్రంలో వైతరణి నదీ తీరంలో వున్న ప్రదేశంను “నాభిగయ” అని అంటారు.

🔹 3. పాదగయ : పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్‌లో గయని పాదాలుండటం వలన అవి వున్న ప్రదేశం పిఠాపురాన్ని “పాదగయ” అంటారు.

 🔹4. మాతృగయ : గుజరాత్ రాష్ట్రంలో మహేషన జిల్లాలో సరస్వతీ నదీ తీరంలో గల ప్రాంతాన్ని “మాతృగయ” అని అంటారు. బిందు సరోవరమనే మరో పేరు కూడా కలదు. అహమ్మదాబాదుకు 32 కి||మి|| దూరంలో గల మాతృగయలో మాతృవంశం వారికి పిండప్రదానం మరింత ముఖ్యం. ఒరిస్సాలోని భువనేశ్వర్‌కి 33 కి||మి|| దూరంలో వున్న బిందు సరోవరం వద్ద కూడా పిండ ప్రదానాలు చేస్తారు.

🔹 5. పితృగయ : బధరీనాథ్, ఉత్తర ప్రదేశ్‌లోని అలకనందా నదీ తీరంలో గల “బ్రహ్మకపాలం” అనే ప్రదేశాన్ని “పితృగయ” అంటారు.

ఏకాదశి : ఉపవాసం ఫలితం

ఏకాదశి : ఉపవాసం ఫలితం.. ఎవరు ఆచరించాలి ?
ఏకాదశి ఉపవాసాన్ని చాలామంది ఆచరిస్తుంటారు. కర్మసిద్ధాంతాన్ని ఆచరించే శైవులు, వైష్ణవులు బేధం లేకుండా ఆచరించే వ్రతాలల్లో ఏకాదశి వ్రతం ఒకటి. ప్రతి నెల వచ్చే రెండు ఏకాదశలను వ్రతంలాగా ఆచరిస్తే మోక్షం తప్పనిసరిగా లభిస్తుందని పురాణాలు పేర్కొన్నాయి. అంతేకాదు ఈ వ్రతం ఆచరించిన వారికి సకల పాపాల నుంచి విముక్తి, ఆయురారోగ్యాలు లభిస్తాయి. అయితే ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత ద్వాదశి నాడు ఉదయాన్నే భోజనం చేయాలి.

ద్వాదశ పారణం అంటే ఏంది?
ఏకాదశి వ్రతం ఆచరించి అంటే ఉపవాసం ఉన్నవారు తర్వాతి రోజు అంటే ద్వాదశి తిథినాడు భోజనం చేసే విధానాన్ని పారణం అంటారు. ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళాకముందే పారణం (భోజనం) చేయాలి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు. అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. బ్రహ్మ స్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశీ నుండి అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ప్రతి ఏకాదశినాడు భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు. ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాసం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి ఆ రోజు అవకాశం లేనివారు తొలి ఏకాదశినాడు ఉంటే లభిస్తుంది.




ఏకాదశి వ్రతాన్ని ఎవరు ఆచరించాలి?
ఈ ఏకాదశి వ్రతాన్ని గృహస్థులందరూ ఆచరించవచ్చు. ఏకాదశి దీక్ష ముఖ్యముగా ఉపవాస ప్రధానం. గరుడ పురాణములో
ఊపోష్య ఏకాదశ్యాం నిత్యం పక్షయోరుభయోరపి !
కృత్వాదానం యథాశక్తి కుర్యాశ్చ హరిపూజనమ్ !!
అని చెప్పబడినది. అనగా ఉపవాసం, దానం, హరి పూజ అనేవి ఏకాదశి వ్రతములో ముఖ్యమైన విశేషాలు. ఏకాదశి నాడు ఉపవాసమున్నవారు ద్వాదశినాడు విష్ణుపూజ చేసి ఆ విష్ణువుకి నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే అది దొంగతనంతో సమానమని శాస్ర్తాలు పేర్కొన్నాయి.

ఉపవాసం ఎవరు ఉండ కూడదు?
ఎనిమిదేండ్లలోపు పిల్లలు, 80 ఏండ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్లాల్సినవారు ఉపవాసాన్ని ఆచరించకున్నా దోషం లేదు అని పురాణాలు పేర్కొన్నాయి. ఇక గృహస్తులు, సన్యాస ఆశ్రమంలో ఉన్నవారు తప్పక ఈ దీక్షను ఆచరించాలి.

ఏకాదశినాడు ఏం తినవచ్చు?
ఏకాదశినాడు పూర్తిగా ఉపవాసం ఉండలేనివాళ్ళు పండ్లు, సగ్గుబియ్యం, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. ధాన్యాలు కాని, పప్పుదినుసులు కానీ స్వీకరించరాదని పురాణాలు చెప్తున్నాయి.

