11, జనవరి 2025, శనివారం

108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు

 🕉  *108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు" : :


       41వ దివ్యదేశం 🕉


🙏 శ్రీ అలగర్ పెరుమాళ్ ఆలయం. 

అళగర్ కోయిల్ ,

తిరుమాలిరుంశోలైమలై 🙏


⚜  ప్రధాన దైవం : అలగర్ పెరుమాళ్,

⚜ ప్రధాన దేవత : సుందరవల్లి తాయార్.

⚜ ఉత్సవ విగ్రహం :  సుందరరాజ పెరుమాళ్.

⚜  పుష్కరిణి : శీలంబర్ పుష్కరిణి;

       నూపురగంగా పుష్కరిణి.

⚜  విమానం : సోమసుందర విమానము


🌀  స్థల పురాణం 🌀


💠 మదురై సమీపమున గల " అళగర్ " పర్వతమాలలో ఒక పర్వత పాదమందు " కల్లర్ " వంశజులైన బందిపోటు దొంగలు ఉండిరి . 

వారిలో కొందరు గొప్ప విష్ణుభక్తి కూడ కలిగి తాము ధనవంతుల నుండి దోచుకొనిన ధనము , వస్తువులను శ్రీమన్నారాయణునికి అర్పించి సేవించు చుండెడివారు . 


💠 12 మంది ఆళ్వార్లలో ఒకరైన తిరుమంగై ఆళ్వార్ కూడ ఈ కల్లర్ వంశజుడే . శ్రీమన్నారాయణుడు వారి భక్తికి మెచ్చి ఇచ్చట దర్శనమిచ్చెను . తిరుమల తిరుపతి లో వలె శ్రీమహావిష్ణువు శ్రీనివాసుడు , వేంకటేశ్వరుడు నామములతో దర్శనమిచ్చును . 

ఆ కారణమున తిరుమల తిరుపతిని ఉత్తర తిరుపతియని , ఈ దివ్య దేశమును దక్షిణ తిరుపతియని ఈ ప్రదేశమున వ్యవహరింతురు . 


💠 యమధర్మరాజు ప్రతి రాత్రి వచ్చి ఈ దివ్యదేశమున పెరుమాళ్ ను పూజించును అని స్థల పురాణము .

 

 💠ఈ ఆలయ గోపురము చాలా పెద్దది . తొండైమాను గోపురము అందురు . సుందరపాండ్య మండపము , సూర్యమండపము , ఆత్రేయముని మండపము గలవు . ఈ మండపములను దాటిననే మూల విరాట్ సన్నిధి వచ్చును .

  

💠చైత్రపూర్ణిమ రోజును కలిపి 9 రోజులు అళగర్ ఉత్సవములు చాలా గొప్పగా జరుగును . ఈ ఉత్సవములు 3 రోజులు అళగర్ పర్వతమందు జరిగిన పిమ్మట 4 వ రోజున పెరుమాళ్ ఉత్సవమూర్తిని మదురై తీసుకొని పోవుదురు . 

ఈ రోజున శ్రీవిల్లిపుత్తూర్ నుండి వచ్చు ఒక తులసి మాలను ఆండాళ్ ప్రేమకు చిహ్నముగా పెరుమాళ్ ధరించును . 

ఇది ప్రతి సంవత్సరము నిశ్చయముగా జరుపు ఆచారము . 

పెరుమాళ్ అశ్వారూఢుడై మదురై పోవును . ముందుగా " వైగై నదిలోనికి పోయి తదుపరి మదురై చేరును . పెరుమాళ్ యొక్క ఈ వైగై నదీ ప్రవేశము కూడ గొప్ప ఉత్సవముగా పాటించబడును . 


💠 ఈ విధముగా పెరుమాళ్ మదురైచేరుట అచ్చట జరుగు " మీనాక్షి - సుందరేశ్వర్ " ల కళ్యాణోత్సవములను తిలకించుట కొరకు . ఆ కళ్యాణోత్సవములను 5 రోజులు చూచి , అనగా 9 వ రోజున పెరుమాళ్ అళగర్ పర్వత దివ్యదేశ సన్నిధికి చేరుకొనును . ఈ ఉత్సవములకు లక్షలాది భక్తులు వత్తురు . 

  

💠ఇచట మూలవర్, ఉత్సవర్ కూడ పంచాయుధములతో ఉంటారు. మూలవర్‌కు వైకుంఠ నాథన్, పరమ స్వామి అనే తిరునామములు ఉన్నాయి. స్వామి సుదర్శన చక్రహస్తులై వేంచేసియున్నారు.


💠 ఈ ఆలయంలో గోపురం చాలా పెద్దది.

బ్రహ్మోత్సవ సమయంలో చక్రత్తాళ్వార్ మాత్రమే గోపుర ద్వారము నుండి వేంచేస్తారు. పెరుమాళ్లు ప్రక్కనున్న ద్వారము నుండి వేంచేస్తారు.


💠ఆలయ ప్రాంగణంలోని జ్వాలా యోగ నరసింహ సన్నిధి ప్రసిద్ధి చెందింది. అతనికి రోజువారీ  తిరుమంజనం జరుగుతుంది. ఒంటరిగా యోగ నరసింహ కోపాన్ని తగ్గించడానికి పుణ్యక్షేత్రం పైకి గాలి రావడానికి పైకప్పు తెరిచి ఉంది.


💠తమిళంలో “కల్లార్” అంటే దొంగ అని అర్థం. పెరుమాల్ ను ఈ పేరుతో పిలుస్తారు ఎందుకంటే అతను తన భక్తల హృదయాన్ని తన అందం మరియు ఆశీర్వాదాల ద్వారా దొంగిలించాడు. అతను తన భక్తలన్నింటినీ చెడు నుండి రక్షిస్తాడు.



 🙏శ్రీమన్నారాయణ🙏

10, జనవరి 2025, శుక్రవారం

వైకుంటైకాదశి పర్వదినంబున

 వైకుంటైకాదశి పర్వదినంబున శార్దూలంలో శ్రీవిష్ణు స్తుతి


🌹//శార్దూలం//🌹

శ్రీశున్ శ్రీహరినచ్యుతున్ సురనుతున్ సేవింతునేకాదశిన్l

క్లేశఘ్నున్ కలికల్మషాపహరణున్ కేళీప్రియున్ కేశవున్ ll 

శేషాద్రిన్ ప్రభవిల్లు వేంకటపతిన్ శ్రీభూమినీళాధవున్ 

వైశేష్యైకవిశాలమానసయుతున్ వైకుంఠసద్మున్ సదాll

~మల్లిభాగవతః...🙏

నారాయణోపనిషత్

 *నారాయణోపనిషత్*


ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై

తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై!!


తా: సర్వ జీవులు రక్షింప బడు గాక.  సర్వ జీవులు పోషింప బడు గాక. అందరూ కలిసి గొప్ప శక్తి తో కూడి పని చేయాలి. ( సమాజ ఉద్ధరణ కోసం)  మన మేధస్సు వృద్ది చెందు గాక. మన మధ్య విద్వేషాలు రాకుండు గాక. ఆత్మా ( వ్యక్తిగత ) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక.


ఓం అథ పురుషో హ వై నారాయణోఁకామయత ప్రజా: సృజేయేతి !


నారాయణాత్ప్రాణో జాయతే !


మన: సర్వేన్ద్రియాణి చ !


ఖం వాయుర్జ్యోతిరాప: పృథివీ విశ్వస్య ధారిణీ !


నారాయణాద్ బ్రహ్మా జాయతే !


నారాయణాద్ రుద్రో జాయతే !


నారాయణాదిన్ద్రో జాయతే !


నారాయణాత్ప్రజాపతయ: ప్రజాయస్తే !


నారాయణాద్ ద్వాదశాదిత్యా: రుద్రా వసవస్సర్వాణి చ ఛన్దాగంసి !


నారాయణాదేవ సముత్పద్యస్తే !


నారాయణే ప్రవర్తస్తే !


నారాయణే ప్రలీయస్తే !!


ఓమ్ ! అథ నిత్యో నారాయణ: !


బ్రహ్మా నారాయణ: !


శివశ్చ నారాయణ: !


శక్రశ్చ నారాయణ: !


ద్యావాపృథివ్యౌ చ నారాయణ: !


కాలశ్చ నారాయణ: !


దిశశ్చ నారాయణ: !


ఊర్థ్వశ్చ నారాయణ: !


అధశ్చ నారాయణ: !


అస్తర్బహిశ్చ నారాయణ: !


నారాయణ ఏవేదగం సర్వమ్ !


యద్భూతం యచ్చ భవ్యమ్ !


నిష్కళో నిరఙ్ఞనో నిర్వికల్పో నిరాఖ్యాత: శుద్ధో దేవఏకో నారాయణ: !


న ద్వితీయోఁస్తి కశ్చిత్ !


య ఏవం వేద !


స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి !


ఓమిత్యగ్రే వ్యాహరేత్ !


నమ ఇతి పశ్చాత్ !


నారాయణాయేత్యుపరిష్టాత్ !


ఓమిత్యేకాక్షరమ్ !


నమ ఇతి ద్వే అక్షరే !


నారాయణాయేతి పంచాక్షరాణి !


ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం !


యో హవై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి !


అన పబ్రువస్సర్వమాయురేతి !


విన్దతే ప్రాజాపత్యగం రాయస్పోషం గౌపత్యమ్ !


తతోఁమృతత్వమశ్నుతే తతోఁమృతత్వమశ్నత ఇతి !


య ఏవం వేద !!


ప్రత్యగానన్దం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం !


అకార ఉకార మకార ఇతి !


తాసేకధా సమభరత్తదేతదోమితి !


యముక్త్వా ముచ్యతే యోగీ జన్మసంసారబన్ధనాత్ !