కాళిదాసుకు అమ్మ పరీక్ష

మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు. మిట్టమధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు. ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది. ఆమెను చూసి ‘బాలికా! నాకు దాహంగా ఉంది. నీళ్లు ఇవ్వమ’ని అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక.. ‘మీరెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా ఇచ్చేద’ని బదులిచ్చింది. కాళిదాసు ‘నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతార’ని అన్నాడు. అహంకార పూరితమైన ఆ మాటలు విని బాలిక నవ్వి.. ‘మీరు అసత్యమాడుతున్నారు. ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు. వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’ అంటుంది.

అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి.. ‘నాకు తెలియదు. గొంతు ఎండిపోతోంది. ముందు నీళ్లు ఇవ్వమ’ని బతిమాలుకుంటాడు. అయినా ఆ బాలిక కనికరించదు. ‘ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?’ అని అడుగుతుంది బాలిక. ‘నేను బాటసారి’ని అన్నాడు కాళిదాసు. ‘మళ్లీ అసత్యమాడుతున్నారు. బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి. మీరేమో అలిసిపోయారు కదా. ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు. వారే సూర్యచంద్రులు!’ అని చెప్పి గుడిసెలోకి వెళ్లింది బాలిక.

దాహానికి తట్టుకోలేక.. ఆ గుడిసె ముందే నిలబడి.. ‘మాతా నీళ్లు ఇవ్వండి. దాహంతో చనిపోయేలా ఉన్నాను..’ అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు. లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి.. ‘మీరెవరో సెలవివ్వండి.. నీళ్లిస్తాను’ అంది. కాళిదాసు దీనంగా.. ‘నేను అతిథిని..!’ అని బదులిచ్చాడు. ‘మీరు అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు. ఒకటి ధనం, రెండోది యవ్వనం. ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు’ అంటుంది. కాళిదాసు.. ‘నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని వేడుకుంటాడు. కానీ ఆమె ‘మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు. ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు ఉన్నారు. ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు?’ అని అడిగింది.

ఓపిక నశించిన కాళిదాసు.. ‘నేను మూర్ఖుడను. ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని అడిగాడు. ఆ అవ్వ నవ్వుతూ.. ‘ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు’ అని అంటుంది. ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు. ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. ‘కాళిదాసా..! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ, అహంకారం కాదు నాయనా! కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ  బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష’ అని జలమును అనుగ్రహిస్తుంది.

గమనిక;- విద్య, అధికారం, ధన బలము తో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి

తొలిఏకాదశి*


*ఆషాడ శుక్ల ఏకాదశి - 1 జులై 2020🚩*

*ఉపవాస ప్రారంభం 19:49, జూన్ 30  నుండి ఉపవాస సమాప్తం 17:29, జులై 01*

 ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, *ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు*. పూర్వకాలంలో ఈ రోజునే *సంవత్సరారంభంగా పరిగణించేవారు*. వానాకాలం మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). *ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి.*

*ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది.* తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు *ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని* నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత *కార్తీక శుద్ధ ఏకాదశి* నాడు మేల్కొంటాడంటారు. ఈ ఏకాదశిని పద్మఏకాదశిగా కూడా పిలుస్తారు. *ఈ యోగ నిద్ర అనేది భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన*.తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి. 

*భవిష్యోత్తరపురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.*

తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే *"ఏకాదశి"* అంటారు.ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట.  *చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున కచ్చితంగా పేలపిండి తింటారు. ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.*

ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. *ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం.*

*పురాణ నేపథ్యం*

ధర్మము తప్పని, సత్యసంధుడు అయిన రాజు మాంధాత. అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దానితో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగిరసుడు సూచన పై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు, దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా వున్నారని పురాణాలు చెపుతున్నాయి. *విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే, నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణదిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు. సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు. ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి, అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.*
 
ఈ పండుగకు పేల పిండిని తినే ఆచారము ఉన్నది *పేలాలలో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారుచేస్తారు ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని ప్రసాదంగా కూడా ఇస్తారు.ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది.

*శైవము*

హైందవ మత సంప్రదాయములో *పరమశివుని ప్రధాన అధిదేవతగా ఆరాధించే శాఖను శైవము అంటారు.* వీరు శివాలయాలలోని లింగాకారంలో నున్న శివుని పూజిస్తారు. శివారాధకులను శైవులు అని అంటారు. శైవ మతాన్ని ప్రచారం చేయటానికి సాహిత్యాన్ని సృష్టించిన వారు శివకవులు. వారిలో *నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమనాథుడు* ముఖ్యులు. వీరిని *"శివ కవిత్రయము"* అని అంటారు.