ఓం నమో నారాయణాయేతి మన్త్రోపాసక: !


వైకుంఠ భువనలోకం గమిష్యతి !


తదిదం పరం పుణ్డరీకం విజ్ఞానఘనమ్ !


తస్మాత్తదిదావన్మాత్రమ్ !


బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదనోమ్ !


సర్వభూతస్థమేకం నారాయణమ్ !


కారణరూపమకార పరబ్రహ్మోమ్ !


ఏతదథర్వ శిరోయోఁధీతే !


ప్రాతరధీయానో రాత్రి కృతం పాపం నాశయతి !


సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి !


మాధ్యన్దినమాదిత్యాభిముఖోఁధీయాన: పంచపాత కోపపాతకాత్ ప్రముచ్యతే !


సర్వ వేద పారాయణ పుణ్యం లభతే !


నారాయణసాయుజ్యమవాప్నోతి నారాయణసాయుజ్యమవాప్నోతి !


య ఏవం వేద !


ఇత్యుపనిషత్ !!


ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై

తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై!!


*నారాయణ ఉపనిషత్ భావము*

*ఓం శ్రీ నమో నారాయణాయ*


 1.నారాయణుడే ఆది పురుషుడు. ఇది సత్యము.నారాయణునకు ప్రజలను సృష్టించవలెనను కోరిక కలిగినది .అపుడు మొదటగా నారాయణుని నుండి ప్రాణము(ప్రాణవాయువు)ఉద్భవించినది.ఆ తరువాత మనస్సు,ఇంద్రియములు,మరియు ఆకాశము,వాయువు, అగ్ని,జలము,భూమి వీటన్నింటికీ అధారమైన విశ్వము ఉద్భవించినవి. నారాయణుని నుండి బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు ప్రజాపతులు ఉద్భవించిరి.నారాయణుని నుండి ఆదిత్యులు(12) రుద్రులు(11) వసువులు(8) ఉద్భవించిరి.మరియు వేద చందస్సు ఉద్భవించినది. ఇవన్నియూ నారాయణుని యందే పుట్టుచున్నవి.ప్రవర్తిల్లుచున్నవి. నారాయణునియందే విలీనమగుచున్నవి. ఇది ఋగ్వేద ఉపనిషత్తు.


 2.నారాయణుడు శాశ్వతుడు. నారాయణుడే బ్రహ్మ. నారాయణుడే శివుడు. నారాయణుడే ఇంద్రుడు. నారాయణుడే కాలుడు(మృత్యుదేవత).నారాయణుడే ఉర్ధ్వ-అధోదిక్కులు.లోపల వెలుపల (శరీరములోనున్న-బయటనున్న)ఉన్నది నారాయణుడే. సర్వము నారాయణుడే.ఇది సత్యము. భూతభవిష్యత్ వర్తమానములు నారాయణుడే. విభాగములు లేక ఒక్కటిగా నున్నది నారాయణుడే. 

సర్వమునకు ఆధారభూతుడు,దోషరహితుడు,భావింపశక్యముకానివాడు,వర్ణింపనలవికానివాడు, పవిత్రుడు, దివ్యుడు అయిన దేవుడు నారాయణుడు ఒక్కడే. ఆ నారాయణుడే విష్ణువు. ఆ నారాయణుడే సర్వవ్యాపి అయిన విష్ణువు. ఇది యజుర్వేద ఉపనిషత్తు.


3."ఓం" అని మొదటగా ఉచ్చరించవలెను. తరువాత "నమ:" అని ఉచ్చరించవలెను.తరువాత "నారాయణాయ" అని ఉచ్చరించవలెను."ఓం" అనునది ఏకాక్షరము."నమ:"అనునది రెండక్షరములు. "నారాయణాయ"అనునది ఐదక్షరములు.ఈ విధముగా నారాయణుడు "ఓం నమో నారాయణాయ"అను అష్టాక్షరి మంత్రముగా రూపుదిద్దుకొనినాడు.


ఈ అష్టాక్షరి మంత్రమును పఠించుట వలన సర్వారిష్టములు తొలగును.సంపూర్ణ ఆయురారోగ్యములు సిద్ధించును.


సంతానము, యశస్సు, ధనము, గోగణములు వృద్ధి చెందును. ఆ తరువాత అమృతత్వము(ముక్తి)సిద్ధించును.ఇది సత్యము. ఇది సామవేద ఉపనిషత్తు. 


4.పురుషుడైన నారాయణుని ప్రణవస్వరూపమైన ఓంకారమును పఠించుట వలన సంపూర్ణమైన ఆనందం కలుగును.ఓంకారము అకార,ఉకార,మకారములతో ఏర్పడినది.ఎవరు సదా ఓంకారమును ఉచ్చరింతురో వారు(యోగి)జన్మసంసార బంధముల నుండి విముక్తులగుదురు."ఓం నమో నారాయణాయ" అను ఈ అష్టాక్షరీ మంత్రమును ఎవరు ఉపాసింతురో వారు శ్రీమన్నారాయణుని వైకుంఠమునకు చేరుదురు.అది పరమ పురుషుని హృదయకమలం.అది ఇంద్రియాతీతమైన విజ్ఞానముతో నిండియున్నది.ఆ కారణముచే ప్రకాశించుచున్నది.


దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మము. మధువు అను రాక్షసుని చంపిన విష్ణువు బ్రహ్మము. పుండరీకాక్షుడు బ్రహ్మము; అచ్యుతుడు బ్రహ్మము.ఓంకారమే బ్రహ్మము. సర్వభూతములలో ఒక్కడుగా నున్నది నారాయణుడే. కారణరూపమైన అకారపరబ్రహ్మమే ఓంకారము.ఇది అధర్వణవేద ఉపనిషత్తు.


ఈ నారాయణ ఉపనిషత్తును ఉదయ,మధ్యాహ్న,సాయం సమయముల ఎప్పుడైనను పఠింతురో వారు పంచమహాపాతకములనుండి ,ఉపపాతకముల నుండి విముక్తులగుదురు.మరియు వారికి సర్వవేదములు పారాయణ చేసిన పుణ్యము లభించును.నారాయణ సాయుజ్యము(మోక్షము) లభించును.ఇది సత్యము.అని ఉపనిషత్తు ఉపదేశించుచున్నది.


నారాయణుడు అవ్యక్తము కంటే అతీతుడు. అవ్యక్తమునుండే ఈ బ్రహ్మాండము పుట్టినది. ఈ బ్రహ్మాండములోనే పదునాల్గు లోకములు, సప్తద్వీపములు,భూమి ఉన్నాయి.


ఓం శాంతి: శాంతి: శాంతి:!!

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..*


*శ్రీ స్వామివారి సమాధి..ఒక పుణ్యక్షేత్రం..*


*(అరవై ఐదవ రోజు)*


శ్రీ స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధి పొందిన పిదప..శ్రీ స్వామివారి పార్థివదేహాన్ని ఆశ్రమం లోని ప్రధాన గది లో ఉన్న నేలమాళిగ లోనే సమాధి చేయడం జరిగిపోయింది..శాస్త్రోక్తంగా క్రతువు నిర్వహించారు..


1976 మే 7వతేదీ మధ్యాహ్నం నాటికి అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు..విజయవాడ నుంచి శ్రీ చెక్కా కేశవులు గారు, వారి తోడల్లుడు మెంటా మస్తాన్ రావు గారు కూడా ఆరోజు మొగలిచెర్ల చేరుకున్నారు.. మీరాశెట్టి గారు అక్కడే వున్నారు..అందరూ కలిసి..శ్రీ స్వామివారి ఆశ్రమమును నిర్వహించే బాధ్యత శ్రీధరరావు గారికి అప్పజెప్పారు..వారూ సరే నన్నారు..ప్రస్తుతానికి యెవరినైనా ఒక మనిషిని కాపలాగా ఉంచుదాము అని ఆలోచన చేశారు..కానీ వారికి ఆ నిమిషంలో తెలీదు..ఇంకో రెండు మూడు రోజుల కల్లా భక్తులు వెల్లువలా వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకుంటారని..


"సంతానం కావాలంటే..మొగలిచెర్ల వెళ్లి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్ద మ్రొక్కుకోండి..సంతానం కలుగుతుంది.."!


"గ్రహ బాధలున్నాయా?..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం వద్ద వర పడండి.. తీరి పోతాయి!.."


"దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తున్నారా..ఆ స్వామి వద్ద నిద్ర చేయండి..క్షణంలో బాగు పడతారు!.." 


ఇలా ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడసాగింది..అందుకు తగ్గట్టే దృష్టాంతరాలు కనబడ సాగాయి..


మే 9వ తేదీ ఆదివారం నాటి నుంచి శ్రీ స్వామివారి సమాధి దర్శించడానికి భక్తులు రావడం మొదలుపెట్టారు..వెంటనే శ్రీధరరావు గారు ముందుగా అక్కడొక పూజారిని ఏర్పాటు చేశారు.. శాస్త్రోక్తంగా పూజా విధానాలు ఏర్పడ్డాయి..క్రమంగా భక్తుల రాక పెరగసాగింది..అనతి కాలంలోనే..శ్రీ స్వామివారి ఆశ్రమం కాస్తా.."శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం"  గా రూపాంతరం చెందింది..మట్టి రోడ్డు వేసారు..బస్సులు నేరుగా మందిరం వద్దకే రాసాగాయి..విద్యుత్ సౌకర్యం వచ్చింది..ఒకటి రెండు దుకాణాలు వెలిశాయి..కొంతమందికి ప్రత్యక్ష..మరికొంతమందికి పరోక్ష ఉపాధి కల్పన జరిగింది..మెల్ల మెల్లగా మొగలిచెర్ల గ్రామం పేరు.. శ్రీ స్వామివారి మందిరం వలన అందరికీ తెలియసాగింది..


"ఇది దత్తుడి భూమి!..పుణ్యక్షేత్రంగా మారుతుంది!.." అని శ్రీ స్వామివారు పదే పదే చెప్పిన మాట శ్రీధరరావు ప్రభావతి గార్ల మనసులో వినబడుతూ ఉండేది..అందుకు తగ్గట్టు గానే..మొగలిచెర్ల గ్రామ శివార్ల లో ఉన్న తమ భూమి..అదికూడా ఒకప్పుడు  ఫకీరు మాన్యం గా పిలవబడ్డ బీడు భూమి..నేడు తమ కళ్ల ముందే..వేలాది మందికి స్వాంతన చేకూర్చే పుణ్య ప్రదేశంగా మారిపోయింది..ప్రస్తుతం అన్నదానమూ జరుగుతున్నది..ఎంతో మంది భక్తులు తమ తమ బాధలు తీరిపోయాయని చెప్పుకుంటూ వుంటారు..కొంతమంది భక్తుల అనుభవాలను ముందు ముందు రోజుల్లో తెలుసుకుందాము..


ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరియు శ్రీ స్వామివారు సిద్ధిపొందిన వైశాఖ శుద్ధ సప్తమి తిథి నాడు శ్రీ స్వామివారి ఆరాధనామహోత్సవం ఘనంగా జరుగుతాయి..


ప్రతి చరిత్రకూ ముగింపు తప్పనిసరి..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర నేటితో సమాప్తి చేస్తున్నాను ..ఈ చరిత్ర చదివి ఎంతో మంది నన్ను ప్రోత్సహించారు...వారందరికీ పేరు పేరునా నా ధన్యవాదములు..


అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే..


ఇది ఒక సాధకుని తపోభూమి..


ఇది ఒక అవధూత ఆశ్రమం..


అదే..మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..


శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్న భక్తుల అనుభవాలు..శ్రీ స్వామివారి లీలలు..రేపటి నుండి ధారావాహికంగా చదువుకుందాము..


సర్వం

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..*


*కపాలమోక్షం..*


*(అరవై నాలుగవ రోజు).*


శ్రీ స్వామివారు దేహ త్యాగం చేశారు కనుక..ఇక జరగవలసిన ఏర్పాట్ల గురించి శ్రీధరరావు గారు, శ్రీ స్వామివారి సోదరులు చర్చించుకుంటున్నారు..శ్రీ స్వామివారి ఆఖరి సోదరుడు పద్మయ్యనాయుడుకు శ్రీ స్వామివారు చెప్పిన విధంగా చేద్దామని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు..


సమయం రాత్రి 11 గంటలు కావొచ్చింది..ఇంతలో ఎవ్వరూ ఊహించని విధంగా ఒక సంఘటన జరిగింది..


శ్రీ స్వామివారి శరీరం లోంచి..ఒక పెద్ద శబ్దం వినబడసాగింది..దూరం నుంచి ఒక మోటార్ సైకిల్ వస్తున్న శబ్దాన్ని పోలివుంది..ముందుగా ఎవ్వరూ ఆ శబ్దం శ్రీ స్వామివారి శరీరం నుంచి వస్తున్న సంగతిని పసిగట్టలేదు..ఎవరో మోటార్ సైకిల్ మీద వేస్తున్నారేమో అనే భ్రమ లో వున్నారు..కానీ రెండు నిమిషాల కాలం గడిచేసరికి..ఆ శబ్ద నాదం ఉధృతంగా మారింది..అప్పటికి అందరూ తేరుకొని..శ్రీ స్వామివారి దేహం వైపు చూసారు..నాభి ప్రాంతం నుంచి మొదలైన ఆ శబ్దం..క్రమంగా ఊర్ధ్వంగా శిరస్సు పై భాగానికి  ప్రాకిపోయింది..ఇలా దాదాపు 5నిమిషాల పాటు జరిగింది..అందరూ ఆశ్చర్యంగా స్థాణువుల్లా నిలబడిపోయారు..


ఎంత ఉధృతంగా శబ్దం వచ్చిందో..ఒక్కసారిగా ఆ శబ్దం ఆగిపోయింది..ఆ మరునిమిషంలోనే.. శ్రీ స్వామివారి శిరస్సు పై మధ్యభాగం నుంచి..రక్తం ధారగా కారసాగింది..అదే సమయానికి ఆశ్రమం బైట ఉన్న వ్యక్తులకు..ఆశ్రమం పై భాగం నుంచి ఒక నీలి రంగు జ్యోతి..పై కెగసి..ఆకాశం లో కలిసిపోవడం కనిపించింది..ఆ నీలి రంగు జ్యోతి మొగలిచెర్ల గ్రామం లో ఉన్న వ్యక్తులూ చూడగలిగారు.. ఆశ్రమం లోపల ఉన్న శ్రీధరరావు దంపతులకు..శ్రీ స్వామివారు కపాలమోక్షం పొందారు అని అర్ధం చేసుకున్నారు..అప్పటి దాకా శ్రీ స్వామివారు తన శరీరం లో తన ప్రాణాన్ని నిలిపివుంచారని వాళ్లకు అవగతం అయింది..