*వీరశైవం*

ఆది జగద్గురు *శ్రీ రేణుకాచార్య భగవత్పాదులు శ్రీ స్వయంభు సోమేశ్వర లింగం నుండి లింగోద్బవం చెంది పరమశివుడి ఆనతి మేరకు ఈ భుమండలంపైన శక్తివిశిష్టాద్వైతాన్ని స్థాపించడం జరిగింది.* ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్నే *వీరశైవంగా* పిలుస్తారు. శివునికి ఐదు ముఖాలు - *సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన*. ఈ ఐదుగురి అంశలలో ఉద్భవించినవారు *పంచాచార్యులు*. వారు చారిత్రక వ్యక్తులో, కాదో తెలియదు. *స్వయంభువులుగా* చెప్పబడుతారు. వారిపేర్లు *రేణుకాచార్య, మరుళారాధ్య, ఏకోరామారాధ్య, పండితారాధ్య, విశ్వారాధ్య* అనేవారు.వారి అనుగ్రహాన్ని కోరుదాం. ఈ సిద్ధాంత శిఖామణి *రేణుకాచార్య - అగస్త్య సంవాదంగా* చెప్పబడుతుంది. ఈ వీరశైవ సామ్రాజ్యానికి ఐదు ముఖ్య పీఠాలున్నాయి. వానిని మొదట పాలించినది పంచాచార్యులు. అవి *బాళేహెణ్ణూరు, ఉజ్జయిని (ఉజ్జిని)(కర్ణాటక), కేదారనాథ్ (ఉత్తరాఖండ్) , శ్రీశైలం, కాశీ.* వీరశైవ మతానికి సంబంధించి మూలమైన అయిదుగురు పంచాచార్యులలో ఈ రేణుకులు ప్రథములు. వీరి గురించి 28 శివాగమాలలో చాలా చోట్ల ప్రస్తావించబడింది. ప్రధానంగా *స్వయంభువాగమ, వీరాగమ, సుప్రభేదాగమాల్లో* వివరించబడి ఉంది. వీరు వీరసింహసనం అను పేర పీఠమును స్థాపించడం జరిగింది ఈ పీఠమూల పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శ్రీ రెణుకాచార్యుల వారు కృతయుగమున అగస్త్య మహాముని వినతి మేరకు అగస్త్యునికి శైవ సిద్దాంతమును ఉపదేశించారు.

*రేణుకాచార్యులు అగస్త్య మహామునికి ఉపదేశించిన శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని, శివయోగి శివాచార్యులు "సిద్దాంత శిఖామణి" పేరిట సంస్కృత భాషలో గ్రంథస్తం చేయటం జరిగింది*. ఈ గ్రంథం అప్పటికే వీరాగమాది 28 గ్రంథాల్లో ఉన్న వీరశైవ తత్వాన్ని సంగ్రహించి రాయటం జరిగింది. *సిద్దాంత శిఖామణి,* సిద్దంతాలకన్నిటికీ తలమానికమై శిరోరత్నమువలె భాసిల్లటం జరుగుతుంది. ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని రేణుకాచార్యుడు బోధించటం వలన దీనిని *"రేణుకాగీత"* అని కూడా పిలవబడుతుంది

*బ్రహ్మసూత్రములకు శక్తి విశిష్టాద్వైత సిద్దంతపరంగా (వీరశైవ పరంగా ) భాష్యము - నీలకంఠ భాష్యం వ్రాసిన శ్రీకంఠ శివాచార్యులు వీరశైవులకు ఆగమోక్త ప్రామాణిక గ్రంథమైన సిద్దాంత శిఖామణి* గూర్చి ప్రస్తుతించటం జరిగింది. ఈ గ్రంథమే సమస్త వీరశైవులకు ప్రామాణిక గ్రంథము.

శ్రీకంఠ శివాచార్యులు కూడా తమ బ్రహ్మసూత్ర భాష్యం శ్రీకంఠ భాష్యములో సిద్దాంత శిఖామణి శ్లోకములను ప్రమాణ యుక్తముగా ఉదహరించుట జరిగింది.

10వ శాతబ్దంలో బ్రహ్మసూత్రములకు శక్తి విశిష్టాద్వైత సిద్దంతపరంగా (వీరశైవ పరంగా ) భాష్యము శ్రీకరభాష్యం వ్రాసిన శ్రీపతి పండితాచార్యుడు వీరశైవులకు ఆగమోక్త ప్రామాణిక గ్రంథమైన సిద్దాంత శిఖామణి గూర్చి  ప్రస్తుతించటం జరిగింది.

వేదవ్యాసుడు తన స్కంద పురాణము శంకర సణితలో అధ్యాయము 85 లో శ్రీశైల సూర్యసింహనాధీశులైన జగద్గురు శ్రీ సదానంద శివాచార్య భగవత్పాదుల గారిని గూర్చి ఈ విధముగా స్తుతించారు.

తస్మిన్ శ్రీ పర్వతేపుణ్యే, సన్సారామయభేషజే| ఆస్తే లింగాంగ సంబంధీ, సదానందాహ్వయోమునిః|| సర్వోపనిషదర్ధజ్ఞః - శివధ్యాన పరాయణాః| భస్మావలిప్త సర్వాంగో -రుద్రాధ్యాయ జపాశ్రయః|| రుద్రాక్ష మాలాభరణో - దృతపాశుపత వ్రతః| అతివర్ణాశ్రమీయోగి -జీవన్ముక్తో జగద్గురుః|| తం సదానంద నామానం -- శంకరధ్యాన లాలసం| నిరస్తకుహకం విప్రం - సహపుత్రేణ పూజయ|| తస్యప్రసాదత్వే - పుత్రోగచ్చేన్నీరోగతాం ధ్రువం| తస్మాదుత్తిష్ఠ గచ్చత్వం - శ్రీఅ పర్వతమతంద్రితః||

తాత్పర్యము:- *శ్రీశైల సూర్యసింహనాధీశులైన జగద్గురు శ్రీ సదానంద శివాచార్య భగవత్పాదులు సంసార రోగమును పారద్రోలుదురు. పరమ పవిత్రులు, భస్మరుద్రాక్షధారులు, శ్రీ రుద్రాధ్యాయ, జపాసక్తులు, (సంసార రోగ నాశకులు) జీవన్ముక్తులు, జగద్గురువులు, శ్రీశైల క్షేత్రమున ఉన్నారు. వారిని పూజించినట్లయితే వారి అనుగ్రహము వలన నీ కుమారుడైన పింగళుడు రోగ విముక్తుడు అగును. నీవు తక్షనమే శ్రీశైల క్షేత్రమునకు వెళ్లుమని హరప్రియుడు శ్వేతునకు చెప్పినట్లు వేదవ్యాస మహర్షి స్కంద మహాపురాణము యొక్క శంకర సంహిత లోని 85వ అధ్యాయములో శ్లొకము 90 నుండి 95వ శ్లోకము వరకు వివరించి ఉన్నాడు.,* తన పద్మపురాణాంతర్గత, శివగీత 16 వ అధ్యాయం యందు అఙ్ఞో పహాస భక్తాశ్చ-భూతి రుద్రాక్షధారిణ| లింగినోయశ్చవాద్వేష్టి - తేనైనా త్రాధికారిణ||

ప్రతిమా శివలింగంవా - దేవ్యైరేతః కృతంతుయత్| తత్రమాం పూజయేత్తేషు - ఫలం కోటి గుణోత్తరమ్||

తా: *అఙ్ఞాని, అపహాస్యము చేయువాడు, విభూతి రుద్రాక్ష లింగదారులె ఉన్న శివభక్తులను ద్వేషించువారు మోక్షమును పొందుటకు అర్హులు కారు. ఎవరైతే భక్తితో శివలింగాన్ని పూజిస్తారో, వారే ముక్తిని పొందుటకు అర్హులు.*

తన శివ మహాపురాణము యొక్క విద్వేశ్వర సంహితలో 16వ అధ్యాయములో 159వ స్లోకమున శివభక్తో వసేన్నిత్యం - శివలింగం సమాశ్రితః| పూజయాచర లింగస్య - క్రమాన్ముక్తో భవేధ్రువమ్||

తా: *శివభక్తుడైనవాడు ఎల్లప్పుడూ తన దేహము పై శివలింగమును ధరించియున్నను జంగమమూర్తి పూజ వలననే మోక్షమును పొందగలడు అని చెప్పబడింది.*

*నాయనార్లు:*

శైవ శాఖలో వీరు చెప్పుకోదగ్గవారు. *వైష్ణవశాఖలో ముఖ్యమైన 12 మంది ఆళ్వార్లతో కలిపి వీరిని దక్షిణ భారతదేశంలో పరమ భక్తాగ్రేసరులుగా వ్యవహరిస్తారు వీరుమొత్తం 63 (అరవై ముగ్గురు) మంది.* తమ కవిత్వంతో శివుణ్ణి కీర్తించిన *అపర భక్తాగ్రేసరులు*. వీరి చరిత్ర తమిళంలోని *'పేరియ పురాణం'* లో చక్కగా వివరించబడింది. దీనిని రచించినది సెక్కిళార్. ఈ నయనార్లలో *భక్త కన్నప్ప, కరైక్కాల్ అమ్మన్* మొదలగు వారు పెక్కు ప్రసిద్ధులు. 