శ్రీధరరావు ప్రభావతి గార్లు అందరితో చర్చించి..శ్రీ స్వామివారి పార్థివ దేహాన్ని..శ్రీ స్వామివారు కోరుకున్న విధంగా..వారు ముందుగానే నిర్మించుకొని..తపస్సు ఆచరిస్తున్న నేలమాళిగ లోనే ఉంచి సమాధి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు..శ్రీ పద్మయ్యనాయుడు తో శ్రీ స్వామివారు ముందుగానే ఆ విధి విధానాలు తెలియచేసి వున్నారు కనుక..ఎవ్వరికీ ఆ విషయం లో ఎటువంటి సందేహమూ కలుగలేదు..తెల్లవారేవరకూ వేచి చూసి..సమాధి చేద్దామని నిర్ణయం తీసుకున్నారు..ఉదయానికి శ్రీ స్వామివారి దేహాన్ని..ఆ నేలమాళిగ లో..ఉత్తరాభిముఖంగా పద్మాసనం వేసుకున్న స్థితి లోనే ఉంచి..పై భాగాన్ని సిమెంట్ తో మూసివేశారు..


అతి చిన్న వయసు లోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని..కఠోర సాధన చేసి..అవధూత అంటే...ఇలా ఉండాలి..ఇలా ఆచరించాలి..అని మార్గదర్శనం చేసి..కేవలం ముప్పై రెండు సంవత్సరాల ప్రాయం లోనే..ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్రీ స్వామివారు..శ్రీ దత్తాత్రేయుడిని ఆరాధించి..తనను కూడా దత్తాత్రేయుడి గానే పిలువమని ఆదేశించి..దత్త తత్వానికి ఓ సంపూర్ణత తీసుకొచ్చారు..మాలకొండ పుణ్యక్షేత్రం లో తపస్సు ఆచరించినందునా...ఆ లక్ష్మీనృసింహుడి మీద ఉన్న అపార భక్తి ప్రపత్తుల కారణంగా..ఒక్క శనివారం నాడు మాత్రం..తన సమాధి దర్శనం వద్దనీ..మిగిలిన రోజుల్లో తనను దర్శించవచ్చనీ..తెలియచేసారు..ఈనాటికీ ఆ నియమం పాటించబడుతున్నది..


తమకు శ్రీ స్వామివారు పరిచయం అయిన నాటి నుంచీ..తమ జీవితాలను ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించి..తమకు అపారమైన జ్ఞాన బోధ చేసిన ఆ మహనీయుడిని దగ్గరుండి సమాధి చేయడం..శ్రీధరరావు ప్రభావతి గార్ల జీవితంలో మరచిపోలేని ఒక ముఖ్య ఘట్టం..ఇలా చేయవలసి వస్తుందని ఆ దంపతులు ఊహించని పరిణామం..


శ్రీ స్వామివారి ఆశ్రమం..దత్తక్షేత్రంగా రూపాంతరం చెందడం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

దత్తపది

 *ముర- కరి - గిరి- హర*( దత్తపది) 

*కందంలో విష్ణు స్తుతి*


 మురహర! కరుణను జూపర!


కరివరదా! భవము విడువ కావుము వేగన్


గిరిధర! లక్ష్మి మనోహర!


హరకత్తులు  లేని భక్తి నందించు హరీ!


(హరకత్తులు =ఆటంకములు)


*స్వప్నంబందున గాంచినట్టి దవురా సత్యంబుగా నిల్చెడిన్. 

ఈ సమస్యకు నాపూరణ. 



*రుమణ్వంతుడు*

స్వప్నంబన్నది  మీరు నమ్మ దగునా సాధ్యంబె? సాధించుటే!


స్వప్నంబంత నయోచనా రచనలే  సాగించు మిథ్యార్థముల్


*ఉదయనుడు*

స్వప్నావస్థను జూచి వాసవిని నే సందేహమున్ నొందగా


స్వప్నంబందునc గాంచినట్టి దవురా సత్యంబుగా నిల్చెడిన్. 

అల్వాల లక్ష్మణ మూర్తి.