*లింగాయత్*

భారతదేశంలో శైవం ఎన్నో శాఖలుగా రూపాంతరం చెందింది. వాటిలో *లింగాయత్ శైవం* కర్ణాటకలోని ప్రసిద్ధ శైవ శాఖ. ఈ పద్ధతిని *బసవేశ్వరుడు* ప్రారంభించాడు. *ఈ శైవాన్ని పాటించేవారు తమ కంఠంలో చిన్న శివ లింగాన్ని ధరిస్తారు. ఆ శివ లింగానికి రోజూ నీటితో అభిషేకం నిర్వహించి మరల ఆ లింగాన్ని తమ కంఠంలో ధరిస్తారు.*

*శివాలయం*

*శివుని ఆరాధనకు శివాలయం ప్రధానమైన కేంద్రం.* మన దేశంలోను, రాష్ట్రంలోను ఎన్నో శివాలయాలు ఉన్నాయి. వానిలో ముఖ్యమైనవి *ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచ భూత లింగాలు,  పంచారామాలు.*

*ఏకదండి..ద్విదండి..త్రిదండి*



మనం ఎంతో మంది పీఠాధిపతులను లేదా యతీంద్రులను (స్వాములను) చూస్తూ వుంటాం. వారి చేతుల్లో కర్రలు పట్టుకొని వుండటం కూడా చూసివుంటాం. ఆ *కర్రలను దండెములు* అంటారు. అవి,  *వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత మరియు విశిష్టాద్వైత* భావానికి సంకేతాలు. వారు చేతిలో పొడవాటి కర్రలు ఎల్లవేళలా పట్టుకుంటారు. ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి కూడా ఓ అర్థం ఉంది. *గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి, కాబట్టి సన్యాసులు అయిదు అడుడుగుల కర్రను ధరిస్తారు.* 

ఆ యతీంద్రులు తమ చేతి ధరించే, *కర్రలలో ఏకదండి (ఒక కర్ర), ద్విదండి (రెండు కర్రలు), త్రిదండి (మూడు కర్రలు)* అని మూడు విధాలుగా ఉన్నాయి. దండి అంటే కర్ర అని అర్థం. *ఒక కర్రను (ఏకదండి) ధరించే వారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారని అర్థం. అద్వైతం అనగా జీవాత్మ, పరమాత్మ ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు అనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. ఇది  జగద్గురు ఆది శంకరాచార్యుల వారు బోధించినది. ఈ అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే వారి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుండి సేకరించిన ఒక కర్ర ఉంటుంది.*

ఇక రెండవ సిద్ధాంతం ద్వైతం. *రెండు కర్రలు కలిపి (ద్విదండి) ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం అనసరించి బోధించేవారు. వీరి ప్రథమాచార్యుడు మధ్వాచార్యులు. వీరిని ‘ద్విదండి స్వాములు’ అంటారు వీరు విష్ణుభక్తులు. వీరు పరమాత్మ వేరు మరియు జీవాత్మ వేరు అని బోధిస్తారు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.*

ఇక మూడవది విశిష్టాద్వైతం. *మూడు కర్రలను కలిపి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారిని తత్వత్రయం అనుసరించే వారు అంటారు. వీరిది భగవద్రామానుజాచార్యుల పరంపర. ఈ సిద్ధాంతం ప్రకారం, శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధంలో చిక్కుకుంటాడని, నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుండి విముక్తులై, మరణానంతరం నారాయణ సాన్నిధ్యం (మోక్షం) పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు.*

ఈ మూడు కర్రలలో, *ఒక్కో దండం ఒక్కోక్క తత్వానికి గుర్తు. ఒకటి జీవుడికి, ఒకటి ప్రకృతికి మరియూ ఒకటి పరమాత్మకి.* మనం చూసే ఈ ప్రపంచం అంతా *ఈ మూడు తత్వాలతోనే నిండి ఉంటుంది అని వేదం తెలియజేస్తుంది.* వేదార్థాన్ని వివరించే పురాణాలు, ఇతిహాసాలు, వాంగ్మయాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. *తత్వాలు అన్నింటినీ మూడుగా విడదీయవచ్చు*. 

అందులో మనం లెక్కకు అందనంత మంది జీవులు వుంటారు. రెండోది రకరకాల చిత్ర విచిత్ర రూపాలు మార్చుకొనే పంచభూతాత్మకమైన ప్రకృతి. ప్రకృతి అంటే అచేతనమైనది మరియు ప్రకృతికి జ్ఞానం ఉండదు. అందుకే దానిని అచిత్తు అని అంటారు. చేతన రహితమైనప్పటికీ చేతనమైన జీవ సంబంధంచే తన రూపాన్ని మార్చుకుంటుంది. కర్మ సంబంధం చేత సహజమైన జ్ఞానం కలిగి అణుస్వరూపుడైన జీవులు, ఈ ప్రకృతిని శరీరాలుగా దాల్చి ఉంటారు. ఎనభైనాలుగు లక్షల రకాల జీవులు ఈ విశ్వంలో వుంటారని చెబుతారు. ఈ జీవులంతా ప్రకృతిలో సంచరిస్తూ, కర్మ అనుభవాన్ని కష్టమైనదో లేక సుఖమైనదో ఎదో ఒకదాన్ని పొందుతూ ఉంటారు. *ప్రకృతిని జీవరాశిని ఈ రెండు తత్వాలని నిరంతరం బయట లోపల వ్యాపించి వాటిని నిలబెట్టి, వాటికి కావల్సిన శక్తిని ఇచ్చి నడిపిస్తూ ఉండే తత్వం పేరే పరమాత్మ.* ఈ పరమాత్మ అనే తత్వం మూడోది. *ఈ మూడు తత్వాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి, విడిచి ఉండటం అనేది లేనే లేదు*. పరమాత్మ జీవాత్మ ప్రకృతిలలో వ్యాపించి ఉంటాడు. జీవుడు ప్రకృతిలో నిరంతరం ఉంటాడు. అంటే మరి ముక్తి ఉండదా అని అంటే అట్లాంటి సందేహం అవసరం లేదు. *ప్రకృతి అనేక రకాలుగా అనేక గుణాలతో ఉంటుంది. ప్రకృతికి సత్వ, రజస్సు అని మరియు తమస్సు అనే గుణాలు కలిసి వుంటాయి. అందుకే మిశ్రమ తత్వం అని పేరు. రజస్సు, తమస్సు ఏమాత్రం లేని కేవలం సత్వం మాత్రమే ఉండే సుద్ద సత్వ ప్రకృతి విరజా నదికు ఆవల ఉండే ప్రకృతి. ఇవి రెండు కాక గుణములకు అతీతమైన కాలం అనేది ఒక ప్రకృతి. కాలం కూడా ప్రకృతిలో ఒక భాగమే, అందుకే అది సత్వ శూన్యం అని పేరు. ఇలా మూడు రకాలుగా ఉండే ప్రకృతి, ఎన్నో జీవులు, వీటికి వెనకల ఉండి నడిపించే పరమాత్మ ఈ మూడుతత్వాలని విశ్వసించి మనకు మార్గం చూపే యతులు త్రిదండాన్ని ధరించాలని శాస్త్రం యొక్క నిర్ణయం.* ఈ మూడు దండాలను కలిపి కట్టి, ధరించిన వ్యక్తిని త్రిదండి అని అంటారు. చక్రం ధరించిన వాడిని చక్రీ అన్నట్టుగానే 'త్రిదండీ' అని సంస్కృతంలో పదం వస్తుంది, అదే తెలుగులో 'త్రిదండి' అని వ్యవహరిస్తాం. శ్రీవైష్ణవ సంప్రదాయంలో యతులు త్రిదండాన్ని ధరించాలని నియమం. వేదం కానీ, ఇతిహాసాలు ఇదే విషయాన్ని ప్రస్తావించాయి. *దత్తాత్రేయుడు అనే భగవంతుడు వేదోద్దరణకై ఎత్తిన అవతారం. కర్నాటక రాష్ట్రంలో, మండ్యా దగ్గరలో మేలుకోట క్షేత్ర ప్రాంతంలో ఆయన పాద చిహ్నాలు ఉంటాయి. అక్కడి పుష్కరిణికి దత్తాత్రేయ పుష్కరిణి అని పేరు. భగవంతుడు, అత్రి మహర్షికి అనసూయకు తనను తానే వారి పుత్రునిగా అర్పించుకోవడం చేత దత్తుడు అయ్యాడు. అందుకే ఆయన పేరు దత్తాత్రేయుడు అయ్యింది. వైదిక ధర్మాన్ని లోకానికి నెలకొల్పి ఉన్నాడు, ఆయనకూడా త్రిదండి సన్యాసి అని తెలుస్తున్నది.*  మనకు ప్రామాణికమైన గ్రంథాలు తెలిపే దత్తాత్రేయుడు త్రిదండి సన్యాసి అని తెలుస్తున్నది. అందుకే అవసరం ఏర్పడినప్పుడు త్రిదండి సన్యాసులు మేలుకోటలో దత్తాత్రేయుని వద్దకి వెళ్ళి తిదండాన్ని పొందే సంప్రదాయం ఉంది. రామానుజుల వారి చరిత్రలో వారికి కుళోత్తుంగచోళుడి వల్ల ఏర్పడ్డ ఉపద్రవం నుంచి రామానుజుల వారిని తప్పించడానికి, కూరేశులు రామానుజులవారి దండాన్ని మరియు కాశాయాన్ని తాను ధరించి, రామానుజులవారిని పశ్చిమ దేశం వైపు పంపారు. రామానుజులవారు మేలుకోట ప్రాంతం చేరే సరికి వారి వద్ద త్రిదండం, కాశాయం లేదు. తిరిగి వాటిని పొందే అవకాశం లేదు. అందుకే వారు మేలుకోటలోని దత్తాత్రేయుడి వద్ద కొత్త త్రిదండాన్ని, కాశాయాన్ని ఉంచి స్వీకరించినట్లు చరిత్ర చెబుతుంది.