సంస్కృత భాష స్థానం

 🙏ప్రపంచ భాషలలో సంస్కృత భాష స్థానం 🙏

              ..రెండవ భాగం 

ఈ భాగములో సంస్కృతం గురించి అనేక పాశ్చాత్యపండితులెల్లరు తెలిపిన అభిప్రాయాలు చెబుతున్నాను. ఎందుకంటే మనకు స్వదేశీయులు కంటే విదేశీయులు చెప్పినది రుచిస్తుంది. అంతకుమించి విదేశీయులకు సంస్కృతం అంటే ఎంత గౌరవం ఉందో తెలుస్తుంది. కరివేపాకు అరుగుదలకు మంచిది అని ఆయుర్వేద వైద్యుడు అంటే మనము మనం చిన్నచూపు చూస్తాం. అదే ఒక RMP వైద్యుడు కరివేపాకు డైజిషన్ మీద యాక్ట్ చేస్తుంది అని వచ్చిరాని ఇంగ్లిష్ లో అంటే ఆయన మాటకు మురిసిపోతాం.మనకు ఏమి చెప్పినా పరభాష వాళ్ళు చెబితే విశ్వసిస్తాము. ఒక సంస్కృత పండితుడో లేదా దేశీయ పండితుడో చెబితే నమ్మము. కాబట్టి పరభాషావేత్తలు చెప్పిన విషయం చూద్దాము.ఇక విషయంలోకి వెడదాము. 

ప్రపంచములోని యేభాషలోను వాఙ్మయము పుట్టక పూర్వమే, సంస్కృతములో వాఙ్మయము బయలుదేరినదని ఎల్లరు నంగీకరించుచున్నారు. మానవ పుస్తకభాండాగారములో ఋగ్వేదమే మొదటిగ్రంథమని మాక్సుముల్లరు నుడివియున్నాడు.

“Rig Veda is the first book in the Library of man”

ప్రపంచములో మొదటికావ్యమగు రామాయణము సంస్కృతభాషలో నుద్భవించినది, ప్రపంచములోని మొదటి జ్యోతిష్య గ్రంథము, మొదటి నాట్యశాస్త్ర గ్రంథము, మొదటి వ్యాకరణ గ్రంథము సంస్కృతభాషలోనే యుద్భవించినవి. కావున ప్రపంచవిజ్ఞానచరిత్రలో సంస్కృతభాషకు విశిష్టమైనస్థానము ఉంది.

.సంస్కృతభాషలోని వాఙ్మయముతో పరిచయమును పొందిన పాశ్చాత్యపండితులెల్లరు, దాని మహత్త్వమును వేనోళ్ల కొనియాడిరి. మహామేధావి, విమర్శకశిరోమణియైన గెటీయను జర్మన్ పండితుడు శాకుంతలనాటకమును జర్మనుభాషలో చదివి ముగ్ధుడైనాడు. స్వర్గమర్త్యలోకముల సారసర్వస్వమే శాకుంతలమని యాతడు వర్ణించాడు. మానవ హృదయమునకు ఉపనిషత్తు లీయగల శాంతిని మరియేవాఙ్మయము కూర్పజాలదని యెల్లరు నంగీకరించిరి. విశ్వవిఖ్యాతిగల షోపెన్ హోవర్ అను జర్మన్ విద్వాంసుడు "ఉపనిషత్పఠన మంత లాభదాయకమైనది, ఔన్నత్యమైనది మరొకటిలేదు. అది జీవితకాలమంతయు నాకు ఆశ్వాసజనకముగా నున్నది. మరణ సమయమునకూడ అదియే నాకు ఆశ్వాసహేతువు కాగలదు” అని నుడివినాడు.


ఫ్రెడెరిక్ ష్లెగెల్ "భారతీయుల భాష, విజ్ఞానము” అను గ్రంథములో నిట్లు వ్రాసెను. “ప్రాగ్దేశస్థుల ఆదర్శ ప్రాయమైన విజ్ఞానజ్యోతి ముందర గ్రీకువేదాంతుల తత్వశాస్త్రము అప్రతిబద్ధమై మినుకుమినుకుమను నిప్పునెరసు వలె నుండును”.


సంస్కృతభాషయొక్క కట్టుబాటును గురించి మోనియర్ విలియమ్స్ యిట్లు పల్కినాడు. “ఇంతవరకు ప్రపంచములో బయలుదేరిన అద్భుతగ్రంథములలో పాణినివ్యాకరణమొకటి. స్వతంత్ర ప్రతిభ లోను, సూక్ష్మ పరిశీలనలోను పాణినీయ వ్యాకరణముతో పోల్చదగిన గ్రంథమును మరియే దేశమును సృజించుకొనలేదు”.


భాషను నిబంధించు వ్యాకరణశాస్త్రము ఒక శాస్త్రముగా పరిగణింపబడు ఉన్నతస్ధితికి వచ్చుట భారతదేశములో మాత్రమే జరిగింది. సంస్కృతవ్యాకరణమునుగూర్చి యీరీతి వర్ణనను "Most Scientific Grammar” అని అనేక పాశ్చాత్యపండితులు గావించియున్నారు. బుద్ధికి శిక్షణము నొసగు విషయములలో గణితశాస్త్రమొకటి. గణితశాస్త్రమునుగాని, సంస్కృతవ్యాకరణమునుగాని చదువుచో మానవబుద్ధి సరియైన మార్గములో ఆలోచించుటయను అలవాటులో పడునని నిష్పక్షపాతబుద్ధి గల పాశ్చాత్యులే నుడివియున్నారు.