ప్రభావిద్య

గతంలో తరుణీవిద్యను ఉపదేశించారు. ఇప్పుడు తరుణీ విద్యకు ఆంగభూతమైన ప్రభావిద్యను ఉపదేశిస్తున్నారు. ఆ పరమేశ్వరి కోటి సూర్యప్రభలతో వెలుగొందుతూ ఉంటుంది. ఇక్కడ కోటి అనే
నామం సంఖ్యావాచకం కాదు. అనేకానేకమైనటువంటి, లెక్కలేనటువంటి కాంతి కిరణము లతో ఆ పరమేశ్వరి విరాజిల్లుతుంటుంది. భైరవయామళంలో పరమేశ్వరుడు పార్వతీ
దేవికి శ్రీవిద్యను వివరిస్తూ పంచభూతాలు, తన్మాత్రలు, ఇంద్రియాలు, మనస్సు, మాయ, శుద్ధవిద్య, మహేశ్వరుడు, సదాశివుడు ఈ ఇరవైఐదు తత్వాలకు అతీతంగా ఆ పరమేశ్వరి
బిందువునందు ఉంటుంది. ఆమె శరీరం నుంచి ప్రకాశవంతమైన కాంతికిరణాలు వస్తున్నాయి. ఆ కిరణాలు వేయి, రెండువేలు, లక్ష, కోటి, అర్బుదము ఇంకా లెక్కపెట్టటానికి వీలుకాదు అంటున్నాడు. అంటే లెక్కపెట్టలేనన్ని, లెక్కపెట్టటానికి వీలుకానన్ని కిరణాలు
ఆ పరమేశ్వరి శరీరం నుంచి వస్తున్నాయి. ఆ కిరణాలవల్లనే ఈ చరాచరజగత్తంతా ప్రవర్తిల్లుతున్నది.

బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుణ్ణి జనకమహారాజు అడుగుతాడు.

జనకుడు : స్వామీ ! ఈ జగత్తులోని కార్యక్రమాలన్నీ దేనివల్ల జరుగుతున్నాయి?
యాజ్ఞవల్క్యుడు : సూర్యుని యొక్క వెలుగువల్ల. సూర్యుని వెలుగులోనే జీవులన్నీ కూడా తమకు కావలసినచోటికి పోయి, మళ్ళీ ఆ వెలుగులోనే తిరిగివస్తాయి. తమ కిష్టమైన కార్యాలు చేస్తాయి.
జ: మరి సూర్యకాంతులు ఎప్పుడూ ఉండవుకదా ? సూర్యుడు లేనప్పుడు ఏరకంగా కార్యక్రమాలు జరుగుతాయి ? అంటే రాత్రులందు ఏరకంగా జరుగుతుంది.
యా: చంద్రుని కాంతులతో చంద్రుని కాంతిలో జనులు తమ పనులు నిర్వర్తించుకుంటారు.
జ: సూర్యుడు చంద్రుడు ఇద్దరూ లేనప్పుడు అంటే సంధ్యవేళలయందు కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతాయి ?
యా : అగ్నికాంతులతో అంటే దీపపు వెలుగులతో జరుగుతాయి.
జ: అయితే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఎవరూ లేనప్పుడు కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? వాక్కువల్ల, వాక్కు అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి చేరుతుంది. దానివల్ల పనులు జరుగుతాయి.
యా: జ: మరి వాక్కు కూడా లేప్పుడు ఎలా జరుగుతుంది ? అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని వాక్కు లేవు. అంతా చీకట్లు, అప్పుడు ఏం జరుగుతుంది ?
యా : ఆత్మవల్ల జరుగుతుంది. పెనుచీకట్లు దాటిన తరువాత ఆత్మ యొక్క కాంతులవల్ల జగత్తంతా ప్రవర్తిల్లుతుంది. అసలు ఆత్మ యొక్క కాంతులతోనే చరాచరజగత్తు అంతా నడుస్తున్నది. అని చెబుతాడు. కాబట్టి పరమేశ్వరి నుంచి వచ్చే కిరణాలవల్లనే
ఈ జగత్తు అంతా నడుస్తున్నది. ఆ కిరణాలలో అగ్ని 108, సూర్యుడు 116, చంద్రుడు 136 కిరణాలను గ్రహించగలిగారు. ఇప్పుడు సూర్యుని కాంతివల్ల పగలు, చంద్రకాంతుల
వల్ల రాత్రి, సంధ్యవేళలయందు అగ్నికాంతులవల్ల జీవకోటి సంచరిస్తున్నది. ఈ రకంగా అనేక కోట్ల కిరణసముదాయము ఆమె శరీరం నుంచి వస్తుంది. అసలు పరమేశ్వరి అంటే దివ్యమైన తేజోమయమైన కాంతి పుంజము. అందుకే ఆమె ప్రభావతి,
ప్రభారూపా అనబడింది. ఆమె మూలప్రకృతి. వ్యక్తావ్యక్తస్వరూపిణి. వివిధాకారాలతో జగత్తంతా వ్యాపించి ఉన్నది. భక్తుల అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞానజ్యోతులు
ప్రసాదిస్తుంది. ఆ దేవి విషయం 388 నుంచి 404 వరకు నామాలలో చెప్పబడింది.

శ్రీమాత్రే నమః

వైదిక ధర్మ ప్రచారం

వెంకటేశ్వర ప్రసాదు

విమాన వేంకటేశ్వరస్వామి విశిష్టత.



           విజయనగర పాలకుల కాలంలో తిరుమల శ్రీవారికి లెక్కకు మించిన ధన కనక వస్తు వాహనాలను విజయనగర ప్రభువులు అందించారు. అలాంటి సమయంలో కొంత మంది అర్చకులు స్వామి వారి నగలను ధరించి తిరుగాడటం మహారాజు దృష్టిలో పడింది. ఆగ్రహంతో ఆ మహారాజు తొమ్మండుగురు వైష్ణవ అర్చకులను తన కరవాలంతో కడతేర్చాడు.  నరహత్య మహాపాప మనుకుంటే ఏకంగా  తొమ్మండుగురిని ఆలయంలోనే మట్టుపెట్టాడు మహారాజు. 
            అత్యంత పవిత్రమైన దేవాలయంలో జరిగిన యీ ఘోరమైన పాప పరిహారానికి నడుము బిగించారు విజయనగర సామ్రాజ్య రాజ గురువులైన శ్రీ వ్యాసరాయలవారు.  12 సంవత్సరములపాటు రాజగురువులు శ్రీవారి గర్భాలయంలో అత్యంత కఠోర దీక్షతో పాప పరిహార పూజాదికములను నిర్వహించారు. ఆ 12 సంవత్సరముల కాలంలో భక్తులకు గర్భగుడి లోని మూలవిరాట్ దర్శనభాగ్యాన్ని నిషేధించారు. 
           అందుకు ప్రతిగా ఆనందనిలయ విమానం మొదటి అంతస్తులో శ్రీవారి మూలమూర్తిని పోలిన విగ్రహాన్ని ప్రతిష్టించి నిత్యార్చన దర్శనాదులకు ఆటంకం లేకుండా చేయబడింది. ఈ విగ్రహం ఆనందనిలయానికి ఉత్తర వాయువ్యం మూలకు వుంటుంది. శ్రీవారి మూలమూర్తి రూపానికి యిదొక్కటే ప్రతిరూపంగా సంభావింపబడుతూ ఆనందనిలయ విమాన వేంకటేశ్వరునిగా ప్రసిధ్ధిగాంచారు. 
          గర్భాలయంలో స్వామి తన భక్తుల మనోభీష్టాన్ని తీర్చే వాడైతే ఈ విమాన వేంకటేశ్వరుడు కేవలం మోక్ష ప్రదాత. అందుకనే ప్రదక్షిణ మార్గంలో వీరిని తప్పనిసరిగా దర్శించుకోవాలి. 
          గర్భాలయం లో స్వామిని దర్శించుకోవడానికే సమయం సరిపోదు.  కనుక మన కోరికలన్నీ ఇక్కడ స్వామికి ఎంతసేపు కావాలంటే అంత సేపు నిలబడి అన్నీ మొక్కుకోవచ్చు.  
          ఇదీ సంక్షిప్తంగా శ్రీ విమాన వేంకటేశ్వర స్వామి వారి విషయం.