బహుభాషానిబద్ధ సాహిత్యకృషి చేసినవారు ప్రపంచసాహిత్యములో వాల్మీకి రామాయణముతో సమానమైన గ్రంథము లేదనిరి. ఆంగ్లములో గ్రంథకర్తగా ప్రసిద్ధిచెందిన పూర్వ బీహార్ రాజ్యపాల్ 

 శ్రీ ఆర్. ఆర్. దివాకర్ ఇట్లు వాక్రుచ్చారు. “కొందరు నాతో ఏకీభవించినను, ఏకీభవింపకపోయినను నామట్టునకు నాకు ప్రపంచసాహిత్యములో వాల్మీకి రామాయణము ఉత్తమోత్తమ గ్రంథమనిపించుచున్నది.”.ఇట్టి బహు విషయములలో అగ్రస్థానము మరియే భాషకును లభించుట లేదు                        

                        సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కట్టెదుర వైకుంఠము

 


శ్రీభారత్ వీక్షకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 🌹 వైకుంఠ ఏకాదశి రోజున పరంధాముడైన ఆ విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీనివాసుని స్మరించడం నిజంగా పూర్వజన్మ సుకృతమే. నిరంతరం ఆ వేంకటేశ్వరుని మది నిండా నింపుకొని కొన్ని తరాల పాటు మనమంతా కీర్తించే కీర్తనలను మనకు అందించిన ఆ అన్నమాచార్యుని భాగ్యం ఎంత గొప్పది! ఆయన రచించిన ఓ అద్భుతమైన, మనోహరమైన కీర్తన ' కట్టెదుర వైకుంఠము ' శ్రీమతి రాధాదేవి గళం నుంచి వినండి. అన్నమయ్య కీర్తనలు ఆలపించడం, ఆస్వాదించడం ఒక యోగం. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

ముక్కోటి ఏకాదశి రోజున

 జై శ్రీ రామ్ 

ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్య ఫలం ఏమిటి?


అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు. ప్రాజ్ఞ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిక్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం. అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తరం దిక్కుకు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము axil అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది. ఈ విశ్వము దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపుకు anti clockwise తిరుగుతూండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపునుంచి దక్షిణానికి clockwise తిరుగుతుంది. "ప్రాగ్ ఆరభ్య దక్షిణేణ వర్తనం" మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి - ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిమీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు.


ఈరోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము. భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు. ఇలా చెప్పి ఆలయాలవైపు మనల్ని మరల్చారు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము. కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్షించాలా? అని సంసిద్దుడై ఉంటాడుట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? - ఈ లోకంతో భవ బంధనాలనుంచి విముక్తి. మోక్షము అంటే "ముచిల్ మోక్షణే" అని అర్థం. బంధనాలనుంచి ముక్తిని పొందడము, విముక్తిని కలిగించుకోవడము అని అర్థం. అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది. జై శ్రీ రామ్ జై జై హనుమాన్ కంచెర్ల వెంకట రమణ

విద్యార్థినులూ - వేదనలూ (42)

 ఓం శ్రీ మాత్రేనమః

ఓం శ్రీ గురుభ్యోనమః

7-01-25

విద్యార్థినులూ - వేదనలూ (42)

(హితోక్తి)

డా.రఘుపతి శాస్త్రుల


కం.బాలిక లుండు నివాసము

లాలయముల వోలె సేవలలరుచునుండన్

పాలకులు చూడగా వలె

పాలసులను చేరదీయ వర్ధిల్లుదురే?

(పాలసులు=దుర్మార్గులు)


చ.చదువుల నొందు కోసమనిశమ్మును వేదనలన్ భరింప నె

మ్మది దృఢ నిశ్చయమ్మున ప్రమాదములన్ గనలేక నమ్మక

మ్మొదవెడు మాటలన్ వినియు నుల్లములందున సంతసించు వా

రెదను సహింప గల్గుదురె హీనులు చేయు దురాగతమ్ములన్

(ఎద=మనస్సులో-దురాగతము=దుర్మార్గపు పనులను)


కం.మోసములను జేసి తమ వి

లాసములను గనగనెంచు రాబందులకున్

దోసములవి కనిపించునె

గాసిల జేయుటలె వారి కర్తవ్యములౌ!

(గాసిల జేయు=బాధపెట్టడం)


క.దుష్టుల కండగ నిలుచుచు

ఇష్టారాజ్యముగ మసలు హీనులకట నా

భ్రష్టులకు శిక్షలుండవొ

శిష్టులకే యిడుదురేమొ శీల పరీక్షల్!


క.మానినులకు బ్రతుకున నభి

మానము, మానములె, సిరులు మాన్యములగునౌ

ప్రాణము కన్నను మిన్నగ

మానమునే ఎంచు చుంద్రు మనుగడ కొరకై

(మానిని=స్త్రీ-మానము=గౌరవము-

మాన్యము=గౌరవ సంపద)